Saturday, 25 October 2025

సత్యం ఒక్కటే, దర్శనాలు వేరు

 


సత్యం ఒక్కటే దర్శనాలు వేరు

 సేకరణ, సంకలనం : ఆర్కే ప్రభు, రవీంద్ర కేలేకర్ అనువాదం: వాడ్రేవు చిన్న వీరభద్రుడు. 

ఈ పుస్తకం గాంధీ ఠాగూర్ల మధ్య జరిగిన లేఖల ఆధారంగా  వ్రాయబడింది. 

ఏ విషయం పైన అయినా చర్చించుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చించుకుంటే ఒక ఏకాభిప్రాయానికి రావచ్చు రాకపోనూవచ్చు అంతమాత్రాన వ్యక్తిగతంగా విభేదించుకోవాల్సిన పనిలేదు

గాంధీ,ఠాగూర్ ల మధ్య కూడా ముఖ్య మైన విషయాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయి. వారి ఆలోచనలలో స్పష్టత ప్రత్యర్థి ఆలోచనలపై అవగాహనలతో సహా విచక్షణా జ్ఞానం సంయమనం పటిష్టంగా ఉండాలి. ఇంగ్లాండ్ యూరప్ అమెరికా దేశాలలో తరచూ ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటూ ఉంటారు.ప్రాచీన భారతదేశంలో ఇలాంటి చర్చ సంస్కృతి మనం గుర్తిస్తాం కానీ ప్రస్తుతం ఇది అంతరించి ప్రవచనాలు ప్రబలుతున్నాయి. వేదాలలో ఉపనిషత్తులలో సత్యాన్వేషణ ఎక్కువ నచికేతుడు -యముడు, గార్గి -యాజ్ఞవల్క్యుడు మధ్య జరిగిన సంవాదాలు ఇందుకు ఉదాహరణలు.

గాంధీ ఠాగూర్ లు భిన్న ధ్రువాలు కానీ వారి ఆత్మ ఒక్కటే ఠాగూర్ చింతనాపరుడైన మానవుడు కవీశ్వరుడు. గాంధీజీ కర్మయోగి మహాత్ముడు. ఇద్దరూ సత్యం కోసం ఒకరితో ఒకరు తీవ్రంగా తల పడ్డప్పటికీ వారి మధ్య వ్యక్తిగత సంబంధాలు కానీ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ సుహృద్భావాలు కానీ ఈషన్మాత్రం చెక్కుచెదరలేదు.వారి లేఖల్లోని కొన్ని విషయాలు ఎవరు వ్రాసారో తెలియజేస్తూ పరిచయం చేస్తున్నాను. వాటి అంతరార్ధం పూర్తిగా తెలుసుకోవాలంటే పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే.

 ఠాగూర్ 

 ఎవరైతే మమకారాన్ని  ప్రత్యేక అస్తిత్వాన్ని పోగొట్టుకోగలరో వారు అనంతత్వాన్ని అందుకోగలుగుతారు.ఎవరైతే అనంతత్వాన్ని కనుగొంటారో వారు అమృతులవుతారు.ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ తననే దర్శిస్తుందో అతడే మహాత్ముడు.ఎవరు అందరి హృదయాల్లో నిలిచి ఉంటాడో ఎవరి కార్యక్రమాలు అపరిమితాలో ఆ అనంతాత్ముడే మహాత్ముడు. మనుషులు ఆత్మ త్యాగమయ పూర్వకమైన జీవితం జీవించినప్పుడు అనంతత్వాన్ని అందుకుంటారు.

గాంధీజీ విజయ రహస్యం ఆయన ఆధ్యాత్మిక శక్తి లోను నిర్విరామ ఆత్మ బలిదానాలలో ఉంది ఆయన త్యాగమూర్తి ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది ఆయన విముక్తాత్ముడు పసి పిల్లవాడి తరహా నిరాడంబరత్వం ఉంది సత్యం పట్ల ఆయన  విధేయత చెక్కుచెదరనిది. మానవాళి పట్ల ఆయన ప్రేమ తీవ్రమైనది రుజువైనది ఇది క్రీస్తు స్వభావం.ప్రాచ్య ప్రపంచపు ఆత్మకు గాంధీ విలువైన ప్రతీక.

 అధికారం అన్ని రూపాల్లోనూ అహేతుకంగానే ఉంటుంది. అది శకటాన్ని గుడ్డిగా ఈడ్చుకుపోయే గుర్రం లాంటిది ఆ ప్రయాణంలో నైతిక పార్శ్వం అంటూ ఉంటే అది ఆ గుర్రాన్ని నడిపే మనిషి లోనే ఉంటుంది.కోపాన్ని కోపం లేకుండా చేయించు.చెడుని మంచితో  జయించు.తమకు ఓటమి నిశ్చయమని  తెలిసి కూడా తమ ఆదర్శాలకు కట్టుబడి ఉండడం లోనే నిజమైన విజయం దాగివుంది. అత్యున్నతమైన ప్రేమ సాహసం నా కందివ్వు మాట్లాడగలిగే చేసి చూపించగలిగే వ్యధ చెందగలిగే,అన్నిటినీ వదులుకోగలిగే సాహసం ఒంటరిగా ఉండగలిగే సాహసం మృత్యుముఖంలో బ్రతుకుపట్ల విశ్వాసం, ఓటమి సమక్షంలో గెలుపు గురించిన నమ్మకం, సౌందర్య దుర్భలత్వంలో దాగిన అమేయశక్తి అవమానా న్ని అంగీకరించగలిగే వేదనలోని హుందాతనం, తనకి అవమానం జరిగినా ప్రతీకారం తీర్చుకోవాలనుకోని హృదయం..... వీటినే నాకివ్వు 

ప్రేమ ఒక్కటే ఆధ్యాత్మిక చరమ సత్యం. నిరాకరించే మనః స్థితి సదా విభజనను కోరుకుంటుంది. అంగీకరించే మనఃస్థితి ఏకత్వాన్ని అభిలషిస్తుంది. మానవుడి మనస్సు సత్యాన్ని వివిధ పార్శవాల్లో, వివిధ కోణాల్లో సమీపించే ప్రయత్నమే చేస్తుంది.

తటస్థ వైఖరితో వైజ్ఞానిక సహకారంతో మనం పాశ్చాత్య ప్రపంచాన్ని సమీపిస్తే ఈ మానవ ప్రపంచ యదార్థ పరిస్థితిని అవగాహన చేసుకోగలుగుతాం.కబీర్ నానక్ తాత్కాలిక అవరోధాలను అతిక్రమించి శాశ్వతత్వపు సంపూర్ణ దిగంతాన్ని చూడగలిగిన సమ్యక్ దృష్టి వారిది. సర్వ విషయాల్లోని అంతరంగంలోకి మనం ప్రవేశించడానికి కావలసిన ఆధ్యాత్మిక దృష్టిని ఇవ్వగలిగే మంత్రం భారతీయ మంత్రం శాంతి మంచితనం ఏకత్వాల మంత్రం. 

