Tuesday, 19 May 2020

నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ


ఆధునిక ఇతిహాసం,నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ :ఒద్దుల రవిశేఖర్                                                                                 *కవి వ్యక్తీకరణ సమాజం గురించి అందులోని సమస్యలకు తన ప్రతిస్పందన.ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్లమంది కోసం,భారత దేశం లోని 50 కోట్లమంది(రచనాకాలం జనాభా)కోసం గొంతెత్తుతాను అంటూనే ఈ దేశమే కాదు మానవ జాతి అంతా ఇదే వేదన పడుతుందని విశ్వవేదనను తన కలం ద్వారా పలికించాడు. తన పలికే నా దేశపు నాలికపై పలుకుతుందని ప్రకటించాడు.                               *ఇతిహాస నిర్మాణానికి తన అనుభవం,పాండిత్యం అంతా ధారబోసి రచించానని ప్రకటిస్తూ నా రక్తమే ఈ ఇతిహాసం అనడంలో తనలో పగిలిన బడబానలమేఈ రచన అంటూ విశ్వమానవుడయ్యారు."అనుభవ జ్ఞాన నేత్రద్వంద్వం" అనే పదప్రయోగం అద్భుతం.అనుభవం,జ్ఞానం అనే రెండు నేత్రాలతో మానవచరిత్రను పిండినట్లు తెలియజేసారు.అందుకే ఎంతో స్థిరంగా ఇది ఈ శతాబ్దపు పాటగా ధైర్యంగా ప్రకటించుకున్నారు.                                      *తన అనుభూతికోసం ప్రతితరం కవులు ఒక భాషను సృష్టించుకుంటారు.ఈ కాలపు మనిషిని అవిష్కరించడాానికి నేను ఒకభాషను,ఒక లోకాన్ని సృష్టించానని ,ఎందుకంటే మనిషి లాగా,ఎవరికీ తలవంచని స్వతంత్రమానవుడు ఈ కాలం మనిషి కనుక. ఇప్పటి మనిషి గతం లోని వ్యవస్థను విధ్వంసం చేయడమే లక్ష్యంగా నమ్ముతాడు కాబట్టి.కనుక తన రచన ఇప్పటి మనిషి ఆశల్ని,ఆశయాల్ని, తిరుగుబాటును ప్రతిబింబిస్తుందని చెబుతారు.                       *కర్షకుని ఇతివృత్తమే ఈ కావ్యం.ఈ ఇతిహాసం లో అంతా కర్షకుని శ్రమే కనపడుతుంది .ప్రపంచ సాహిత్యాన్ని విస్తారంగా చదివిన అనుభవం ఆయన ఇచ్చిన విభిన్నభాషల్లోని పుస్తకాల ఉదాహరణనుబట్టి మనకర్ధమవుతుంది.                                                                                             ఒకటో సర్గ.                                                     కర్షకుని,కార్మికుని హస్తం ఎన్ని పనులు చేస్తుందో వర్ణిస్తూ "మానవ జీవిత పొలాల్ని దున్నుతా"అన్న ఒక్క వాక్యం తో వివరిస్తారు.కానీ రైతుకు ఏమీ దక్కలేదని నిర్వేదం చెందుతాడు.ప్రపంచంలో అన్ని మార్పులు తన చేతి గుండా జరుగుతున్నా తన జీవితం ఏమీ మారలేదని ఆవేదన తో తనలో రగిలే ఎర్రకోరికనే ఒక జెండాగా ప్రకటిస్తారు.తన అంతరంగ ఆవేదనను తిరుగుబాటుగా మార్చి పలుకుతున్న ఈ భావాలు చూడండి."తుఫానులు లెక్కజేయని నాకు ఈ క్షుద్బాధ ఒక లెక్కా!మిలియన్ల సుత్తులు, కొడవళ్లు సూర్యకిరణాల్లో ప్రతిఫలిస్తున్నాయి.".సముద్రపు అశాంతిని,ం
ఝoఝామారుతపు ఆవేశాన్ని తనలో పలికిస్తున్నాడు.           *కాలమనే కాగితంపై ఒక స్వప్నం రాసి తన ఊపిరితో సంతకం చేస్తా అంటూ భవిష్యత్ తరానికి ఒక సందేశం అందిస్తారు.తన కోరిక మనిషిలో అశాంతిని రేకెత్తించి ఉద్రిక్త రక్తం లా ప్రాకుతుంది అంటారు.తన పద్యాలను పొందే అర్హత భూగోళo మీద అన్ని జాతులకూ ఉంటుందంటారు.పైన తెలిపిన ధిక్కార ధోరణి ఏమయినా రుచించక నోబుల్ బహుమతి నిరాకరించారేమో అనిపిస్తుంది.అంతలోనే వసంతాన్ని వర్ణిస్తూ మనల్ని హాయిగా పలుకరిస్తారు.                                                            *అడవుల్ని కప్పుకొని, నదుల్ని తలపాగాలాగా చుట్టుకోవడం,రస్తాలను ఉత్తరీయాలుగా వేసుకోవడం లాంటి ప్రయోగాలతో ప్రకృతే తానై పోయాడు.తన దేశపు పర్వతాలను ఇతిహాసాలుగా మలచ దలుచుకున్నా అని ప్రకటిస్తూ తన మార్గం చెప్పకునే చెప్పారు.                                                                                                                                                                           రెండోసర్గ:                                                      తనను ఒక తుఫానుగా పరిచయం చేసుకుంటాడు. తన జాతి కెరటంలా ఆకాశం మీదికి దుముకుతుంది అని ధిక్కరిస్తారు. నగరాలు ఏర్పడకముందు,నదుల్ని దాటి ఇతర దేశాలకు ఎలా ప్రయాణమయ్యింది వర్ణిస్తూ భూమిని వాక్యంలా,నీలి సముద్రాలు,కామాలు,సెమీకొలన్లుగా పరిగణిస్తాడు. సముద్రాలు,భూమి ప్రేమ లేఖలు వ్రాసుకునే నీలిసిరిగిన్నెలుగా అభివర్ణిస్తూ అందులోని సిరాలోనుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు,నాగరికతలు,విజ్ఞానం అని ఓ మనోహరమైన పోలికను ప్రతిపాదించారు.                                                                                          మూడో సర్గ                                                   హైదరాబాద్ మహానగరంగా మారాక ఎంత కాలుష్యకారకంగా మారిందో ఇందులో వర్ణిస్తారు.చెట్లు తనకేసి చూస్తూ మాకు కవిత్వాలు వద్దు,వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వమని అడుగుతాయని చెప్పడం ద్వారా చెట్లెంత విషాదంలో ఉన్నాయో కాలుష్యాన్ని పీల్చలేక అనిపిస్తుంది.పూలెందుకు పూస్తాయి ఇవి,బుల్లెట్లు పూయక అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.మిలియన్ల కొద్దీ మనుషుల గొంతుల్ని కాలం నొక్కివేస్తుంది ఈ నగరం లో,కానీ నీలగిరి కొండల్లో చెట్లు,పర్వతాల నడుమ చిక్కి చూస్తుంది కాలం అనే పోలికతో కవిత్వం లో కొత్త పోకడలు పోతారు." ఇక్కడ మనిషి సంతోషపు ఇంద్రజాలం లో శబ్దమై,పాటై, పక్షుల పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు.కాలం చేతి వేళ్ళ లోంచి కారిపోతాడు మనిషి."ఈ వాక్యాల్లో మనిషి పొందే ఆనందపు అంచుల్ని పట్టి మనముందుంచుతారు.ఇక్కడ పక్షులు, కీటకాలు అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాయి.ఇక్కడ మనిషి బుద్ది,అహంకారాలకు అధికారం లేదు.అందుకే కాలాన్ని నగరాలనుండి, కొండల్లోకి ఈడ్చుకువచ్చి సంహరించాను అని చెప్పడం ద్వారా తను ఎంత ప్రకృతి ప్రేమికుడో,అందులో ఎంత లీనమయ్యారో,ఎంత ఆనందం అనుభవించారో మన కర్ధమవుతుంది.విత్తనమై,చెట్టయి, పువ్వై వాటి మార్పుల్ని ,.పక్షినై,చేపనై మారి వాటి స్వేచ్ఛను తాననుభవిస్తారు.   పండు ఒట్టి సన్యాసి! సత్యదర్శనం కోసం తపస్సులో మునిగి పోయిన ఋషి ,ఎప్పుడయితే అది లభిస్తుందో అప్పుడు రాలిపోతుంది.అంతవరకు పండు ధ్యానం చేస్తున్న ఋషి అంటారు.ఈ ఒక్క పోలికతో ఆయన కవితా సౌందర్యం తాత్వికసీమల వైపు పయనిస్తోంది.రాలే పండు అనుకుంటుందట-చెట్టు గింజ తన కడుపులో ఉందని,చెట్టు నేను,ఒకటేనని ఎంత తాత్వికతను పండించారో ఇక్కడ! ఈ ధరిత్రి ఒక సృష్టి ప్రదర్శనశాల.పశువులు,పక్షులు,వృక్షాలు,మనుషులు అందరూ మట్టిలోకి అస్తమిస్తారు.కాలం అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది.,నిర్దాక్షిణ్యంగా.ఈ నాగరికతలను నిర్మించటానికి చెమట ఒక శాశ్విత అంతర్వాహినిిలా ప్రవహిస్తూ ఉంటుందని  హెప్పడా ద్వారా శ్రామికుని పాత్రను ఆవిష్కరిస్తారు. ఈ ప్రదర్శనశాల ఎన్నో నాగరికతలు,ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి.అన్ని నశించిపోతుంటాయి.కానీ మనిషి బౌద్ధికశక్తి మరో మార్పుకు బీజం వేసుకుంటుంది.                                                            నాలుగో సర్గ.                                            ఇందులో మళ్లీ తన కవిత్వాన్ని కదనాశ్వo లా దూకిస్తారు.ఎరుపు,రక్తం వంటి మాటలతో ధిక్కారం తన అజెండాగా ప్రకటిస్తారు.నేను పోయినా నా కవిత్వం,నా జ్ఞాపకాలు ఈ దేశపు గాలిలో పక్షులై పాడుతుంటాయి,అని తన కవిత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.చెట్లను,ఆకులుకాదు తుపాకులు కాయమని అడుగుతున్నాడు.అంతలోనే నిర్వేదం లో మునిగిపోతాడు. ఇప్పటివరకు ప్రకటించిన తిరుగుబాటు మాయమై తను ఓడిపోతున్న జీవినని,నేలమీద నడుస్తున్న బాటసారినని, ధ్యానంచేసుకోవాలనుందని ,తన ఏకాంతానికి భంగం కలిగించని దేవుడు లేని దేవాలయానికి పారిపోవాలని ఉందని తన నిస్సహాయతను వ్యక్తపరుస్తారు.ఈ ధ్యానంలోనుండే చివరకు దేవుడినయ్యాను అని చెప్పుకుంటారు.సూర్యోదయం,సూర్యాస్తమయాల్లేని అలౌకిక నిశ్శబ్దం లో మునిగిపోయాను అని తన స్థితిని వర్ణిస్తారు.చెట్లను నరికే కసాయి వాని చేతులు నరకాలి అని తనెంత వృక్ష ప్రేమికుడో తెలియజేస్తారు.తన ప్రయాణాన్ని తన ప్రేయసికి తెలియ జేస్తూ ఆయన కలం తెలుగు భాషను భరత నాట్యం ఆడేలా చేసింది."నీవక్షస్ శాద్వలసీమ మీద నా కవోష్ణ కిరణాల హిరణ్యం వెదజల్లుతాను".                                                                                         ఐదో సర్గ                                       మళ్లీ ఇందులో తనే నీ మోహినీత్వoతో తనని మోసం చేయవద్దని తనలో ద్వేషాన్ని తొలగించవద్దని,దాంతో నాలోని అగ్ని పర్వతాలు పగలనీయమని కోరుకుంటాడు.ఈ నేల ఎంతకఠినమైందో చెబుతూ తన గాయాల రక్త జ్వాలల్ని ఎండమావులుగా ఉమ్మివేస్తున్న నేల గా అభివర్ణిస్తారు."అవి రాళ్ళని ఎవరన్నారు,నోళ్ళుమూసుకున్న అంతరాత్మలు"అని చెప్పడంలో రాళ్లు ఎన్ని యుగాలనుండి అన్ని దోపిడీలు,దారుణాలు చూస్తూ మౌనంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారు. కర్షకునికి నీ ఒంటరికావు,నీ అడుగులో అడుగేసే వాళ్ళు ఉన్నారని మరువకు అంటాడు.కొండలు ఎందుకు అరవవు,రాత్రుల కపాలాలు పగలవెందుకు,ఈ నక్షత్రాలు చచ్చి నేలకు రాలవెందుకు,ఈ జనం నా మాట వినరెందుకు ,వీరిని ఎలా మార్చాలో తెలీదు అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.                                                      ఆరోసర్గ.                                                   పరిణామ క్రమంలో  భూమంతా మానవులు స్వేచ్చగా తిరిగినట్లు తను అలాంటి దేశద్రిమ్మరినని చెబుతూ నేను పీల్చే ఊపిరే పోట్లాట అని స్పష్టంగా ఎలుగెత్తిచాటుతారు."నేను సత్యాగహిని,సత్యం నా గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం,నా గొంతులో గర్జిస్తున్న జలపాతం అని సత్యం కోసం తన కోసం తన పోరాటాన్ని ఆరంభిస్తారు."దేశం కోసం పోరాడటానికి తరలిరమ్మని ప్రజలకు పిలిపిస్తున్నాడు.మీ వేడి గొంతులతో నా తుపాకులూ, నా శతఘ్నులు తయారుచేసుకుని దేశం కన్నీరును తుడుస్తాను"అని తన దేశభక్తిని చాటుకుంటారు."నా గొంతు ,నా భాష జాతికి అంకితం,నేను ఒక రక్త ప్రవక్తను".అంటూ నా పద్యాలనే బందూకులు తీసుకురండి,మబ్బుల్లో దాచుకున్న పిడుగులు తెండి,రండి,అంటూ తనని తాను ఝంఝామారుతాన్ని అని ప్రజలకు పిలుపిస్తారు.పీడిత ప్రజలదే ఈ భూమి,నాతో కలిసినడవండి, నాగళ్ళు తీసుకు రండి,మనల్ని బానిసలు చేసిన వాళ్ల ప్రాణ వాయువులు తీద్దాం రమ్మని విప్లవోన్ముఖం వైపు ఒకరకంగా ఒక Long March కోసం పిలుపిస్తారు.ఆకలి ,దప్పికలు నీ స్వేచ్ఛను హరిస్తున్నాయి.విద్యార్థులను పుస్తకాలు వదిలేసి పొలాలు ఆక్రమించుకుందాం రమ్మంటారు."స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస.అది నీ రక్తపు సజీవభాష. నీ చివరి శ్వాస వరకు స్వేచ్ఛను నిలుపుకోవడమే నీ ధ్యాస "అంటూ మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలియ జేస్తారు.తన ఆగమనాన్ని ,తన మహాప్రస్థానం కర్షకులకోసం అంటూ తన శక్తి ,రక్తం అంతా ధాన్యంగా,పండ్లుగా మారిపోవాలి.తను ఒక ఉద్యమ విద్యుత్తు ఇస్తున్నానంటూ పిలుపిస్తారు.తిండి గింజలు ఎలా వస్తున్నాయి.వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవాలంటారు."భూమిని బుజ్జగిస్తాను,లలితంగా లాలిస్తాను.వెన్నలాంటి మన్నుతో గోరుముద్దలు చేసి పైర్ల పసినోళ్ళ కందిస్తాను.".భూమి పట్ల,పంట పట్ల రైతు ప్రేమను ఇంతకన్నా  గొప్పగా ఎవరు వ్రాయగలరు.ఇంత చేస్తున్నా నాకు గుడిసెతప్ప ఏమీ లేదని కర్షకుని దైన్యాన్ని తనలో పలికిస్తారు. ఉదయాన్నే సూర్యోదయం అవుతుందని ఆశిస్తే సూర్యగ్రహణం వచ్చిందని ,మనుషుల్ని అలా మోసం చేసారని ఆవేదనతో జ్వలించి పోతారు."ఎవరు నేల గొంతు ఆలకించి దాన్ని లాలించి తన చెమటతో,రక్తంతో వెన్నలా,జున్నులా మృదువు చేశారో" రైతు దేహంలోకి ,మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుంది ఈ కవిత్వం.ఇంత చేసినా చివర్లో ఒక్కగింజ దక్కలేదని బాధపడతారు.మనిషిని అవమానించిన వాణ్ణి దుర్భాష లాడతారు.తిట్లు చిన్నవి,నా దేహమంతా అగ్నిఛ్చటుల వర్షపాతం వీస్తోంది. అది మిమ్మల్ని భస్మిపటలం చేస్తోంది అని హెచ్చరిస్తారు.రైతుకు ఏమీ దక్కనివ్వని ఈ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు."ఈ దేశం లో ఒంగేవాడికి ఒంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు"అని బానిసలుగా బ్రతికే వారిని ప్రశ్నిస్తారు.                                                                                                 ఏడవ సర్గ                                                      చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు.సూర్యుడు భూమిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. తన దేశాన్ని తన ప్రేయసిలో చూసుకుంటూ ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం విసిరే క్రూర సవాళ్ళను ఎదుర్కొంటాను,అని ముగిస్తారు.                       *శ్రామికునిపట్ల,కర్షకుని పట్ల సామాన్యమానవుని పట్ల ఇంత ప్రేమ,ఆపేక్ష చూపించిన కవి మనం చూడలేమేమో!శ్రీశ్రీ మహా ప్రస్థానం మానవ సంగీతాన్ని పలికిస్తే శేషేంద్ర "నా దేశం,నా ప్రజలు" మనిషి గుండెలోని బడబాగ్నిని అగ్నిపర్వతం లా తుఫానులా విరుచుకు పడేలా చేస్తుంది.                                             *ఈ ధిక్కార ధోరణే ఆయనకు నోబుల్ బహుమతిని దూరం చేసిందేమో అనిపిస్తుంది.ఠాగూర్ "గీతాంజలి"కి ఏమాత్రం తీసిపోని కావ్యం.నోబుల్ బహుమతికి అర్హమైన కావ్యం.

