Saturday 4 June 2022

మనమంతా పరిపూర్ణమైన అపరి పూర్ణులం....మునాబ్ మజారి.

 అందరికీ ధన్యవాదాలు. నన్ను నేను ప్రేరణాత్మక వక్తగా కాక ఒక కథకురాలిగా భావిస్తా ఎక్కడి కెళ్ళినా ఒక కథ చెబుతా, మాటలకున్న శక్తి విలువ నాకు తెలుసు. పదాలు మిమ్మల్ని తయారు చేయవచ్చు, మీ మనసును గాయ పరచవచ్చు, గాయాన్ని మాన్ఫవచ్చు.అందుకే నేను ఆశావాదంతో మాట్లాడుతుంటా వాళ్ళు దాన్ని నా బలహీనతగా భావిస్తే నేను అది బలంగా భావిస్తా, వారు నన్ను వికలాంగురాలిగా భావిస్తే నేను విభిన్న ప్రతిభా వంతురాలిగా భావిస్తా, నా సామర్ధ్యాన్ని చూస్తా. మీ జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మీ DNA ను మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీ దేహాన్ని ముక్కలు చేసినా మీ ఆత్మలో పరివర్తన కలిగిస్తాయి.అవి మిమ్మల్ని మరింత ఉన్నతీకరిస్తాయి. నాకు అలాగే జరిగింది.18 ఏళ్లప్పుడే నాకు పెళ్లి అయింది మాది చాలా సంప్రదాయ కుటుంబం వివాహం అయిన 2 ఏండ్ల కు నాకు కార్ ప్రమాదం జరిగింది. నా భర్త ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. నాకు తీవ్ర గాయా లయ్యాయి.కుడి భుజం మణికట్టు విరిగాయి. ఊపిరి తిత్తులు, కాలేయం దెబ్బతిన్నాయి గాలి పీల్చలేక పోయేదాన్ని, మూత్రము మీద నియంత్రణ కోల్పోయాను. నా వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. జీవితాంతం ఇక నడవ లేనని తెలిసింది ఈ గాయాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి కొంత మంది రక్షించి ఒక జీప్ వెనుక భాగంలో తీసుకెడుతుంటే మిగిలిన ఎముకలు కూడా విరిగాయి. అప్పుడు నా కర్ధమైంది. సగం దేహం విరిగిపోయింది, మిగతా సగం చలనం లేకుండా మారిందని. రెండున్నర నెలలు ఆసుపత్రి లో ఉన్నాను. నాకు చాలా శ స్త్ర చికిత్సలు జరిగాయి. నా శరీరం లో చాలా టైటానియం అమర్చారు అందుకే పాకిస్థాన్ లో నన్ను అందరూ ఉక్కుమహిళ అంటారు.ఒక రోజు డాక్టర్ వచ్చి నీవు ఇక చిత్రకారిణి కాలేవని చెప్పారు. మరుసటి రోజు వచ్చి నీ వెన్నెముక బాగా దెబ్బ తిన్నదని ఇక నీవు నడవ లేవని, బిడ్డలను కనలేవని చెప్పడం తో నా కర్ధమయింది పూర్తిగా నా జీవితం నాశనమయిందని. మా అమ్మను అడిగాను నేను ఎందుకు బ్రతికి ఉండాలని, నా జీవితానికి అర్థం ఏముందని? పిల్లలు కలగక పోతే జీవితమంతా అసంపూర్ణం గా మిగిలిపోవాల్సిందేనా అని. దేవుడు నీ కేదో గొప్ప భవిష్యత్తును వ్రాసి పెట్టాడేమో అని అమ్మ అన్నది. అంత బాధలోనూ అమ్మ మాటలు నా మీద మంత్రం లా పనిచేసాయి నన్ను ఆసుపత్రి నుండి తీసికెళ్ళమని అమ్మను, తమ్ముడిని కోరాను నేను మొదటి చిత్రాన్ని నా మృత్యు పాన్పు మీద వేసాను అదే నా హృదయానికి నేను చేసుకున్న చికిత్స. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చాను. నా గాయల వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే బెడ్ పైనే  ఉండవలసి వచ్చింది,కిటికీ గుండా పక్షుల కిలకిలా రావాలు వింటూ.ఒకసారి బయటికెళ్లి ప్రకృతి సంగీతాన్ని వినాలని కోరిక కలిగింది, అప్పుడనిపించింది ప్రజలెంత అదృష్టవంతులో కాని వారది గుర్తించరు. రెండున్నర సంవత్సరాల తర్వాత చక్రాల కుర్చీ పై కూర్చో గలిగాను. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లనిపించింది. ఇక జీవితమంతా నడవ లేనని గుర్తు కొచ్చింది. అద్దముందు నిలబడి అనుకున్నా ఏ అద్భుతం జరిగి నేను నడవలేనని, ఏడ్చుకుంటూ మూలన కూర్చునే బదులు, ఎవరి దయ కోసమో ఎదురు చూసే బదులు నా స్థితిని అంగీకరించాలని నిర్ణయించుకున్నా! నా కోసం నేను జీవించాలనుకున్నా, అప్పుడే నిర్ణయించుకున్నా నా భయాలను గెలవాలని కానీ నా పెద్దభయం ఏంటంటే విడాకులు. నా అవసరం లేని వ్యక్తికి నేను ఎందుకు? అతనికి స్వేచ్చ ఇచ్చి నేను స్వేచ్ఛను పొందటం మేలు కదా!అతను వివాహం చేసుకున్నాడు అని తెలియగానే అభినందనలు తెలియజేసా రెండవ పెద్దభయం నాకు పిల్లలు కలగరని! కానీ ప్రపంచంలో ఎంతో మంది అనాధలున్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకోవచ్చు కదా అనిపించింది, అదే చేసాను. ఇక  3 వ భయం  జనాలను ఎలా ఎదుర్కోవాలి అని ఇంట్లో బెడ్ మీదున్న ఆ రెండు సంవత్సరాలు తలుపులు వేసుకొని ఎవరిని పలకరించటానికి ఇష్టపడే దాన్ని కాదు. వారు ఒక లాగా సానుభూతి చూపడం నాకు నచ్చదు ఇప్పుడు ఇలా మీ అందరి ముందు నా కథ పంచుకోవడం నా అదృష్టం. అలాగే పెయింట్ వేయడం మొదలు పెట్టాను. మోడలింగ్ చేస్తున్నాను. అందువలన  మనల్ని మనం ముందు అంగీకరిస్తే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. పాకిస్థాన్ తరపున ఐక్యరాజ్యసమితికి రాయబారిగా వ్యవహరిస్తూ స్త్రీ ల  పిల్లల  హక్కుల గురించి  లింగ సమానత్వం గురించి  మాట్లాడుతున్నా.2015 BBC ఎన్నుకొన్న 100 మంది స్త్రీల లిస్ట్ లో నేను ఉన్నా, Forbes ఎన్నుకొన్న 30 సంవత్సరాల లోపు వయసు  గల  30 మంది స్త్రీల లిస్ట్ లో ఉన్నా. మీ వృత్తి లో మీరు  ఎంతో ఉన్నతస్థానం చేరుకోవాలని మీకు ఉండవచ్చు. కానీ దానికి ఒకటే  సూత్రం నేను అనుకోకుండా మనం అనుకోవాలి. నీ ఒక్కడివే విజయాలు సాధిస్తావు అనుకోవద్దు. నీ  వెనుక ఒకరుండాలి. నీకు మద్దతిస్తూ ఒకరుండాలి అటువంటి వ్యక్తిని కోల్పోవద్దు. నా  వెనుక  మా అమ్మ ఉంది నేను ఇలా ఉన్నానంటే ఆమే కారణం. మనం జీవితం నుంచి ఎంతో ఆశిస్తుంటాం కానీ జీవితం నన్నిక్కడ నిలిపింది. ఇది నాకు పరీక్షా కాలం. దాన్ని మనం  అర్థం  చేసుకుంటే  చాలు ఓటమి  ఒక అవకాశం, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి ప్రయత్నించాలి కానీ ఎప్పుడూ వదిలి పెట్టకూడదు. మనకు అంతా దోషం లేకుండా ఖచ్చితంగా, సంపూర్ణం గా ఉండాలనుకుంటాం. జీవితం, వృత్తి సంబంధాలు డబ్బు ఇలా అన్నింట్లో సంపూర్ణతను ఆశిస్తాం ఏదీ ఈ ప్రపంచం లో పరిపూర్ణంగా ఉండదు. మనమంతా పరిపూర్ణంగా అసంపూర్ణులం.