Wednesday, 17 October 2012

బంగారు కథలు (గత యాభై ఏళ్లలో వచ్చిన అద్భుత కథలు)


            మన దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంలో గత ఏభై ఏళ్లలోతెలుగులో వచ్చిన వేల కథల్లో అత్యుత్తమ మయిన అరవై కథలను కేంద్ర సాహిత్య అకాడమీ "బంగారు కథలు" పేరుతో అచ్చు వేసింది దీనికి సంకలన కర్తలు వాకాటి పాండు రంగారావు గారు,వేదగిరి రాంబాబు గారు.ఈ పుస్తకం అన్ని శాఖా గ్రందాలయాలలో దొరుకుతుంది దాదాపు ఆరువందల పేజీల ఈ పుస్తకాన్ని చదవటానికి నాకు ఓ నెల సమయం పట్టింది.ఒక్కో కథ ఆనాటి సామాజి క జీవనాన్ని,అప్పటి వాస్తవ పరిస్థితులను అద్భుతంగా వర్ణించింది.ఇందులోవ్యక్తీ,సమాజం,సంప్రదాయం,విప్లవం అంతరంగ మధనం, బాహ్యజగతి, ప్రేమ,అశాంతి,అయోమయం,సమన్వయము దాకా వీటి పరిధి విశాలంగా విస్తరిం చింది.సమకాలీన సమస్యలకు సంఘటనలకు ఆయా రచయితలు,రచయిత్రులు అద్భుతంగా స్పందించి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు.తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు కథా బంగారం మెరుస్తూనే ఉంటుం ది.మురిపిస్తునే ఉంటుంది.
       ఈ కథలు చదివి నేను అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను.మీరూ చదవటానికి ప్రయత్నించండి.నా వంతు వారికి కృతజ్ఞతగా వారి పేర్లు,కథలు ఈ దిగువ ఇస్తున్నాను.
1)చాగంటి సోమయాజులు (ఎంపు)
2)కొడవటిగంటి కుటుంబరావు (చెడిపోయిన మనిషి)
3)పాలగుమ్మి పద్మ రాజు(పడవ ప్రయాణం)
4)విశ్వనాధ సత్య నారాయణ(కపర్ది )
5)చలం ( ఓ పువ్వు పూసింది)
6)బుచ్చి బాబు (కాగితం ముక్కలు,గాజు పెంకులు)
7)మునిపల్లె రాజు (బిచ్చగాళ్ళ జెండా)
8)మల్లాది రామ క్రిష్ణ శాస్త్రి (మంత్ర పుష్పం)
9)గోపీచంద్ (సంపెంగ పువ్వు)
10)రావిశాస్త్రి(మోక్షం)
11)దేవరకొండ బాల గంగాధరతిలక్(ఊరిచివర ఇల్లు )
12)ముల్లపూడి వెంకట రమణ (కానుక)
13)హితశ్రీ (గులాబి పువ్వు-సిగరెట్టూ)
14)స్మైల్ (ఖాళీ సీసాలు)
15)పెద్దిభొట్ల సుబ్బరామయ్య(నీళ్ళు)
16)ఆదివిష్ణు(కుర్చీలు)
17)బీనాదేవి(డబ్బు)
18)కాళీ పట్నం రామారావు(హింస)
19)కొలకలూరి ఇనాక్(ఊరబావి)
20)నాయని కృష్ణ కుమారి (ఎండు చేపలు)
21)పోతుకూచి సాంబశివరావు(మామ్మ నడిపిన విప్లవం)
22)వి.రాజా రామమోహనరావు(వరద)
23)వాసిరెడ్డి సీతాదేవి(తమసోమా జ్యోతిర్గమయ )
24)డి.కామేశ్వరి (కన్నీటికి విలువెంత)
25)ఇచ్చాపురపు జగన్నాధ రావు (మనిషి-మమత )
26)ఆర్.ఎస్ .సుదర్శనం (ఎరుపు)
27)దేవరాజు మహారాజు .బి.విద్యాసాగర రావు(పాలు ఎర్రబడాయి)
28)వేదగిరి రాంబాబు(సముద్రం)
29) చాగంటి తులసి(యాష్ ట్రే )
30)సదానంద్ శారద (జాడీ)
31)ఆర్.వసుందరాదేవి(గడియారం)
32)కేతు విశ్వనాధరెడ్డి(నమ్ముకున్ననేల )
33)వాకాటి పాండు రంగారావు(ప్లసీబో)
34)రావులపాటి సీతారామారావు(మనసా తుల్లిపడకే)
35)విహారి(గోరంత దీపం)
36)బి.ఎస్.రాములు(అడవిలో వెన్నెల)
37)ఓల్గా (ఆర్తి)
38)పాపినేని శివశంకర్(మట్టి గుండె )
39)స్వామీ(సావుకూడు)
40)శ్రీ పతి (చెట్లు కూలుతున్న దృశ్యం)
41)అల్లం రాజయ్య (మనిషి లోపలి విధ్వంసం )
42)సింగమనేని నారాయణ(అడుసు)
43)తుమ్మేటి రఘోత్తమ రెడ్డి(చావు విందు)
44)ఆర్ .ఎం.ఉమా మహేశ్వర రావు (బిడ్డలు గల తల్లి )
45)భూపాల్(అంబల్ల బండ)
46)పులికంటి కృష్ణారెడ్డి (బంగారు సంకెళ్ళు )
47)అబ్బూరి చాయాదేవి(ఆఖరికి అయిదు నక్షత్రాలు )
48)కలువ కొలను సదానంద(నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు)
49)తురగా జానకి రాణి(యాత్ర)
50)బలివాడ కాంతారావు(చక్రతీర్ధ)
51)తోలేటి జగన్మోహనరావు (మార్పు)
52)మధురాంతకం రాజారావు(రాతిలో తేమ)
53)శ్రీ రమణ(బంగారు మురుగు)
54)మధురాంతకం నరేంద్ర(నాలుగు కాళ్ళ మండపం)
55)ఆవుల మంజులత(నిన్ను ప్రేమించలేదు)
56)కాలువ మల్లయ్య(ఆంబోతు)
57)యర్రం శెట్టి శాయి(సర్కస్
58)పి.సత్యవతి(పెళ్లి ప్రయాణం)
59)బోయ జంగయ్య(చీమలు)
60)అయితా చంద్రయ్య(మంచు ముద్ద  )

