Sunday 23 September 2012

ర్యాగింగ్ అనే విష సంస్కృతి


              రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎట్టకేలకు admissions పూర్తి చేసుకుని తరగతులు ప్రారం భిస్తున్నాయి విద్యార్థులు EAMCET వ్రాసిన 4 నెలలనుండి ర్యాంకుల కొరకు,ప్రవేశాలలోఏర్పడిన ప్రతి ష్టంబనలోని స్పష్టత కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి తాము కోరుకున్న కళాశాలల్లో చేరటంతో విద్యా సం:ప్రారంభమయ్యింది.inter లోఅనుభవించిన ఒత్తిడి తగ్గిపోయి స్వేచ్చా వాతావరణంలోకి సీతాకోక చిలుకల్లా అడుగు పెట్టారు.తల్లిదండ్రులు తమ ఆశలను,ఆకాంక్షలను వారిలో నింపి వారిని కళాశాలలకు పంపారు.ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్యాలు గుర్తించాల్సిన అంశం గురించి చర్చిద్దాం.
      కళాశాలల్లో అడుగిడగానే అంతకు ముందే చదువుతున్న విద్యార్థులు(వీరిని seniors అంటారు) కొత్త గా చేరిన వారిని (వీరిని juniors అంటారు)పరిచయం చేసుకుంటారు.ఈ పరిచయం స్నేహం పెంపొందటానికి,విద్యార్జనలో సహ కరించుకోవటానికి,కొత్త వారిలో బెరుకు పోగొట్టి స్నేహితులుగా మార్చుకోవడంలో సీనియర్ విద్యార్థులు చొరవచూపి జూనియర్ విద్యార్థులకు మార్గ  దర్శకత్వం వహించటం వరకు అర్థం చేసుకోదగినదే!
        ఇలా ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఎన్నివికృత పోకడలు పోయిందో!ఎన్ని జీవితాలు బలి అయ్యాయో మనం ఏటా చూస్తున్నాం.జూనియర్స్ ను సీనియర్స్ ఆట పట్టిస్తూ సాగే ఈ తంతును ర్యాగింగ్ అని పిలుస్తుంటారు.ఇంటర్ నుండే ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థుల్లో బిడియస్తులు మొహమా టస్తులు,సిగ్గుపడే తత్వం,బెరుకు మనస్తత్వం,ఇతరులతో కలవలేనివారు,సున్నిత మయిన మనస్కులు ఇలా ఎంతో మంది ఉంటారు.వాస్తవానికి కాల క్రమేణ వీరంతా పరిస్థితులకు తగ్గట్లు మారి అందరిలో కలిసి పోతారు.కానీ వెళ్ళగానే  ర్యాగింగ్ పేరుతో వీరి చేత చేయరాని  పనులు చేయిస్తూ సీనియర్స్ పొందే పైశాచిక ఆనందానికి ఎన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసాయో!ఎంత మంది చదువులు మానేసారో!
