Friday, 30 April 2021

ఆనందో బ్రహ్మ.....యండమూరి.

              కాలాన్నివెనక్కి ముందుకు నడిపించిన సుందరకావ్యం ఇది.భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ముందుగా అంచనావెయ్యడం కొంతమందికే సాధ్యం,ముఖ్యంగా రచయితలకి.యండమూరి ఆ విషయంలో పరాకాష్టకు చేరుకున్నారిందులో ఉదాహరణకు సోలార్ శాటిలైట్.ఇంకో 100 ఏండ్లు పోయినా సాంకేతికత ఎలా మారినా ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా చేసుకొని వ్రాసిన అపురూపమైన నవల ఇది.           మంచినవల:ఉన్న పరిస్థితులు ఉన్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయడం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాల్ని కలుగజేసేది మంచినవల.                                              నవల:మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే నవల....యండమూరి                     విశ్వనాథ సత్యనారాయణ,జంధ్యాలపాపయ్య శాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవులో స్మరించుకుంటారు.                                  గోదావరి నది వర్ణించడం విషయానికి వస్తే కవి విశ్వరూపం కనిపిస్తుంది.తెలుగు భాషలో రచయిత వాడే కొన్నిపదాలు నిఘంటువు చూసి తెలుసుకోవాల్సిందే,కొన్నింటి అర్ధం వివరిస్తుంటారు.పల్లెటూరిని వర్ణిస్తుంటే అటువంటి ఊర్లలో కొంత కాలం గడుపుదామనిపిస్తుంది.                          "భూదేవి కొత్త పెళ్లికూతురయితే బంతిపూలు పసుపు!మిరప పంట కుంకుమా!" ఎంత చక్కని పోలిక.సాహిత్యమన్నా,గతకాలపు కవుల కావ్యాలన్నా రచయితకి ప్రాణం.వారి పేర్లను, వారి పద్య,గద్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించకుండా ఉండరు.సంక్రాంతికి పల్లె ఎలా ఉంటుందో చదివి తీరవలసిందే.        *"అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్పవేదం లేదు".ఆణిముత్యం లాంటి మాట. పద్యాలంటే రచయితకు చాలా ఇష్టం.మనం చదవని, మరిచిన,కావ్యాల్లోని పద్యాలను పరిచయం చేస్తూ తన్మయత్వం చెందుతూ మనల్ని పరవశించి పోయేలా చేస్తారు.ఇక స్త్రీని వర్ణించడం లో ప్రబంధకవులైన కాళిదాసు,ముక్కుతిమ్మన,శ్రీనాధుడు,అల్లసాని పెద్దనల కే మాత్రం తీసిపోని శైలిలో మనకర్ధమయ్యే వచనంలో వ్రాస్తారు.     మందాకిని పాత్రను అత్యద్బుతంగా మలిచిన తీరు తెలుగు నవలా చరిత్రలో కలికుతురాయి.అలాంటి వ్యక్తి ఒకరయినా జీవితంలో సరయిన దశలో మార్గదర్శకత్వం చేస్తే  ప్రతివ్యక్తి జీవితం మారిపోతుంది. సోమయాజితో పలికించిన పద్యం రచయిత వ్రాసిన అద్భుత మైన పద్యం.కార్తెలను వర్ణిస్తూ మందాకిని వ్రాసుకున్న డైరీ లో ప్రకృతిలో మనం కలిసిపోవాలని పిస్తుంది.మరిచి పోతున్న తెలుగు భాష ,సంస్కృతిమీద తీవ్రమైన ఇష్టం పుట్టించే నవల ఇది.గుండెను వీణ మీటినట్లు మీటిన నవల ఆనందోబ్రహ్మ.                         "వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం".యండమూరి                                                             ......ఒద్దుల రవిశేఖర్.

No comments:

Post a Comment