Friday 30 March 2012

కవితారవి... ఒద్దుల రవిశేఖర్

                 అక్షరాలను అస్త్రశస్త్రాలుగా మలచినవాడు                      
                       నిశ్శబ్దం లోని శబ్దాన్ని వినేవాడు
                 అభావం లోని భావాన్నిచూసేవాడు
                        ప్రకృతి లోని కృతిని పాడేవాడు
                 అంతరంగ లోతుల్నిస్ప్రుశించేవాడు
                         ఆనందపు అంచుల్ని తాకేవాడు
                 పూలపరిమళాన్నిపుటలఫై చల్లేవాడు
                         పండు వెన్నెలను పగలే చూపించేవాడు
                 ఇంద్రధనుస్సు లోని రంగుల మర్మం తెలిసినవాడు
                         చెరకు విల్లును వంచి చెక్కర రసాన్ని గ్రోలేవాడు
                 చెలి చెక్కిలి ఫై చక్కిలిగింతలు పెట్టేవాడు
                         ప్రణయం  లో ప్రణవరాగం వినిపించేవాడు
                  కవితా కాంతులతో వెన్నెల కావ్యాలు రచించినవాడు
                         సౌందర్యం లోని సౌరభాన్ని వెదజల్లే వాడు
                  శృంగారం లోని రహస్యాలను శోధించేవాడు
                         ఒక్క పిలుపుతో లక్ష అక్షౌహినులయ్యేవాడు
                   ఒక్కపలుకుతో సహస్ర శతఘ్నలు  పేల్చేవాడు
                         మనిషి వేదనను  ఉచ్చ్వాశించేవాడు
                  కవితాక్షరాలతో    నిశ్వాశించేవాడు
                         సమస్యల ఫై పర్జన్య శంఖం పూరించేవాడు
                  అన్నార్తుల పాలిట  ఆపన్నహస్తం అయ్యేవాడు
                         కష్ట జీవుల స్వేదం లో నిర్వేదం తెలిసిన వాడు
                  కర్షకుల కష్టాన్ని కన్నీటితో పలికించినవాడు
                         కార్మికుని కడుపాకలిని పసిగట్టేవాడు
                  కాలం చెక్కే చరిత్రను క్రమబద్ధం చేసే వాడు
                          ప్రతి ఎద లోని వ్యధలను  వినేవాడు
                  అవినీతిని కవిత్వం తో ఖడ్గ  ప్రహారం  చేశేవాడు
                          అంధకారాన్ని  చీల్చుతూ వెలుగురేకలు నింపేవాడు
                 నిజాల నిప్పులు చిమ్ముకుంటూ నింగి    కెగరేవాడు
                          ఇజాల తుప్పు  వదిలిస్తూ డప్పు మ్రోగించేవాడు   
                  నిత్యం సత్యాలను ఆవిష్కరించేవాడు
                          తిమిరం ఫై జ్ఞానఖడ్గం తో సమరం   చేశేవాడు

18 comments:

  1. బాగుందండి. ఇన్ని లక్షణాలు ఉండాలా కవి కి?

    ReplyDelete
  2. బాగుందండీ! కవికి ఇన్ని లక్షణాలు సలక్షణం గా ఉండాలి అంటారా?

    ReplyDelete
  3. అమ్మో!! ఇన్నింటిలో ఒక్కటికూడా లేదు నాకు... :-)
    Nice one.

    ReplyDelete
  4. వెన్నెల గారు,వనజ గారు ఒక కవి ఇన్ని విభాగాల్లో వ్రాయాలని కాదు .కవులు ఈ విభాగాల్లో వ్రాస్తుంటారు
    ఇక్కడ కవి అంటే అందరికి ప్రాతినిధ్యం వహిస్తాడు .కృష్ణ శాస్త్రి భావుకత అయితే,శ్రీశ్రీ గారు విప్లవ కవితలు అలాగే శివారెడ్డి,అఫ్సర్ విభిన్న కవులు పలికించిన అన్ని భావాలు "కవి "కే చెందుతాయి కదా!ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మీ భావం అర్ధమైంది శేఖేర్ గారు.కవికి యెంత
    విషయ పరిజ్ఞానం వుంటే అంతా బాగా కవి గా రాణించగలడు అని!

    ReplyDelete
  6. స్వాగతం పూర్వ ఫల్గుని గారు !ధన్యవాదాలు.కవి సమాజాన్ని ఎంత బాగా చదివితే అంత లోతయిన అవగాహన కలిగి అన్ని విభిన్న రంగాలలో వ్రాయగలడు.

    ReplyDelete
  7. "కవిత్వం తో ఖడ్గ ప్రహారం "

    "సమస్యల ఫై పర్జన్య శంఖం "

    "తిమిరం ఫై జ్ఞానఖడ్గం"

    చాలా బాగా రాసారు శేఖర్ గారు.

    వీలైతే దీనికి కూడా ఓ మంచి కవితని పంపండి..

    http://neelahamsa.blogspot.com/2012/03/open-challenge.html



    ధన్యవాదాలు..

    ReplyDelete
  8. "ప్రణయం లో ప్రణవరాగం వినిపించేవాడు" .... దయచేసి కాస్త వివరిస్తారా?