మనిషి అంతఃపూర్వ ప్రపంచంలో లేని సంభావ్యతల్ని సంభవం చేయడం కోసం నడుంబిగించాడు.తన స్వీయ శక్తి సామర్థ్యాలతో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయడమే మానవుడి యదార్ధ కర్తవ్యం మనిషి జీవించేది ప్రధానంగా తన అంతరంగిక ప్రకృతి మీద. సత్యం గుణాత్మకం అది మన ఆత్మ నిర్ధారణ వాక్యం మనిషి తన సంకల్పంతో వివేకంతో తన ప్రేమతో తన కార్యాచరణతో నిర్మించగలిగే దేశమే అతని నిజమైన దేశం అనిపించుకుంటుంది తమ కోపాన్ని యదేచ్చగా వ్యక్తం చేయడం అనేది ఒక రకమైన ఆత్మ దుబారా. మన దేశాన్ని మన స్వీయ సృజనాత్మక సాధ్యంతో నిర్మించాలనే పిలుపు గొప్ప పిలుపు

మన హృదయం ప్రేమ సత్యాన్ని అంగీకరించినట్టే మన మనసు జ్ఞాన సత్యాన్ని అంగీకరిస్తుంది అసత్యం కన్నా అపరిశుద్ధమైంది మరి ఏదీ లేదు.

మానవుడు ఒక మానసరహిత శిలా ప్రతిమ ఈనాడు మన దేశాన్ని పూర్తిగా పీల్చిపిప్పి చేస్తున్న ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే అది విజ్ఞాన శాస్త్రాన్ని వదిలిపెట్టి కేవలం చేతులకు పని చెప్తే సరిపోదు మానవుడి జ్ఞానకాండ ఆగిపోయి అతని కర్మకాండ మాత్రం కొనసాగుతూ ఉండాలను కోవడం కన్నా మించిన గౌరవ విహీన ప్రయాస మరొకటి ఉండబోదు.

విష్ణువు చేతిలో పద్మం చక్రం ఉంటాయి పద్మము పరిపూర్ణతలోని పరమాదర్శం చక్రము నిరంతర చలన ప్రక్రియ.విష్ణుశక్తి పరిపూర్ణతను కోరుకునే నిరంతర క్రియాశక్తి.విజ్ఞాన శాస్త్రం చేస్తున్నది విష్ణు చక్ర మహిమను విస్తరింప చేయడమే

గాంధీ 

ఇంగ్లీష్ మీడియం విద్య భారతీయుల్ని అనుకరణ వాదులుగా మార్చింది చదువుకున్న భారతీయుణ్ణి నిర్వీర్యం చేసింది.

దుఃఖం అనే యదార్ధాన్ని ఎత్తిచూపుతూ దాన్ని దూరం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు బుద్ధుడు. బ్రహ్మవిద్యలో ఆనందమనే యదార్థాన్ని ఎత్తిచూపుతూ దాన్ని పొందవలసిందిగా ఉద్బోధిస్తూ ఉంటారు.ఒక విషయాన్ని స్వీకరించడం ఏ విధంగా ఒక ఆదర్శం కాగలదో దాన్ని పరిత్యజించడం కూడా అంతే ఆదర్శం కాగలదు.మనిషికి తన దేహవ్యావృత్తి నుండి విమోచన లేదా దేహం పట్ల దాస్యం అంతరించడమే ఆనందానికి శాశ్వత అనుగ్రహానికి దారి తీస్తుంది అసహజమైన అధార్మికమైన హింస సిద్ధాంతం బదులు తమకు హాని కలిగించని సహజమైన ధార్మికమైన సహాయం నిరాకరణ సిద్ధాంతాన్ని జాతి స్వీకరించింది.

 నా భావాలతో వేధించినంత మాత్రాన ఆ విభేదం నాకు అప్రియమెలా అవుతుంది కేవలం అభిప్రాయ భేదమే అసంతోషకారకమైతే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా ఒక్కలానే ఆలోచించరు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదం కటువుగా ఉండకపోవడం.ప్రకృతిలో అద్భుతమైన అనూ హ్య మైన వైవిధ్యం వెనుక ధ్యేయంలో వ్యూహంలో ఆకృతిలో ఒక ఏకత్వాన్ని చూడగలగాలి...... సేకరణ :ఒద్దుల రవిశేఖర్




Tuesday, 2 September 2025

వినూత్నంగా సన్మానాలు

 సన్మానాలు 

దండలు,శాలువాలు బదులు

మొక్కలు పుస్తకాలు ఇద్దాం 

      ప్రస్తుతం సన్మానం ఏదయినా  శాలువాలు, దండలు ఉండాల్సిందే!retire అయిన వారు జరుపుకునే functions కి ఇక చెప్పాల్సిన పని లేదు. August 15,September 5,January 26 ఇలా ఏ సందర్భంగా awards గెలుచుకున్నా ఇక శాలువాల,దండలు తప్పని సరి. రెండూ పునర్వినియోగించేవి కావు, దండలు అయితే కొద్ది సేపటికే అక్కడే వదిలేస్తారు,శాలువాలు అయితే ఇంటికి తీసుకెళ్లి బీరువాలో పెడతారు.మళ్ళీ వాటిని ఉపయోగించరు.

             ఇలా కాకుండా ఇంకేదైయినా మంచి సన్మానం ఉందా! అక్కడక్కడా ఈ పాటికే అటువంటి సన్మానాలు చేస్తున్నారు.APNGC meetings లో అయితే మొక్కలు ఇస్తారు. కొన్ని సాహిత్య సమావేశాల్లో పుస్తకాలు ఇస్తారు. మరి అన్ని సన్మానాలకు మొక్కలు లేదా పుస్తకాలు ఇస్తే బాగుంటుంది కదా! మొక్కలు ప్రకృతి పరిరక్షణకు,పుస్తకాలు జ్ఞానసముపార్జనకు పనికి వస్తాయి కదా!

         సన్మానం ఘనంగా చేయాలి అనుకుంటే పెద్ద మొక్కలు, గ్రంధాలు ఇవ్వవచ్చు. గుర్తుగా ఒక జ్ఞాపికను ఇచ్చుకోవచ్చు.పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమాజంలో చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. అలాగే మొక్కలు నాటే సంస్కృతి పెరుగుతుంది.

