Sunday 21 November 2021

చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకోవడం.

 జీవిత పయనంలో లక్ష్యాల సాధనలో పడి మనకిష్టమైన పనులు చేయడం మరిచిపోయివుంటాం.ఉద్యోగం, వివాహం,పిల్లలు,వారి చదువులు,ఆరోగ్యం,ఇల్లు కట్టుకోవడం ,పిల్లల వివాహాలు మళ్లీ వారికి పిల్లలు ఇలా విభిన్న దశల్లో జీవితం కొనసాగుతుంది.మనం మనకోసం కాక ఇతరుల కోసం బ్రతుకుతుంటాం.పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం.కాలం గడిచిపోతుంది.చివర్లో వారేదో మనకు చేస్తారనుకుంటాం.వారి కుటుంబాల తో వారు బిజీ. ఆయా దశల్లో మన అభిరుచులు,మన కిష్టమైన కళలు, ఆటలు,కొత్త ప్రదేశాలు చూడటం,మొక్కలు నాటడం,పెంచడం,ప్రకృతిని పరిశీలించడం ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ అన్ని బాధ్యతలు తీరాక ఇవన్నీ చేయాలంటే మన మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండకపోవడంతో మనం చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది.మొన్నటి కరోనా కాలంలో ఎంతమంది చిన్న వయసులో చనిపోయారో కదా!ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళు జీవితంలో ఏదో చేయాలని.అలాగే ఆకస్మిక ప్రమాదాలు,గుండెపోటులతో మరింతమంది మరణిస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్(48) మరణం ఎంత విషాదం. అందుకే సమయం లేదు మిత్రమా! జీవితం లో మీరు ఏ దశలో ఉన్నా మీ కిష్టమైన వ్యాపకాలకోసం కొంత సమయం కేటాయించండి.సంగీతం వినడం,నేర్చుకోవడం,పాటలు పాడడం చిత్రలేఖనం,పుస్తకాలు చదవడం,స్నేహితులతో మాట్లాడటం,వ్యాయామం ....ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకుంటూ జీవితం కొనసాగిద్దాం.ఇక జీవిత చరమాంకంలో ఆ జ్ఞాపకాల దొంతరాలను నెమరువేసుకుని తృప్తిగా జీవితయాత్ర చాలించవచ్చు.....ఒద్దుల రవిశేఖర్.

2 comments: