Sunday, 26 August 2012

ఏకాంతం


              ఒంటరితనం నుండి బయట పడే మార్గాల గురించి చర్చిస్తూ మనం ఏకాంతంలో మన అంతరంగ స్థితిని గమనిస్తూ గడపాలి అనుకున్నాము.మరి ఏకాంతం అంటే ఏమిటి?ఒంటరితనానికి ఏకాంతానికి గల తేడా ఏమిటి?అన్న విషయాలు పరిశీలిద్దాము.తోడు లేక పోవటం,నిర్లక్ష్యం చేయబడటం,దగ్గరివారు వదలి వెయ్యటం,ఎవ్వరు పట్టించుకోక పోవటం,విస్మరించబడటం,అందరితో సంబంధాలు తెగిపోవటం,దగ్గరి వారు మరణించటం ఇలా ఎన్నో రకాల స్థితులలో మనిషికి కలిగే భావమే ఈ ఒంటరితనం.ఒక రకంగా ఇవన్నీ మనిషిని వేదనకు గురిచేసేవే!వాటినుండి బయట పడటానికి ఏకాంతాన్ని కూడా ఒక మార్గంగా ప్రస్తావిం చుకున్నాము.
      మరి ఏకాంతం అంటే ఏమిటి?ఎవరితోనూ,దేనితోను కలవని స్థితి .మనం ఈ ప్రపంచం లోకి ఎలా వచ్చాము?ఒక్కరిగానే వచ్చాము కదా!కవల పిల్లల విషయంలో తప్ప.అలాగే మరణంలోకూడా మన కెవ్వరు తోడు రారు కదా!మరి మధ్యలో ఉన్న జీవితమంతా ఏ విధంగా గడుపుతున్నాం.
                     ఒక్కరయి రావటం....ఒక్కరయి పోవటం నడుమ ఈ  నాటకం ,విధి లీల.........
పాటలాగా!చిన్నప్పుడు అమ్మానాన్నలు,బంధువులు,,తరువాత స్నేహితులు ,భార్య ,పిల్లలు ఇరుగు పొరుగు సమాజంలో ఎంతో మంది మన జీవితంలోకి ప్రవేశిస్తారు.ఈ సంబంధాలలో ఎన్నో కష్టాలు,బంధాలు వాటన్నటి నుండి ఏర్పడే ఒంటరితనాన్ని పరిశీలించాం .కాని మనిషి ఈ అన్ని సంబంధాలలో ఉంటూ  వాటినుండి కలిగే అన్ని సమస్య లను నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండగలడా!ఉండలేడు.ప్రతి సంబంధం సృష్టించే సుఖాలను,సంతోషాలను ,బాధలను ,కన్నీళ్లను,కష్టాలను,ఈర్ష్యా అసూయలను,కోపం,ద్వేషాలను ఆశలను,కోరికలను దురాశ ,దుఖాలను,భయాలను అన్నింటిని గురించి ఆలోచిస్తూ సంఘర్షణకు గురి అవుతూ మనసు ఒంటరితనానికి లోనవుతూ ఉంటుంది .దీన్నుం డి తప్పించుకోవటానికి రకరకాల పలాయన మార్గాలను మనసు అన్వేషిస్తుంది.ఒంటరితనంలో పుట్టే భయాన్నుండి తప్పించుకోవటానికి ఎన్నుకునే మార్గాలు మరింత బాధకు గురిచేస్తాయి.
         మరి వాటినన్నింటిని తప్పించుకోవటం కాకుండా పై పరిస్తితులన్నింటిని అర్థం చేసుకొని అవగాహనతో ఆ పరి స్థితులకు తగ్గట్లు స్పందిస్తూ ఎవరికివారు తమకు సంబంధించిన తమ లోకాన్ని ఒక దానిని సృష్టించుకుంటే ఎలా ఉంటుంది?ఆ స్థితి దేని నుండి పారిపోతే వచ్చేది కాదు.తన పరిస్థితిని తాను అర్థం చేసుకొని మనసును పై అన్ని క్లేశా ల నుండి  దూరంగా ఉండే స్థితిని కల్పించు కోవటం,అన్నిరకాల బందాలలోని బాధనుండి ,అన్ని రకాల భయాల నుండి,మన మనసును కట్టడి చేసే రకరకాల ప్రతిబంధకాలనుండి స్వేచ్చను కల్పించే ఆ స్థితిని మనకు మనం సృష్టించుకుంటే ఎలా ఉంటుంది.అంటే మనతో మనం గడపటంతో ఇది సాధ్యమవుతుంది.
          ఎప్పుడూ ఎవరో ఒకరితో మాటలాడుతూ,లోకాభిరామాయణం ముచ్చటిస్తూ ,మన కష్టాలు బాధలు,సంతో షాలు పంచుకునే వాళ్ళుఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే బదులు మన మొత్తం మనసులో జరిగే ప్రక్రియల ను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మన మనసులోకి ఓ ఏకాంత సౌందర్యం ప్రవేశిస్తుంది.అది ఒంటరి తనం లాంటి ది కాదు.ఊహ తెలిసినప్పటినుండి మరణించే వరకు మనకు తోడు ఎవరుంటారు.మన మనసే కదా ఉండేది!  దానిని ఎప్పుడు ఎవరో ఒకరి ఆలోచనలతో నింపే బదులు దానిని మనతోనే ఉండనిస్తే! ఆ ఉండటంలో ఓ ప్రశాంత చిత్తం ఏర్ప డుతుంది మనల్ని గురించి మనం సంపూర్ణంగా ఆవగాహన చేసుకున్న స్థితి.మనలో ఉన్న బలాలు,బలహీనతలు మనలోని వక్రత,సక్రమత మన లోపాలు అన్నీ అర్థం అయిన స్థితి.
        ఆ స్థితిని మనకు మనం కల్పించుకుంటే ,అంత సమయాన్ని మనకు మనం ఇవ్వగలిగితే మన మనసు అద్భు తాలు సృష్టించదా !అందులోంచి ఉల్లాసం ఆహ్లాదం ఉద్భవిస్తాయి.ఏ బంధానికి చిక్కుకోని స్థితి,ఎవరిపై ఆధార పడనీ  స్థితి,ఓ స్వేచ్చా ప్రపంచం,మనదైన లోకం.చిన్నప్పటి మనలోని అమాయకత్వం స్వచ్చత ,సున్నితత్వం మనసులో ఉద్భవించి మన కళ్ళల్లోకి ప్రవహిస్తుంది.అప్పుడు ఆ ఏకాంత సరోవరంలో పూసే ఆనంద కలువల పరిమళం మది నిండా ఆవరించటం మన అనుభవంలోకి వస్తుంది.ఏటిగట్ల వెంట ఉదయపు వ్యాహ్యాళి,సాయంత్రపు నడకలు,పార్కు ల్లో మనం ఏకాంతంగా గడపటం,కాలువ గట్ల వెంట పంట పొలాలలో,నదుల ఒడ్డున ఎవరికీ వీలయినచోట వారు ఈ ఏకాంతాన్ని సృష్టిం చుకుంటే,అన్నింటికీ మించి మన ఇంటిలోనే మనం కల్పించుకునే ఈ ఏకాంతం మనలో మానసిక పరివర్తనకు దారి తీస్తుంది.ఆ పరివర్తనలోనే ఓ దివ్యానందం ఉద్భవిస్తుంది.