Sunday, 14 October 2012

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది?


              ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ,జబ్బుల బారిన పడకుండా ఉండటం ఎలా? అన్నవి అత్యంత ప్రధానమైనవని భావించవచ్చు.మనుష్యులకు ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది? జబ్బులు ఎందుకు వస్తాయి?వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు,అంటు వ్యాధులు,విభిన్న రకాల కాలుష్యాల వలన వచ్చేవి,పొగాకు,మద్యం  తీసుకోవటం వలన వచ్చే జబ్బులు ఇంకా ఎన్నో రకాలు గా మనిషిని జబ్బులు పట్టి పీడిస్తు న్నాయి.వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు తప్ప మిగతా వాటినన్ని టిని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ చాలా వరకు సాధ్య మవుతుందని డాక్టర్స్ అంటుంటారు. అలాగే జబ్బులు వచ్చిన తర్వాత విభిన్న వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.
                ఆరోగ్య పరిరక్షణకు,జబ్బుల నివారణ కొరకు మనకు అందుబాటులో ఉన్న వాటిలో1) ప్రకృతి వైద్యం, యోగ(BNYS) 2)ఆయుర్వేద(BAMS) 3)హోమియోపతి(BHMS),4)అల్లోపతి(MBBS,MD,MS) 5) యునాని ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంకా ఎన్నో విధానాలు అవలంబిస్తుంటారు.కానీ ప్రతి ఒక్క దానికి దేని పరిధులు దానికున్నాయి.కొన్ని జబ్బులు కొన్ని విధానాల్లో బాగా నయ మవుతాయి.కొన్ని విధానాల్లో side effects వస్తాయి ఒక రంగంలో పనిచేసే వారు మరొక రంగం లో పనిచేసే వైద్యులతో ఏకీభవించరు.ఎవరి విధాన్నాన్ని వారు బలంగా నమ్ముతారు.
         అలా కాకుండా మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావటానికి జబ్బులు రాకుండా రక్షింప బడటానికి ,వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవటానికి ,ఏ విధానంలో ఏ జబ్బులు బాగా తగ్గుతాయి,.ఏ విదాన్నాన్ని అవలంబిస్తే జబ్బు లు రాకుండా చూసుకోవచ్చు అన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని వైద్య విధానాలలోని పరిమితు లను వివరిస్తూ ప్రామాణిక మైన పుస్తకాలు వ్రాస్తే ఎలా ఉంటుంది.పై విధానాలు ప్రాక్టీసుచేసే వైద్యులుకొంత మంది కలిసి మానవుడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఎటువంటి స్వార్ధం లేకుండా ఏ వైద్య విధానం పట్ల పక్షపాత  వైఖరి లేకుండా ఆరోగ్యము అనే సత్యాన్ని దర్శించే విధంగా ఒక ప్రయత్నం చేస్తే ఎలా వుంటుంది?ఈ దిశలో ఈ వ్యాసాన్ని చదివిన వారందరూ ఇంకా ఇంతకంటే మంచి సలహాలు,సూచనలు ఏవైనా ఉంటె తెలియ జేయగలరు అన్ని వైద్య విధానాలు ఒకే గొడుగు క్రిందకు తీసుకు వచ్చి,వచ్చిన రోగికి దేనిలో పరిపూర్ణంగా నివారణ సాధ్య మవుతుందో దాని లో వైద్యం ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ ఉంటె ఎలా ఉంటుంది ?ఆలోచించండి.