                

Saturday, 16 May 2020

విత్తనాలు నాటుదాం.

                 పండ్లు తినడం మనకు బాగా అలవాటు.ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.ఏ కాలం లో వచ్చే పండ్లను ఆయాకాలాల్లో తినడం ఎంతో మంచిది.విదేశాల్లోనుండి దిగుమతి అయ్యే ఖరీదైన పండ్ల కంటే మన దేశం లో పండ్లు తక్కువ ధరలో దొరుకుతాయి.పండ్ల తోటలను చూస్తే అక్కడ రైతులు వాటిని ఎంత కష్టపడి పండిస్తున్నారో అర్ధమవుతుంది ఒకప్పుడు మాకు బత్తాయి తోట ఉండేది.నీళ్లు లేక ఎండిపోయాయి.sweets,oil foods,junk food కు పెట్టే ఖర్చులో సగభాగం పండ్లు తినడానికి వెచ్చిస్తే రైతులు లాభపడతారు.                                                                                  మనం తినే పండ్లలో విత్తనాలు ఉంటాయి.వాటిని మనం పారవేస్తూ ఉంటాము.కానీ ఒక్కసారి ఆలోచించండి.ఆ విత్తనాల ద్వారానే కదా ఆయా మొక్కలు మొలిచేది.మరి వాటిని భద్రపరిచి,ఎండపెట్టి,ఎక్కడయినా భూమిలో పాతితే మొక్కలు మొలుస్తాయి కదా!అడవిలో చెట్లు ఎవరు నాటుతున్నారు.విత్తనాలు నేలపై పడి వర్షాలు పడ్డప్పుడు మొలకెత్తుతాయి.అలాగే రాబోయే వానాకాలం లో మనం తిన్న పండ్ల విత్తనాలను ఎక్కడ వీలయితే అక్కడ భూమిలో నాటితే సరి. పండ్ల విత్తనాలే కాదు,చింతపండు ఇంట్లో వాడతాము కదా,వాటి విత్తనాలు,ఇంకా వేప,కానుగ, మర్రి,రావి ఏవి దొరికితే అవి నాటుకుంటూ వెడితే వాటిలో 10 శాతం బ్రతికినా మేలే కదా! నేను విత్తనాలు దాచిపెడుతున్నాను,మీరు చేస్తారా ఈ పని.మన భూమికోసం,మన పిల్లలకోసం ఈ పని చేద్దాం.చేస్తారు కదూ!

Monday, 20 April 2020

SAPIENS A Brief history of human kind by Yuval Noah Harari పై విశ్లేషణ ......ఒద్దుల రవిశేఖర్

SAPIENS A Brief history of human kind by  Yuval Noah Harari పై విశ్లేషణ ......ఒద్దుల రవిశేఖర్        మాములుగా మనం History books చదవాలంటే అంతగా ఆసక్తి చూపం.ఎందుకంటే అవి వ్రాసిన రచయితల శైలి కావచ్చు,అందులోని సమాచారాన్ని అందించే క్రమం కావచ్చు మనలో చదవాలనే ఉత్సాహాన్ని కలిగించవు. మానవ జీవిత పరిణామ క్రమాన్ని తెలిపే నండూరి రామమోహనారావు గారి "నరావతారం "నేను 8వ తరగతిలో చదివినప్పటినుండి నాకు ఆసక్తి పెరిగింది.తరువాత జీవ శాస్త్రం లో వచ్చిన  చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం మరింత ఉత్సుకతను కలిగించింది.అలా ఈ విషయాలపై అక్కడక్కడా కొన్ని పుస్తకాల్లో,మరియు వార్తాపత్రికల్లో ,science magazines లో తెలుసుకుంటూ వస్తున్న క్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా బోధిస్తున్న క్రమంలో అసలు ఈ విశ్వము ఎలా ఏర్పడింది,విశ్వ పరిణామ క్రమం తెలుసుకోవాలనే జిజ్ఞాస ను కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు రోహిణీ ప్రసాద్ రచించిన "విశ్వాంతరాళం"తీర్చింది.ఇక TED talks లో Big history project గురించి David christian చెప్పింది విన్న తరువాత మరింత స్పష్టత వచ్చింది.(https://www.bighistoryproject.com/home)తరువాత మార్కాపురం రేడియో స్టేషన్ డైరెక్టర్ మహేష్ గారు కోరిక మేరకు "విజ్ఞాన ప్రపంచం "శీర్షిక తో 12 ఎపిసోడ్స్ కార్యక్రమాన్ని నన్ను ఇంటర్వ్యూ చేసి రికార్డింగ్ చేసి,ప్రసారం చేశారు.విశ్వ,మానవ పరిణామ క్రమాల గురించి తెలుసుకుంటూ,విద్యార్థులకు,కొన్ని public seminars బోధించడం జరుగుతూనే ఉంది.ఈ దశలో చరిత్ర ప్రొఫెసర్ యువల్ నోహ్ హరారి రచించిన "Sapiens" A brief history of humankind  book ,shop లో casual గా చూసాక,ఇదేదో మన కోసమే వ్రాశారట్లుందే అనుకొని కొని 1 సంవత్సరం అయింది.ఇదిగో ఇలా ఈ కరోనా కాలం లో చదివాను.చదువుతుంటే ఎన్నో సందర్భాల్లో విభ్రమానికి గురయ్యాను ఆయన విశేషణకు.దీని తెలుగు అనువాదం కూడా దొరుకుతుంది.ఇక ఇందులో 4 విభాగాలు,20 chapters ఉన్నాయి. Part 1: The cognitive Revolution :ఇందులో ఆఫ్రికా నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హోమోసేపీఎన్స్ చరిత్ర వివరిస్తారు. Part 2:The Agricultural revolution:ఆహార సేకరణ నుండి ఆహారం ఉత్పత్తి కి మారిన క్రమాన్ని వివరిస్తారు.Part 3:The unification of humankind ఇందులో సమూహాలుగా,జాతులుగా,మతపరంగా,డబ్బుపరంగా,సామ్రాజ్యాల పేరుతో ఎలా మానవ జాతి ఏకమయ్యిందో వివరిస్తారు.Part4:The scientific revolution:ఇందులో విజ్ఞాన విప్లవం ఎలా మనల్ని ప్రభావితం చేసిందో సమగ్రంగా విశ్లేషిస్తారు.చివర్లో మన (హోమోసే పియన్స్) భవిష్యత్తు గురించి విభ్రాంతికరమైన విషయాలు తెలియజేస్తూ "తమ కేమి కావాల్నో తెలియని ఈ మానవజాతి ప్రయాణం కన్నా భయంకరమైనది ఇంకా ఏమైనా ఉన్నదా?"అని ప్రశ్నిస్తూ మన మెదడు నిండా భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తారు.ఈ క్రింది లింక్ లో రచయిత స్వయంగా వీడియో ల రూపంలో ఈ పుస్తక సమాచారాన్ని గురించి వివరించారు.https://www.youtube.com/playlist?list=PLfc2WtGuVPdmhYaQjd449k-YeY71fiaFp

