ఇది రచయితచే రచింపబడి ఆదరణ పొందిన 3 పుస్తకాల కలయిక. 1)బుద్ధుడు-బౌద్ధ ధర్మం 2)జనం మనిషి 3)విరాట్ 1) బుద్ధుడు -బౌద్ధ ధర్మం. బుద్ధుడి జీవితాన్ని,బోధనలను అతిసరళంగా వివరిస్తారు రచయిత ఇందులో.ఇందులో ముఖ్యాంశాలు. * *జ్ఞానోదయం పొందినప్పటి నుండి మహాపరి నిర్వాణం వరకు నిర్భయంగా బ్రతికిన మహా పురుషుడు బుద్ధుడు. *ఆత్మదీపోభవ(నీకు నీవే దీపం కావాలి) *ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్వేచ్ఛ,సమానత్వం గురించి బోధించిన వాడు బుద్ధుడు.ప్రేమను,కరుణను,అహింసను ప్రపంచానికి మొదటి సారి బోధించినవాడు బుద్ధుడు. *ఆయన చివరి మాటలు:సృష్టిలో ప్రతిదీ నశించేదే.బాధ పడకండి.మీరు శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించి నిర్వాణాన్ని సాధించండి. *మనసును అదుపులో ఉంచుకోవడానికిపంచశీల,చతురార్య సత్యాలు,అష్టాంగ మార్గం దశపారమితలు బోధించారు.బుద్ధుడు క్రీ. పూ 563 లో పుట్టి 80 ఏళ్ల పాటు జీవించి 45 ఏండ్ల పాటు ధర్మప్రచారం చేశారు. 2)జనం మనిషి:ఒక డాక్టర్ మరణం,2 లక్షల మంది అంతిమ యాత్రలో పాల్గొనడం,ఇది కదా జీవితం.పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు,పుచ్చలపల్లి రామ్ గారి జీవితాన్ని చదువుతుంటే ఇటువంటి మనుషులు ఈ భూమిమీద జీవించారా అనిపిస్తుంది.మనిషిని ప్రేమించడం,పేదలకు ఉచిత వైద్యం,దాతృత్వం,ప్రజాసేవ,స్నేహ తత్వం,ప్రజల తరపున పోరాడడం ఆయన్ని ఒక విశిష్ట మైన వ్యక్తిగా నిలబెడతాయి.పుస్తక ప్రేమికుడు,జ్ఞానాన్వేషి,అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు,అత్యంత ధైర్యవంతుడు,కరుణామయుడు,గాంధీజీలా తను నమ్మిన విషయం ఆచరించినవాడు రామ్.ఒక డాక్టర్ గా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో తరించే వ్యక్తిత్వం అత్యంత అరుదు.చదివి తీరవలసిన జీవితం ఆయనది. 3) విరాట్ (మూల రచయిత: stephan thysvk) బుద్ధుడి కంటే ముందు జీవించిన ఒక గొప్ప యోధుడు,తాత్వికుడి జీవిత చరిత్ర ఇది. యుద్ధం వద్దనుకుని,సర్వ సైన్యాధ్యక్షుడి పదవిని కాదని న్యాయాధికారిగా నియమించబడిన ' విరాట్' కథ ఇది.తన తీర్పును ప్రశ్నించిన దోషి పాత్రలోకి ప్రవేశించి అతని శిక్షను తాను అనుభవించి,న్యాయాధికారి పదవిని త్యజించి,గృహస్థు జీవితాన్ని వీడి,అడవులలోకి వెళ్లి ఏకాంతంగా జీవించిన ఒక ఋషి కథ ఇది.చివరకు ఒక ఇల్లాలి ప్రశ్న తో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ఒక కుక్కల కాపరిగా జీవితాన్ని ముగిస్తాడు.హృదయాన్ని మెలిపెట్టే కథనం తో సాగుతూ గొప్ప జీవితసత్యాలను,తత్వాన్ని మనకందిస్తుంది ఆయన జీవిత గమనం.
Monday 10 May 2021
Saturday 1 May 2021
మానవ ఆరోహణ(The Ascent of Man)....మూలం:జేకబ్ బ్రోనోస్కీ.పరిచయం:ముక్తవరం పార్థసారధి
మానవ పరిణామ క్రమాన్ని వివరించే పుస్తకాల్లో ఇది 4 దశాబ్దాల క్రితంది అయినా మనకు ఈ మధ్యనే పరిచయం చేసారు పార్ధసారధి గారు.ఏదేమైనా ఈ అంశం పై ఏ పుస్తకమైనా నన్ను కుతూహలానికి గురిచేస్తుంటుంది. ప్రకృతి పరిణామం కన్నా భిన్నమైన విషయం "మానవారోహణ".జ్ఞానమెప్పుడు పరిణామక్రమం లో ఒక దశ మాత్రమే.ప్రతి పరిణామ దశలో కీలకమైన మలుపు ఒకటి ఉంటుంది.అదే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే దృష్టికోణం అన్న వాక్యాల ద్వారా రచయిత తను చెప్పదలచుకొన్న అంశాలకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు.మానవ మేధస్సు వివిధ రంగాలలో వికసించిన క్రమం ఇందులో ప్రస్తావించారు.1859 లో అచ్చయిన The origin of spices తో,1871 నాటి " the descent of man" తో చార్లెస్ డార్విన్ మనకు ఆదర్శం కావడాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఆసక్తి కలిగిస్తూ వెడతారు.20 లక్షల సంవత్సరాల క్రితం లభించిన పిల్ల వాడి పుర్రె ను విశ్లేషించి ఆస్ట్రలో పితికస్ దానికి పేరు పెట్టారు.తొలి రాతి పనిముట్టు తయారు చేసిన కాలం ఇది.10 లక్షల సంవత్సరాల క్రితం Homoerectus ఆవిర్భవించాడు.2 లక్షల సం. నాడు Neanderthal Man దర్శనమిస్తాడు.తరువాత దశలో వచ్చినవారు Homo sapien (మనం).మానవ చరిత్రలో మౌలికమైన ఆవిష్కరణ నిప్పును రాజెయ్యటం.అగ్నిని తయారు చేసిన మనిషి జీవితమే మారిపోయింది.ఈ విషయాలతో మొదలు పెట్టి తరువాత దొరికిన కుడ్య చిత్రాల ఆధారంగా 20,000 ఏళ్ల క్రితం మనిషిని విశ్లేషిస్తారు.గత 12,000 ఏళ్ల క్రితం నుండి జరిగిన మానవ చరిత్ర మీద దృష్టి సారించారు రచయిత.10,000 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు.మంచుయుగం చివరి దశలో వ్యావసాయిక విప్లవం(జీవ విప్లవం)ప్రారంభమైంది.మానవారోహణలో తొలిమెట్టు సంచారజీవితం మాని ఒక చోట స్థిరపడి వ్యవసాయం ప్రారంబించటమే.ప్రకృతి లో జరిగిన జన్యు సంయోగ ఫలితాల ద్వారా ఏర్పడిన గోధుమ ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా మనల్ని రచనలోకి మరింత ముందుకు వెళ్లేలా చేస్తారు.