Wednesday, 22 August 2012

ప్రాణ సఖా!


ప్రాణ సఖా!నా ఉచ్చ్వాసము మన ప్రేమ అయితే
నా నిశ్వాసము అంతా నీ పై నా విరహమే
నా హృది నిండా నీ పై నా
అనురాగం పలికిస్తూనే ఉంటాను
అప్పటికీ నీ నాదం నా దరికి చేరకపోతే
నా ధమనుల్లోని ప్రతి కణాన్ని అద్ది
మనసు స్పృహ తప్పనంతవరకు
మన ప్రేమ భాషనే కురిపిస్తుంటాను
సంధ్య వాకిట్లో నిలబడి
పున్నమి చంద్రునికి విన్నవిస్తున్నా
నీ సఖి ఇక్కడ విషాద సితార తంత్రుల్ని
"రవిశంకర్"కన్నా మనోహరంగా మీటుతుందని
నీ చెలి ఇక్కడ నీ రూపాన్ని వందల చిత్రాల్లో
"రవివర్మ" కన్నా  అద్భుతంగా చిత్రిస్తుందని
నీకు చెప్పమని వేడుకుంటున్నా
ప్రభూ నీ కోసం ఎదురు చూస్తున్నా
రేపు తూరుపు పగడపు కొండల నడుమ నుండి
ఉదయించే ఉషస్సులను మోసుకొస్తావని