    ReplyDelete
    Replies
    1. ప్రణవం అంటే ఓంకారం .ప్రణయ రచనలలో ఓంకారం పలికిస్తాడని .అంటే బాగా వ్రాస్తాడని .మీ ఆహ్వానానికి ,ప్రశంసకు ధన్యవాదాలు.తప్పక ప్రయత్నిస్తాను.

      Delete
  9. చాలా చాలా బాగుందండీ! అలంకార భరితంగా ఉంది. మరి కవయిత్రి అవ్వాలంటే? (తిట్టుకోకండే ఇదేం ప్రశ్న అని సరదాకే అడిగా!) అక్షౌహిణి అంటే నాకు తెలిసినంతవరకూ పది అనీకులు అంటే మొత్తం కలిపి లెఖ్ఖ వేస్తే 21870 రధములు, 21870 ఏనుగులు, 65610 గుఱ్ఱాలు, 109350 పదాతులు. ఇక్కడ మీరు ఒక్క పిలుపుతో లక్ష అక్షౌహినులయ్యేవాడు అన్నారు దాని అంతరార్థం చెప్పగలరా? అలానే సమస్యల ఫై పర్జన్య శంఖం పూరించేవాడు అన్నారు అంటే కృష్ణుడిని ఉద్దేశ్యించేనా? అదే అయితే కృష్ణుడు పూరించిన శంఖం పేరు పాంచజన్యం కదా? (ఒకసారి ఇది చూడండి http://navarasabharitham.blogspot.mx/2011/08/blog-post_09.html) . అలానే పర్జన్యుడు వర్షానికి అధిదేవత కదా! దీనిని కూడా కాస్త వివరించగలరు.

    ReplyDelete
    Replies
    1. పర్జన్యం అంటే మేఘం అని అర్థం వస్తుంది పర్జన్య శంఖం అంటే మేఘం యొక్క గర్జన గా భావించగలరు .అలాగే మీ అక్షౌహిని భావన నిజమే .అతని పిలుపు అంతశక్తివంతమని .ధన్యవాదాలు మీ వివరణకి .ఇక మనమంతా కవులమే

      Delete
    2. మీ ప్రశంశ కు ధన్యవాదాలు

      Delete
  10. రవి శేఖర్ గారు నమస్తే ! మీరు నా కథ "దేవత -ప్రేమ దేవత ని రీ షేర్ చేసినందులకు ధన్యవాదములు. నేను ఇప్పుదే చూసాను. మీరు ఆ post లింక్ ఇవ్వడం మరచి పోయినట్లు ఉన్నారు. నేను పంపుతున్న లింక్ ఇవ్వండి.అప్పుడు మన మిత్రులు చూడటానికి సులభంగా ఉంటుంది. ధన్యవాదములు.
    http://vanajavanamali.blogspot.in/2012/02/blog-post_17.html

    ReplyDelete
    Replies
    1. నమస్కారమండి ,మీ కథకు వ్యాఖ్య వ్రాద్దామని చూస్తే అలా అయింది .అలా కూడా చేయవచ్చా !ప్రయత్నిస్తాను.

      Delete
  11. ' రవి గాంచనిచో కవి గాంచు నెయ్యెడన్ '
    అని కదా ఆర్యోక్తి . అదే నీ కవితలో వివరించావు
    రవివి కదా ! కవితా స్వభావాన్ని రమణీయంగా కమనీయంగా చిత్రించావు .
    చిత్రం ఏమిటంటే , ప్రణయం ప్రణవం పరిమళం పర్జన్యం సౌరభం ప్రహారం వంటి
    సుందర సుమధుర పద బంధాలు , తెలుగు భాషా సౌందర్య మకరంద మాదుర్యా;లు
    కనుమరుగై పోతున్నాయని ఒకింత బాధ . అది మనపై దాడి చేస్తున్న ఆంగ్ల భాష ప్రభావం మరి
    నీ కవితని తిలకించిన కొందరి స్పందనలు చూచి ఇది వ్రాసాను .
    నీకు, నీ కవితని దర్శించిన అందరికి , వారి కవితా హృదయానికి , అభినందనలు

    ReplyDelete
  12. తెలుగు బాష లోని అద్భుత సౌందర్యం మీ కవితల్లో చూసాను .మీ విశ్లేషణకు ,ప్రశంసకు ధన్యవాదాలు .మీ బాషాభిమానం మాకు ఆదర్శం .మీ లాంటి వారి ప్రశంసలు మాకు ఆశీర్వాదాలు .

    ReplyDelete
  13. ఎస్ ! రవి గాంచని చో కవి గాంచు నెయ్యడన్ అన్న కవి పుంగవుల వాక్కులకు చక్కని ప్రతీక మీ కవిత . ప్రపంచాన్ని .సకల ద్ర్హక్కోనాలలో వీక్షించ గల శక్తి వుండి సమస్యకు నివృత్తిని సూచించ గలవాడు కవి. మీ అక్షరాల కూర్పులో భావం ఇమిడి పోయి భవ్యత చేకూరింది. కవి లోకానికి భాద్యత పెరిగింది. . ...శ్రేయోభిలాషి ...నూతక్కిరాఘవేంద్ర రావు.Kanakambaram.)

    ReplyDelete
  14. మీ అభినందనకు నమస్సుమాంజలులు రాఘవేంద్ర రావు గారు!

    ReplyDelete