        ఈ విష సంస్కృతికి కారణ మేమిటి?ఎందుకు తోటి మనుషుల పట్ల ఇటువంటి అనాగరిక  ప్రవర్తను కనబరుస్తా రు? తమ అన్నలు,అక్కలు,చెల్లెళ్ళు,తమ్ముళ్ళు కూడా ఇతర కాలేజీల్లో ఇదేవిధంగా ఇబ్బంది పడి ఉంటారు కదా !స్వయంగా తామే ఆ ఇబ్బందులకు గురయి బాధలు పడి కూడా ఇలా ఇంకొకరిని ఎలా  బాధించ గలగుతున్నారని  కొంత మంది విద్యార్థులను అడిగితే వారిచ్చిన సమాధానం వింటే తల తిరిగినంత పనయ్యింది.తాము ఇంతకు ముం దు పొందిన బాధకు ప్రతీకారంగా ఇంకొకరిని ఆ విధంగా బాధిస్తే వారికి ఆనందం కలుగుతుందట.దీనిని ఒక రకం గా sadism అంటారు.ఈ మనస్తత్వం పిల్లలకు కాలేజీలకు వెళ్లాకే ఏర్పడుతుందా!
         దీనికి బాల్యం నుండి వారి కేదురైన అనుభవాలు,వారు శిక్షింపబడిన జ్ఞాపకాలు వారిలో ఆ విధ మైన కసి ప్రతీ కారం కలగటానికి ఆస్కారం కలిగించి ఉంటాయి.మరియు పాటశాలలు,కళాశాలలు వారికి ఎటువంటి నైతిక విద్యను అందించకపోవటం ఒక కారణం.అయినా తల్లిదండ్రులు తమ పిల్లకు కాలేజీలకు వెళ్ళేటప్పు డు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.అయినా ఇలా జరుగుతూనే ఉంది.ప్రస్తుత మైతే ర్యాగింగ్ కు వ్యతిరే కంగా కటినమైన చట్టాలు ఉన్నాయి ఇలాంటి ప్రవర్తన కలిగిన విద్యార్థులను మరల ఎక్కడా చదవకుండా నిషేదించవచ్చు.అలా యాజ మాన్యాలు ధృవీక రణ పత్రాలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ ఇంకా చాలా కాలేజీల్లో ఈ సంస్కృతి ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
       యాజమాన్యాలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేయాలి.మొదటి సం:విద్యార్థులు చేరగానే వారే college లోని అందరు విద్యార్థులను సమావేశ పరిచి counsilling psychologist లసహాయంతో శిక్షణ ఇప్పించాలి.చట్టంలోని కఠిన నిబంధనలు తెలియజేయాలి.అప్పుడు ఇటువంటి ఆలోచనలు మనసులో నుండి వైదొలుగుతాయి.అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో స్నేహభావన ,పరస్పరం సహకరించుకునే తత్వం,నాయకత్వ లక్షణాల్లాంటి అంశాలను వారి కి ఆ శిక్షణలో నేర్పిస్తే ఈ సంస్కృతి తగ్గిపోతుంది విద్యా ర్థులు కూడా అలా ప్రవర్తించే ముందు తమ తల్లిదండ్రు లను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటే అటువంటి విష సంస్కృతి నుండి బయట పడగలుగుతారు.చక్కటి స్నేహ పూర్వ క వాతావరణంలో ,మంచి  విద్యనూ నేర్చుకొని ఉపాధి సంపాదించుకొని తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఇంజి నీరింగ్ విద్యను పూర్తి  చేసుకోగలరు.

