Friday 8 September 2023

2) పాటల పూదోట


ప్రపంచ ధరిత్రీ దినోత్సవ సందర్భంగా అత్య ద్భుతమైన జయరాజ్ సాహిత్యం, మోహన్ అందించిన చక్కని సంగీతం,విజయ్ ఏసుదాస్(జేసుదాస్ కుమారుడు) అమృత స్వరంలో జాలువారిన ఈ 23 నిముషాల దీర్ఘ గీతాన్ని save చేసుకుని వినండి. మానవ జీవిత తాత్వికతను రంగరించి మనపై వెదచల్లిన పుప్పొడి పరిమళం ఈ గానం వినండి మరి.(https://youtu.be/j1Z0u4SkdwQ?si=yjOuOSB2CB3xD5XA)

Wednesday 6 September 2023

1)పాటల పూదోట


మానసిక ప్రశాంతత కు, ఆరోగ్యానికి సంగీతం ఉపకరిస్తుందని తెలిసిందే." నడక " లో మంచి పాటలు వింటుంటే ఆ అనుభూతే వేరు. అలాగే ఒంటరి తనాన్నుండి తప్పించు కోవాలన్నా సంగీతమే దివ్య ఔషధం.విభిన్న మైన పరిమళాలు విరబూసే సంగీతం వినడం అలవాటు చేసుకోండి. దైనందిన జీవిత సమస్యలనుండి కాస్త ఉపశమనం పొందండి

చిత్రం :వందేమాతరం 

పాడటం మొదలెట్టాక stage పై నేను పాడిన మొట్ట మొదటి పాట ఇది.ఈ సినిమా విడుదల కాకముందే Nellore లో శ్రీనివాస్ గారు law చేస్తూ ఉండేవారు. మేము ఆయన ఉండే room పైన ఉండేవాళ్ళం.అప్పుడే ఆయన పాటలు record చేసుకొని practice చేస్తూ ఉండే వాళ్ళు."వందేమాతరం" శ్రీనివాస్ స్వీయ సంగీతం లో ఆయనే పాడిన అర్థవంతమైన గీతం,డా. సినారె రచన.రాజశేఖర్ కి మొదటి సినిమా అనుకుంటా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టినట్లు సినారె వ్రాసిన ఈ పాటను కృష్ణ గారు చక్కగా చిత్రించారు. వందేమాతరం లోని ప్రతి వాక్యానికి అప్పటి పరిస్థితులను అన్వ యించి వ్రాయగా శ్రీనివాస్ తనదైన గంభీరమైన విలక్షణ మైన గొంతుతో అద్భుతం గా పాడారు. అప్పటినుండి ఆయనకు "వందేమాతరం శ్రీనివాస్ అనే పేరు స్థిర పడింది."దర్శకుడు T. కృష్ణ. (https://youtu.be/DICYKmHXbl0?si=Zw5H-RLaolBghS1d)

Tuesday 6 June 2023

ఆత్మహత్య లు వద్దు.

 NEET లో MBBS SEAT రాకున్నా, Biotechnology, Bioinformatics,Biomedical engineering వంటి మంచి ఉద్యోగ అవకాశాలున్న courses లో చేరవచ్చు.నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు.జీవితం విలువైనది.తల్లిదండ్రులారా పిల్లలపై మీ ఆశలను రుద్దవద్దు!వారికిష్టమున్న చదువులు చదవనీయండి,మంచి ర్యాంకులు రాకున్నా వారిని ఏమీ అనవద్దు.ఏదో ఒక రంగం లో వారు ఎదుగుతారు.మీ బిడ్డల ప్రాణాల కంటే చదువులు,ర్యాంకులు ఎక్కువేం కాదు కదా!ఈ విషయం తీవ్రంగా ఆలోచించండి.అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఇలా లేదు!డాక్టర్,ఇంజినీర్ కాకుంటే భూకంపాలేమీ రావు.మిగతా వారి విజయాలను మీ పిల్లలతో పోల్చవద్దు.ఇంటర్ తర్వాత విభిన్న రంగాలలో రాణించే అవకాశాలున్నాయి.విద్యార్థులు,తల్లిదండ్రులు,విద్యావేత్తలు,పౌరసమాజం,ప్రభుత్వాలు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోండి,పరిష్కార మార్గాలు ఆలోచించండి.చదువులు ఆనందాన్ని ఇవ్వాలిగాని ఆత్మహత్యలకు పురికొల్పకూడదు...................ఒద్దుల రవిశేఖర్

Saturday 3 June 2023

ప్రపంచ సైకిల్ దినోత్సవం

 ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు

చిన్నప్పుడు మామయ్య వాడిన cycle ఉండేది. Cycle తొక్కేవాళ్ళని చూస్తే అది ఒక అద్భుతం గా అనిపించేది. పడిపోకుండా ఎలా తొక్కుతారా అనిపించేది.ఇంట్లో hero cycle చాలా ఎత్తుగా ఉండేది.6,7 తరగతుల్లో అనుకుంటా cycle నేర్చుకుందాం అని మిత్రుల సహకారం తో ప్రయత్నాలు మొదలెట్టాను. ఇద్దరు అటొకరు, ఇటొకరు పట్టుకుంటే కత్తెర తొక్కడం (seat పైన ఎక్కకుండా )అలవాటు చేసుకున్నా. క్రమంగా మిత్రులు పట్టు కోకున్నా తొక్కడం, balance చేసుకోవడం అలవాటయ్యింది. మరి seat ఎక్కి తొక్కాలికదా. మళ్ళీ మిత్రులు పట్టుకుంటే seat ఎక్కి కూర్చుని తొక్కుకుంటూ వెళ్లే వాన్ని ఆపాలంటే ఏదయినా చిన్న బ్రిడ్జి (mori) దగ్గరికెళ్లి దిగేవాన్ని. ఇక చివరి అంకం సొంతంగా seat ఎక్కడం ఇది నేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు. క్రింద పడటం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం...... ఇలా చివరికి cycle నేర్చే సుకున్నా. ఇహ 10 వతరగతి దోర్నాల చదివే రోజుల్లో రోజు వెళ్లి రావడం 16 km cycle తొక్కేవాడిని. తరువాత మార్కాపురం లో inter, చదివేటప్పుడు 2 సంవ త్స రాలు college కి cycle పై వెళ్లి వచ్చే వాళ్ళం నేను Jay కలిసి. ఇహ డిగ్రీ nellore సర్వో దయాలో చేరినప్పుడు cycle ప్రయాణమే.cycle పై nellore అంతా తిరిగే వాన్ని. ఇహ teacher గా మార్కాపురం లో చేరాక కూడా కొంత కాలం cycle వాడాను. ఇహ గత 6,7 ఏండ్ల నుండి ఆరోగ్యం కోసం cycle తొక్కడం చేస్తున్నాను. ఇలా cycle నా జీవితం లో విడదీయరాని భాగం అయింది. ఇహ cycle తొక్కడం వల్ల ప్రయోజనాలు ఇంకో post లో వ్రాస్తాను.... ఒద్దుల రవిశేఖర్ 

Wednesday 31 May 2023

దేవనహళ్లికోట

 దేవనహళ్లి కోట (Devanahalli Fort):బెంగళూరు కు సమీపంలో ని 

చారిత్రక ప్రాధాన్యత ఉన్న దేవనహళ్లి కోట చూద్దామని jay అనగానే ఆసక్తిగా అనిపించి చూడ్డానికి బయలు దేరాం. కోట ప్రవేశ ద్వారం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కోట లోపలికెళ్లి చూస్తే ఎక్కడా కోట లాంటి నిర్మాణం కనపల్లేదు.అన్ని సాధారణ ఇల్లే కనిపించాయి. కాని కోట గోడ మాత్రమే విశాలం గా చాలా పొడవుగా నిర్మితమై ఉంది. అక్కడున్న వివరాల ప్రకారం 1501 లో మట్టి కోట గా మల్ల బెరే గౌడ కట్టారు.ఈయన బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ పూర్వీకుడు. ఈ మట్టికోట క్రమంగా చేతులు మారి 1749 లో హైదర్ అలీ చేతికి వచ్చింది. దీన్ని ఈయన పునర్నిర్మించాడు. ఈయన మైసూరు రాజు వడయార్ అశ్విక దళం లో పనిచేసే వారు. హైదర్ అలీ కొడుకే టిప్పుసుల్తాన్. దేవనహళ్లి లోనే టిప్పు సుల్తాన్ జన్మించారు. తరువాత మైసూర్ రాజ్యాన్ని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరిపాలించారు.

