గ్రామీణ ప్రాంతాలలో రకరకాలయిన పండ్ల తోటలను మీరు చూసే ఉంటారు.మేమున్న మార్కాపూర్ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రసిద్ది.కడప,కర్నూలు ,ప్రకాశంజిల్లాలో పశ్చిమప్రాంతం (కనిగిరి,గిద్దలూరు ,మార్కాపూర్,ఎర్రగొండపాలెం) మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలలో ఈ తోటలు బాగా ప్రసిద్ది.ఇవి అన్నీ బోర్ల క్రింద నీటి సాగుతో పండుతాయి.భూమిలో 300 అడుగులనుండి 600 అడుగుల లోతువరకు బోర్లు వేస్తారు.ఈ మధ్య కాలంలో మా ప్రాంతంలో సరి అయిన వర్షాలు లేక బోర్లలో నీళ్ళు లేక కొన్ని వందల ఎకరాలు ఎండి పోయాయి.రైతులు వాటిని తమ పిల్లల్లాగా కంటికి రెప్పలాగా పెంచుకుంటారు.మాకు కూడా 5 ఎకరాల తోట ఉండేది.బాగా కాపు మీద నీళ్ళు లేక మొత్తం ఎండి పోతే కొట్టివేసాము.9 అడు గుల ఎత్తు పెరిగిన వాటిని కొట్టివేస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.అలా 5 జిల్లాలలో కొన్ని వేల ఎకరాలు తోటలు కొట్టివేశారు.పండినప్పుడు కూడా సరిగా గిట్టుబాటు ధరలు వచ్చేవి కావు.3,4 సం: నేను హైదరాబాద్ మార్కెట్ కు వెళ్లి వాటిని అమ్మగా టన్నుకు రూ 4000 లేదా రూ6000 మాత్రమే వచ్చే వి.బాగా వేసవిలో అయితే రూ10,000 వరకు వచ్చేవి కానీ అప్పుడు నీరు లేక కాయలు తక్కువగా ఉండి బరువు తూగేవి కావు.
మా తోటలోకి వెడితే అదొక స్వర్గం .తోట పూతకు వచ్చినప్పుడు అక్కడ గాలిలో వాటి పరిమళం అంతా తోట చుట్టూ వ్యాపిస్తుంది.మా తోటలో వున్ననాలుగు వేపచెట్లు ఒకే చోట ఉండి గొడుగు పట్టినట్లు ఉంటా యి. ఇవి మాత్రం నా కోరిక మేరకు ఇప్పటికీ అక్కడ వున్నాయి.తోట మధ్యలో ఉండడం తో వాటిని కొట్టే స్తామంటే ఆపాను.వాటి క్రింద నులక మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో!
చెట్లకు నీరు కడుతుంటే మట్టి వాసన కమ్మగా మనకు సోకుతుంది.రైతుకు భూమి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.అందుకే కన్నతల్లి ఎలా లాలిస్తుందో ఆ భూమి అంత సాంత్వన నిస్తుంది.కాబట్టే దాన్ని వదలాలంటే రైతుకు అంత కష్టం.అందుకే పరిశ్రమల పేరుతో సారవంత మయిన భూములు కోల్పోయే రైతులు అలా తిరగబడతారు.
నీరు కట్టిన రెండు రోజులకు చెట్లు చిగిర్చి తలలూపుతూ పలకరిస్తుంటే రైతు కడుపు ఆనందంతో నిండి పోతుంది.అలాంటి స్థితిని అనుభవించిన మాకు ఆ తోట నీరు సరిపోక కొట్టివేసి ప్రస్తుతం మిర్చి, పత్తి వేసాము.కానీ అప్పటి ఆనందం తోట కెడితే ఇప్పుడు రావటం లేదు.ప్రభుత్వం ఈ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించాలి.
మనం ఎక్కువగా బజారు కెళ్ళినా,ఇతర ప్రాంతాలకు వెళ్ళినా cooldrinksత్రాగుతూ ఉంటాము అలా కాకుండా బత్తాయి రసం త్రాగితే ఎంతో ఆరోగ్యం.100 grams ఒక కాయలో fat o.2 grams, saturated fat 0%,cholestrol 0%,sodium0%,carbohydrates 11g,fibre 3g,protiens 0.7 g,sugar 3g ఇలా ఇందులో పోషక పదార్థాలు ఉంటాయి.అలాగే దీనిలో c విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది జబ్బు పడ్డ వారికి ఈ రసం చాలా శక్తి నిస్తుంది.ఇరాన్ లో ఈ రసం తో ఫ్లూ,మరియు జలుబు కు వైద్యం గా వాడతారు.ఇవే కాకుండా ఎక్కువ మంది ఈ రసం త్రాగితే వాటికి బాగా డిమాండ్ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలు దొరికే అవకాశం ఏర్పడుతుంది.అందరు ఈ దిశగా ఆలోచిస్తే మన గ్రామీణ ప్రాంతాల లోని రైతులకు,పల్లెలకు ఎంతో మేలు చేసిన వారమవుతాము.