           ప్రభుత్వమే రాబోయే september 5 న ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానాల నుండే ఇలా చేయొచ్చు. తరువాత వారికి పాఠశాల స్థాయిలో మొక్కలు,పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని అభినందించవచ్చు.ఏదయినా ఒక మంచి ఎక్కడో ఒకచోట మొదలు కావాలి.

       ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,రాజకీయ నాయకులు, నూతనంగా పదవులు పొందే వారు ఇలా మొక్కలు పుస్తకాలు ఇవ్వడం మొదలు పెడితే సామాన్య ప్రజలు కూడా ఈ అలవాటును ఆచరిస్తారు. కనుక ఈ దిశగా సమాజం అంతా ఆలోచిస్తుందని, మొదటగా ఉపాధ్యాయులుగా మనం ఇందుకు మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటున్నాను 

ఒద్దుల రవిశేఖర్

స్వచ్ఛ అక్ష్యరాస్యత(Clean literacy)

 Clean literacy (స్వచ్ఛ అక్షరాస్యత )

FA1 పరీక్షల మార్కులు upload చేసి cluster meetings కు హాజరవుతున్న ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్తే 

      FA1 పరీక్షా పత్రాలు దిద్దే క్రమంలో విద్యార్థులు వ్రాసిన భాషను గమనించి ఉంటారు కదా అందరు.అన్ని subject లలో విద్యార్థులు తప్పులు లేకుండా వ్రాయగలిగారా! తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల పరిస్థితి ఏంటి? ఇక ఇంగ్లీష్ మీడియంలోకి మారిన Maths, P.S N.S, Social పరిస్థితి ఏమిటి? ఎంత మంది అక్షరాలు, పదాలు, వాక్యాలు తప్పుల్లేకుండా సరిగా వ్రాయగలిగారు.

మన చదువుల విషాదం ఏంటంటే ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయంలో విద్యార్థులు ఇంకా సమస్యలు ఎదుర్కోవడం.అసలు పాఠం అర్ధం కావాలన్నా, నేర్చుకోవాలన్నా పై రెండు ప్రక్రియలు రాక పోతే ఎలా సాధ్యం?మనకున్న syllabus, exams,వివిధ కార్యక్రమాల నడుమ ప్రాధమిక ప్రక్రియలైన చదవడం, వ్రాయడం ప్రక్రియల పై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.కానీ ఈ సమస్య ను గుర్తించే FLN కి ప్రాధమిక స్థాయిలో ప్రాధాన్యత పెంచారు. మరి ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితిలో పిల్లలు english లో ప్రశ్న చదవడం,దాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకొని వ్రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే 10 వ తరగతి కి వచ్చే సరికి ఆ విద్యార్థులు పూర్తిగా వెనుక బడిపోతారు.అప్పటికి ఎలాగోలా బయట పడ్డ తరువాత చదువు కొనసాగించ లేక మానేస్తారు.

కనుక అందరు ఉపాధ్యాయులు తమ తమ subject లలో చదవడం, వ్రాయడం విషయం లో పిల్లలను వర్గీకరించుకొని, group leaders సహాయంతో పదాలు,వాక్యాలను ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడంలో  నైపుణ్యం సంపాదించే టట్లు విద్యార్థులను తీర్చి దిద్ది  స్వచ్ఛ అక్షరాస్యత సాధించేందుకు ముందుకు రావలసినదిగా అభ్యర్థిస్తున్నాను..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 20 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

 చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

గత రెండు వ్యాసాల సారాంశం:గణితం, సైన్స్, సోషల్ subject లు english medium లో మాత్రమే ఉండటంతో వాటిని కూడా ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం నేర్చుకోవడానికి అందులోని పాఠాల్లోని పదాలను అక్షరాల సంఖ్య కు అనుగుణంగా విభజించి వ్రాయించి group leaders సహకారంతో నేర్పించడం.ఈ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా మంది ఉపాధ్యాయులను ఆకర్షించడం, చాలా మంది ఉపాధ్యాయులు స్పందించడం జరిగింది. ఇంకో వ్యాసంలో వారిని గురించి వివరిస్తాను.

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుండి 5 వ తరగతి పిల్లలకు నేర్పించడానికి FLN( Foundational Literacy and Numeracy ) శిక్షణను ఉపాధ్యాయులకు అందిస్తూ ఈ దిశగా పెద్ద ప్రయత్నమే చేస్తుంది. NEP 2020 లో FLN కు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.ఉన్నత పాఠశాలల్లో 6 వ తరగతికి readiness program  కూడా అమలు చేస్తున్నారు. వీటి లక్ష్యం ఒక్కటే భాషలు చదవడం, వ్రాయడం రావాలి అని.

         కనుక ఉన్నత పాఠశాలల్లో ని అన్ని subject ల ఉపాధ్యాయులు  తమ తరగతి లోని పిల్లల్లో చదవడం, వ్రాయడం తాము చెప్పే పాఠాల్లో ఎలా ఉందో పరీక్షించుకుంటే అర్థం అవుతుంది. అప్పుడు పిల్లల్ని groups గా విభజించి group leaders ను నియమించి చదవడం, వ్రాయడం రాని వారికి నేర్పించే లాగా చేయాలి.      ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని follow up చేయాలి. మొదటి 3 పాఠాలు ఇలా చేస్తే పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గణితం, సైన్స్, సోషల్ పాఠాలను తప్పుల్లేకుండా చదవడం,వ్రాయడం నేర్చుకుంటారు. అప్పుడు ఆయా పాఠాలు వారికి అర్థం అవుతాయి. తరువాత వాటిని నేర్చుకోవడానికి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.    ఈ విధానం నేను ఆచరిస్తున్నాను. చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీరు కూడా ఆచరిస్తారని, మీరు ఇంకా వినూత్నంగా ఆచరిస్తే తెలియజేస్తారని పిల్లల్లో ఈ సమస్యను నివారించడానికి మనమందరం కృషి చేద్దాం అని కోరుకుంటున్నాను. మొదటి రెండు వ్యాసాలను క్రింది link లలో ఉన్న నా blog లో చదవండి.

