Thursday, 28 November 2013

అభివృద్ది పల్లవించిన గంగదేవిపల్లె


            ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి . ఆ సమావేశాల్లో గంగదేవిపల్లెను గురించి చెబితే బాగుంటుంది.
            పల్లెలన్నీ నిరక్షరాస్యత ,జీవన ప్రమాణాల తరుగుదల ,పేదరికం ఆకలి చావులు వంటి సమస్యలతో కునా రిల్లి  పోతున్నాయి.వాటికి అతీతమైనదేమీ కాదు ఒకప్పటి గంగదేవిపల్లె.అప్పుడు ఆ ఊరు మద్యం మత్తులో ముని గి తేలుతుంది.రోడ్లు లేవు కరంటు లేదు.ఊరంతా ఫ్లోరైడ్ నీళ్ళు .అధికారులు,రాజకీయ నాయకులు పట్టించు కున్న పాపాన పోలేదు.ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా,గీసుకొండ మండలంలో ఉంది.
         కూసం రాజమౌళి ఆయన మిత్రులు గొనె చేరాలు,చల్ల మల్లయ్య,కూసం నారాయణ పెండ్లి రాజయ్య ఓ జట్టుగా కలిసి ఆ ఊరిని ఆదర్శంగా తయారు చేయాలని సంకల్పించారు.గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఆ ఊరిలో బడి లేదు డాక్టర్ లేడు. శివారు గ్రామం,పంచాయతీ కూడా కాదు. మద్యం తో అందరు ఇంట బయటా గొడవ పడుతుండే వారు.నాటు సారా త్రాగి చని పోతుండేవారు.రాజ మౌళి ఆయన  మిత్రులు కలిసి ఊర్లో సారాపై నిషేధం విధించారు.  ప్రతి ఇంటికి వెళ్లి త్రాగుబోతులకు నచ్చజెప్పారు.సారా contractors వ్యతిరేకించారు.అయినా లెక్కచేయకుండా అభి వృద్ది వైపు తోలి అడుగు వేసారు.1994 లో ఈ గ్రామానికి పంచాయతీగా గుర్తింపు వచ్చింది.
             తరువాత నీటి కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తుల చందాలతో  రూ 53000 వసూలు చేసి లోడి ,బాల వికాస్
సంస్థల  సహకారంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. టాటా కంపెనీ సహాయంతో ఫ్లోరైడ్    రహిత త్రాగునీరు ఏర్పాటుచేసుకున్నారు.2000 సంవత్సరం సిమెంట్ రోడ్లు ,వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి.కానీ ఊరంతా ఆరుబయట మలమూత్ర విసర్జనాలు చేస్తుండేవారు.పారిశుధ్యం పై వారిలో చైతన్యం కల్పిం చారు రాజమౌళి.జరిమానాలు హెచ్చరికలతో ఊరంతా దారికి వచ్చారు.తరువాతి కాలంలో అక్షరాస్యతపై నాటి కలు వేయించి రాత్రి బడులు తెరిపించారు.పది మంది నిరక్ష్యరాస్యుల బాధ్యత ఒక అక్ష్యరాస్యుడికి అప్పగించారు. 2002 నాటికి 100% అక్ష్యరాస్యత సాధించారు.పిల్లలందరినీ బడిలో చేర్చారు .
            తరువాత పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటేలా తప్పనిసరి చేసారు. మొక్క పెంచకపోతే మంచి నీళ్ళు కట్ చేసారు.ఆ వూరిలో కరంట్ చౌర్యం చేయరు.సకాలంలో బిల్లులు చెల్లిస్తారు. తగాదాలు పంచాయతీలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలే తీర్పు ఇస్తారు ఎన్నికల్లో మందు,నోట్ల పంపిణీ నిషేదించారు.1995 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ ఎన్నికలే ఊర్లో మహిళలే మహారాణులు.1995 నుంచి అందరు మహిళలే వార్డ్ members 14 పొదుపు సంఘాలున్నాయి .కెనడా,బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన సంస్థలు గ్రామ అభివృద్ధిని మెచ్చుకున్నాయి . శిక్షణ కొచ్చిన ప్రతి ఐఏఎస్ కు ఈ ఊరు ఓ పాట్యాంశం. 2005 లో పంచాయతీరాజ్ కమీషనర్ చెల్లప్ప "దేశం లో ప్రతి జిల్లాలో ఇలాంటి గ్రామం ఒకటుండాలి" అన్నాడు .
           గ్రామం లో 13 అభివృద్ది కమిటీలు వేసారు. రూపాయికి 20 లీటర్ల మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు
2007 లో  ఈ గ్రామం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికయింది . కూసం రాజమౌళి గారు అప్పటి నుంచి సర్పంచ్చ్ గా కొనసాగుతున్నారు.ఈ గ్రామం అగ్రశ్రీ అవార్డ్ సాధించింది.నిర్మల్ గ్రామ పురస్కారం అబ్దుల్ కలాం ద్వారా స్వీకరించారు . వివిధ పార్టీలున్నా ఊరి మంచికోసం అందరూ స్పందిస్తారు .
         ఇలాంటి గ్రామాలు దేశమంతా ఏర్పడితే దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది.
             (ఈ సమాచారం ఈనాడు ఆదివారం నుండి సేకరించ బడింది .వారికి ధన్యవాదాలు )