Sunday, 5 April 2020

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey)      ఒక సమీక్ష.   .........   By  ఒద్దుల రవిశేఖర్                                                                            2000  సంవత్సరం లో అనగా 20 సంవత్సరాల క్రితం నంద్యాలలో ఈ పుస్తకం కొని చదివాను.నా మీద బాగా ప్రభావితం చూపిన పుస్తకం ఇది.సత్యవతి గారిచే తెలుగులో అనువదించబడింది.మళ్లీ చదవాలని నిర్ణయించుకుని గత 10 రోజుల్లో పూర్తి చేశాను.కొద్దిగా వివరంగా ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తాను.                                                        తొలి పలుకులో మన పరిష్కారాలెప్పుడూ దేశాకాలాతీతమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి.ఇదే ఈ పుస్తక మూలసారం.                                                             పుస్తకం ఒకటవ భాగం:దృక్పధాలు-సిద్ధాంతాలు,అంతరంగం నుండి బహిరంగానికి,7 అలవాట్లు ఒక అవలోకన.                    ఆలోచనలు ఎట్లా ఏర్పడతాయి,మన దృక్పధాన్ని అవి ఎలా నిర్దేశిస్తాయి అన్న అంశాలపై రచయిత పరిశోధించారు.గత 200 సంవత్సరాలలో వచ్చిన వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని చదివిన రచయిత మొదటి 150 సంవత్సరాలలో వచ్చిన సాహిత్యం నైతికత,నిజాయితీ పునాదిగా వస్తే తరువాతి 50 సంవత్సరాల లో వచ్చింది మన ప్రవర్తన,వైఖరులు,నైపుణ్యాల గురించి చెబుతుంది.                 మన ప్రవర్తన మన స్వభావం దేనినుంచి పుట్టుకొచ్చిందో ఆ మూల దృక్పధాన్ని సరిచేసుకోనంతవరకు మనకు నిజమైన ఫలితాలు దక్కవు అంటాడు రచయిత.దృక్పధాలు సిద్ధాంత కేంద్రకంగా ఉండాలంటారు. ఇందులో చెప్పబడిన 7 అలవాట్లు మన ఇంగితజ్ఞానం లో ,మన అంతరాత్మ లో నిక్షిప్తమై ఉన్నాయని వీటిని గుర్తించి వెలికి తీయడం మన కర్తవ్య మంటారు.                                                                     రెండవభాగం:వ్యక్తిగత విజయం.                                                 మొదటి అలవాటు:క్రియా సంసిద్ధత(Be proactive) ఈ అలవాటును దార్శనికతా సూత్రాల క్రింద మనకు వివరిస్తారు.విక్టర్ ఫ్రాంకెల్ చెప్పిన మానవ స్వభావపు మౌలిక సూత్రం " ప్రేరణకి,స్పందనకీ మధ్య మానవులకు స్పందనను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది" నుండి రచయిత బాగా ప్రభావితమయ్యారు.మనం మార్చగలిగే అంశాల పట్ల దృష్టిపెట్టమని,మార్చలేని వాటిని గురించి పట్టించుకోవడం మానమని చెబుతారు.మన ప్రభావ వృత్తాన్ని పెంచుకోమంటారు.మనకి మనం చేసుకునే వాగ్దానాలకు ఇతరులకు చేసే వాటికి నిబద్ధులై ఉండడమే మన క్రియా సంసిద్ధతకి రుజువు అంటారు.వాగ్దానాలు చేసి నిలుపుకోవడం మనలో నిజాయితీని పెంచుతుంది.                    రెండవ అలవాటు:అంతం ధ్యాసతో ఆరంభం(Begin with the  end in mind)   ఈ అలవాటును వ్యక్తిగత నాయకత్వ సిద్ధాంతాల ఆధారంగా వివరించారు."మీ జీవితాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవన గమనాన్ని ప్రారంభించడం మీలో ఎంతో మార్పు తెస్తుంది".గమ్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహనతో గమనాన్ని ప్రారంభించడం,మనలో గొప్ప మార్పు తెస్తుందంటారు.ఎవరికి వారు వారి జీవిత లక్ష్య ప్రకటనను తయారు చేసుకోమంటారు.                            మూడవ అలవాటు:ముందు విషయాలు ముందు(Put first things first) ఈ అలవాటును వ్యక్తిగత నిర్వహణా సిద్ధాంతాల ఆధారంగా వివరించారు. మనుషులు చేసే పనులు 4 విభాగాలుగా ఉంటాయంటారు.మన ప్రాథమ్యాలను చక్కగా plan చేసుకుని అవి urgent గా మారకుండా ముందుగానే పూర్తి చేయమంటారు.                       3 వ భాగం:సామాజిక విజయం,పరస్పరాధార దృక్పధాలు.            మనపై మనం విజయం సాధించుకోలేకపోతే,ఇతరులపై విజయం సాధించలేము.ఇందులో వ్యక్తులతో మంచి అనుబంధాలను కలిగి ఉండాలంటారు.ఇందుకు ఇతరులను అర్ధం చేసుకోవడం,నిబద్దత,నిజాయితీ కలిగి ఉండడం ముఖ్యం అంటారు.                                                                  నాలుగవ అలవాటు:గెలుపు/గెలుపు ఆలోచన(Think win/win) ఈ అలవాటును పరస్పర నాయకత్వ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఈ దృక్పధానికి 1)నిజాయితీ(integrity)2)పరిణతి (Maturity) 3) పుష్కల మనస్తత్వం (abundance mentality) ఈ 3 లక్షణాలున్నవారు ఎటువంటి నైపుణ్యాలతో పనిలేకుండానే సామజిక విజయం సాధిస్తారు.గెలుపు/గెలుపు ఒప్పందం అనేది ఒక దృక్పధం,సత్యశీలం.సత్సంబంధాల ఫలితం.            అయిదవ అలవాటు:ముందు అర్ధం చేసుకోండి,తరువాత అర్ధం అవండి.                                                                    ఈ అలవాటును సహానుభూతి భావ ప్రసార సిద్ధాంతాల ఆధారంగా వివరించారు.సహానుభూతితో వినడం నేర్చుకోవాలంటారు.అనగా అర్ధం చేసుకునే ఉద్దేశం తో వినడం.చెప్పే వారిని లోతుగా,సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం.తరువాత మీరు వారికి అర్ధం అవుతారు.మన ఆలోచనల్ని స్పష్టంగా,నిర్దిష్టంగా,దార్శనికంగా, సందర్భానుసారంగా చెబితే మనపట్ల విశ్వసనీయత పెరుగుతుంది అంటారు.దాపరికం లేని సంభాషణ వలన సమస్యల్ని మొగ్గలోనే తుంచవచ్చు అంటారు.                          ఆరవ అలవాటు:సమ్మిళిత శక్తి (synergy).                                ఈ అలవాటును సృజనాత్మక సహకార సిద్ధాంతాలు ఆధారంగా వివరిస్తారు.సిద్ధాంత కేంద్రక నాయకత్వం యొక్క సారాంశమే సమ్మిళిత శక్తి అంటారు.ఒక బృందం అంతా కలిసి పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త వాటిని స్వాగతించడమే సమ్మిళిత శక్తి.జీవితం ఎప్పుడూ ద్వందాల నడుమే ఉండదని,మూడవ ప్రత్యామ్నాయం ఉంటుందని తెలుసుకోవాలంటారు.ప్రకృతి అంతా సమ్మిళితమే.                   నాలుగవ భాగం:పునరుద్ధరణ.                                                    ఏడవ అలవాటు:కత్తికి పదును(Sharpen the saw).             ఈ అలవాటును పునరుద్దరణ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఇందులో మన స్వభావం లోని భౌతిక,ఆధ్యాత్మిక,బౌద్ధిక,మానసిక/సామాజిక దిశలను పునరుద్ధరించుకోవాలి.ఈ 4 దశల్లో 6 అలవాట్లను పునరుద్ధరించు కోవచ్చు.రోజూ పై 4 దిశల్లో పునరుద్ధరణకు కృషి చేస్తుంటే 6 అలవాట్లు శక్తివంతం అవుతాయి.ఇదే కత్తికి పదును అనే 7 వ అలవాటు.                                                    మనతో మనం ఏకత్వం సాధించడం,మనకు ప్రేమాస్పదులైన వారితో ఏకత్వం సాధించడం అనేదే అత్యంత ప్రభావ శీ లుర 7 అలవాట్లు ఇచ్చే మధురఫలం అంటారు.                         సత్య సిద్ధాంతాలనేవి ప్రకృతి ధర్మాలు.వీటికి అనుగుణంగా నడిస్తే మన స్వభావం లో దివ్య లక్షణాలు వచ్చి చేరతాయి.మన జన్మ సార్ధకమవుతుందంటారు.                    మనని ఒకరు ఇష్టపడడం కన్నా నమ్మడం మేలు.నమ్మకం,గౌరవం ఉన్నప్పుడు ప్రేమ సహజంగా ఉబికి వస్తుంది.                                                                                   మనం ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల గురించి విని ఉంటాము,చదివి ఉంటాము.కానీ జీవితం లో విజయం సాధించడానికి వేగవంతమైన పరిష్కారాలు లేవని సిద్ధాంతాల ఆధారంగా ఈ 7 అలవాట్లు కలిగి ఉంటే అదే పరిపూర్ణమైన జీవితం అంటారు.ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి 50 లక్షల ప్రతులు అమ్ముడు పోయిన పుస్తకం ఇది.   అందరూ తప్పక చదవండి.





Wednesday, 1 January 2020

కాలచక్రం 2020

కాల చక్రం తిరుగుతూ ఉంది.మన భూమి 454 కోట్ల సంవత్సరాలనుండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.ఒక్కో పరిభ్రమణాన్ని ఒక్కో సంవత్సరంగా మనం పరిగణిస్తుంటాం.అంటే ప్రస్తుతం క్రీస్తు జననం తర్వాత 2019 పరిభ్రమణాలు పూర్తి చేసి 2020 వ పరిభ్రమణం మొదలెట్టింది మన భూమి.గణాల్ని,తెగల్ని,సమూహాలను,రాజ్యాల్ని దాటుకుంటు ప్రస్తుతం దేశాల్ని చూస్తుంది.ఒక్కటిగానున్న తనను గీతలు గీసి ముక్కలు చేసుకున్న కాలాన్ని చూస్తుంది.దేశాల పరంగా, మతాల పరంగా,జాతుల పరంగా విడిపోయిన తనని తాను చూసుకుంటుంది భూమి.                                     జీవరాశి నివసించటానికి అనుగుణంగా సిద్ధమయిన భూమి అదే జీవరాశి లో అత్యున్నతమైన దశకు చేరుకున్న మానవుని దెబ్బకు విలవిలలాడుతుంది.struggle for existence, survival of the fittest సూత్రాలతో జీవపరిణామ  ముందుకు సాగుతోంది.అత్యంత నాణ్యమయిన జీవితం గడపటానికి ,సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనిషి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు.                                                                 పారిశ్రామిక యుగానికంటే ముందు స్వచ్ఛమైన గాలి,నీరు,పచ్చని అడవులతో కాలుష్యరహితంగా ఉన్న ఈ భూమి అత్యున్నత సాంకేతిక యుగం లో కాలుష్యభరితమై,జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ,భూతాపం ఎక్కువయ్యి కొట్టుమిట్టాడుతోంది.2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీ లు పెరిగి జీవికి నివాసయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.                                            మరో ప్రక్క ఇవేవీ పట్టని దేశాలు,ఒకదానిపై మరొకటి పోటీతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో, వాణిజ్యయుద్దాలతో సంపద సృష్టితో,అభివృద్ధి పేరుతో తీవ్రంగా పోటీ పడుతూ ప్రస్తుత తరం భవిష్యత్తును ఫణంగా పెడుతూ దూసుకెడుతున్నాయి.                                             నాణ్యమైన, ఆరోగ్యకరమైన,ఆనందకరమైన ,సమతుల జీవనం ఎలా ఉండాలో భూటాన్ లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవచ్చు.                                                               భూమి ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన అభివృద్ధి,మన సంపద,జీవజాతుల మనుగడ.ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు సమావేశమై తక్షణం భూవిధ్వంసానికి కారణమయ్యే ప్రతిఅంశాన్ని లోతుగా చర్చించి అమలుపరిచే కార్యాచరణ సిద్ధం చేయాలి.ప్రతి ఒక్కరు,ఏ పనిచేస్తున్నా పర్యావరణానికి,ప్రకృతికి ఏమయినా కీడు చేస్తున్నామా అని ఆలోచించాలి.ఎవరివంతు ప్రయత్నం వారు చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని బహుమతిగా ఇవ్వవచ్చు.లేదంటే భావితరాలు మనల్ని క్షమించవు.                                                                        క్రీ.శ 2020 వ భూ పరిభ్రమణ శుభాకాంక్షలు.                     ఒద్దుల రవిశేఖర్.

Monday, 10 September 2018

అనంతపురం యాత్ర.