             కోట గోడ పై  నడుస్తూ గమనిస్తే  వృత్తాకారంగా గోడ మాత్రమే ఉంది. గోడ కు ఒక వైపు పెద్ద చెరువు ఉంది. కోట గోడకు రక్షణ గా నిలిచే సైన్యం తుపాకులు ఎక్కుపెట్టడానికి గోడకు రంధ్రాలు చేశారు. ఒకే రంధ్రం గుండా 4 తుపాకులు ఎక్కుపెట్టేలా లోపల 4 వైపులా  4 చిన్నరంధ్రాలు చేశారు. ఫోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది. కోట గోడ నిర్మాణ శైలి. నంది hills ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నంది కొండలు టిప్పు సుల్తాన్ వేసవి విడిది గా ఉపయోగించుకునే వారట.


Wednesday 17 May 2023

నందికొండలు (Nandi Hills) బెంగుళూరు సందర్శన.

 భానుడి భగ భగల నుండి కాస్తంత తప్పించు కోవటానికి బెంగుళూరు వెళ్లాను. ఆంధ్రా లో 45 C ఉంటే అక్కడ 34 C మాత్రమే ఉంది.ఇక దగ్గరిలో చూడదగ్గ ప్రాంతం ఏదయినా ఉందా అని ఆలోచిస్తే ఇంతకు ముందు మా అబ్బాయి స్నేహిత్ వాళ్ళ మిత్రులతో నంది కొండ (Nandi Hills ) చాలా బాగుంటుంది అని చెప్పాడు. మిత్రుడు Jay తో చెప్పగా ఆదివారం ఉదయాన్నే వెడదామన్నాడు. Car లో బయలు దేరాం. కొన్ని వందల cars, bikes లో అదేదో ఉత్సవాన్ని చూట్టానికన్నట్టు ఉదయం 4 గంటల నుండే బయలు దేరారు జనం.పైకి వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి. వేరు వేరు గా ఉంటే ప్రజల కెంతో సౌకర్యం. Parking చేసి ticket కొనుక్కొని పైకి వెళ్ళగానే (కొద్దిగా కొండ ఎక్కాలి ) పలకరించాయి మంచు తుంపరలు. చల్లటి గాలి దట్టమైన పొగమంచు తెరలు కట్టి నట్లు, మంచు కరిగి టప్ టప్ శబ్దం చేస్తూ పెద్ద పెద్ద చినుకులు. మంచు తెరల మధ్య మనుషులు కనబడటం లేదు.అక్కడి వాతావరణాన్ని వచ్చిన వేలాది మంది తన్మ యత్వం చెందుతూ ఆస్వాది స్తుంటే ప్రకృతి మనిషి కెంత మంచి స్నేహితుడో అర్ధమవుతుంది.దీన్ని నందిహిల్స్ లేదా నంది దుర్గ్ అంటారు. టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా దీన్ని ఉపయోగించుకున్నాడు.ఇది బెంగుళూరు వాసులకు వారాంతపు విడిది గా మారింది.సిటీ నుండి 60km దూరంలో ఉంటుంది. చిక్ బళ్ళాపూర్ కు 10km దూరం లో ఉంటుంది.భూమికి 1478 మీ ఎత్తులో చిక్ బళ్ళాపూర్ జిల్లాలో (బెంగుళూరు.... హైదరాబాద్, అనంతపూర్ రూట్ లో )ఉంటుంది.చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి గాని చెప్పే guides ఎవరూ లేరు. జనం అంతా 6 గంటలకల్లా అక్కడకు చేరుకున్నారు సూర్యోదయం చూట్టానికి. వారి కోలాహలాన్ని enjoy చేస్తూ మేము ఎదురు చూస్తున్నాం. విపరీతమైన మంచు కురవడం వల్ల కాస్త ఆలస్యంగా సూర్యుడు మబ్బుల మాటున దోబూచులాడాడు.కేరింతలతో జనం ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.సూర్యోదయం అనంతరం కొండపై తిరుగుతూ 11 వ శతాబ్దం లో చోలుల కాలంలో నిర్మితమయిన 10 అడుగుల పొడవు,6 అడుగుల ఎత్తుగల నంది విగ్రహాన్ని చూసాం. అందుకే దీనికి నంది hills అని పేరు వచ్చిందేమో.ప్రక్కనే రాతి లో సహజంగా ఏర్పడ్డ గుహ చూసాం. దీన్ని బ్రహ్మా శ్రమం అంటారు. ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునే వారట.SAARC SUMMIT జరిగిన భవనాన్ని చూసాం చెట్ల కొమ్మల చాటున తొంగి చూస్తున్న సూర్యుడిని చూస్తూ మంచు దుప్పటిని కప్పుకున్న చెట్లను పలకరిస్తూ,ఆకుల స్పర్శ తో గాలి గాంధర్వమై వీస్తున్న వేళ... పరవశించిన కొమ్మలు రా రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్య కావ్యాలను చదువుతూ తనివి తీరా ప్రకృతి లో పరవశించి పోయాం మార్గ మధ్యం లో ద్రాక్ష తోటను చూసాం. మంచి అనుభూతులను మూట గట్టుకుని తిరుగు పయనమయ్యాము..(https://www.thrillophilia.com/attractions/nandi-hills)(https://en.m.wikipedia.org/wiki/Nandi_Hills,_India)

Saturday 15 April 2023

చరిత్ర శకలాలు.