Sunday, 24 November 2013

స్టీవ్ జాబ్స్ చెప్పిన జీవిత సత్యాలు

       సాంకేతిక ప్రపంచానికి రారాజు లా వెలుగొందినా తాను జీవితం లో చూసిన ఎత్తు పల్లాలను తనదైన మాటల్లో ఓ తాత్వికవేత్తలా స్టీవ్ జాబ్స్ చెప్పిన తీరు ఆయన మాటల్లోనే 
  •  "మనిషి జీవితం లోని అన్ని సంఘటనలకు లింక్ లు ఉంటాయి . వాటన్నిటిని కలుపుతూ  పోతే అదే భవిష్యత్తు అవుతుంది . అదే జీవిత మవుతుంది . ప్రతి మార్పును ఆహ్వానించాలి.ఆస్వాదించాలి . "
  • "జీవితంలో ఎదురుదెబ్బలు అవసరం.ఆత్మ విశ్వాసాన్నికోల్పోకూడదు.చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలి.ఎప్పుడూ ఒకే పనిలో సెటిల్ అయిపోకూడదు . అలా అయిపోతే మనలోని కొత్త ఆలోచనలు బయటికి రావు.జీవితంలో ఎలాంటి మెరుపులు ఉండవు ".   
  • "ప్రతి రోజు ఇదే నీ ఆఖరి రోజు అనుకోని బ్రతికితే ఏదో ఒకరోజు నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు . "
  • "ఈ భూమ్మీద మనుషులందరూ సమానంగా పంచుకునేది ఏదయినా ఉందంటే అది మరణమే .కాబట్టి ఈ ప్రయాణం లో ఎదురయ్యే అవమానాలు,రాగ ద్వేషాలు ,అపజయాలు అన్నీసమానమే". 
  • "మనం  ఏం వదిలేసి వెళ్ళిపోతున్నాం అన్నదే ముఖ్యం.సాటి వారికి ఎంత సాయ పడ్డాం,ఈ ప్రపంచానికి ఏం అందించ గలిగాం,ఎంత ప్రేమను పొందాం అన్నదే శాశ్వతం". 
  • "connecting the dots,నేను దీన్ని నమ్ముతాను. మన లక్ష్యం బలంగా ఉండాలి.ఎన్నిఅనూహ్య పరిణామాలు ఎదురయినా మనసు కోకూడదు.అప్పుడే ఆ పరిణామాలన్నీ అనుసంధానమై లక్ష్యం వైపు నడిపిస్తాయి ".

Sunday, 10 November 2013

ప్రజల ప్రాణాలు గాల్లో!