Sunday, 7 October 2012

Art Of Listening(కళాత్మకంగా వినడం)

          మనం చిన్నప్పుడు అమ్మ,అమ్మమ్మ,తాతయ్య కథలు చెబుతున్నప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నాం.ఉపాధ్యా యులు పాఠాలు చెబుతున్నప్పుడు ఇంతే శ్రద్ధగా విన్నామా!అదేవిధంగా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా వింటాం.అమ్మా,నాన్నలు,పెద్దలు మన మేలు కోరి చెబుతున్నప్పుడు ఎలా వింటున్నాము.అలాగే మన సంసారం లో భార్య మాట,మన పిల్లలు చెబుతున్నప్పుడు ,అలాగే ఆఫీసుల్లోసహచరులతో,ఈ వినడం అనే ప్రక్రియ మనలో ఎలా నడుస్తుంది.ఇంతకీ ప్రస్తుతం మనం ఏదైయినా విషయాన్ని ఎలా వింటున్నాం.అలాగే మనం చెబుతున్నప్పుడు ఎదుటి వారు ఎలా ఆలకిస్తున్నారు.ఈ విషయం గురించి ఎప్పుడయినా ఆలోచించారా!
            సహజంగా మనకు ఏ విషయం అయినా వింటున్నప్పుడు  ఏమి జరుగుతుంది.మన మనసు మనకున్న పూర్వ జ్ఞానంతో విన్న ఆ విషయాన్ని విశ్లేషించి వెంటనే మనదయిన  అభిప్రాయాన్ని చెప్పమంటుంది.మనకు తెలి సిన అంశాల ఆధారం గా మనదైన ప్రతిస్పందనను తక్షణం తెలియ జేయాలనిపిస్తుంది.అంటే ఇక్కడ వినడం అనే ప్రక్రియ జరగక మనం చెప్పడం అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయాము.ఎప్పుడూ చెప్పటానికి అలవాటు పడ్డ మనసు పూర్తిగా వినడాన్ని నిరాకరిస్తుంది.ప్రకృతి పరంగా కూడా మనకు రెండు చెవులు,ఒక నోరు ఉండటానికి కారణం ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి అంటారు.మనమందరం మనం చెప్పేది అవతలి వారు వినాలని కోరుకునే వారమే!మరి అదే సూత్రం మనకి మనం అన్వయించుకోము. కుటుంబంలో,స్నేహితుల మధ్య నయినా ఆఫీసుల్లో నయినా సమాజంలో ఎక్కడయినా ఇదే జరుగుతుంటుంది.మనం ఎదుటివారి నుండి ఏమి ఆశిస్తామో వారు మననుండి అదే ఆశిస్తారు.
              మరి దీన్ని మనం ఎలా ఆచరణ లోకి తెచ్చుకోవాలి.ఎవరితో మాట్లాడుతున్నాఅవతలి వారి మాటలను ఎంతో శ్రద్ధతో,దయతో,వాత్సల్యం తో వినడం చేస్తే వారు మీకు చెప్పేది తప్పయినా ఒప్పయినా ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది.వింటున్నప్పుడు ఎటువంటి ఖండనలు,విమర్శలు,ఆలోచనలు లేకుండా కేవలం వినడం మాత్రమే జరిగితే అప్పుడు ఎదుటివారికి తాము చెప్పినది విన్నాడు అనే త్రుప్తి కలుగుతుంది. ఆ త్రుప్తితో మీరు చెప్పేది వారు అదేవిధంగా వినడం మొదలు పెడతారు.ఎప్పుడయితే మీరు శ్రద్ధగా విన్నారో వారికి మీ అభిప్రాయం కూడా అంతే సున్నితంగా వ్యక్తం చేస్తారు.ఆ సున్నితత్వంలోని సహ్రుదయతను అవతలి హృదయం గ్రహించి మీ సంభాషణను అంతే స్థాయి అవగాహనతో వింటుంది.
               అప్పుడు రెండు మనసుల మధ్య,రెండు హృదయాల మధ్య ఒక అద్భుతమయిన భావ ప్రసారం జరుగు తుంది.అందులో స్నేహం,ప్రేమ,దయ,అవగాహన,వాత్సల్యం వంటి మాటల కందనిదేదో ఇద్దరి మధ్యా ప్రవహిస్తుంది.                                               

