Saturday, 4 August 2012

జ్ఞానం వలన కలిగే అహంకారం (6)


         మనం జన్మించినప్పటి నుండి ప్రతి విషయాన్ని పంచేంద్రియాలయిన చెవులు,ముక్కు,నోరు,నాలుక,చర్మ ములతో గ్రహిస్తూ ఉంటాము.ఇలా ప్రతి విషయం మన మెదడు పొరలలోనిక్షిప్తమయి ఉంటుంది.పై ఐదింటిని జ్ఞానేం ద్రియాలు అని కూడా అంటాము.పై సమాచారాన్ని విశ్లేషించుకొని మెదడు తన పొరలలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇంకా మనిషి అనుభవాల ద్వారా,సమాజాన్ని చూడటం ద్వారా ,చదువు ద్వారా విభిన్న మయిన పుస్తకాలు చదవ టంద్వారా ,వార్తాపత్రికలు,టి.వి ,కంప్యూటర్(ఇంటర్నెట్),సినిమాలు,రాజకీయాలుద్వారా తను చేసే పనుల ద్వారా నేర్చుకున్న విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి.అలాగే ,కుటుంబం,సమాజంతోకలిసి ఉండడం ద్వారా వ్యవ హారధోరణి,ప్రవర్తన,వంటివి ఏర్పడుతుంటాయి.
         ఇలా మనిషి పోగుచేసుకున్న జ్ఞానం అంతా మనిషి మాటల్లో,చేతల్లో, ప్రవర్తనలో వ్యక్తమవుతూ ఉంటుంది.ఈ వ్యక్తమయ్యే జ్ఞానం ఎక్కడ ఎంతవరకు అవసరమో అంత వరకు ఉపయోగిస్తూ,పనులు సమర్థవంతంగా పూర్తి చేసే వారు కొంతమంది,అవసరం లేని చోట తెలివి ప్రదర్శించటం,తనకే ఎక్కువ తెలుసు అనుకోవటం,ఎదుటివారిని అజ్ఞా నులుగా  భావించటం,అన్నీ తెలిసినట్లుగా మాట్లాడటం,ఎదుటివారిని అవమానించేలా మాట్లాడటం,నేనే కరెక్ట్ అను కోవటం,ఎదుటివారు చెప్పేది సరికాదు అనుకోవటం ,అసలు సరిగా వినకపోవటం ఇవన్నీ జ్ఞానం ద్వారా వచ్చిన అహంకారంగాపరిగణించవచ్చు.ఇందులోమళ్ళీ రెండు రకాల వ్యక్తులు ఉంటారు.1)మొదటి రకం ఏదయినా ఒక అంశాన్ని కాస్త ఎక్కువగా తెలుసుకొని ఇక ఈ విషయంలో నాకు ఎదురులేదు అనుకునే వారు,2)అన్ని విషయాలు కొద్దికొద్ది గా తెలుసుకొని అరకొర జ్ఞానంతో మాట్లాడేవారు.
      ఎక్కువగా చదువుకున్నవారిలో ఈ రకమైన ధోరణులు మనం చూడవచ్చు.అసలు జ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది.మానవ పరిణామ క్రమములో సైన్సు ఈ స్థాయికి వచ్చిందంటే ఎప్పటికప్పుడు మారుతున్న జ్ఞానం ఆధా రంగానే సాధ్య పడింది.ఒకప్పటి జ్ఞానం నిన్న లేదు.నిన్నటి జ్ఞానం ఈ రోజుకి పనికి రావటం లేదు. ఈరోజు జ్ఞానం రేప టికల్లా మారిపోతుంది.అదేవిధంగా మానసిక రంగంలో కూడా కొన్నివేల సంవత్సరాలనుండి నిరంతర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఒకప్పటి నమ్మకాలు,అవగాహన నేడు మారిపోతున్నాయి.ఇంత వైవిధ్య భరితమైన మానవ జీవితంలో జ్ఞానం ఆధారంగా అహంకారం ప్రదర్శించటం సముచితం కాదు.
        ఏదయినా ఇలా అహంకారం ప్రదర్శించే వ్యక్తులు ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో!ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కీ మొత్తం జ్ఞానం తెలిసే అవకాశం లేదు.మనిషి జీవనానికి అవసర మైన విభిన్నవృత్తుల ద్వారా లేదా ఆసక్తుల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తాం .కొంత మంది కొన్నివిషయాల్లో మాస్టర్ డిగ్రీలు,Phd చేసిన ఆ తర్వాత కొంత కాలానికి అదే విషయంలో ఎంతో నూతన జ్ఞానం కనుగొన బడుతుంది.కాబట్టి ఏ విషయంలో నైనా నాకు అంతా తెలు సు అనిగాని,నాకే తెలుసు అనిగాని,ఎదుటి వ్యక్తులు చెప్పేదంతా తప్పుఅనిగాని భావించేవారు ఒక్క సారి ఆలోచిం చండి.ఈ విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణువుతో సమానం.దానిలో ఉన్న 700 కోట్ల మందిలో మనం ఒకరం కాబట్టి మన స్థాయిని  మనం అంచనా వేసుకోవాలి.
     ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సైంటిస్ట్ లతో ఓటింగ్ జరిపిస్తే న్యూటన్ మొదటి స్థానం  పొందారు.ఆయన అన్న మాట లు మనం గుర్తించాలి."మహా సముద్రం ఒడ్డున గులక రాళ్ళు ఏరుకునే ఓ చిన్న బాలుడిని నేను."అని.ఈ విశ్వంలో జ్ఞానం అపారం.అది నిరంతరం కనుగొన బడుతునే ఉంది.
        చాలా మంది తమకు తెలిసిన విషయపరిధి లోనే వాదించటం చూస్తూ ఉంటాము.ఎదుటి వారి కోణాన్ని అర్థం చేసుకోరు.కొన్ని విషయాల పట్ల ఏ అవగాహన లేకున్నాకొంత మంది వ్యక్తుల గురించి ఏమీ తెలియకున్నా వారి గురించి వ్యాఖ్యానిస్తుంటారు.ఏదయినా ఒక విషయం గురించి గట్టిగా వాదించే ముందు కూలంకషంగా తెలుసుకొని  మాట్లాడితే బాగుంటుంది.లేదా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను.మీరు చెబితే తెలుసుకుంటాను అని ఎదుటి వారు చెప్పే దివినాలి.ఆ విషయాన్ని విశ్లేషించుకొని,నిర్ధారించుకొని మన అభిప్రాయాలను చెప్పాలి..
          సినిమాలు,రాజకీయాలు,క్రికెట్,సామాజిక సమస్యలు,నమ్మకాలు,తత్వం,ఆరోగ్య విధానాలు విశ్వావిర్భావం జీవపరిణామ క్రమం ఇలా విభిన్న విషయాలపై,కొంత మంది ఘంటాపధంగా తమ అభిప్రాయాలు చెబుతుంటారు. ఎదుటివారికి ఏమీ తెలియదనుకొని.ఏ విషయం పట్ల అయినా ఒక అభిప్రాయం వ్యక్త పరిచే ముందు కొంత మనసు లోఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది.మనసులో ఏమనిపిస్తే,మనకేమి తెలిస్తే అదే మాట్లాడితే ఎన్నో సమస్య లు వస్తాయి.
       మనం ప్రతి రోజు ఎన్నోవిషయాలు నేర్చుకుంటూ ఉంటాము.ఎన్నో సంఘటనల నుండి ,ఎన్నో పుస్తకాల నుండి ఎంతో మంది వ్యక్తుల నుండి,మనకు కలిగే జీవితానుభవాల నుండి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాము.పసిపిల్ల వాని నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు.నాకే అంతా తెలుసనే భావన వదిలి పెట్టి ఎదుటివారు చెప్పేది మనసు హృదయం పెట్టి వినటం నేర్చుకుంటే మనలో క్రమంగా ఈ జ్ఞానం వలన కలిగే అహంకారం తొలగి పోతుంది.

Sunday, 29 July 2012

డబ్బు సృష్టించే అహంకారం(5)