1)https://ravisekharo.blogspot.com/2025/06/blog-post.html

2)https://ravisekharo.blogspot.com/2025/07/blog-post.html

ఒద్దుల రవిశేఖర్ SA(PS) 9492124454

Monday, 7 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* *నేర్పిద్దాం* ( 2)

             పోయిన సారి వచ్చిన మెదటి వ్యాసానికి ఇది కొనసాగింపు.ఇంతకు ముందు వ్యాసానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పందన వచ్చింది. ఫోన్ లో వాట్సాప్ లో మిత్రులు పలకరించారు. కొంత మంది మేము కూడా మెదలు పెడతామని, మరికొంత మంది తాము చేసిన విధానాల గురించి వివరించారు.                                         సహజంగా తరగతి గదిలో మనకున్న వ్యవధి తక్కువ. Syllabus పూర్తి చేయడం పరీక్షలకు  సిద్ధం చేయడం వంటి వాటికే సమయం చాలదు అనుకుంటాం.ఒక సారి మనం వెళ్లే తరగతి పిల్లలకి ఆయా subjects ఉపాధ్యాయులు వారి పాఠాలను చదివించడం, dictation చెబితే ఎంత మంది వెనుకబడి ఉన్నారో అర్థం అవుతుంది. లేదా పరీక్షా పత్రాలు దిద్దుతున్నప్పుడు వాళ్ళు వ్రాసింది చూస్తే పరిస్థితి మరింత అర్ధం అవుతుంది. మనం చెప్పిన పాఠం చదవడం రాక వాటిని పరీక్షలో వ్రాయలేక పోతే మనకే అనిపిస్తుంది కదా అయ్యో ఇలాగే వీళ్ళు 10 వ తరగతి వరకు వెడితే అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది కదాని!          అందుకని పై రెండు అంశాల్లో అన్ని తరగతుల్లో విద్యార్థులను గుర్తించి అందరు ఉపాధ్యాయులు వారి వారి subject లలో నేర్పించగలిగితే విద్యార్థుల్లో చదువు పట్ల ఇష్టం ఏర్పడుతుంది. బడి తెరిచాక నేను ఈ విధానం అమలు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఈ కృత్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. మెదటి పాఠంలోని పదాలన్నీ రెండు, మూడు.... అక్షరాల పదాలుగా వర్గీకరించుకుని గ్రూప్ leaders సహాయంతో పిల్లలే నేర్చుకుంటున్నారు. 4,5 అక్షరాల పదాల వరకు ఇంగ్లీష్ భాషా పదాలే ఎక్కువగా ఉంటాయి. 6 అక్షరాల పదాల నుండి PS Subject పదాలు ఎక్కువగా వస్తున్నాయి.రెండవ పాఠం నుండి నేర్చుకున్న మొదటి పాఠం లోని పదాలు తీసివేస్తే చాలా వరకు కొత్త పదాలు తగ్గిపోతుంటాయి.రెండు మూడు నెలలపాటు 3 పాఠాల్లో ఇలా చేస్తే తరువాత వారికి చదవడం, వ్రాయడం వచ్చేస్తుంది. తరువాత కూడా సంవత్సరమంతా group leaders వారిని follow up చేసే విధంగా చేయాలి.               కొద్దిగా మనం ఈ విషయం ఆలోచించి ప్రయత్నం చేస్తే తప్పకుండా పిల్లలు నేర్చుకుంటారు. మీరు చేసే ప్రయత్నాలు, వినూత్న విధానాలు నాకు తెలియజేయండి. మన అనుభవాలను సంకలనం చేద్దాం.ఈ వ్యాసాన్ని మన ఉపాధ్యాయ మిత్రులకు whatsapp, telegram, Facebook ఇలా అన్ని social media గ్రూప్ ల ద్వారా share చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు ఈ సమస్య నుండి బయట పడాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఒద్దుల రవిశేఖర్ SA(PS)

Monday, 30 June 2025

ధారాళంగా చదవడం -శుద్ధంగా వ్రాయడం

 *ధారాళంగా* *చదవడం* , *శుద్ధంగా* *వ్రాయడం* :

భాషలు నేర్చుకోవడానికి LSRW ప్రక్రియను పాటిస్తుంటారు. Listening, Speaking, Reading, writing. పాఠశాలల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలు ఉంటాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా English medium అమల్లో ఉన్నందున Maths, Physical and Biological sciences,Social కూడా english భాష లోనే నేర్చుకోవలసి వస్తుంది. English లో ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం రాకపోతే ఈ subjects నేర్చుకోవడం సాధ్యం కాదు.English ఉపాధ్యాయులు ఈ విషయాలపై విశేషంగా శ్రమిస్తున్నా Non language subject లలో వచ్చే పదజాలం english subject పాఠాల్లో ఉండకపోవడం వల్ల కూడా విద్యార్థులు వాటిని చదవడం, వ్రాయడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

               ఈ సమస్య ను అధిగమించడానికి నాకు వచ్చిన ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం మా పాఠశాల లో మొదలు పెట్టాను. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజు నుండే 7 వ తరగతి గణితం 8,9,10 తరగతుల భౌతిక శాస్త్రం మెదటి పాఠాల్లోని అన్ని english పదాలను అక్షరాల సంఖ్యకు( రెండక్షరాల, మూడ క్షరాల......... పదాలు )అనుగుణంగా విద్యార్థులతో notes లో వ్రాయించాను. బాగా చదివి వ్రాయగలిగే పిల్లల్ని group leaders గా పెట్టాను. వీరు తమ group లోని పిల్లలకు ఆయా పదాలను పలకడం వ్రాయడం లో సహాయం చేస్తుంటారు. నేను ప్రతి రోజు follow up చేస్తుంటాను. తరగతి లో కొద్ది సేపు విద్యార్థులతో పదాలను చదవడం వ్రాయడం లో పోటీ పెడుతుంటాను.అలాగే కొద్దిసేపు వాక్యాలు చదివిస్తాను. అలాగే ప్రతిరోజు ఇంటి దగ్గర పాఠాన్ని తెలుగు english భాషల్లో రెండు సార్లు చదివేలా ప్రోత్సాహిస్తుంటాను.

             పాఠం ఎప్పుడైతే చదవడం బాగా వస్తోందో వ్రాయడం తప్పుల్లేకుండా వ్రాస్తారో అప్పుడే విద్యార్థికి ఆత్మ విశ్వాసం కలిగి ఆయా అంశాలను నేర్చుకొని పరీక్షల్లో వ్రాయ గలుగుతారు. ఈ విషయాలను గమనించి గణితం, PS&BS, సోషల్ ఉపాధ్యాయులు తమ పాఠాల్లోని పదజాలం విద్యార్థులకు నేర్పిస్తూ,చదివిస్తూ ఉంటే విద్యార్థుల్లో ఆయా subject లలో మంచి ప్రగతి నమోదు అవుతుంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు తమ భాషలు చదవడం, వ్రాయడం లో విద్యార్థులను ప్రావీణ్యులుగా చేయడానికి మరింతగా కృషి చేస్తారని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.    

             అందరం కలిసి విద్య కు పునాది అయినటువంటి ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయాల్లో కలిసికట్టుగా కృషి చేసి విద్యార్థుల విద్యాభి వృద్ధికి కృషి చేద్దామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.తెలంగాణ లో కూడా English medium ఉంది కనుక ఈ విషయాన్ని పరిశీలించ గలరు.ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ, అన్ని Fb, telegram ఉపాధ్యాయ whatsapp, groups ద్వారా share చేయగలరు. పై విషయం పై ఎవరయినా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తున్న మిత్రులు తెలియజేయగలరు.

