Sunday, 27 November 2022

క్రియ (పిల్లల పండుగ ).... క్రియాత్మకంగా

  పోటీలగురించి వినగానే ముందు పేరే చిత్రంగా అనిపించింది. క్రియ అంటే చేయడం,verb. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఖమ్మం బాలోత్సవ్ చూడటం ఎప్పుడూ కుదర్లేదు. ఇదయినా చూద్దాం అని బలంగా అనుకొని facebook మిత్రుడు రాంబాబు తోట గారికి ఫోన్ చేస్తే సాదరంగా ఆహ్వానించారు. ఒక్కరన్నా తోడు వస్తారా అని friends ని అడిగితే ఎవ్వరూ సుముఖత చూపలేదు. "Ignite young minds "సంస్థ మార్కాపురం MLA శ్రీ K. నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలోఇటువంటి పోటీలనే గత ఏడాది నుండి నిర్వహిస్తుంది. Sir కు ఈ విషయం చెప్పగానే పిల్లలను కూడా పంపిద్దాం తీసుకు వెళ్ళండి అని తన స్వంత ఖర్చులతో 77 మంది విద్యార్థులను, ఉపాధ్యాయుల ను కాకినాడ "క్రియ " పోటీల్లో పాల్గొనడానికి పంపారు. వారికి ధన్యవాదములు.కాకినాడ లో క్రియ నిర్వాహకులు రామ కృష్ణ రాజు, దీపక్, రాజు చక్కని వసతి కల్పించారు. మిత్రులు మాచి రాజు గారు ఆత్మీయ స్వాగతం పలికారు.ఉదయాన్నే JNTU ప్రాంగణం చేరుకోగానే స్వాగత ద్వారాల్లోనే వారి సృజనాత్మకత ఎలా ఉంటుందో అర్ధం అయింది. ముందుగానే Online registration చేసుకోవడం వలన ఉదయం 9 గంటలకే పోటీలు మొదలయ్యాయి. విభిన్న వేదికల మీద ఒకే సారి పోటీలు మొదలయ్యాయి. Quiz, drawing, songs విభాగాల్లో  మా పాఠశాల విద్యార్థులు (ZPHS చెన్నారెడ్డి పల్లి )పాల్గొన్నారు. అన్ని పోటీలు తిరుగుతూ వారి నిర్వహణ విధానం పరిశీలిస్తూ పిల్లల ప్రతిభ కు ఆశ్చర్య పోతూ ఫోటోలు తీసుకుంటుంటే కాలం తెలియ లేదు.దాదాపు 10,000 పిల్లలు వందల మంది ఉపాధ్యాయులు తల్లి దండ్రులు ఒక చోట చేరడం పండుగ కాక మరేమిటి. చక్కని ప్రణాళికతో, బృంద స్ఫూర్తి తో నిర్వహించడం ఆశ్చర్యం గొలిపింది. ఇక పిల్లల ఆనందానికి అవధుల్లేవు. బాల్యం ఒక వరం అది ఆనందాలకు నిలయం.బాలల సంపూర్ణ మూర్తిమత్వం వికసించడానికి విద్యలో ఎన్నో అంశాలు ప్రవేశపెట్టారు మేధావులు, విద్యావేత్తలు,తత్వవేత్తలు, మనో వైజ్ఞానిక నిపుణులు. వాటి ఆధారంగా NCERT, SCERT లు ప్రణాళికా బద్దంగా పాఠ్య, సహపాఠ్య, అదనపు కృత్యాలు,ఆటలు ఇలా విభిన్న అంశాలతో విద్యా Calendars తయారు చేసి అమలు చేయాలి అని ఆదేశిస్తుంటారు. కాని IIT, NEET, Ranks, marks ల పేరుతో విద్యార్థులకు అవేవి అందించకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఊదరగొట్టేదే నిజమైన విద్య అని నమ్మే సమాజం తయారయ్యింది. విషాదం ఏంటంటే విద్యారంగం లో ఉండే వారే వాటిని నమ్మడం. వీటన్నిటికి సమాధానం చెబుతున్నట్లు "క్రియ "సంస్థ వారు  విభిన్న అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఇలా విద్యార్థుల్లోని ఆసక్తులను, అభిరుచులను, ప్రతిభ ను వెలికి తీయడం అపూర్వమైన విషయం. కొన్ని విషయాలు చర్చించుకుందాం.1)వ్యాస రచన : civils,groups లకు అద్భుతంగా పనికి వచ్చే అంశం.విద్యార్థి సృజనాత్మకంగా తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి అనువైన అంశం.