ప్రకృతి సహజంగా ఏర్పడిన వీటిని తరువాత పంట లాగా పండించడం నేర్చుకున్నాడు.క్రీ.పూ 6000 సం నాడు జెరికో వ్యవసాయ క్షేత్రంలో వీటిని పండించారు.తరువాత కొడవలి,నాగలి,చక్రం ఆవిష్కరించారు.కుక్క,గాడిద,ఎద్దు,గుర్రం వంటి జంతువులను పెంచుకుని వాటి సహాయం తో అదనపు సంపద సృష్టించిన విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా లభించిన ఆధారాల ఆధారంగా పనిముట్లు,నిర్మాణాలు చేయడం,లోహాలను వాడటం,గణిత అవిష్కరణలతో ఉదాహరణలతో మనకు ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతారు.ఇక 16 వ శతాబ్దం లో మొదలయిన పారిశ్రామిక విప్లవాన్ని గెలీలియో తో మొదలు పెట్టి న్యూటన్,leebnitz einstein,నీల్స్ బోర్ దాకా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.ఆవిరి యంత్రం కనుగొన్న జేమ్స్ వాట్,చార్లెస్ డార్విన్ ల కృషిని తలచుకుంటారు.కాంతి కిరణాల పై ప్రయోగాలు,రాంట్ జెన్ x రే కిరణాలు,లియో జిలార్డ్ అణు విచ్చిత్తి ప్రక్రియలను ప్రస్తావిస్తారు.గ్రెగరీ మెండల్ పరిశోధనలు,DNA ఆవిష్కరణ,క్లోనింగ్ వంటి ఆధునిక పరిశోధనల వరకు వివరిస్తారు.సైన్స్ నైతికతను పెంచాలని,మేధో ప్రజాస్వామ్యం అవసరమని చెబుతారు.what is man అనే రహస్యం తెలుసుకోవడానికి కొనసాగాలి ఆరోహణ అంటారు.జ్ఞానం వెనుక బాధ్యత,నిజాయితీ,విచక్షణ ఉంటుంది.మానవ జాతి మూలాలు, చరిత్ర ఆరోహణ క్రమం ప్రతి స్కూలు పుస్తకం లోను భాగం కావాలని అభిలషిస్తారు రచయిత.మనిషికి తన పరిణామ క్రమాన్ని గురించిన జ్ఞానమే ఆలోచన కలిగిస్తుంది.అనుభవం,ఆలోచనను కలగలిపి ఆచరణను నిర్ణయించుకోవాలని చెబుతారు. జ్ఞానాన్ని లాటిన్ భాషలో సైన్స్ అంటారు.చరిత్ర అంటే గతం కాదు,ఈనాడు,ఈ క్షణం మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న జ్ఞానమే చరిత్ర .దీని ఆధారంగా మనిషి ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయడమే మానవారోహణ అన్న ముగింపు తో మనలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. సైన్స్ ఉపాధ్యాయులు,అధ్యాపకులు,విద్యార్థులు,చరిత్రపట్ల అభిరుచి ఉన్న వారందరు చదవతగ్గ పుస్తకం ఇది....ఒద్దుల రవిశేఖర్.
Friday 30 April 2021
ఆనందో బ్రహ్మ.....యండమూరి.
కాలాన్నివెనక్కి ముందుకు నడిపించిన సుందరకావ్యం ఇది.భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ముందుగా అంచనావెయ్యడం కొంతమందికే సాధ్యం,ముఖ్యంగా రచయితలకి.యండమూరి ఆ విషయంలో పరాకాష్టకు చేరుకున్నారిందులో ఉదాహరణకు సోలార్ శాటిలైట్.ఇంకో 100 ఏండ్లు పోయినా సాంకేతికత ఎలా మారినా ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా చేసుకొని వ్రాసిన అపురూపమైన నవల ఇది. మంచినవల:ఉన్న పరిస్థితులు ఉన్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయడం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాల్ని కలుగజేసేది మంచినవల. నవల:మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే నవల....యండమూరి విశ్వనాథ సత్యనారాయణ,జంధ్యాలపాపయ్య శాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవులో స్మరించుకుంటారు. గోదావరి నది వర్ణించడం విషయానికి వస్తే కవి విశ్వరూపం కనిపిస్తుంది.తెలుగు భాషలో రచయిత వాడే కొన్నిపదాలు నిఘంటువు చూసి తెలుసుకోవాల్సిందే,కొన్నింటి అర్ధం వివరిస్తుంటారు.పల్లెటూరిని వర్ణిస్తుంటే అటువంటి ఊర్లలో కొంత కాలం గడుపుదామనిపిస్తుంది. "భూదేవి కొత్త పెళ్లికూతురయితే బంతిపూలు పసుపు!మిరప పంట కుంకుమా!" ఎంత చక్కని పోలిక.సాహిత్యమన్నా,గతకాలపు కవుల కావ్యాలన్నా రచయితకి ప్రాణం.వారి పేర్లను, వారి పద్య,గద్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించకుండా ఉండరు.సంక్రాంతికి పల్లె ఎలా ఉంటుందో చదివి తీరవలసిందే. *"అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్పవేదం లేదు".ఆణిముత్యం లాంటి మాట. పద్యాలంటే రచయితకు చాలా ఇష్టం.మనం చదవని, మరిచిన,కావ్యాల్లోని పద్యాలను పరిచయం చేస్తూ తన్మయత్వం చెందుతూ మనల్ని పరవశించి పోయేలా చేస్తారు.ఇక స్త్రీని వర్ణించడం లో ప్రబంధకవులైన కాళిదాసు,ముక్కుతిమ్మన,శ్రీనాధుడు,అల్లసాని పెద్దనల కే మాత్రం తీసిపోని శైలిలో మనకర్ధమయ్యే వచనంలో వ్రాస్తారు. మందాకిని పాత్రను అత్యద్బుతంగా మలిచిన తీరు తెలుగు నవలా చరిత్రలో కలికుతురాయి.అలాంటి వ్యక్తి ఒకరయినా జీవితంలో సరయిన దశలో మార్గదర్శకత్వం చేస్తే ప్రతివ్యక్తి జీవితం మారిపోతుంది. సోమయాజితో పలికించిన పద్యం రచయిత వ్రాసిన అద్భుత మైన పద్యం.కార్తెలను వర్ణిస్తూ మందాకిని వ్రాసుకున్న డైరీ లో ప్రకృతిలో మనం కలిసిపోవాలని పిస్తుంది.మరిచి పోతున్న తెలుగు భాష ,సంస్కృతిమీద తీవ్రమైన ఇష్టం పుట్టించే నవల ఇది.గుండెను వీణ మీటినట్లు మీటిన నవల ఆనందోబ్రహ్మ. "వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం".యండమూరి ......ఒద్దుల రవిశేఖర్.