                 ఫిజిక్స్ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సమావేశం అనంతపురంలో 9/9/18 న ఉండటం తో చుట్టుపక్కల ప్రదేశాలు శనివారం చూద్దామని నాగ మూర్తి ప్రతిపాదించడంతో ఏడో తారీఖు సాయంత్రం అనంతపురం బయలుదేరాము. ఉదయాన్నే ఆనంద భాస్కర్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్లు
హోటల్ కు వచ్చి పలకరించారు. టిఫిన్ గా ఆప్రాంత ప్రత్యేక వంటకమైన  ఓలిగలు పెట్టించారు. పక్
భక్ష్యం కంటే పలుచగా చాలా బాగున్నాయి.                                               8:30 కి కార్ లో బయలుదేరాము, మొదట పెనుగొండ కోట కు  బయలుదేరాం. మార్గమధ్యంలో  కియా మోటార్స్ మీదుగా వెళ్ళాము, వందల ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి కొరియా భాషలో దారి పక్కన బోర్డులు దర్శనమిస్తున్నాయి, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు పోషించిన సాళ్వనరసింహరాయలు స్థాపించిన కోట ఈ పెనుగొండ కోట, చుట్టూ కోటగోడ తప్ప ఏమీ మిగల్లేదు అక్కడే కాళేశ్వర్ ఆశ్రమం, జైన దేవాలయం చూసి కృష్ణదేవరాయలు అద్భుతమైన విగ్రహాన్ని చూసాము.
                అక్కడ నుండి లేపాక్షి వెళ్ళాము మేము వస్తున్నామని ఆనంద్ భాస్కర్ చెప్పడంతో కేశవరెడ్డి మమ్మల్ని స్వాగతిస్తూ ఆలయంలోని శిల్పాల ప్రాధాన్యతను తెలియచేస్తూ 2 గంటలపాటు వివరించారు, మరియు ప్రత్యేక దర్శనం చేయించి వారు చేసిన అతిధి మర్యాద మరువలేనిది, వారు లేకపోతే ఒక అర్ధగంటలో బయటికి వచ్చే వారం అక్కడ మాకు పశ్చిమగోదావరి మిత్రుడు శేషేంద్ర గారు కలిశారు అందరిని మరలా కేశవరెడ్డి వారి ఇంటికి తీసుకెళ్లి
ఆదరించారు, తరువాత ప్రసిద్ధి చెందిన నంది విగ్రహాన్ని
దర్శించాము. గండభేరుండ పక్షి ని ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించారట, లేపాక్షి ఆలయానికి సరియైన ప్రచారం లేదనిపిస్తుంది తమిళనాడు ఆలయాల తరహాలో శిల్పకళ ఉట్టిపడు తుంది.పర్యాటకులు విస్తారంగా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
                 కదిరి దగ్గర ఉండే తిమ్మమ్మ మర్రిమాను దగ్గరికి వెళ్లాం.దాదాపు 600 సంవత్సరాల క్రితం తిమ్మమ్మ నాటిన ఈ మొక్క 8 ఎకరాల్లో విస్తరించి అద్భుతంగా కనిపిస్తుంది.
పచ్చగా కళకళలాడుతూ ఉన్న మర్రిచెట్టును తనివితీరా చూసాం.చెట్టు మొదలు శిథిల
మవటంతో అక్కడ చిన్నగుడి కట్టారు.అటవీ శాఖ దీనిని చాలా చక్కగా పరిరక్షిస్తుంది.ప్రతి సంవత్సరం ఈ చెట్టు  విస్తరిస్తోంది.
ఈ వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయింది.
 తరువాత కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యాము..

Tuesday, 28 August 2018

మహాబలిపురం(తమిళనాడు) యాత్ర.

                   చెన్నైలోని చూడదగ్గ ప్రదేశాలలో మైలాపూర్లోని కపాలీశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడుతుంది. ముందున్న అతి విశాలమైన కోనేరు చూపులు పక్కకు తిప్పనివ్వదు. దీనికి దగ్గరలో రామకృష్ణ మిషన్ ఆశ్రం ఉంది ఇది 1905 లోనే ప్రారంభించబడింది శారదామాత వివేకానంద ఇక్కడికి వచ్చారు.                                                              అలాగే మెరీనా బీచ్ ఉదయాన్నేచూస్తే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే శుభ్రత బాగా తక్కువ.అన్నాదురై,MGR ,జయలలిత,కరుణానిధి సమాధులు ఇక్కడ ఉండటంతో యాత్రా స్థలంగా మారింది.                                            ఇక ప్రత్యేకంగా చూడాలనుకుని ప్లాన్ చేసుకొని మహాబలిపురం వెళ్ళాం ప్రభుత్వ బస్సులు ఉన్నా ఎక్కువ ప్రాంతాలు చూడలేమని కారు తీసుకుని ఏడు గంటలకు బయలుదేరి 8:30 కల్లా  మహాబలిపురం చేరాము. అడయార్ ఆనంద భవన్ లో టిఫిన్ చేశాం ఊరిబయట విశాలమైన స్థలంలో రిసార్ట్ లాగా ఉంది రుచి బాగా ఉన్నా, విపరీతమైన ధరలు ఉన్నాయి. మొదట షోర్ టెంపుల్ చూసి పాండవ రధాల దగ్గరికి వెళ్లాము. రాయిని చెక్కి గుడిని శిల్పాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
                   ఇసుకలో పూడిపోతే వెలికితీసినట్లు గా ఉంది సహజత్వం ఉట్టిపడేలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది సముద్రపు ఒడ్డున ఉంది తర్వాత లైట్ హౌస్ దగ్గర కొండపైన గుడి చూసాము. అక్కడనుండి నది సముద్రంలో కలిసే చోటుకనిపిస్తుంది .మొదట ఈ కొండపైన గుడిపై old light house ఉండేది.1900 లో బ్రిటిష్ వారు కొత్తగా కట్టారు.దీనిపై నుండి సముద్రాన్ని చూడటం గొప్ప అనుభూతి.తరువాత మ్యూజియం చూసాము.ఓడల విడిభాగాలు,ఆ ప్రాంతం లో దొరికిన విభిన్నమైన వస్తువులు ఇక్కడ ఉంచారు.ఓడ పై భాగంలో గల గద ఆకారంలో ఉన్న వస్తువు చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక మహాబలిపురానికి ప్రత్యేకమైనటువంటి రాళ్ళపై శిల్పాలు గుడులు చూసాము.చివరలో సీషోర్ టెంపుల్ చూసాం ఇదికూడా పల్లవులు చోళులు హయాంలో నిర్మించిందే ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది ప్రక్కనే బీచ్ చూసుకొని తిరుగు ప్రయాణమయ్యాం.                                                                                        మార్గమధ్యంలో దక్షిణ చిత్ర , జైన దేవాలయం చూశాం. దక్షిణ చితలో దక్షిణ భారతదేశం లోని పాతకాలపు ఇండ్లను తిరిగి కడుతున్నారు.  ఇక్కడ దక్షిణ భారత కళలు పరిరక్షించ బడుతున్నాయి ఈ ఆలోచన ఒక విదేశీయురాలుకు వచ్చింది ఆమె ఈ ప్రాంతానికి వచ్చి 13 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించింది ఇది గొప్ప ఆలోచన.  జైన దేవాలయం అత్యద్భుత నిర్మాణశైలితో రాజస్థాన్ వారు నిర్మించారు. జైన మతానికి చెందినటువంటి తీర్థంకరుల యొక్క విగ్రహాలు ఇందులో ప్రత్యేకత. నిర్మాణం పై భాగమంతా అర్థ చంద్రాకారంగా ఉంటుంది. మీరు ఒకసారి మహాబలిపురం చూసి  వస్తారు కదూ!

Thursday, 19 October 2017

శ్రీశైలం ఆనకట్ట సందర్శన

కృష్ణా నది ఉరవళ్లతో డాం నిండి గేట్లు ఎత్తివేశారని తెలిసి శ్రీశైలం వెళ్ళాము.దారంట నల్లమల అడవి వర్షాలకు మనోహరంగా కనిపిస్తుంటే చూస్తూ వెళ్ళాము.పోగానే పర్యాటక సందర్శన బస్ ఎక్కి బయలుదేరాము.పాలధార పంచదార దగ్గర శంకరాచార్యుడు తపస్సు చేసాడంటారు.అక్కడ జలధార ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియదు.తరువాత శిఖరం చూసుకుని ఆనకట్ట దగ్గరికి వెళ్ళాము,రెండు కళ్ళు  చాలలేదు ఆ ప్రవాహాన్ని చూడటానికి.6 గేట్లు ఎత్తారు.డాం ఉపరితలం లో గుఱ్ఱపుడెక్క నిండి ఉంది.ప్రవాహం అంతెత్తునుండి పడి పాము పడగ విప్పి పైకి లేచినట్లు లేచి మరల పడుతూ వెండి మబ్బుల్లా తెల్లని నురగను వ్యాపింప చేస్తుంటే మనసు ఆనందం తో పరవశించింది. అక్కడ ప్రవాహాన్ని చూడటానికి ఒక భద్రమైన ఏర్పాటు చేసి ఉంటే బాగుండు. కెమెరా నిండా ఆ దృశ్యాలను బంధించి మళ్లీ శ్రీశైలం చేరుకుని గుడి సందర్శనకు వెళ్ళాము,జనం లేకపోవటం తో త్వరగా దర్శనం పూర్తయింది.గుడికి దక్షిణం వైపు అందమైన రంగులతో రంగవల్లిక లద్దారు. తరువాత పాతాలగంగ చూడటానికి మెట్లు దిగుతూ వెళ్ళాము.ఆనకట్ట వెనుకగా చూస్తే నిండుకుండలా ప్రశాంతంగా ఉంది.అక్కడ కొండలపై కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి.కెమెరాతో వాటిని బంధించి రోప్ వే  ద్వారా తిరుగు ప్రయాణం అయ్యాము.తప్పకుండా రోప్ వే ఎక్కండి, మంచి అనుభూతి ,అక్కడనుండి మరిన్ని ఫొటోస్ తీసాము.బస్ ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాయి.express bus tickets పల్లెవెలుగు కన్నా రెట్టింపు కన్నా ఎక్కువున్నాయి.ఏదేమైనా ఒక్కరోజు ప్రయాణం లో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకొని వచ్చాము.ఈ క్రింది చిత్రాలన్నీ అక్కడివే.






Monday, 26 June 2017

కృష్ణమూర్తి ఫౌండేషన్,చెన్నై సందర్శన

             








ఎప్పటినుండో అనుకుంటున్న కోరిక తీరింది.నిన్న ఆదివారం 25/6/17 న చెన్నై egmore నుండి అడయార్ లోని జిడ్డు కృష్ణమూర్తి నివసించిన వసంత విహార్ ను చూడటానికి వెళ్ళాను.అడయార్ లోని ఆంధ్ర మహిళసభ నుండి Greenways road లో కొద్దిగా ముందుకు వెడితే వస్తుంది.అమెరికా నుండి ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక నెలపాటు ఉపన్యాసాలు ,చర్చలు చేస్తుంటారు.                  6 ఎకరాల సువిశాల స్థలం లో పాతకాలపు రెండస్తుల భవనం ఉంటుంది.పైన కృష్ణమూర్తి పుస్తకాలతో కూడిన గ్రంధాలయం,క్రింద సమావేశ మందిరం ఉన్నాయి.చుట్టూ విభిన్న రకాల వృక్షాలతో కూడిన తోట ఉంది.వెదురు,మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి.ఆయన మరణించిన తరువాత ఆయన కోరిక మేరకు అధ్యయన కేంద్రంగా మార్చారు.ప్రతి నెల 3 రోజుల ఉండేలాగా అక్కడకు వెళ్ళాలి.ఆ 3 రోజుల్లో చర్చలు,వీడియో పాఠాలు,పుస్తక పఠనం లో నిమగ్నమయి మన జీవితాలలో జరిగే అనేక విషయాలపై లోతయిన అవగాహన కలిగించుకోవచ్చు అని చెప్పారు.ఉండటానికి వసతి ఉంది.అఖిలేష్ అని అక్కడే ఉండే నిర్వాహకుడు ఈ విషయాలు చెప్పారు.కృష్ణమూర్తి స్కూల్ నిర్వాహక లైన భరత్ గారు పరిచయమయ్యారు.నేను టీచర్ అని చెప్పగానే స్కూల్ లో పనిచేయండి అని ఆహ్వానించారు.ఈ క్రింది చిత్రాలు చూస్తే మీరు తప్పక వెడతారు.అడ్రస్ THE STUDY ,KRISHNAMURTI FOUNDATION INDIA,Vasantha vihar,124 Greenways Road,R.A.Puram,Chennai 600028 Landmark- between Andhra Mahila sabha hospital and Greenways Road Railway station) Tel:044-24937803/596,Email:vvstudy@kfionline.org,website:www.kfionline.org,Facebook:kfivasantaviharchennai

Monday, 5 June 2017

Finland లో విద్యావిధానం

*ఫిన్లాండ్‌ 100/100*

అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం ఫిన్లాండ్‌. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్‌ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.

పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్‌ నెలల్లో ఏ టీవీ ఛానల్‌ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్‌ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్‌ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్‌ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.

సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్‌, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్‌’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్‌ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ఎసెస్‌మెంట్‌’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్‌, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్‌ సొంతం.

*ఏడేళ్లకు స్కూలు... *

మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్‌ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్‌ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్‌ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలేద’ంటారు అక్కడి ఉపాధ్యాయులు

*చదువంతా ఉచితం*
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్‌ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్‌ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.

*ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...*
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్‌ ఎలొవెన్స్‌’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్‌’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్‌, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!

*రోజూ ఒంటిపూట* బడులే...
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్‌ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్‌’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్‌ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్‌ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.

*ర్యాంకులకు చెల్లు!*
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్‌ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్‌ విద్యా విధానం సాగుతుంది.

*ఒకే ఒక్క పరీక్ష!*
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్‌ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్‌ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.

*టీచరే సూపర్‌స్టార్‌!*
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్‌ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్‌ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్‌ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్‌ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్‌ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్‌-టీచర్‌’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్‌ ఈజ్‌ మోర్‌’ అన్నది ఫిన్లాండ్‌ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.
మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్‌ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్‌ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!

మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్‌ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్‌ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!

*అక్షరాస్యతలో నంబర్‌ 1*

గతేడాది కనెక్టికట్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.
 
* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్‌ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.

* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్‌ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్‌ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.

ఫిన్లాండ్‌లో స్కూల్‌ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్‌ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి.
* పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్‌ పిల్లలకు ఇంగ్లిష్‌ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్‌, స్వీడిష్‌ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
* పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్‌. హైస్కూల్‌ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

*అదే తేడా!*

‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌ డెవలప్‌మెంట్‌’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్‌ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్‌ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్‌ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.