Sunday, 19 August 2012

ఒంటరితనం నుండి బయటపడటం ఎలా?(2)            విద్యార్ధి దశలో స్నేహం ,ప్రేమ ఈ రెండింటి విషయంలో చాలా మంది ఎన్నోసమస్యల బారిన పడుతుంటారు. చదువు కంటే ఈ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.మంచి స్నేహి తులు ఒకరిద్దరు ఉండటంలో తప్పు లేదు కానీ స్నేహం ప్రేమలతో కాలమంతా దుర్వినియోగం చేయటం తగదు. స్నేహితుల మధ్య మనస్పర్ధలతో ఎడం కావటం,అందులో బాధలు ఎక్కు వగా ఇష్ట పడ్డవాళ్ళు దూరం కావటంవంటి సంఘటనల్లోనుంచి విద్యార్థులు ఈ సమస్య బారిన పడతారు అలాగే ప్రేమలు కూడా!స్నేహమో,ఇష్టమోప్రేమో అర్థం కాక అర్థం చేసుకునే సరికి కాలం కరిగిపోయి దూరమై పోయే సరికి బాధతో కూడిన ఒంటరితనానికి లోనవటం జరు గుతూ ఉంటుంది.విద్యార్ధి దశలో ఈ సమ స్యలనుండి బయటపడాలంటే చదువును ఇష్ట పడుతూ,ఉన్నత మైన లక్ష్యం ఏర్పరుచుకొని ముందుకు వెడుతూ ఉంటె ఈ ఇబ్బంది నుండి బయట పడవచ్చు.ఒక వేళ ఈభావనలోఉన్నా తల్లి దండ్రులను ఒక్క సారి గుర్తు చేసుకొని వారికంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరు ఉండరని  తెలుసుకొని మాన సిక ధైర్యం  తెచ్చుకొని కొత్త ఉత్సాహంతో చదువు మీద ఏకాగ్రత పెంచుకోవాలి.ఇలా చదివితే మంచి ఉద్యోగాలు లభిం చటం జీవితంలో ఏదో ఒక రంగంలో స్థిరపడటం వలన నిరుద్యోగ సమస్య దాని లోని బాధలు అనుభవించే పరిస్థితి తప్పిపోతుంది.
        ఇక సంసారంలోకి ప్రవేశిస్తున్నప్పుడే జీవిత భాగస్వామిని,సరిగా అర్థం చేసుకుంటూ ఇద్దరు పంతాలకు పట్టిం పులకు పోకుండా పిల్లలను చక్కగా పెంచుకుంటూ ఆనందకరమైన జీవితాన్నిగడపగలిగితే ఈ సమస్యలు రావు అలాగే ఆరోగ్యం పట్ల ముందు నుండి జాగ్రత్త వహిస్తూ ఎవరికి సరిపోయిన వ్యాయామం వారు చేస్తూ ఫలితాలిచ్చేఆరో గ్య విధానాలు పాటిస్తూ వృద్ధాప్యంలో ఏ జబ్బులు రాకుండా మంచానపడ కుండా తమ సంతానం మీద ఆధార పడ కుండా తిరుగుతూనే జీవనయాత్రను చాలించగలిగితే ఆ జీవితం ఎంత అద్భుతం.
          ఒంటరితనం నుండి పారిపోవాలని రకరకాలయిన అలవాట్లకు లోనయి జీవితాన్ని నరక ప్రాయం చేసుకునే వాళ్ళెంత మందో! చక్కటి సంగీతం వినటం,నేర్చుకోవడం ,మంచి పుస్తకాలుచదవటం అద్బుతమైన ప్రదేశాలు చూడ టం,ప్రకృతిని ఆరాధించటం ,మొక్కల పెంపకం,తోటపని,సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం,ఏకాంతంలో అంతరంగాన్ని విశ్లేషించుకోవటం ద్వారా ఈ ఒంటరితనాన్ని నుండి బయట పడ వచ్చు.మన అంతరంగాన్నిసానుకూల విషయాల వైపు మల్లిస్తూ వాటిల్లో పాల్గొంటూ ఉంటె  ఈ భావనను దూరం చేసుకోవచ్చు.