కొన్ని వందలమంది ఒక్క చోట చేరి వ్రాస్తూ ఉండడం చూట్టానికి ఎంతో బాగుంది.2) వక్తృత్వం :ఏ అంశం పై నైనా అందరి ముందు తన అభిప్రాయాలను చెప్పే ధైర్యం, వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉండడం భవిష్యత్ ఉద్యోగం సాధనకు పనికి వచ్చే విలువైన అంశం." క్రియ" లో ఈ అంశం చక్కగా నిర్వహించారు.3) క్విజ్ :GK, Current affairs, general science ల సమాహారం. కౌన్ బనేగా కరోడ్ పతి time లో tv లకు అతుక్కుపోయి చూసారు జనాలు. విద్యార్థుల జీవితాలను జ్ఞాన సుసంపన్నం చేసే ప్రక్రియ ఇది. ముందుగా ఇద్దరేసి జట్లకు వ్రాత పరీక్ష నిర్వహించి, తరువాత Top 4 జట్లకు పెద్ద ఆడిటోరియం లో computerbased quiz నిర్వహించారు. ఉత్కంట భరితంగా జరిగింది.4) Debate : ముగ్గురేసి విద్యార్థులు జట్లుగా నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థిలోని సంభాషణా నైపుణ్యాలను వెలికి తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి సంస్థలు ఈ ప్రక్రియనే ఎన్నుకొంటాయి. ఈ అంశాన్ని మరింత సమన్వయం తో జరిపారు.5) science fair 6) poster presentation విద్యార్థుల్లోని విజ్ఞాన తృష్ణ ను వెలికితీస్తాయి.7) పాటలు 8) నృత్యం 9) వాద్య సంగీతం విద్యార్థులకు ఎంతో మానసిక,శారీరక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు. వీటి నిర్వహణ అమోఘం. ముఖ్యంగా classical, folk dance లకు వందకు పైగా group ల విద్యార్థులు చేసే నృత్యాలను చూస్తుంటే రెండు కళ్ళు చాల్లేదు. అలాగే విభిన్న వాద్య పరికరాలను వాయించే చిన్నారులను చూడటం ఒక ఆహ్లాదం కలిగించే అంశం. ఇక 10) mono action, 11)drawing 12) skits 13) మేజిక్ పిల్లల్లోని ప్రతిభ ను వెలికి తీసే అంశాలు.14) మట్టి తో బొమ్మలు చేయడం మరో అపూర్వ అంశం. కొన్ని వందల మంది తదేక దీక్షతో వాటిని తయారు చేయడం ముచ్చటేసింది.15) కథలు వ్రాయడం 16) కథలు చెప్పడం 17) కథలు విశ్లేషించడం ఇవి ఇప్పుడు చదువులో భాగమే కదా.18) spelling 18) map pointing 19) project work ఇవన్నీ curriculam లో భాగం.20) క్రాఫ్ట్ 21) fancy dress,22) మిమిక్రి ఇలా పిల్లలు ఆనందించే ఇన్ని అంశాలు అద్భుతమైన సమన్వ యం, ప్రణాళికతో నిర్వహించిన" క్రియ " team కు అభినందనలు. మళ్ళీ ఈ సారి ఈ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం.ఈ కార్యక్రమం లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ గారితో మాట్లాడటం ఒక గొప్ప అవకాశం. అలాగే సినిమా మాటల రచయిత పింగళి చైతన్య గారిని కలిసి మాట్లాడటం మరో మంచి జ్ఞాపకం.తోటి ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవికుమార్, బ్రహ్మానందరెడ్డి, ఏకాంబ రేశ్వరరావు, సుబ్బనాయుడు, వినీల్, సుబ్రహ్మణ్యం గార్లను లను కలవడం ఆనందం కలిగించిన విషయం.ఇంకా నాతో పాటు CH. సుబ్రహ్మణ్యం HM,ఉపాధ్యాయులు రామాంజనేయులు, వేణు గోపాల్, రవిచంద్ర, రంగనాధ్,music teacher ఖాసీం,ఝాన్సీ పాల్, పద్మజ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు, తోడ్పాటు ను అందించిన చంద్రశేఖర్ రెడ్డి HM సార్ కు ధన్యవాదములు.కొసమెరుపు :మాతో పాటు వచ్చిన మార్కాపురం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు జానపద నృత్య విభాగం లో ద్వితీయ బహుమతి సాధించడం.... ఒద్దుల రవిశేఖర్.