*నలభై ఐదేళ్ల క్రితం...*

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్‌ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయమిది.(ఈనాడు పత్రిక నుండి సేకరణ,వారికి ధన్యవాదాలు)

Monday, 27 February 2017

                                                             తమిళనాడు యాత్ర (3)
                         ఇక అక్కడనుండి మధ్యాహ్నానికి తంజావూరు బృహదీశ్వరాలయానికి చేరుకున్నాము.త్రిచి నుండి 52 కి.మీ ఉంది .చోళుల అసమాన శిల్ప కళా నైపుణ్యంతో కట్టిన గుడి.దీనిని Big  temple గా స్థానికంగా పిలుస్తారు.ఆస్ట్రేలియానుండి ఒక బృందం ఒక చోట కూర్చొని విశ్రా0తి తీసుకుంటుంటే సెల్ఫీ తీశాను .వారు చిరునవ్వుతో అంగీకరించారు.వారి సెల్ తో నన్ను ఒక ఫోటో తీయమంటే తీశాను.వారు గైడ్ తో చెప్పించు కుంటున్నారు.ఆధ్యాత్మిక,భక్తి పరంగా తక్కువ ప్రాధాన్య మున్నా ఆ గుడి సౌందర్యాన్ని,విశాల ప్రాంగణాన్ని చూసి త రించాల్సిందే.ఎన్ని సార్లయినా అక్కడకు వెళ్లి చూసి రావచ్చు . గుడికి ఎదురుగా అతి పెద్ద నంది అచ్చెరువు గొలుపుతుంది .
               తరువాత రాజభవనం చూసాము.బ్రిటిష్ వారి కంటే ముందు ఉన్న రాజా సంస్థానం వారి కోట అది . ఆ కాలం నాటి సామాగ్రి తో కూడిన మ్యూజియం,దర్బార్ హాల్ ఆశ్చర్యాన్ని కలిగించాయి . 25 నిముషాల documentory చూపించారు. చాలా అద్భుతం గా తీశారు .ఆ ప్రాంత మంతా చూ సి న భావన కలిగింది.దగ్గరలో రాజులు కట్టించిన రిజర్వాయర్ ఉందని అందులో చూపారు.అక్కడకు వెళ్ళటం కుదర్లేదు ..  
          మరుసటి రోజు కుంభకోణం వెళ్ళాము దానికి temple సిటీ అని పేరు.నిజంగా పదుల కొలది ఆలయాలు  ఉన్నాయి ముఖ్య మైనవి కుంభేశ్వర,సారంగపాణి,చక్రపాణి చూసాము . 12 ఏళ్లకోసారి కుంభమేళా జరిగే కోనేరు చూసాము.ఏ గుడిలో 10 మంది కంటే ఎక్కువ మంది లేరు.అన్నీ ఒక గంటలో పూరి చేసుకున్నాము .కుంభేశ్వర ఆలయం లో ఓ ఏనుగు చిన్నగా నాట్యం చేస్తూ మనమి ఛ్చిన  10 రూపాయలు తీసుకుని మనల్ని ఆశీర్వదించే దృశ్యం చాలా నచ్చింది .వ రి, చెరకు ఆప్రాంతం లో బో ర్ల క్రిందనే ఎక్కువగా పండిస్తున్నారు.  మొదటి పంటకు కావేరి నీరు వచ్చాయేమో !మన లాగా పట్టణాల  ప్రక్కన plots వేసి వదిలేసిన దాఖలాలు లేవు .మన లాగా స్థిరాస్తి రంగ పిచ్చిలేదు .
            ఇక కాఫీ 10 రూపాయలకు చిక్కటి పాలతో మంచి రుచిగా ఇస్తారు. పాలు 10 రూపాయలే  ఒక గ్లాసును కాస్త ఎక్కువగా ఇస్తారు తమిళనాడు వారు కాఫీ ప్రియులు మరియు టిఫిన్స్ కూడా బాగా తింటారు.రాత్రిపూట అందరు టిఫిన్స్ తింటారు.రాత్రి పూట  హోటల్స్ లో  భోజనం దొరకదు .అన్ని టిఫిన్స్ రేట్లు బాగా ఎక్కువ దోశలు 40 రూపాయలు పై నే ఉంటాయి .ఇక అన్నింట్లో సాంబారే ,కానీ సాంబారు బాగుంటాయి. భోజనం  70 రూపాయలు ,పెరుగు extra రేట్, కారం,ఉప్పు కూరల్లో బాగా తక్కువ.  వాళ్ళు సాంబారు  పోసుకొని అందులో కూరలు నంజుకుంటారు . 90 రూపాయలకి



fullmeals  ఎగ్మోర్  ఎదురుగ వసంత భవన్ లో బాగుంది. చెన్నయ్ లో తెలుగు పేపర్లు   దొరుకుతాయి  కానీ తంజావూరు,త్రిచి లో దొరకవు.జామకాయలు లావుగా మంచి రుచిగా ఉన్నాయి .కేజీ 80 అమ్ముతున్నారు .కొంత మంది 60 కి ఇచ్చారు  .
               అన్ని హోటల్స్ లో పళ్లరసాల స్టాల్స్ ఉన్నాయి. త్రిచి ,తంజావూరు రెండు జిల్లా కేంద్రాలు వాటి మధ్య దూరం 50 కిమీ .తమిళనాడు లో 38 జిల్లాలు ఉన్నాయి . త్రిచి కాస్త పెద్దదే,తంజావూరు సాంస్కృతికంగా,చారిత్రకం గా బాగా ప్రసిద్ధి.తమిళులు వాళ్ళ సంస్కృతిని బాగా ఇష్ట పడతారు. చెన్నై ఎగ్మోర్ నుండి త్రిచికి superfast trains  350 కిమీ దూరం  5 1/2 గంటలలో వెడతాయి.మధ్యలో తాంబరం ,విల్లుపురం లాంటి పెద్ద junctions ఉన్నాయి.విల్లుపురం నుండి గంటన్నర ప్రయాణం లో పుదుచ్చేరి ఉందట.ఈ మార్గం లో చెన్నై airport  చాలా గొప్పగా కనిపిస్తుంది.త్రిచి నుండి తంజావూరు వెళ్లే మార్గం లో NIT,SASTRA  universities ఉన్నాయి.త్రిచి లో airport ఉంది .ఇక్కడ బస్సులు , ట్రైన్స్ బాగా ఉన్నాయి .వేగంగా వెడతాయి .బస్సు టికెట్స్ కూడా తక్కువ .వాజపేయి UPA  హయాం లోనే రోడ్లు బాగా వేశారు.కుంభకోణం లో అక్కడక్కడా a/c busstop లు కనబడ్డాయి చిన్న రూమ్ లో 10 కుర్చీలు వేసి ఉంటాయి .తిరుగు ప్రయాణం లో ఓ మ్యూజిక్ టీచర్ చెప్పిన దాని ప్రకారం తమిళనాడు అంతా పిల్లలు సాయంత్రం పూట  సంగీతం, నాట్యం నేర్చుకుంటూ ఉంటారట .శిక్షణ సంస్థలు చాలా ఉంటాయట.
     ఏదిఏమయినా భారత దేశాన్ని పుస్తకాల్లో చదివే కంటే యాత్రల ద్వారా మరింతగా తెలుసుకోవ చ్చని అర్థ మయింది.కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఒక కార్యక్రమం ప్రకటించింది .ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రాన్ని ఎన్నుకొని సాంస్కృతిక సంబంధాలను, సందర్శించటం ద్వారా అభివృద్ధి చేసుకోవాలట. బ్లాగు మిత్రులారా మీరు చూసిన ప్రాంతాలపై ఇలాగే వ్యాసాలూ రాయండి 

Saturday, 18 February 2017

                                                    తమిళనాడు యాత్ర నా అనుభవాలు
                  ముందే ప్రయాణ టికెట్స్ బుక్ చేసుకున్నందున స్థిమితంగా ఉన్నాము. కానీ అక్కడ రాజకీయ పోరాటం మొదల య్యింది .ఎక్కడ గందరగోళం జరుగుతుందోనని ఆందోళన పడ్డా గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవటంతో మేము యాత్ర ముగించుకుని రాగలిగాము .
           ఒంగోలులో అర్థ రాత్రి హైదరాబాద్ చెన్నై superfast express లో బయలుదేరాము .చెన్నైకి ఉదయం 6 గంటలకి చేరాలి .కానీ ఊరిబయట ముప్పావుగంట ఆపేసాడు.తరువాత కదిలినా చిన్నగా 7;50 కి చెన్నై సెంట్రల్ చేరుకున్నాము.8;15 కు ఎగ్మోర్ లో గురువాయూర్ express లో త్రిచికి వెళ్ళాలి. ఆటోలో ఎగ్మోర్ చేరుకొని పరుగెత్తి ఎక్కినా 2 నిముషాల కే  కదిలింది.ఈ అసౌకర్యానికి బి.పి పేషంట్స్ అయితే ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళు .
            చెన్నై సెంట్రల్ బయట ఆటో లు ఎక్కువ రేట్ అడుగుతారు.కొద్దిగా బయటకు వెళ్లి ఎక్కితే మంచిది. సమయం ఉంటె చక్కగా బస్సులు  ఉన్నాయి .కాస్త అడిగి ఎక్కాలి.బస్సులపై వివరాలు తమిళంలో ఉంటాయి.  బస్సు సంఖ్యల ఆధారం గా ఎక్కాలి.ఇంగ్లీష్ లో పేర్లు ఉంటె బాగుండు .సెంట్రల్ నుండి ఎగ్మోర్ కు  40 రూపాయ లు తీసుకుంటారు.కానీ కొంత మంది rs100 అడుగుతారు.బస్సు కు అయితే కేవలం 4 రూపాయలు మాత్రమే.కొద్దీ దూరం ముందు కెడితే ఓ ఫ్లైఓవర్ వస్తుంది.అక్కడకు బస్ లు వస్తాయి.అక్కడనుండి ఎగ్మోర్కు కేవలం 5 నిముషాల ప్రయాణం .
        త్రిచి (తిరుచిరాపల్లి )లో ఆ రూమ్ తీసుకున్నాము . ASHBAY HOTEL  మన సినిమా లో ఉండే మండువా ఇల్లు లాగా ఉంటుంది .అద్దె  ఇద్దరికి RS 950 ,అదనం గా ఒకరికి 250 ఉంటుంది .1956 నుండి నడుస్తున్నది . చక్కటి ఇంటి వాతావరణం 1. 5 ఎకరా విస్తీర్ణం,మొక్కలు చెట్లు ఉంటాయి.రైల్వే స్టేషన్ కి బస్సు స్టాండ్ కి మధ్య లో ఉంటుంది .టిఫిన్స్ త్రిచి  రైల్వే స్టేషన్లో బాగుంటాయి .కొద్దిగా రేట్ కూడా తక్కువే కాఫీ 10 రూపాయలు .మంచి టేస్ట్ ,మన కంటే పరిమాణం కాస్త ఎక్కువ .దోషాలు పెద్దగా ఉంటాయి .రేటు 40 ఉంటుంది భోజనం దగ్గరలో ఆనంద్ హోటల్ ప్రక్కనే రెస్టారంట్ లో బాగుంటుంది .
     ఇక మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరంగం బయలు దేరాము.7 కి మీ ఉంటుంది . rs 6 చార్జి .చాలా గొప్పగా ఉంది ఆలయం.విశాల మైన ప్రాంగణం.చాలా గుళ్ళు ఉన్నాయి.విష్ణువు కొలువై ఉన్నాడు.గర్భగుడిలో శయనించిన విష్ణువును చూడటం మరవొద్దు.ప్రాంగణమంతా తిరగాలంటే ఒక పూట  పడుతుంది.వేయి కాళ్ళ మంటపం,చుట్టూ ప్రాకారాల్లాంటి గోపురాలు,చూడచక్కని శిల్ప సంపద .ఆ కాలపు రాజుల అభిరుచి చెక్కిన స్తంభాలు ,మంటపాలు ఆలయాలు గోపురాల లో  వ్యక్త మవుతుంది (తరువాయి భాగం మరో పోస్ట్ లో )       

Wednesday, 15 February 2017

తమిళనాడు యాత్ర

తమిళనాడు యాత్ర :.                                                           రెండు రోజులు శ్రీరంగపట్నం,త్రిచి,తంజావూరు,కుంభకోణం యాత్ర గురించి మీతో పంచుకోవాలని పించింది.తిరుచురాపల్లి నే త్రిచి అంటారు.ఇది జిల్లా కేంద్రం,ఇక్కడ airport కూడా ఉంది.దీనికి దగ్గర లోనే శ్రీరంగపట్నం లో విష్ణువు కొలువై ఉన్నాడు.ఇక్కడి  గుడి చాలా విశాలంగా ఉంటుంది.శిల్పకళ కు అచ్చెరువొందుతాం.తరువాత తంజావూరు బృహదీశ్వరాలయం చూశాము.దీనిని big temple అంటారు.ఇది ఆసియా లోనే ఒక పెద్ద గుడి అంటారు.కుంభకోణం లోని సారంగపాణి,కుంభేశ్వర ఆలయాలు దర్శించాం.