Wednesday, 15 August 2012

ఒంటరితనం (1)         ఈ భావన మనకెప్పుడు వస్తుంది? చిన్నతనంలో తల్లిదండ్రుల సమక్షంలో కాలం గడిచిపోతుంది. మన సంర క్షణ అంతా వారే చూసుకుంటారు కాబట్టి.మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రుల ప్రేమ ను ఎవరు భర్తీ చేయగలరు? ఆ పిల్లల మనస్సులో ఏర్పడిన వెలితిని ఎవరు పూరించగలరు.వారిలోకలిగే ఒంటరి భావనను ఎవరు దూరం చేయగలరు?చాలా స్వచ్చంద సంస్థలు ఇక్కడ కొంతవరకు వారిని ఆదుకుంటున్నాయి. ఎదుగుతున్న క్రమంలో యుక్త వయసులో తమ భావాలను పంచుకోవటానికి స్నేహితుల అవసరం ఏర్ప డుతుంది స్నేహంలోవచ్చే సమస్యలు,అపార్థాలు,విడిపోవటాలు,సరి అయిన స్నేహితులు దొరకకపోవటం అందులో ఏర్పడే ఒంటరితనం మరో సమస్య.ఇక ప్రేమించటం,ప్రేమింపబడకపోవటం,ప్రేమలోఉన్నంత కాలం అదో సంఘర్షణ కలుసు కోవాలని,మాట్లాడుకోవాలని ఉంటుంది.కలిసే సమయం కుదరక అవకాశాలు రాక విరహంతో కూడిన ఒంటరితనం అభిప్రాయ భేదాలతో,పెద్దల జోక్యంతో విడిపోయినప్పుడు, ప్రేమ విఫల మైనప్పుడు మరల ఏర్పడే ఒంటరితనం దీనిని తట్టుకున్న వారు జీవితంలోముందుకు వెడతారు,తట్టుకోలేని వారు చదువు పాడు జేసుకుని నిష్ప్రయోజకులుగా మిగిలి పోవటం లేదా ఆ ఒంటరితనం నుండి వచ్చిన depression తో ఆత్మ హత్యకు పాల్పడటం.
      ఇక పోతే చదువులు ranks,లక్ష్యాలు,నరాలు తెగే పోటీ !చివరకు సాధించే వారు కొద్ది మంది మాత్రమే!మిగిలిన వారి పరిస్థితి.సాధించలేక పోయామన్న బాధ ,ఏదో కోల్పోయిన భావన,ఓటమిని పంచుకోలేక ఎవరితో కలవలేని ఒంటరితనం.ఏదో ఒక కోర్సు అయిపోగానే ఉద్యోగాల వేట!నేర్చుకున్నదేదీ ఉద్యోగానికి పనికి రాక కొత్తగా వేల కొద్ది ఫీజులతో మరల శిక్షణలు!ఉద్యోగం కోసం విపరీతమైన పోటీ. ఫలితం శూన్యం.వందల ఉద్యోగాలు,లక్షల్లో అభ్యర్థులు చివరికి ఏమీ సాదించలేక మనస్సంతా భవిష్యత్తు పట్ల భయం .. ఒంటరితనం. చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరినా అసం తృప్తితో తల్లిదండ్రుల ముందు స్నేహితుల ముందు తలెత్తుకోలేక ఎవరితో పెద్దగా కలవక లేక కలిసినా ముభావంగా ఉండటం మనసును ఒంటరితనం ఆక్రమించుకున్న చిహ్నం.
         జీవితంలో విజయంతోనో,చిన్నపాటి ఉద్యోగాలతోనో,వ్యాపారాలతోనో ఏదో ఒక పనిచేసుకుంటూనో వివాహం చేసుకోవాలి కాబట్టి సంసారంలో అడుగు పెట్టటం జరుగుతుంటుంది.అర్థం చేసుకుని ఆనందంగా జీవించే జంటలు కొన్నైతే అర్థం చేసుకోలేక ఆర్ధిక సమస్యలతోకొన్ని జంటలు, ఆర్థికంగా బాగా వున్నా అహం సమస్యలతో కాపురం చేస్తున్నా భయంకరమయిన ఒంటరితనం.ఇక వివాహ వయసు దాటిపోయి పెళ్లి చేసుకోలేక పోవటం,వధువు,వరు డు దొరకకపోవటం పెళ్లి కాకుండా జీవితంలో ఒంటరిగా ఉండి పోయేవారి పరిస్థితి మరో రకం.వారికి తాము నిర్లక్ష్యం చేయబడ్డ భావన ,ఎవరు పట్టించుకోలేదని విచారం కలుగుతుంటుంది.ఇక జీవితం స్థిర పడే దశలో విభిన్న ఉద్యో గాలు,వ్యాపారాలు రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నో కష్ట నష్టాల కోర్చినా ఎదుగు,బొదుగు లేని జీవితం వెనుదిరిగి చూసుకుంటే ఏమీ లేదు.భవిష్యత్తు ఆశాజనకంగా లేక ఇంటా బయటా సమస్యలతో మనిషిని కమ్ముకునే ఒంటరి తనం.
                  విలాసవంతమైన జీవితం గడుపుతున్నా ,పరిస్థితులతో సర్దుకుంటూ పరిమిత జీవనం గడుపుతున్న
ఏర్పడే ఆరోగ్య సమస్యలు ,కుటుంబ సభ్యుల నిరాదరణ ,పిల్లల సమస్యలు, నిర్లక్ష్యం చేయబడుతున్నామన్నభావన పిల్లలు పట్టించుకోవటం లేదన్న దిగులు భర్త నిరాదరణ,భార్య నిరాదరణ ఇలాంటి పరిస్థితిలో నాకెవ్వరు లేరన్న భావంలోనుంది వచ్చిన ఒంటరితనం.
     డబ్బు ఉన్నా లేకున్నా మనిషిని జీవితం చివరి దశలో ఆవరించే ఈ ఒంటరితనాన్ని,జీవితమంతా ఏదో ఒక దశలో ప్రతిమనిషి అనుభవించే ఈ ఒంటరితనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
                                                          (మిగతా తరువాతి భాగంలో )