Thursday 29 April 2021
ప్రేమ....యండమూరి
పల్లెను వర్ణించాలంటే మాటలు చాలవు.వేప చెట్టు వేదం చదవడం,కొబ్బరాకులు నీటిలో జల తరంగిణులు మ్రోగించడం తో మొదలవుతుంది రచయిత పద విన్యాసం." వేదసంహిత"ను సృష్టిస్తూ బ్రహ్మ ఆమెను గురించి శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు అక్షరాలను విరజిమ్ముతుంటే మనకు విభ్రమం కలుగుతుంది. ,మోహనరాగం,బిలహరి గురించి లోతుగా తెలుసుకుని మరీ మనకు వివరిస్తారిందులో.ఆంథ్రోపాలజీ గురించి పాఠకుడికి వివరంగా పరిచయం చేస్తూ ఇది ప్రేమ పై ఆధారపడి ఉందని చెప్పిస్తూ నవల యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తారు.ఊరు మేల్కోవడాన్ని కన్నులకు కట్టినట్లు వ్రాస్తారు.పనిచేసే వారు పాడే పాటల్లోని అంత రార్ధాన్ని కూలంకషంగా వివరిస్తారు. "పొద్దున్నే ఊరు మేల్కొవటం ఓ పాటైతే మేల్కొన్న తోటను చూడటం ఒక కావ్యం.ప్రేమ ,పైరును పోల్చడం ఆసక్తికరం.ఆంత్రోపాలజీ ప్రేమ చుట్టూ కోట కట్టి అందులో ప్రేమను బంధించింది అని చెబుతూ మనుషులు ఎందుకు ప్రేమ రాహిత్యంగా,ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వివరించిన తర్కం బాగుంది."ప్రేమించడానికి హృదయం ఉండాలి.ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి" ప్రేమంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ వల్ల కలిగే సంపర్కం మాత్రమే కాదు,విశ్వాన్నీ,ప్రకృతిని,సాటి మనిషిని ప్రేమించడం అని చెప్పడం ద్వారా ప్రేమకు సంపూర్ణ నిర్వచనం ఇచ్చారు. చరిత్ర చదివిన వారికే సరిగా ఈ అపాచీ కల్చర్(red indians) గురించి తెలీదు.సరిగ్గా ఈ విషయాన్ని తన "ప్రేమ" కు ఇరుసుగా మలచుకున్నారు యండమూరి.పోలీస్ ఆఫీసర్,అపాచీ నాయకుడి మధ్య సంభాషణలు సినిమాగా తీస్తే కళ్ళప్పగించి చూస్తాం."కోరిక యొక్క సాంద్రతని కొలిచే సాధనాలు ఇంకా ఈ ప్రపంచం లో కనుగొనబడలేదు." "ద్వేషం స్థానం లో ప్రేమను నింపండి.నవ్వును ప్రేమించండి." చక్కటి సందేశాలు."కన్నీటి చుక్కకి చాలా విలువుంది.ఇతరుల కష్టాల్ని చూసి అది స్రవించాలే కానీ,మన గురించి కాదు".గొప్ప సహానుభూతిని చూపే భావం. " సాటి మనిషికి చేయి అందిస్తే ప్రపంచమంతా సుఖ శాంతులతో వర్ధిల్లుతుందనే నమ్మకమే విశ్వ జనీనమైన ప్రేమ"అన్న వాక్యాల ద్వారా ప్రేమలోని విశ్వ వ్యాప్త భావనను ఆవిష్కరించారు. "ప్రేమకి పునాది నమ్మకమయితే పై కప్పు భద్రత". పిల్లలాడే ఆటల్లోని అర్ధాలు వివరిస్తారు.ప్రకృతి ని వర్ణించడం లో యండమూరి తర్వాతే ఎవరయినా అనిపిస్తుంది."ప్రకృతి ని ప్రేమించడమే అన్నిటికన్నా గొప్ప".ప్రేమించు --ప్రేమను పొందు అన్న ఆలోచనా స్రవంతే సంక్రాంతి.ఇక 5 రోజుల పెళ్లిళ్లు ఎలా చేస్తారో చదవ వలసిందే.మనం మరచిన మన సంప్రదాయాలన్నీ గుర్తు చేస్తారు."మట్టినీ, మేఘాన్ని, మొక్కనీ ప్రేమించ లేని వాడు ప్రపంచం లో దేనినీ ప్రేమించలేడు. అచ్చ తెలుగు సంస్కృతి నిండిన ఓ పల్లె గురించి వ్రాసిన విధానాన్ని ప్రతి తెలుగువాడు చదవాలి.ఇక తెలుగు భాషలోని గొప్పదనాన్ని వివరిస్తూ పద్యాలు మన భాషకు ఎలా తలమానికమో ఛందస్సు అలంకారాలు మనకే ఎలా ప్రత్యేకమో వివరించడం తెలుగు భాషపై మనకు మరింత మక్కువని పెంచేలా చేస్తాయి.ఆంధ్ర ,తెలంగాణ,రాయలసీమ నేపధ్యాలుగా కవి చెప్పిన గేయాలు హృదయాన్ని హత్తుకుంటాయి.తనను ఉరితీయబోయిన కార్టిస్ ను తన రక్తం ఇచ్చి రక్షించబోయిన అభిషేక్ పాత్ర ద్వారా ప్రేమ విశ్వరూపాన్ని చూపారు." మీకీ ప్రపంచం లో అయిష్టమైన దేదీ లేదా అన్న ప్రశ్నకు .....యండమూరి పలికించిన జవాబు ఏ తత్వ వేత్త చెప్పిన దానికి తీసిపోదు.ఈ ఒక్క జవాబు ఆయన్ను నవలా శిఖరాగ్రాన నిలబెడుతుంది."ప్రేమంటే సౌందర్యం,సౌందర్యమంటే ఆనందం." ఉప్పెన లో సముద్రం లో ప్రేయసీ ప్రియులు గడిపే దృశ్యం ఇందులో చదివి ప్రభావితమైనట్లుగా ఉంది.అద్భుతమైన ఈ వర్ణన ఉప్పెన సినిమాలో ఆవిష్కృతమైంది.ఓ మహాత్మాగాంధీ, ఓ నెల్సన్ మండేలా,ఓ మార్టిన్ లూధ ర్ కింగ్,ఓ ఆంగ్ సాన్ సూకీ లా అభిషేక్ ని అపాచీల కోసం పోరాటం చేసే నాయకుడిగా నిలపటం విశ్వ జనీనమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం....ఒద్దుల రవిశేఖర్.
Wednesday 1 July 2020
సాధారణత్వం
Friday 29 May 2020
భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.