 చరిత్ర శకలాలు

రచయిత :ఈమని శివనాగిరెడ్డి

పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్

చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరమే.ఏ చరిత్ర అయినా ఆ కాలం లో ఉన్నవారు పుస్తకం రూపం లో వ్రాస్తే అది చదివి మనం ఆయాకాలాలలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోమొదటి సారిగా 5500 సం. క్రితం మెసపటోమియా(ప్రస్తుత ఇరాక్ )లో లిపి వాడారు.అంటే క్రీస్తు పూర్వం 3500 సం నుండి మాత్రమే జరిగిన సంఘటనలను వ్రాయడానికి భాష మొదలయిందన్న మాట. అన్ని చోట్ల ఒకే సారి భాష అందుబాటులోకి రాలేదు. మన దేశం లో పరిపాలించిన రాజులు వేసిన శాసనాల ద్వారా అప్పటి విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా వారు నిర్మించిన దేవాలయాలు,అప్పటి ప్రజలు వాడిన వస్తువులు,ఇలా ఎన్నో సాక్ష్యాలుగా సేకరించి ఆయా కాలాలలో ఏం జరిగిందో ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి గారు "చరిత్ర శకలాలు" అన్న పుస్తకం లో తెలుగువారి చరిత్రను వివరించారు. ప్రతి అంశం ఆధారాలతో సహా వ్రాసిన తీరు ఆకట్టుకుంటుంది. మన మనో ఫలకం పై ఆ కాలాలు ప్రత్యక్ష మవుతాయి.2000 సం. రాల క్రితమే శాతవాహన చక్రవర్తి తెలుగు నేలను ఏలిన దగ్గరనుండి,చైనాలో విశేష ప్రాచుర్యం ఉన్న జెన్ గురువు బోధి ధర్ముడు తెలుగు వాడేనని,74,000 ఏళ్ల క్రితం ఇండో నేషియా లోని తోబా అగ్ని పర్వతం పేలడం వలన ఎగజిమ్మిన లావా,బూడిద కర్నూల్ జిల్లా జ్వాలా పురం దాకా విస్తరించిందని అక్కడ ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు దొరికాయని,బుద్ధుని 'దంత 'పురం,తెలుంగాణపురం,తెలుగు నేలపై రోమన్ నాణాలు, చేజారిన కోహినూర్, నల్గొండ లో పడిన ఉల్కా శకలం, శ్రీశైల చరిత్ర ఇలా ఎన్నో ఆసక్తి గొలిపే చరిత్ర విషయాలు మనకు అందించిన తీరు ప్రశంస నీయం. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు చదువదగ్గ పుస్తకం ఈ "చరిత్ర శకలాలు ".

Thursday 6 April 2023

దార్శనికుడు (Scientist గురించి )

 అతడు వర్తమానం లో చరిస్తున్న భవిష్యత్ దార్శనికుడు

సృష్టి రహస్యాల్ని ఛేదిస్తూ సాగే అలుపెరుగని యాత్రికుడు

అతడి చేతులు

దిగ్ దిగంతాలు దాటుకుంటూ

అనంతాకాశపు ఆవలి అంచును సైతం అంది పుచ్చుకోగలవు

అతడి చూపులు

సాగర గర్భాల్ని చీల్చుకుంటూ

పరమాణు కేంద్రకాల్ని పటాపంచలు చేసుకుంటూ చొచ్చుకు పోగలవు

అతడి అడుగులు నాటికల్ మైళ్లంత విస్త్రతంగా ఉందనుకునేంత లోనే

నానో మీటర్లా సూక్ష్మీకరించుకుంటూ కాంతి సం వత్సరం లా దూసుకుపోతాయి

అతడి హృదయం వయలిన్ తంత్రులకు లయబద్ధంగా ఓ వైపు స్పందిస్తూనే

మరో వైపు వైరస్ ల వైచిత్రి ని విశ్లేషిస్తూ జీవ వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది

అతడి మనసు నీతో నాతో సంచరిస్తూనే

సరికొత్త సంబంధాలను సృజించడం లో సంగమిస్తుంది

అనాది నుండి అతనొక నిరంతర శ్రామికుడు

నిత్య చైతన్య స్ఫూర్తి

మానవాళి సౌఖ్యం కోసం పరిశోధనే ప్రాణంగా

ప్రజ్వలిస్తున్న విజ్ఞాన వీచిక

అతడే ఓ కెప్లర్... ఓ జన్నర్...ఓ రామన్... ఎందరెందరో

 (ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి భౌతిక శాస్త్రము వెనుక అట్ట లోపలిభాగం లోని కవిత. రచయిత పేరు లేదు. వారికి ధన్యవాదాలు )


Wednesday 5 April 2023

అమ్మ....నాన్న.....ఓ జీనియస్.


రచయిత :వేణు భగవాన్

పుస్తక పరిచయం : ఒద్దుల రవిశేఖర్

పిల్లల పెంపకం ఎప్పటికీ ఒక సవాలే. మన అమ్మా నాన్న మనల్ని పెంచినట్టు మన పిల్లల్ని పెంచుతామంటే కుదరదు.21 వ శతాబ్దపు parenting చాలా challenging గా ఉంటుంది. ఈ విషయం మీద ఈ పుస్తకం అంతా నడుస్తుంది. చక్కటి కొటేషన్స్ సేకరించి తనదైన అన్వయంతో ఒకటి, రెండు పేజీ లలోనే ఒక అంశాన్ని ముగించడం బాగుంది.ప్రస్తుత చదువులు, పిల్లలు ఎలా ఉన్నారో వివరిస్తూ ఈ పోటీ ప్రపంచం లో నిలదొక్కుకోవాలంటే ఏ రకమైన నైపుణ్యాలు ఉండాలి అన్న విషయాలు విపులంగా చర్చించారు. కెరీర్ అంటే, విజయం అంటే చక్కని నిర్వచనాలు ఇచ్చారు.అర్థవంతమైన బొమ్మలతో (ven diagram ) కూడిన సమాచారం మరింత ఆకట్టుకుంటుంది.ఖలీల్ జీబ్రాన్ కవిత ఆలోచింపజేస్తుంది.ఇదంతా విషయ సూచిక. పుస్తకం మొత్తం 10 chapters గా వర్గీకరించారు. 1) పిల్లలు గొప్ప మానవులుగా ఎదగాలనుకుంటే! ఇందులో అబ్రహాం లింకన్ ఉత్తరం మనల్ని కదిలిస్తుంది. బాల్యాన్ని ఆట పాటలతో ఆనందంగా గడపాలంటాడు. ఆ స్వేచ్చ లోనే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది మానవ వనరుల్లో అత్యంత విలువైనది అంటారు. పిల్లలకు ప్రశ్నించే హక్కు, కలలు కనే స్వేచ్ఛ ఉండాలంటారు 2)సరయిన విద్యాలయాలను ఎంచుకోండి.ఇందులో పిల్లలని ప్రశంసించాలని, ప్రతి శిశువు ఓ జీనియస్ అని చెబుతారు. స్టీవ్ జాబ్స్ కవిత భావి జీనియస్ లు ఎలా ఉంటారో చెబుతుంది. తెలివి తేటలు (multiple intelligences) 10 రకాలుగా ఉంటాయని హోవార్డ్ గార్డనర్ కనుగొన్నారు. పిల్లల్లో వాటిని కనుగొనాలంటారు. పిల్లల్లో 5 రకాల minds అభివృద్ధి చేయాలట.3)పిల్లల్ని ఎలా పెంచాలి?4) గొప్ప మానవులుగా తీర్చి దిద్దండి.5) పిల్లల హృదయాలను గెలవాలంటే? 6) సరయిన సంభాషణ 7) Family managment 8) స్ఫూర్తి కలిగించండి 9) character building 10) ఒత్తిడిని జయించండి 

ఇలా 10 విభిన్న మైన topic లతో తల్లిదండ్రులను ఆలోచింప జేసే విధంగా వ్రాయబడిన ఈ పుస్తకం ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా చదవదగ్గది.


Wednesday 8 March 2023

కొండవీడు కోట


సెలవొస్తే ఏదయినా ప్రాంతం చూసే అవకాశమొస్తే వెళ్లడమే. అలా విజయవాడ వస్తావా అని ఆనంద్ అనగానే ఏంటి కార్యక్రమం అంటే మార్కాపురం ప్రాంతం లో 10 వ తరగతి విద్యార్థులకు అందించే "వాసవి club అమృతాహార సేవ " ను విజయవాడ వాసవి క్లబ్ వారు కూడా అక్కడ  కూడా అందించేందుకు వారిని motivate చేయడానికి అన్నాడు. సరే మంచిదే కదా!మధ్యాహ్నం వీలయితే భవానీ ద్వీపమో, కొండవీడు కోట గాని చూద్దా మనుకున్నాం.మధ్యాహ్నం meeting అయ్యాక 3:00 కల్లా విజయవాడ లో బయలు దేరాం. మిత్రుడు HM సుధాకర్ car నడుపుతుంటే నేను ఆనంద్, పిచ్చిరావు 5 గంటలకల్లా కోట పైకి చేరుకున్నాం.