            డబ్బు సమాజాన్ని శాసిస్తున్న రోజులివి.సంపద పట్ల విపరీత మైన వ్యామోహం ప్రజల్లో వ్యాపించింది.
ఎప్పు డైతే దీనికి అంత ప్రాధాన్యత ఏర్పడిందో ఎవరికయితే డబ్బు ఉందొ వారికి సంఘంలో విలువ గౌరవం పెరిగి పోసాగాయి.డబ్బున్న వారు గొప్ప వారుగా ,డబ్బు లేని వారు సామాన్యులుగా పరిగణింప బడే సంస్కృతి ప్రబలింది ఎప్పుడైతే దీనికంత ప్రముఖ స్థానం లభించిందో అది వున్న వారికి సహజం గా గుర్తింపు లభించటంతో వారు తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణింపబడాలని కోరుకోవటం మొదలయింది.సహజంగా వారికి సంఘంలోఅన్ని పనులు చకచకా జరిగిపోవటం,ప్రభుత్వాలు వారు చెప్పినట్లు అనుకూల నిర్ణయాలు తీసుకోవటంతో వారి సంపద అనూ హ్యంగా పెరిగిపోతుంది.
        ఈ నేపధ్యంలో ఎవరికి వారికి వ్యక్తిగత స్థాయిలో డబ్బుద్వారా వచ్చే గుర్తింపును కోరుకోవటం ,ధనవంతుల మనే దర్పం ప్రదర్శించటం ,డబ్బు లేని వారిని తక్కువగా భావించటం ,తమ దైనందిన వ్యవహారాల్లో ఆ అహాన్ని చూపించే తత్వం స్థిరపడటంతో అది సంపద ద్వారా వచ్చిన అహంకారం గా పరిగణించవచ్చు.ఇది ప్రజల మధ్య ఎన్నో వైరుధ్యాలు సృష్టిస్తోంది.మధ్య తరగతి వారిలో కూడా తమ కంటే తక్కువ ఆస్తిని కలిగి ఉన్నవారి పట్ల చిన్న చూపు చూస్తున్నారు.సొంత ఇల్లు కలిగిన ఇంటి యజమానులు అద్దెకుండే వారిపై ఈ అహంకారంతో కూడిన మాటలు వాడ టం మనం వింటూ ఉంటాము.
      సంపద కలిగిన వారు దానిని ఎలా ప్రదర్శించాలి  అనే కోణంలో ఆలోచిస్తుంటారు.తమ కట్టుకున్న ఇంటి ద్వారా ధరించే బంగారు ఆభరణాల ద్వారా,ఖరీదయిన బట్టలు ధరించడం ద్వారా ,విలాసవంత మైన వాహనాలు ద్వారా భారీ వేడుకలు నిర్వహించటం ద్వారా తమ గుర్తింపును పెంచుకోవటానికి ,ఇతరులకు తమ ఆర్ధిక హోదా అర్థం కావ టానికి దాని ద్వారా తమ అహంకారాన్ని చూపిస్తుంటారు.ఈ క్రమంలో వారు తమ కంటే తక్కువ ఆర్ధిక స్థాయి కలి గిన వారిపట్ల వారిమాట తీరులో వారి వ్యవహార ధోరణిలో అడుగడుగునా సంపద ఇచ్చిన అహంకారం తొణికిసలాడు తుంది.బంధువుల మధ్య ఈ ధోరణి సంబంధాలను క్షీణింప చేస్తుంది.వారు సంపాదించే క్రమంలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేస్తూ,వారి హక్కులను కాలరాస్తూ ,తమ తోటి ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను తామే సొంతం చేసుకుంటూ వ్యవహరించే ఈ ధోరణి సమాజానికి ఎంతో అరిష్టం.
      సంపద కలిగిన వారిలో కొంత మంది ఎంతో నిరాడంబరంగా ,ఎక్కడా ఈరకమైన అహంకార ధోరణి చూపకుండా
సరళమైన జీవితాన్ని గడిపే వారిని మనం గమనిస్తుంటాము.ధర్మ బద్దంగా సంపాదిస్తూ ప్రభుత్వానికి పన్నులు కడు తూ సేవా కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనించ వచ్చు.అటువంటి వారు పెద్ద పారిశ్రామిక వేత్తలలో కూడా వున్నారు.మన మధ్య లో కూడా ఎంతో మందిని మనం గుర్తించ వచ్చు.
       సంపద సుఖాన్ని,విలాసవంత మైన జీవనాన్ని ఇవ్వ వచ్చు.ఆరోగ్యం సరిగా లేక పోతే ఎంత డబ్బు వున్నా నిష్ప్రయోజనం.సుగర్,బి.పి లేని ధన వంతులను మనం తక్కువగా గమనిస్తాంఎంత డబ్బులున్నా ఏమీ తినటానికి ఉండదు.తిన్నది అరగదు.సమస్యలతో కంటినిండా నిద్రపట్టదు.heart attacks,cancers వస్తే పరిస్థితి మరింత దారుణం. ఇంత మాత్రానికి డబ్బు పేరుతో విర్ర వీగటం ,అహంకారం ప్రదర్సించటం,తమ తోటివారిని ఇబ్బందులు పెట్టటం ఎంత వరకు సమంజసం.సంపాదనకు అంతు లేదు.ఎంత సంపాదించినా వారికంటే అధిక ధనవంతులు ఉంటూనే వుంటారు.వారు చూపించే ఆధిపత్యం ,అహంకారం తక్కువ ధనవంతులను మరల బాధ కలిగిస్తుంది.
        సంపద వున్నా తృప్తిగా జీవించకపోతే ,సమాజంలో మంచి పేరు,గౌరవం జీవిత కాలం లో సాధించలేకపోతే దేన్ని చూసుకుని ఇంత అహంకారం ప్రదర్సించారో అది మరణిస్తే తన వెంట రాదు కదా!అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాలని ,భూమండలాన్నంతా తన పాదాక్రాంతం చేసుకోవాలని బయలుదేరి భారత దేశం వచ్చి తిరిగి వెళుతూ మార్గ మద్యంలో మరణిస్తూ తన రెండు చేతులు తన శవ పేటిక పై చాచి ఉంచే లాగా ఏర్పాటు చేయ మన్నాడట తాను ఏమీ తీసుకు పోవటం లేదు అని చెప్పటానికి.
            తాను తన కంటే అధిక ధనవంతుల ద్వారా పొందే అవమానం తో బాధ పడే వ్యక్తి దానిని ఇతరుల పై చూప కుండా ఆ లక్షణం తనలో వున్నట్లు గుర్తించి సంపద ద్వారా అహంకారాన్ని కాకుండా,వినయాన్ని పెంచుకుంటూ తోటి మనుషుల యెడల సహకార ధోరణితో మెలిగితే తన జీవితం ధన్యం అయినట్లే!

Friday, 27 July 2012

అందంగా వుండే వారిలో అహంకారం ఉంటే!(4)


           నేను  ఎక్కువ అన్న భావం ప్రదర్శించే వారిని సమాజం లో చాలా మందిని చూస్తుంటాము.అందం ద్వారా భావం ఏర్పడిన వాళ్ళు తాము ఇతరుల కంటే చాలా అందంగా ఉన్నామని దానిని ప్రద ర్శించుకోవటం   కోసం అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ,విభిన్న సందర్భాలలో దానిని మాటల రూపం లో ,హావభావాల రూపం లో వ్యక్తం చేస్తుంటారు.అందంగా లేని వ్యక్తుల పై కామెంట్ చేస్తుంటారు.మేము B.ED  చదివే రోజుల్లో మా మిత్రుడు ఒకతను నల్లగా ఉంటాడు.కాని మంచి తెలివితేటలు ,ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యము ఉన్నాయి.ఇంకొక మిత్రుడు చాలా అందంగా ఉండేవాడు.అతను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు.ఒకరోజు ఒక అంశం పై సెమినార్ జరిగితే ఇద్దరు మాట్లాడారు.సెమినార్ అయిన తర్వాత అందంగా ఉండే మిత్రుడు మా దగ్గరికి వచ్చి నా మిత్రుని (నల్లగా వుండే)తో నీవు అచ్చు శివరాసన్లా (రాజీవ్ గాంధీ హంతకుడు) ఉన్నావు,అన్నాడుఇంకొకరయితే ఎలా సమాధానమిచ్చేవారో కాని నా మిత్రుడు చాలా కూల్ గా నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా అందంగాఉన్నావు అన్నాడు.అంతే వ్యాఖ్య చేసిన మిత్రుడు బాధపడి విచారం వ్యక్తం చేసాడు.
           ఈ విధం గా ఎంతో మంది అందంగా లేని వారిపట్ల అవమానకరమైన రీతిలో మనసు బాధ పడే లాగే వ్యాఖ్యానిస్తుంటారు.ముఖ్యంగా నలుపు,ఎత్తు,లావు గురించి కామెంట్స్ చేస్తుంటారు. అహంకారం ప్రదర్శించే వ్యక్తులు అవతలి మనుషుల మంచి తనానికి విలువ ఇవ్వరు.ఎప్పుడయినా తమకి అవసరమయినప్పుడు బాధలో వున్నప్పుడు వీరికి అందం లేని వారు సహాయం చేస్తే అప్పుడు వారిలో మానసిక మార్పు రావచ్చు.లేదా తాము ఆరోగ్యాన్ని కోల్పోయి అందాన్ని కోల్పోయినప్పుడు వారిలో అహంకారం సమసి పోవచ్చు.లేదా వయసు మీరిన తర్వాత వచ్చే వృద్ధ్యాప్యంవలన ముడతలు పడిన పడిన శరీరాన్ని అద్దంలో చూసుకుంటూ అప్పుడు తీరిగ్గా అహంకారాన్ని తొలగించుకోవచ్చు. లోపల జీవితం ముగిసి పోతుంది.అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలే గాని అహంకారాన్ని ఇవ్వ కూడదు.
     అందాల పోటీల్లో మీ జీవిత లక్ష్య మేమిటని అందగత్తెలను ప్రశ్నిస్తే సమాజానికి సేవచేయాలనో,అనాధలను వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవ చేయాలనో సమాధానమిస్తారు.అంటే వారిలో ఎంత వరకు  అంతఃసౌందర్యం ఉందో పరీక్షిస్తారు.అక్కడ సరి అయిన సమాధానము చెప్పేవారికే ప్రపంచ సుందరి కిరీటం దక్కుతుంది.వారికన్నా అందం గా వుండి  సరి అయిన సమాధానం చెప్పని వారికి కిరీటం తప్పి పోయిన సందర్భాలున్నాయి ..
        బాహ్య సౌందర్యం తాత్కాలిక మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది . రోజుకు మహనీయుల గురించి తలచుకుంటూ వుంటామంటే వారి ప్రవర్తన ,వారి ఆలోచనలు,వారి ఆచరణలను బట్టే  .ప్రపంచంలో ఎంతో మంది అంద మైన వాళ్ళు పుట్టారు,మరణించారు.అందం పేరుతో గొప్పవారుగా పరిగణింప బడే వారు ఎంత మంది?ఎంతో అందమైన సినిమా నటులయినా వారి నటనకు గుర్తింపు పొందుతారు, కాని అందంగా ఉన్నంత కాలం ఆరాధిస్తారు  తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా!అందంగా లేని ఎంతో మంది ఎన్నో రంగాల్లో అద్భుత మైన తెలివితేటలతో గొప్ప సేవా భావం తో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
      ఒక్క క్షణం అందంగా ఉండే వారంతా ఆలోచిస్తే వారిలో ఇటువంటి అహంకార మేమైనా ఉంటే  దాన్ని తమంతట తాము గుర్తిస్తే అంటే తమకి లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తిస్తే క్షణమే అహంకారం నుండి బయట పడగలరు.అప్పుడు వారికి ప్రపంచ మంతా అందంగా కనబడుతుంది.ముఖ్యం గా వారి మనస్సులో  అహంకారం  ఎప్పుడయితే తొలగి పోతుందో వారి ముఖము దేదీప్య మానంగా వెలిగిపోతూ వారు ద్విగుణీకృత మయిన తేజస్సు తో ప్రకాశిస్తారు.

