Monday 30 May 2022

నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం... ప్రియాంక చోప్రా

 అందరికి శుభమధ్యాహ్నం. ఈ అమ్మాయి పేరు ఈవ,16 ఏండ్ల వయసు. ఈ వయసులో అమ్మాయిలు వారి అమాయకత్వాన్ని ఆనందిస్తూ,వారి యవ్వనంలో త్రుళ్ళుతూ గడుపుతుంటారు. కానీ ఇంత చిన్న వయసులో ప్రపంచం లోని తన తోటి పిల్లల గొంతుకై, అవకాశాల్లేని యువతులు, మహిళలకు సలహా లిస్తూ ఇటువంటి గౌరవాన్ని పొందటం విశిష్ఠ మైన విషయం. ధన్యవాదాలు.  మీలాంటి అద్భుతమైన, అపురూపమైన మహిళల మధ్యన నేను పాల్గొనడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను.   ఇక్కడ హాజరయిన ఎంతో గొప్ప విజయాలు సాధించిన octavia, మిచేల్, కెల్లీ, పాటి లాంటి 50  మంది మహిళలకు నా అభినందనలు. మీ విజయాలు నాకే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తి నిస్తాయి. మీ ప్రక్కన నిలబడటం నాకెంతో గర్వ కారణం. మీ జీవితం లో ఒక్క సారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇక్కడి దాకా ఎలా వచ్చాం, ఇక్కడ ఎందుకు నిలబడ్డాము అని. నాక్కూడా నా మూలాల్లోకి తిరిగి వెళ్లి చూసుకోవాలనిపిస్తుంది. నేను అపురూపమైన, అద్భుతమైన తల్లిదండ్రులకు పుట్టాను. వాళ్ళు భారత సైన్యం లో పనిచేసారు. నేను వారికి ప్రధమ సంతానం.99% మా తల్లిదండ్రులనుగర్వపడేలా చేసాను. కొన్ని సార్లు వ్యక్తిగత విజయాలు చెప్పుకుంటే ఎక్కువ గా చెప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు పుట్టాక కూడా నాకేమీ మార్పు లేదు. మా ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చారు మా తల్లి దండ్రులు.ఈ విషయాన్ని నేను నొక్కి చెప్పగలను. సమాన అవకాశాలు ఇవ్వడం మీకు సాధారణం అనిపించవచ్చు కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోలాగానే మా భారత్ లో కూడా ఈ అసమానత్వ సమస్య ఉన్నది.ఈ అసమానత్వం చాలా చిన్న వయసు నుండే అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉంటుంది.సేవా భావం కలిగిన, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల ఇంట్లో నేను పెరిగాను. వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు. తక్కువ సంపద కలిగి ఉన్నవారికి సేవ చెయ్యడం అనేది అవకాశం కాదు అది ఒక జీవన మార్గం అని మనం ఎంతో అదృష్టవంతులమని చెబుతుండే వారు.నాకు  7,8 ఏండ్ల వయసు నుండే మా తల్లి దండ్రులు వెర్రిల్లి పట్టణ చుట్టూ ప్రక్కల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నన్ను తీసుకెళ్ళే వారు. నేను రోగులకు మందులు ఒక ప్యాకెట్ లో పెట్టి ఇచ్చే దాన్ని. ఈ పని నేను చాలా తీవ్రంగా చేస్తుండే దాన్ని. ఇలా నేను వెడుతున్నప్పుడు బాల బాలికల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు గమనించాను.ఉదాహరణకు బాలికలను యవ్వనం రాగానే పాఠశాలలు మాన్పించి వివాహానికి సిద్ధం చేస్తారు. కాని బాలు రు వారి బాల్యాన్ని ఆనందిస్తుంటారు.స్త్రీలు అయినంత మాత్రాన ప్రాధమిక మానవ హక్కులు, ఆరోగ్యం నిరాకరించబడటం అన్యాయం. ఇలా నేను ఎదిగే కొద్ది ఇటువంటి ఎన్నో అంశాలు గమనించాను. నా సినిమా కెరీర్ 18,19 ఏండ్లకే మొదలయ్యింది. స్త్రీ ని అయినందుకు నాకు తక్కువ పారితోషికం ఇవ్వజూపే వారు, నేను వ్యతిరేకిస్తే నా స్థానం లో ఇంకొకరికి అవకాశం ఇచ్చేవారు.