 ఒద్దుల రవిశేఖర్ SA(PS).

Wednesday, 1 January 2025

BIS వారి పరిశ్రమల యాత్ర

 

*BIS* *వారి* *పరిశ్రమల* *సందర్శన* *యాత్ర* :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ వారు ఏర్పాటు చేసిన పరిశ్రమల సందర్శన లో భాగంగా ZPHS చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు కడప జిల్లా బద్వేలుకు
సమీపంలోని సెంచరీ ప్లై వుడ్ కంపెనీ ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో BIS తరపున G. కిషోర్ గారు హాజరయ్యారు. మొదటగా పాఠశాల లో BIS కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ Y. శ్రీనివాస రావు,ఉపా ధ్యాయులు ఒ.వి. రవిశేఖర రెడ్డి( మెంటర్ BIS), ఒ.నరసింహారావు 8,9 వతరగతుల  విద్యార్థులు 26 మంది తో కలిసి సెంచరీ కంపెనీ సందర్శనకు బయలు దేరారు. కంపెనీ యాజమాన్యం సా దరంగా ఆహ్వానించి, కంపెనీని త్రిప్పి చూపించి విద్యార్థులకు వివరించడానికి ఇద్దరు ఉద్యోగులను కేటాయించారు.సుబాబుల్,మామిడి కర్ర ను ఉపయోగించి ప్లై వుడ్ తయారు చేస్తారని చెప్పారు. అంతా ఆటోమేటిక్ మిషన్ ల ద్వారా జరుగుతుందని కర్ర ను ముక్కలయ్యే దశనుండి చివరకు ప్లై వుడ్ తయారయ్యేంతవరకు వివిధ దశలను చూపిస్తూ వివరించారు. అన్ని యంత్రాలను కంప్యూటర్ ద్వారా గమనిస్తుంటారు. విద్యార్థులు తమ సందేహాలను అడుగుతు చాలా ఆసక్తిగా కంపెనీ లోని అన్ని విషయాలను తెలుసుకున్నారు. యంత్రాల పని తీరు, నిర్వహణ విధానం, అయిన ఖర్చు ను తెలుసుకుని ఉత్పత్తి అయిన వుడ్ ను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చక్కని ఆతిధ్యం ఇచ్చి విద్యార్థులకు అన్ని విషయాలను వివరించిన కంపెనీ యాజమాన్యానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియ జేశారు.

Thursday, 26 December 2024

SHEROES పుస్తకావిష్కరణ


ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారంటే ఒక auditorium లో ఆ పుస్తకం గురించి మాట్లాడే కొద్ది మంది వక్తలు, ప్రేక్షకులు,రచయిత ఆ కార్యక్రమంలో ఉంటారు.వక్తలు మాట్లాడిన తరువాత ఓ నాలుగు పుస్తకాలు విడుదల చేసి సభను ముగిస్తారు ఎక్కడయినా.ఆ విధానాన్ని SHEROES పుస్తక విడుదల కార్యక్రమం బ్రద్దలు కొట్టింది. Dr శివ ఆర్ జాస్తి, అహల గార్లు రచించిన ఈ పుస్తకం ఆంగ్లం లో జనవరిలో విడుదల కాగా ప్రస్తుతం వంగపల్లి పద్మ దానికి తెలుగు లోకి అనువాదం చేయగా విడుదల చేసే కార్యక్రమం ఇది.256 మంది ధీర వనితల జీవితాలను గురించి క్లుప్తంగా వివరిస్తూ వారు సాధించిన అనుపమాన మైన లక్ష్యాలను నేటి బాలలకు పరిచయం చేయడం ద్వారా వారిలో ప్రేరణ నింపడానికి రచయితలు ఈ పుస్తకం ద్వారా ప్రయత్నించారు.ఈ పుస్తకానికి బాబు డుండ్రపల్లి వేసిన బొమ్మలు అద్భుతమైన అందాన్ని తీసుకొచ్చాయి.అందరు SHEROES బొమ్మలు ప్రదర్శనగా ఉంచడం ప్రత్యేక ఆకర్షణ.అదనంగా మరో 100 మంది SHEROES ను గుర్తించారు మరో సంచికలో చేర్చడానికి. మొత్తం దాదాపుగా 350మంది బాలికలచే SHEROES పాత్రల ఏకపాత్రాభినయాలు చేయించి వారిలోని ప్రతిభ ను ఈ సందర్భంగా గుర్తించడం ప్రశంసనీయం. ప్రతి రూమ్ లో 40 మంది చొప్పున 8 గదుల్లో 350 మంది బాలికలు ప్రదర్శన ఇవ్వగా వారిని 16 మంది జడ్జి లు పరిశీలించి ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక చేసి వారిచే సభలో మరల వారి ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు.మధ్యాహ్నం ఈ పుస్తకం లోని కొంతమంది SHEROES అయిన ఉషా ముళ్ళపూడి, శ్యాల తాళ్లూరి, వంగపల్లి పద్మ, ఓల్గా, వంటి వారితో పుస్తక ఆవిష్కరణ చేయించారు. 350 బాలికలకు ఈ పుస్తకాలు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు బహుకరించారు.ప్రసాద్ గారు ఇందులో పాల్గొనే బాలికలను,తల్లిదండ్రులను సమన్వయం చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు.ఇంకా NRIVA నుండి పందిరి శ్రీనివాస్ గారు కార్యక్రమ సమన్వయ కర్త గా చక్కని పాత్ర పోషించారు.Oxford పాఠశాలను వేదికగా ఇచ్చినందుకు పాఠశాల అధినేత వేదకుమార్ గారికి పుస్తక రచయితలు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఒద్దుల రవిశేఖర్

పుస్తకాల పండక్కి వెళ్ళొద్దాం


పుస్తకం మస్తకపు ద్వారాలను తెరిచి విశాల ప్రపంచాన్ని చూపిస్తుంది. కాలం ఎంత మారినా పుస్తకం చేతికి తీసుకుని చదువుతూ ఉహించుకుంటూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ మజానే వేరు.పుస్తకపు పరిమళం అక్షరాల ద్వారా వెదజల్లబడుతుంది.దాన్ని గ్రోలుతూ ఉంటే మనస్సు విభిన్న భావోద్వేగాలకు లోనవుతుంటే ప్రపంచం మన ముందు సాక్షాత్కారించి నట్లుంటుంది. ఎందరో కవులు,రచయితలు తమ సృజనాత్మకతకు,మేధస్సుకు పదును పెట్టి ఎన్నో విలువైన విషయాలు మనకందిస్తుంటే మనం అతి సులభంగా ఆ జ్ఞానాన్ని అనుభూతిని పొందు తున్నాం.