Wednesday, 25 July 2012

అహంకారం యొక్క లక్షణాలు (3)


గత భాగం తరువాయి
అహంకారం యొక్క లక్షణాలను ఒకసారి గమనిద్దాము.
1)ఇతరుల కంటే  తాను అధికము అనే భావన మనిషిలో వుంటే అతని ప్రవర్తన లో అది ప్రతి సందర్భం లో కనిపిస్తూ ఉంటుంది.అతని మాట తీరులో అది వ్యక్త మవుతూ ఉంటుంది.ఇది అందం,డబ్బు,పదవి,,జ్ఞానం వలన కలుగుతుం టుంది.వీటిని ప్రదర్శిస్తూ మిగతా వారికి ఇవి లేవు అంతా నాకే తెలుసుఅన్న భావం లో ఉంటాడు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయటం,అవమాన పరచటం ,అసహ్యించుకోవడం,ద్వేషించడం చేస్తుంటాడు.
2))వీరి ఆలోచనా విధానం పరిమితమైన చట్రం  లో బంధించబడి ఉంటుంది.వీరు ప్రపంచం  గురించి గాని సమాజ శ్రేయస్సు గురించి కాని ఆలోచించరు.ఎవరు ఏమైనా ఫరవాలేదు.అన్న ధోరణిలో ఉంటారు.
3))పక్షపాతం తో వ్యవహరిస్తారు.నా కులం ,నా మతం ,నా వర్గం,నా పార్టీ గొప్ప అని భావిస్తూ  తను చెప్పిన విషయాన్నే అందరు అంగీకరించాలని భావిస్తుంటారు.ఇది సత్యాన్ని అంగీకరింప నీయదు.
4))ప్రపంచాన్ని తన కోణం లోనే చూస్తాడు.తన కనుకూల మైన దానిని మాత్రమే ఇష్ట పడతాడు.
5)నిరంతరం గుర్తింపు కోరుకుంటూ ఉంటాడు.తను చేసిన ప్రతిపనిని అందరు మెచ్చు కోవాలని భావిస్తుంటాడు .ఆస్తి,అంతస్తు,నటన,పదవి,జ్ఞానం,వీటి ద్వారా నిరంతరం గౌరవాన్ని కోరుకుంటూ ఉంటాడు.తమ కంటే వేరొకరికి గుర్తింపు వస్తుందన్నా భరించలేరు.
6)వీరు ఏ పదవిలో వున్నా తమ క్రింది సిబ్బందిని తమ ప్రవర్తన ద్వారా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
7)నేను చాలా ప్రత్యేకం ,నేను చాలా ముఖ్య మైన వ్యక్తిని అనుకుంటూ నిరంతరం ప్రాముఖ్యతను కోరుకుంటూ ఉంటాడు.
8)వీరు కొన్ని నిర్దిష్ట మయిన పద్ధతులు పాటిస్తూ ఉంటారు.వాటికి వ్యతిరేకం గా ఏమి జరిగినా తట్టుకోలేరు.రాజీ పడరు.వీరికి నచ్చజెప్పడం చాలా కష్టం.
9)వీరు నిరంతరం కీడును శంకిస్తూ,ఇతరుల లో నిరంతరం లోపాలను ఎంచుతూ ఉంటారు.వీరికి మంచి కన్నా చెడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
10)వీరు జీవితాన్ని అశాంతి,అసంతృప్తి,ఘర్షణలతో గడుపుతారు.
11) ఎప్పుడు భౌతిక వాదం లో మునిగి తేలుతూ తన అంతరంగ స్థితిని గురించిన ఆలోచన ఎప్పుడు చేయరు.
     అహంకారం కలిగిన వ్యక్తులు తమకు తాము నష్టం కలిగించుకోవడమే కాక సమాజాన్ని ఎన్నో కష్ట,నష్టాలకు గురిచేస్తుంటారు.
మరి ఈ అహంకారాన్ని ఏర్పడకుండా చూసు కోవడం ఎలా?ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడం ఎలా?
తరువాయి భాగంలో వివరిస్తాను. 

Tuesday, 24 July 2012

స్వార్థం ,అహంకారం రెండు వేర్వేరా!లేదా ఒకటేనా!(2)


గత వ్యాసం తరువాయి భాగం.
గత వ్యాసం పై కొన్ని సందేహాలకు సమాధానాలు .స్వార్థం ,అహంకారం అంటే ఏమిటి ?రెండు ఒకటా?వేర్వేరా ?ఒక సారి మనం నిఘంటువు అర్థాలు పరిశీలిస్తే వీటి గురించి మనకు ఒక అవగాహన వస్తుంది.
అహంకారం=గర్వం,ఆత్మాభిమానం,క్రోధం
అహం=గర్వం
అహంభావం= గర్వం
స్వార్థం =స్వప్రయోజనం
స్వార్థపరుడు =తన ప్రయోజనాన్ని చూసుకునే వాడు.ఇవి తెలుగు అకాడెమి వారి నిఘంటువు లోని  అర్థాలు
ఇక oxford dictionary లో
ego=the part of the mind that reacts to reality and has a sense of idividuality.మానవుని మనసులో ఏర్పడే నేను అనే వ్యక్తిత్వ భావన
egoism=an ethical theory that treats self interest as the foundation of morality
అనగా నేను లేదా తన ప్రయోజనం మే  ప్రధానమైన నైతిక సిద్దాంతం
  egoism is a term used in philosophy and psychology to mean self interest

selfish=concerned chiefly with one"s own profit or pleasure.
ఆధ్యాత్మికంగా
అహంకారం =అహం+ఆకారం =నేనే శరీరాన్ని.
అహంబ్రహ్మస్మి =నేనే బ్రహ్మాన్ని అన్నట్లుగా
              ఒకవ్యక్తి యొక్క మానసిక మట్టం చుట్టూ ఏర్పడే పరిమితమైన స్థితిని అహంకారం అంటారు.సహజత్వా నికి   విరుద్ధంగా సమత్వాన్ని  కోల్పోయిన స్థితినే అహంకారం అంటారు.నేను ఫలానా ,ఇదినాది,నాకు కావాలి అనే భావనలతో జీవించే స్థితినే అహంకారం అంటారు.
                                         i,my,mine are the three states of egoism.
       ఈ రెండింటికి అర్థాలు ఒకే లాగా కనిపిస్తున్నప్పటికీ సూక్ష్మంగా ఆలోచిస్తే కొన్ని భేదాలను గమనించ వచ్చు.అవి1)స్వార్థం అంటే కేవలం తన ప్రయోజనం చూసుకునే వాడు.
2)అహంకారం  అనగా తన ప్రయోజనమే ప్రధానమైన నైతిక  సిద్దాంతం. ఇంకా గర్వం అనికూడా అర్థం.ఇది కూడా philosophy, psychology లలో స్వప్రయోజనం అనే వాడారు అని  .oxford dictionary చెబుతుంది.కాని నిఘంటువుల అర్థాలతో పాటు మన indian philosophy ని పరిశీలిస్తే ఇది ఒక మానసిక భావనగా పరిగనిస్తారు.
          మొదట మానవుడికి ఏర్పడిన భావనను పై అర్థాల ప్రకారం స్వార్థం అన్న అహంకారం అన్న ఒకటేగా కనబడుతుంది.కాని ఆదిమ కాలంలో ఇది కేవలం ఆహార సేకరణ లో ఏర్పడిన భావం గా పరిగణిస్తే  మొదట స్వార్థం గా ప్రవర్తించేవాడు అని పరిగనించ వచ్చు.తరువాత పరిణామ క్రమం లో ఇది ఒక మానసిక స్థితిగా మారి దీనిని కోపం లాగా తన  మాటల ద్వారా ముఖం లో భావాన్ని చూపించే ఒక మానసిక సమస్య మారింది.ఇక ప్రస్తుతం దీన్ని వాడే క్రమం లో గర్వం గా కూడా తీసుకుంటున్నారు.
         ఏది ఏమైనప్పటికి,మనిషి కి ఎప్పుడో ఒకప్పుడు ఉదయించిన ఈ అహంకారాన్ని అర్థం చేసుకొని
దీని లక్షణాలను వివరంగా వచ్చే వ్యాసం లో చర్చిద్దాము.      

Sunday, 22 July 2012

మనిషిలో అహంకారం ఎలా మొదలయింది? 1


                   సమూహంలో ఉంటూ అందరు కలిసి ఆహారాన్ని సేకరిం చుకుంటూ ,దానిని కలిసి పంచుకుని తింటూ ఉన్నంత కాలం మనిషికి వ్యక్తిగతమంటూ ఏదీలేదు.ఎప్పుడయితే కుటుంబం ఏర్పడిందో అప్పుడు ఆహార సంపాద నలో స్వార్థం బయలుదేరి నా కుటుంబం,నా పిల్లలు,నా ఇల్లు అన్న వ్యక్తిగతమైన భావనలు బలపడ్డాయి. ఆహారా న్ని  తన కుటుంబానికి దాచి పెట్టుకోవటం,వస్తువులను సేకరించుకోవటం సంసారానికి కావలసిన  అన్ని రకాల పదార్థాల సేకరణలో మనుషుల మధ్య పోటీ ఏర్పడటం,ఆ పోటీలో మనిషి తత్వం లో మార్పులు చోటు చేసుకున్నా యి .అందులోంచి పుట్టినదే నా అన్న భావన.అప్పుడు ఈ భావన కేవలం బాహ్య పరిస్థితులకు మాత్రమే అన్వయిం చుకుని మనుష్యులు ప్రవర్తించే వారు.ఇది బాగా పూర్వ కాలానికి సంబంధించినది.
         సమూహాలనుండి,ఉమ్మడి కుటుంబాల నుండి  నేడు చిన్న కుటుంబాలు ఏర్పడ్డ తర్వాత వ్యక్తిగత వాదం పెరి గింది.ప్రతి సమస్యను తనే అధిగమించటానికి దాని గురించి ఆలోచించటం ప్రారంబించాడు.బాహ్య అవసరాలకోసం ప్రా రంభమైన ఈ తత్వం పూర్తిగా వ్యక్తి తన మనస్సును దానితో నింపి మధనం చేయటం ప్రారంభం కావటంతో మన సం తా నేను నాకు,నా వలన,నన్ను ,నాయొక్క నావారు,నాతోనే, నేను లేకపోతే ఇలాంటి ఎన్నో భావాలు మనిషి లో స్థిరపడిపోయాయి.మరల ఇవన్నీ మనిషి ప్రాధమిక అవసరాలు తీర్చుకోవటం వరకు బాగానే ఉంది.ఈ తత్వం ఇతరు లకు నష్టం కలిగించే విధంగా ,ఇతరుల హక్కులు కాలరాసే విధంగా తయారయినప్పటి నుండి దీని పై చర్చ ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.
          మరో వైపు మానవ పరిణామ క్రమంలో అభివృద్ది నా అన్న భావన వలన కూడా జరిగింది.కాని ఇది వ్యక్తి అభి వృద్దిని దెబ్బ తేసే విధంగా ఇతరుల హక్కులకు భంగం కలిగించే దశగా ప్రస్తుత దశను భావించవచ్చు.దీనినే మనం ప్రస్తుతం అహం అని అహంకారం అని నేను అనే భావన అని అంటున్నాము.ప్రస్తుత దశ  గురించి చర్చిద్దాము.       .          
          మానవ  జీవనం 20 వ శతాబ్దం నుండి విభిన్న మార్పులకు లోనవుతూ వస్తుంది.ప్రతి రంగం లో ఆధునిక మైన శాస్త్ర సాంకేతికత ప్రభావం తో అనూహ్యమైన అభివృద్ధి చోటుచేసుకుంటుంది.అదే సమయంలో మనిషి జీవన విధానం,ఆలోచనా విధానం మారిపోతూ వస్తుంది.ప్రపంచ మంతా వ్యక్తి వాదం ప్రబలి తన కుటుంబం,తన పిల్లలు కేంద్రం గా మనిషి ఆలోచన కేంద్రీకృత మయింది.తను అభివృద్ధి అయ్యే క్రమంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది.ఇతరులతో  పోటీ పడటం తన ఆధిక్యతను చూపించటానికి ప్రయత్నించటం,ఇతరులతో పోల్చుకుంటూ తను వారికంటే తక్కువ,లేదా ఎక్కువ అనే భావనలకు లోనవుతూ సంఘర్షణ లో ఉన్నాడు.
       ఈ క్రమంలో తన అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తూ స్వార్థాన్ని,సంకుచితత్వాన్ని పెంచుకుంటూ ఎవరు ఏమైనా ఫర్లేదు, నేను అందరినీ అధిగమించాలి.అంతా నాకు కావాలి,ఇది నాది,నేను ఫలానా అనే భావనలు మనిషికి అహంకారం సృష్టించాయి.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Thursday, 19 July 2012