కొండ పైకి 3 ఏళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. మలుపులతో కూడిన ఘాట్ రోడ్డు. ఆ ప్రాంతమంతా అటవీశాఖ పరిధిలో ఉంది. కొండపైన చిన్న పార్క్ అభివృద్ధి చేశారు. లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్దరిస్తున్నారు. ప్రక్కనే చిన్న మసీదు ఉంది. దానికి ముందు అనవేమారెడ్డి విగ్రహం ఉంది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రక్కనే వేమన విగ్రహం ఉంది. వెనుకగా రంగసాని మంటపం ఉంది. అది ఎక్కి చూస్తే ఒక వైపు కోట గోడ కనిపిస్తుంది.14 వ శతాబ్దం లో రెడ్దిరాజులు అద్దంకి నుండి రాజధాని ని ఈ ప్రాంతానికి మార్చారు. ప్రోలయ వేమారెడ్డి దీనిని నిర్మించారు.1328 నుండి 1482 వరకు రెడ్డి రాజులు కొండవీడును రాజధాని గా చేసుకుని శ్రీశైలం నుండి సింహాచలం వరకు పరిపాలించారు. తరువాత గజపతులు, కృష్ణ దేవరాయలు(1516), కులీ కుతుబ్ షా (1579), ఫ్రెంచ్ వారు (1752), బ్రిటిష్ వారు (1788) వరుసగా ఈ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలించారు. గుంటూరు కు 16 km దూరం లో ఫిరంగి పురం దగ్గరిలో ఉంటుంది.భూమికి 1700 అడుగుల ఎత్తులో ఉంటాయి ఇక్కడి కొండలు. ఆంధ్రప్రదేశ్ TOURISM Department వారు ఇక్కడ resort లాగా అభివృద్ధి చేసి వసతి కల్పిస్తే చక్కటి పర్యాటక ప్రాంతమౌతుంది. అక్కడ గడిపింది కొద్దిసేపే అయినా "ఇచ్చోటనే కదా భూములేలు రాజన్యుల అధికార ముద్రలు అంతరించి పోయే. ... గుర్రం జాషువా పద్యం గుర్తుకు వచ్చింది. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు రాజులు రాణులతో కళ కళ లాడుతూ ఉండి ఉంటుంది కదా, ఎన్నో యుద్దాలకు ఈ కోట గోడలు సాక్షీ భూతాలుగా నిలిచాయి కదా అనిపించింది.అంత గొప్ప కోట ఆనవాళ్లే మీ లేవు.

కొండకు దిగువన కొండవీడు museum ఉంది. అపురూపమైన చిత్రాలు, శిల్పాకళా సంపద ఇక్కడ భద్రపరిచారు. శ్రీశైలం రెడ్ల సత్రం వారు దీన్ని ఏర్పాటు చేశారు. కోట చూసి వచ్చిన తరువాత museum తప్పకుండా చూడండి.( https://en.m.wikipedia.org/wiki/Kondaveedu_Fort)

..........ఒద్దుల రవిశేఖర్.

Sunday 19 February 2023

సంగమేశ్వర సందర్శన

 ఎప్పటినుండో చూడాలని అనుకుంటున్న ప్రాంతం సంగమేశ్వరం. శివరాత్రి సందర్భంగా  వెళ్లడం జరిగింది. ఆత్మకూరు అటవీ ప్రాంతం ఎండలకేమో చెట్లు ఎక్కువగా ఎండిపోయి కనిపించాయి. దారంటా అటు ఇటు వెదురు విస్తారంగా గుబుర్లు గుబుర్లుగా పెరిగి కనువిందు చేస్తూ ఉంది.దోర్నాల దాటాక కొత్త పల్లి దగ్గర వెలుగొండ tunnels దాటిన తర్వాత అడవి మొదలవుతుంది.అడవి ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. కొర్రపోలు,పెద్దమంతనాల,బైర్లూటి ఊర్లు దారిలో కనిపిస్తాయి.భైర్లూటి దగ్గర Jungle safari ని AP అటవీ శాఖ ఏర్పాటు చేసింది.ఇక్కడ రాత్రి బసకు ఏర్పాట్లు చేసారు.అడవిలో ఒక రోజు ఉండాలని ఉంది.చూడాలి ఎప్పుడు కుదురుతుందో.ఆత్మకూరుకు 40 కిమీ దూరం లో కృష్ణానదిలో సంగమేశ్వరం ఉంటుంది.శ్రీశైలం డాం పూర్తిగా నిండితే ఇక్కడ ఉన్న శివాలయం  నదీ గర్భంలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు తగ్గిన తరువాత మరల ఫిబ్రవరి, మార్చి లోనే గుడి బయట పడుతుంది.గత సం.రం శివరాత్రి కి నీళ్ల నుండి గుడి బయట పడలేదట.గుడి చుట్టూ 3 వైపులా నది ఒక వైపు చిన్న కొండ ఉంటాయి. చిన్న పడవలు నదిలో తిరుగుతున్నాయి.గుడి చుట్టూ నది హారంలా ఉంది. కనుచూపు మేరలో నది మధ్యలో కొండలు ఉన్నాయి. పుణ్య క్షేత్రంతో పాటు చక్కని నదీ విహార కేంద్రంగా దీన్ని మలచవచ్చు. ఇంకా గుడి ఎదురుగా ఉన్న కొండ పరిసర ప్రాంతాలను AP tourism శాఖ చక్కని resort లు కట్టి ,ఉద్యానవనాలు అభివృద్ధి చేయవచ్చు. Tourism department వారు boat షికార్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడకు కొద్ది దూరం లో నది అవతల తెలంగాణ లోకి పడవ ద్వారా వెళ్లొచ్చు. అక్కడే కేంద్రప్రభుత్వం నది పై ఒక వంతెన కట్టబోతుంది. తరువాత మార్గ మధ్యం లో కొలను భారతి ని సందర్శించాము. ఇది జ్ఞాన సరస్వతి ఆలయం. బాసర సంగీత సరస్వతి ఆలయమట.ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.7 రకాల శివాలయాలు బంగారు వర్ణం తో మెరిసిపోతున్నాయి.3 వైపులా కొండలు ఉంటాయి.ప్రకృతి ఒడిలో ఉన్నట్లు ఉంది ఈ ప్రాంతం. చిన్న పిల్లలు వేదమంత్రాలు చదువుతున్నారిచ్చట. తరువాత ఆత్మకూరు నుండి నంద్యాల మార్గంలో అడవిలోకి 15 కి.మీ వెళ్ళాము.ఇక్కడ రుద్రకోడూరులో శివుడు కొలువై ఉన్నాడు.పూర్తిగా మట్టి రోడ్డు. ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకో లేనంతటి దారి. కాని bus లు ట్రాక్టర్లు జీప్ లలో జనం విపరీతంగా వచ్చారు. అసలు ఈ దారిలో వెళ్లి తిరిగి రావడం అదృష్టమే. ట్రాఫిక్ జామ్ అయి ఇరుక్కుంటే ఇక అడవిలో జాగారమే.ప్రభుత్వం ఈ విషయమై ఆ లోచించి కొద్దిగా రోడ్డు వెడల్పు చేయాలి.దేవాలయం దగ్గర ఎత్తయిన చెట్లు పచ్చగా చిగురించి మరింత శోభనిస్తున్నాయి. ప్రక్కనే కొలనులో భక్తులు స్నాన మాచరిస్తున్నారు.ఆ ప్రాంతమంతా భక్తులతో కోలాహలంగా ఉంది.కాని దర్శనం దగ్గర విపరీతమైన రద్దీ. గర్భ గుడిలోకి చిన్న వాకిలి గుండా దర్శనం చేయిస్తున్నారు. ఏమాత్రం తొ క్కిసలాట జరిగినా ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ కూడా ఆలయానికి బంగారు వర్ణం అద్దారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో మనోహరంగా ఉంది.ఇంత అటవి లోపలికి భక్తులు రావడం సాహసమే.ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి రహదారి వెడల్పు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుగు ప్రయాణం కూడా ట్రాఫిక్ జామ్ లతో సాగి బయటపడి ఊపిరి పీల్చుకున్నాము.పండుగ సమయంలోనే కాకుండా సంగమేశ్వరం,కొలను భారతి, రుద్ర కోడూరు విడిగా రాగలిగితే చక్కటి అనుభూతినిస్తాయి. తీర్ధ యాత్రలతో పాటు విహార యాత్రలుగా కూడా అందరు ఈ ప్రాంతాలను సందర్శించే లాగా చేయగలిగితే మరింత బాగుంటుంది. ప్రకృతి, అడవుల్లోకి ప్రయాణం మనల్ని మరింత ఉత్తేజితుల్ని చేస్తాయి. అందుకని వాటిప్రేరణ తో మన పరిసరాల్లో మొక్కలు నాటి పెంచి మన ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు భావి తరాలకు చక్కటి పరిసరాలను  అప్పగించవచ్చు. ప్రకృతిని కాపాడండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది....... ఒద్దుల రవిశేఖర్.