ఎందుకంటే వినోద రంగం లో మహిళలను మారుస్తూ ఉంటారు. అప్పుడు నన్ను వారు మార్చలేని విధంగా తయారవ్వాలని నిర్ణయించుకున్నాను. చివరకు అంతిమంగా ఇది ప్రియాంకా చోప్రా foundation పుట్టుకకు దారి తీసింది. దీని తరపున విద్య, వైద్య రంగాల్లో  UNICEF భాగస్వామిగా పని చేయాలని నిర్ణయించుకున్నాను.12 ఏండ్ల క్రితం మా ఇంట్లో పని మనిషి వాళ్ళ అమ్మాయి, నేను షూటింగ్ నుండి త్వరగా వచ్చిన రోజు నా పుస్తకాల గది లో పుస్తకం తీసి చదవడం గమనించా,8 లేక 9 ఏండ్లు ఉంటాయోమో పుస్తకాలంటే ఎంత ప్రేమో అనుకున్నా, ఈ రోజు బడి ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నేను ఇక బడికి వెళ్ళను అంది.వాళ్ళ అమ్మను అడిగితే  అమ్మాయిని అబ్బాయిని బడికి పంపే స్థోమత లేదు మాకు అన్నది.ఆ అమ్మాయికి చదువుకు డబ్బు వృధా, ఆ డబ్బు తో వారికి పెళ్లి చేయవచ్చు అంది. నా కు ఆ మాట ఈడ్చి కొట్టినట్లు తగిలింది. నా అంతరంగాన్ని కుదిపేసింది.ఆ అమ్మాయి చదువుకయ్యే ఖర్చు నేను భరించాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి చదువు కొనసాగించాలి ఎందుకంటే, చదువనేది కనీస మానవ హక్కు మరియు ప్రస్తుతం అత్యా వశ్యకం. అప్పుడు దృఢముగా నిర్ణయించుకున్నా ఎంత మంది పిల్లల జీవితాల్లో వీలయితే అంత మార్పు తీసుకు రావాలని, ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నా.ఈ మధ్యే ఒక అందమైన కోట్ చదివా,ఈ సందర్భంగా దాన్ని చెప్పటం చాలా సమయోచితం అనుకుంటా " ఈ రోజు ఊయల ఊపే చేయి రేపటి తల్లిని తయారు చేస్తుంది, స్త్రీ నాగరికత యొక్క విధినే రూపు దిద్దుతుంది " అటువంటి అందమైన సృష్టి అయిన ఆడబిడ్డలు నేడు మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కావడం విధి కల్పించిన దుఃఖకరమైన నిందా స్తుతి కాక మరేమిటి? ప్రపంచాన్ని మార్చే శక్తి బాలికలకుంది. అది నిజం.గత రెండు దశాబ్దాల్లో ఎన్ని ప్రయత్నాలు ఎంత అభివృద్ధి జరిగినా తరగతి గదుల్లో బాలుర కంటే బాలికలు చాలా తక్కువగా ఉన్నారు.కోటి మంది బాలుర తో పోలిస్తే కోటిన్నర మంది  ప్రాధమిక పాఠశాల బాలికలు చదవడం వ్రాయడం నేర్చుకోలేక పోతున్నారు. ఇదీ మన భవిష్యత్తుకు ఆరంభం. గత 11 సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహం, యుద్ధం, సెక్స్, హింస ల బాధితులు, వాటి నుండి నుండి బయట పడ్డవారికి UNICEF చేసే నమ్మ శక్యం కాని అపూర్వమైన సేవను వీక్షిస్తున్నా, కానీ చాలా పని మిగిలి ఉంది చేయడానికి. నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం, అదే ఈ సమస్య పట్ల నా నిబద్దత కు కారణం, అక్కడనుండే నా తీవ్రమైన ఇష్టం మొదలయింది, ఎందుకంటే బాలికా విద్య కుటుంబాలకు అధికారం ఇవ్వడమే కాదు సమాజానికి, ఆర్ధిక వ్యవస్థకు కూడా తోడ్పాటు నందిస్తుంది. ఇక్కడ కూర్చున్న కళాకారులు, ప్రభావశీలురు మనందరి సామాజిక బాధ్యత ఏంటంటే మాట్లాడలేని వారి గొంతుక కావడం.ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ ని ఎందుకు ప్రశంసిస్తున్నానంటే, మీ కందరికి ఈ సమస్య పట్ల ఉన్న అవగాహనతో మీ మీ కార్యక్షేత్రాల్లో మీ స్వరాన్ని వినిపించండి, మనం బ్రతికున్నంత వరకు ఒక్క తరపు బాలికలు కూడా విద్యను కోల్పోకూడదు. ఈ వేదికపై నాకు అవకాశమిచ్చిన "Variety " సంస్థకు, ప్రోత్సహించిన మీ అందరికి, ఇక్కడున్న అందరం ఈ సమస్యపై పోరాటం చేస్తూ ముందుకెళదామని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ ) (https://youtu.be/iCwKM6uB71I)

