Saturday 15 April 2023

చరిత్ర శకలాలు.

 చరిత్ర శకలాలు

రచయిత :ఈమని శివనాగిరెడ్డి

పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్

చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.ఏ చరిత్ర అయినా ఆ కాలం లో ఉన్నవారు పుస్తకం రూపం లో వ్రాస్తే అది చదివి మనం ఆయాకాలాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోమొదటి సారిగా 5500 సం. క్రితం మెసపటోమియా(ప్రస్తుత ఇరాక్ )లో లిపి వాడారు.అంటే క్రీస్తు పూర్వం 3500 సం నుండి మాత్రమే జరిగిన సంఘటనలను వ్రాయడానికి భాష మొదలయిందన్న మాట. అన్ని చోట్ల ఒకే సారి భాష అందుబాటులోకి రాలేదు. మన దేశం లో పరిపాలించిన రాజులు వేసిన శాసనాల ద్వారా అప్పటి విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా వారు నిర్మించిన దేవాలయాలు,అప్పటి ప్రజలు వాడిన వస్తువులు,ఇలా ఎన్నో సాక్ష్యాలుగా సేకరించి ఆయా కాలాలలో ఏం జరిగిందో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారు "చరిత్ర శకలాలు" అన్న పుస్తకం లో తెలుగువారి చరిత్రను వివరించారు. ప్రతి అంశం ఆధారాలతో సహా వ్రాసిన తీరు ఆకట్టుకుంటుంది. మన మనో ఫలకం పై ఆ కాలాలు ప్రత్యక్ష మవుతాయి.2000 సం. రాల క్రితమే శాతవాహన చక్రవర్తి తెలుగు నేలను ఏలిన దగ్గరనుండి,చైనాలో విశేష ప్రాచుర్యం ఉన్న జెన్ గురువు బోధి ధర్ముడు తెలుగు వాడేనని,74,000 ఏళ్ల క్రితం ఇండో నేషియా లోని తోబా అగ్ని పర్వతం పేలడం వలన ఎగజిమ్మిన లావా,బూడిద కర్నూల్ జిల్లా జ్వాలా పురం దాకా విస్తరించిందని అక్కడ ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు దొరికాయని,బుద్ధుని 'దంత 'పురం,తెలుంగాణపురం,తెలుగు నేలపై రోమన్ నాణాలు, చేజారిన కోహినూర్, నల్గొండ లో పడిన ఉల్కా శకలం, శ్రీశైల చరిత్ర ఇలా ఎన్నో ఆసక్తి గొలిపే చరిత్ర విషయాలు మనకు అందించిన తీరు ప్రశంస నీయం. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు చదువదగ్గ పుస్తకం ఈ "చరిత్ర శకలాలు ".

No comments:

Post a Comment