అద్దెగర్భం


ఇల్లు అద్దెకు ఇచ్చినంత తేలికగా
అక్కడ గర్భాశయాలు దొరుకుతాయి
ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి
వంశాకురాలను  కడుపులో పెంచి అప్పగించాలి
ప్రేమ వాత్సల్యాల పాత్ర లేనే లేదు
ఇంట్లో దాచి వుంచిన వస్తువు ఇచ్చినంత తేలికగా
బ్యాంకు లాకర్ లో బంగారం దాచినంత సులువుగా
అంగట్లో సరుకును కొనుక్కున్నంత సునాయాసంగా
అక్కడ వారసులను కొనుక్కుంటారు
తనువులోని ప్రతికణం లోని శక్తి నిస్తూ
రక్త మాంసాలను రంగరించి మరో జీవికి  జన్మ నిస్తూ
మనః శరీరాలు అనుభవించే క్లేశాలను భరిస్తూ
కుటుంబ అవసరాల కోసం మగువ చేస్తున్నదీ త్యాగం
దేహాన్ని కర్మాగారంగా మార్చి
కడుపును యంత్రం గా చేసి
ఉచ్వాస నిశ్వాసాలను ఊపిరులుగా  ఊది
ప్రాణవాయువును ఇంధనంగా అందిస్తూ
ప్రతి జీవక్రియకు ప్రయాసపడి భారము మోస్తూ
ప్రాణాన్ని ఫణంగా పెట్టి చేస్తున్న ఈ సృష్టి యజ్ఞం
ఆమె పాలిట  జీవన్మరణ పోరాటం
పునర్జన్మ ఎత్తి మరో జీవికి జన్మనిచ్చిన ఆమెకు
కడుపు తీపి ప్రేమను పుట్టిస్తే  
కరెన్సీ నోట్లు నిర్దాక్షిణ్యంగా దానిని తుంచి వేస్తే  
కళ్ళ నీళ్ళు కుక్కు కొని ప్రేగు బంధం తెంచుకొని 
సంతానాన్ని చేజేతులా అప్పగించి 
కాసుల గల గలలను లెక్కబెట్టుకుంటూ 
మాతృత్వానికి ధరను నిర్ణయించుకున్న 
ఓ అభాగ్య అద్దె  మాతృమూర్తి! 
నీ ఆకలి కేకలకు అమ్మతనం చిన్నబోయింది 

Tuesday, 17 July 2012

నా హృదయ సీమ


 అహంకారం ఎరుగని సరిహద్దులకు
 నా మనసు విస్తరించనీ 
 అలంకరణలకు విలువివ్వని
 అభిమానాన్ని సంతరించు కోనీ
 ఆప్యాయతానురాగాల భావాల
 సమున్నత్వాన్ని పెంపోందించుకోనీ
 ఈ విశాల   విశ్వాంతరాళంలో 
 నా మానసిక సౌందర్యం విస్తరించి ప్రకాశించనీ
 నా హృదయ సీమ లోని ప్రతి కణం  ఈ ప్రకృతి పై
 అవ్యాజ్య అభిమానాన్ని నిలుపుకోనీ
 నా మనోగగనాన స్నేహ మధురిమల పరిమళాలు
నా శ్వాస  నాళాల్లో ప్రాణవాయువు
 ప్లవించే వరకు గుబాళించనీయనీ
 అని నా హృద్యంతరం లోని శక్తిని కోరుతున్నా

Sunday, 15 July 2012

దుర్యోధన దుశ్శాసన పర్వం


"అర్ధ రాత్రి ఆడది స్వేచ్చగా తిరగగలిగిన నాడే
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు "
అన్న మహనీయుల మాటలు తుత్తునియలు చేస్తూ
క్రూర వికటాట్టహాస పదఘట్టనలు
లేడి కూనలను వేటాడే క్రూర మృగాల  కర్కశత్వం
ఒంటరి అసహాయ మహిళపై అమానుషం
వ్యంగ్య బాణాలు ,విషరసాయనాల్లాంటి మాటలు
దేహాన్ని దగ్ధగీతంలా దహిస్తుంటే
నెత్తురు సలసలా మరిగి నరనరాల్లోకి
ప్రవహించదా! అభిమాన వతికి
పోరాటం పొత్తిళ్ళలో పెరిగిన బిడ్దేమో
గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రతిఘటిస్తే
కామోన్మాదం తలకెక్కిన విషపురుగుల
వికృత పైశాచికత్వం నిద్రలేచి
దుర్యోధన దుశ్శాసన పర్వానికి తెర తీసింది.
మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం
ఎక్కడో ఓ చోట ప్రతిరోజు ద్రౌపది ఆక్రందనలు
నిస్సిగ్గుగా నిలబడి చూస్తున్న జనం సాక్షిగా
విలువల వలువలు తగల బడుతుంటే
ఒళ్లంతా గొంగళి పురుగులు ప్రాకినట్లు
శరీరాన్ని తాకరాని చోట్ల తాకుతుంటే
నిస్సహాయంగా,బేలగా ముకులిత హస్తాలతో
మొగ్గలా ముడుచుకుని దీనంగా వేడుకుంటుంటే
తోడేళ్ళ గుంపు ఒక్కపెట్టున దాడి చేసినట్లు
అంగాంగాలను దుర్మార్గంగా తడుముతుంటే
కీచకుల వారసత్వాన్ని నీచంగా ప్రదర్శిస్తున్న
ఈ దానవ జాతిని ఏ పేరుతో పిలిచినా తక్కువే
అమ్మల స్తన్యంతో పెరిగిన కండలతో
అక్కచెల్లెల్ల ఆప్యాయత మరచిన రాక్షసత్వంతో
రెచ్చి పోతున్న ఈ మానవ మృగాలను ఏమనాలి?
హృదయవిదారకంగా విలపిస్తున్నా
వినోదంలా చూస్తున్న కన్నులున్న దృతరాష్ట్ర జాతి
సభ్యత సంస్క్రుతులకు సమాధి కడుతున్ననరాధముల్ని
యుగాల తరబడి క్షమిస్తున్నమానవజాతి
ఏ చరిత్రకు వారసులు వీరంతా !
మానవత్వం మరచిన ఈ మదాంధులను
ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? 

Friday, 13 July 2012

స్నేహం ఎక్కడనుండి ప్రారంభమవ్వాలి?(4)


          చిన్నప్పటి స్నేహంలో అంటే 10 వతరగతి వరకు స్నేహితుల మధ్య అనుబంధం గాఢంగా ఉంటుంది. వారి లోకం అంతా ఆటలు,చదువులు,బడి,ఉపాధ్యాయులు,విభిన్నమైన కళలు వంటి అంశాలతోసాగిపో తుంది.ఇక్కడ ఆటల్లో ఒకే అభిరుచి ఉన్నవాళ్ళు ఎక్కువ సన్నిహితంగా వుంటారు.చదువులో చర్చించు కుంటూ మరి కొంత మందితో స్నేహంగా వ్యవహరిస్తారు.రకరకాలయిన కళల పట్ల ఇష్టం ఉన్నవారు అందులో స్నేహాన్ని వెతుక్కుం టారు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోఅయితే ప్రభుత్వపాఠశాలలలో ఆటలు ఎక్కు వగా ఆడిపిస్తున్నారు..ప్రైవేటు పాఠశా లలు ఎక్కువశాతం మార్కులు,ర్యాంక్స్,talent test లతో IIT foundation  లతో మునిగిపోయి ఆటలు,కళలకు అసలు స్థానం లేకుండా చేసాయి.కొన్ని ప్రైవేటు పాఠశా లలు ఇందుకు మినహాయింపు .ఇలా బాల్యంలో అభిరుచులలోని సారూప్యత వల్ల ఒకరిద్దరితో ఏర్పడిన గాఢమైన స్నేహం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉన్నది.తరగతి మొత్తం తో స్నేహం చేయరు కాబట్టి వారు classmates గా మిగిలి పోతారు.ఈ వయసులో స్నేహితులతో ఆటలు,కంప్యూటర్ గేమ్స్ సినిమాలు,టి.వి చూడటంలో ఎక్కువగా మునిగిపోతే చదువు దెబ్బ తినే ప్రమాదముంది.తల్లిదండ్రులు ఈ స్నేహాలను గమనిస్తూ ఉండా లి.ఇక్కడే యుక్త వయస్సు ప్రారంభ మవుతుంది.కనుక శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మాన సిక ఉద్వేగాలు ఉంటాయి.వీటిని parents గమనించి వారితో స్నేహితు లుగా వ్యవహరిస్తూ వారి ని సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది.పిల్లలతో సంభాషిస్తూ వారి ఉపాధ్యాయులతో చర్చిస్తూ ఉంటె చెడు స్నేహాల వైపు దారితీయకుండా ఉంటారు.
           తల్లిదండ్రులు పిల్లలకు మొదటి స్నేహితులుగా ఉండాలి.తరువాత అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్లు అన్న చెల్లె ళ్ళు ,అక్కా తమ్ముళ్ళు పరస్పరం స్నేహితులుగా వ్యవహరిస్తే అంతకు మించిన స్నేహితులు బయట దొరకరు పర స్పర అభిప్రాయాలు పంచుకోవటం అనేది స్నేహానికి మొదటి పునాది.ఇది సొంత ఇంట్లోనుండే ప్రారంభమవ్వాలి పిల్ల ల మధ్య స్నేహాన్ని వృద్ది చేయాల్సిన బాధ్యత పెద్దలపై కూడా ఉంది ఒకరిని ముద్దు చేస్తూ అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ వేరొకరిని సరిగా పట్టించుకోక పోవటం ,ఆడపిల్లలకి ఒకరకం చదువు,అబ్బాయికి మరింత మంచి చదువు చెప్పించే సంస్కృతి ఇప్పుడు A.P లో బాగా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిని చదివిస్తూ ప్రైవేటు schools లోఅబ్బాయిలను చదివించటం ఎక్కువ యింది.పిల్లల్ని ఎప్పుడయితే సమానంగా చూస్తూ,వారితో చర్చిస్తూ స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తామో వారు కూడా తమలో తాము అంతే స్నేహంగా ఉంటారు.బయటి స్నేహితుల కంటే ఇంట్లో స్నేహితులు ఎంతో మంచిది కదా!ఆ విధంగా అన్నదమ్ములు అక్కా చెల్లెలు వ్యవహరించాలి.చిన్నప్పటి ఈ గాఢతే  పెద్ద యిన తర్వాత అనుబంధాలు,ఆప్యాయతలు చివరి వరకు ఉండటానికి దోహదం చేస్తుంది అన్న తమ్ము డికి స్నేహితుడైతే 95% అతని అభిప్రాయాలు పంచుకుంటాడు.ఇంకా ఏవైనా చెప్పలేనివి తన మిత్రులతో పంచుకుం టాడు.అలాగే అక్కచెల్లెళ్ళు కూడా !ఇలాంటి బంధాలు కుటుంబాల్లో అభివృద్ది కావాలి.
          కొంత మంది అభిమానాలు మనసులో ఉంచుకుంటారు.కాని వాటిని వ్యక్తం చేయలేరు.ప్రతి మనిషి ఎదుటి మనిషి నుండి స్నేహపూర్వకమైన పలకరింపును ఆశిస్తారు.భార్య అయినా పిల్లలయినా అదే కోరు కుంటారు.పనుల ఒత్తిడితో,బాధ్యతల బరువుతో తండ్రి పిల్లల పైన ,భార్య పైన చిరాకుతో కోపంతో విసుక్కుం టే వారి మనసులో క్రమేపి ఓ రకమైన వ్యతిరేక భావం ముద్ర పడి పోతుంది.కాబట్టి తండ్రి తన పిల్లల పట్ల స్నేహంగా ఉంటూ భార్యను మంచి స్నేహితురాలిగా పరిగణిస్తూ ఉండాలి.అలాగే తల్లి కూడా పిల్లల పట్ల తన భర్త పట్ల తన ఇష్టాన్ని,ప్రేమను వ్యక్త పరు స్తూ మంచి స్నేహితురాలిగా వ్యవహరించాలి.అప్పుడు ఆ కుటుం బం ఆనందంగా ఉంటుంది.పిల్లలు కాలేజిల నుండి మా ఇంట్లో ఇద్దరు స్నేహితులు(తల్లి దండ్రులు ) నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని త్వరగా ఇంటికి వస్తారు.ఈ స్నేహ సౌరభాలు పిల్లలు తమ మనస్సు లోనింపుకొని బయట ఉన్న తమ స్నేహితులతో వ్యవహరిస్తారు.అప్పుడు ఆ స్నేహాలు కల్మషం లేకుండా  అవాంఛనీయధోరణులకు దారితీయకుండా సక్రమ మార్గంలో ఉంటాయి.