Thursday 2 February 2023

Jungle safari (Eco tourism )అటవీ సందర్శన

 

APNGC, AP అటవీ శాఖ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థినీ విద్యార్థులు,4 గురు ఉపాధ్యాయులు పత్రికా విలేఖరులు, అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్న వీర్ల కొండ ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ఆనందో త్సా హాల మధ్య సాగింది. దోర్నాల అటవీ శాఖాధికారి      E. విశ్వేశ్వర రావు గారి ఆహ్వానం మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నారెడ్డి పల్లె ప్రధానోపాధ్యాయులు Y. శ్రీనివాసరావు, APNGC ప్రకాశం జిల్లా కోర్డినేటర్ M. సజీవరాజు, మార్కాపురం Cluster కోర్డినేటర్ ఒద్దుల రవిశేఖర్, మల్లిఖార్జున గార్ల ఆధ్వర్యం లో అటవీ సిబ్బంది తమ వాహనాల్లో అందరినీ మొదట ట్రెక్కింగ్ జరిగే కొండ వద్దకు తీసికెళ్లారు. నిలువెత్తు కొండను సునాయాసంగా ఎక్కి అక్కడ ఉన్న ఇనుప మంచె పై నుండి నల్లమల అందాలను తిలకించాము.తరువాత జంగిల్ సఫారీ కి వెళ్ళాము. FRO విశ్వేశ్వర రావు గారు అక్కడ ఏర్పాటు చేసిన Exhibition లో ఉన్న జంతువుల విశేషాలను వివరిస్తుంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు.జంతువుల జీవన విధానం కూడా తెలుసుకోవాలి. పులి ఎలా మనకు ఎలా మేలు చేస్తుందో తెలిపారు. భారత దేశం లో పులుల అభయారణ్యాల్లో ఇది పెద్దది.అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన భోజనాలు చేసి 3 వాహనాల్లో అందరం జంగిల్ సఫారీ కి బయలు దేరాము. మాతో పాటు భారతదేశం సైకిల్ పై చూడాలని బయలు దేరిన ప్రవీణ్ కుమార్ కూడా కలిశారు. అడవిలో ప్రయాణం 14 కిమీ. పగటి పూట జంతువులు ఏమీ కనబడ లేదు.సాయంత్రం 5 తరువాత ఆహార సేకరణకు పులులు బయలు దేరతాయట. నెమలిని మాత్రం చూసాము. మధ్యలో పులి చెరువు ఆగి చూసాము.అక్కడ Solar motor ఏర్పాటు చేశారు.6 మంది అయితే ఒక trip వేస్తారట,₹2400 ticket.ఒక ఆహ్లాద కరమైన అనుభవాన్ని మూటగట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాము."Save tiger "అని ముద్రించిన tea shirt ను బహుకరించారు.APNGC, AP Forest department తో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము.Eco Tourism sites in NTSR  లను గురించి వివరించారు. Nallamala Jungle Safari ని చూడటానికి సంప్రదించండి : Ph:9154825778

Saturday 14 January 2023

ఆనంద సాగరం

 పుస్తకం: ఆనంద సాగరం (The book of joy కి సంక్షిప్తానువాదం )                                      మూలం :దలైలామా, డెస్మండ్ టుటు, డగ్లస్ అబ్రామ్స్, అనువాదం : రావెల సాంబశివరావు. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్  దలైలామా,డెస్మండ్ టుటు ల సంభాషణను దగ్లస్ అబ్రాహాం గ్రంధస్తం చేశారు.మతం విశ్వ జనీనమైనది కాదని విద్య సార్వ జనీనమైనదని  అందువలన విలువలు వ్యాప్తి చేయడానికి విద్య సాధనమని అన్నింటికంటే మానవతా వాదం ప్రధానమని ఇందులో వారి అభిప్రాయం. ఈ బాధామయ ప్రపంచం లో ఆనందాన్ని సాధ్యం చేసుకోవడం ఎలా అనే అంశం ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఆనందాన్ని పొందడానికి ఉన్న అడ్డంకులు, ఆనందానికి ఆధారాల గురించి వారి లోతయిన సంభాషణ సాగుతుంది. మానసిక ఆనందం, మానవత ద్వారా ఐకమత్యాన్ని సాధించడం,ఆనంద సాధనలో ప్రేమ పాత్ర వంటి అంశాలు చర్చించారు. ఆనంద సాధనకు అవసరం అయిన 8 లక్షణాలు లోతుగా చర్చించ బడ్డాయి. ఇందులో 4 మేధోపరమయినవి :1)దృక్కోణం 2) నమ్రత 3)హాస్యం 4)ఆమోదం.4 లక్షణాలు హృదయ గతమైనవి1) క్షమాగుణం 2)కృతజ్ఞత 3) కరుణ 4)ఔదార్యం. ఈ పుస్తకం మానవీయ విలువల సృజనాత్మక క్రోడీకరణ. ఇతరుల కోసం జీవించడం లోనే నిజమైన ఆనందం ఇమిడి ఉంది అనేది ఈ పుస్తకం చివరి ప్రత్తిపాదన. మనుషులు శాంతి సంతోషాలతో జీవించడానికి ప్రేమ కరుణ అనురాగం మూలమని దలైలామా అంటారు. ఇందులోని ముఖ్య విషయాలు                                  *జీవితపు ప్రయోజనం ఆనందాన్వేషణే               * మనకు ఎక్కడ మిత్రులుంటే అదే మన దేశం, మనకు ఎక్కడ ప్రేమ లభిస్తే అదే మన కుటుంబం    .* స్వార్ధం బాధకు దారి తీస్తే ఇతరులమేలు కోరడం ఆనందాన్ని చేకూర్చుతుంది.            *ఆనందమయులు సమాజం లో కలిసి పోతూ సృజన కర్తలుగా ప్రేమమ యులుగా ఉంటారు.        * మనకు ఆనందాన్ని అందించేది ప్రసన్నత, స్నేహపూర్వక ప్రవర్తన                              *అసూయ మానసిక ప్రశాంతతను ధ్వంసం చేసి ఆనందాన్ని దూరం చేస్తుంది.                                * మరణం జీవితం లో ఒక భాగం. మరణం దగ్గరయ్యేకొద్ది ఆనందం  ఆనందం పొందటం అత్యుత్తమ మార్గం.                                            * ఈ గ్రహం మీద మనం అతిధులం. ఉన్నన్నాళ్ళు జీవితాన్ని తెలివిగా వెళ్ళబుచ్చాలి. ఈ ప్రపంచాన్ని అందరికి అనువుగా ఉండేట్లు చేయాలి.       *ఆనందం అనేది ఒక బహుమతి లేదా ప్రతిఫలం.  * మానవ జాతి మనుగడకు కరుణ మూలం          * ప్రపంచాన్ని మార్చటం అన్నది ప్రజలకు కరుణను అలవాటు చేయడం ద్వారామాత్రమే సాధ్యం 

Sunday 27 November 2022

క్రియ (పిల్లల పండుగ ).... క్రియాత్మకంగా

  పోటీలగురించి వినగానే ముందు పేరే చిత్రంగా అనిపించింది. క్రియ అంటే చేయడం,verb. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. ఖమ్మం బాలోత్సవ్ చూడటం ఎప్పుడూ కుదర్లేదు. ఇదయినా చూద్దాం అని బలంగా అనుకొని facebook మిత్రుడు రాంబాబు తోట గారికి ఫోన్ చేస్తే సాదరంగా ఆహ్వానించారు. ఒక్కరన్నా తోడు వస్తారా అని friends ని అడిగితే ఎవ్వరూ సుముఖత చూపలేదు. "Ignite young minds "సంస్థ మార్కాపురం MLA శ్రీ K. నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలోఇటువంటి పోటీలనే గత ఏడాది నుండి నిర్వహిస్తుంది. Sir కు ఈ విషయం చెప్పగానే పిల్లలను కూడా పంపిద్దాం తీసుకు వెళ్ళండి అని తన స్వంత ఖర్చులతో 77 మంది విద్యార్థులను, ఉపాధ్యాయుల ను కాకినాడ "క్రియ " పోటీల్లో పాల్గొనడానికి పంపారు. వారికి ధన్యవాదములు.కాకినాడ లో క్రియ నిర్వాహకులు రామ కృష్ణ రాజు, దీపక్, రాజు చక్కని వసతి కల్పించారు. మిత్రులు మాచి రాజు గారు ఆత్మీయ స్వాగతం పలికారు.ఉదయాన్నే JNTU ప్రాంగణం చేరుకోగానే స్వాగత ద్వారాల్లోనే వారి సృజనాత్మకత ఎలా ఉంటుందో అర్ధం అయింది. ముందుగానే Online registration చేసుకోవడం వలన ఉదయం 9 గంటలకే పోటీలు మొదలయ్యాయి. విభిన్న వేదికల మీద ఒకే సారి పోటీలు మొదలయ్యాయి. Quiz, drawing, songs విభాగాల్లో  మా పాఠశాల విద్యార్థులు (ZPHS చెన్నారెడ్డి పల్లి )పాల్గొన్నారు. అన్ని పోటీలు తిరుగుతూ వారి నిర్వహణ విధానం పరిశీలిస్తూ పిల్లల ప్రతిభ కు ఆశ్చర్య పోతూ ఫోటోలు తీసుకుంటుంటే కాలం తెలియ లేదు.దాదాపు 10,000 పిల్లలు వందల మంది ఉపాధ్యాయులు తల్లి దండ్రులు ఒక చోట చేరడం పండుగ కాక మరేమిటి. చక్కని ప్రణాళికతో, బృంద స్ఫూర్తి తో నిర్వహించడం ఆశ్చర్యం గొలిపింది. ఇక పిల్లల ఆనందానికి అవధుల్లేవు. బాల్యం ఒక వరం అది ఆనందాలకు నిలయం.బాలల సంపూర్ణ మూర్తిమత్వం వికసించడానికి విద్యలో ఎన్నో అంశాలు ప్రవేశపెట్టారు మేధావులు, విద్యావేత్తలు,తత్వవేత్తలు, మనో వైజ్ఞానిక నిపుణులు. వాటి ఆధారంగా NCERT, SCERT లు ప్రణాళికా బద్దంగా పాఠ్య, సహపాఠ్య, అదనపు కృత్యాలు,ఆటలు ఇలా విభిన్న అంశాలతో విద్యా Calendars తయారు చేసి అమలు చేయాలి అని ఆదేశిస్తుంటారు. కాని IIT, NEET, Ranks, marks ల పేరుతో విద్యార్థులకు అవేవి అందించకుండా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఊదరగొట్టేదే నిజమైన విద్య అని నమ్మే సమాజం తయారయ్యింది. విషాదం ఏంటంటే విద్యారంగం లో ఉండే వారే వాటిని నమ్మడం. వీటన్నిటికి సమాధానం చెబుతున్నట్లు "క్రియ "సంస్థ వారు  విభిన్న అంశాల్లో రాష్ట్ర స్థాయిలో ఇలా విద్యార్థుల్లోని ఆసక్తులను, అభిరుచులను, ప్రతిభ ను వెలికి తీయడం అపూర్వమైన విషయం. కొన్ని విషయాలు చర్చించుకుందాం.1)వ్యాస రచన : civils,groups లకు అద్భుతంగా పనికి వచ్చే అంశం.విద్యార్థి సృజనాత్మకంగా తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి అనువైన అంశం.కొన్ని వందలమంది ఒక్క చోట చేరి వ్రాస్తూ ఉండడం చూట్టానికి ఎంతో బాగుంది.2) వక్తృత్వం :ఏ అంశం పై నైనా అందరి ముందు తన అభిప్రాయాలను చెప్పే ధైర్యం, వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉండడం భవిష్యత్ ఉద్యోగం సాధనకు పనికి వచ్చే విలువైన అంశం." క్రియ" లో ఈ అంశం చక్కగా నిర్వహించారు.3) క్విజ్ :GK, Current affairs, general science ల సమాహారం. కౌన్ బనేగా కరోడ్ పతి time లో tv లకు అతుక్కుపోయి చూసారు జనాలు. విద్యార్థుల జీవితాలను జ్ఞాన సుసంపన్నం చేసే ప్రక్రియ ఇది. ముందుగా ఇద్దరేసి జట్లకు వ్రాత పరీక్ష నిర్వహించి, తరువాత Top 4 జట్లకు పెద్ద ఆడిటోరియం లో computerbased quiz నిర్వహించారు. ఉత్కంట భరితంగా జరిగింది.4) Debate : ముగ్గురేసి విద్యార్థులు జట్లుగా నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థిలోని సంభాషణా నైపుణ్యాలను వెలికి తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి సంస్థలు ఈ ప్రక్రియనే ఎన్నుకొంటాయి. ఈ అంశాన్ని మరింత సమన్వయం తో జరిపారు.5) science fair 6) poster presentation విద్యార్థుల్లోని విజ్ఞాన తృష్ణ ను వెలికితీస్తాయి.7) పాటలు 8) నృత్యం 9) వాద్య సంగీతం విద్యార్థులకు ఎంతో మానసిక,శారీరక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు. వీటి నిర్వహణ అమోఘం. ముఖ్యంగా classical, folk dance లకు వందకు పైగా group ల విద్యార్థులు చేసే నృత్యాలను చూస్తుంటే రెండు కళ్ళు చాల్లేదు. అలాగే విభిన్న వాద్య పరికరాలను వాయించే చిన్నారులను చూడటం ఒక ఆహ్లాదం కలిగించే అంశం. ఇక 10) mono action, 11)drawing 12) skits 13) మేజిక్ పిల్లల్లోని ప్రతిభ ను వెలికి తీసే అంశాలు.14) మట్టి తో బొమ్మలు చేయడం మరో అపూర్వ అంశం. కొన్ని వందల మంది తదేక దీక్షతో వాటిని తయారు చేయడం ముచ్చటేసింది.15) కథలు వ్రాయడం 16) కథలు చెప్పడం 17) కథలు విశ్లేషించడం ఇవి ఇప్పుడు చదువులో భాగమే కదా.18) spelling 18) map pointing 19) project work ఇవన్నీ curriculam లో భాగం.20) క్రాఫ్ట్ 21) fancy dress,22) మిమిక్రి ఇలా పిల్లలు ఆనందించే ఇన్ని అంశాలు అద్భుతమైన సమన్వ యం, ప్రణాళికతో నిర్వహించిన" క్రియ " team కు అభినందనలు. మళ్ళీ ఈ సారి ఈ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం.ఈ కార్యక్రమం లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ గారితో మాట్లాడటం ఒక గొప్ప అవకాశం. అలాగే సినిమా మాటల రచయిత పింగళి చైతన్య గారిని కలిసి మాట్లాడటం మరో మంచి జ్ఞాపకం.తోటి ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవికుమార్, బ్రహ్మానందరెడ్డి, ఏకాంబ రేశ్వరరావు, సుబ్బనాయుడు, వినీల్, సుబ్రహ్మణ్యం గార్లను లను కలవడం ఆనందం కలిగించిన విషయం.ఇంకా నాతో పాటు CH. సుబ్రహ్మణ్యం HM,ఉపాధ్యాయులు రామాంజనేయులు, వేణు గోపాల్, రవిచంద్ర, రంగనాధ్,music teacher ఖాసీం,ఝాన్సీ పాల్, పద్మజ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి చక్కటి ఏర్పాట్లు, తోడ్పాటు ను అందించిన చంద్రశేఖర్ రెడ్డి HM సార్ కు ధన్యవాదములు.కొసమెరుపు :మాతో పాటు వచ్చిన మార్కాపురం బాలికోన్నత పాఠశాల విద్యార్థులు జానపద నృత్య విభాగం లో ద్వితీయ బహుమతి సాధించడం.... ఒద్దుల రవిశేఖర్.

