Friday 29 March 2013

అమ్మా-నాన్న,ఓపెన్ హౌస్ అను సేవా సంస్థలు


            మనం ఎన్నో రకాలయిన ప్రేమలను చూస్తూఉంటాం.తల్లి ప్రేమ,తండ్రి ప్రేమ ,సహోదర ప్రేమ ,సమ వయసు ప్రేమ .మరి  ఏ  బంధము  లేకుండా సేవ చేసే ప్రేమను ఏమంటాము ....పిచ్చి ప్రేమ అంటామేమో .మతిస్థిమితం లేని వారిపై ఇటువంటి ప్రేమనే చూపుతున్నారు "అమ్మా నాన్న"ఆశ్రమం  నిర్వాహకులు శంకర్ ఆయన భార్యపరమేశ్వరి హైదరాబాద్ విజయవాడ రహదారిలోని చౌటుప్పల్ ప్రాంతం లోని ఈ ఆశ్రమంలో పాతిక మంది మతిస్థిమితం కోల్పో యిన వ్యక్తులు కనిపిస్తారు.వారిని కంటికి రెప్పలా చూస్తూ,వారిని మామూలు మనుషులుగా తీర్చి దిద్ది వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు.తన అన్న పిచ్చివాడిలా మారి పోయి చాలా కాలం కనిపించక కొన్నేళ్ళకు హైదరా బాద్ ఉస్మానియా ప్రాంతం లో చెత్త కుప్పల్లో చనిపోయి కనిపించాడట.నా అన్నలాగ మరొకరు ప్రాణాలు వదలకూడ దని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాము అంటాడు శంకర్.
     పని మీద  హైదరాబాద్   వచ్చి నిలువ నీడ లేక జేబులో డబ్బు లేక  ఉన్నారనుకొండి .అలాంటి వాళ్ళ కోసం డా .వింజమూరి ప్రకాష్ స్థాపించిన "ఓపెన్ హౌస్" సిద్ధంగా ఉంటుంది.సరూర్ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంకు ప్రక్కనే ఉన్నఈ హౌస్ లోకి ఎవరైనా రావచ్చు.కాకపోతే అక్కడ వున్న వంట పదార్థాలతో మీరే  వండుకొని తృప్తిగా తిని ఒకటి,రెండు రోజులు బస చేసి వెళ్ళవచ్చు.పేద విద్యార్థులు,నిరుద్యోగులు దీనిని ఉపయోగించు కుంటున్నారు .వంట చేసుకోలేని వారికోసం వాలంటీర్స్ ఉన్నారు.దీనికి సాయం చేయాలనుకునే వారు 040-24046000 కు ఫోన్ చేయవచ్చు.
   పై రెండు సేవా  సంస్థల వివరాలు సాక్షి,ఆంధ్రజ్యోతి నుండి సేకరించినవి.వారికి ధన్యవాదాలు.వారు చేసే ఈ గొప్ప ప్రయత్నాలను అందరికీ తెలియజేయాలనే ఆలోచన.  