Friday 27 May 2022

మూడడుగుల్లో విశ్వం

 మూడడుగుల్లో విశ్వం:రచయిత డా. వి. శ్రీనివాస చక్రవర్తి పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్     భూమి మీద  దూరాలను కొలవడం సులభంగానే మానవుడు నేర్చుకున్నాడు. కాని ఖగోళ దూ రాలను కొలవడానికి మానవునికి కొన్ని వందల సం.రాలు పట్టింది. రచయిత అందుకు జరిగిన ప్రయత్నాలను సవివరంగా ఇందులో వివరించారు. ఆసక్తికరమైన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. మొదటి మెట్టు :మొదటగా క్రీ. పూ  ఎరటోస్తనీస్, పోసిడోనియస్ విశ్వం స్థాయిలో శాస్త్రీయ పద్దతిలో దూరాలు కొలిచారు.భూమి వ్యాసాన్ని, చుట్టుకొలతను అంచనా వేసారు.అరిస్టార్కస్, హిప్పార్కస్ భూమి వ్యాసాన్ని ఆధారం చేసుకొని చంద్రుడి దూరాన్ని అంచనా వేసారు.భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది అని,భూమి నుండి సూర్యుని దూరం కొలవటానికి ప్రయత్నించిన వారు అరిస్టార్కస్.1543 లో నికోలాస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రత్తిపాదించారు. గ్రహాల దూరాలను అంచనా వేయడానికి కొత్త సూత్రాన్ని అందించిన వాడు కెప్లర్.1609 లో గె లీలియో ఒక దూరదర్శినిని తయారు చేసి ఆకాశం కేసి గురిపెట్టాడు.1673 లో గియోవానీ సూర్యునికి భూమికి మధ్య దూరం సగటున 9,29,65,000 మైళ్ళని అంచనా వేశారు. దీన్ని ఖగోళ ఏకాంకం (AU) అంటారు.1830 లో విల్ హెల్మ్ బెసెల్ హీలియో మీటర్ ను వాడటం మొదలు పెట్టాడు. 61 సిగ్మస్ అనే తార దూరం 64 ట్రిలియన్ మైళ్ళు అని కనుగొన్నారు కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు.ఒక ఏడాదిలో (6 లక్షల కోట్ల (ట్రిలియన్ ) మైళ్లు ) కాంతి ప్రయాణించిన దురాన్ని కాంతి సంవత్సరం అంటారు ఆల్ఫా సెంటారీ తార దూరం 4.3 కాంతి సం వత్సరాలని థామస్ హేండర్సన్ కనుగొన్నారు.1900 సం.రానికి  విక్షేప పద్ధతిని ఉపయోగించి 70 తారల దూరాలను కనుగొన్నారు 1950 కల్లా 6000 తారల దూరాలు కనుగొన్నారు. మన కంటితో 6000 తారలను చూడగలం.1609 లోనే గేలీలియో పాల పుంత గెలాక్సీ ని గమనించాడు. విలియం హెర్షల్ 1785 లో రోదసిలో తారలన్ని ఒక కటకం ఆకారం లో అమరి ఉన్నాయని ప్రతిపా దించాడు.                                              