ఇక విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగే పుస్తకాల పండుగ గురించి. ఎన్ని వందల స్టాళ్ల లో ఎన్ని వేల పుస్తకాలు కొలువు దీరి ఉన్నాయో, పుస్తక ప్రియులను రా రమ్మని ఆహ్వానిస్తూ! తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలా విభిన్న భాషల్లో మనల్ని ఆనందింప జేయడానికి సిద్ధంగా ఉన్నాయి.ఎంతో మంది కవులు,రచయితలు తమ పుస్తకాలను స్వయంగా అమ్ముతున్నారు. ఆ ప్రాంగణంలో పుస్తక ఆవిష్కరణలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు,పిల్లల ప్రదర్శనలు, రకరకాల తినుబండారాలు ఇలా ఓ పండుగనే తలపిస్తుంది. వేల మంది ఎంతో ఆసక్తిగా పుస్తకాలు చూస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ కొంటున్నారు. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రులు పరిచయం కావడం ఓ అదనపు ప్రయోజనం.

ప్రతి ఒక కుటుంబం తమ పిల్లలతో కలిసి తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇది.చదివే అలవాటు లేని వారు కూడా ఒక్క సారి సందర్శిస్తే ఏదో ఒక పుస్తకం కొనక మానరు.పిల్లలకు ఇప్పటినుండే విభిన్న పుస్తకాలు చదివే అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు చదవడం అలవాటయితే జీవితాంతం ఆ అలవాటు మానరు. వారికి మీరు ఇచ్చే అతి గొప్ప బహుమతి పుస్తకం అయితే చదవడం నేర్పే అలవాటు వారి జీవితాలను అత్యున్నత స్థాయికి తీసుకు వెడుతుంది.

చివరగా ఇంకో 4 రోజులు అంటే 29/12/24 9:00PM వరకు మాత్రమే NTR Stadium (దాశరధి కళా ప్రాంగణం ), ఇందిరాపార్క్ దగ్గర హైదరాబాద్ లో ఈ పండుగ జరుగుతుంది. ఒక్కసారి ఈ పండక్కి వెళ్లిరండి .

 ఒద్దుల రవిశేఖర్(https://www.facebook.com/share/p/15ZfRWHbbW/)

Sunday, 15 September 2024

47.పాటల పూదోట

 హిందీ musical language. మాటలు పాటలుగా ఒదిగే భాష. మహేంద్రకపూర్ పాడిన ఈ old melody వినండి. ప్రకృతిలోని మేఘం, ఆకాశం, జలపాతాలు, పర్వతాలు, ఇలా అన్నిటిని వర్ణిస్తూ విహరిస్తూ, వర్ణిస్తూ మనల్ని మైమరిపించేలా చేసే ఈ గీతం వింటుంటే ఇలా కదా జీవించాల్సింది వర్తమానంలో ప్రకృతితో కలిసి అనిపిస్తుంది.(https://youtu.be/904vZjjVhJU?si=MVJM9hek7E-K8s1L)

పుట్టినరోజు మొక్కలు నాటి పెంచడం.... ఈనాడు వార్త



పుడమికి పచ్చదనమే ఊపిరి


• మొక్కల పెంపే లక్ష్యంగా ముందడుగు •


భావితరాలకు మార్గదర్శకులు ఆ ఉపాధ్యాయులు


పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం కీలకమని గుర్తించిన ఆ మాస్టార్లు కేవలం వాటిని పాఠాలకే పరిమితం చేయలేదు. విద్యార్థులకు భవిష్యత్తు నిర్దేశనం చేసే మార్గదర్శకులుగా మారారు. తాము పనిచేస్తున్న పాఠశాలలోనే అటు విధులు నిర్వహిస్తూ ఇటు పచ్చదనానికి శ్రీకారం చుట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే మార్కాపురం పట్టణానికి చెందిన ఉపాధ్యా యులు ఒద్దుల రవిశేఖర్ రెడ్డి, ఎం.శ్రీనివాస్


న్యూస్ టుడే, మార్కాపురం పట్టణం


పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్న రవిశేఖర్ రెడ్డి 


పుట్టిన రోజు గుర్తుండి పోయేలా...


ఒద్దుల రవిశేఖర్ రెడ్డి తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొక్కల పెంపకంపై అమితమైన ఆసక్తి ఉన్న ఈయన తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో పచ్చదనం పెంపునకే ప్రాధా న్యమిచ్చారు. విద్యార్థులను ఆ బాటలో నడిపేందుకు విద్యార్థుల పుట్టిన రోజు సంద ర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల పుట్టిన రోజులను ముందుగానే రాసు కొని వారికి ఆ విషయాన్ని గుర్తు చేసి మొక్కలు తెప్పించి పుట్టిన రోజు నాటేలా చూశారు. దీంతో ఆ పాఠశాలలో ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది తన సొంత ఖర్చులతో కొంత, దాతల సహకా రంతో మరికొంత నగదును పోగు చేసి వివిధ రకాలు మొక్కలు కొని నాటుతున్నారు. సపోట, దానిమ్మ, సీతాఫలం, నేరేడు, బాదం, బత్తాయి వంటి మొక్కలతో పాటు కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 13 సంవత్సరాలుగా ఆయన పనిచేసే ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం. మొక్కల పెంపకానికి సంబందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Thursday, 12 September 2024

పుట్టిన రోజు మొక్కలు నాటడం

               పుట్టినరోజు ఎవరికయినా మధురమైన రోజు. పుట్టిన రోజులు ఎంతో వైభవంగా,ఘనంగా ఆడంబరంగా జరపటం చూస్తున్నాము.అలాగే సంపన్నులు,రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.పిల్లల పుట్టిన రోజులు మరింత వేడుకగా చేస్తుంటారు. పుట్టిన తరువాత మొదటి,రెండు సంవత్సరాలు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరుపుకుంటే బాగుంటుందేమో!

          ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు.ఇది అంతా మామూలే!కానీ ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది,కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి, పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము. వారి పుట్టినరోజు లు ఒక నోట్స్ లో వ్రాసుకొని ముందుగానే వారికి గుర్తు చేసి వారి పుట్టినరోజు మొక్కలు తెచ్చేలా ఏర్పాటు చేసి మొక్కలను ప్రార్ధనా సమావేశంలో ప్రధానోపాధ్యాయులకు ఇస్తూ పిల్లలకు photos తీయడం,పిల్లలందరితో జన్మదిన శుభాకాంక్షలు చెప్పించడం మొక్కలు నాటేటప్పుడు వారి తరగతి మిత్రులతో శుభాకాంక్షలు చెప్పిస్తూ photos, వీడియో తీసి వారి తల్లి దండ్రులకు పంపడం చేయడం వలన విద్యార్థులందరు మొక్కలు పాఠశాల కు బహుకరిస్తున్నారు. తరువాత వాటి సంరక్షణ, పెంపకం బాధ్యత లు తరగతుల వారీగా సిమెంట్ తో కట్టిన పెట్టెల్లో విద్యార్థులే చూసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు chacolates, sweets పంచే విధానం అందరు మానుకున్నారు.ఈ కార్యక్రమం HM Y. శ్రీనివాస రావు గారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సాగుతోంది.

          ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా ఇలా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినా   ఏటా 800 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!

మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి  బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !భూమికి మనం చూపించాల్సిన కృతజ్ఞత మొక్కలు నాటి పెంచడం కన్నా మరేముంటుంది!........ఒద్దుల రవిశేఖర్

Sunday, 14 January 2024

46. పాటల పూదోట

 శ్రీమణి కలం నుండి జాలువారిన అచ్చ తెనుగు నుడికారం అనురాగ్ కులకర్ణి, రమ్యల మృదు మధుర స్వరాల్లో నింపి పల్లె అందాలను సంగీతం తో తో జత చేసి సినిమా కాన్వాస్ పై పరిచిన ఈ మనోజ్ఞ గీతం శతమానం భవతి చిత్రంలోనిది.మూలాలను, అనుబంధాలను గుర్తు చేసే ఈ సినిమాను ఓ సారి చూడండి.దర్శకుడు వేగేస్న సతీష్ maru(https://youtu.be/e5T1gbGJuAc?si=UWbBj0m4l8ei6wyV)

Thursday, 11 January 2024

45. పాటల పూదోట

 ఘంటాడి కృష్ణ తక్కువ instruments వాడి చక్కని melody పలికించాడు.యాదగిరి చిక్కని తెలుగు పదాలు ఉన్నికృష్ణన్ స్వరంలో కొత్త సొబగులు అద్దుకున్నాయి.పాట వింటున్నంత సేపు మనసు హాయిగా, హృదయం దూది పింజలా తేలిపోతుంటుంది. (https://youtu.be/gVwsAZlHE8M?si=7eTJqJ_rvLasYbmp)

Wednesday, 10 January 2024

నరసింహుడు -ఇప్పటి భారత దేశ నిర్మాత కథ


రచయత :వినయ్ సీతాపతి

అనువాదం :జి.వళ్ళీశ్వర్, టంకశాలఅశోక్,కె.బి గోపాలం 

పుస్తకపరిచయం :ఒద్దుల రవిశేఖర్

భారత దేశానికి స్వాతంత్ర్యo వచ్చిన తరువాత 44 ఏండ్ల వరకు ఒక దశగా తరువాత ఒక దశగా దేశ ఆర్ధిక విధానాన్ని విభజించి చూడాలి. మొదటి దశలో సోషలిస్ట్ దృక్పధంతో సాగిన ఆర్ధిక వ్యవస్థ 1991 నుండి సరళీకరించిన ఆర్ధిక వ్యవస్థగా మార్పు చెందింది. ఈ మార్పుకు కారణం అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం గురించి సవివరంగా వివరించారిందులో.మొట్ట మొదటి పార్లమెంట్ ఎన్నికల్లోనే నరసింహా రావు రాజకీయ రంగప్రవేశం చేశారు.రాజకీయాలు,పరిపాలన,ఆర్ధిక వ్యవస్థ లు నడిచే తీరు తెన్నులు తెలుసు కోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.అధికారం లో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడం లో ఎదురయ్యే ఆటంకాలను వ్యక్తిగత వ్యవహార శైలితో ఎలా అధిగమించవచ్చో ఇందులో గమనించవచ్చు. నరసింహారావు తీసుకు వచ్చిన సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను చాలా వరకు మార్చి వేసాయి.ఆర్ధిక సంస్కరణ వల్ల రహదారులు, విమానయానం,టెలిఫోన్,T. V రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.భారత దేశం కత్తి అంచుపై నడవ వలసి ఉంటుందని ఆయన అంటుండేవారు.ఈ పుస్తకాన్ని రచయిత ఆసక్తికరంగా మలిచారు.ఈ పుస్తకం లో ని కొన్ని అంశాలు

• నరసింహా రావు బహుభాషా కోవిదుడు.10 భాషలు వచ్చు. గ్రంథ రచయిత కూడా.

• • నర్సింహా రావు రచనలు " The insider ", The other half 

• Analysis until paralysis (కొంప మునిగే దాకా మీనమేషాలు లెక్కించడం )

• కొన్ని సందర్భాలలో నోరు తెరిచి తీవ్రంగా స్పందించడం కన్నా నోరు మూసుకుని కూర్చోవటమే అత్యుత్తమ స్పందన

• రాఘవ పాండవీయం.... ఒకే పదాలు ఒక అర్థం లో రామాయణం మరో అర్థం లో భారతం చెబుతాయి.

• ఈయన హయాం లో మానవ వనరుల శాఖ సృష్టి జరిగింది.

• మార్పు ఒక్కటే శాశ్వతం

• సంస్కరణలు క్రమంగా చోటు చేసుకోవాలి. గతం లోని ఉత్తమ లక్షణాలు స్వీకరించి వాటిని మెరుగు పరచాలి.

• మనకు నిర్వచనమనే ఒక గొప్ప సంప్రదాయం ఉంది.దానిని భాష్యకార అంటారు.

• అసమ్మతి అన్నది సంప్రదాయం లో భాగం. ప్రధాన సంస్కృతులను అంతర్గతంగా సంస్కరించటం భారతదేశపు సంప్రదాయం.