Tuesday, 2 October 2012

మహాత్మా గాంధి -సత్యం,అహింస              ఐక్యరాజ్య సమితి మహాత్మాగాంధీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందటానికి ఎంతో రక్తపాతాన్ని చవిచూసాయి.మన దేశంలో మాత్రమే మహాత్మా గాంధి నాయకత్వంలో అహింసాయుతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించగలిగాము.సత్యం,అహింసలు ఆయుధాలుగా గాంధిజీ సాగించిన ఈ పోరాటం ప్రపంచానికి ఆదర్శం.
             గాంధిజీ తన ఆత్మ కథ చివరిలో సత్యం,అహింస  గురించి ఈ విధంగా వివరిస్తారు.ఆయన మాటల్లోనే
             "సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో,ఏ రూపంలో చూచానో ఆ రూపంలో  దాని వివరించడానికి సదా ప్రయ త్నించాను.ఈ ప్రయోగాల వలన  పాఠకుల మనసులో సత్యము,అహింస పై అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం.సత్యం కంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు .సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం.నా అహింస సత్యమయమైనా అది ఇంకా అపూర్ణమే,అపరిపక్వమే.వేలాది సూర్యుల్నిప్రోగు చేసినా,సత్యమనే సూర్యున్ని చూడలేము.అంత తీక్షణ మైనది సత్యం.అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శిం చవచ్చు.అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యం కాదు.ఇప్పటి వరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల ఆధారంగా  చేసుకొని ఈ మాట చెబుతున్నాను.ఇట్టి వ్యాప్తి చెందినా సత్యనారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవి ని ప్రతి ప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం."
   మహాత్మా గాంధీ ప్రవచించిన ఈ సత్యము,అహింస ల గురించి ఆలోచించే ఓపిక,తీరిక ప్రస్తుతం మనకున్నాయా !అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ప్రపంచమంతా రాజ్యాల మధ్య,జాతుల మధ్య సమూహాల మధ్య వ్యక్తు ల మధ్య హింస రాజ్యమేలుతుంది.దేశాల మధ్య ఆధిపత్య పోరాటాలు యుద్ధాలుగా పరిణమిస్తు మానవ జాతిని అంతులేని హింసకు గురి చేసాయి.మొదటి రెండవ  ప్రపంచ యుద్దాల వలన  కొన్ని కోట్ల మంది మరణించినా కూడా ఇంకా దేశాలు యుద్దాలు చేస్తూ ఉన్నాయి.అలాగే వ్యక్తులు  చేసే హింస కూడా తక్కువేమీ కాదు.హింస ద్వారా రాజ్యాలు అయినా వ్యక్తులయినా చివరకు సాధించేది ఏమీ ఉండదు.
       అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నఈ సందర్భంలో మానవ జాతి తనకు తాను చేసుకునే హింస నుండి కూడా బయట పడాలి.మనుషుల ప్రాణాలను అలవోకగా తీసే ఈ సమాజం లో ఇక వన్య ప్రాణులను ప్రకృతిని మానవుడు నాశనం చేయటంలో ఆశ్చర్యం లేదు.విజ్ఞానం పెరుగుతుందని మనిషి అనుకుంటూ అజ్ఞానంతో ప్రవర్తి స్తున్నాడు.తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రకృతిని ఏమి ప్రేమించగలడు ఒకరికి అపకారం చెయ్యకుండా బ్రతకటమే మనిషికి గల ప్రాధమిక కర్త వ్యం.అప్పుడు ప్రకృతిని,ప్రాణులను ప్రేమిం చటం నేర్చుకుంటాడు.ఇందుకు సత్యం,అహింసల పథంలో మనిషి ప్రయాణం చేయాలి.