Monday 30 May 2022

నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం... ప్రియాంక చోప్రా

 అందరికి శుభమధ్యాహ్నం. ఈ అమ్మాయి పేరు ఈవ,16 ఏండ్ల వయసు. ఈ వయసులో అమ్మాయిలు వారి అమాయకత్వాన్ని ఆనందిస్తూ,వారి యవ్వనంలో త్రుళ్ళుతూ గడుపుతుంటారు. కానీ ఇంత చిన్న వయసులో ప్రపంచం లోని తన తోటి పిల్లల గొంతుకై, అవకాశాల్లేని యువతులు, మహిళలకు సలహా లిస్తూ ఇటువంటి గౌరవాన్ని పొందటం విశిష్ఠ మైన విషయం. ధన్యవాదాలు.  మీలాంటి అద్భుతమైన, అపురూపమైన మహిళల మధ్యన నేను పాల్గొనడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను.   ఇక్కడ హాజరయిన ఎంతో గొప్ప విజయాలు సాధించిన octavia, మిచేల్, కెల్లీ, పాటి లాంటి 50  మంది మహిళలకు నా అభినందనలు. మీ విజయాలు నాకే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తి నిస్తాయి. మీ ప్రక్కన నిలబడటం నాకెంతో గర్వ కారణం. మీ జీవితం లో ఒక్క సారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇక్కడి దాకా ఎలా వచ్చాం, ఇక్కడ ఎందుకు నిలబడ్డాము అని. నాక్కూడా నా మూలాల్లోకి తిరిగి వెళ్లి చూసుకోవాలనిపిస్తుంది. నేను అపురూపమైన, అద్భుతమైన తల్లిదండ్రులకు పుట్టాను. వాళ్ళు భారత సైన్యం లో పనిచేసారు. నేను వారికి ప్రధమ సంతానం.99% మా తల్లిదండ్రులనుగర్వపడేలా చేసాను. కొన్ని సార్లు వ్యక్తిగత విజయాలు చెప్పుకుంటే ఎక్కువ గా చెప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు పుట్టాక కూడా నాకేమీ మార్పు లేదు. మా ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చారు మా తల్లి దండ్రులు.ఈ విషయాన్ని నేను నొక్కి చెప్పగలను. సమాన అవకాశాలు ఇవ్వడం మీకు సాధారణం అనిపించవచ్చు కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోలాగానే మా భారత్ లో కూడా ఈ అసమానత్వ సమస్య ఉన్నది.ఈ అసమానత్వం చాలా చిన్న వయసు నుండే అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉంటుంది.సేవా భావం కలిగిన, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల ఇంట్లో నేను పెరిగాను. వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు. తక్కువ సంపద కలిగి ఉన్నవారికి సేవ చెయ్యడం అనేది అవకాశం కాదు అది ఒక జీవన మార్గం అని మనం ఎంతో అదృష్టవంతులమని చెబుతుండే వారు.నాకు  7,8 ఏండ్ల వయసు నుండే మా తల్లి దండ్రులు వెర్రిల్లి పట్టణ చుట్టూ ప్రక్కల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నన్ను తీసుకెళ్ళే వారు. నేను రోగులకు మందులు ఒక ప్యాకెట్ లో పెట్టి ఇచ్చే దాన్ని. ఈ పని నేను చాలా తీవ్రంగా చేస్తుండే దాన్ని. ఇలా నేను వెడుతున్నప్పుడు బాల బాలికల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు గమనించాను.ఉదాహరణకు బాలికలను యవ్వనం రాగానే పాఠశాలలు మాన్పించి వివాహానికి సిద్ధం చేస్తారు. కాని బాలు రు వారి బాల్యాన్ని ఆనందిస్తుంటారు.స్త్రీలు అయినంత మాత్రాన ప్రాధమిక మానవ హక్కులు, ఆరోగ్యం నిరాకరించబడటం అన్యాయం. ఇలా నేను ఎదిగే కొద్ది ఇటువంటి ఎన్నో అంశాలు గమనించాను. నా సినిమా కెరీర్ 18,19 ఏండ్లకే మొదలయ్యింది. స్త్రీ ని అయినందుకు నాకు తక్కువ పారితోషికం ఇవ్వజూపే వారు, నేను వ్యతిరేకిస్తే నా స్థానం లో ఇంకొకరికి అవకాశం ఇచ్చేవారు.ఎందుకంటే వినోద రంగం లో మహిళలను మారుస్తూ ఉంటారు. అప్పుడు నన్ను వారు మార్చలేని విధంగా తయారవ్వాలని నిర్ణయించుకున్నాను. చివరకు అంతిమంగా ఇది ప్రియాంకా చోప్రా foundation పుట్టుకకు దారి తీసింది. దీని తరపున విద్య, వైద్య రంగాల్లో  UNICEF భాగస్వామిగా పని చేయాలని నిర్ణయించుకున్నాను.12 ఏండ్ల క్రితం మా ఇంట్లో పని మనిషి వాళ్ళ అమ్మాయి, నేను షూటింగ్ నుండి త్వరగా వచ్చిన రోజు నా పుస్తకాల గది లో పుస్తకం తీసి చదవడం గమనించా,8 లేక 9 ఏండ్లు ఉంటాయోమో పుస్తకాలంటే ఎంత ప్రేమో అనుకున్నా, ఈ రోజు బడి ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నేను ఇక బడికి వెళ్ళను అంది.వాళ్ళ అమ్మను అడిగితే  అమ్మాయిని అబ్బాయిని బడికి పంపే స్థోమత లేదు మాకు అన్నది.ఆ అమ్మాయికి చదువుకు డబ్బు వృధా, ఆ డబ్బు తో వారికి పెళ్లి చేయవచ్చు అంది. నా కు ఆ మాట ఈడ్చి కొట్టినట్లు తగిలింది. నా అంతరంగాన్ని కుదిపేసింది.ఆ అమ్మాయి చదువుకయ్యే ఖర్చు నేను భరించాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి చదువు కొనసాగించాలి ఎందుకంటే, చదువనేది కనీస మానవ హక్కు మరియు ప్రస్తుతం అత్యా వశ్యకం. అప్పుడు దృఢముగా నిర్ణయించుకున్నా ఎంత మంది పిల్లల జీవితాల్లో వీలయితే అంత మార్పు తీసుకు రావాలని, ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నా.ఈ మధ్యే ఒక అందమైన కోట్ చదివా,ఈ సందర్భంగా దాన్ని చెప్పటం చాలా సమయోచితం అనుకుంటా " ఈ రోజు ఊయల ఊపే చేయి రేపటి తల్లిని తయారు చేస్తుంది, స్త్రీ నాగరికత యొక్క విధినే రూపు దిద్దుతుంది " అటువంటి అందమైన సృష్టి అయిన ఆడబిడ్డలు నేడు మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కావడం విధి కల్పించిన దుఃఖకరమైన నిందా స్తుతి కాక మరేమిటి? ప్రపంచాన్ని మార్చే శక్తి బాలికలకుంది. అది నిజం.గత రెండు దశాబ్దాల్లో ఎన్ని ప్రయత్నాలు ఎంత అభివృద్ధి జరిగినా తరగతి గదుల్లో బాలుర కంటే బాలికలు చాలా తక్కువగా ఉన్నారు.కోటి మంది బాలుర తో పోలిస్తే కోటిన్నర మంది  ప్రాధమిక పాఠశాల బాలికలు చదవడం వ్రాయడం నేర్చుకోలేక పోతున్నారు. ఇదీ మన భవిష్యత్తుకు ఆరంభం. గత 11 సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహం, యుద్ధం, సెక్స్, హింస ల బాధితులు, వాటి నుండి నుండి బయట పడ్డవారికి UNICEF చేసే నమ్మ శక్యం కాని అపూర్వమైన సేవను వీక్షిస్తున్నా, కానీ చాలా పని మిగిలి ఉంది చేయడానికి. నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం, అదే ఈ సమస్య పట్ల నా నిబద్దత కు కారణం, అక్కడనుండే నా తీవ్రమైన ఇష్టం మొదలయింది, ఎందుకంటే బాలికా విద్య కుటుంబాలకు అధికారం ఇవ్వడమే కాదు సమాజానికి, ఆర్ధిక వ్యవస్థకు కూడా తోడ్పాటు నందిస్తుంది. ఇక్కడ కూర్చున్న కళాకారులు, ప్రభావశీలురు మనందరి సామాజిక బాధ్యత ఏంటంటే మాట్లాడలేని వారి గొంతుక కావడం.ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ ని ఎందుకు ప్రశంసిస్తున్నానంటే, మీ కందరికి ఈ సమస్య పట్ల ఉన్న అవగాహనతో మీ మీ కార్యక్షేత్రాల్లో మీ స్వరాన్ని వినిపించండి, మనం బ్రతికున్నంత వరకు ఒక్క తరపు బాలికలు కూడా విద్యను కోల్పోకూడదు. ఈ వేదికపై నాకు అవకాశమిచ్చిన "Variety " సంస్థకు, ప్రోత్సహించిన మీ అందరికి, ఇక్కడున్న అందరం ఈ సమస్యపై పోరాటం చేస్తూ ముందుకెళదామని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ ) (https://youtu.be/iCwKM6uB71I)

1 comment:

  1. చాలా బాగా అనువాదం చేశారు. అర్థమయ్యే రీతిలో అనువాదం చేసినందుకు మంచివిషయం తెలినందుకు ధన్యవాదాలు

    ReplyDelete