రెండవ మెట్టు :1921 లో 25 సెఫెయిడ్ తారలను హేన్రి యేట్టా లీవిట్ కనుగొన్నారు. షాప్లీ గోళాకార రాసులను కనుగొన్నాడు. గేలాక్సీ పరిమాణం కొలవాలని ప్రయత్నించాడు. సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ సెకనుకి 150 మైళ్ళ వేగంతో కదులుతూ  200 మిలియన్ ఏండ్లకు ఒకసారి గేలాక్సీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. గెలాక్సీ వ్యాసం లక్ష కాంతి సం వత్సరాలు అని తెలిసింది. తారా నీహారికలను(నెబ్యూలా )మెసియర్ కనుగొన్నాడు. ఓరియన్ నెబ్యూలాను క్రిస్టియన్ హైగెన్స్ కనుగొన్నాడు.విలియం పార్సన్స్, సైమన్ మారియస్ నెబ్యూలాలను అధ్యయనం చేశారు.100 అంగుళాల దూరదర్శిని తో హబుల్ ఆండ్రోమెడా ను గమనించి ఇది ఒక గేలాక్సీ అని తేల్చారు. ఇది మన గెలక్సీ కి 2.5 మిలియన్ కాంతి సం.రాల దూరంలో ఉన్నట్లు తేలింది. గేలాక్సీ లు కూడా రాసులుగా ఉంటాయి. కోమా బెరెనేసిస్ అనే తారా రాశిలో 11,000 గెలా క్సీ లు ఉన్నాయి. మన గేలాక్సీఉన్న తారా రాశి లో 19 గేలాక్సీ లు ఉన్నాయి.                                                     3 వ మెట్టు :100 మిలియన్ కాంతి సం. రాలకి మించిన దూరాలను కొలవడానికి ఎడ్విన్ హబుల్ మరో పద్ధతి కనుగొన్నాడు.హబుల్ నోవాలపై అధ్యయనం చేశారు. వెస్టో స్లిఫర్ తారల నుండి వచ్చే కాంతిని బట్టి వాటి వయసులు తెలుసుకున్నాడు. అన్ని గేలాక్సీ లు మనకు దూరంగా వెడుతుంటే ఆండ్రో మెడా గేలాక్సీ మన గేలాక్సీ కి దగ్గరగా వస్తుంది. హబుల్ గేలాక్సీ ల దూరం కనుగొనడానికి V=HD అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు. H=హబుల్ స్థిరాంకం. ఇలా గేలాక్సీ లన్నీ పరస్పరం దూరంగా జరుగుతుంటే విశ్వం వ్యా కోచిస్తుందా అన్న సందేహం కలిగింది. మహా విస్పోటనం విశ్వానికి నాంది అని జార్జి లమేత్ర్ మొట్ట మొదట ఊహించారు. విశ్వం లోని అంతరి క్షమే వ్యాకోచిస్తుంది. అలా పరిమాణం పెరిగి తిరిగి సంకోచిస్తుంది. దీన్నే మహా సంకో చం అంటారు. మన పాల పుంత గేలాక్సీ లో 20,000 కోట్ల తారలున్నాయి అందులో మన సూర్యుడొకడు.గేలాక్సీ కేంద్రం నుండి మన సూర్యుడు 26,000 కాంతి సం. రాల దూరం లో ఉన్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం దృశ్య విశ్వం 93 బిలియన్ కాంతి సం వత్సరాలు.ఇలాంటి అద్భుతమైన, ఊహించటానికే వీలు కాని దూరాలను గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించారు రచయిత. వారికి అభినందనలు.విశ్వం అనంతత ముందు సౌరకుటుంబం, భూమి, మానవ జాతి  చాలా అల్పంలా అనిపిస్తాయి. సౌరమండలం చివరినుండి మన భూమి చిన్న చుక్కలా కనిపిస్తుంది. కానీ మన భవిష్యత్తు  ఈ భూమే దానిని రక్షించుకోవాలి అన్న గొప్ప సందేశం తో ముగిస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు,ఉపాధ్యాయులు అధ్యాపకులు చదివి తీరవలసిన పుస్తకమిది.