Sunday, 9 October 2022

ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబరు 9)

 ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబర్ 9)        ఇప్పటి తరానికి తెలియవు గాని 40 సం. వయసు పై బడిన వారికి పోస్టాఫీస్ తో ఎంతో అనుబంధం ఉంటుంది. బంధువుల, స్నేహితుల ఉత్తరాల కోసం ఎదురుచూడటం,దూరంగా ఉండి చదువుకుంటున్నప్పుడు నాన్న పంపించే మనీ ఆర్డర్ కోసం చూడటం, టెలిగ్రామ్ ఎవరికయినా వస్తే తెరచి చూసే దాకా గుండె వేగంగా కొట్టుకోవడం, ఉత్తరాలు వ్రాసి ఎర్రని post box లో వేయడం అందరికీ అనుభవమే.కార్డు 10 పైసలు, inland letter(నీలిరంగు ) 25 పైసలు, మూత కవర్ (enevelop ) 50 పైసలు ఉండేది.విషయం open అయినా పర్లేదు అనుకుంటే కార్డు వ్రాసేవాళ్ళు, బంధువులకు inland letter వ్రాసేవారు. ఇదికూడా gum అంటించి మూసివేయవచ్చు. ఇక మిత్రలకు ప్రత్యేకంగా తెల్లకాగితం మీద వ్రాసి మూత కవర్ లో పంపేవాళ్ళం. చిన్నప్పుడు పోస్టల్ ద్వారానే వార్తా పత్రికలు పల్లెలకు చేరేవి. అప్పుడు ఆంధ్రపత్రిక వచ్చేది అలా 3 వ తరగతి నుండే వార్త పత్రికలు చదవడం అలవాటయ్యింది. ఇక మిత్రులకు ఉత్తరాలు వ్రాయడం డిగ్రీ లో మొదలయ్యింది. కలం స్నేహం చేయడంఅప్పు డొక మంచి అభిరుచి. నాకు గుర్తు ఉండి 2004 దాకా నాకు ఉత్తరాలు వ్రాయడం, నేను ఉత్తరాలు రాయడం జరిగింది.2005 లో అనుకుంటా మొదట సెల్ ఫోన్ కొన్నాం . ఇహ అప్పటినుండి క్రమేపీ ఉత్తరాలు వ్రాసుకోవడం తగ్గిపోయింది. నెల్లూరు లో డిగ్రీ చదివే రోజుల్లో ఇంటికి అమ్మా నాన్నకి ఉత్తరాలు వ్రాసే వాళ్ళం. అప్పుడు land phone చేసే అవకాశం కూడా లేదు. నెలాఖరు ఉత్తరం లో డబ్బులు పంపమని వ్రాసేవాళ్ళం. పాపం ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళో డబ్బులు పంపడానికి. Money order కోసం ఎదురు చూసే వాళ్ళం. ఇహ పత్రికలకు సీరియల్స్ చదువుతూ ఉత్తరాలు వ్రాసేవాళ్ళం.నేను పంపిన కవితను అభినందిస్తూ యండమూరి గారు వ్రాసిన కార్డు ఇప్పటికీ నాదగ్గర ఉంది.మా నాన్న  ఒద్దుల గోవింద రెడ్డి 30 ఏండ్లకు పైగా BPM (Branch post master) గా పనిచేసి retire అయ్యారు.ఆయన పని చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళం. ఇంటికి కార్డులు కవర్లు, స్టాంప్స్ కొనడానికి వచ్చే వారికిచ్చే వాళ్ళం.ఇంట్లో ఉన్నప్పుడు మిత్రులు వ్రాసే ఉత్తరాల కోసం పోస్టుమాన్ ఇంటికి రాగానే తపాలా సంచి తెరవగానే ఏమయినా ఉత్తరాలు వచ్చాయా అని చూసే వాన్ని. చిన్నప్పుడు గడ్డం క్రింద గాయం అయితే నాన్న తపాలా పని పూర్తయ్యే దాకా మావయ్య  దుగ్గెంపూడి సాంబి రెడ్డి తన చేతితో రక్తం రాకుండా పట్టుకునే ఉన్నాడు. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు..... ఒద్దుల రవిశేఖర్ 