Thursday 20 September 2012

Life Is Beautiful(అందమైన జీవితం )


       జీవితం ఎంతో అందమైనది,సరళమైనది.మరి దీనిని ఎందుకింత సంక్లిష్టం చేసుకుంటున్నాము.మానవ జన్మతో ఏర్పడిన బంధాలు,సమాజంలోని వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు,వారిపట్ల మన ప్రవర్తన,వారి ప్రతిస్పందన ఇవే కదా జీవితం!ఈ మొత్తం వ్యవహారం ఎంతో అందంగాను,అద్భుతం గాను,ఉండాలి.అటువంటి దీన్ని ఎందుకింత నీర సంగా ,అందవిహీనంగా ,యాంత్రికం గా మార్చుకుంటున్నాము.జీవితం ఉల్లాసంగా,ఉత్సాహంగా,ఆహ్లాదంగా మార కుండా ఏవి అడ్డుపడుతున్నాయి..
       తల్లిదండ్రులు,వారి పిల్లలు వీరి మధ్య సంబంధాల్లోని ఆప్యాయతలు,ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి?అలాగే బంధువులు,స్నేహితులు,సన్నిహితులతో ఎలా సంబంధాలను నెరపుతున్నాము?ఇవన్నీ గమనిస్తే చాల సున్నితం గా ,సరళంగా,అందంగా,ఆనందంగా గడపాల్సిన జీవితం ఎలా ఉంది?       
       శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా Life is Beautiful లో వీటికి కొంత సమాదానమిచ్చే ప్రయత్నం చేసారు .సిని మా ప్రారంభం లోనే చూ పించిన  రంగుల ద్వారా జీవితమెంత అందంగా ఉండాలో చూపించాడు.Happy Days చాయ లు కాస్త ఎక్కువగానే కన్పించినప్పటికీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అందులో లీనమయ్యేలా నడిపించాడు. అమ్మను ఇంగ్లీష్ లోవర్ణించటానికి మాటలు రావని తెలుగులో ఆ అమ్మాయితో చెప్పించటం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.అన్నా చెల్లెళ్ళ సంబంధాలను ,కుటుంబ ఆప్యాయతలను,స్నేహితుల సహాయాలను,వాటి మధ్య మొగ్గ తొడిగే ఇష్టాలను,అవి ప్రేమలుగా మారే క్రమం లాంటి  సున్నిత మయిన మానవ సంబంధాలను తన దైన శైలిలో స్పృశిస్తూ ఓ అందమైన జీవితాన్ని మనకు పరిచయం చేసారు.అమ్మ మీద నువ్వు కావాలె అమ్మా! అంటూ సాగే పాట  ఇంకా మిగతావి కూడా మధురంగా ఉన్నాయి.ప్రస్తుత సినిమాలకు విభిన్నంగా,కుటుంబ మంతా కలిసి చూసే విధంగా ఆహ్లాదంగా తీసాడు.ఇటువంటి సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కూడా కావాలి.కానీ ఏదైనా కొత్త అంశాన్ని ఎన్నుకొని తీసి ఉంటె ఇంకా బాగుండేది.ఇటువంటి ఆరోగ్య కరమయిన సినిమాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది.
           మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన "అందమైన జీవితం" నవల చాల అద్భుతంగా ఉంటుంది.ఇందులో
ప్రణయ్ జీవితంలో డబ్బు ఖర్చు లేకుండా ఆనందంగా ఎలా జీవించాలో చూపిస్తాడు.చదవక పోతే ఓ సారి చదవండి.
        జీవిత మంటే చిన్నచిన్నఆనందాలు,ఆప్యాయతలు,కలబోసిన రంగుల హరివిల్లు.ఉన్న దానితో త్రుప్తి చెందు తూ,రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా  ఉంటె చాలు.కోరికల సాంద్రత తగ్గించుకొని మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ఉంటె ఆ జీవితం అందంగా మారుతుంది.కాలం వెంట పరుగులు తీస్తూ,లక్ష్యాల ఒత్తిడితో చిత్త వుతూ వర్తమానాన్ని త్యాగం చేస్తూ ఎప్పుడో ఆనందిస్తామంటే అప్పటికి అందరినీ కోల్పోతారు.విలువైన కాలం నష్ట పోతారు.గమ్యం ఎంత ముఖ్యమో! గమనం అంతే ముఖ్యం.ఆనందం కోసం బ్రతకడం కాదు,ఆనందంతో బ్రత కాలి.ముఖ్యంగా ఇతరులతో పోలికను తగ్గించుకోవాలి.
          కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం,స్పష్టత,సర్దుబాట్లు,చిన్నచిన్న త్యాగాలు,క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకోవటం,ఉద్వేగాల నియంత్రణ,సమన్వయము నెలకొల్పుకోవటం వంటి వాటి కలబోతే కదా జీవితం .సాధించలేక పోయిన,చేరుకోలేక పోయిన లక్ష్యాల గురించి అసలు చింతించకూడదు.వర్తమానంలో మన సామర్ద్యాల మేరకు,అవకాశాల మేరకు కృషి చేస్తూ పోవటమే!చక్కటి ఆహార నియమాలు,పాటిస్తూ శారీరక మానసిక వ్యాయా మాలైన ఆటలు,exercises ,ప్రాణాయామం,ఆసనాలు,ధ్యానం చేస్తూ చేస్తున్న పనిని అంకిత భావంతో,నిజాయితీ తో నిర్వహిస్తూ భార్యా పిల్లలతో ప్రతిరోజుముచ్చటించటం, సంగీతం వినటం పుస్తకాలు చదవడం,ప్రక్రుతి ఆరాధన లాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని అందంగా మలచుకోవటం దాన్ని ఆనందించటం మన చేతుల్లోనే ఉంది.