Wednesday 20 May 2020
సాయి అభయారణ్యం
Tuesday 19 May 2020
నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ
ఆధునిక ఇతిహాసం,నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ :ఒద్దుల రవిశేఖర్ *కవి వ్యక్తీకరణ సమాజం గురించి అందులోని సమస్యలకు తన ప్రతిస్పందన.ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్లమంది కోసం,భారత దేశం లోని 50 కోట్లమంది(రచనాకాలం జనాభా)కోసం గొంతెత్తుతాను అంటూనే ఈ దేశమే కాదు మానవ జాతి అంతా ఇదే వేదన పడుతుందని విశ్వవేదనను తన కలం ద్వారా పలికించాడు. తన పలికే నా దేశపు నాలికపై పలుకుతుందని ప్రకటించాడు. *ఇతిహాస నిర్మాణానికి తన అనుభవం,పాండిత్యం అంతా ధారబోసి రచించానని ప్రకటిస్తూ నా రక్తమే ఈ ఇతిహాసం అనడంలో తనలో పగిలిన బడబానలమేఈ రచన అంటూ విశ్వమానవుడయ్యారు."అనుభవ జ్ఞాన నేత్రద్వంద్వం" అనే పదప్రయోగం అద్భుతం.అనుభవం,జ్ఞానం అనే రెండు నేత్రాలతో మానవచరిత్రను పిండినట్లు తెలియజేసారు.అందుకే ఎంతో స్థిరంగా ఇది ఈ శతాబ్దపు పాటగా ధైర్యంగా ప్రకటించుకున్నారు. *తన అనుభూతికోసం ప్రతితరం కవులు ఒక భాషను సృష్టించుకుంటారు.ఈ కాలపు మనిషిని అవిష్కరించడాానికి నేను ఒకభాషను,ఒక లోకాన్ని సృష్టించానని ,ఎందుకంటే మనిషి లాగా,ఎవరికీ తలవంచని స్వతంత్రమానవుడు ఈ కాలం మనిషి కనుక. ఇప్పటి మనిషి గతం లోని వ్యవస్థను విధ్వంసం చేయడమే లక్ష్యంగా నమ్ముతాడు కాబట్టి.కనుక తన రచన ఇప్పటి మనిషి ఆశల్ని,ఆశయాల్ని, తిరుగుబాటును ప్రతిబింబిస్తుందని చెబుతారు. *కర్షకుని ఇతివృత్తమే ఈ కావ్యం.ఈ ఇతిహాసం లో అంతా కర్షకుని శ్రమే కనపడుతుంది .ప్రపంచ సాహిత్యాన్ని విస్తారంగా చదివిన అనుభవం ఆయన ఇచ్చిన విభిన్నభాషల్లోని పుస్తకాల ఉదాహరణనుబట్టి మనకర్ధమవుతుంది. ఒకటో సర్గ. కర్షకుని,కార్మికుని హస్తం ఎన్ని పనులు చేస్తుందో వర్ణిస్తూ "మానవ జీవిత పొలాల్ని దున్నుతా"అన్న ఒక్క వాక్యం తో వివరిస్తారు.కానీ రైతుకు ఏమీ దక్కలేదని నిర్వేదం చెందుతాడు.ప్రపంచంలో అన్ని మార్పులు తన చేతి గుండా జరుగుతున్నా తన జీవితం ఏమీ మారలేదని ఆవేదన తో తనలో రగిలే ఎర్రకోరికనే ఒక జెండాగా ప్రకటిస్తారు.తన అంతరంగ ఆవేదనను తిరుగుబాటుగా మార్చి పలుకుతున్న ఈ భావాలు చూడండి."తుఫానులు లెక్కజేయని నాకు ఈ క్షుద్బాధ ఒక లెక్కా!మిలియన్ల సుత్తులు, కొడవళ్లు సూర్యకిరణాల్లో ప్రతిఫలిస్తున్నాయి.".సముద్రపు అశాంతిని,ం
ఝoఝామారుతపు ఆవేశాన్ని తనలో పలికిస్తున్నాడు. *కాలమనే కాగితంపై ఒక స్వప్నం రాసి తన ఊపిరితో సంతకం చేస్తా అంటూ భవిష్యత్ తరానికి ఒక సందేశం అందిస్తారు.తన కోరిక మనిషిలో అశాంతిని రేకెత్తించి ఉద్రిక్త రక్తం లా ప్రాకుతుంది అంటారు.తన పద్యాలను పొందే అర్హత భూగోళo మీద అన్ని జాతులకూ ఉంటుందంటారు.పైన తెలిపిన ధిక్కార ధోరణి ఏమయినా రుచించక నోబుల్ బహుమతి నిరాకరించారేమో అనిపిస్తుంది.అంతలోనే వసంతాన్ని వర్ణిస్తూ మనల్ని హాయిగా పలుకరిస్తారు. *అడవుల్ని కప్పుకొని, నదుల్ని తలపాగాలాగా చుట్టుకోవడం,రస్తాలను ఉత్తరీయాలుగా వేసుకోవడం లాంటి ప్రయోగాలతో ప్రకృతే తానై పోయాడు.తన దేశపు పర్వతాలను ఇతిహాసాలుగా మలచ దలుచుకున్నా అని ప్రకటిస్తూ తన మార్గం చెప్పకునే చెప్పారు. రెండోసర్గ: తనను ఒక తుఫానుగా పరిచయం చేసుకుంటాడు. తన జాతి కెరటంలా ఆకాశం మీదికి దుముకుతుంది అని ధిక్కరిస్తారు. నగరాలు ఏర్పడకముందు,నదుల్ని దాటి ఇతర దేశాలకు ఎలా ప్రయాణమయ్యింది వర్ణిస్తూ భూమిని వాక్యంలా,నీలి సముద్రాలు,కామాలు,సెమీకొలన్లుగా పరిగణిస్తాడు. సముద్రాలు,భూమి ప్రేమ లేఖలు వ్రాసుకునే నీలిసిరిగిన్నెలుగా అభివర్ణిస్తూ అందులోని సిరాలోనుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు,నాగరికతలు,విజ్ఞానం అని ఓ మనోహరమైన పోలికను ప్రతిపాదించారు. మూడో సర్గ హైదరాబాద్ మహానగరంగా మారాక ఎంత కాలుష్యకారకంగా మారిందో ఇందులో వర్ణిస్తారు.చెట్లు తనకేసి చూస్తూ మాకు కవిత్వాలు వద్దు,వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వమని అడుగుతాయని చెప్పడం ద్వారా చెట్లెంత విషాదంలో ఉన్నాయో కాలుష్యాన్ని పీల్చలేక అనిపిస్తుంది.పూలెందుకు పూస్తాయి ఇవి,బుల్లెట్లు పూయక అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.మిలియన్ల కొద్దీ మనుషుల గొంతుల్ని కాలం నొక్కివేస్తుంది ఈ నగరం లో,కానీ నీలగిరి కొండల్లో చెట్లు,పర్వతాల నడుమ చిక్కి చూస్తుంది కాలం అనే పోలికతో కవిత్వం లో కొత్త పోకడలు పోతారు." ఇక్కడ మనిషి సంతోషపు ఇంద్రజాలం లో శబ్దమై,పాటై, పక్షుల పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు.కాలం చేతి వేళ్ళ లోంచి కారిపోతాడు మనిషి."ఈ వాక్యాల్లో మనిషి పొందే ఆనందపు అంచుల్ని పట్టి మనముందుంచుతారు.ఇక్కడ పక్షులు, కీటకాలు అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాయి.ఇక్కడ మనిషి బుద్ది,అహంకారాలకు అధికారం లేదు.అందుకే కాలాన్ని నగరాలనుండి, కొండల్లోకి ఈడ్చుకువచ్చి సంహరించాను అని చెప్పడం ద్వారా తను ఎంత ప్రకృతి ప్రేమికుడో,అందులో ఎంత లీనమయ్యారో,ఎంత ఆనందం అనుభవించారో మన కర్ధమవుతుంది.విత్తనమై,చెట్టయి, పువ్వై వాటి మార్పుల్ని ,.పక్షినై,చేపనై మారి వాటి స్వేచ్ఛను తాననుభవిస్తారు. పండు ఒట్టి సన్యాసి! సత్యదర్శనం కోసం తపస్సులో మునిగి పోయిన ఋషి ,ఎప్పుడయితే అది లభిస్తుందో అప్పుడు రాలిపోతుంది.అంతవరకు పండు ధ్యానం చేస్తున్న ఋషి అంటారు.ఈ ఒక్క పోలికతో ఆయన కవితా సౌందర్యం తాత్వికసీమల వైపు పయనిస్తోంది.రాలే పండు అనుకుంటుందట-చెట్టు గింజ తన కడుపులో ఉందని,చెట్టు నేను,ఒకటేనని ఎంత తాత్వికతను పండించారో ఇక్కడ! ఈ ధరిత్రి ఒక సృష్టి ప్రదర్శనశాల.పశువులు,పక్షులు,వృక్షాలు,మనుషులు అందరూ మట్టిలోకి అస్తమిస్తారు.కాలం అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది.,నిర్దాక్షిణ్యంగా.ఈ నాగరికతలను నిర్మించటానికి చెమట ఒక శాశ్విత అంతర్వాహినిిలా ప్రవహిస్తూ ఉంటుందని హెప్పడా ద్వారా శ్రామికుని పాత్రను ఆవిష్కరిస్తారు. ఈ ప్రదర్శనశాల ఎన్నో నాగరికతలు,ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి.అన్ని నశించిపోతుంటాయి.కానీ మనిషి బౌద్ధికశక్తి మరో మార్పుకు బీజం వేసుకుంటుంది. నాలుగో సర్గ. ఇందులో మళ్లీ తన కవిత్వాన్ని కదనాశ్వo లా దూకిస్తారు.ఎరుపు,రక్తం వంటి మాటలతో ధిక్కారం తన అజెండాగా ప్రకటిస్తారు.నేను పోయినా నా కవిత్వం,నా జ్ఞాపకాలు ఈ దేశపు గాలిలో పక్షులై పాడుతుంటాయి,అని తన కవిత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.చెట్లను,ఆకులుకాదు తుపాకులు కాయమని అడుగుతున్నాడు.అంతలోనే నిర్వేదం లో మునిగిపోతాడు. ఇప్పటివరకు ప్రకటించిన తిరుగుబాటు మాయమై తను ఓడిపోతున్న జీవినని,నేలమీద నడుస్తున్న బాటసారినని, ధ్యానంచేసుకోవాలనుందని ,తన ఏకాంతానికి భంగం కలిగించని దేవుడు లేని దేవాలయానికి పారిపోవాలని ఉందని తన నిస్సహాయతను వ్యక్తపరుస్తారు.ఈ ధ్యానంలోనుండే చివరకు దేవుడినయ్యాను అని చెప్పుకుంటారు.సూర్యోదయం,సూర్యాస్తమయాల్లేని అలౌకిక నిశ్శబ్దం లో మునిగిపోయాను అని తన స్థితిని వర్ణిస్తారు.చెట్లను నరికే కసాయి వాని చేతులు నరకాలి అని తనెంత వృక్ష ప్రేమికుడో తెలియజేస్తారు.తన ప్రయాణాన్ని తన ప్రేయసికి తెలియ జేస్తూ ఆయన కలం తెలుగు భాషను భరత నాట్యం ఆడేలా చేసింది."నీవక్షస్ శాద్వలసీమ మీద నా కవోష్ణ కిరణాల హిరణ్యం వెదజల్లుతాను". ఐదో సర్గ మళ్లీ ఇందులో తనే నీ మోహినీత్వoతో తనని మోసం చేయవద్దని తనలో ద్వేషాన్ని తొలగించవద్దని,దాంతో నాలోని అగ్ని పర్వతాలు పగలనీయమని కోరుకుంటాడు.ఈ నేల ఎంతకఠినమైందో చెబుతూ తన గాయాల రక్త జ్వాలల్ని ఎండమావులుగా ఉమ్మివేస్తున్న నేల గా అభివర్ణిస్తారు."అవి రాళ్ళని ఎవరన్నారు,నోళ్ళుమూసుకున్న అంతరాత్మలు"అని చెప్పడంలో రాళ్లు ఎన్ని యుగాలనుండి అన్ని దోపిడీలు,దారుణాలు చూస్తూ మౌనంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారు. కర్షకునికి నీ ఒంటరికావు,నీ అడుగులో అడుగేసే వాళ్ళు ఉన్నారని మరువకు అంటాడు.కొండలు ఎందుకు అరవవు,రాత్రుల కపాలాలు పగలవెందుకు,ఈ నక్షత్రాలు చచ్చి నేలకు రాలవెందుకు,ఈ జనం నా మాట వినరెందుకు ,వీరిని ఎలా మార్చాలో తెలీదు అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు. ఆరోసర్గ. పరిణామ క్రమంలో భూమంతా మానవులు స్వేచ్చగా తిరిగినట్లు తను అలాంటి దేశద్రిమ్మరినని చెబుతూ నేను పీల్చే ఊపిరే పోట్లాట అని స్పష్టంగా ఎలుగెత్తిచాటుతారు."నేను సత్యాగహిని,సత్యం నా గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం,నా గొంతులో గర్జిస్తున్న జలపాతం అని సత్యం కోసం తన కోసం తన పోరాటాన్ని ఆరంభిస్తారు."దేశం కోసం పోరాడటానికి తరలిరమ్మని ప్రజలకు పిలిపిస్తున్నాడు.మీ వేడి గొంతులతో నా తుపాకులూ, నా శతఘ్నులు తయారుచేసుకుని దేశం కన్నీరును తుడుస్తాను"అని తన దేశభక్తిని చాటుకుంటారు."నా గొంతు ,నా భాష జాతికి అంకితం,నేను ఒక రక్త ప్రవక్తను".అంటూ నా పద్యాలనే బందూకులు తీసుకురండి,మబ్బుల్లో దాచుకున్న పిడుగులు తెండి,రండి,అంటూ తనని తాను ఝంఝామారుతాన్ని అని ప్రజలకు పిలుపిస్తారు.పీడిత ప్రజలదే ఈ భూమి,నాతో కలిసినడవండి, నాగళ్ళు తీసుకు రండి,మనల్ని బానిసలు చేసిన వాళ్ల ప్రాణ వాయువులు తీద్దాం రమ్మని విప్లవోన్ముఖం వైపు ఒకరకంగా ఒక Long March కోసం పిలుపిస్తారు.ఆకలి ,దప్పికలు నీ స్వేచ్ఛను హరిస్తున్నాయి.విద్యార్థులను పుస్తకాలు వదిలేసి పొలాలు ఆక్రమించుకుందాం రమ్మంటారు."స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస.అది నీ రక్తపు సజీవభాష. నీ చివరి శ్వాస వరకు స్వేచ్ఛను నిలుపుకోవడమే నీ ధ్యాస "అంటూ మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలియ జేస్తారు.తన ఆగమనాన్ని ,తన మహాప్రస్థానం కర్షకులకోసం అంటూ తన శక్తి ,రక్తం అంతా ధాన్యంగా,పండ్లుగా మారిపోవాలి.