Tuesday, 14 August 2012

పచ్చని అడవి

        వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో!కాగితపు పడవలు,చేసి పారే నీళ్ళల్లో వదిలి కోలాహలంగా వాటి వెంట పరుగు తీసే వాళ్ళం .చిన్న చిన్న పిల్లకాలువలకి ఆనకట్టలు(చిన్నవే) కట్టి వాటిలో అగరుబత్తీలకు వచ్చే కడ్డీ లను తూములుగా అమర్చి దానిగుండా పారే నీటిని చూస్తూ ఎంత ఉత్సాహంగా వుండే వాళ్ళమో! వడగళ్ళ వాన పడితే వాటిని చేతుల్లోకి తీసుకొని ఐస్ అంటూ ఆడుకునే వాళ్ళం.అప్పటికి ఈ ఫ్రిజ్ లు  లేవు.కొని తినే ఐస్ లు మాత్రమే తెలుసు.ఇక ఇప్పటి వర్షాకాలంలో  పిల్లలు ఏమీ ఆటలు ఆడటం లేదు. మనమే మన పిల్లల్ని తడవనీయటం లేదు జలుబు చేస్తుందని.ఈ మధ్య రాష్ట్రం లో వర్షాలు బాగానే పడ్డాయి కానీ  projects లకి ఇంకా నీరు రాలేదు.శ్రీశైలంకు  వస్తున్నాయని అంటున్నారు.ఎప్పుడొస్తాయా వెళ్లి చూద్దామని ఉంది. ఈ లోపల ఒకసారి మహానంది వెడితే ఎలా ఉంటుందా అని అనిపించింది.
         మార్కాపూర్ (మేము ఉండే వూరు )నుండి నంద్యాల వెడుతూ నల్లమల అడవి అందాలు చూస్తుంటే తన్మయత్వంతో పులకించి  పోయాము.కొన్ని లక్షల వృక్షాలు పచ్చగా చిగురించి ఆకు పచ్చని తివాచిని పరిచినట్లు ఎంత హొయలు పోతున్నాయి.ట్రైన్లో  వెడుతూ చూస్తూఉంటే  చెట్లన్నీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఊగుతూ  పలకరించాయి.ఎన్ని రకాల చెట్లని.పేర్లన్నీ  సేకరించి మరోసారి  వ్రాస్తాను,ఎందుకంటే అన్ని చెట్ల పేర్లు తెలియవు మరి.రైలు మెలికలు తిరుగుతూ వెడుతుంటే చెట్లన్నీ టాటా చెబుతూ వెనుకకు పరిగెడుతూ ఉన్నాయి.దిగువ మెట్ట  దగ్గర కాసేపు ఆపుతారు,ట్రైన్ కు నీరు పట్టు కోవాలని.మీకో విచిత్రం తెలుసా!ఇక్కడ అన్ని రైళ్లకు పట్టే నీరంతా దగ్గరి కొండమీదనుండి సంవత్సరమంతా వస్తూ ఉంటుంది.కొండ పైన ఒక చోటనుండి నీరు ఉబికి వస్తుంటే అక్కడ బ్రిటిష్ వారు వేసిన పైపులనుండి క్రిందికి వస్తాయి.ఇక అక్కడి నుండి ముందుకు వెడితే పచ్చర్ల స్టేషన్ లో కొద్ది సేపు రైల్  ఆగుతుంది.ఇది అడవి మధ్యలో ఉంటుంది.అక్కడ తనివి తీరా ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు.మబ్బులు కొండల అంచును తాకుతూ వెడుతుంటాయి.
     ఇక దాని తర్వాత మొదటి సొరంగం వస్తుందండీ.ఇక ట్రైన్ అంతా ఒకటే కేకలు.లోపల ఒక మూడు నిమిషాల ప్రయాణం .లైట్స్ ముందే వేస్తారు.వేయకపోతే చిమ్మ చీకటి పగలే.అది దాటినా తరువాతంతా అడవే.ఇక్కడే చాలా సినిమాలు తీసారు.p.v.నరసింహారావు గారి హయాం లో దీనిని అభివృద్ది చేసారు.ఇక అలా అడవిని దాటుకొని నంద్యాల వెళ్లి తరువాత మహానంది వెళ్ళాము.ప్రకృతి ఎంత అందంగా అలంకరించుకొని అక్కడ నాట్యం చేస్తుందో చూడాలంటే రెండు కళ్ళు చాలవు.ఆ గుడిలో సహజ సిద్ధంగా వచ్చే నీటితో ఒక కొలను లోపల, రెండు కొలనులు బయట ఏర్పాటు చేసారు.వాటిల్లో ఈత కొట్టటం మరపురాని అనుభవం.చాలా సార్లు వెళ్ళినా వెళ్ళిన ప్రతి సారి కొత్తగా ఉంటుంది.ఇక్కడ వచ్చే నీరు బయటికి వదులుతారు.వీటి సహాయంతో వందల ఎకరాల అరటి తోటలు  పండుతాయి గుడిలో దర్శనం  అయిన తర్వాత గుడి వెనుకే అడవి.అడవిలో కొద్ది దూరం నడిచి చెట్లను చేతులతో తట్టి పలకరించి వచ్చాము .కానీ ఇక్కడ కొండకు దిగువగా గుడి వెనకాల ఒక మంచి ఉద్యాన వనం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో!
      అలాగే అక్కడ ఒక హెలిపాడ్ ఏర్పాటు చేసి అందులోహెలికాప్టర్తో  నల్లమల అడవంత చూపించే  ఏర్పాటు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!అడవిని పైనుండి చూడటం ఎవరికీ సాధ్యం కాదు కదా!నల్లమల  అడవి ప్రపంచం లోనే పేరెన్నికగన్నది.దీన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత.అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడి చెట్లు కొట్ట నీయకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి .ఈ కాలంలో ఓ సారి  అక్కడికి ఒక సారి వెళ్లి రండి.

Friday, 10 August 2012

ఓ ప్రియ నేస్తమా!