Tuesday 24 May 2022

మెదడు చరిత్ర :Dr. వి. శ్రీనివాస చక్రవర్తి

 రచయిత :డా. వి. శ్రీనివాస చక్రవర్తి             పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                      మనం ఆలోచిస్తున్నామన్నా, మన శరీరం లోని అన్ని వ్యవస్థలు క్రమబద్ధంగా నడుస్తున్నాయన్నా దానికి కేంద్రం మెదడే. మెదడు గురించి ఆలోచించి పరిశోధించిన వారి వివరాలు తెలియజేస్తూ మనకు మెదడు గురించి అర్ధమయ్యేలా సరళంగా వ్రాయడానికి ప్రయత్నించిన పుస్తకమిది. ఇది science కు సంబంధించిన పుస్తకం కనుక చదివి పూర్తి వివరాలు తెలుసు కోండి. ఇక్కడ  విశేష కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. క్రీ.శ  2వ శతాబ్దంలోనే వైద్యుడ యినా కాడ్ గాలెన్ మెదడు నిర్మాణాన్ని వివరించాడు.1500 సం రాల తర్వాత లియో నార్దో డావిన్సీ అండ్రియాస్ వేసేలియాస్ మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. తరువాత రెనడే కార్త్, ఫ్రాన్స్ గాల్ మెదడును యంత్రం లా భావించారు.రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శిని సహాయం తో జీవకణాలను మొదటి సారి చూసాడు.ఆంటాన్ వాన్ రీవెన్ హాక్ సూక్ష్మ దర్శిని సహాయంతో నాడీ కణాలను పరిశీలించాడు. లూయిగీ గాల్వాని విద్యుత్ జీవక్రియా శాస్త్రం నకు ప్రాణం పోశారు. జోహాన్నస్ ముల్లర్ ఇంద్రియ సంవేదనలపై శో ధించారు. ఎమిల్ దుబ్వా రేమండ్ హెల్మ్ హోల్జ్ "విద్యుత్ ఈల్" మీద పరిశోధనలు గావించారు. హోల్జ్ నాడీ మండల క్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.20 వ శతాబ్దం ఆరంభానికి మెదడు ఒక విస్త్రతమైన సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్ధమయ్యింది. ఔషద  శాస్త్రంపై పెన్ ఫీల్డ్,పాల్ బ్రోకా, కార్ల్ వెర్న్ కీ పరిశోధించారు. వెర్న్ కీ పరిశోధన ల నుండి కనెక్షనిజం అనే నాడీ   శాస్త్రం ఆవిర్భవించింది. దాన్నుండి neural networks అనే కొత్త గణిత సిద్ధాంతం జన్మించింది. మనస్తత్వ శాస్త్రం పై ఇవాన్ పావ్లోవ్ జరిపిన పరిశోధనలు ప్రేరణ, స్పందన, నియంత్రణ లకు దారితీశాయి. B. F. Skinner,Tharandike, jhon watson ప్రవర్తనా వాదాన్ని ప్రవేశ పెట్టారు. మెదడు ఒక జాలం (Net work ) 10,000 కోట్ల న్యూరానులను కలిగి ఉంది. ఇన్ని విశేషాలను మనకు వివరించిన రచయిత శ్రీనివాస చక్రవర్తి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మెదడు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పాఠశాల, కళాశాలలో సైన్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పక చదవాల్సిన పుస్తకం...... ఒద్దుల రవిశేఖర్.

Monday 23 May 2022

కోవిడ్, ఎయిడ్స్ నేను..... Dr.Y.మురళీ కృష్ణ

 ప్రతి రంగంలో క్రొత్త దారులు వేసేవారుంటారు. తమదయిన ముద్రతో వినూత్న ఆవిష్కరణ లతో మానవాళికి మేలు చేసే వారుంటారు వారిలో డా. యనమదల  మురళీ కృష్ణ గారు ఒకరు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు మహమ్మారులకు తన దైన పరిష్కారాలు చూపిస్తూ లక్షలాది మంది జీవితాలను రక్షిస్తున్న మురళీ కృష్ణ గారి  వ్యాసాలు Facebook లో తరచుగా చదువుతూ share చేస్తుండే వాడిని.తాను కనుగొన్న పద్ధతులతో ఎయిడ్స్, కోవిడ్ కు ఇచ్చే చికిత్సలపై ఆయన వ్రాసిన "కోవిడ్ ఎయిడ్స్ నేను "అన్న పుస్తకం తెప్పించుకుందామనుకుంటూ కొంత ఆలస్యమయ్యింది."రవీ నువ్వు చదవాలి" అంటూ ఆప్యాయంగా పలకరించి పుస్తకాన్ని పంపించిన వారికి ధన్యవాదాలు. వైద్య రంగంలో ఆరోగ్యం పట్లతగిన జాగ్రత్తలు చెబుతూ సరియైన చికిత్సను అందిస్తూ రోగిని కోలుకునేలా చేయడం వైద్యుని ప్రాధమిక విధి.  ఏ మందు వాడాలో, ఏ చికిత్స,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పుస్తకం లో చక్కగా వివరించారు.వైద్య రంగం లో తాను చేసిన కృషిని వివరిస్తూ తగిన సూచనలు అందజేస్తూ ఎయిడ్స్, కోవిడ్ ల పట్ల ప్రజలకు సరిఅయిన అవగాహన కల్పించడం లో వారి అనుభవం పరిశోధన ఎంతగానో దోహద పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను గుర్తించడం, మన దేశపరిస్థితుల కనుగుణంగా వైద్య విధానాలు రూపొందించడం ఆయనలోని విశేష ప్రతిభ, మేధస్సును తెలియజేస్తాయి. ఈ పుస్తకం లో నాకు విశేషంగా తోచిన, ఉపయుక్తంగా అనిపించిన కొన్ని అంశాలు 1)ఆసుపత్రుల్లోని A/C గదుల్లో HAI జబ్బులు వ్యాపిస్తాయి జనం గుమికూడే ప్రాంతాలు మూసికొని ఉండరాదు A/C ఇళ్ళకే పరిమితం చెయ్యాలి.2)ఇంటిలో కేవలం సబ్బు, నీటిని ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇతర చోట్ల శానిటైజర్ వాడాలి.3) కోవిడ్ బారిన పడ్డవారు  ధైర్యం, ప్రశాంతత, డాక్టర్ సూచించిన వైద్యం తో కోలుకోవచ్చు.4) కరోనాకు home care treatment ను రెండు pages లో చేతిరాతతో వివరించిన విధానం 5)కోవిడ్ చికిత్సలో డా. మురళీ కృష్ణ గారి ప్రోటోకాల్ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధనా పత్రం సమర్పణ వారిలోని విశేషమైన ప్రతిభకు తార్కాణం.6)కోవిడ్ బారిన పడ్డ వారికి ఎదురవుతున్న సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 7) అన్ని వ్యాసాల్లో అదనపు సమాచారం కోసం QR codes ఇవ్వడం 8)MBBS చేస్తున్నప్పటినుండి ఎయిడ్స్ పట్ల సమాజానికి అవగాహన కల్పిస్తూ దానిపై స్వంత పరిశోధనలుచేస్తూ specialist వైద్యునిగా ఆయన ప్రయాణం అద్భుతం.9)ఎయిడ్స్ రోగులను ఆయన చూసే విధానం కొన్నివేల మంది రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం మానవునిలోనే మాధవుడున్నాడు అనేందుకు సాక్ష్యం.10) తాను తక్కువ ఖర్చుతో, స్వంత డబ్బులతో వైద్యం చేస్తూ నిస్సహాయమైన రోగులకు సహాయం చేసేలా సమాజాన్ని చైతన్యం చేయడం 11) వైద్యునిగా ఆయనకు కలిగే సంతృప్తిని గురించి "మీరు జీవితాన్ని స్వాధీనం చేసుకున్నారు "అన్న ప్రశంస పొందడం 12) వైద్య రంగం లోని లోటుపాట్లను ఒక వైద్యునిగా ఎత్తి చూపడం  13)ఆయన వైద్య విద్యార్థి గా ఉన్నప్పటినుండి ఇప్పటివరకు తన గురించి, తన విధానాల గురించి వివరించే పద్ధతి పాఠకుడిని పుస్తకాన్ని ఆసక్తిగా చదివేలా చేస్తుంది.14) వైద్యం లోని విషయాలే కాకుండా గొప్ప జీవన తాత్వికతను గురించి చెబుతూ ఆలోచింప జేసే విధానం 15) మనం పంచిన ప్రేమ పదింతలై తిరిగి వస్తుంది... ఎంత గొప్ప తాత్వికత 16) విపరీత మైన వినిమయలాలస ప్రకృతిని ధ్వంసం చేస్తుంది అన్న విషయం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం 17)తనకు నచ్చిన, తాను మెచ్చిన వ్యక్తుల గురించి చెప్పడం 18) జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చు కోవడమే గొప్ప జీవితం, సంతృప్తిని మించిన సంపదలేదు అని తన అనుభవ సారం చెబుతారు 19)కాలం చెల్లిన మందులు కూడా వాడొచ్చు అన్న కొత్త విషయాన్ని తెలియజేయడం 20)ఆయన,పుస్తకాలు విపరీతంగా చదవడం, కాలం కన్నా ముందు ఆలోచించడం.                                             ఇవీ ఈ పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు. ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు చదవతగ్గ పుస్తకం. నాకు అనిపిస్తుంటుంది, ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి ఒక్కో రంగం లో కొంతమంది విశిష్ఠ వ్యక్తుల్ని సృజించుకుంటుంది అని. అందులో మురళీ కృష్ణ గారు ఒకరు. వారికి నాదొక విన్నపం,వ్యాధులు, జబ్బులు రాకుండా ముందుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తగిన చికిత్సలు, తక్కువ ఖర్చుతో రోగాలు నయమయ్యే విధానాలపై మరిన్ని పుస్తకాలు వ్రాయాలని........ ఒద్దుల రవిశేఖర్