Wednesday, 11 July 2012

ఓ స్వరం


ఓ స్వరం
నిశీధి నిద్రను చెరిపేస్తూ
ఓ గాత్రం
భావనా వీచికలను శ్రుతిచేస్తూ
స్వాప్నిక జగత్తులో
 ప్రేమైక లోకంలో
విహరిస్తూ
తపిస్తూ వున్న
నన్ను స్పర్శించింది
అలలా
సెలయేటి గలగలలా
కరిగిన మంచులా
చల్లగా
మెల్లగా
వీణను మీటిన నాదంలా
కోయిల గొంతున రాగంలా
నన్నే స్మరిస్తూ
నన్నే జపిస్తూ
నా హృదయ కోశం లో
ప్రతి  పొరను కదిలిస్తూ
గగనంలో ఎగురుతున్న
మేఘాలను పలకరిస్తూ
సున్నితంగా
సునిశితంగా
చిరుగాలి సవ్వడిలో
వెన్నెల చల్లదనంలో
మిళితమై చేరింది
వీనుల విందుగా    

Friday, 6 July 2012

వెన్నెల్లో జలకమాడినట్లు!


                                             నీలిరంగు పూసిన ఆకాశం కాన్వాసుపై
                                                  ధవళ వర్ణపు బొట్టు పెట్టినట్లు
                                             తల్లి చుట్టూ పాలకోసం తిరిగే పిల్లాడిలా
                                                 భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ
                                                 భువిపై రవి కల్పించిన రాతిరిని
                                                 వెలుగును నింపి కావలి కాస్తూ
                                                 పని ఒత్తిడిలో అలసి పవళించిన
                                             జనజీవన స్రవంతికి చల్లని కాంతినిస్తూ
                                                      చుక్కలన్నీ బిక్కుమంటూ
                                             మినుకుమినుకుమంటూ చూస్తుంటే
                                             వెండి మేఘాలను మరింత మెరిపిస్తూ
                                             పుడమి ఒడి పై పున్నమి చంద్రుడు
                                             పిండార బోసినట్లు వెన్నెలను ప్రసరిస్తుంటే
                                                  నా తనువులోని అణువణువూ
                                                  పరవశంతో  మైమరిచి పోతుంది
                                                  పౌర్ణమిలో ధ్యానం చేస్తుంటే
                                             నా శ్వాసలో మలయ పవనపు సందడి
                                             నా మేను వెన్నెల్లో జలకమాడిన అనుభూతి
                                             నా వీనుల్లో మురళీరవపు మంద్రనాదాలు
                                             మెల్ల మెల్లగా మనసంతా ఆలోచనారహిత స్థితి
                                             శూన్యం మదినిండా ఆవరించిన అలౌకిక స్థితి
                                                      అంతఃశ్చేతనలోని చైతన్యం
                                                పురి విప్పిన మయూరపు నాట్యమై
                                               వెన్నుపూసనుండి జరజరా పైకి ప్రాకి
                                               మెదడంతా ఆక్రమించిన విద్యుత్తేజమై
                                             శిరసునిండా విశ్వమంతా పరచుకున్నట్లు
                                                   ఓ సంపూర్ణ సహజానందం
                                                   దేహమంతా వ్యాపించింది

Sunday, 1 July 2012

యాంత్రిక మైన జీవితం


కష్ట పడితే ప్రభవించేది స్వేదం 
ఉద్విగ్నపు సంతోషానికి ఫలితం ఆనంద భాష్పం
గుండె గాయమైతే కన్నీటి ప్రవాహం
అనుభూతుల స్మరణలో కళ్ళల్లో చెమర్చే తడి
కష్టాలకు,ఆనందాలకు
అనుభూతులకు ,అనుబంధాలకు
స్పందించే మన శరీర ధర్మం
జీవితంలో ఇదేకదా నిత్యం జరిగేది
మనసుపై బాధల ఒత్తిడి పడనీకుండా
శోకం జ్ఞాపకాలుగా మిగలకుండా
 రక్షించే శరీర  యంత్రాంగం తీరు అర్థమైతే
మనిషికి మానసిక సమస్య లుండ వేమో!
శ్రమ లేని జీవితం
ఆనందం లేని జీవనం
నిస్సారమైన సంసారం
మదినిండా త్రుప్తి లేని గమనం
కాలంతో పరుగులు
బంధాలలో అంతులేని అంతరం
యాంత్రిక మైన యుగం లో
మనిషెంత కూరుకుపోతున్నాడో
ఇక స్పందనలకు సమయ మెక్కడ !

Friday, 29 June 2012

స్నేహం మొదలయ్యే క్రమం(3)


   ( మార్చ్ నెలలో స్నేహం(1),స్నేహం ఓ ఆహ్లాదం (2)తరువాత స్నేహం పై వ్యాసాలలో ఇది మూడవది.)
                స్నేహం  చేసుకుందామని  ఎవరూ  ప్రయాణం  మొదలెట్టరనుకుంటా ! ఎందుకో  రెండు  హృదయాలు  ట్యూన్ అవుతాయి.ఇద్దరు మగ అయినా ఇద్దరు ఆడ అయినా ,ఒక మగ ఒక ఆడ అయినా స్నేహితులు కావచ్చు చిన్నపిల్లలు కూడా ఒకరిద్దరితో స్నేహం చేస్తారు.వారితోనే ఎక్కువ మాట్లాడటం,వారి ఇళ్ళకు వెళ్ళటం వారితో       ఎక్కువగా ఆడటం పరస్పర అభిప్రాయాల్ని పంచుకోవటం ఇలా స్కూల్ స్థాయి నుండి కాలేజీ వరకు తరువాత జీవి తంలోను స్నేహం ఓ భాగమయి పోతుంది.
        అసలు స్నేహం చేయటం ఎందుకు?స్నేహానికి జీవితం లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి.జీవితం చివరి వరకు అవ సరమా!అవసరాలతో స్నేహాన్ని కోలుస్తామా!ఆస్తులు,అంతస్తులను స్నేహం చూస్తుందా!అలా చూస్తే అది స్నేహం అవుతుందా!అంతస్తులను చూసి స్నేహితులుగా వుంటే దాన్లో ప్రయోజనాలను ఆశిస్తారు కదా!ప్రయోజనాన్ని ఆశిం చేది స్నేహం ఎలా అవుతుంది?
      ప్రాథమిక స్థాయి నుండి 10 వ తరగతి వరకు కనుక కలిసి చదువుకుంటే ఆ స్నేహం జీవితంలోగట్టి పడి చివరి దాకా ఉంటుందేమో!స్నేహంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక.చిన్ననాటి స్నేహితులు ఆ ముచ్చట్లు ఇచ్చిన త్రిల్ మరేదీ ఇవ్వదేమో!చిన్నప్పుడు ఆడిన ఆటలు,చేసిన అల్లరి పెద్దయిన తర్వాత గుర్తు చేసుకుంటే ఆ తన్మయ త్వం ఆ ఆనందం వర్ణించనలవికాదు.
        కాలేజీ నుండి ఉద్యోగం వచ్చే వరకు  మిత్రులు ఓ రకం.పరిపక్వత కలిగిన స్నేహం.ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం,సాంత్వన పొందటం,పరస్పరం సహాయం చేసుకోవటం జరుగుతుంది.ఒక రకంగా కుటుంబం లోని వారికంటే ఎక్కువ స్నేహంగా ఉంటారు.ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది.అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్లకి అమ్మనాన్నలకి చెప్పుకోలేని సంగతులన్నీమిత్రులతోనే కదా పంచుకునేది.జీవితంలో 25 సం :వరకు అంటే పెళ్ళ య్యే వరకు స్నేహమొక ఆపాత మధురం.ఓ సజీవ స్రవంతి.ఓ భావ ప్రకంపనా ప్రపంచం.తరువాత జీవితంలో మన ఉద్యోగం లో మంచి స్నేహితులు తారస పడతారు .పరస్పర అవగాహ నతో కుటుంబ స్నేహితులు గా మారతారు ఇలా జీవన పయనం లో స్నేహం ప్రాధాన్యత ఎంత ఉందో!    