           చార్ ధామ్ యాత్రలోఆకస్మిక వరదల్లో వేలల్లోభక్తులు మరణించారు.భక్తీ పారవశ్యంతో వెళ్లి కుంభమేలాల్లో ఆలయాల్లోతోక్కిసలాటల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఆలయాలు,మత సంబంద ప్రాంతాల్లో గత పదేళ్ళలో 1000 మంది ప్రాణాలు కోల్పొయారు.వీటిల్లో నిస్సహాయులైన మహిళలు ,వృద్దులు,చిన్నారులు   బలి అవుతున్నారు. వరదలు,తుపానులు వలన మరిన్ని వందల మంది మరణిస్తున్నారు. ఆలయాలకు ఆదాయం పుష్కలంగా వస్తున్నా సురక్షిత ఏర్పాట్ల పై ఏమాత్రం దృష్టి పెట్టక పోవటం ,గత అనుభవాల నుండి పాటాలు నేర్వక పోవటంతో ఈ సంభవిస్తున్నాయి.
               ఇవన్నీఒక ఎత్తు అయితే ఇక యముడి నరకలోకానికి దారులా అన్న విధంగా ఉండే మన రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఏడాదికి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ మధ్య వోల్వో బస్సులో45 మంది సజీవదహన సంఘటన మనసును కలచి వేసింది.ఈ ఘటన కలిగించిన భయంతో ట్రైన్ లో పొగలు రావటంతో దూకి ప్రాణాలు పోగొ ట్టుకున్న వారెంత దురదృష్టవంతులు.ఇక గౌతమీ ఎక్ష్ ప్రెస్ లో మంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారిదెంత విషా దం.ఇక లారీలు,ఆటోలు ,బైక్స్ ప్రమాదాలు లెక్క లేనన్ని ఆగి ఉన్న లారీని డీ కొని ఎన్నో  ప్రమాదాలు జరుగుతు న్నాయి.బైక్స్ పై వేగంగా వెడుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.విజయవాడలో బస్ స్టాప్ లో ఆగి ఉన్న వారిపై కారు వెళ్ళడం వారు చనిపోవడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కెంత భద్రత ఉందో అర్థమవుతుంది .
          వీటి వెనుక ప్రజలు సరి అయిన జాగ్రత్తలు తీసుకోక పోవటం,డ్రైవర్స్ నిర్లక్ష్యం ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపో వటం రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించే యంత్రాంగం వైఫల్యం ,త్వరగా గమ్యం చేరుకోవాలనే ప్రయాణీకుల తొందర ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి.
        పటిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ,ముందస్తు హెచ్చరికలు ,చట్టాలను కటినంగా అమలు చేయటం,ట్రాఫిక్ నిబం ధనల ప్రచారం , లైసెన్స్ ల తనిఖీ, వాహనాలు  సరి అయిన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం  వంటి చర్యల వలన వీలయినంత మేర ప్రమాదాలు  తగ్గించవచ్చు.ప్రజలు తమ విలువైన ప్రాణాలు  కాపాడు కోవటానికి తగిన  జాగ్రత్తలు తీసుకోవటం ,పకడ్బందీ ఏర్పాట్లతో ప్రయాణం చేయటం ఎంతో అవసరం .    

Monday, 4 November 2013

పుట్టిన రోజు ఇలా చేస్తే ఎలా ఉంటుంది!


           మా చిన్నప్పుడు పుట్టిన రోజు చేసుకున్న జ్ఞాపకాలే లేవు.గుర్తు ఉంచుకుందామనుకుంటూ ఉంటాము.   తీరా ఆ  రోజుకి మర్చి పోవటం ,18 వ ఏట అనుకుంటా ఓ ఫ్రెండ్ గుర్తుచేసేదాకా ఇలా మరిచిపోవటమే జరిగింది మరి ప్పుడో పిల్లల పుట్టిన రోజులు ఎంతో వైభవంగా జరపటం చూస్తున్నాము.ఘనంగా ఆడంబరంగా జరుపుతున్నారు.   ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.చిన్నప్పుడు ఓ 5 లేదా 6 ఏండ్ల వరకు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరు పుకుంటే బాగుంటుందేమో!
          ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు .ఇది అంతా మామూలే! ఇక చెప్పేదేమిటంటే ఈ మధ్య మా అమ్మాయి పుట్టిన రోజు ఏదైనా విభిన్నంగాచేద్దామనుకున్నాను. గుర్తు ఉండిపోయేలా!అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది అని. కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి. వాటిని పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే పాటశాల సరయిన చోటు అని నిర్ణయించుకున్నాక దగ్గరిలో ఉన్న నర్సరీ నుండి 8 కానుగ మొక్కలు తెప్పించి బడి పిల్లలు మరియు మావ్యాయామ ఉపాధ్యాయుడు  రామానాయక్ సహకారంతో నాటించాను.ఆయన అప్పటికే చాలా  మొక్కలను పెంచాడు.8,9 తరగతుల పిల్లలకు వాటి బాధ్యత అప్పగించాము.ఒక్కొక్కరికి ఒక మొక్క కేటాయించి వాటి సంరక్షణ చూడమని ప్రోత్సాహించాము.అలాగే పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము .
             ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా 7 వ వంతు జనాభా ప్రతి ఒక్కరు ఇలా ఒక మొక్క నాటినా   ఏటా 100 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!
మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి  బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !