Saturday 15 April 2023

చరిత్ర శకలాలు.

 చరిత్ర శకలాలు

రచయిత :ఈమని శివనాగిరెడ్డి

పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్

చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.ఏ చరిత్ర అయినా ఆ కాలం లో ఉన్నవారు పుస్తకం రూపం లో వ్రాస్తే అది చదివి మనం ఆయాకాలాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోమొదటి సారిగా 5500 సం. క్రితం మెసపటోమియా(ప్రస్తుత ఇరాక్ )లో లిపి వాడారు.అంటే క్రీస్తు పూర్వం 3500 సం నుండి మాత్రమే జరిగిన సంఘటనలను వ్రాయడానికి భాష మొదలయిందన్న మాట. అన్ని చోట్ల ఒకే సారి భాష అందుబాటులోకి రాలేదు. మన దేశం లో పరిపాలించిన రాజులు వేసిన శాసనాల ద్వారా అప్పటి విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా వారు నిర్మించిన దేవాలయాలు,అప్పటి ప్రజలు వాడిన వస్తువులు,ఇలా ఎన్నో సాక్ష్యాలుగా సేకరించి ఆయా కాలాలలో ఏం జరిగిందో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారు "చరిత్ర శకలాలు" అన్న పుస్తకం లో తెలుగువారి చరిత్రను వివరించారు. ప్రతి అంశం ఆధారాలతో సహా వ్రాసిన తీరు ఆకట్టుకుంటుంది. మన మనో ఫలకం పై ఆ కాలాలు ప్రత్యక్ష మవుతాయి.2000 సం. రాల క్రితమే శాతవాహన చక్రవర్తి తెలుగు నేలను ఏలిన దగ్గరనుండి,చైనాలో విశేష ప్రాచుర్యం ఉన్న జెన్ గురువు బోధి ధర్ముడు తెలుగు వాడేనని,74,000 ఏళ్ల క్రితం ఇండో నేషియా లోని తోబా అగ్ని పర్వతం పేలడం వలన ఎగజిమ్మిన లావా,బూడిద కర్నూల్ జిల్లా జ్వాలా పురం దాకా విస్తరించిందని అక్కడ ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు దొరికాయని,బుద్ధుని 'దంత 'పురం,తెలుంగాణపురం,తెలుగు నేలపై రోమన్ నాణాలు, చేజారిన కోహినూర్, నల్గొండ లో పడిన ఉల్కా శకలం, శ్రీశైల చరిత్ర ఇలా ఎన్నో ఆసక్తి గొలిపే చరిత్ర విషయాలు మనకు అందించిన తీరు ప్రశంస నీయం. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు చదువదగ్గ పుస్తకం ఈ "చరిత్ర శకలాలు ".

Thursday 6 April 2023

దార్శనికుడు (Scientist గురించి )

 అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )


Wednesday 5 April 2023

అమ్మ....నాన్న.....ఓ జీనియస్.


రచయిత :వేణు భగవాన్

పుస్తక పరిచయం : ఒద్దుల రవిశేఖర్

పిల్లల పెంపకం ఎప్పటికీ ఒక సవాలే. మన అమ్మా నాన్న మనల్ని పెంచినట్టు మన పిల్లల్ని పెంచుతామంటే కుదరదు.21 వ శతాబ్దపు parenting చాలా challenging గా ఉంటుంది. ఈ విషయం మీద ఈ పుస్తకం అంతా నడుస్తుంది. చక్కటి కొటేషన్స్ సేకరించి తనదైన అన్వయంతో ఒకటి, రెండు పేజీ లలోనే ఒక అంశాన్ని ముగించడం బాగుంది.ప్రస్తుత చదువులు, పిల్లలు ఎలా ఉన్నారో వివరిస్తూ ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవాలంటే ఏ రకమైన నైపుణ్యాలు ఉండాలి అన్న విషయాలు విపులంగా చర్చించారు. కెరీర్ అంటే, విజయం అంటే చక్కని నిర్వచనాలు ఇచ్చారు.అర్థవంతమైన బొమ్మలతో (ven diagram ) కూడిన సమాచారం మరింత ఆకట్టుకుంటుంది.ఖలీల్ జీబ్రాన్ కవిత ఆలోచింపజేస్తుంది.ఇదంతా విషయ సూచిక. పుస్తకం మొత్తం 10 chapters గా వర్గీకరించారు. 1) పిల్లలు గొప్ప మానవులుగా ఎదగాలనుకుంటే! ఇందులో అబ్రహాం లింకన్ ఉత్తరం మనల్ని కదిలిస్తుంది. బాల్యాన్ని ఆట పాటలతో ఆనందంగా గడపాలంటాడు. ఆ స్వేచ్చ లోనే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది మానవ వనరుల్లో అత్యంత విలువైనది అంటారు. పిల్లలకు ప్రశ్నించే హక్కు, కలలు కనే స్వేచ్ఛ ఉండాలంటారు 2)సరయిన విద్యాలయాలను ఎంచుకోండి.ఇందులో పిల్లలని ప్రశంసించాలని, ప్రతి శిశువు ఓ జీనియస్ అని చెబుతారు. స్టీవ్ జాబ్స్ కవిత భావి జీనియస్ లు ఎలా ఉంటారో చెబుతుంది. తెలివి తేటలు (multiple intelligences) 10 రకాలుగా ఉంటాయని హోవార్డ్ గార్డనర్ కనుగొన్నారు. పిల్లల్లో వాటిని కనుగొనాలంటారు. పిల్లల్లో 5 రకాల minds అభివృద్ధి చేయాలట.3)పిల్లల్ని ఎలా పెంచాలి?4) గొప్ప మానవులుగా తీర్చి దిద్దండి.5) పిల్లల హృదయాలను గెలవాలంటే? 6) సరయిన సంభాషణ 7) Family managment 8) స్ఫూర్తి కలిగించండి 9) character building 10) ఒత్తిడిని జయించండి 

ఇలా 10 విభిన్న మైన topic లతో తల్లిదండ్రులను ఆలోచింప జేసే విధంగా వ్రాయబడిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా చదవదగ్గది.