Monday, 25 June 2012

త్రిశంకు నరకం


                                                           
   నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి  పిలుస్తుంటే
   మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే
   లేత పాదాలు అటువైపే దారితీస్తుంటే
   ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ని 
   అగ్నిపర్వతం క్రేటర్లో మునగపోతున్నట్లు
   తుఫాన్ కన్నులో కాలు మోపబోతున్నట్లు 
   కాళ్ళ క్రింద భూమి చీలబోతున్నట్లు 
   ఏ సంకేతాలు వాడికి అందలేదు 
   ఆటలోని ఆనందం 
   కుతూహలం లోని ఉత్సాహం 
   వాడిని మరణం అంచుల్లోకి 
   వెళ్ళకుండా ఆపలేదు 
   అన్వేషణ అంతమయ్యే లోపు 
   వాడు త్రిశంకు నరకం లోకి 
   జారుతున్నాడు 
   కన్నులు పొడుచుకున్నా  
   కానరాని గాడాంధకారం  
   ఒళ్లంతా చీరుకుపోయి కారుతున్న రక్తం  
   ఏదో బండరాయి వాని చావుకు అడ్డుపడింది 
   అప్పుడు మొదలయ్యింది ప్రత్యక్ష నరకం 
   ఉచ్చ్వాస,నిశ్వాసలు భారంగా మారుతూ 
   కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ 
   గొంతు నిండా మట్టితో ఉక్కిరిబిక్కిరవుతూ 
   క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే 
   సమాంతర బోరుకు సన్నాహాలు 
   ఆక్సిజన్ గొట్టాల జారవేత 
   గంటలతరబడి వేలమంది కన్నీటి ధారలతో 
   గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో 
   మార్మోగుతున్న ఆ ప్రాంతంలో 
   ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం 
   బయటకు తీసిన వాడి శరీరంలో 
   కొన ఊపిరయినా ఉందేమోననే ఆశ 
   నిరాశగా మారిన ఆ క్షణం 
   దిక్కులు పిక్కటిల్లేలా శోకం 
   ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో 
   రక్కసిలా నోరు తెరిచిన ఈ బోరు బావుల్లో 
   యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు 
   చిన్నారుల చిరునవ్వుల కోసం                                                                                                                                                               

Saturday, 23 June 2012

అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!


       
రాత్రి ముసుగును భూమి కప్పుకున్నవేళ
నేను రక్త మాంసాల దోసిళ్ళలో నిదరోతున్నాను
                  ఉచ్చ్వాస ,నిశ్వాసాల్లోఉన్ననాలో కదలిక
                 అందుకే  అమ్మ ఆర్తనాదాల ధ్వనులిక
                 నా చిన్ని గుండె తడబడుతుంది
                 నా లోన ఆవేదనే రగులుతోంది
ఎక్కడో అరుపులు,బాధామయ రోదనలు
ప్రసవ వేదనలు,ఆకలికేకల శోధనలు
అమ్మ పీల్చే గాలిలో మిళితమై ప్లవిస్తూ
నా శ్రవణేంద్రియాలలో ధ్వనిస్తూ
నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి
                       ఓ వెన్నెల కిరణం
              నా తనువును స్పర్శిస్తున్నట్లుంది
             శశి నిశి పరదాలను తొలగిస్తున్నట్లుంది
               ఓ భయ విహ్వలత కంఠద్వానం
ఓ అంతరాల సమాజ వికృత పదఘట్టనలు
మరో శ్మశాన విషాద గీతాల ఆర్తారావాలు
శతకోటి దరిద్రనారాయణుల దీనాలాపాలు
అనారోగ్యంతో మరణించే పసివాళ్ళ ఆక్రందనలు
ప్రకృతీ వికటాట్టహాస వైపరీత్యాలు
         మత మూఢత్వాలపైశాచిక ఆనందపు డోలికలో
          తేలిపోతూ తూలిపోతు ఒకరినొకరు నరుక్కునే
         సుందర ప్రపంచాన్నానేను చూడబోయేది  
         ఇదేనా నా తడబడు అడుగులు పడబోయే ధరిత్రి
అణుధూళి విరామమెరుగక నిండబోయే రోజులు
సర్వమానవ వినాశ హేతువుల కారణభూత రాజ్యాలు
ఇవేనా నాకగుపించే  భవిష్యత్ సుందర్ దృశ్యాలు
          నా కొద్దు ఆ రాబోయే పరిణామాల ఫలితం
          ఇక్కడే ఆనందంగా,ఆహ్లాదంగా వుంది
          నా మనుగడకు ప్రాణం పోస్తూ తన మమకార
          మాధుర్యాలను నాలోన పొందుపరుస్తున్న
          అమ్మ ఆనంద బృందావనంలో
          ఇలానే ఉండాలనివుంది
          అందుకే అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!        

Friday, 22 June 2012

ఆధిక్యతా భావన (2)


               ఈ బంధాలు నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలి?మొదట అన్న తమ్ముళ్ళకి ,అక్కాచెల్లెళ్లకి తాము ఎలా పెరిగారు?చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ?తాము ఎలా కలిసి పెరిగారు?అప్పటి ప్రేమ ఆప్యాయ తలు మనసులో ఉంచుకోవాలి.ఎవరు ఏ స్థాయిలో వున్నా పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి బాధ మరొకరు పంచుకోవాలి.ముఖ్యంగా ఒకరు చెప్పేది మరొకరువినాలి.అప్పుడు బంధువులయి నా స్నేహం ఉంటుంది.ఆ స్నేహం లో అర్థం చేసుకునే గుణం ఉంటుంది.ఆ గుణమే బంధాలను నిలబెడుతుంది.ఆర్ధిక హోదా నుండి,చదువుల వలన వచ్చిన కీర్తి నుండి,హోదా నుండి వచ్చిన పేరు నుండి కలిగిన ఆధిక్యతను మిగతా వారిపై చూపటం వలన బంధాలు విచ్చిన్నమవుతాయి.సమాజంలో చాలా మంది ఈ బంధాలను నిలబెట్టుకుంటున్నారు.అంతే స్థాయిలో ఇవి బలహీనమవుతున్నాయి.
         సరే ఇవి కలవలేనంతగా తెగిపోయాయి అనుకుందాము.అప్పుడెలా?ఏముంది ఎవరి జీవితాలు వారు మిగ తా వారితో పోల్చుకోకుండా ,ఈర్ష్య పడకుండా తమకున్న అవకాశాల మేరకు సంతృప్తిగా ఆనందంగా జీవించ టమే కోపం,ద్వేషాలు పెంచుకోకుండా పరస్పరం నష్ట పరిచే చర్యలకు పాల్పడకుండా ఎవరి పరిధులలోవారు ఉండటమే!ఇది ఎంతో ఉత్తమమైన విధానం.
      అలాకాకుండా ఆస్తులు పంచుకోవటంలో వచ్చిన తగాదాలు,మాట జారటంలో వచ్చిన కక్షలు కొనసాగుతూ
తాము నాశన మవుతు కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.ఇది అనాగరికమైన చర్య. వారి కక్ష్యల కు,ద్వేషాలకు పిల్లల జీవితాలు బలి అయి పోతాయి.ఇంకో తరం అభివృద్ది ఆగిపోతుంది.ఎన్నో జీవితాలు ఇలా ధ్వంసం  అయినవి మనకు కన్పిస్తాయి.
    పై అన్ని అంశాలను విశ్లేషిస్తే కుటుంబ సంబంధాలు అద్భుతంగా మారాలన్నా ,సంబంధాలు కలకాలం నిలవా లన్నా ఆ భావన ఇరువైపులా వుండాలి.అలా లేక పోయినా అవి నిలబడకపోయినా  ఘర్షణలు లేని వాతావరణంలో జరగాలి.

Tuesday, 19 June 2012

ఆధిక్యతా భావన (1)


                                                       
             మానవుడి మనస్సు స్నేహాన్ని,ప్రేమను అద్భుతంగా స్వీకరిస్తుంది.కోపాన్నిద్వేషాన్నిఆధిక్యతా భావనను వ్యతిరేకిస్తుంది.ఏ వయసు వారయినా దీనికి అతీతం కాదు.చిన్నపిల్లల్నిగమనిస్తే మనం ప్రేమ పూర్వకంగా వ్యవహ రిస్తున్నామా ,వారిపట్ల కోపంతో ,దయ లేకుండా ప్రవర్తిస్తున్నామా!అన్నవిషయాన్ని వారు గమనించి వారి వ్యతిరేక తను ఏడుపు రూపంలో,లేదా కోపం రూపంలోవ్యక్తపరుస్తారు.ఇక మిగిలిన వారి గురించి చెప్పేదేముంది.
      మానవ సంబంధాలను ఆధిక్యతా భావన విచ్చిన్నం చేస్తుంది.ఒక కుటుంబాన్నిగమనిస్తే భార్యా భర్తల మధ్య చక్కటి అవగాహన ఉండి,పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటూ చిన్నచిన్నభేదాభిప్రాయా లను సర్దుబాటు చేసుకుంటూ ఉంటె అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది.అలాకాకుండా భర్త,భార్యపై ఆధిక్యత ప్రదర్శిస్తుంటే కొన్నాళ్ళ పాటు దానిని భరిస్తుంది.ఏదో ఒక సమయంలోఅది తిరుగుబాటుగా మారుతుంది.అలాగే భార్య భర్తలపై ప్రదర్శించే ఆధిక్యత కూడా ఇలాంటిదే.అక్కడ ఇద్దరి మధ్య ఉండవలసింది ముఖ్యంగా స్నేహం.స్నేహం ఇద్దరినీ కలిపి ఉంచు తుంది.ఆధిక్యతా భావన వేరుచేస్తుంది.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముల మధ్య ఎన్నోభేదాభిప్రాయాలు వస్తుంటాయి.వీటిల్లోముఖ్యంగా ఆర్ధిక హోదా,చదువులో తేడాలు,మాటలు ముందుగా జారటం ఇవన్నీఈ బంధాలు తెగిపోవటానికి కారణమవుతున్నాయి.
        ఒక్కో కుటుంబంలో అందరిని తండ్రి చదివించలేక కొంత మంది వ్యవసాయంలో,చిన్న ఉద్యోగాల్లో ఉండిపోతారు మిగిలిన వారు చదువుకొని ఉన్నతస్థానాలకు వెళతారు.ఇంకో కుటుంబంలోతండ్రి అందరిని చదివించినా తెలివిలో తేడాలుండటం వలన ఒకరు ఉన్నత స్థానానికి వెళ్లి మిగిలిన వారు సాధారణ జీవితం గడుపుతుంటారు.మరికొన్ని కుటుంబాలలో తండ్రికి గల ఆర్ధిక సమస్యలవలన ఒకరిని ఖర్చుపెట్టి ఉన్నత చదువులు చదివిస్తాడు.రెండవ వారికి (తెలివి వున్నాకూడా)డబ్బులేక సాధారణ కోర్సులు చదివిస్తాడు.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య కూడా మంచి చదువు, మంచి సంబంధాలు కుదరటం(ఇక్కడ అందం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది)సాంఘికంగా ఉన్నత  స్థానంలో కొంద రు,సాధారణ స్థాయిలో మరికొందరు ఉండటం జరుగుతుంది.ఇక్కడే ఒకరిపై మరొకరికి భేదభావాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు లేనివారితో సరి అయిన మానవ సంబంధాలు కొనసాగించలేక పోవటం, వారి పై  ఆధిక్యత ,ఆధిపత్య భావజాలం ప్రదర్శించటం వలన ఆ సంబంధాలు క్షీణిస్తాయి.అదే విధంగా వారు ఉపయోగించే బాష వ్యవహార శైలి,సంభాషణ తీరు తక్కువ స్థాయిలో వున్నవారిని బాధించే విధంగా ఉన్నాఆ బంధాలు బలహీన మవుతాయి.
      పై వాటినన్నింటిని గమనించిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్ధికపరంగా చదువులపరంగా, ఆస్తుల పరంగా సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతయినా వుంది.సమాన అవకాశాలను కల్పించినా వారు ఉన్నత స్థానాలకు వెళ్ళకపోతే అది వారి సామర్థ్యాలను బట్టి ఉంటుంది .కాబట్టి తరువాత ఆక్షేపించే అవకాశం వారి కుండదు,
     ఒకప్పుడు ఎక్కువమంది సంతానం ఉండేది కాబట్టి అందరికి సరి అయిన సమాన అవకాశాలను తల్లిదండ్రులు కల్పించలేక పోయేవారు.కాని చిన్నకుటుంబాల(ఇద్దరు కలిగిన)లో సమానంగా పెంచటం, సమాన అవకాశాలను కల్పించటం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత.
(మిగతా భాగం తరువాత వ్యాసంలో )

Sunday, 17 June 2012

నేనే మీకు సజీవ సాక్ష్యాన్ని!