• హామ్లెట్ ఆలోచనలు గల నిష్క్రియాపరుడు.క్విక్సోట్ ఆలోచించని విప్లవకారుడు

Sunday, 7 January 2024

యాదగిరి గుట్ట (తెలంగాణ ) సందర్శన

 ఎప్పటినుండో చూడాలి అనుకున్న యాదగిరి గుట్ట ను అభివృద్ధి చేసాక చూడడం ఆనందం కలిగించింది. MGBS(Hyderabad , busstand) 10 గంటల కల్లా చేరు కోగానే కుప్పలు తెప్పలుగా జనం ఉన్నారు. ఎక్కడికి వీరంతా అనుకుని కొందరిని అడిగితే వారంతా గుట్ట కే అని చెప్పారు.3 భాగాలు మహిళలే కనిపించారు.తెలంగాణ లో కొత్త గా వచ్చిన ప్రభుత్వం RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.ticket ధరలు తగ్గించి ఉంటే బాగుండు అని మహిళలే అన్నారు. అత్యవసర ప్రయాణీకులకు సమస్య గా మారింది.6 వ bus అతి కష్టం మీద seat దొరికించుకుని బయలు దేరాం. City దాటేసరికి గంట పట్టింది.65 km ప్రయాణానికి రెండున్నర గంట పట్టింది. దారిలో భువనగిరి కోట కొండపై కనిపించింది. ఆ కొండంతా ఒకటే బండ లాగా ఉంది.ఇహ గుట్ట bus stand దిగాక కొండపైకి వెళ్లే దేవస్థానం ఉచిత bus ఎక్కే సరికి యుద్ధం చేసినంత పని అయింది. కొండ చుట్టూ మొక్కలు, పచ్చిక తో పచ్చగా ఉంది. Bus stand చుట్టూ shoping complex కట్టారు. యాత్రికుల కోసం ఎదురుగా కొండపైన విల్లాస్ కట్టారు. కొండపైకి నూతన రహదారి కోసం flyover గా కట్టారు. Car పైకి వెళ్లాలంటే ₹500 ticket పెట్టారు కొండ పై స్థలాభావం వల్ల.ఒకటే private canteen ఉంది భోజనానికి. Tiffin తిన్నాం.కొండ చుట్టూ కోట లాగా గోడ పునర్ నిర్మించారు. ఉన్న స్థలం లోనే వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు.ఇంకా కొండ క్రింద పూర్తి చేయవలసిన పనులు ఉన్నాయి. Shopping complex లు మొదలు కాలేదు.సెలవు రోజుల్లో కాకుండా వారం మధ్యలో వెళ్లడం మంచిది.

Monday, 1 January 2024

కాలం నుంచి నేర్చుకుందాం


మంచు కరుగుతుంది.... అది ఉష్ణ ధర్మం.కాలం కరుగుతుంది.... అది విశ్వ ధర్మం.కాల చక్రం గిరగిరా తిరుగుతుంది. అసలు కాల భావనను ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి జీవ రాశి తెలుసుకుంది. పక్షులు జంతువులు ప్రకృతికి అనుగుణంగా, కాలానుగుణంగా జీవిస్తుంటాయి. మొదట్లో మనుషులు అలానే జీవించారు.ప్రస్తుతం మనుషులు పకృతికి విరుద్ధంగా కొండొకచో ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే మరో సంవత్సరం కాల గర్భం లో కలిసిపోయింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి.

మరి కాలం నుండి ఏం నేర్చుకోవాలి. కాల గమనం మన ఆలోచనా తీరుపై ఏదయినా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు ఆలోచిద్దాం.కాలం నిత్య నూతనం. మనం మాత్రం వయసు పెరిగే కొద్ది ఎన్నో శారీరక,మానసిక మార్పులకు లోనవుతుంటాం. మన అనుభవాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటాయి. యువత నూతన అనుభవాల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. పెద్దలు తమ అనుభవాలను వారికి పాఠాలుగా చెప్పాలను కుంటారు. పిల్లలు,విద్యార్థులు, యువత తాము చేసి చూసి తెలుసుకోవాలను కుం టారు. రెండింటి మధ్య సమతుల్యత అవసరం. కాలం నిత్యం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది.పరీక్షలను తట్టుకోవాలి మరెన్నో సవాళ్లు విసురుతుంది. సవాళ్ళను ఎదుర్కోవాలి.వాటిని తట్టుకుని ముందుకు వెళితే అందమైన ఆనందమైన భవిష్యత్ ఉంటుంది. ఎన్నో సాధించాలి అనుకుంటాం,ప్రణాళికలు వేసుకుంటాం. కొంతమంది విజయం సాధిస్తుంటారు.ఎక్కువమంది వైఫల్యం చెందుతుంటారు.గెలుపైనా ఓటమైనా తాత్కాలికం. వాటిని అర్ధం చేసుకుని అందుకనుగుణంగా మన వ్యవహరించాలి. గెలిచామని విర్ర వీగ కూడదు. ఓటమికి క్రుంగి పోకూడదు. ఉదయిస్తూ సూర్యుడు ఉత్తే జాన్నిస్తాడు.సాయంత్రం అస్తమిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటాడు. తనలోని దశలన్నీ మానవ జీవితం లో ఉంటాయని అన్నింటిని దాటుకుని నాలాగా పూర్ణ బింబంలా జీవించమని, నిండు పున్నమి మీ జీవితాల్లో ప్రసరిస్తుందని జాబిల్లి మనకు నేర్పిస్తుంటాడు. సృష్టి లో ప్రతిదీ చలనం లో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ, సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. మనం కూడా విభిన్న ప్రాంతాలను చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆ స్వాదిస్తూ,వైవిధ్యమైన సంస్కృతులను తెలుసుకుంటూ ఉంటే మనసు,హృదయం విశాలం అవుతుంది.ఇలా కాలం మనకెన్నో నేర్పుతుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 31 December 2023

44. పాటల పూదోట

 Harris jayaraj music వింటుంటారా. ఇది చాలా heart touching song. మధ్యలో వచ్చే వేణుగానం,మిగతా instruments వింటుంటే మనసు మబ్బుల్లో తేలిపోతుంది.Parth Dodiya mashup చాలా సున్నితంగా హృదయాన్ని స్పృశిస్తుంది.(https://youtu.be/cDLL8FHhLc8?si=nPWjiHf-qBZ89xqo)

43. పాటల పూదోట

 G.V.Prakashkumar మంచి talent ఉన్న music director.ఈ పాట ఒక మంచి ప్రయోగం. రూప్ కుమార్ రాథోడ్ స్వరం విభిన్నంగా గమకాలు పలికిస్తుంటే హరిణి వినసొంపుగా పాడిన ఈ గీతం వినండి.(https://youtu.be/no4pZ4EwE_o?si=Iev-cloanjU20xM-)

42. పాటల పూదోట

 సంగీతం, సాహిత్యం, గానం, అభినయం,ఫోటోగ్రఫీ దర్శకత్వం శిఖరాగ్ర స్థాయికి చేరితే ఈ పాటవుతుంది. ఆకాశం కాన్వాసుపై,కడలి అలలపై,చిక్కని భావోద్వేగాలతో చిత్రీకరించిన గీతమిది. బాలు గళం అజరామరం వాణి జయరాం అరుదైన గాయని.ఇళయరాజా సంగీతం మన హృదయాలను రంజింప జేస్తుంది.భారతీ రాజా అత్యున్నత దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుందీ పాటలో.(https://youtu.be/PX-X8SbYbFE?si=HHPvSea7jGCr1xnt)