Sunday, 29 July 2012

డబ్బు సృష్టించే అహంకారం(5)

            డబ్బు సమాజాన్ని శాసిస్తున్న రోజులివి.సంపద పట్ల విపరీత మైన వ్యామోహం ప్రజల్లో వ్యాపించింది.
ఎప్పు డైతే దీనికి అంత ప్రాధాన్యత ఏర్పడిందో ఎవరికయితే డబ్బు ఉందొ వారికి సంఘంలో విలువ గౌరవం పెరిగి పోసాగాయి.డబ్బున్న వారు గొప్ప వారుగా ,డబ్బు లేని వారు సామాన్యులుగా పరిగణింప బడే సంస్కృతి ప్రబలింది ఎప్పుడైతే దీనికంత ప్రముఖ స్థానం లభించిందో అది వున్న వారికి సహజం గా గుర్తింపు లభించటంతో వారు తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణింపబడాలని కోరుకోవటం మొదలయింది.సహజంగా వారికి సంఘంలోఅన్ని పనులు చకచకా జరిగిపోవటం,ప్రభుత్వాలు వారు చెప్పినట్లు అనుకూల నిర్ణయాలు తీసుకోవటంతో వారి సంపద అనూ హ్యంగా పెరిగిపోతుంది.
        ఈ నేపధ్యంలో ఎవరికి వారికి వ్యక్తిగత స్థాయిలో డబ్బుద్వారా వచ్చే గుర్తింపును కోరుకోవటం ,ధనవంతుల మనే దర్పం ప్రదర్శించటం ,డబ్బు లేని వారిని తక్కువగా భావించటం ,తమ దైనందిన వ్యవహారాల్లో ఆ అహాన్ని చూపించే తత్వం స్థిరపడటంతో అది సంపద ద్వారా వచ్చిన అహంకారం గా పరిగణించవచ్చు.ఇది ప్రజల మధ్య ఎన్నో వైరుధ్యాలు సృష్టిస్తోంది.మధ్య తరగతి వారిలో కూడా తమ కంటే తక్కువ ఆస్తిని కలిగి ఉన్నవారి పట్ల చిన్న చూపు చూస్తున్నారు.సొంత ఇల్లు కలిగిన ఇంటి యజమానులు అద్దెకుండే వారిపై ఈ అహంకారంతో కూడిన మాటలు వాడ టం మనం వింటూ ఉంటాము.
      సంపద కలిగిన వారు దానిని ఎలా ప్రదర్శించాలి  అనే కోణంలో ఆలోచిస్తుంటారు.తమ కట్టుకున్న ఇంటి ద్వారా ధరించే బంగారు ఆభరణాల ద్వారా,ఖరీదయిన బట్టలు ధరించడం ద్వారా ,విలాసవంత మైన వాహనాలు ద్వారా భారీ వేడుకలు నిర్వహించటం ద్వారా తమ గుర్తింపును పెంచుకోవటానికి ,ఇతరులకు తమ ఆర్ధిక హోదా అర్థం కావ టానికి దాని ద్వారా తమ అహంకారాన్ని చూపిస్తుంటారు.ఈ క్రమంలో వారు తమ కంటే తక్కువ ఆర్ధిక స్థాయి కలి గిన వారిపట్ల వారిమాట తీరులో వారి వ్యవహార ధోరణిలో అడుగడుగునా సంపద ఇచ్చిన అహంకారం తొణికిసలాడు తుంది.బంధువుల మధ్య ఈ ధోరణి సంబంధాలను క్షీణింప చేస్తుంది.వారు సంపాదించే క్రమంలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేస్తూ,వారి హక్కులను కాలరాస్తూ ,తమ తోటి ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను తామే సొంతం చేసుకుంటూ వ్యవహరించే ఈ ధోరణి సమాజానికి ఎంతో అరిష్టం.
      సంపద కలిగిన వారిలో కొంత మంది ఎంతో నిరాడంబరంగా ,ఎక్కడా ఈరకమైన అహంకార ధోరణి చూపకుండా
సరళమైన జీవితాన్ని గడిపే వారిని మనం గమనిస్తుంటాము.ధర్మ బద్దంగా సంపాదిస్తూ ప్రభుత్వానికి పన్నులు కడు తూ సేవా కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనించ వచ్చు.అటువంటి వారు పెద్ద పారిశ్రామిక వేత్తలలో కూడా వున్నారు.మన మధ్య లో కూడా ఎంతో మందిని మనం గుర్తించ వచ్చు.
       సంపద సుఖాన్ని,విలాసవంత మైన జీవనాన్ని ఇవ్వ వచ్చు.ఆరోగ్యం సరిగా లేక పోతే ఎంత డబ్బు వున్నా నిష్ప్రయోజనం.సుగర్,బి.పి లేని ధన వంతులను మనం తక్కువగా గమనిస్తాంఎంత డబ్బులున్నా ఏమీ తినటానికి ఉండదు.తిన్నది అరగదు.సమస్యలతో కంటినిండా నిద్రపట్టదు.heart attacks,cancers వస్తే పరిస్థితి మరింత దారుణం. ఇంత మాత్రానికి డబ్బు పేరుతో విర్ర వీగటం ,అహంకారం ప్రదర్సించటం,తమ తోటివారిని ఇబ్బందులు పెట్టటం ఎంత వరకు సమంజసం.సంపాదనకు అంతు లేదు.ఎంత సంపాదించినా వారికంటే అధిక ధనవంతులు ఉంటూనే వుంటారు.వారు చూపించే ఆధిపత్యం ,అహంకారం తక్కువ ధనవంతులను మరల బాధ కలిగిస్తుంది.
        సంపద వున్నా తృప్తిగా జీవించకపోతే ,సమాజంలో మంచి పేరు,గౌరవం జీవిత కాలం లో సాధించలేకపోతే దేన్ని చూసుకుని ఇంత అహంకారం ప్రదర్సించారో అది మరణిస్తే తన వెంట రాదు కదా!అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాలని ,భూమండలాన్నంతా తన పాదాక్రాంతం చేసుకోవాలని బయలుదేరి భారత దేశం వచ్చి తిరిగి వెళుతూ మార్గ మద్యంలో మరణిస్తూ తన రెండు చేతులు తన శవ పేటిక పై చాచి ఉంచే లాగా ఏర్పాటు చేయ మన్నాడట తాను ఏమీ తీసుకు పోవటం లేదు అని చెప్పటానికి.
            తాను తన కంటే అధిక ధనవంతుల ద్వారా పొందే అవమానం తో బాధ పడే వ్యక్తి దానిని ఇతరుల పై చూప కుండా ఆ లక్షణం తనలో వున్నట్లు గుర్తించి సంపద ద్వారా అహంకారాన్ని కాకుండా,వినయాన్ని పెంచుకుంటూ తోటి మనుషుల యెడల సహకార ధోరణితో మెలిగితే తన జీవితం ధన్యం అయినట్లే!