ఓ ప్రియ నేస్తమా!
మాట వినని ఈ మనసునేం చేయను ?
నీ కోసం శ్రుతి చేసిన రాగాన్ని
పంపుదామన్న ఈ గాలి ప్లవించదేం    
నీ మౌన వీణా తంత్రులను
మీటుదామన్నా వీలు కాదేం
నిర్ఝర ఝరీ తరంగ ప్రవాహంలా
మధుర స్నిగ్ధ హ్రుదయినిలా
వ్యక్తమయ్యే నీ అవ్యక్త భావనలు
మౌనం ఒడిలో కునుకు తీస్తున్నాయేం
ప్రభాత  స్వప్నంలో నీవు కనిపించావు  అంటే
నీ దరహాస వదనం దర్శనం అవుతుందా!
ఏమిటో చెలి మన ప్రేమ
నా కవిత్వంలో చిందులు తొక్కుతుంది
మరేమిటో సఖీ !మధురానుభూతివి నీవే
అందమైన జ్ఞాపకానివి నీవే
నీ పట్ల కనబరిచే నా భావనలు
ఎంతకీ తరగని స్మృతులు మరి
ఇంకేం వ్రాయను ?వెలుగు వెనుక సంధ్య
సంధ్య వెనుక వెన్నెల విరబూస్తుంది
వుంటాను మరి
నీ జ్ఞాపకాల విత్తుల్ని ఏరుకుంటూ

Monday, 6 August 2012

అహంకారం తొలగించుకోవడం ఎలా?(ముగింపు)


           ఈ వ్యాసాలు ఎంతోమంది వ్యక్తులను ఎన్నో సందర్భాలలోగమనించిన తరువాత వాటినన్నింటిని క్రోడీకరించి నాకు తెలిసినంత వరకు విశ్లేషించాను.ఇవే పూర్తిగా 100% సరి అయినవి అని నేను అను కోవటం లేదు.ఇంకా ఎంతో మందికి ఎంతో సమాచారం ఈ విషయంపై తెలిసి  ఉండవచ్చు.వారికి సదా స్వాగతం.సద్విమర్శకు ఎప్పుడూ ఆహ్వా నం పలుకుతాను.ఈ వ్యాసాలూ ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. ఎవ్వరినీ నొప్పించాలని వ్రాయలేదు.నాకు ఎదురైన అనుభవాలను,ఎంతో మంది అహంకార లక్షణాలు గల వ్యక్తులను గమనించిన తరువాత,ఈ అహంకారం ప్రదర్శిం చిన వారివలన బాధలు పడిన వారితో మాట్లాడిన మేరకు మరియు నా మీద ఈ భావనతో మాట్లాడిన వ్యక్తుల వలన కలిగిన అనుభవాలు అన్నింటిని కలిపి వ్రాసాను.నా పట్ల ఈ భావంతో మాట్లాడిన వారికి అప్పుడే ఇవే విషయాలు ఓపెన్ గా స్పష్టంగా చెప్పాను.ఇప్పుడు కొత్తగా ఏమీ వ్రాయలేదు.కాకపోతే ఆ అనుభవాలు ఈ అహంకారం శీర్షిక క్రింద చేర్చాను.ఒక వేళ అటువంటి వారెవరైనా ఇది చదివి నొచ్చుకుని ఉంటె క్షంతవ్యుడిని.ఇక్కడ  గమనించాల్సిన విష య మేమనగా ఈ వ్యాసాలూ చదివి వారు నొచ్చుకున్నారంటే మరి వారి మాటలకు నొచ్చుకున్న వారు,లోలోన బాధపడ్డ వారెంత మందో కదా!ఈ అహంకారంతో కూడిన మాటలతో బాధ పడ్డ వారు తమ భావాలు వ్యక్తపరిస్తే అది ప్రదర్శించిన వారి వైఖరిలో సహజంగా మార్పు రావాలి.కానీ అలా కాకుండా మరల తిరిగి అలాంటి భావాలను ప్రదర్శించడం సరికాదేమో!దానిని వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.విషయం వరకే తీసుకోవాలిగానీ ఎవరు వ్యక్తి గతంగా తీసుకోకూడదు అని నా భావన. అటువంటి వారు వ్రాసిన సందర్భంకాని వ్యాఖ్యలను తొలగించక తప్పని పరిస్థితి.
      మొదటే చెప్పినట్లు ఈ బ్లాగులో వ్రాసే వ్యాసాలూ ఎక్కువ భాగం మనిషి ఆనందంగా జీవించడం కోసం ఉద్దేశిం చినవే!ఈ విషయం నా గత వ్యాసాలూ చదివితే మీకే అర్థమవుతుంది.
           ఇక మిగిలిన అహంకార లక్షణాలు తొలగించుకోవాలంటే మన హృదయాల్లో మనస్సులో కాస్త స్నేహభావం ప్రేమ నిండి వుంటే చాలు.సాటి మనిషిని మాటలతోబాధించకూడదు అన్న స్పృహ ఉంటె చాలు.అంతే కాకుండా ప్రతి రోజు మనం నిద్రించే లోపు ఆ రోజు మన ప్రవర్తన ద్వారా,మన మాటల ద్వారా ఎవరినయినా నొప్పించామా అన్న ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ అహంకారం దానంతట అదే తొలగి పోతుంది.ఈ విషయాలు అన్ని నిరక్షరాస్యులు కూడా పాటిస్తుంటారు.వారు ఎంతో దయకలిగి ఎవ్వరినీ బాధించకుండా మాట్లాడుతుంటారు.వారి అమాయకత్వాన్ని ఎంతో మంది వాడుకుంటూ వారిపట్ల ఈ అహంకారాన్నిప్రదర్శిస్తుంటారు.రాజకీయ నాయకులు,ప్రజలకు సేవ చేయాల్సిన పదవుల్లో ఉన్న వారు ప్రజలకు అందాల్సిన వాటినన్నిటినీ తామే స్వాహ చేస్తూ వారి పట్ల ఎంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారు.ఆ అహంకారానికి గురయిన వారు నా కంటే చాలా  బాగా ఈ విషయాల గురించి చెప్పగలరు,ఎందుకంటే ఆ బాధలు పడ్డ వారు కాబట్టి .
     జీవితం ఎంతో చిన్నది.చాలా అందమైనది.ఎంతో సరళ మైనది.కానీ మనిషి దాన్ని ఎందుకో ఇంత క్లిష్టంగా మార్చుకుంటున్నాడు.జీవితం చివరి దశలో వెనుదిరిగి చూసుకుంటే ఎంతో త్రుప్తి కలగాలి మనసంతా ఆనందంతో నిండిపోవాలి.సంపూర్ణ మైన జీవితం గడిపినందుకు సంతృప్తితో చెట్టు నుండి ఆకు రాలినట్లు రాలిపోవాలి.ఎంతో అందమైన,అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను అధిగమించేందుకు మనిషి మానసికంగా,సామాజికంగా మంచి మార్పులకై నిరంతరం  అన్వేషించాలి.