Sunday 16 September 2012

బత్తాయి తోటతో అనుబంధం


     గ్రామీణ ప్రాంతాలలో రకరకాలయిన పండ్ల తోటలను మీరు చూసే ఉంటారు.మేమున్న మార్కాపూర్ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రసిద్ది.కడప,కర్నూలు ,ప్రకాశంజిల్లాలో పశ్చిమప్రాంతం (కనిగిరి,గిద్దలూరు ,మార్కాపూర్,ఎర్రగొండపాలెం) మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలలో తోటలు బాగా ప్రసిద్ది.ఇవి అన్నీ బోర్ల క్రింద నీటి సాగుతో పండుతాయి.భూమిలో 300 అడుగులనుండి 600 అడుగుల లోతువరకు బోర్లు వేస్తారు. మధ్య కాలంలో మా ప్రాంతంలో సరి అయిన వర్షాలు లేక బోర్లలో నీళ్ళు లేక కొన్ని వందల ఎకరాలు ఎండి పోయాయి.రైతులు వాటిని తమ పిల్లల్లాగా కంటికి రెప్పలాగా పెంచుకుంటారు.మాకు కూడా 5 ఎకరాల తోట ఉండేది.బాగా కాపు మీద నీళ్ళు లేక మొత్తం ఎండి పోతే కొట్టివేసాము.9 అడు గుల ఎత్తు పెరిగిన వాటిని కొట్టివేస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.అలా 5 జిల్లాలలో కొన్ని వేల ఎకరాలు తోటలు కొట్టివేశారు.పండినప్పుడు కూడా సరిగా గిట్టుబాటు ధరలు వచ్చేవి కావు.3,4 సం: నేను హైదరాబాద్ మార్కెట్ కు వెళ్లి వాటిని అమ్మగా టన్నుకు రూ 4000 లేదా రూ6000 మాత్రమే వచ్చే వి.బాగా వేసవిలో అయితే రూ10,000 వరకు వచ్చేవి కానీ అప్పుడు నీరు లేక కాయలు తక్కువగా  ఉండి బరువు తూగేవి కావు.
   మా తోటలోకి వెడితే అదొక స్వర్గం .తోట పూతకు వచ్చినప్పుడు అక్కడ గాలిలో వాటి పరిమళం అంతా తోట చుట్టూ వ్యాపిస్తుంది.మా తోటలో వున్ననాలుగు వేపచెట్లు ఒకే చోట ఉండి గొడుగు పట్టినట్లు ఉంటా యి. ఇవి మాత్రం నా కోరిక మేరకు ఇప్పటికీ అక్కడ వున్నాయి.తోట మధ్యలో ఉండడం తో వాటిని కొట్టే స్తామంటే ఆపాను.వాటి క్రింద నులక మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో!
           చెట్లకు నీరు కడుతుంటే మట్టి వాసన కమ్మగా మనకు సోకుతుంది.రైతుకు భూమి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.అందుకే కన్నతల్లి ఎలా లాలిస్తుందో ఆ భూమి అంత సాంత్వన నిస్తుంది.కాబట్టే దాన్ని వదలాలంటే రైతుకు అంత కష్టం.అందుకే పరిశ్రమల పేరుతో సారవంత మయిన భూములు కోల్పోయే రైతులు  అలా తిరగబడతారు.
         నీరు కట్టిన రెండు రోజులకు చెట్లు చిగిర్చి తలలూపుతూ పలకరిస్తుంటే రైతు కడుపు ఆనందంతో నిండి పోతుంది.అలాంటి స్థితిని అనుభవించిన మాకు ఆ తోట నీరు సరిపోక కొట్టివేసి ప్రస్తుతం మిర్చి, పత్తి వేసాము.కానీ అప్పటి ఆనందం తోట కెడితే ఇప్పుడు రావటం లేదు.ప్రభుత్వం ఈ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించాలి.
        మనం ఎక్కువగా బజారు కెళ్ళినా,ఇతర ప్రాంతాలకు వెళ్ళినా cooldrinksత్రాగుతూ ఉంటాము అలా కాకుండా బత్తాయి రసం త్రాగితే ఎంతో ఆరోగ్యం.100 grams ఒక కాయలో fat o.2 grams, saturated fat 0%,cholestrol 0%,sodium0%,carbohydrates 11g,fibre 3g,protiens 0.7 g,sugar 3g ఇలా ఇందులో పోషక పదార్థాలు ఉంటాయి.అలాగే దీనిలో c విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది జబ్బు పడ్డ వారికి ఈ రసం చాలా శక్తి నిస్తుంది.ఇరాన్ లో ఈ రసం తో ఫ్లూ,మరియు జలుబు కు వైద్యం గా వాడతారు.ఇవే కాకుండా ఎక్కువ మంది ఈ రసం త్రాగితే వాటికి బాగా డిమాండ్ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలు దొరికే అవకాశం ఏర్పడుతుంది.అందరు ఈ దిశగా ఆలోచిస్తే మన గ్రామీణ ప్రాంతాల లోని రైతులకు,పల్లెలకు ఎంతో మేలు చేసిన వారమవుతాము.