అస్పష్ట చిత్రాలు
సంక్లిష్ట దృశ్యాలు
స్పష్టత లేని చూపు
భవిష్యత్ ప్రమాదాన్ని సూచించలేదేవ్వరు?
నాకు కూడా అనిపించలేదు
కత్తుల వంతెన పై కాలం సాగుతుందని
బోర్డు కనపడదు మరి
విన్న దాన్నివిశ్లేషించుకోవడం
మిత్రులతో చదివించుకోవడం
వారికి తిరిగి వినిపించడం
జీవితమంతా సంఘర్షణల రణం
లక్ష్యం ఘనం గా ప్రతిష్ఠించుకున్నా
ప్రతి పరీక్షలో విజయం సాధించా
కీలకమైన జీవన గమనానికి
అనర్హుడివని తీర్మానించారు
నాలుగు రోడ్ల కూడలిలో జీవితం
ఆటంకాల మధ్య ప్రయాణం
అవకాశాలకై వెతుకులాట
నన్ను నడిపించింది ఆశావాదం
అంతులేని ఏకాగ్రత నాకు వరం
గణితాన్ని అవపోసన పట్టా
ఉద్యోగం సాదించా
ఇది నా పోరాటం
ఇది గొప్ప విషయమేం కాదు
కానీ నాలాంటి పిల్లలను గుర్తించండి
బాల్యంలోనే వారికి సహాయపడండి
ఇంత కష్టం! ఇంత నష్టం!
కలగకూడదు ఎవ్వరికి
అర్థం కావటం లేదు అన్న
 నా  విద్యార్థులకు చెబుతుంటా
నేనే మీకు సజీవ సాక్ష్యాన్నని
ఎవరు ఏమైనా సాధించగలరని
దేన్నైనా నేర్చుకోగలరని
నిరాశతో ఉన్నవారికి చెబుతుంటా
"నన్ను చూసి మీ జీవితాన్ని ప్రేమించండి
 ఆశావాదాన్ని మనసు నిండా నింపండి"  

     ఇది ఒక  అంధ ఉపాధ్యాయుని అంతరంగ ఆవిష్కరణ.ఆయన పేరు ఆంజనేయులు.ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర సానికవరం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు.ఆయనకు చిన్నతనంలోనే వచ్చిన అరుదైన రెటీనా జబ్బు వలన చూపు క్రమేపి కోల్పోవటం, ఆయన ఎదుర్కొన్నకష్టాలు ఉపాధ్యాయ శిక్షణ కార్య క్ర మంలో చెబుతుండగా ఈ కవిత వ్రాసి అందరి ఎదుట దానిని చదివి ఆయనకు అందించటం ఎంతో త్రుప్తి నిచ్చింది ఆయనను చూసి మనిషెంత ఆశావాదిగా ఉండాలో నేర్చుకోవచ్చు.  

Sunday, 10 June 2012

జీవితాన్ని తృప్తిగా జీవించటానికి 10 సూత్రాలు(2)


గత భాగం తరువాయి
           వీటన్నింటికి డబ్బు ఎక్కడనుండి వస్తుంది.డబ్బు సంపాదించటం కోసం ,అదనపు ఆదాయం కోసం సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు ప్రయాణం చేస్తారు.ప్రధానంగా ఉద్యోగుల్లో నైతే అవినీతి, మిగ తావారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలకోసం మోసాలు చేయటం,షేర్లు కొనటం ,అమ్మటం, రియల్ ఎస్టే ట్ ,పేకాట,పందాలు కట్టటం, అధిక వడ్డీలకు ఆశపడి ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల్లో deposites కట్టటం 10000 లకు  60,000 రూపాయలిస్తామని చెప్పే కంపెనీల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకోవటం(ఈ మధ్య india లోని 3 రాష్ట్రాల్లో 2000 కోట్లు జనం పోగొట్టుకున్నారు.) networkmarketing సంస్థల్లో చేరటం ఇలా విభిన్న మార్గాల్లో మోసపోతుంటారు.మరల ఆ కోల్పోయిన డబ్బును సంపా దించటం కోసం పలు అక్రమ మార్గాల వైపు ప్రయాణిస్తుంటారు.మనిషికి ఇదంతా నిత్యకృత్య మయింది.
          వీటన్నింటికి కారణం మనిషికున్న కోరికలు,వస్తువులు విచ్చల విడిగా కొనే సంస్కృతి,అత్యాశ కార ణంగా చెప్పవచ్చు.కోరికలు దుఃఖానికి కారణమని 2500 సం: క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు కోరికలను పరిమితం చేసుకోవాలి.మనకున్న ఆదాయాన్ని బట్టి మన ఆలోచనలుండాలి .అత్యాశకు పోకూడదు. ఎక్కువ వడ్డీ,ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారంటే అందులో ఏదో మోసం ఉంటుందని అంచనా వేయలేక పోవటం జనం యొక్క బలహీనత.బ్యాంకు, పోస్టల్ వడ్డీల కంటే ఎక్కువ వస్తుందంటే రిస్క్ పెరిగినట్లే.
      ఇక విద్య,వైద్యం వ్యాపారమయంగా మారిపోయాయి.ప్రైవేటు స్కూ ల్స్ ,కాలేజీల ఫీజులు పేద మధ్య తరగతి వారిని అప్పులపాలు చేస్తున్నాయి.అలాగే వైద్యం ఖర్చులు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. జబ్బులు రాకముందే ముందు జాగ్రత్త తీసుకునే అలవాటు మనుషులకుండటం లేదు.విద్య,వైద్యం తప్ప ని సరి అయినవి కాబట్టి సరి అయినవి ఎన్నుకోవటం చాలా అవసరం.లేక పోతే ఫలితం రాకపోగా ఎంతో డబ్బును, విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతాము.వస్తువులు విపరీతంగా కొనే సంస్కృతిని పరిమి తం చేసుకొని తమ పిల్లలకు మంచి విద్యను అందింప చేయటం,చక్కని ఆరోగ్య పరిరక్షణకు తమకున్న వనరులు ఖర్చు చేయటం సరి అయిన ఆర్ధిక ప్రణాళిక.ఇన్ని ఒత్తిడుల మధ్య మనిషి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు.మానసిక సమస్యలు,B.P,SUGAR,గుండెపోటులకు గురవుతున్నాడు వ్యసనాలకు బానిస కావటం చివరకు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది.
      ఆడంబరం లేని సరళమైన జీవితాన్నిఎలా జీవించాలో తెలుసుకోవాలి.జీవితం తృప్తిగా ఆనందంగా గడిచి పోవాలంటే ఏమి కావాలో తెలుసుకోవాలి.అందుకు కొన్ని మార్గాలు
 1) కోరికలను పరిమితం చేసుకోవటం
2) అవసరం లేని వస్తువులను కొనే సంస్కృతిని తగ్గించుకోవటం
3) ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు
4) ప్రాధమిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం
5) అత్యాశకు పోకుండా వుండటం
6) కష్ట  పడకుండా  సులభంగా సంపాదించాలనే ఆశకు పోకుండా వుండటం
7) పొదుపు మంత్రాన్ని పాటించటం
8) సరళమైన జీవితాన్ని గడపటం
9) ఇతరులతో పోటీని ,పోలికను మానుకోవటం
10) వ్యసనాల బారిన పడకుండా వుండటం
ఈ 10 సూత్రాలతో చాలావరకు జీవితాన్ని తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు.        