తను ఒక ఉద్యమ విద్యుత్తు ఇస్తున్నానంటూ పిలుపిస్తారు.తిండి గింజలు ఎలా వస్తున్నాయి.వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవాలంటారు."భూమిని బుజ్జగిస్తాను,లలితంగా లాలిస్తాను.వెన్నలాంటి మన్నుతో గోరుముద్దలు చేసి పైర్ల పసినోళ్ళ కందిస్తాను.".భూమి పట్ల,పంట పట్ల రైతు ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరు వ్రాయగలరు.ఇంత చేస్తున్నా నాకు గుడిసెతప్ప ఏమీ లేదని కర్షకుని దైన్యాన్ని తనలో పలికిస్తారు. ఉదయాన్నే సూర్యోదయం అవుతుందని ఆశిస్తే సూర్యగ్రహణం వచ్చిందని ,మనుషుల్ని అలా మోసం చేసారని ఆవేదనతో జ్వలించి పోతారు."ఎవరు నేల గొంతు ఆలకించి దాన్ని లాలించి తన చెమటతో,రక్తంతో వెన్నలా,జున్నులా మృదువు చేశారో" రైతు దేహంలోకి ,మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుంది ఈ కవిత్వం.ఇంత చేసినా చివర్లో ఒక్కగింజ దక్కలేదని బాధపడతారు.మనిషిని అవమానించిన వాణ్ణి దుర్భాష లాడతారు.తిట్లు చిన్నవి,నా దేహమంతా అగ్నిఛ్చటుల వర్షపాతం వీస్తోంది. అది మిమ్మల్ని భస్మిపటలం చేస్తోంది అని హెచ్చరిస్తారు.రైతుకు ఏమీ దక్కనివ్వని ఈ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు."ఈ దేశం లో ఒంగేవాడికి ఒంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు"అని బానిసలుగా బ్రతికే వారిని ప్రశ్నిస్తారు. ఏడవ సర్గ చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు.సూర్యుడు భూమిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. తన దేశాన్ని తన ప్రేయసిలో చూసుకుంటూ ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం విసిరే క్రూర సవాళ్ళను ఎదుర్కొంటాను,అని ముగిస్తారు. *శ్రామికునిపట్ల,కర్షకుని పట్ల సామాన్యమానవుని పట్ల ఇంత ప్రేమ,ఆపేక్ష చూపించిన కవి మనం చూడలేమేమో!శ్రీశ్రీ మహా ప్రస్థానం మానవ సంగీతాన్ని పలికిస్తే శేషేంద్ర "నా దేశం,నా ప్రజలు" మనిషి గుండెలోని బడబాగ్నిని అగ్నిపర్వతం లా తుఫానులా విరుచుకు పడేలా చేస్తుంది. *ఈ ధిక్కార ధోరణే ఆయనకు నోబుల్ బహుమతిని దూరం చేసిందేమో అనిపిస్తుంది.ఠాగూర్ "గీతాంజలి"కి ఏమాత్రం తీసిపోని కావ్యం.నోబుల్ బహుమతికి అర్హమైన కావ్యం.
Saturday 16 May 2020
విత్తనాలు నాటుదాం.
Saturday 25 April 2020
Monday 20 April 2020
SAPIENS A Brief history of human kind by Yuval Noah Harari పై విశ్లేషణ ......ఒద్దుల రవిశేఖర్
Sunday 5 April 2020
అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్
Wednesday 1 January 2020
కాలచక్రం 2020
Monday 10 September 2018
అనంతపురం యాత్ర.
హోటల్ కు వచ్చి పలకరించారు. టిఫిన్ గా ఆప్రాంత ప్రత్యేక వంటకమైన ఓలిగలు పెట్టించారు. పక్
భక్ష్యం కంటే పలుచగా చాలా బాగున్నాయి. 8:30 కి కార్ లో బయలుదేరాము, మొదట పెనుగొండ కోట కు బయలుదేరాం. మార్గమధ్యంలో కియా మోటార్స్ మీదుగా వెళ్ళాము, వందల ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి కొరియా భాషలో దారి పక్కన బోర్డులు దర్శనమిస్తున్నాయి, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు పోషించిన సాళ్వనరసింహరాయలు స్థాపించిన కోట ఈ పెనుగొండ కోట, చుట్టూ కోటగోడ తప్ప ఏమీ మిగల్లేదు అక్కడే కాళేశ్వర్ ఆశ్రమం, జైన దేవాలయం చూసి కృష్ణదేవరాయలు అద్భుతమైన విగ్రహాన్ని చూసాము.
అక్కడ నుండి లేపాక్షి వెళ్ళాము మేము వస్తున్నామని ఆనంద్ భాస్కర్ చెప్పడంతో కేశవరెడ్డి మమ్మల్ని స్వాగతిస్తూ ఆలయంలోని శిల్పాల ప్రాధాన్యతను తెలియచేస్తూ 2 గంటలపాటు వివరించారు, మరియు ప్రత్యేక దర్శనం చేయించి వారు చేసిన అతిధి మర్యాద మరువలేనిది, వారు లేకపోతే ఒక అర్ధగంటలో బయటికి వచ్చే వారం అక్కడ మాకు పశ్చిమగోదావరి మిత్రుడు శేషేంద్ర గారు కలిశారు అందరిని మరలా కేశవరెడ్డి వారి ఇంటికి తీసుకెళ్లి
ఆదరించారు, తరువాత ప్రసిద్ధి చెందిన నంది విగ్రహాన్ని
దర్శించాము. గండభేరుండ పక్షి ని ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించారట, లేపాక్షి ఆలయానికి సరియైన ప్రచారం లేదనిపిస్తుంది తమిళనాడు ఆలయాల తరహాలో శిల్పకళ ఉట్టిపడు తుంది.పర్యాటకులు విస్తారంగా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
కదిరి దగ్గర ఉండే తిమ్మమ్మ మర్రిమాను దగ్గరికి వెళ్లాం.దాదాపు 600 సంవత్సరాల క్రితం తిమ్మమ్మ నాటిన ఈ మొక్క 8 ఎకరాల్లో విస్తరించి అద్భుతంగా కనిపిస్తుంది.
పచ్చగా కళకళలాడుతూ ఉన్న మర్రిచెట్టును తనివితీరా చూసాం.చెట్టు మొదలు శిథిల
మవటంతో అక్కడ చిన్నగుడి కట్టారు.అటవీ శాఖ దీనిని చాలా చక్కగా పరిరక్షిస్తుంది.ప్రతి సంవత్సరం ఈ చెట్టు విస్తరిస్తోంది.
ఈ వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయింది.
తరువాత కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యాము..
Tuesday 28 August 2018
మహాబలిపురం(తమిళనాడు) యాత్ర.