Monday 10 September 2012

ఆత్మహత్యా ప్రయత్నం ఆపడం- నా అనుభవం


         ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నిరోధకదినం.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం బలవన్మ రణం పాలవుతున్నారు.ఎంత విషాదం.అందులో 30% విద్యార్థులే వున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆత్మ హత్యలకు ఎన్నోకారణాలు.కుటుంబంలోమనస్పర్ధలు,నయం కాని జబ్బులు కలిగిన  వారు,అప్పుల పాలయిన వారు,సన్నిహితులను కోల్పోయిన వారు,,జీవితం పై విరక్తి చెందినవారు విద్యార్థులయితే  ranks,marks రాలేదని  విపరీతమయిన మానసిక ఒత్తిడితో,ఉద్యోగాలు సాధించలేదని ఇలా విభిన్న కారణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.
        నా అనుభవంలో ఓ మిత్రుని ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపగలిగాను.ఒక ఉదయాన్నేఅతను ఫోన్ చేసి రైల్ పట్టాలపై ఉన్నాను.జీవితం పై విరక్తి కలిగింది.అని చెబుతుంటే అతన్ని చిన్నగా కారణాలు అడు గుతూ మాటల్లో పెట్టాను.తన కుటుంబ సమస్యనంతా వివరించాడు.అతనికి రకరకాలుగా నచ్చ జెబుతూ  మాట్లాడ సాగాను.మధ్య మధ్యలో ధైర్యము నూరి పోస్తు సంభాషణను కొనసాగిస్తున్నాను.అలా ఒక గంట మాట్లాడిన తరువాత కూడా అతను మళ్ళీ మొదటికి వచ్చి నాకు చావు తప్ప పరిష్కారం లేదు అనే సరికి ఎలా సముదాయించాలోఅర్థం కాలేదు అప్పుడు  ఓ ఆలోచన వచ్చింది.చనిపోయే ముందు నాతో ఒక్క సారి మాట్లాడమని అడిగాను.ఈ రోజు రాత్రి బయలు దేరి రేపు ఉదయం నీ దగ్గరికి వస్తాను.అప్పుడు మాట్లాడు దాము.అప్పటికి నీకు అదే భావం ఉంటె అలాగే చనిపోదు వుగానీ అని అడిగాను.అలాగే అంటూ బాధపడు తూ కొంత కోలుకున్నాడు.చివరికి వద్దులేరా!అంత రిస్క్ తీసుకొని రావద్దులే నేను ఏమి చేసుకోనులే!అన్నాడు.నేను నమ్మలేక మాట ఇవ్వ మన్నాను.నీకు ఎప్పుడు అలా చనిపోవా లనిపిం చినా నాతో కలవ కుండా ఆత్మహత్య చేసుకోనని మాట ఇవ్వమన్నాను .అలాగే ఇచ్చాడు.ఒక గంటన్నర మాట్లాడాను తరువాత మళ్ళీ కలిసినప్పుడు అంతా బాగుందని చెప్పాడు.