Tuesday, 27 September 2022

ప్రపంచ పర్యాటక దినోత్సవం

 ప్రపంచ పర్యాటక దినోత్సవం(27/9/2022) సందర్భంగా మీకు ఇష్ట మైన ప్రాంతాన్ని సందర్శించండి. జీవితాన్ని కొత్త కోణం లో చూడండి.ఖరీదైన వస్తువులు ఇచ్చేసంతోషం కన్నా కొత్త ప్రాంతాలు చూస్తే కలిగే ఆనందం మిన్న.పర్యాటకం మీ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుంది.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. మీ పర్యాటకా నుభావాలను పంచుకొని మిగతావారికి మార్గదర్శకులు కండి. ప్రకృతి పరిమళాన్ని మీ గుండెలనిండా నింపుకోండి.ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ ప్రతినెలా ఏదో ఒక ప్రాంతాన్నిసందర్శిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.... ఒద్దుల రవిశేఖర్.

Tuesday, 20 September 2022

ఆనందమఠం... బంకించంద్ర చటర్జీ (అనువాదం:అక్కిరాజు రమాపతి రావు )

 "బంకించంద్ర చటర్జీ " పేరు చూడగానే వందేమాతరం గీతం రచయిత అని ఆసక్తిగా చదవడం మొదలెట్టాను. ఆయన గురించి అనువాదం రచయిత అక్కిరాజు రమాపతి గారు వివరంగా తెలియజేయడం తో మనకు చక్కటి అవగాహన వస్తుంది. ప్రముఖ బెంగాలీ రచయి త అయినప్పటికీ భారతీయ భాషా సాహిత్యాలను విశేషంగా ప్రభావితం చేశారు. మన స్వాతంత్ర సమరాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వందేమాతర గీతం ఇందులోదే.               ఇక నవలలోని ఇతివృత్తం సన్యాసులు "ఆనందమఠం"స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం. ఉత్కంఠ కలిగించే సంఘటనలతో కథను మలుపులు త్రిప్పుతూ, అద్భుతమైన వర్ణనలతో మనల్ని కట్టిపడేస్తుంది ఈ నవల.తెలుగు నవల అనుకునేలా రమాపతి రావు గారి అనువాదం మనల్ని చక్కగా చదివేలా చేస్తుంది.అడవిని వర్ణించడం చదివి తీరవలసిందే. బెంగాల్ వచ్చిన కరువును గురించి చదువుతుంటే హృదయం ద్రవించి పోతుంది.బ్రిటిష్ వారిపై సన్యాసుల స్వాతంత్ర్య ఉద్యమాన్ని, యుద్ధ సన్నివేశాలను ఊపిరి తీయకుండా చదివేలా చేస్తాయి.మధ్య మధ్య లో వందేమాతర గీతం వారి పోరాటాన్ని మరింత పదునెక్కిస్తుంది. పాత్రల చిత్రణ, సన్నివేశాల కూర్పు అంతా మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించడం నవల యొక్క ప్రధాన లక్షణం. చక్కని చిక్కని తెలుగులో వచ్చిన నవల అనిపిస్తుంది. అనువాద నవల అనే భావనే కలగదు. ప్రతి ఒక్కరు తప్పక చదవ వలసిన నవల ఇది..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 28 August 2022

అమరావతి ( గుడి ) కృష్ణా నది.

 అమరావతి గుడి                                 కృష్ణానది అందంగా కనిపిస్తూ ప్రవహించే ప్రదేశాల్లో అమరావతి (పుణ్యక్షేత్రం )ఒకటి.రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి ని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి వంశస్థులే ఆలయ ధర్మకర్తలు.ఇక్కడ నది చాలా విశాలంగా,వెడల్పు గా ఉంటుంది.నది ఒడ్డునే ధ్యాన బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు.2006 లో ఇక్కడ జరిగిన ప్రపంచ స్థాయి కాలచక్ర ప్రత్యేక కార్యక్రమాలకు బౌద్ధ గురువు దలైలామా గారు హాజరయ్యారు ఇక్కడే బుద్ధుడు మొదటి కాలచక్ర నిర్వహించారని ప్రతీతి  మిత్రులతో కలిసి కాల చక్ర కు హాజరైయి దలైలామా గారిని దర్శించాము.ఆలయం ముందు తూర్పు వైపు నది కి ఆనుకొని చక్కటి పార్క్ ను అభివృద్ధి చేస్తే బాగుంటుంది.(https://en.m.wikipedia.org/wiki/Dhyana_Buddha_statue)