Thursday 21 March 2013

తెలుగు సౌరభం


       తెలుగు  సౌరభం  పేరుతో 7 వ రాష్ట్ర స్థాయి రచయితల మహాసభలు 2013 ఫిబ్రవరి 8,9,10 తేదీలలో ఒంగోలు లోని T.T.D కళ్యాణ మండపం నందు ఘనం గా జరిగాయి.3 వ రోజు జరిగిన సమావేశానికి నేను హాజరయ్యాను.ఉదయం జరిగిన సాహిత్య శిక్షణా శిబిరం లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  గ్రహీత కే.శివారెడ్డి ఆధ్వర్యం లో జరిగింది.మొదట ప్రముఖ కవి దర్భ శయనం శ్రీనివాసా చార్య  హాజరయిన కవులకు కవిత్వం పై పలు సూచనలు చేసారు.
       మంచి కవిత్వం వ్రాయటానికి జీవితానుభవం,విస్తృత అధ్యయనం దోహదం చేస్తాయి.మన చింతన లోనుండి పుట్టిన ఆవేశం నుంచి కవిత్వం ఉద్భ విస్తుంది.భావం, భాషల పై మనకున్న మోహం మనల్ని నడిపిస్తాయి.కాని భాష పట్ల నిర్మోహం కూడా అలవర్చుకోవాలి.మన తాత్విక సాధన కవిత్వం లో శబ్దమై కూర్చుంటుంది.
    కవిత్వానికి మూలకాలు భావన,భాష .ఇవి నిరంతరం చదవడం ద్వారా అలవడతాయి.కవిత పాఠకుడు మననం చేసుకుని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించాలి.బాలగంగాధర తిలక్ అంటాడు.కవిత చదివితే ఆనందం లాంటి విచారం కలగాలంటాడు కవిత ఆరంభం ఒక పెద్ద అవస్థ అంటాడు శ్రీ శ్రీ .కవిత అవిచ్చిన్నంగా ఉండాలి.కవిత లో సంక్లిష్టత ,కష్టమైన  మాటలు తగ్గిం చాలి.ఒక పాదానికి ఇంకో పాదానికి మధ్య అన్వయం కుదరాలి.విషాద కవిత నుండి పాఠకుడు DISTURB కావాలి గందర గోళానికి గురికాకూడదు.మృదువైన కవితలో శబ్దానికి,శబ్దానికి మధ్యలో సామరస్యం ఉండాలి.భాషా సంపద విస్తృతం గా ఉంటె వాటిని మన భావనలకు ఎన్నుకోవచ్చు.ఏ కవితయినాపాఠకుడిని తన జీవితం లోకి పునర్దర్శనం చేయగలిగితే అది గొప్ప కవిత.కవిత్వం లో బాధ్యతా రాహిత్యానికి తావు లేదు.కవిత్వానికి శబ్దం కాదు.భావన ప్రధానం.ఒక ఇంగ్లీష్ కవిత పేరు అమెరికా .అందులో ఈ విధంగా ఉంది .WHERE THE LIBERTY IS STATUE.మంచి కవికి క్లుప్తత కావాలి.గరుకైన పదాలు కావాలి.పత్రికల్లో పడటం గీటురాయి కాదు.కవికి నమ్రత కావాలి.కవి గొప్ప భావుకుడు కావాలి.మంచి కవిత్వం చదివిన వెంటనే మనసులో  నిశ్శబ్దం ఆవరించాలి.
       కథలపై డా:వి.చంద్ర శేఖర రావు కవులకు సూచనలు చేసారు.కథా రచనలో సమాజం లోని సంఘటనలు transform కావాలి.కథ, కవిత meditative process లో  పుడతాయి.రాయలేనితనం,తపన ,నుండి  కథ కవిత ఉదయిస్తాయి మన లో గొప్ప కాంక్ష,నిలవనీయని అగ్ని పుట్టాలి.వాతావరణం,పాత్రలు ,పాత్రల  స్వ భావం గురించి  అవగాహన   చేసుకొని కథ మొదలెట్టాలి.కథకు శైలి శిల్పం అవసరం.సమాజం, మనుషుల్లోని ప్రేమ,కథల్లో ప్రస్తావించాలి.కథ వ్రాయాలనే దహించే అగ్ని ఉండాలి.
విమర్శ  పై పాపినేని  శివశంకర్
         వి మర్శకుడికి నిజాయితీ అవసరం.ప్రశంస  కూడా విమర్శ లో ఒక భాగమే విమర్శ అంటే గుణాగుణ  పరామర్శ. విమర్శ గొప్ప అన్వేషణ.కవి జీవితాన్ని ఉన్నతీకరిస్తాడు.కవిత్వాన్ని సాహిత్యాన్ని విమర్శకుడు ఉన్నతీకరిస్తాడు.శివారెడ్డి గారు కవిని ప్రేమించి ప్రోత్సాహించాలి అంటాడు.దాన్ని ప్రేమపూర్వక అభినందన అంటారు.దర్భశయనం కవితలను విశ్లేషణ చేస్తాడు.నేను నిష్కర్షగా విమర్శి స్తుంటాను.విమర్శకుడు కుల మత ప్రాంత రహిత విమర్శ చేయాలి.విమర్శ ఆలోచనా ప్రధాన మైనది.మానవ జీవితానికి,మానవ సంస్కారానికి విరుద్ధమైనది అనవసరం.
        ఘజ ల్స్  గురించి పెన్నా శివరామ కృష్ణ  వివరించారు.దేవీ ప్రియ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేసారు.
      సాయంత్రం సభకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి.హనుమారెడ్డి అధ్యక్షత వహింఛి బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతుల అన్నదాన దాతృత్వాన్ని ప్రశంసించారు.తరువాత గరికపాటి నరసింహారావు గారిని సభకు పరిచయం చేసారు ఆయన వాగ్ధాటి సభికులను మంత్ర ముగ్ధులను చేసింది.ఆయన మాటలలోనే "తెలుగు భాషకు తల్లి వేర్లు  తెగిపోతు న్నాయి.మనం చివుల్లకు నీళ్ళు పోస్తున్నాము.పాటశాల స్థాయి లోనే పిల్లలకు వేమన పద్యాలు నేర్పించాలని అందులో వున్న  వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలని  ఉపాధ్యాయు లను కోరారు.విరాట పర్వాన్ని మానవత్వం కోసం చదవాలి.భారత జాతిలో వున్నా మూఢ నమ్మకాలు పోవాలి.స్వామీజీల వెంట పడే జనాలు శాస్త్రవేత్తల  వెంట నడవాలని  కోరారు. పురాణాలలోని పద్యాలలో వున్నా వ్యక్తిత్వ వికాసాన్ని వివరించారు.మనిషి యొక్క గుప్పెడు గుండెలో ఆనందముందా?  ఎదగాలంటే ఏకాంతం కావాలి.ఉపాధ్యాయుడు జీవితాంతం చదవాలి.కవులు ఎక్కడ మంచి కవిత్వ మున్నా ప్రశంసించాలి వాస్తవాన్ని ఊహ తో సమర్ధించాలి.ఊహను వాస్తవం తో  సమర్ధించాలి.అతనే మహాకవి.అవినీతి తగ్గాలంటే ముగ్గురి వలన  సాధ్యమవుతుంది.వారు తల్లి తండ్రి,ఉపాధ్యాయుడు.ముందు మానవ సంభందాల్లోని అవినీతిని పారద్రోలాలని చెప్పారు.
     సభలు దిగ్విజయంగా  జరగటానికి పొన్నూరి  శ్రీనివాసులు గారు ప్రముఖ కవి బాలకృష్ణారెడ్డి గారు కృషి  చేశారు