Tuesday 23 April 2013

పుస్తకాలే మన నేస్తాలయితే !



            తల్లి  సుద్దులు  చెబుతుంది .తండ్రి మార్గం చూపిస్తాడు.గురువు ఇంగితం బోధిస్తాడు.ఏక కాలంలో ఈమూడు ధర్మాలను స్నేహనిష్టతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే!-------డా సర్వేపల్లి రాధాకృష్ణన్
            కల్పతరువు,గురువు,పురాతన,ప్రస్తుత భవిష్యత్కాల సంపద ,కరదీపిక,ఆశారేఖ పుస్తకమే ----మహాత్మా గాంధీ.
            మంచి మిత్రులు,మంచి పుస్తకాలు,మంచి నిద్ర..... వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది.--------మార్క్ ట్వైన్
         షేక్స్పియర్ ,గర్సిలసో లవేగా వంటి విశ్వ విఖ్యాత సాహిత్య వేత్తల జన్మదినం ఏప్రిల్ 23 .ఈ రోజును UNESCO ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించింది.
           పుస్తకం మనిషి మస్తకం లోని భావాల ఆలోచనల అనుభవాల అనుభూతుల వ్యక్తీకరణ. విశ్వావి ర్భావం భూమి చరిత్ర,జీవ పరిణామ క్రమం చారిత్రక విశేషాలు,మనిషి సృష్టించిన విభిన్నతత్వాలు కను గొన్న జ్ఞానము ,సృజించిన కళలు,సృష్టించిన సాహిత్యం మొత్తం అంతా అక్షరబద్ధం గావించటం అవి పుస్త కాల రూపంలోమనిషి జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యంలా మనకు దర్శనమిస్తున్నాయి.
           ఒక పుస్తకం చదువుతున్నామంటే ఆ రచయిత అనుభవాన్ని లేదా అతని జ్ఞానాన్ని మనం కొద్ది సమయం లోనే తెలుసుకుంటున్నాము.ఆ రచయిత దాన్ని పుస్తక రూపంలో మలచటానికి అహోరాత్రాలు కష్టించి ఉంటాడు అతని కష్టాన్ని మనం ఎంతో తేలికగా చదివేసి తెలుసుకుని ఆనందిస్తున్నాము.జ్ఞానం అనుభవం ద్వారా,తనకు కలిగి న ఆలోచన ద్వారా,పుస్తకాల ద్వారా,ఎవరో ఒకరు నేర్పటం ద్వారా లభిస్తుం ది.దానిని ఇతరులకు పంచటం అతని ప్రాధమిక కర్తవ్యం.అందుకే మనిషి సృష్టించిన ప్రతి విషయం ఈ రోజు పుస్తకాల రూపంలో ప్రపంచ మంతా అందుబాటులో ఉంది.
        మంచి పుస్తకాలు చిరకాల స్నేహితుల్లాంటివి.మంచి స్నేహితులు దొరికిన వారు చాలా అదృష్ట వంతులు .కాని మంచి పుస్తకాన్ని నమ్ముకుంటే వారు మరింత అదృష్ట వంతులు.
           కాని ప్రస్తుతం T.V,COMPUTER,CELLPHONE వచ్చిన తర్వాత చదవటం కంటే చూడటం ఎక్కువయిం ది.కాలాన్ని ఎక్కువగా సినిమాలు,సీరియల్లు,క్రికెట్ ,ఫోన్ సంభాషణలు,బాతాఖానీలు,వంటి వ్యాపకాలతో చద వటం తగ్గిపోతుంది.
           విద్యార్ధి దశలోనే పిల్లలకు పుస్తకాలు(తరగతి పుస్తకాలే కాదు) చదివించటం నేర్పిస్తే ఆ అలవాటు  జీవిత మంతా  ఉంటుంది.మంచి కథల పుస్తకాలు చదివిస్తే వారిలో ఊహా శక్తి పెరుగుతుంది.ఇక యువత తమ జీవితానికి పనికి వచ్చే వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకునే  పుస్తకాలు చదివితే మంచిది.అలాగే మలి  వయసులో మెల్లిగా తత్వం ,సాహిత్యం,ఆధ్యాత్మికం వంటి విషయాల వైపు దృష్టి మళ్లిస్తే బాధ్యతల నుండి విరమించిన తర్వాత ఆ అలవాటు మంచి నేస్తమవుతుంది.
      ఇలా ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ,తాము మెచ్చిన ఏదో ఒక పుస్తకాన్ని రెండు నెలలకు ఒకటి అయినా చదవ గలిగితే ఎంతో  బాగుంటుంది.సమయం ఉన్నవారు ఎంత చదివితే అంత జ్ఞానం.
               జ్ఞానం తేనె లాంటిది.దాన్ని మరణించే లోపు ఎంత సేవిస్తే అంత మంచిది.
 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలను మన స్నేహితులుగా మార్చుకుందాం.మన జీవితాలను ఉన్నతంగా మార్చుకుందాం

