Sunday 2 January 2022

ఒక వైపు.....ఇంకోవైపు.

 కాలం చెక్కిన గాయాన్ని మాన్పటానికి ప్రయత్నం ఒకవైపు,నిర్లక్ష్యపు చేష్టలతో ప్రాణం మీదకు తెచ్చుకునే మనుషులొక వైపు, ఇది జరుగుతున్న వర్తమానం.                                                 ప్రకృతిలో ఎప్పుడూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం.చరిత్ర మొత్తం మనకు కనిపిస్తున్నదిదే.                                           విధ్వంసక ఆయుధాల కుప్పలపై కూర్చున్న రాజ్యాలొక వైపు,నిస్సహాయంగా చూస్తున్న ఐక్యరాజ్య సమితి మరో వైపు ,నడుస్తున్న నాటకమిదే.                                                   మనిషికి రక్షణ ఛత్రంలా ప్రకృతి ఒక వైపు,దాన్ని ఛిద్రం చేస్తూ కాలుష్యం మరోవైపు మనం నిత్యం చూస్తున్నదిదే.                                         అయస్కాంత మేదో ఆకర్షించినట్లు సంపద కేంద్రీకృతం ఒకవైపు,కోట్ల మంది దరిద్రనారాయణుల జీవితమొకవైపు , కఠిన వాస్తవమిదే.                                            సృష్టికి ప్రతిసృష్టి చేసే విజ్ఞానం ఒక వైపు,జీవితాలను దుర్భరం చేసుకునే అజ్ఞానం మరోవైపు.                                             ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ ఒక వైపు,నియంతృత్వపు పరిపాలనలోని దైన్యం మరో వైపు.                                                           బంగారం లాంటి భూమిని మరుభూమిగా మారుస్తున్న వైనం ఒక వైపు,అంగారకుడి ఉపరితలంపై ఆవాసం కోసం ఆరాటం మరో వైపు.                                                    నాణ్యమైన,సుఖప్రదమైన జీవితాలొక వైపు,క్షణ క్షణం బ్రతుకు నరకం మరొక వైపు.                    అధిక ఆహారంతో ఊబకాయ ప్రపంచం ఒకవైపు,ఆకలితో డొక్కలంటుకుపోయిన ప్రజలొక వైపు.                                                             వేలకోట్ల ఆకాశ హర్మ్యాలొక వైపు,నిత్యం రాత్రి ఆకాశం చూసే కోట్లాది బ్రతుకులొక వైపు.              ఈ ఘర్షణకు అంతం ఎప్పుడో, లేదా అంతమే పరిష్కారమా! కాలమే సమాధానం ఇవ్వాలి..... ఒద్దుల రవిశేఖర్.

Saturday 1 January 2022

నూతన సంవత్సరం(2022)... నూతన ఆలోచనలు

                 ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోను స్థానిక కాలమాన పరిస్థితుల్ని బట్టి వారి క్రొత్తసంవ త్సరాలు జరుపుకుంటారు.కానీ ప్రపంచీకరణ జరిగిన తరువాత ఆంగ్లసంవత్సరాన్ని నూతన సంవత్సరంగా జరుపుకునే సంస్కృతి గత 30 సం. నుండి విస్తృతమైంది.ఇక అందరు గతం నుండి బయటపడి నూతన సం.లో సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అలవాటయ్యింది.నిజంగా ప్రపంచంలోని మనుషులందరు ఆశించినట్లు ఇతరుల మేలు కోరే సమాజం ఈ రోజు బాగా కనిపిస్తుంది.ఇతరులగే కాక మనకు మనం  శుభాకాంక్షలు చెప్పుకుంటే మరింత బాగుంటుంది.ఎందుకంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పులు,నూతన ఆలోచనలు మనకు మేలు జరగడంతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడాలి,లేదా నష్టం కలిగించకుండా ఉండాలి.అలాగే మనకు నష్టం కలిగించే అసూయ,ద్వేషం,కోపం,బద్దకం,నిర్లక్ష్యం లాంటి వాటినుండి విముక్తి పొంది ప్రేమ,కరుణ,స్నేహం,శాంతి మన మనసులో విరబూయాలని మనకు మనం కోరుకుందాం .                            ఏ వృత్తిలో ఉన్న వారయినా తాము చేసే పనులతో తమలో నైపుణ్యాలు పెంచుకుంటూ,ఇతరులకు ఉపయోగపడేలా ప్రవర్తించాలి.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని,ఒక వైద్యుడు రోగులకు మరింత మెరుగైన సేవలందించాలని,రాజకీయనాయకులు ప్రజలజీవితాల్లో మార్పులు తీసుకురావాలని,ఉద్యోగులు ప్రజలకు బాధ్యతగా ఉండాలని,వ్యాపారవేత్తలు నాణ్యమైన వస్తువులు తయారుచేయాలని ఇలా ఎవరికివారు తమకి తాము శుభాకాంక్షలు చెప్పుకోవాలి.మనలో వచ్చే మార్పే బయట ప్రతిఫలిస్తుంది.ఇలా ఎవరికి వారు మారితే బయటి ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది.నూతన ఆలోచనలతో మనలో వచ్చేమార్పు అందరికి శుభం కలిగిస్తుంది.అందరికి నూతన సం. శుభాకాంక్షలు.......ఒద్దుల రవిశేఖర్.