Thursday, 2 February 2017

బ్లాగులు :ఒక సమీక్ష
                        మన మది లోని భావాలను స్వేచ్చగా వ్యక్తీరించటానికి బ్లాగులు మంచి సాధనంగా ఉపయోగపడేవి . అప్పుడు ఎంతో మంది మిత్రులు పరిచయ మయ్యారు . ఒకరి పోస్టులు మరొకరు చదువుతూ చాలా ప్రొత్సాహక రమైన మాటలతో వ్యాఖ్యలు వ్రాస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్లాగులు ఉండేవి .తరువాత ఫేస్బుక్ బాగా ప్రాచుర్యం పొందిన తరువాత అందరు దానిలో సభ్యులు కావటం తో అక్కడే ఎక్కువగా గడుపుతూ బ్లాగుల్లో వ్రాయటం తగ్గించారు.నేను కూడా అంతే.దీని తరువాత దీనికంటే ప్రభావం కల్గించింది వాట్సాప్.ఇక జనం అంతా వ్యక్తిగతంగా గ్రూపుల్లో ఒకటే ముచ్చట్లు.దీనితో కొంత ఫేస్బుక్ ప్రభావం తగ్గటం తో గమనించిన ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనేసింది.
           ఇక వాట్సాప్ లో గ్రూపుల్లో ఎన్నో సమస్యలు అడ్మిన్ ఒక ఉద్దేశ్యం తో గ్రూపు ప్రారంభిస్తే  పోస్టులు ఎవరి ఇష్టం వఛ్చినట్లు వారు వ్రాయటం చాలా గొడవలు జరగటం చాలా గ్రూపులు మూసివేయటం జరిగాయి .ఫొటోస్ ,వీడియో లు విపరీతం గా షేర్ చేసుకోవటం ఎంతో మందికి చికాకు తెప్పిస్తుంది .అడ్మిన్స్ ఎంత మొత్తు కున్నా వినే వారు లేరు అంతా చదువుకున్న వారే,మరి అర్థం చేసుకోరు ఎందుకో. రిలయన్స్ ఫ్రీ డేటా ఉండటం వ లన  ఇన్ని గ్రూపులు ఉన్నాయి గాని రేపు డబ్బులు వసూలు చేస్తే చూడాలి ఎంత మంది వాట్సాప్ లో ఉంటారో!
         బ్లాగు మిత్రులందరికీ మనవి ,అందరు మరల రండి బ్లాగు వేదికగా మన ఆలోచనలు అభిరుచులు కలబోసుకుందాము.      

Sunday, 1 January 2017

కాలం(Time)
                     భూమి సూర్యుని చుట్టూ మరో  సారి చుట్టి వచ్చింది.అందుకే మన మంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం.కాలాన్ని విభజించుకుని పని చేయటం అలవాటయిపోయింది మరి.కానీ గతం లోని పనులు,భావాలు ,అభిరుచులు, లవాట్లు అభిప్రాయాలు దృక్పధాలు ఇవేమన్నా మారాయా,అలాగే ఉన్నాయా   తరచి చూసు కోవటం లేదెవ్వరు.కాలంతో పాటు ఎన్నో మారుతుంటాయి. ఆ మార్పు మంచి వైపుకైతే ఆహ్వానించవచ్చు.అదే చెడు వైపుకైతే ఆలోచించాల్సిందే .
               కొత్తదనం ప్రతి క్షణానికి సొంతం.దాన్నిమరిచి పోతున్నాం .ప్రతిక్షణం మన మనసు నిత్యనూతనం.ప్రతి క్షణాన్ని ఇలాగే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.జీవితం నిత్య నూతన మై పోదూ !మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉంచుకుంటూ ఉంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది .
            గతాన్ని తవ్వుకుంటూ బాధపడే కన్నా వర్తమానంలో ఉంటూ చేసే పనిలో లీనమైతే ఆనందం మన సొంత మవుతుంది.కాలం మనల్ని తనలోకి లాక్కెళుతూ ఉంటుంది.ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా అనుబంధాలను,స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ నిత్య నూతనంగా అందరూ గడపాలని నా కోరిక .     

Saturday, 17 September 2016

                                             రూపాయికే ఐ.ఐ.టి శిక్షణ (సూపర్ 30)
       పేదరికంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో చదివే అవకాశం కోల్పోయిన బీహార్ కు చెందిన ఆనంద్ కుమార్  ప్రతి సంవత్సరం ప్రతిభావంతు లైన నిరుపేద విద్యార్థులకు ఉచిత వసతి భోజనం కల్పించి  ప్రతిష్టాత్మక ఐ.ఐ.టి లలో సీట్లు సాధిస్తూ సూపర్ 30 గా గుర్తింపు పొందారు.మన దేశంలో గణిత బోధన,చదువులు ఐ.ఐ.టి. ల పై ఆసక్తి,తమ శిక్షణ కేంద్రం విజయ సూత్రాలపై ఆయన మాటల్లోనే
1) నాకు లెక్కలంటే ప్రాణం.డబ్బుల్లేక  కేంబ్రిడ్జిలో చేరే అవకాశం కోల్పోయాను.ఆ దిగులుతో నాన్న చనిపోయారు.  అమ్మ అప్పడాలు చేస్తే నేను వాటిని అమ్మే వాణ్ని.Ramaanujam school of mathematics మొదలెట్టి ట్యూషన్స్ చెప్పా .
2) మన దేశంలో చదువును ఉద్యోగం ఉపాధితో ముడిపెడుతున్నారు.10 తరువాత ఐ.ఐ.టి పై విద్యార్థుల్లో ఉన్న ఆసక్తిని గమనించి 30 మంది పేద పిల్లలను ఎంచుకుని  వారిని మా ఇంట్లోనే  ఉంచుకుని  శిక్షణ ఇస్తున్నా .
3) కేవలం IITians ను తయారు చెయ్యడమే నా లక్ష్యం కాదు.సాధ్య మైనంత మందికి చదువు చెప్పించి వారి ద్వారా సమాజానికి తిరిగి లబ్ది చేకూర్చాలన్నదే నా ఆశయం.ఈ దేశం లో డబ్బుల్లేక ఎవరు చదువు ఆపేయకూడదు. అదే నా జీవిత అంతిమ లక్ష్యం.
4)సూపర్ 30 లో మేము మూస పద్ద్దతి లో భోదించం. పిల్లలు బృందంగా చర్చించి ప్రశ్నలు తయారు చేస్తారు.వాటికి సమాధానాలు అన్వేషిస్తారు.ఆలోచించే,ప్రశ్నించే తత్వం ఆధారంగా భోధన జరుగుతుంది.సంస్కారం నేర్పుతాం.  నా శిష్యుల్లో ఎవరూ రూపాయి కట్నం తీసుకోలేదు. 
5)మారుమూల ఉన్నవారు పట్టణాలకు వఛ్చి శిక్షణ తీసుకోలేరు.అటువంటి వారి కోసం అంతర్జాలం CELLPHONES ను  ఉపయోగించుకుని ఏడాది లోపే ఆన్లైన్ ద్వారా ఐ.ఐ.టి శిక్షణ ఇవ్వబోతున్నాము. ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి నా తరగతులను ఆన్లైన్లో వినవచ్చుఁ. 1 నుండి 12 తరగతి దాకా అన్ని పాఠాలు online లో ఉంచుతా .
6) రామానుజం ఓ విలక్షణ శాస్త్రవేత్త్త. ప్రపంచంలో గణితంలో ఇచ్ఛే అత్యున్నత పురస్కారం పొందిన వాడు మన మంజుల భార్గవ్.కానీ ఇలాంటి వారు మన దేశం లో తయారు కావటం లేదు.మన గణిత బోధనా పద్ధతులు బాగా లేవు. లెక్కల్ని బట్టీ పట్టిస్తున్నాము.ఎలా ఎందుకు అని ప్రశ్నించి,విశ్లేషించే అవకాశం లేకుండా చేస్తున్నాము.
6) మంచి చదువులు మంచి ఉపాధ్యాయులు న్న చోట వస్తాయి.గణిత ఒలింపియాడ్స్ లో  చైనా గత 20 ఇండ్లలో 13 సార్లు ప్రపంచ నెంబర్ 1 గా నిలిచింది.
7) పిల్లల్ని ఆలోచించ నీయకుండా అంతా వారి మెదళ్లలో కుక్కుతుండడంతో వారి ఊహా శక్తి చఛ్చి పోతుంది.
8) ప్రతిభావంతులంతా ఐ.ఐ.టి వైపు పరుగులు తీ స్తుండడంతో  ఉపాధ్యాయ  విద్య వైపు మంచి వారు రావటం లేదు పిల్లల పై చిన్నప్పటి నుండి ఐ.ఐ,.టి  అంటూ ఒత్తిడి తే కండి .వారికి పజిల్స్ ఇస్తూ ఆలోచించే తత్వాన్ని నేర్పండి
9)గణితం లో ఆసక్తికర సమస్యల్ని ఇఛ్చి పరిష్కరించ మనండి.వారి మనసులు  సహజం గా వికసించ నీయండి .
10) వారికి వయసుకు మించిన చదువులు చెబితే పిల్లలు యాంత్రికంగా తయారవుతారు.ఆత్మీయతలు మరిచి పోతారు.  

Friday, 1 January 2016

కాల ప్రవాహం@2016

                       కాలం మన జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది.ఏమిటి ఈ ప్రశ్న అని ఆశ్చర్య పోతున్నారా ?బడికి పోనంతవరకు ఎంత స్వేచ్చని అనుభవించాము.మన కిష్ట మైన పనులు,మనకిష్ట మైన సమయంలో చేస్తూ అమ్మా నాన్నల బంధువుల ప్రేమను పొందుతూ గడిపాము కదా !స్కూల్ లో చేరాము !
          అప్పుడు ప్రవేశించింది కాలం మన జీవితంలోకి !అయినా మనం స్వేచ్చను కోల్పోలేదు.ఉదయం సాయంత్రం తనివి తీరా ఆటలు,బడిలో చదువు అక్కడ కూడా ఆటలు,స్నేహితుల సరదాలు,ఆదివారాలు, సెలవు రోజుల్లో మరింత ఎక్కువగా ఆటలు అలా 9 వ తరగతి వరకు జరిగింది నా విషయం లో,మీరంతా అలానే అనుకుంటాను.10 వ తరగతిలో ఇంటి దగ్గర ఆటలన్నీ బంద్. స్కూల్ లో o.k ఉదయం,సాయంత్రం tutions అలా కాలం తనలోకి తీసుకోవటం మొదలెట్టింది.ఇక ఇంటర్ ,డిగ్రీ ,చదువులు,ఉద్యోగాన్వేషణ వరకు కొంత వరకు అభిరుచులకు సమయం కేటాయిస్తూ కాలాన్ని గురించి జీవన్మరణ సమస్యగా తీసుకోక పోయినా కాలం ఆధీనంలోకి వెడుతున్నట్లనిపించింది.ఉద్యోగము తేలిగ్గానే సాధించటం,వివాహ జీవితం లోకి ప్రవేశించటం,పిల్లలు ,సంపాదన,పిల్లల చదువులు అలా.... .. ,వాళ్ళ చదువులకు కీలక నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది .
              ఎక్కడనుండి ఎక్కడకు వచ్చామా !అని ఆలోచిస్తే కాల ప్రవాహం యొక్క మధ్యలో ఉన్నామని అర్థమయింది .బాల్యంలోని కాలం తెలియని తనంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాము.ఈ ప్రవాహం లో ఎక్కడ తేలుతామో ఆ కాలమే నిర్ణయిస్తుంది .
     అన్నట్టు ఈ కాల ప్రవాహం లోకి మరో సంవత్సరం వచ్చి చేరింది. అందరికి నూతన (2016) సంవత్సర శుభాకాంక్షలు .  