Sunday 9 October 2022

ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబరు 9)

 ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబర్ 9)        ఇప్పటి తరానికి తెలియవు గాని 40 సం. వయసు పై బడిన వారికి పోస్టాఫీస్ తో ఎంతో అనుబంధం ఉంటుంది. బంధువుల, స్నేహితుల ఉత్తరాల కోసం ఎదురుచూడటం,దూరంగా ఉండి చదువుకుంటున్నప్పుడు నాన్న పంపించే మనీ ఆర్డర్ కోసం చూడటం, టెలిగ్రామ్ ఎవరికయినా వస్తే తెరచి చూసే దాకా గుండె వేగంగా కొట్టుకోవడం, ఉత్తరాలు వ్రాసి ఎర్రని post box లో వేయడం అందరికీ అనుభవమే.కార్డు 10 పైసలు, inland letter(నీలిరంగు ) 25 పైసలు, మూత కవర్ (enevelop ) 50 పైసలు ఉండేది.విషయం open అయినా పర్లేదు అనుకుంటే కార్డు వ్రాసేవాళ్ళు, బంధువులకు inland letter వ్రాసేవారు. ఇదికూడా gum అంటించి మూసివేయవచ్చు. ఇక మిత్రలకు ప్రత్యేకంగా తెల్లకాగితం మీద వ్రాసి మూత కవర్ లో పంపేవాళ్ళం. చిన్నప్పుడు పోస్టల్ ద్వారానే వార్తా పత్రికలు పల్లెలకు చేరేవి. అప్పుడు ఆంధ్రపత్రిక వచ్చేది అలా 3 వ తరగతి నుండే వార్త పత్రికలు చదవడం అలవాటయ్యింది. ఇక మిత్రులకు ఉత్తరాలు వ్రాయడం డిగ్రీ లో మొదలయ్యింది. కలం స్నేహం చేయడంఅప్పు డొక మంచి అభిరుచి. నాకు గుర్తు ఉండి 2004 దాకా నాకు ఉత్తరాలు వ్రాయడం, నేను ఉత్తరాలు రాయడం జరిగింది.2005 లో అనుకుంటా మొదట సెల్ ఫోన్ కొన్నాం . ఇహ అప్పటినుండి క్రమేపీ ఉత్తరాలు వ్రాసుకోవడం తగ్గిపోయింది. నెల్లూరు లో డిగ్రీ చదివే రోజుల్లో ఇంటికి అమ్మా నాన్నకి ఉత్తరాలు వ్రాసే వాళ్ళం. అప్పుడు land phone చేసే అవకాశం కూడా లేదు. నెలాఖరు ఉత్తరం లో డబ్బులు పంపమని వ్రాసేవాళ్ళం. పాపం ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళో డబ్బులు పంపడానికి. Money order కోసం ఎదురు చూసే వాళ్ళం. ఇహ పత్రికలకు సీరియల్స్ చదువుతూ ఉత్తరాలు వ్రాసేవాళ్ళం.నేను పంపిన కవితను అభినందిస్తూ యండమూరి గారు వ్రాసిన కార్డు ఇప్పటికీ నాదగ్గర ఉంది.మా నాన్న  ఒద్దుల గోవింద రెడ్డి 30 ఏండ్లకు పైగా BPM (Branch post master) గా పనిచేసి retire అయ్యారు.ఆయన పని చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళం. ఇంటికి కార్డులు కవర్లు, స్టాంప్స్ కొనడానికి వచ్చే వారికిచ్చే వాళ్ళం.ఇంట్లో ఉన్నప్పుడు మిత్రులు వ్రాసే ఉత్తరాల కోసం పోస్టుమాన్ ఇంటికి రాగానే తపాలా సంచి తెరవగానే ఏమయినా ఉత్తరాలు వచ్చాయా అని చూసే వాన్ని. చిన్నప్పుడు గడ్డం క్రింద గాయం అయితే నాన్న తపాలా పని పూర్తయ్యే దాకా మావయ్య  దుగ్గెంపూడి సాంబి రెడ్డి తన చేతితో రక్తం రాకుండా పట్టుకునే ఉన్నాడు. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు..... ఒద్దుల రవిశేఖర్ 

Tuesday 27 September 2022

ప్రపంచ పర్యాటక దినోత్సవం

 ప్రపంచ పర్యాటక దినోత్సవం(27/9/2022) సందర్భంగా మీకు ఇష్ట మైన ప్రాంతాన్ని సందర్శించండి. జీవితాన్ని కొత్త కోణం లో చూడండి.ఖరీదైన వస్తువులు ఇచ్చేసంతోషం కన్నా కొత్త ప్రాంతాలు చూస్తే కలిగే ఆనందం మిన్న.పర్యాటకం మీ జ్ఞానాన్ని విస్తృత పరుస్తుంది.జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగ పడుతుంది. మీ పర్యాటకా నుభావాలను పంచుకొని మిగతావారికి మార్గదర్శకులు కండి. ప్రకృతి పరిమళాన్ని మీ గుండెలనిండా నింపుకోండి.ప్రపంచం లోని ప్రతి ఒక్కరూ ప్రతినెలా ఏదో ఒక ప్రాంతాన్నిసందర్శిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.... ఒద్దుల రవిశేఖర్.

