Thursday, 26 December 2024

పుస్తకాల పండక్కి వెళ్ళొద్దాం


పుస్తకం మస్తకపు ద్వారాలను తెరిచి విశాల ప్రపంచాన్ని చూపిస్తుంది. కాలం ఎంత మారినా పుస్తకం చేతికి తీసుకుని చదువుతూ ఉహించుకుంటూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ మజానే వేరు.పుస్తకపు పరిమళం అక్షరాల ద్వారా వెదజల్లబడుతుంది.దాన్ని గ్రోలుతూ ఉంటే మనస్సు విభిన్న భావోద్వేగాలకు లోనవుతుంటే ప్రపంచం మన ముందు సాక్షాత్కారించి నట్లుంటుంది. ఎందరో కవులు,రచయితలు తమ సృజనాత్మకతకు,మేధస్సుకు పదును పెట్టి ఎన్నో విలువైన విషయాలు మనకందిస్తుంటే మనం అతి సులభంగా ఆ జ్ఞానాన్ని అనుభూతిని పొందు తున్నాం.

ఇక విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగే పుస్తకాల పండుగ గురించి. ఎన్ని వందల స్టాళ్ల లో ఎన్ని వేల పుస్తకాలు కొలువు దీరి ఉన్నాయో, పుస్తక ప్రియులను రా రమ్మని ఆహ్వానిస్తూ! తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలా విభిన్న భాషల్లో మనల్ని ఆనందింప జేయడానికి సిద్ధంగా ఉన్నాయి.ఎంతో మంది కవులు,రచయితలు తమ పుస్తకాలను స్వయంగా అమ్ముతున్నారు. ఆ ప్రాంగణంలో పుస్తక ఆవిష్కరణలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు,పిల్లల ప్రదర్శనలు, రకరకాల తినుబండారాలు ఇలా ఓ పండుగనే తలపిస్తుంది. వేల మంది ఎంతో ఆసక్తిగా పుస్తకాలు చూస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ కొంటున్నారు. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రులు పరిచయం కావడం ఓ అదనపు ప్రయోజనం.

ప్రతి ఒక కుటుంబం తమ పిల్లలతో కలిసి తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇది.చదివే అలవాటు లేని వారు కూడా ఒక్క సారి సందర్శిస్తే ఏదో ఒక పుస్తకం కొనక మానరు.పిల్లలకు ఇప్పటినుండే విభిన్న పుస్తకాలు చదివే అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు చదవడం అలవాటయితే జీవితాంతం ఆ అలవాటు మానరు. వారికి మీరు ఇచ్చే అతి గొప్ప బహుమతి పుస్తకం అయితే చదవడం నేర్పే అలవాటు వారి జీవితాలను అత్యున్నత స్థాయికి తీసుకు వెడుతుంది.

చివరగా ఇంకో 4 రోజులు అంటే 29/12/24 9:00PM వరకు మాత్రమే NTR Stadium (దాశరధి కళా ప్రాంగణం ), ఇందిరాపార్క్ దగ్గర హైదరాబాద్ లో ఈ పండుగ జరుగుతుంది. ఒక్కసారి ఈ పండక్కి వెళ్లిరండి .

 ఒద్దుల రవిశేఖర్(https://www.facebook.com/share/p/15ZfRWHbbW/)

No comments:

Post a Comment