      నా అనుభవంతో అందరికి చెప్పేదేమంటే మీ సన్నిహితులు గాని,ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు వారు చెప్పినా మీరు పసిగట్టినా ఆ ప్రయత్నాన్ని మాటలతో వాయిదా వేపించండి.అలా వారితో మాట్లాడుతూ వుంటే కొద్ది సేపటిలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు.మీరు చెప్పే మాటలతో వారికి బ్రతుకు మీద ఆశ కలుగుతుంది.ఇలా తెలు సుకోలేక ఇద్దరు దగ్గరి బంధువులను కోల్పోవాల్సి వచ్చింది.ఒకరు అప్పులతో,మరొకరు సంసార సమస్యలతో.
       జీవితం ఎంత విలువైనది.విద్యార్థులయితే మంచి  marks,ranks రాలేదని తమ జీవితాలను తామే బలి తీసు కుంటున్నారు.ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీర్చ గలరు.జీవితాన్ని జీవించటానికే గాని అంతం చేసు కునేం దుకు కాదు.తల్లిదండ్రులు కూడా పిల్లల ఆశలను,ఆకాంక్షలను అర్థం చేసుకొని ఒకవేళ  అవి తప్పయితే వారికి స్నేహితుల్లాగా నచ్చజెప్పి ధైర్యమివ్వాలి గాని వారిని మందలించ కూడదు.వారి  సామర్ద్యాలేమిటో తెలుసుకోకుండా తమకు నచ్చిన చదువులు చదవమని వాటిలో  చేర్పించటం విపరీతమైన ఒత్తిడితో వారు ఆత్మ హత్యా చేసుకోవటం చాలా ఘోరం.విద్యాలయాలు కూడా విద్యార్ధి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్యనూ అందిస్తూ,వారికి జీవితం పట్ల సరి యిన అవగాహనను కల్పిస్తూ బోధించాలి.
   అలాగే విభిన్న సంసార సమస్యలు ఉన్నవారు వాటిని ఎలా అధిగమించాలో పరిష్కారాలకై,మిత్రులతో సన్నిహితు లతో చర్చించి అవసరమయితే సైకాలజిస్ట్ ల సహకారంతో పరిష్కారాలను కనుగొనాలి గాని ఆత్మహత్యలకు పాల్ప డకూడదు.అలాగే అప్పులైన వారు ఆత్మాభిమానంతో ఆత్మ హత్యలు చేసుకోకుండా I.P పెడితే పోలీసు,కోర్ట్ లు రక్షణ కల్పిస్తారు.లేదా ఆ ఊరికి దూరంగా ఎక్కడయినా బ్రతకవచ్చు.తమ అప్పులకు తమ పిల్లలను చంపి ఆత్మచేసుకునే వాళ్ళను ఏమనాలి?
    అలాగే ప్రభుత్వం కూడా సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి విస్త్రుత ప్రచారం చేయాలి.ఎక్కడయినా ఈ విషయం పై help lines కేంద్రాలు ఉంటె తెలియజేయగలరు

