Saturday 25 June 2022

మానసిక అనారోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి...దీపిక (హిందీ సినీనటి )

 

2013,2014 సంవత్సరాల్లో నాకు సినిమా పరిశ్రమలో మంచి విజయాలు దక్కాయి. నాకు వచ్చిన సమస్యను మీ అందరితో పంచుకుంటాను. మొదట్లో ఉదయం లేవగానే కడుపులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించేది అదేంటో ఎందుకు వస్తుందో అర్ధమయ్యేది కాదు. ఇంత వరకు ఎప్పుడూ ఈ పరిస్థితి నాకు ఎదురు కాలేదు జ్వరం, జలుబు వచ్చినప్పుడు వచ్చే మార్పులు మనకు తెలిసిపోతాయి. కానీ ఈ ఇబ్బంది నన్ను తీవ్రంగా బాధించేది. నాలో నేనే ఏడ్చుకునే దాన్ని అవి నా పాలిట చీకటి రోజులు. గమ్యరహితంగా,వెలితిగా ఉండేది  నా జీవితం.                                      *మా అమ్మ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా లక్షణాలు గమనించి అన్నా అనే సైకాలజిస్ట్ కు ఫోన్ చేసింది. ఆమె నన్ను నిపుణుడి సహాయం తీసుకోమంది. దీనికి సరయిన వైద్యం ఉందని, దాని ద్వారా నయమవుతుందని నమ్మమని కోరింది. మొదట్లో మందులు తీసుకోవడానికి వ్యతిరేకించాను. ఎక్కువ మందులు మింగడం ఆరోగ్యానికి మంచిది కాదు అనుకునే దాన్ని. నా మానసిక స్థితి చాలా హెచ్చు తగ్గులుగా ఉండేది. ఒకో సారి చాలా ఉన్నతంగా, మరో సారి పాతాళం లోకి తోసి వేసినట్లు అనిపించేది.లోలకం ఊగినట్లు నా మనసు ఊగేది. నా మనసుకు, నా శరీరానికి ఏమవుతుందో అర్ధమయ్యేది కాదు. తీవ్రమైన నిరాశ లో కూరుకు పోయేదాన్ని. అప్పుడు నాకు మందులు ఇవ్వడం మొదలు పెట్టారు డాక్టర్.           *Function లకు, party లకు వెళ్ళినప్పుడు అందరి ముందు చిరునవ్వుతో అంతా బాగున్నట్లు ఉన్నా ఏదో తీరని వెలితి లోపల. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి నాకు clinical depression ఉందని తెలిసింది. ఒక్క సారి సమస్య అర్ధమయ్యాక దాన్ని అంగీకరించాను. ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నాను. నేను నిజాయితీ గా ఈ విషయాలు చెబుతున్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు నన్ను అర్థం చేసుకుని సహకరించే వారు. అప్పటినుండి నా సమస్యను అందరికీ చెబుతుండే దాన్ని అప్పుడర్ధమయ్యింది ఇండియాలో ఈ సమస్యలు చాలా మందికి ఉన్నాయని.ఈ విధంగా అందరికీ చెప్పుకోవడం వల్ల నా career దెబ్బతింటుందనుకోలేదు. అసలు ఈ సమస్యను అందరికీ చెప్పుకోవడం వలననే నేను కోలుకోగలిగాను.                                       *జాతీయ టెలివిజన్ లలో ఇంటర్వూ లు ఇచ్చే దాన్ని. అలా చెబుతున్నప్పుడు స్వేచ్ఛ పొందినట్లు భావించేదాన్ని. మనం నిజాయితీగా ఉంటే మన చుట్టూ ఉన్న వారు అర్థం చేసుకొని అంగీకరిస్తారని తెలిసింది.నేను అనుభవించే బాధను,ఎలా అధిగమించానో తెలుసుకుంటే మిగతా వారికి మేలు జరుగుతుందని భావించేదాన్ని.  ఒక విలేఖరి నన్ను ఏదయినా మందుల కంపెనీ కి ఏజెంట్ గా పని చేస్తూ ఇదంతా చెబుతున్నావా అని అనుమానించింది.                                   *విచారంగా ఉండటం వేరు,వ్యాకులంగా ఉండటం వేరు మనం వ్యాకులాన్ని గుర్తించలేం కూడా. మానసిక అనారోగ్యం దాని లక్షణాలు అర్థం చేసుకోవాలి. కొంత మంది ఎలా ఉన్నావు అని అడిగితే బాగాలేను అంటారు. వారు కోలుకోవడానికి అటువంటి వారి పట్ల సహానుభూతి చూపడం అత్యంత అవసరం  అవతలి వారిపట్ల శ్రద్ద చూపడం వారిపట్ల జాగ్రత్త వహించడం ఉదాత్త లక్షణం       *2013-14 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత కఠినమైనవి.నా హృదయం ముక్కలై పోయిందా అన్న భావన. ఆ స్థితిని తెలుసుకుని వైద్య సహాయం తీసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది. అలాగే శారీరక అనారోగ్యం గురించి అందరికీ ఏదో ఒక మేరకు అవగాహన ఉంటుంది. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారని ఆశిస్తాను. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

No comments:

Post a Comment