10 comments:

  1. నాకు అమెరికాలో నచ్చిన మంచి విషయాల్లో ఇది ఒకటి. పిల్లలకు మాటలు కూడా రాని సమయం నుండే పిల్లలకు పుస్తకం చదివి వినిపిస్తారు. ఇక బడికి వెళ్ళడం మొదలుపెట్టినప్పటినుండి రోజుకు కనీసం 20 నిముషాలు పుస్తకం చదవాలి. కొంచెం పెద్దయ్యాక తరగతిలో వాళ్ళు చదివిన పుస్తక౦పై చర్చలు జరుగుతాయి. ఇవి కాక లైబ్రరీలు ప్రతి వేసవిలో 20 పుస్తకాలు చదివిన వారికి ఓ పుస్తకం బహుమతిగా ఇస్తుంది. ఇలా చిన్నతనం నుండే పుస్తకం చదవడం జీవితంలో ఓ భాగంగా మారుతుంది.

    మంచి విషయాన్నీ ప్రస్తావించారు రవిశేఖర్ గారు. థాంక్యు

    ReplyDelete
    Replies
    1. మన దేశం లో పిల్లలు చాలా తక్కువగా ఇతర పుస్తకాలు చదువుతారు.ఎంత సేపు తరగతి పుస్తకాలు తప్ప వారికి వేరే ప్రపంచం లేదు.మీరు చెప్పిన విషయాన్ని ఇక్కడ అమలు జరిగితే బాగుంటుంది.ఇక్కడ కూడా అలాగే గ్రంధాలయాల వారు పోటీ పెట్టేలా ప్రయత్నిస్తాను. మంచి విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  2. ఆటలకు కాకపోయినా, వ్యాసరచన / వక్తృత్వ పోటీలప్పుడయినా బహుమతులుగా పుస్తకాలనిచ్చే అలవాటు నిర్వహించేవారికుంటే బాగుంటుంది.
    అంతేకాక స్థానిక గ్రంథాలయాల గురించి పాఠశాలల్లో అవగాహన కలిగించడం ముఖ్యంగా చేయాల్సి ఉంది.

    ReplyDelete
    Replies
    1. బహుమతులుగా పాటశాలల్లో పుస్తకాలిచ్చే అలవాటు ఉంది కానీ సమాజం లో కూడా జన్మదిన కానుకలుగా పుస్తకాలు ఇస్తే మరింత బాగుంటుంది.మీరన్నట్లు పిల్లలకు గ్రంధాలయాలను పరిచయం చేయాలి.ధన్యవాదాలండి.

      Delete
  3. నిజమేనండి. పుస్తకపఠనం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
    పుస్తకపఠనం గురించి చక్కటి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు.

    ReplyDelete
  4. నేను కొద్ది రోజులు అమెరికా రాజధానిలో పనిచేస్తున్నపుడు, ఇక్కడ మెట్రోలో ప్రయాణం చేసేదాన్ని.ప్రతి ఒక్కరు ఏదో ఒక పుస్తకం చేతిలో పెట్టుకుని చదువుకుంటూ ఉండేవారు.నిజంగానే చాలా మంచి అలవాటు.ఇక్కడ పిల్లలు కూడా అంటే, పుస్తకం చదవటం అలవాటు ఉన్నవారు,అలా చదువుతూనే ఉంటారు. వారికి తిండి, తిప్పలు కూడా అక్కర్లేదు ఒక్కోసారి ఆ పుస్తకాలు ఉంటే! చక్కటి టపా రాసారండి

    ReplyDelete
  5. చాలా మంది చెప్పగా విన్నాను.reading habbit USA లో
    బాగా ఎక్కువని .వృత్తి సంబంధమైనవి తమ career లో ఉన్నతికి దోహదపడితే తమ అభిరుచుల మేరకు చదివే ఇతర పుస్తకాల వలన జ్ఞానము తో పాటు ఆనందం కలుగుతుంది.మీ స్పందనకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  6. E లైబ్రరీ లింక్ పెడితే పిల్లలు చదివే అవకాశం వుంది

    ReplyDelete
  7. జ్ఞానం తేనెలాంటిది ..వహ్వా ...

    ReplyDelete