Saturday 1 September 2012

అంతరంగ యాత్ర

                ఏకాంతంలో మనలో ఏం జరుగుతుంది?మనకు మనం దగ్గరగా ఉంటాము.మన మనసు మన గురించే ఆలోచిస్తుంది.మన లోపలి ప్రతి ఆలోచన,భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి.ఇంకా ఏం చేస్తే బాగుంటుం  ది.ఏకాంతంలోమనం మన అంతరంగాన్నిశోధిస్తూ వెళ్ళాలి ఆ సాధనలోమనకు మనం పూర్తిగా అర్థమవుతుంటాము ఈ ప్రక్రియలో ఎప్పటినుంచో మన మనసులోని సంస్కారాలు,వికారాలు,మన ప్రవర్తన,మన అలవాట్లు,మనం చేసిన పనుల్లోని మంచి చెడ్డలు,మన గుణగణాలు,మన బలాలు,మన బలహీనతలు,మన లోటుపాట్లు వంటి వన్నీ అలా వరుసగా అలలు అలలుగా ఆ యాత్రలో మనకు దర్శన మిస్తాయి.ఎటువంటి విశ్లేషణలు చేయకుండా,ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా వాటిని గమనిస్తూ ఉంటె మనకు మనం మరింత అర్థమవుతుంటాము.
              జీవన ప్రవాహంలో మనం ఎటు వైపు వెడుతున్నామో కూడా మనకు తెలుస్తుంటుంది.ఆ ప్రక్రియలోమనం ఇంతకు ముందు ఎవరిన యినా అనాలోచితంగా అన్న మాటలు,ఎవరినయినా ఇబ్బందులకు గురిచేసే పనులు చేసి ఉన్నాఅన్నీగుర్తొస్తాయి.మన మనసులో పేరుకుపోయిన ఎన్నోసంఘటనలు,అవి కలిగించిన ప్రభావాలు,వాటికి మన  ప్రతిస్పందనలు అన్నీ తెరపై ప్రత్యక్షమయినట్లుగా మనకు కనిపిస్తాయి.వాటిని అలాగే గమనిస్తే అందులోని సంక్లిష్టత లు మెల్లగా తొలగి పోతుంటాయి.మన జీవితంలోని ఎన్నో సమస్యలు,కష్టాలు,కన్నీళ్లు బాధలు,సుఖ సంతోషాలు ఒక టేమిటి?మన ప్రతిస్పందనలన్నీ మనకు పునర్దర్శన మిచ్చి మన అంతరంగం మనకు దృశ్య రూపం లో కన్పిస్తుంది.
             ఈ అంతరంగ యాత్రను ఎవరికి వారు చేయాల్సిందే.ఆ యాత్రను ధైర్యంగా మొదలు పెట్టిన వారికే  అందు లో వచ్చే మార్పేమిటో అర్థమవుతుంది.ఈ యాత్రకు ఎటువంటి సాధనాసంపత్తి అక్కరలేదు.తమ మనసు లోపలి పొరల్లోకి తామే ప్రయాణించటం.ఈ యాత్ర ప్రతిరోజు జరిపితే మన మనసంతా తేలిక పడుతుంది.ఇది చాలా సాధార ణంగా ఏ స్థితిలో కూర్చున్నా ,పడుకున్నాఅటు ఇటు డాబా పైనో, గార్డెన్ లోనో నడుస్తున్నాచేయవచ్చు.ఇది ఎలాగైనా మన ఏకాంతంలోజరగాల్సిన ప్రక్రియ.దీనికి ఏ విధమైన నియమ నిబంధనలు లేవు.ఎటువంటి ఏర్పాట్లు లేవు ఎప్పు డు కుదిరితే అప్పుడు చేయవచ్చు.దీనికి ఎవరి సహాయము అక్కర లేదు.దీనిని మనకు ఎవరు నేర్పవలసిన పని లేదు.
             మానసిక విశ్లేషణ కూడా మన జీవితంలో మార్పుకు ఉపయోగ పడుతుంది.కానీ దాని కంటే ఇది మరింత గా మనకు తోడ్పడుతుంది.ఈ యాత్ర నిత్యం చేస్తుంటే మనం మనకు కొత్తగా,నూతనంగా ఆవిష్కరింపబడతాం.ఆ నూతనమైన,సజీవమయిన మనసుతో కొత్త పరిస్థితులను ఎదుర్కోవటం,కొత్త సంఘటనలకు మన మనసు ప్రతి స్పందనలు విభిన్నంగా ఉంటాయి.ఎదుటి వారికి మనం కొత్తగా కనిపిస్తాము.ఇంటిలో,బయటా మనతోఉండే వారిపై ఈ ప్రభావం పడుతుంది.అందులోనుండే అవగాహనతో కూడిన,స్నేహ పూరిత మైన,ప్రేమతో కూడిన మానవ సంబం ధాలు ఏర్పడతాయి.మనిషి జీవిత మంతా ఇతర వ్యక్తులతో అతని ప్రవర్తన మీదనే అతని వ్యక్తిత్వం అంచనా వేయ బడుతుంది.మనం సంఘ జీవులం కనుక ఈ సంఘంలో అందరితో కలిసి మెలసి మెలగ వలసిందే. ఈ మారిన మన సుతో మన చుట్టూ ఉన్నవాతావరణం మనకు మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది.మన లోని మార్పు ప్రభావం పరిస రాలపై కుడా పడుతుంది.మన మనసులో కలిగే ఆనందం ఇంకొకరికి ప్రసారం అవుతుంది.