Monday, 11 May 2015

మనలో సమూలమైన మార్పును తీసుకురాగలమా!(నేడు జిడ్డు కృష్ణ మూర్తి జయంతి )



              "మన జీవితాలలో దౌర్జన్యం నిండి ఉన్నది .కనుక ఈ ప్రపంచం లో జరుగుతూ ఉన్న ప్రతి యుద్దానికి మనదే బాధ్యత. మన జాతీయ భావాలు,స్వార్థ పరత,దేవుళ్ళు ,అసూయలు,ఆదర్శాలు ఇవన్నీ మనను విడదీస్తున్నాయి ఇందులోని యధార్తను మన ఆకలినో బాధనో గమనించేంతటి స్పష్టంగా సూటిగా ప్రపంచంలోని గందరగోళం అంతటికీ మీరు నేను బాధ్యులుం .దుఖాని కంతటికీ మనదే బాద్యత.విభిన్న మైన సంఘాన్ని తయారు చేయటానికి జ్ఞానులు ఏవేవో చెప్పారు.అన్ని మా ర్గాలు సత్యం వంకే నడుస్తాయని చెప్పారు.పరిశీలిస్తే ఇది అసంబద్దం అని తేలిపోతుంది.  సత్యానికి మార్గం,పథం అంటూ ఏమీ లేదు.సత్యానికి సంబంధించిన సుందరత అదే. అది సజీవ మైనది.దానికి విశ్రాంత మందిర మేమీ ఉండదు.ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకు పోలేరు.ఈ సజీవ వస్తువే మీ స్వస్వరూపం అన్న సంగతి మీరు గమనిస్తారు మీ కోపము మీ దౌర్జన్యము,మీ నిరాశ,మీ బాధలు ఇదంతా అర్థం చేసుకోవడం లోనే సత్యం ఉన్నది. 
            మీరు ఎవరిపైనా ఆధార పడి మనగలగడం అసాధ్యమని తేలి  పోయింది.ఎవరు మార్గ దర్శకులు లేరు ,గురువులు లేరు ఆధిపత్యం లేదు,ఉన్నదంతా మీరే ఇతరులతో మీ సంబంధ బాందవ్యాలు.మీరు నేను మరే బాహ్య సంపర్కము ప్రభావము లేకుండా ఎవరి ప్రోద్భలము,జులుము,శిక్ష పడుతుందేమో అన్న భయం లేకుండా మనలో సమూల మైన మార్పును తీసుకు రాగలమా ?మానసికంగా ఆకస్మిక పరిణామం తీసుకు రాగలమా మనం అప్పుడు క్రూరులం  కాకుండా పై పోటీ మనో భావం లేకుండా ఆదుర్దాలు, భయాలు,అసూయలు,దురాశలు లేకుండా ఇప్పుడు మన జీవితాలలో నిండిపోయిన కుళ్ళు కల్మషము ఏమాత్రము లేకుండా ఉండగలుగుతాము." JK 
(ఈ వ్యాసం జిడ్డు కృష్ణమూ ర్తి బోధనలతో కూర్చిన ప్రచురణ అయిన అంతరంగ యాత్ర నుండి సేకరించినది .వారికి ధన్యవాదాలు )  
మరిన్ని వివరాలకు http://www.jkrishnamurti.org/index.php  వెబ్సైటు ను సందర్శించండి .

Saturday, 18 April 2015

సంభాషణలు చర్చలు ఇలావుంటే ఎలావుంటుంది ?

                         మనందరికీ రాజకీయాలు,సినిమాలు,క్రికెట్ ,కులం,మతం ,వ్యక్తీ ,ప్రాంతం,వర్గం,దేశం,తత్వం లాంటి విషయాల పై కొన్ని నిశ్చితాభి ప్రాయాలు ఉంటాయి.సంభాషణల్లోఎదుటి వారి ముందు అవి వ్యక్త పరుస్తుంటాము. అవతలి వారు కూడా తమ అభిప్రాయాలు చెబుతారు.ఇరువైపులా ఒకే రక మైన అభిప్రాయాలు ఉంటె ఓకే.పరస్పరం వ్యతిరేకమయితే ఇక ఘర్షణ మొదలవుతుంది.ఇలా మనసులో ఒక స్థిర అభిప్రాయం లేకుండా ఏ ప్రభావానికి గురి కాకుండా ఒక సమస్యకు కొత్త కోణంలో సత్యం,వాస్తవం ప్రాతిపదికన చర్చించుకునే openmindset  ఏర్పరచుకోవటం ఎంతో అవసరం.అప్పుడే అందులోనుండి మనమేదయినా కొత్త అంశాన్ని అంటే సత్యాన్ని కనుగొనగలం.అప్పుడు అందరం ఆ అభిప్రాయం తో ఏకీభవించ వచ్చు.సమాజంలో అంత తీరిక,ఓపిక,సహనం ఎవరికీ ఉండటం లేదు.మన మధ్య జరిగే విధంగానే T.V  చర్చల్లో,అసెంబ్లీ,పార్లమెంటుల్లో ప్రతిఫలిస్తుంది.కాబట్టి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి.
           ఈ openmindset ను పెంపొందించుకునే విధంగా విద్యార్థులను చిన్నప్పటినుండితీర్చిదిద్దాలి ఉపాధ్యాయు
లు ముందుగా ఈ ధోరణిని కలిగి ఉంటే విద్యార్థులకు నేర్పగలరు.అలాగే media కూడా ఈ ధోరణిని ప్రోత్సాహిస్తూ చర్చలు చేపడితే చాలా బాగుంటుంది.ప్రతి సంభాషణ నుండి,చర్చలనుండి ఒక కొత్త అంశం నేర్చుకోవటం,ఓ కొత్త సత్యం ఆవిష్కృతం కావటం,ఒక సమస్యకు పరిష్కారం లభించటం,ఓ వాస్తవిక దృక్పథం ఏర్పడటం,ఇవన్నీ వ్యక్తీ ,సమాజం అభివృద్ది చెందటానికి దోహదం చేస్తాయి

Saturday, 11 April 2015

మన సంభాషణల్లో జరిగేది ఏమిటి?

         నిత్య జీవితంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము.వాటి వలన మన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి.ఇక మన మిత్రుల దగ్గర,బంధువుల దగ్గర ప్రయాణాల్లో మన వైన అభిప్రాయాలు చెబుతూ వెళతాము.అవతలి వారికి అవి నచ్చితే సరి,నచ్చక పోతే వాతావరణం వేడెక్కుతుంది.సంభాషణలో ఎవరి అభిప్రాయాలు వారివి.కాని వాస్తవం లో ఏమి జరుగుతుంది అంటే మన మనసు మనకు నచ్చిన అంశాలనే ఇష్ట పడుతుంది నచ్చని వాటిపట్ల వ్యతిరేకతను ఏర్పరుచుకుంటుంది.అది క్రమంగా ఆ వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా మారు తుంది .విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. క్రమంగా నచ్చే మాటలు మాటలు మాట్లాడే వ్యక్తులతో మాత్రమే మనం ఒక సమూహం లో ఏర్పడి ఒకరికి ఇంకొకరు నచ్చేలా మాట్లాడు కుంటూ కాల క్షేపం చేస్తుంటాము.విషయాలు తెలుసుకోవాలనే తపన తగ్గి పోయి మనం అనుకున్నదే సరిఅయినది అనే మిత్ర బృందంతో మాత్రమే జీవితం  గడుపుతూ ఉంటాము .దీనితో జీవితం లో సత్యాలు తెలుసుకునే మార్గాలు మూసు కుంటాము.ఏ విషయంలో నైనా వాస్తవాలు ఏమిటి,సత్యం ఏమిటి అని తరచి చూసుకోగలిగితే సరిపోతుంది.మనం నమ్మినవి మాత్రమే సత్యాలు అనుకుంటే ఎన్నో విషయాలు తెలుసు కాకుండానే ఈ జీవితం ముగిసి పోతుంది. విభిన్న అభిప్రాయాలను గౌరవిద్దాము,అందులో సత్య మెంతో తరచి చూద్దాము.   

Monday, 6 April 2015

అబ్దుల్ కలాం ద్వారా శంఖు స్థాపన చేయబడ్డ అనాధల స్కూల్

             పై విషయం పేపర్ లో చూసిన తరువాత అదీ maartur లో అని తెలిసిన తరువాత వెళదామనిపించింది.కానీ ఒక్కడినే ఎలా అనుకున్నాను.సరే ఎప్పుడో ఒక సారి ఆ స్కూల్ ను చూడాలనుకున్నాను.ఆనంద్ ఫోన్ చేసి కార్లో వెడదామా అనటంతో O.K చెప్పేశాను.నేను,ఆనంద్,రంగయ్య ,DVN ప్రసాద్,T.V. శ్రీనివాస్ తో కలిసి బయలుదేరా ను.మేముండే మార్కాపురం నుండి ఒంగోలు మీదుగా నేషనల్ హైవే పై మార్టుర్ దాటిన తరువాత 2 KM లకు శారదా విద్యా నికేతన్ కనిపించింది. అదే అబ్దుల్ కలాం ఆవిష్కరించ బోయే అనాధల school.
             6 గంటల కల్లా అక్కడికి వెళ్ళాము.60 ఎకరాల్లో ఓ 10 ఎకరాల్లో స్కూల్ ఉంది.అక్కడ మాచెర్ల,వినుకొండ లలో పనిచేసే MARG  స్వచ్చంద నిర్వాహకులు పరిచయమయ్యారు.ఈ స్కూల్ కు వారు 60 మంది పిల్లలను పంపారట.కరీముల్లాఖాన్ అనే ఉపాధ్యాయుడి ద్వారా స్థా పించబడి 2000 మంది వివిధ వృత్తులలో పనిచేసే వారు సభ్యులుగా పనిచేస్తున్నదీ సంస్థ.ఆ సంస్థ లోని  M. పాపిరెడ్డి ,B.నాగరాజు పరిచయమయ్యారు వేదికపై శివారెడ్డి (నటుడు) కొద్దిసేపు మిమిక్రీ చేసారు .
             6:15 కల్లా కలాం గారు వేదిక పైకి వచ్చారు.ఈ స్కూల్ ను స్థాపించిన NRI డాక్టర్ పోలినేని సుబ్బారావు తన తల్లి పేరుతో ఫౌండేషన్ స్థాపించి తన 60 ఎకరాలను(60 కోట్లు విలువ చేసే ) ఈ ఫౌండేషన్ కు దానం చేసాడు. ఆయనకు చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోవటం తో ఆ లోటు తెలుసుకనుక ఈ స్కూల్ ఏర్పాటు చేసారు.తను ఎలా చదువుకుంది,కాలేయ cancer కు  గురయి బయట పడటం గురించి వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి .cbse syllabus తో 12 వ తరగతి వరకు అన్నిసౌకర్యాలతో (AC HOSTEL,LABS) ఏర్పాటు చేసారు.HIV సోకిన పిల్లలు ,అనాధలు ,తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఇందులో ప్రవేశం.ప్రస్తుతం 250మంది ఉన్నారు.పిల్లల బాల్యాన్ని కాపాడాలని,Quality విద్య నందించాలని తన లక్ష్యాన్ని వివరిస్తుంటే కలాం తో సహా అందరూ స్పందించారు. తరువాత కలాం గారు గంట సేపు పిల్లలతో Interactive mode లో సంభాషించారు.పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు . కలాం గారు ఇచ్చిన స్పూర్తితో ,సుబ్బారావు గారి సేవను స్మరించుకుంటూ తిరుగు పయన మయ్యాము


Sunday, 5 April 2015

kasturibaschool లో 10వ తరగతి అమ్మాయిలకు careerguidence

                         ప్రతి మండలం లో కస్తూరిబా విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంత పేద అమ్మాయిలు విద్యనభ్యసి స్తున్నారు.వారిలో చాలా మందికి ఇంటిదగ్గర  ఆర్ధిక పరిస్థితి సరిగాలేక బడిమానేసిన వారినందరిని ఇక్కడచేర్చుకుని శిక్షణ ఇస్తుంటారు.వారికి careergudence&personalitydevelopment లో శిక్షణ నిమ్మని ఉపాధ్యాయ మిత్రుడు సజీవరావు కోరటం తో ఒక ఆదివారం దోర్నాల (దిగువ srisailam) కస్తురిబా స్కూల్ కి వెళ్లాను.నాతోపాటు దోర్నాల మండల పరిషత్ ప్రెసిడెంట్ వేదాంతం ప్రభాకర్ గారు  (ఈయన సజీవరావు అన్న),కరీం (హిందీ లెక్చరర్ ) వచ్చారు.అక్కడ ప్రిన్సిపాల్ అనూష గారు మమ్ము ఆహ్వానించారు.
                       అమ్మాయిలూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.ముందు ప్రభాకర్ గారు వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.రాజకీయనాయకుడు అయినా విద్యార్థుల పట్ల ఎంతో ఆపేక్ష ,చదువు పట్ల ఎంతో ఇష్టం కలిగిన వ్యక్తి .తరువాత నేను ఒక గంట పాటు చదువు యొక్క విలువ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న అవకాశాలు వివరిస్తూ అద్బుత విజయాలు సాధించిన ఇద్దరు మహిళల గురించి వివరించాను.అందులో ఒకరు ఆకురాతి పల్లవి తెలుగు మీడియంలో డిగ్రీ చదివి ,తెలుగు మీడియం లోనే ఐఏఎస్ వ్రాసి 4 వ ప్రయత్నం లో ఎంపికయిన వారు.వారి గురించి "తెలుగు వెలుగు " పత్రిక లో వస్తే ఆ విషయం వివ రించాను. ఇద్దరు అమ్మాయిలూ మేము ఎన్ని కష్టాలు ఎదురయినా ఆమె లాగా ఐఏఎస్ సాధిస్తామని లక్ష్యం పెట్టుకున్నారు.
                      రెండవ మహిళ జ్యోతిరెడ్డి .ఈమె అత్యంత దయనీయ పరిస్థితుల్లో తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోబోయి విరమించుకుని పట్టుదలతో అమెరికా వెళ్లి అక్కడ కంపెనీ పెట్టి ప్రస్తుతం తన లాంటి ఎందఱో పేదవారికి సాయం చేస్తున్నారు.ఈ రెండు ఉదాహరణలతో వారిలో ఎంతో పట్టుదల కలిగి వారి వారి లక్ష్యాలను వివరించారు.ఇలా ఆరోజు వారికి చెప్పిన విషయాలతో వారిజీవితం లో కొద్ది మార్పు వచ్చినా చాలు.
             అదేరోజు త్రిపురాంతకం లో సజీవరావు,కరీంముల్లా (PSTeacher ),కరీం గారి ఆధ్వర్యంలో 40 మంది S.C మరియు ,ST పిల్లలకు కూడా ఇదేవిధమైన class నిర్వహించాము. ఆ పిల్లలు కూడా చాలా బాగా విన్నారు .అక్కడ కూడా ఒక విద్యార్థి ఐఏఎస్ లక్ష్యం పెట్టుకోగా మిగిలిన వారందరూ విభిన్న వృత్తులను ఎన్నుకున్నారు . ఈ రెండు కార్యక్రమాలను SAPS అనే స్వచ్చంద సంస్థ నిర్వహించింది .దీనిని వేదాంతం ప్రభాకర్ గారు,సజీవరావు ,కరీం కరీముల్లా నిర్వహిస్తున్నారు . వారిని ప్రత్యేకంగా అభినందించాను .మొదటి ఫోటోలో మాట్లాడుతున్నది వేదాంతం ప్రభాకర్ గారు,కూర్చున్న వారిలో మొదట నేను ,సజీవరాజు ,కరీం,అనూష Principal   (వరుసగా).
      