Tuesday 20 September 2022

ఆనందమఠం... బంకించంద్ర చటర్జీ (అనువాదం:అక్కిరాజు రమాపతి రావు )

 "బంకించంద్ర చటర్జీ " పేరు చూడగానే వందేమాతరం గీతం రచయిత అని ఆసక్తిగా చదవడం మొదలెట్టాను. ఆయన గురించి అనువాదం రచయిత అక్కిరాజు రమాపతి గారు వివరంగా తెలియజేయడం తో మనకు చక్కటి అవగాహన వస్తుంది. ప్రముఖ బెంగాలీ రచయి త అయినప్పటికీ భారతీయ భాషా సాహిత్యాలను విశేషంగా ప్రభావితం చేశారు. మన స్వాతంత్ర సమరాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వందేమాతర గీతం ఇందులోదే.               ఇక నవలలోని ఇతివృత్తం సన్యాసులు "ఆనందమఠం"స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం. ఉత్కంఠ కలిగించే సంఘటనలతో కథను మలుపులు త్రిప్పుతూ, అద్భుతమైన వర్ణనలతో మనల్ని కట్టిపడేస్తుంది ఈ నవల.తెలుగు నవల అనుకునేలా రమాపతి రావు గారి అనువాదం మనల్ని చక్కగా చదివేలా చేస్తుంది.అడవిని వర్ణించడం చదివి తీరవలసిందే. బెంగాల్ వచ్చిన కరువును గురించి చదువుతుంటే హృదయం ద్రవించి పోతుంది.బ్రిటిష్ వారిపై సన్యాసుల స్వాతంత్ర్య ఉద్యమాన్ని, యుద్ధ సన్నివేశాలను ఊపిరి తీయకుండా చదివేలా చేస్తాయి.మధ్య మధ్య లో వందేమాతర గీతం వారి పోరాటాన్ని మరింత పదునెక్కిస్తుంది. పాత్రల చిత్రణ, సన్నివేశాల కూర్పు అంతా మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా అనిపించడం నవల యొక్క ప్రధాన లక్షణం. చక్కని చిక్కని తెలుగులో వచ్చిన నవల అనిపిస్తుంది. అనువాద నవల అనే భావనే కలగదు. ప్రతి ఒక్కరు తప్పక చదవ వలసిన నవల ఇది..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday 28 August 2022

అమరావతి ( గుడి ) కృష్ణా నది.

 అమరావతి గుడి                                 కృష్ణానది అందంగా కనిపిస్తూ ప్రవహించే ప్రదేశాల్లో అమరావతి (పుణ్యక్షేత్రం )ఒకటి.రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి ని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి వంశస్థులే ఆలయ ధర్మకర్తలు.ఇక్కడ నది చాలా విశాలంగా,వెడల్పు గా ఉంటుంది.నది ఒడ్డునే ధ్యాన బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు.2006 లో ఇక్కడ జరిగిన ప్రపంచ స్థాయి కాలచక్ర ప్రత్యేక కార్యక్రమాలకు బౌద్ధ గురువు దలైలామా గారు హాజరయ్యారు ఇక్కడే బుద్ధుడు మొదటి కాలచక్ర నిర్వహించారని ప్రతీతి  మిత్రులతో కలిసి కాల చక్ర కు హాజరైయి దలైలామా గారిని దర్శించాము.ఆలయం ముందు తూర్పు వైపు నది కి ఆనుకొని చక్కటి పార్క్ ను అభివృద్ధి చేస్తే బాగుంటుంది.(https://en.m.wikipedia.org/wiki/Dhyana_Buddha_statue)

Sunday 21 August 2022

కృష్ణా నది పరవళ్లు

 కృష్ణా నది పరవళ్లు                                     ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరుకొనడం తో డాం 10 గేట్లు ఎత్తి నీరు వదిలారని తెలిసి ఆదివారం(14/8/2022) చూద్దామని వెళ్ళాం.వందలాది కార్లు బస్సు లతో విపరీతమైన ట్రాఫిక్. Site seeing అని ఇంతకు ముందు 50 rs ticket తో APSRTC buses నడిపేది. ఆ service నిలిపివేయడం తో మనిషికి 200 rs పెట్టి auto లో వెళ్ళాం. మళ్ళీఈ service పునరుద్దరిస్తే సామాన్యులకు చాలా మేలు. మరి APSRTC వాళ్ళు స్పందిస్తారో లేదో చూడాలి. ఇక డాం దగ్గరకు చేరుకొని ఆ మనోహర దృశ్యాన్ని తనివి తీరా చూసి వీడియోల్లో ఫోటోల్లో బంధించాము. మనకు దగ్గరకు ఇంత అద్భుతమైన జల ప్రవాహాన్ని చూడడం అపూర్వం. 1 కి.మీ మేర నీటి తుంపరలు వెదజల్లుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాల్లేదు.10 గేట్ల నుండి దూకిన జల ప్రవాహం తిరిగి పాము పడగ విప్పినట్టు మళ్ళీ పైకి లేచి పడటం మహాద్భుతం. డాం నిండుకుండలా ఉంది. కానీ ఒకటే బాధ. ఇంత నీరు వృధా గా సముద్రం లోకి వెళ్ళిపోతుందే అని. ఈ నీరంతా వెలుగొండ ప్రాజెక్టు కు రాయలసీమ, తెలంగాణ లోని ప్రాజెక్ట్ లలో పట్టుకుంటే కొన్ని కోట్లమంది రైతులకు పండుగ అవుతుంది.... ఒద్దుల రవిశేఖర్.

Sunday 7 August 2022

నడక :ప్రయోజనాలు

 ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా జీవించడం కోరుకోని వారెవరు. కానీ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలా ఉండటానికి, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వెనుకడుగే ఎక్కువ మందిది. చక్కని ఆహారం, సరయిన నిద్ర,వంటికి వ్యాయామం ఇవి ప్రాధమికంగా అవసరం. ఈ వ్యాసంలో  వ్యాయామం గురించి తెలుసుకుందాం.మనం చేయదగ్గ అతి తేలికనది నడక.మనకు ఏదయినా దాని ప్రయోజనాలు తెలిస్తే ఆచరించడానికి సిద్దపడతాం.           నడక వల్ల ప్రయోజనాలు:                                                  1) రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది.                2)B.P నియంత్రణ లో ఉంటుంది. గుండెను శక్తివంతంగా మార్చి గుండె వ్యాధులను నివారిస్తుంది.                                          3)ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తుంది.   4) నొప్పి నివారణ ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఉద్వేగాలు నియంత్రించ బడతాయి.                       5)బరువు తగ్గుతారు.                                       6) కండరాలు బలవర్ధకంగా మారతాయి.            7) చక్కటి నిద్ర వస్తుంది                             8)కీళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.    9)శ్వాస క్రియ వేగంగా జరిగి ఆక్సిజన్ రక్తం లోకి వేగంగా వెళ్లడం వలన వ్యర్థపదార్ధాలు విసర్జింపబడి కొత్త శక్తి వస్తుంది.                                             10) వయసు పెరుగుదలతో వచ్చే మతి మరుపు తగ్గుతుంది.                                                   11) అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది 12)Osteo Arthritis ఉన్నవారికి మంచి వ్యాయామం.                                           మరి మొదలెడతారా నడక. ఈ సారి వ్యాసంలో నడక గురించి మరిన్ని విశేషాలుతెలుసుకుందాం.....ఒద్దుల రవి శేఖర్ (నడక ప్రయోజనాలు :Arthritis Foundation website నుండి )