నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి పిలుస్తుంటే
మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే
లేత పాదాలు అటువైపే దారితీస్తుంటే
ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ని
అగ్నిపర్వతం క్రేటర్లో మునగపోతున్నట్లు
తుఫాన్ కన్నులో కాలు మోపబోతున్నట్లు
కాళ్ళ క్రింద భూమి చీలబోతున్నట్లు
ఏ సంకేతాలు వాడికి అందలేదు
ఆటలోని ఆనందం
కుతూహలం లోని ఉత్సాహం
వాడిని మరణం అంచుల్లోకి
వెళ్ళకుండా ఆపలేదు
అన్వేషణ అంతమయ్యే లోపు
వాడు త్రిశంకు నరకం లోకి
జారుతున్నాడు
కన్నులు పొడుచుకున్నా
కానరాని గాడాంధకారం
ఒళ్లంతా చీరుకుపోయి కారుతున్న రక్తం
ఏదో బండరాయి వాని చావుకు అడ్డుపడింది
అప్పుడు మొదలయ్యింది ప్రత్యక్ష నరకం
ఉచ్చ్వాస,నిశ్వాసలు భారంగా మారుతూ
కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ
గొంతు నిండా మట్టితో ఉక్కిరిబిక్కిరవుతూ
క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే
సమాంతర బోరుకు సన్నాహాలు
ఆక్సిజన్ గొట్టాల జారవేత
గంటలతరబడి వేలమంది కన్నీటి ధారలతో
గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో
మార్మోగుతున్న ఆ ప్రాంతంలో
ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం
బయటకు తీసిన వాడి శరీరంలో
కొన ఊపిరయినా ఉందేమోననే ఆశ
నిరాశగా మారిన ఆ క్షణం
దిక్కులు పిక్కటిల్లేలా శోకం
ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో
రక్కసిలా నోరు తెరిచిన ఈ బోరు బావుల్లో
యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు
చిన్నారుల చిరునవ్వుల కోసం