ఇతరులకు మనం మంచిగా పరిపూర్ణంగా కనిపించాలనుకోవద్దు. నీ లోపల నీకు  ఆ పరిపూర్ణత ఉంటే చాలు. ఈ సమాజం మనం సంపూర్ణులుగా ఉండటానికి చాలా నిబంధనలు పెట్టింది. స్త్రీ పురుషులకు అవి విభిన్నంగా ఉంటాయి. మనం ఎదుటివారు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మనల్ని మనం తక్కువ వింటాం.ఇతరుల మేలు కోసం నీవు ఏదయినా చేస్తే నీవు సంపూర్ణంగా ఉన్నట్లు. ఇతరుల బాధను మనం అనుభవించి నట్లయితే ఆ బాధే మనల్ని ఇతరులతో అనుసంధానం చేస్తుంది. బాధ తప్ప ఏదీ ఇతరులతో మనల్ని అనుసంధానించదు. అందుకే చెబుతుంటా నేను బాధ లో ఉన్నానని. నా కదే ఆశీర్వాదం. చక్రాల కుర్చీలో ఉన్నాను కాబట్టే పిల్లలకోసం పనిచేస్తున్నా. వైద్య సహాయం అందని మారుమూల ప్రాంతాల పిల్లలకు వైద్యం అందిస్తున్నా. అలాగే హిజ్రా లకు  సహాయం అందిస్తున్నా. ఇలా అసంపూర్ణమైన వ్యక్తులు మనతో అనుబంధం ఏర్పరచు కోవడానికి కారణం నేను అసంపూర్ణురాలుని కాబట్టి. జనం అడుగుతుంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉండటంలో మీరు అలసట చెందరా అని. నీవు కోల్పోయిన వాటి గురించి, వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నీవు ప్రస్తుతం పీల్చే ప్రతి శ్వాసను ఆస్వాదించు.జీవితాన్ని ఉత్సవం లా జరుపుకో.జీవించు, మరణానికంటే ముందే చావకు. అందరం మరణించే వాళ్ళమే.75 ఏళ్ళు ఒకేలా బ్రతికి మనం దాన్ని జీవితమంటాం. ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు అది కాదు జీవితం అంటే. బయటికెళ్లి నీ సహాయం కావలిసిన వారిని గుర్తించు. వారి జీవితాలకు రంగులద్దు. వారి జీవితాలకు విలువనివ్వు. అన్ని నిరాశా వాదపు భావనలు తొలగించే స్పాంజ్ లా మారు అందమైన ఆశావాదపు భావనలు వెదజల్లగలిగితే ఇతరులను మార్చగలవు. నేను నవ్వుతుంటేనే ఇతరులను ఆనందపరచగలను. నీకు ఉన్న వాటి పట్ల గొప్పగా భావించు. మనకు లేని వాటిపట్ల ఎక్కువగా ఆలోచించ వద్దు. జీవితాన్ని పూర్తిగా జీవించండి. నీవు ఉన్న స్థితిని అంగీకరించు.నీ పట్ల నీవు దయకలిగి ఉండు అప్పుడే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు.నిన్ను నువ్వు ప్రేమించు ఆ ప్రేమను వ్యాపింపజెయ్యి. జీవితం చాలా కఠినంగా ఉంటుంది.అలజడి, పరీక్షలు ఉంటాయి. అవే నిన్న ద్రుడంగా గా తయారు చేస్తాయి. ఎప్పుడూ దేన్నయినా  మధ్యలో వదిలి వేయవద్దు. నిజమైన ఆనందం డబ్బులో, విజయం లో కీర్తిలో ఉండదు.

నిజమైన ఆనందం కృతజ్ఞతలో ఉంటుంది. ప్రతి క్షణం జీవించడానికి ప్రయత్నించండి.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

No comments:

Post a Comment