Saturday, 9 June 2012

జీవితం తృప్తిగా జీవించాలంటే!1


            ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం ,లేదా వ్యాపారం ,వ్యవసాయం వృత్తి పనులు ,స్వయం ఉపాధి మార్గాలు ఎన్ను కొని జీవితాన్ని గడుపుతుంటాడు.తరువాత వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంబిస్తాడు ఇక్కడ నుండి ఎంతోముందుచూపు,చక్కని ఆర్ధిక ప్రణాళిక ఉంటె కానీ అతని జీవితం సరి అయిన దారిలో నడవదు.
      కుటుంబం గడవటానికి అవసరమైన డబ్బు సంపాదన అన్వేషణాక్రమంలో మనిషి ఎన్నో మార్గాలను వెతుకుతుం టాడు.చట్టబద్ధంగా,న్యాయబద్దంగా అయితే ఫర్వాలేదు.తన అవసరాలు,కోర్కెలు తీర్చు కోవ డం కోసం అవసరమైన ధన సంపాదన మనిషిని  ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
          ముందుగా మనిషి అవసరాలు ఏమిటి? అని ఆలోచిస్తే ఇల్లు,ఆహార పదార్థాలు బట్టలు,విద్య వైద్యం వీటిని మ నం ప్రాధమిక అవసరాలుగా పరిగణిస్తాం.సొంత ఇల్లు కట్టాలంటే స్థలము ఎంతో ముందుగా కొని పెట్టుకోవాలి.ఇల్లు కట్ట టానికి అయ్యే ఖర్చును లెక్కించి ఎంతో చక్కని ఆర్ధిక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి.అలా కాకుండా మన స్నేహి తులో బంధువులో కట్టారని అప్పు చేసి ఇల్లు కట్టటం తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులుకు లోను కావడం మంచిది కాదు పరిస్థితులు అనుకూలించేంతవరకు వరకు అద్దె ఇంట్లో వుంటూ దీర్ఘకాలిక ప్రణాళికతో ఇల్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత మన ప్రాధమిక అవసరాలకు దాన్ని ఏవిధంగా ఖర్చు పెట్టాలి?అన్నపూర్తి అవగాహనతోనడచుకో వాలి.
        మనం తినే ఆహార పదార్థాలలో పోషకాహారాలకు ఖర్చు పెట్టాలి.చాలా మంది ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థా ల కు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు .బట్టలు కూడా విలువైనవి పోటీ పడి కొంటుంటారు. ఇందులో ఎక్కువగా మిగ తావారిని చూసి వారి కంటే మిన్నగా వుండాలని కొంటుంటారు.ఒక మనిషికి స్త్రీ అయినా పురుషుడు అయినా ఐదు లేక పదిజతలు అవసరమవుతాయి.కానీ ప్రస్తుతం ఇంతకు ఎన్నోరెట్లు కొంటున్నారు.
        ఇక ఇంటికి అవసరమయ్యే వస్తువులు కొనే సంస్కృతి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.ప్రతి ఒక్కరి ఇంట్లో డబు ల్ కాట్ ,టి.వి ,ఫ్రిజ్ కూలర్, సోఫా సెట్,dyning table, ఖరీదయిన కుర్చీలు,కంప్యూటర్ లాంటి పరికరాలు కొంటు న్నారు .ఇవన్నీ ఉంటేనే మిగతా వారికి సరితూగ గలమని భావిస్తున్నారు.తమ ఆదా యానికి మించి అప్పులు చేసి మరీ కొన టం జరుగుతుంది.అలాగే బంగారం మీద విపరీతమైన వ్యామోహం తో ఖరీదయిన ఆభరణాలు చేయించుకో వటం ఒక fashion గా మారిపోయింది.మిగతా వారితో పోలిక ఈ వస్తువులను కొనే సంస్కృతిని పెంచుతుంది
         అలాగే cell phones అత్యంత ఖరీదయినవి కొనటం,విపరీతం గా వాటి ద్వారా మాట్లాడటంతో ఎంతో డబ్బు వృధా చేస్తున్నారు.చిత్తూర్ జిల్లాలో ఒక పరిశీలన ప్రకారం గత సం:సెల్ ఫోన్ బిల్ 500 కోట్లు అయి నట్లు తేలింది.జిల్లా మొత్తం వాడిన పాల బిల్ 450 కోట్లు.గమనించండి.కాలేజీ పిల్లలకు కూడా వీటిని కొనిచ్చివారి జీవితాలను పాడుచేస్తున్నారు ఇక ద్విచక్ర వాహనాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదు. ప్రతి చిన్న పనికి వాహనాలు వినియోగిస్తూ పెట్రోలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.అందుకే చైనాలో సైకిల్ ను దేశమంతా వారంలో ఒకరోజు వాడేలా ప్రోత్సాహిస్తున్నా రు.ఇక విందులు,వినోదాలు,ఫంక్షన్లకు పోటీలు పడి ఖర్చు పెడుతున్నారు.కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే ఫంక్షన్ల లో ఆహారపదార్థాలు ఎంతో వృధా అవుతుంటాయి.ఒకరిని మించి మరొకరు తమ ఆడంబరాన్ని చూపటానికి ఈ ఫంక్షన్స్ కి ఖర్చు పెడుతున్నారు.మధ్య తరగతి ,పేదవారు కూడా అప్పులు చేసి మిగతావారితో పోటీలు పడి వ్యయం చేస్తున్నారు.
      (మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Tuesday, 5 June 2012

శబ్ద సౌందర్యం


                                                                  ఓ స్వరం
                                                                  ఓ పిలుపు
                                                                ఒక విభ్రమం
                                                               ఒక సంభ్రమం
                                                           ఉఛ్ఛ్వాసం మరచిన
                                                            నిశ్వాసం నిలిచిన
                                                        ఆ క్షణం సుదీర్ఘ నిరీక్షణం
                                                  నిశ్శబ్దాన్ని చేధించిన శబ్ద సౌందర్యం
                                                 జ్ఞాపకాల పుటలపై పుప్పొడి పరిమళం
                                                  అనంత అంతరం అంతరించిన  వేళ
                                                  మనసంతా వెన్నెల ప్రసరించినట్లు
                                                 ఆశ్చర్యం ఆనందం ఉత్తేజం ఉల్లాసం
                                                       చేజారిన అమృత కలశం
                                                        చిక్కిన చక్కని భావన
     

Monday, 4 June 2012

ప్రకృతికే సరికొత్త భాష్యాన్నిద్దాం


నీలి  సంగీతాన్ని  పరచుకొని ఆకాశం
శశి కోసం ఎదురుచూస్తున్నట్లు
నీరెండ చాయలో నిలబడి నీకోసం
నాలో నేనే పల్లవి పలికిస్తుంటా
సంధ్య యాత్రను ముగించుకొని తన ఒడిలో
ఒదిగే దినకరుని కోసం చూసే పర్వతాల్లాగా
నింగిని రంగులతో అద్ది ముగ్గులతో ముద్దిడి
ఇంద్ర ధనుస్సు తో అలంకరించి వేచి చూస్తుంటా
మల్లెలు మత్తుగా పిలుస్తున్నాయి మరి
జాబిలి ఎందుకో ఈ రోజు రెచ్చగొడుతుంది
భావ విహంగాలు నా నుండి నీకు చేరటం లేదా
నా గాన మకరందాన్ని నింపుకొని గాలిలో
అలలై తేలి నా విరహాన్ని వినిపించటంలేదా
పూల పల్లకిని సిద్ధం చేసి పండు వెన్నెలను రంగరించి
మంచు ముత్యాల తోరణాలు కట్టి
తెల్ల మబ్బుల అల్లరి చిత్రాల కాన్వాసులను
నీవు వచ్చేదారుల్లో స్వాగతానికి పెట్టా
మాటలు రాని చుక్కలకు పలుకులను
పాటలు రాని ఉరుములకు గీతాలు నేర్పించా
దారంతా పున్నమి కాంతులు వున్నా నీకోసం
మెరుపుల చమక్కులను సిద్ధం చేసా
ఏంటో నా పిచ్చిగానీ నీకివన్నీ ఇచ్చే తృప్తి  కంటే
నా సాంగత్యం లోనే నీ హృదయ సరస్సులో
ప్రేమ పుష్పాలు విరుస్తుంటాయి
కానీ ఎందుకో నీ కోసం ఈ ఆకాశపు చిత్రాలన్నీ
భువి పైకి తెచ్చి నీ కందించాలనిపిస్తుంటుంది
నీవు నాదరికొస్తే మనం  ఈ
ప్రకృతికే సరికొత్త   భాష్యాన్నిద్దాం  

Friday, 1 June 2012

కోపాన్ని జయించటం ఎలా?3


             ఆరోగ్య పరంగా కలిగే నష్టం గురించి చెప్పాలంటే అడ్రినలిన్ అనే హార్మోన్   కోపం వచ్చిన సమయం లో రక్తం లోకి ఎక్కువ గా విడుదల అవుతుంది.ఇది చాలా సేపటి వరకు రక్తం లోనే ఉండిపోతుంది.దీని వలన గుండెకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం వుంది.కోపంలోమన భాష అదుపు తప్పుతుంది.అలాగే కొంత మంది ఈ కోపాన్ని గుర్తుపెట్టుకొని ద్వేషంగా మార్చుకొని అవతలి వారికి నష్ట పరిచే చర్యలు కూడా చేపడతారు.అప్పుడు ఇంకా మరిన్ని సమస్యలు వస్తాయి.మానవ సంబంధాలను దారుణం గా దెబ్బ తీసే ఈ కోపాన్ని జయించటం ఎలా?
      ఇది ఒక్క సారిగా కోపం రాకుండా వుండాలని నిర్ణయించుకొని రేపటినుండి ఆపాలి అంటే ఆగిపోయేది కాదు.మరి ఎలా?కోపాన్ని అణచి వేయకుండా మీ ప్రతి స్పందనని కొద్దిసేపు వాయిదా వేయండి.కొంత మంది ఒకటి నుండి పది వరకు లెక్క పెట్ట మంటారు.అంటే మాటల ద్వారా మీ స్పందన తెలియజేయ కుండా కొంత విరామం తీసుకుంటే ఈ లోపు కోపం కొంత తగ్గుతుంది. అప్పుడు మన బాష కొంత మృదువుగా వస్తుంది.కాని మీకు జరిగిన అన్యాయాన్ని ,అవమానాన్ని భరించమని చెప్పటం లేదు.మీరు స్పందించదలచుకున్న అంశానికి కోపాన్ని జత జేయకుండా అవే ప్రశ్నలను సహనం తో అవతలి వ్యక్తిని ప్రశ్నించండి.ఆ లోపు అతను కూడా తేరుకుని మారవచ్చు.లేదా మీకు తన వివరణ ఇవ్వవచ్చు.ఇక్కడ స్పందన ప్రతి స్పందన లకు మధ్య విరామాన్ని ఇస్తే సమస్య చాలా వరకు తేలికౌతుంది. నిర్మాణాత్మకమైన ప్రశ్నలు వేయటం ద్వారా అవతలి మనిషి ప్రవర్తన మారే అవకాశం ఎక్కువ.మనం గొంతు పెంచి అరిస్తే అవతలి వారు బలహీనులైతే కొంత సేపు సహిస్తారు.సమానులు,లేదా బలవంతులైతే అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తారు.
          మీ కోపానికి కారణం అవతలి వారి ప్రవర్తన అయితే వారి ప్రవర్తన ఎందుకు నచ్చలేదో మృదువైన మాటలతో చెప్పటానికి ప్రయత్నించండి.ఫలితముంటుంది.ఇలా మీకు అనువైన మార్గాలను అన్వేషించండి.దీనికి పెద్ద జ్ఞానం అక్క ర్లేదు.పెద్ద చదువులు అక్కర్లేదు.పల్లెటూర్లలో చదువు రాని  నిరక్షరాస్యులు సైతం సహనంతో,నింపాదిగా సమస్యలను పరిష్కరిస్తూ వుంటారు.ఇదంతా అనుభవాల ఆధారంగా మనిషి నేర్చుకుంటాడు.ఒక సారి కోపగించుకుంటే కలిగిన నష్టాన్ని అంచనా  వేసుకొని  ఇంకో సారి అలా కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటె చాలు.రెండు,మూడు అనుభవాలతో మనకు పూర్తిగా  అర్థమయిపోతుంది,కోపం ద్వారా సాధించేదేమీ లేదని.
         కోపగించుకున్నారు.పొరపాటును గుర్తించి మీ కంటే పెద్ద వారయితే విచారాన్ని వ్యక్తం చేయండి.చిన్న వారయితే అభిమానాన్ని,ప్రేమను మృదువైన మాటలతో ప్రదర్శించండి.సమస్య సర్దుకుంటుంది.