Sunday, 21 August 2022

కృష్ణా నది పరవళ్లు

 కృష్ణా నది పరవళ్లు                                     ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరుకొనడం తో డాం 10 గేట్లు ఎత్తి నీరు వదిలారని తెలిసి ఆదివారం(14/8/2022) చూద్దామని వెళ్ళాం.వందలాది కార్లు బస్సు లతో విపరీతమైన ట్రాఫిక్. Site seeing అని ఇంతకు ముందు 50 rs ticket తో APSRTC buses నడిపేది. ఆ service నిలిపివేయడం తో మనిషికి 200 rs పెట్టి auto లో వెళ్ళాం. మళ్ళీఈ service పునరుద్దరిస్తే సామాన్యులకు చాలా మేలు. మరి APSRTC వాళ్ళు స్పందిస్తారో లేదో చూడాలి. ఇక డాం దగ్గరకు చేరుకొని ఆ మనోహర దృశ్యాన్ని తనివి తీరా చూసి వీడియోల్లో ఫోటోల్లో బంధించాము. మనకు దగ్గరకు ఇంత అద్భుతమైన జల ప్రవాహాన్ని చూడడం అపూర్వం. 1 కి.మీ మేర నీటి తుంపరలు వెదజల్లుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాల్లేదు.10 గేట్ల నుండి దూకిన జల ప్రవాహం తిరిగి పాము పడగ విప్పినట్టు మళ్ళీ పైకి లేచి పడటం మహాద్భుతం. డాం నిండుకుండలా ఉంది. కానీ ఒకటే బాధ. ఇంత నీరు వృధా గా సముద్రం లోకి వెళ్ళిపోతుందే అని. ఈ నీరంతా వెలుగొండ ప్రాజెక్టు కు రాయలసీమ, తెలంగాణ లోని ప్రాజెక్ట్ లలో పట్టుకుంటే కొన్ని కోట్లమంది రైతులకు పండుగ అవుతుంది.... ఒద్దుల రవిశేఖర్.

Sunday, 7 August 2022

నడక :ప్రయోజనాలు

 ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా జీవించడం కోరుకోని వారెవరు. కానీ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలా ఉండటానికి, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వెనుకడుగే ఎక్కువ మందిది. చక్కని ఆహారం, సరయిన నిద్ర,వంటికి వ్యాయామం ఇవి ప్రాధమికంగా అవసరం. ఈ వ్యాసంలో  వ్యాయామం గురించి తెలుసుకుందాం.మనం చేయదగ్గ అతి తేలికనది నడక.మనకు ఏదయినా దాని ప్రయోజనాలు తెలిస్తే ఆచరించడానికి సిద్దపడతాం.           నడక వల్ల ప్రయోజనాలు:                                                  1) రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది.                2)B.P నియంత్రణ లో ఉంటుంది. గుండెను శక్తివంతంగా మార్చి గుండె వ్యాధులను నివారిస్తుంది.                                          3)ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది.   4) నొప్పి నివారణ ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఉద్వేగాలు నియంత్రించ బడతాయి.                       5)బరువు తగ్గుతారు.                                       6) కండరాలు బలవర్ధకంగా మారతాయి.            7) చక్కటి నిద్ర వస్తుంది                             8)కీళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.    9)శ్వాస క్రియ వేగంగా జరిగి ఆక్సిజన్ రక్తం లోకి వేగంగా వెళ్లడం వలన వ్యర్థపదార్ధాలు విసర్జింపబడి కొత్త శక్తి వస్తుంది.                                             10) వయసు పెరుగుదలతో వచ్చే మతి మరుపు తగ్గుతుంది.                                                   11) అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది 12)Osteo Arthritis ఉన్నవారికి మంచి వ్యాయామం.                                           మరి మొదలెడతారా నడక. ఈ సారి వ్యాసంలో నడక గురించి మరిన్ని విశేషాలుతెలుసుకుందాం.....ఒద్దుల రవి శేఖర్ (నడక ప్రయోజనాలు :Arthritis Foundation website నుండి )