మంచు కరుగుతుంది.... అది ఉష్ణ ధర్మం.కాలం కరుగుతుంది.... అది విశ్వ ధర్మం.కాల చక్రం గిరగిరా తిరుగుతుంది. అసలు కాల భావనను ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి జీవ రాశి తెలుసుకుంది. పక్షులు జంతువులు ప్రకృతికి అనుగుణంగా, కాలానుగుణంగా జీవిస్తుంటాయి. మొదట్లో మనుషులు అలానే జీవించారు.ప్రస్తుతం మనుషులు పకృతికి విరుద్ధంగా కొండొకచో ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే మరో సంవత్సరం కాల గర్భం లో కలిసిపోయింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి.
మరి కాలం నుండి ఏం నేర్చుకోవాలి. కాల గమనం మన ఆలోచనా తీరుపై ఏదయినా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు ఆలోచిద్దాం.కాలం నిత్య నూతనం. మనం మాత్రం వయసు పెరిగే కొద్ది ఎన్నో శారీరక,మానసిక మార్పులకు లోనవుతుంటాం. మన అనుభవాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటాయి. యువత నూతన అనుభవాల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. పెద్దలు తమ అనుభవాలను వారికి పాఠాలుగా చెప్పాలను కుంటారు. పిల్లలు,విద్యార్థులు, యువత తాము చేసి చూసి తెలుసుకోవాలను కుం టారు. రెండింటి మధ్య సమతుల్యత అవసరం. కాలం నిత్యం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది.పరీక్షలను తట్టుకోవాలి మరెన్నో సవాళ్లు విసురుతుంది. సవాళ్ళను ఎదుర్కోవాలి.వాటిని తట్టుకుని ముందుకు వెళితే అందమైన ఆనందమైన భవిష్యత్ ఉంటుంది. ఎన్నో సాధించాలి అనుకుంటాం,ప్రణాళికలు వేసుకుంటాం. కొంతమంది విజయం సాధిస్తుంటారు.ఎక్కువమంది వైఫల్యం చెందుతుంటారు.గెలుపైనా ఓటమైనా తాత్కాలికం. వాటిని అర్ధం చేసుకుని అందుకనుగుణంగా మన వ్యవహరించాలి. గెలిచామని విర్ర వీగ కూడదు. ఓటమికి క్రుంగి పోకూడదు. ఉదయిస్తూ సూర్యుడు ఉత్తే జాన్నిస్తాడు.సాయంత్రం అస్తమిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటాడు. తనలోని దశలన్నీ మానవ జీవితం లో ఉంటాయని అన్నింటిని దాటుకుని నాలాగా పూర్ణ బింబంలా జీవించమని, నిండు పున్నమి మీ జీవితాల్లో ప్రసరిస్తుందని జాబిల్లి మనకు నేర్పిస్తుంటాడు. సృష్టి లో ప్రతిదీ చలనం లో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ, సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. మనం కూడా విభిన్న ప్రాంతాలను చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆ స్వాదిస్తూ,వైవిధ్యమైన సంస్కృతులను తెలుసుకుంటూ ఉంటే మనసు,హృదయం విశాలం అవుతుంది.ఇలా కాలం మనకెన్నో నేర్పుతుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే..... ఒద్దుల రవిశేఖర్