Saturday, 4 August 2012

జ్ఞానం వలన కలిగే అహంకారం (6)


         మనం జన్మించినప్పటి నుండి ప్రతి విషయాన్ని పంచేంద్రియాలయిన చెవులు,ముక్కు,నోరు,నాలుక,చర్మ ములతో గ్రహిస్తూ ఉంటాము.ఇలా ప్రతి విషయం మన మెదడు పొరలలోనిక్షిప్తమయి ఉంటుంది.పై ఐదింటిని జ్ఞానేం ద్రియాలు అని కూడా అంటాము.పై సమాచారాన్ని విశ్లేషించుకొని మెదడు తన పొరలలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇంకా మనిషి అనుభవాల ద్వారా,సమాజాన్ని చూడటం ద్వారా ,చదువు ద్వారా విభిన్న మయిన పుస్తకాలు చదవ టంద్వారా ,వార్తాపత్రికలు,టి.వి ,కంప్యూటర్(ఇంటర్నెట్),సినిమాలు,రాజకీయాలుద్వారా తను చేసే పనుల ద్వారా నేర్చుకున్న విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి.అలాగే ,కుటుంబం,సమాజంతోకలిసి ఉండడం ద్వారా వ్యవ హారధోరణి,ప్రవర్తన,వంటివి ఏర్పడుతుంటాయి.
         ఇలా మనిషి పోగుచేసుకున్న జ్ఞానం అంతా మనిషి మాటల్లో,చేతల్లో, ప్రవర్తనలో వ్యక్తమవుతూ ఉంటుంది.ఈ వ్యక్తమయ్యే జ్ఞానం ఎక్కడ ఎంతవరకు అవసరమో అంత వరకు ఉపయోగిస్తూ,పనులు సమర్థవంతంగా పూర్తి చేసే వారు కొంతమంది,అవసరం లేని చోట తెలివి ప్రదర్శించటం,తనకే ఎక్కువ తెలుసు అనుకోవటం,ఎదుటివారిని అజ్ఞా నులుగా  భావించటం,అన్నీ తెలిసినట్లుగా మాట్లాడటం,ఎదుటివారిని అవమానించేలా మాట్లాడటం,నేనే కరెక్ట్ అను కోవటం,ఎదుటివారు చెప్పేది సరికాదు అనుకోవటం ,అసలు సరిగా వినకపోవటం ఇవన్నీ జ్ఞానం ద్వారా వచ్చిన అహంకారంగాపరిగణించవచ్చు.ఇందులోమళ్ళీ రెండు రకాల వ్యక్తులు ఉంటారు.1)మొదటి రకం ఏదయినా ఒక అంశాన్ని కాస్త ఎక్కువగా తెలుసుకొని ఇక ఈ విషయంలో నాకు ఎదురులేదు అనుకునే వారు,2)అన్ని విషయాలు కొద్దికొద్ది గా తెలుసుకొని అరకొర జ్ఞానంతో మాట్లాడేవారు.
      ఎక్కువగా చదువుకున్నవారిలో ఈ రకమైన ధోరణులు మనం చూడవచ్చు.అసలు జ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది.మానవ పరిణామ క్రమములో సైన్సు ఈ స్థాయికి వచ్చిందంటే ఎప్పటికప్పుడు మారుతున్న జ్ఞానం ఆధా రంగానే సాధ్య పడింది.ఒకప్పటి జ్ఞానం నిన్న లేదు.నిన్నటి జ్ఞానం ఈ రోజుకి పనికి రావటం లేదు. ఈరోజు జ్ఞానం రేప టికల్లా మారిపోతుంది.అదేవిధంగా మానసిక రంగంలో కూడా కొన్నివేల సంవత్సరాలనుండి నిరంతర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఒకప్పటి నమ్మకాలు,అవగాహన నేడు మారిపోతున్నాయి.ఇంత వైవిధ్య భరితమైన మానవ జీవితంలో జ్ఞానం ఆధారంగా అహంకారం ప్రదర్శించటం సముచితం కాదు.