  రెండవ ఫోటోలో శిక్షణ నిస్తున్న నేను (ఒద్దుల రవిశేఖర్)   

Sunday, 8 March 2015

RMSA లో DRP గా 5 రోజుల శిక్షణ

      RMSA లో  DRP(District resource person) గ  నేను,నాగమూర్తి,సజీవరావు,రఘురాం ఎన్నిక  కావటం తో  28/1/15 night hyderabad బయలుదేరాము.బస్సులో కిటికీ సరిగా మూసుకోక పోవటంతో బాగా అసౌకర్యానికి గురయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే 11 గంటలకు బస్సు బయలు దేరింది. సినిమా పెట్టారు నేను నిద్ర పోవాలి ఆపమన్నాను.ఇంకొకరు పెట్టమన్నారు. రోజు T.V  లో 10 సినిమాలు వస్తుంటాయి .అయినా రాత్రి ప్రయాణం లో సినిమా కావా లంటారు .ఇదొక ప్రొబ్లెమ్.చివరకు డ్రైవర్ సినిమా తీసేసాడు .
         ఉదయం హైదరాబాద్ లో దిగేసరికి విపరీతమైన చలి. గచ్చిబౌలి లోని టెలికాం సెంటర్ కు చేరుకొని రిఫ్రెష్ అయ్ ఉదయం తరగతులకి  హాజరయ్యాము.మారిన 9,10 తరగతుల physical science textbooks పై  training మొదలయ్యింది.ఆనంద్ (text book writer,SRP)విద్యుత్ ,కాంతి పై చక్కటి అవగాహన కలిగించారు. ఆయనకు   ఫిజిక్స్ పై ఎంత ఇష్టం, పట్టు ఉందొ ఆ చెప్పే  విధానం బట్టి అర్థమవుతుంది.1200 పుస్తకాలతో కూడిన ఫిజిక్స్ లైబ్రరీ ఆయన ఇంట్లో ఉందిట.టీచర్స్ చాలా ప్రేరణ పొందారు .
         నెల్లూరు నుండి ఎ.వి  సుధాకర్  organic chemistry గురించి చెప్పారు. ఈయన scert  తరపున ల్యాబ్ బుక్స్ , సాక్షి భవితలో 10 వ తరగతి physicalscience పై వ్రాస్తున్నారు.నేను సుధాకర్ కలిసి మైసూరు లో జరిగిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ శిక్షణకు(NCERT ) వెళ్లి వచ్చాము. ఇంకా కెమిస్ట్రీ  లో ఏకాంబరం,సుబ్రహ్మణ్యం,గురుప్రసాద్ మిగతా తరగతులు  తీసుకున్నారు.చివర్లొ  విద్య,సైన్స్ వెనుక ఉన్న ఫిలాసఫీ ని రమేష్(academic incharge,scert) అద్భుతంగా  వివరించారు.మిత్రు లంతా   smartphones తో  record చేసుకున్నారు. తరువాత A.P STATE  physicalscience teachers forum  ఏర్పడింది .
.    

Saturday, 22 November 2014

నా ముంబై యాత్ర(My Mumbai Tour)


                 హోమిబాబా సైన్స్ సెంటర్ వారి ఆహ్వానం మేరకు ముంబై లో 4 రోజుల సెమినార్ కు (10/11/14 నుండి 13/11/14) వెళ్లాను.విజయవాడ నుండి 22 గంటల ప్రయాణం.నేనుముంబై లో  ఆదివారం దిగాను.kadapa నుండి మిత్రుడు hussainkhan అక్కడ వాళ్ళ బావమరిదితో కలిసి నన్ను కలిసాడు.clockroom లో బ్యాగ్ ఉంచి localtrain లో కుర్లా నుండి CST కి  వెళ్ళాము. అక్కడికి  దగ్గరలో Gateway of India,Taj hotel ఉన్నాయి. అక్కడ ఫొటోస్ దిగాము .సముద్రము లోనికి షిప్ లో వెల్లాము. ఇక తిరిగివస్తు మ్యూజియమ్ చూసాము. అక్కడ ముంబై గురించి 20 నిముషాల shortfilm చూపించారు.చాలా బాగుంది beautiful bay నుండి ఆ పేరు వచ్చింది .ఇక మళ్ళీ లోకల్ ట్రైన్ లో ట్రైనింగ్ క్యాంపు కు వెల్లాము.
              4 రోజులు అంతరిక్షం,నక్షత్రాలు గ్రహాల గురించి  చాలా లోతయిన అవగాహన కలిగించారు .ఒక రోజు nightskyobservatin కోసం ముంబైకి 100 కిమీ దూరం  తీసుకెళ్ళి  టెలీస్కోప్ ల సహాయంతో  నక్షత్రాలను చూపించారు.చాలా మంచి అనుభవం అన్ని  రాష్ట్రా లనుండి  60 మంది వచ్చారు . Nepal   నుండి 4 గురు,బంగ్లాదేశ్ నుండి ఒకరు వచ్చారు .Nepal వారికి మహేష్ బాబు ,పవన్ కళ్యాన్ సినిమాలు బాగా నచ్చుతాయని చెప్పారు. బ్రహ్మ నందం కా మెడి చాలా ఇష్టమట.ఒక రోజు రాత్రి interstellar అనే  scintific మూవీకి వెళ్ళాము.చాలా బాగుంది .olympiyad exams గురించి  వివరించారు.  మంచి  అనుభూతితో తో  తిరుగు  ప్రయానమయ్యాము. 

Sunday, 12 October 2014

బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

                బాలల హక్కుల కోసం,వెట్టి చాకిరి నిర్మూలన కోసం,పిల్లల చదువుల కోసం కైలాష్ 3 దశాబ్దాల కృషికి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.ఇప్పటికి 80,000 మంది పిల్లలను బాలకా ర్మికత్వం నుంచి విముక్తి చెందించి వారికి అందమైన భవిష్యత్తును కల్పించారు.child labour act,విద్యాహక్కు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బాల కార్మికుల కోసం ఈయన కృషిని గుర్తించారు. "నేను చనిపోయే లోపు బాల కార్మిక వ్యవస్థ అంతాన్ని చూస్తాను అని ఆత్మ విశ్వాసం తో చెబుతారు .
             బాలల పథకాలను వారి మీద జాలితో కాకుండా అవి వారి హక్కుగా చూడాలంటారు.పేదరికం,నిరక్షరాస్యత బా ల కార్మికవ్యవస్థ ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉందని వీటిని ఉమ్మడిగా తుద ముట్టించా లంటారు పిల్లల పట్ల ఆయన భావాలు ఆయన మాటల్లోనే
    "నేను చిన్న పిల్లల చెలికాడిని మనం వారిపట్ల చూపాల్సింది జాలి దయ కాదు మనకు స్వచ్చత పార దర్శకత నేర్పేందుకు పిల్లలను మించిన వారు ఎవరుంటారు .వారు పక్షపాతం లేకుండా ముక్కుసూటిగా ఆలోచించే మాయా మర్మం తెలియని వాళ్ళు "
        ఇంత ప్రేమ వారిపట్ల ఉండబట్టే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
  ఇక మలాలా చావు బతుకుల మధ్య పోరాడి గెలిచి న  ధీరబాలిక .విద్య నేర్చుకోవటం  పట్ల ఆమె దృఢ చిత్తం ,ప్రాణాలను లెక్క చేయని సాహసం ఆమెకు ఈ అవార్డ్ తెచ్చి పెట్టాయి .ప్రపంచమ్ లోని బాలికలంతా ఆమె స్పూర్తిని అందిపుచ్చుకోవాలి.ఒక విద్యార్థి,ఒక ఉపాధ్యాయుడు ఒక కలం,ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని మారుస్తాయి అని ప్రకటించిన ఆశావాది .
           బాలలందరి తరపున వీరిద్దరిని హృదయపూర్వకంగా అభినందిద్దాము .
కైలాష్ విద్యార్థి గురించి మరింత సమాచారం ఈ క్రింది వెబ్సైటు లో గమనించగలరు . 
http://www.kailashsatyarthi.net/contact/submit.php 

Wednesday, 25 June 2014

జీవితంలో కుతూహలం ముఖ్యం ---రాకేశ్ రెడ్డి 2013 CIVILS విజేత

                    దేశంలో అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో 219 రాంక్ సాధించారు మార్కాపురానికి చెందిన రాకేశ్ రెడ్డి .IPS వస్తుందని ఆశిస్తున్నారు . అలాగే  మార్కాపురానికి చెందిన   సాయి శ్రీనివాస్ ఎంసెట్ లో medicine లో state  first సాధించారు. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాటశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఇందులో రాకేశ్ రెడ్డి ఇచ్చిన సందేశం  ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే  ఉద్దేశంతో ఇక్కడ వ్రాస్తు న్నాను.ఆయన మాటల్లోనే


విద్యార్థులంతా కుతూహలాన్ని  కలిగి ఉండాలని ప్రతి విషయాన్ని ఎందుకు?ఏమిటి?ఎలా?అని ప్రశ్నించుకోవాలి నవోదయాలో చదివాను .software job  చేస్తుంటే  డబ్బు వచ్చేది కాని మనసులో    ఎక్కడో  అసంతృప్తి   ఉండేది.ఎక్కువ  మందికి ఉపయోగపడే పని సంతృప్తి కలిగించేది ఏదో దానిని ఎన్నుకోవాలనుకున్నాను. పని చేస్తున్నంత కాలం దానిలో ఆనందం పొందే విధంగా
 ఉండాలని అనుకున్నాను .దానికి సివిల్స్ అయితే సరిపోతుంది అనిపించింది జీవితం లో గమ్యం ఎంత ముఖ్యమో దానిని సాధించే క్రమంలో గమనం కూడా అంతే ముఖ్యం ఆ process  ను  ఎంజాయ్ చేయాలి .
అందుకే నాకు సివిల్స్ పరీక్ష తయారీలో కష్టం అనిపించలేదు .
సివిల్స్ ప్రేరణ మా నాన్న నుండి పొందాను. ఆయన  తన వృత్తిలో నిరంతరం ఆనందం పొందుతుండేవాడు . సివిల్స్ సాధించటానికి ముఖ్యంగా 3 అంశాలు దోహదం చేస్తాయి . 1)analytical ability 2)writing ability3) hard work and passion .విద్యార్థి దశలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి .చర్చల్లొ పాల్గొనాలి . మధ్యతరగతి నుండి వచ్చాను. నాన్న ఎప్పుడు చెబుతుండే వారు మనకు చదువు తప్ప వేరే మార్గం లేదు అని అందుకే ఎప్పుడు మెరిట్ స్టూడెంట్ గా ఉండే వాణ్ని .
          వివే కానందుడి మాటలు గుర్తుంచుకోండి .లక్ష్యము సాధించేంత వరకు విశ్రమించకండి .కలామ్ చెప్పినట్లు కలలు కనండి .వాటిని సాకారం  చేసుకోండి. మన లక్ష్యాలను సాధించిన తరువాత సమాజం లో అట్టడుగు వర్గాల వారికి సహాయ పడాలి  .ప్రపంచమ్ లోని  అత్యంత కష్ట మైన పరీక్షల్లో ఇది ఒకటి . 3 దశల   వడపోతలో మన లోని అన్ని కోణాలను పరీక్షిస్తారు .సివిల్స్ లో నైతిక విలువలు కూడా సిలబస్ లో చేర్చారు. తరువాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు .విద్యార్థులు తామెంతో inspire అయ్యామని చెప్పారు .
తరువాత మెడిసిన్ 1 ranker  సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ లో పూర్తీ స్థాయి ఫోకస్ పెడితే సరిపోతుందని చెప్పారు .
తరువాత రాకేశ్ రెడ్డి తో నేను మాట్లాడినప్పుడు psycology,public administration options గా తీసు కున్నానని  చెప్పాడు . మీ  సర్వీస్ లో ఇలాగే పిల్లలతో వీలు దొరికినప్పుడల్లా కలిసి వారికి మంచి విషయాలు వివరించమని చెప్పాను . నైనిటాల్ లో కంటోన్మెంట్ సి యి ఒ గా పనిచేస్తున్నాని చెప్పారు.