Saturday, 11 June 2022

సురభి గౌతమ్ :IAS ఆఫీసర్ అయిన విధం

 

నమస్తే అందరూ ఈ రోజు నా  విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని ప్రఖ్యాతి గాంచిన పోటీ పరీక్షలు ఉత్తీర్ణత అయినట్లు నా  బయోడాటా లో మీకు కనిపిస్తుంది. కానీ మిత్రులారా  నేను పొందిన తిరస్కారాలు,నా పట్టుదల, మానసిక సామర్ధ్యము నా విజయాలకు కారణం.                               *మధ్య ప్రదేశ్ లోని మారుమూల కుగ్రామం మా ఊరు.1000 జనాభా కలిగిన చిన్న పల్లెటూరు. ఒక వర్షా కాలం ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిన్న పాప జన్మించింది. 30 మందితో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబమది.25 ఏళ్ళు గడిచాయి. అదే అమ్మాయి, అదే ఊరు. పూల దండలతో స్వాగతం. ఉమ్మడి కుటుంబంలో ఎవరినీ ప్రత్యేక శ్రద్ధతో చూడరు.మా ఊరి హిందీ మీడియం పాఠశాలలో చదివాను.5 వ తరగతి గణితంలో 100/100 మార్కులు సాధించాను. ఆ రోజు నాకు మొదటి ప్రశంస,గుర్తింపు లభించాయి.నా హృదయం విభిన్న అంశాలపై దృష్టి పెట్టమని కోరుతుంది.చిత్ర కళ,రంగులు వేయడం,ఎంబ్రా యిడరి మొదలు పెట్టాను.                                *కానీ నా దేహంలో కలుగుతున్న నెప్పిని గమనించలేకపోయాను. నా మోచేతి భాగం మరియు నా శరీరంలోని ప్రతి కీలులో విపరీతమైన బాధతో మంచానపడ్డాను. హాస్పిటల్ లో డాక్టర్ రుమాటిక్ జ్వరం అని చెప్పారు. ప్రమాదకర మైన జ్వరమని ప్రతి 15 రోజులకొకసారి నిపుణుడయిన డాక్టర్ తో పెన్సిలిన్ ఇంజక్షన్ వేయించాలని చెప్పారు. మా ఊర్లో కరంట్ లేదు కిరోసిన్ వెలుగులో చదువుకోవాలి. ఎటువంటి ట్యూషన్ లు లేవు.అయినప్పటికీ నా 10 వ తరగతి పరీక్షల్లో maths, science ల్లో 100/100 మార్కులు సాధించాను.నన్ను వార్తపత్రికలు ఇంటర్వూ చేసాయి. భవిష్యత్తులో ఏమవుతావని అడిగారు. Dancer ను singer ను అవుతానని చెప్పాను. కానీ ఆ విలేఖరి నువ్వు బాగా చదివి ఏమవుదామనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు మెరుపులా నా  మనసులో ఓ ఆలోచన వచ్చింది."కలెక్టర్ ను అవుతానని చెప్పాను. పేపర్ లో అదే హెడ్డింగ్ తో వార్త వచ్చింది. అందరూ అభినందించారు. కానీ కలెక్టర్ కావాలంటే ఏమి చెయ్యాలో తెలియదు. సమాజానికి కలెక్టర్ ఎంత ముఖ్యమో తెలీదు.                                             * ఇంటర్ లో మాథ్స్ గ్రూప్ తీసుకున్నాను. మా  ఊరిలో విద్యుత్ శక్తి,ఆసుపత్రి లేని దయనీయ స్థితిని మార్చాలనుకున్నాను. కానీ ఎలానో తెలీదు.12 వ తరగతిలో సైన్స్ లో ఎక్కువ మార్కులు రావడంతో అబ్దుల్ కలాం స్కాలర్ షిప్ వచ్చింది. మంచి గుర్తింపు వచ్చింది.               *తరువాత భోపాల్ వచ్చి ఇంజనీరింగ్ లో చేరాను. మా ఊరి నుండి వచ్చిన ఏకైక అమ్మాయిని నేనే. నేను నా ఆశయాలు సాధించక పోతే మిగతా అమ్మాయిల ఆశలు సమాధి చేసినట్లే. కాలేజీలో మొదటి రోజే చేదు అనుభవం. కెమిస్ట్రీ ల్యాబ్ లో మేడం నన్ను చూసి ఆ టెస్ట్ ట్యూబ్ తీసుకుని టైట్రేషన్ చేయమన్నది. అసలు హిందీలో దాని అర్ధమేంటో తెలీదు. టెస్ట్ ట్యూబ్ పట్టుకోగానే జారి క్రింద పడింది. ఇక రెండవ పీరియడ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. అందరు ఇంగ్లిష్ లో ధా రాళంగా మాట్లాడుతూ పరిచయం చేసు కుంటున్నారు.నాకు ఇంగ్లీష్ రాదు. హిందీ మీడియంలో చదివాను. అందరు చెప్పిన పదాలు పేర్చుకుని ఎలాగోలా చెప్పగలిగాను. మా ఫిజిక్స్ సార్ పొటెన్షియల్ అంటే ఏంటని అడిగారు.అర్థం తెలిసినా ఇంగ్లీష్ లో చెప్పలేక మౌనంగా ఉన్నా. సార్ వచ్చి నువ్వు నిజంగా ఇంటర్ పాస్ అయ్యావా, ఇంత చిన్న ప్రశ్న చెప్పలేవా అన్నారు. రూమ్ కు వచ్చి తనివి తీరా ఏడ్చాను. బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్లి పోదామనుకున్నా. మా  అమ్మానాన్న కు ఫోన్ చేసాను. హనుమంతుడికి అతని గొప్ప తనాన్నిజాంబ వంతుడు ఎలా గుర్తు చేసాడో నాకు అమ్మా నాన్న అలా ధైర్యం చెప్పారు అప్పుడు నిర్ణయించుకున్నా మొదటి సెమిస్టర్ అయిపోయేలోగా ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఇంజనీరింగ్ పుస్తకాల్లోని పదాలను గోడలపై వ్రాసుకున్నా. నా మెదడులోకి బాగా ఎక్కించుకున్నా. నా  కలలు కూడా అప్పటినుంచి ఇంగ్లీష్ లోనే సాగాయి. మొదటి సెమిస్టర్ లో యూనివర్సిటీ లోనే మొదటి స్థానం సాధించాను. ఛాన్సలర్ స్కాలర్ షిప్ అందుకున్నా. సాధించాలని బలంగా నిర్ణయించుకుంటే ఏదయినా సాధించగలమని అప్పుడర్ధయింది. ఏకోచింగ్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాగలిగాను.విశ్వం ఏ విధంగా తలచిందో మీ ముందు TED talk లో ఇలా నిలబడ్డా.20 ఏండ్ల 6 నెలలకు నా B. Tech డిగ్రీ పూర్తయింది.                     *సివిల్స్ వ్రాయాలంటే 21 సం నిండాలి. ఈ 6 నెలల్లో GATE, ISRO,BARC , SAIL,PPSC, IES ఇలా అన్ని ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు వ్రాసా అన్నింట్లోనూ అర్హత సాధించా. ముంబై BARC నుండి ఇంటర్వూ కి పిలుపు వచ్చింది. మిత్రులంతా చాలా కష్టమని నిరాశ పరిచారు. ఇంటర్వూ లో విజయం సాధించి న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యాను.IES లో దేశం లో మొదటి ర్యాంక్ వచ్చింది. కానీ నేను ఏ IIT, NIT ల నుండి వచ్చిన దాన్ని కాదు. నేను ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షలో first వచ్చిన మొదటి మహిళను. ఇప్పటివరకు నా మార్కులు ఎవరూ దాటలేదు. BARC కు రాజీనామా ఇచ్చి రైల్వే ఇంజనీర్ గా చేరాను. హైదరాబాద్ లో శిక్షణ కోసం వెళ్ళా.                                  *ఇక చదవాల్సిన పని లేదు జీవితాన్ని సంతోషం గా గడుపుదా మనుకున్నా .కానీ ఎందుకో ఈ వృత్తి ఆనందాన్ని ఇవ్వడం లేదు.అమ్మని అడిగా ఎందుకు ఇలా అనిపిస్తుంది అని.అమ్మ ఇలా అన్నది "10 వతరగతి అయ్యాక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వూ లో కలెక్టర్ అవుతానని, ఊరికి ఏదో మేలు చేస్తావని చెప్పావు కదా "అన్నది. అప్పుడు సివిల్స్ వ్రాద్దామని నిర్ణయించుకున్నా.సివిల్స్ ఇండియా లోనే కాదు, ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్ష.4,5 సార్లు వ్రాస్తేనే గాని విజయం సాధించలేని పరీక్ష.24 గంటలు చదువుతుంటారు ఈ పరీక్ష కోసం. కానీ నా రైల్వే శిక్షణ తీసుకుంటూనే రోజుకు మిగిలిన  3 లేదా 4 గంటలు చదివే దాన్ని చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. వదిలేద్దా మనుకున్నా. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసాను. ఆమె నాకు ఎప్పుడూ మంచి మెంటార్ గా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కూడా నాకు జీవితం చాలా కష్టంగా ఉంది చిన్నప్పటినుండి కష్టపడుతూనే ఉన్నా. జీవితం లో ఆనందించేదెప్పుడూ సివిల్స్ పాస్ అవుతానోలేదో తెలీదు. అన్నాను అమ్మతో. అమ్మ అన్నది "నీ  వయసు 23, నేను నీ వయసులో ముగ్గురు బిడ్డల తల్లిని.30 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి భోజనం తయారు చేసి 10 కి. మీ  వెళ్లి పని చేసి వచ్చే దాన్ని అయినా నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదు. కానీ నీకు ఎటువంటి కుటుంబ సామాజిక బాధ్యతలు లేవు. నీ కలను సార్ధకం చేసుకో, నిన్ను నువ్వు నిరూపించుకో ఇతరుల కోసం కూడా సాధించు, అదే నీ లక్ష్యం. నీ కళ్లద్దాలను కొద్దిగా సవరించుకో". ఇక నేను మిషన్ మోడ్ లో చదవడం మొదలు పెట్టాను. ఎన్ని ఆటంకాలు ఎదురయినా అంతే దృఢoగా మారిపోయాను.2016 లో సివిల్స్ లో దేశ స్థాయిలో 50 వ ర్యాంక్ సాధించాను.                                                                *ఈ క్రింది వాక్యాలు నేను నమ్ముతాను "కష్టపడటానికి మించి వేరే మార్గం లేదు. విజయానికి దగ్గరి దారి లేదు.సాధించలేని వాటి గురించి ఆలోచించకు.విధితో మొండిగా పోరాడి ఏదయినా సాధించు,ముందుకే వెళ్లాలని బలంగా నిర్ణయించుకో. అదే మన గమ్యాన్ని చేరడానికి గల రహస్యం." ధన్యవాదాలు. 🙏. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

No comments:

Post a Comment