        ఏదయినా ఇలా అహంకారం ప్రదర్శించే వ్యక్తులు ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో!ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కీ మొత్తం జ్ఞానం తెలిసే అవకాశం లేదు.మనిషి జీవనానికి అవసర మైన విభిన్నవృత్తుల ద్వారా లేదా ఆసక్తుల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తాం .కొంత మంది కొన్నివిషయాల్లో మాస్టర్ డిగ్రీలు,Phd చేసిన ఆ తర్వాత కొంత కాలానికి అదే విషయంలో ఎంతో నూతన జ్ఞానం కనుగొన బడుతుంది.కాబట్టి ఏ విషయంలో నైనా నాకు అంతా తెలు సు అనిగాని,నాకే తెలుసు అనిగాని,ఎదుటి వ్యక్తులు చెప్పేదంతా తప్పుఅనిగాని భావించేవారు ఒక్క సారి ఆలోచిం చండి.ఈ విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణువుతో సమానం.దానిలో ఉన్న 700 కోట్ల మందిలో మనం ఒకరం కాబట్టి మన స్థాయిని  మనం అంచనా వేసుకోవాలి.
     ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సైంటిస్ట్ లతో ఓటింగ్ జరిపిస్తే న్యూటన్ మొదటి స్థానం  పొందారు.ఆయన అన్న మాట లు మనం గుర్తించాలి."మహా సముద్రం ఒడ్డున గులక రాళ్ళు ఏరుకునే ఓ చిన్న బాలుడిని నేను."అని.ఈ విశ్వంలో జ్ఞానం అపారం.అది నిరంతరం కనుగొన బడుతునే ఉంది.
        చాలా మంది తమకు తెలిసిన విషయపరిధి లోనే వాదించటం చూస్తూ ఉంటాము.ఎదుటి వారి కోణాన్ని అర్థం చేసుకోరు.కొన్ని విషయాల పట్ల ఏ అవగాహన లేకున్నాకొంత మంది వ్యక్తుల గురించి ఏమీ తెలియకున్నా వారి గురించి వ్యాఖ్యానిస్తుంటారు.ఏదయినా ఒక విషయం గురించి గట్టిగా వాదించే ముందు కూలంకషంగా తెలుసుకొని  మాట్లాడితే బాగుంటుంది.లేదా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను.మీరు చెబితే తెలుసుకుంటాను అని ఎదుటి వారు చెప్పే దివినాలి.ఆ విషయాన్ని విశ్లేషించుకొని,నిర్ధారించుకొని మన అభిప్రాయాలను చెప్పాలి..
          సినిమాలు,రాజకీయాలు,క్రికెట్,సామాజిక సమస్యలు,నమ్మకాలు,తత్వం,ఆరోగ్య విధానాలు విశ్వావిర్భావం జీవపరిణామ క్రమం ఇలా విభిన్న విషయాలపై,కొంత మంది ఘంటాపధంగా తమ అభిప్రాయాలు చెబుతుంటారు. ఎదుటివారికి ఏమీ తెలియదనుకొని.ఏ విషయం పట్ల అయినా ఒక అభిప్రాయం వ్యక్త పరిచే ముందు కొంత మనసు లోఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది.మనసులో ఏమనిపిస్తే,మనకేమి తెలిస్తే అదే మాట్లాడితే ఎన్నో సమస్య లు వస్తాయి.
       మనం ప్రతి రోజు ఎన్నోవిషయాలు నేర్చుకుంటూ ఉంటాము.ఎన్నో సంఘటనల నుండి ,ఎన్నో పుస్తకాల నుండి ఎంతో మంది వ్యక్తుల నుండి,మనకు కలిగే జీవితానుభవాల నుండి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాము.పసిపిల్ల వాని నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు.నాకే అంతా తెలుసనే భావన వదిలి పెట్టి ఎదుటివారు చెప్పేది మనసు హృదయం పెట్టి వినటం నేర్చుకుంటే మనలో క్రమంగా ఈ జ్ఞానం వలన కలిగే అహంకారం తొలగి పోతుంది.