22 comments:

 1. బాగా చెప్పారండి.

  ReplyDelete
 2. మీరు చెప్పింది నిజం రవిశేఖర్ గారు..తోటి మనుషులతో సహకార భావంతో మెలిగితే చాలా బాగుంటుంది..
  చాలా మంచి పోస్టు..

  ReplyDelete
  Replies
  1. మీకు ధన్యవాదాలు.అట్లాంటి వ్యక్తులున్న సమాజం ఏర్పడాలని ఆశిద్దాం.

   Delete
 3. మీరు చెప్పినట్లుంటే ఎంతబాగుంటుందో!!!Good post.

  ReplyDelete
  Replies
  1. మనమంతా ఆశాజీవులం కదండీ.మనలో మార్పును సాధించి సమాజంలో దాన్ని చూడాలని ఆశించటం రచయితల, కవుల లక్షణం.మీ అభినందనకు ధన్యవాదాలు.

   Delete
 4. సర్, మీరు చెప్పినట్లు జరిగితే బాగుంటుంది. మంచి పోస్ట్.

  ReplyDelete
 5. రవి శేఖర్ గారూ!
  మరో వ్యాసం మంచి సందేశంతో ముగిసింది
  మంచి పోస్ట్ కి అభినందనలు మీకు.
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ !

   Delete
 6. Replies
  1. ధన్యవాదాలండి .

   Delete
 7. మంచి అంశాన్ని ఎన్నుకుని చక్కగా వ్రాస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. మీకు ధన్యవాదాలండి.

   Delete
 8. "డబ్బు సృష్టించే అహంకారం" గురించి చాలా బాగా చెప్పారండీ..

  ReplyDelete
 9. డబ్బుతో ఏ అవసరమూ తీరదు. కానీ ఏ అవసరం తీరాలన్నా డబ్బు కావాలి. అందుకే డబ్బు నేటి మానవ జీవితాన్ని శాసితోంది. డబ్బుకు విలువ లేకుండా , విలువలకు విలువనిచ్చే సమాజాన్ని సృష్టించుకుంటే తప్ప ఈ డబ్బు జబ్బు అంత తేలికగా పోదు.

  ReplyDelete
  Replies
  1. ఎంత చక్కగా చెప్పారండి.డబ్బు అవసరమైనప్పటికీ ప్రతి విషయాన్ని డబ్బుతో కొలిచే స్థితి నుండి విలువలపై సమాజం నడిచేలా ఉండాలి.మానవ విలువలన్నీ ఒక్కొక్కటి పతనమవుతున్నాయి.

   Delete
 10. "ధనమగ్ని ర్ధనం వాయు, ధనం సూర్యో ర్ధనం వసుః
  ధన మింద్రో బృహస్పతి ర్వరుణం ధన మశ్నుతే" -శ్రీ సూక్తం

  "Money can not give everything, but you shouldn't utter that without having it" - Ad of Sardarji, Insurance Agent, Canada :)

  ReplyDelete
 11. మాస్టారు,
  అవసరమైన అంశంపై మీ వ్యాసాలు చాలా బావున్నాయి, డబ్బు/పరపతి/పవర్/స్వార్ధం ఇవన్నీ తోబుట్టువులైనా,
  'నీకంటే నేను గొప్ప' అనే అహంకారం వాటికి తాత లాంటిది, మనం చూస్తున్న సమస్యలకి కారణం అనిపిస్తుంది.
  దేశాలు, మతాలు, రాజకీయాలు..ఎక్కడ సమస్యలు చూసినా,వాటికి బీజం ఎవడో ఒకడు/కొందరు మీకంటే నేను మెరుగు
  అనుకోవడమే కారణం అనుకుంటున్నా!

  ReplyDelete
  Replies
  1. చాలా బాగా విశ్లేషించారు సర్.మీకు స్వాగతం మరియు ధన్యవాదాలు.

   Delete