Thursday 19 October 2017
శ్రీశైలం ఆనకట్ట సందర్శన
Monday 26 June 2017
కృష్ణమూర్తి ఫౌండేషన్,చెన్నై సందర్శన
ఎప్పటినుండో అనుకుంటున్న కోరిక తీరింది.నిన్న ఆదివారం 25/6/17 న చెన్నై egmore నుండి అడయార్ లోని జిడ్డు కృష్ణమూర్తి నివసించిన వసంత విహార్ ను చూడటానికి వెళ్ళాను.అడయార్ లోని ఆంధ్ర మహిళసభ నుండి Greenways road లో కొద్దిగా ముందుకు వెడితే వస్తుంది.అమెరికా నుండి ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక నెలపాటు ఉపన్యాసాలు ,చర్చలు చేస్తుంటారు. 6 ఎకరాల సువిశాల స్థలం లో పాతకాలపు రెండస్తుల భవనం ఉంటుంది.పైన కృష్ణమూర్తి పుస్తకాలతో కూడిన గ్రంధాలయం,క్రింద సమావేశ మందిరం ఉన్నాయి.చుట్టూ విభిన్న రకాల వృక్షాలతో కూడిన తోట ఉంది.వెదురు,మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి.ఆయన మరణించిన తరువాత ఆయన కోరిక మేరకు అధ్యయన కేంద్రంగా మార్చారు.ప్రతి నెల 3 రోజుల ఉండేలాగా అక్కడకు వెళ్ళాలి.ఆ 3 రోజుల్లో చర్చలు,వీడియో పాఠాలు,పుస్తక పఠనం లో నిమగ్నమయి మన జీవితాలలో జరిగే అనేక విషయాలపై లోతయిన అవగాహన కలిగించుకోవచ్చు అని చెప్పారు.ఉండటానికి వసతి ఉంది.అఖిలేష్ అని అక్కడే ఉండే నిర్వాహకుడు ఈ విషయాలు చెప్పారు.కృష్ణమూర్తి స్కూల్ నిర్వాహక లైన భరత్ గారు పరిచయమయ్యారు.నేను టీచర్ అని చెప్పగానే స్కూల్ లో పనిచేయండి అని ఆహ్వానించారు.ఈ క్రింది చిత్రాలు చూస్తే మీరు తప్పక వెడతారు.అడ్రస్ THE STUDY ,KRISHNAMURTI FOUNDATION INDIA,Vasantha vihar,124 Greenways Road,R.A.Puram,Chennai 600028 Landmark- between Andhra Mahila sabha hospital and Greenways Road Railway station) Tel:044-24937803/596,Email:vvstudy@kfionline.org,website:www.kfionline.org,Facebook:kfivasantaviharchennai
Monday 5 June 2017
Finland లో విద్యావిధానం
అక్కడ ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం ఫిన్లాండ్. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.
పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్ నెలల్లో ఏ టీవీ ఛానల్ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.
సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసెస్‌మెంట్’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్ సొంతం.
*ఏడేళ్లకు స్కూలు... *
మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలేద’ంటారు అక్కడి ఉపాధ్యాయులు
*చదువంతా ఉచితం*
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.
*ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...*
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్ ఎలొవెన్స్’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!
*రోజూ ఒంటిపూట* బడులే...
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.
*ర్యాంకులకు చెల్లు!*
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానం సాగుతుంది.
*ఒకే ఒక్క పరీక్ష!*
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.
*టీచరే సూపర్‌స్టార్!*
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్-టీచర్’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్ ఈజ్ మోర్’ అన్నది ఫిన్లాండ్ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.
మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!
మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!
*అక్షరాస్యతలో నంబర్ 1*
గతేడాది కనెక్టికట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.
* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.
* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
ఫిన్లాండ్‌లో స్కూల్ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి.
* పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్ పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్, స్వీడిష్ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
* పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్. హైస్కూల్ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.
*అదే తేడా!*
‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ డెవలప్‌మెంట్’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.
*నలభై ఐదేళ్ల క్రితం...*
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయమిది.(ఈనాడు పత్రిక నుండి సేకరణ,వారికి ధన్యవాదాలు)
Monday 27 February 2017
ఇక అక్కడనుండి మధ్యాహ్నానికి తంజావూరు బృహదీశ్వరాలయానికి చేరుకున్నాము.త్రిచి నుండి 52 కి.మీ ఉంది .చోళుల అసమాన శిల్ప కళా నైపుణ్యంతో కట్టిన గుడి.దీనిని Big temple గా స్థానికంగా పిలుస్తారు.ఆస్ట్రేలియానుండి ఒక బృందం ఒక చోట కూర్చొని విశ్రా0తి తీసుకుంటుంటే సెల్ఫీ తీశాను .వారు చిరునవ్వుతో అంగీకరించారు.వారి సెల్ తో నన్ను ఒక ఫోటో తీయమంటే తీశాను.వారు గైడ్ తో చెప్పించు కుంటున్నారు.ఆధ్యాత్మిక,భక్తి పరంగా తక్కువ ప్రాధాన్య మున్నా ఆ గుడి సౌందర్యాన్ని,విశాల ప్రాంగణాన్ని చూసి త రించాల్సిందే.ఎన్ని సార్లయినా అక్కడకు వెళ్లి చూసి రావచ్చు . గుడికి ఎదురుగా అతి పెద్ద నంది అచ్చెరువు గొలుపుతుంది .
తరువాత రాజభవనం చూసాము.బ్రిటిష్ వారి కంటే ముందు ఉన్న రాజా సంస్థానం వారి కోట అది . ఆ కాలం నాటి సామాగ్రి తో కూడిన మ్యూజియం,దర్బార్ హాల్ ఆశ్చర్యాన్ని కలిగించాయి . 25 నిముషాల documentory చూపించారు. చాలా అద్భుతం గా తీశారు .ఆ ప్రాంత మంతా చూ సి న భావన కలిగింది.దగ్గరలో రాజులు కట్టించిన రిజర్వాయర్ ఉందని అందులో చూపారు.అక్కడకు వెళ్ళటం కుదర్లేదు ..
మరుసటి రోజు కుంభకోణం వెళ్ళాము దానికి temple సిటీ అని పేరు.నిజంగా పదుల కొలది ఆలయాలు ఉన్నాయి ముఖ్య మైనవి కుంభేశ్వర,సారంగపాణి,చక్రపాణి చూసాము . 12 ఏళ్లకోసారి కుంభమేళా జరిగే కోనేరు చూసాము.ఏ గుడిలో 10 మంది కంటే ఎక్కువ మంది లేరు.అన్నీ ఒక గంటలో పూరి చేసుకున్నాము .కుంభేశ్వర ఆలయం లో ఓ ఏనుగు చిన్నగా నాట్యం చేస్తూ మనమి ఛ్చిన 10 రూపాయలు తీసుకుని మనల్ని ఆశీర్వదించే దృశ్యం చాలా నచ్చింది .వ రి, చెరకు ఆప్రాంతం లో బో ర్ల క్రిందనే ఎక్కువగా పండిస్తున్నారు. మొదటి పంటకు కావేరి నీరు వచ్చాయేమో !మన లాగా పట్టణాల ప్రక్కన plots వేసి వదిలేసిన దాఖలాలు లేవు .మన లాగా స్థిరాస్తి రంగ పిచ్చిలేదు .
ఇక కాఫీ 10 రూపాయలకు చిక్కటి పాలతో మంచి రుచిగా ఇస్తారు. పాలు 10 రూపాయలే ఒక గ్లాసును కాస్త ఎక్కువగా ఇస్తారు తమిళనాడు వారు కాఫీ ప్రియులు మరియు టిఫిన్స్ కూడా బాగా తింటారు.రాత్రిపూట అందరు టిఫిన్స్ తింటారు.రాత్రి పూట హోటల్స్ లో భోజనం దొరకదు .అన్ని టిఫిన్స్ రేట్లు బాగా ఎక్కువ దోశలు 40 రూపాయలు పై నే ఉంటాయి .ఇక అన్నింట్లో సాంబారే ,కానీ సాంబారు బాగుంటాయి. భోజనం 70 రూపాయలు ,పెరుగు extra రేట్, కారం,ఉప్పు కూరల్లో బాగా తక్కువ. వాళ్ళు సాంబారు పోసుకొని అందులో కూరలు నంజుకుంటారు . 90 రూపాయలకి
fullmeals ఎగ్మోర్ ఎదురుగ వసంత భవన్ లో బాగుంది. చెన్నయ్ లో తెలుగు పేపర్లు దొరుకుతాయి కానీ తంజావూరు,త్రిచి లో దొరకవు.జామకాయలు లావుగా మంచి రుచిగా ఉన్నాయి .కేజీ 80 అమ్ముతున్నారు .కొంత మంది 60 కి ఇచ్చారు .
