Wednesday 1 January 2020

కాలచక్రం 2020

కాల చక్రం తిరుగుతూ ఉంది.మన భూమి 454 కోట్ల సంవత్సరాలనుండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.ఒక్కో పరిభ్రమణాన్ని ఒక్కో సంవత్సరంగా మనం పరిగణిస్తుంటాం.అంటే ప్రస్తుతం క్రీస్తు జననం తర్వాత 2019 పరిభ్రమణాలు పూర్తి చేసి 2020 వ పరిభ్రమణం మొదలెట్టింది మన భూమి.గణాల్ని,తెగల్ని,సమూహాలను,రాజ్యాల్ని దాటుకుంటు ప్రస్తుతం దేశాల్ని చూస్తుంది.ఒక్కటిగానున్న తనను గీతలు గీసి ముక్కలు చేసుకున్న కాలాన్ని చూస్తుంది.దేశాల పరంగా, మతాల పరంగా,జాతుల పరంగా విడిపోయిన తనని తాను చూసుకుంటుంది భూమి.                                     జీవరాశి నివసించటానికి అనుగుణంగా సిద్ధమయిన భూమి అదే జీవరాశి లో అత్యున్నతమైన దశకు చేరుకున్న మానవుని దెబ్బకు విలవిలలాడుతుంది.struggle for existence, survival of the fittest సూత్రాలతో జీవపరిణామ  ముందుకు సాగుతోంది.అత్యంత నాణ్యమయిన జీవితం గడపటానికి ,సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనిషి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు.                                                                 పారిశ్రామిక యుగానికంటే ముందు స్వచ్ఛమైన గాలి,నీరు,పచ్చని అడవులతో కాలుష్యరహితంగా ఉన్న ఈ భూమి అత్యున్నత సాంకేతిక యుగం లో కాలుష్యభరితమై,జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ,భూతాపం ఎక్కువయ్యి కొట్టుమిట్టాడుతోంది.2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీ లు పెరిగి జీవికి నివాసయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.                                            మరో ప్రక్క ఇవేవీ పట్టని దేశాలు,ఒకదానిపై మరొకటి పోటీతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో, వాణిజ్యయుద్దాలతో సంపద సృష్టితో,అభివృద్ధి పేరుతో తీవ్రంగా పోటీ పడుతూ ప్రస్తుత తరం భవిష్యత్తును ఫణంగా పెడుతూ దూసుకెడుతున్నాయి.                                             నాణ్యమైన, ఆరోగ్యకరమైన,ఆనందకరమైన ,సమతుల జీవనం ఎలా ఉండాలో భూటాన్ లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవచ్చు.                                                               భూమి ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన అభివృద్ధి,మన సంపద,జీవజాతుల మనుగడ.ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు సమావేశమై తక్షణం భూవిధ్వంసానికి కారణమయ్యే ప్రతిఅంశాన్ని లోతుగా చర్చించి అమలుపరిచే కార్యాచరణ సిద్ధం చేయాలి.ప్రతి ఒక్కరు,ఏ పనిచేస్తున్నా పర్యావరణానికి,ప్రకృతికి ఏమయినా కీడు చేస్తున్నామా అని ఆలోచించాలి.ఎవరివంతు ప్రయత్నం వారు చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని బహుమతిగా ఇవ్వవచ్చు.లేదంటే భావితరాలు మనల్ని క్షమించవు.                                                                        క్రీ.శ 2020 వ భూ పరిభ్రమణ శుభాకాంక్షలు.                     ఒద్దుల రవిశేఖర్.