అన్ని హోటల్స్ లో పళ్లరసాల స్టాల్స్ ఉన్నాయి. త్రిచి ,తంజావూరు రెండు జిల్లా కేంద్రాలు వాటి మధ్య దూరం 50 కిమీ .తమిళనాడు లో 38 జిల్లాలు ఉన్నాయి . త్రిచి కాస్త పెద్దదే,తంజావూరు సాంస్కృతికంగా,చారిత్రకం గా బాగా ప్రసిద్ధి.తమిళులు వాళ్ళ సంస్కృతిని బాగా ఇష్ట పడతారు. చెన్నై ఎగ్మోర్ నుండి త్రిచికి superfast trains 350 కిమీ దూరం 5 1/2 గంటలలో వెడతాయి.మధ్యలో తాంబరం ,విల్లుపురం లాంటి పెద్ద junctions ఉన్నాయి.విల్లుపురం నుండి గంటన్నర ప్రయాణం లో పుదుచ్చేరి ఉందట.ఈ మార్గం లో చెన్నై airport చాలా గొప్పగా కనిపిస్తుంది.త్రిచి నుండి తంజావూరు వెళ్లే మార్గం లో NIT,SASTRA universities ఉన్నాయి.త్రిచి లో airport ఉంది .ఇక్కడ బస్సులు , ట్రైన్స్ బాగా ఉన్నాయి .వేగంగా వెడతాయి .బస్సు టికెట్స్ కూడా తక్కువ .వాజపేయి UPA హయాం లోనే రోడ్లు బాగా వేశారు.కుంభకోణం లో అక్కడక్కడా a/c busstop లు కనబడ్డాయి చిన్న రూమ్ లో 10 కుర్చీలు వేసి ఉంటాయి .తిరుగు ప్రయాణం లో ఓ మ్యూజిక్ టీచర్ చెప్పిన దాని ప్రకారం తమిళనాడు అంతా పిల్లలు సాయంత్రం పూట సంగీతం, నాట్యం నేర్చుకుంటూ ఉంటారట .శిక్షణ సంస్థలు చాలా ఉంటాయట.
ఏదిఏమయినా భారత దేశాన్ని పుస్తకాల్లో చదివే కంటే యాత్రల ద్వారా మరింతగా తెలుసుకోవ చ్చని అర్థ మయింది.కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఒక కార్యక్రమం ప్రకటించింది .ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రాన్ని ఎన్నుకొని సాంస్కృతిక సంబంధాలను, సందర్శించటం ద్వారా అభివృద్ధి చేసుకోవాలట. బ్లాగు మిత్రులారా మీరు చూసిన ప్రాంతాలపై ఇలాగే వ్యాసాలూ రాయండి
Saturday 18 February 2017
ముందే ప్రయాణ టికెట్స్ బుక్ చేసుకున్నందున స్థిమితంగా ఉన్నాము. కానీ అక్కడ రాజకీయ పోరాటం మొదల య్యింది .ఎక్కడ గందరగోళం జరుగుతుందోనని ఆందోళన పడ్డా గవర్నర్ నిర్ణయం ఆలస్యం అవటంతో మేము యాత్ర ముగించుకుని రాగలిగాము .
ఒంగోలులో అర్థ రాత్రి హైదరాబాద్ చెన్నై superfast express లో బయలుదేరాము .చెన్నైకి ఉదయం 6 గంటలకి చేరాలి .కానీ ఊరిబయట ముప్పావుగంట ఆపేసాడు.తరువాత కదిలినా చిన్నగా 7;50 కి చెన్నై సెంట్రల్ చేరుకున్నాము.8;15 కు ఎగ్మోర్ లో గురువాయూర్ express లో త్రిచికి వెళ్ళాలి. ఆటోలో ఎగ్మోర్ చేరుకొని పరుగెత్తి ఎక్కినా 2 నిముషాల కే కదిలింది.ఈ అసౌకర్యానికి బి.పి పేషంట్స్ అయితే ట్రైన్ మిస్ అయ్యేవాళ్ళు .
చెన్నై సెంట్రల్ బయట ఆటో లు ఎక్కువ రేట్ అడుగుతారు.కొద్దిగా బయటకు వెళ్లి ఎక్కితే మంచిది. సమయం ఉంటె చక్కగా బస్సులు ఉన్నాయి .కాస్త అడిగి ఎక్కాలి.బస్సులపై వివరాలు తమిళంలో ఉంటాయి. బస్సు సంఖ్యల ఆధారం గా ఎక్కాలి.ఇంగ్లీష్ లో పేర్లు ఉంటె బాగుండు .సెంట్రల్ నుండి ఎగ్మోర్ కు 40 రూపాయ లు తీసుకుంటారు.కానీ కొంత మంది rs100 అడుగుతారు.బస్సు కు అయితే కేవలం 4 రూపాయలు మాత్రమే.కొద్దీ దూరం ముందు కెడితే ఓ ఫ్లైఓవర్ వస్తుంది.అక్కడకు బస్ లు వస్తాయి.అక్కడనుండి ఎగ్మోర్కు కేవలం 5 నిముషాల ప్రయాణం .
త్రిచి (తిరుచిరాపల్లి )లో ఆ రూమ్ తీసుకున్నాము . ASHBAY HOTEL మన సినిమా లో ఉండే మండువా ఇల్లు లాగా ఉంటుంది .అద్దె ఇద్దరికి RS 950 ,అదనం గా ఒకరికి 250 ఉంటుంది .1956 నుండి నడుస్తున్నది . చక్కటి ఇంటి వాతావరణం 1. 5 ఎకరా విస్తీర్ణం,మొక్కలు చెట్లు ఉంటాయి.రైల్వే స్టేషన్ కి బస్సు స్టాండ్ కి మధ్య లో ఉంటుంది .టిఫిన్స్ త్రిచి రైల్వే స్టేషన్లో బాగుంటాయి .కొద్దిగా రేట్ కూడా తక్కువే కాఫీ 10 రూపాయలు .మంచి టేస్ట్ ,మన కంటే పరిమాణం కాస్త ఎక్కువ .దోషాలు పెద్దగా ఉంటాయి .రేటు 40 ఉంటుంది భోజనం దగ్గరలో ఆనంద్ హోటల్ ప్రక్కనే రెస్టారంట్ లో బాగుంటుంది .
ఇక మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరంగం బయలు దేరాము.7 కి మీ ఉంటుంది . rs 6 చార్జి .చాలా గొప్పగా ఉంది ఆలయం.విశాల మైన ప్రాంగణం.చాలా గుళ్ళు ఉన్నాయి.విష్ణువు కొలువై ఉన్నాడు.గర్భగుడిలో శయనించిన విష్ణువును చూడటం మరవొద్దు.ప్రాంగణమంతా తిరగాలంటే ఒక పూట పడుతుంది.వేయి కాళ్ళ మంటపం,చుట్టూ ప్రాకారాల్లాంటి గోపురాలు,చూడచక్కని శిల్ప సంపద .ఆ కాలపు రాజుల అభిరుచి చెక్కిన స్తంభాలు ,మంటపాలు ఆలయాలు గోపురాల లో వ్యక్త మవుతుంది (తరువాయి భాగం మరో పోస్ట్ లో )