Sunday, 7 April 2013

ఆరోగ్యమే మన లక్ష్యమైతే !


                మనం ఎన్నో లక్ష్యాలను సాధించాలని అనుకుంటాం.మానవ జీవన పురోగమనానికి ఈ వైఖరే  కారణం కానీ మనం అనుకున్న లక్ష్యాలను సాధించటానికి మన ఆరోగ్యం సహకరించాలి కదా!లక్ష్యాల సాధనకు ఓ లక్ష్యం పెట్టుకోవాలి.అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం.మన పెద్దలు ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటించేవారు.ప్రశాంత మైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించారు.వేగవంత మైన ఆధునిక జీవన శైలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంది.చివరికి ఆరోగ్యం పాడవగానే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా,శారీరకంగా మానసికంగా క్రుంగి పోతుంటారు.కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకుంటే ఎవరికి  వారు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
       వివిధ రకాలయిన ఆహార పదార్ధాలు  ఎటువంటి పోషక విలువలు కలిగి ఉన్నాయో  NIN(National institute of Nutrition) వారు  సమగ్రంగా పరిశోధించి తెలియ జేశారు.ప్రతి రోజు దినపత్రికల్లో,పుస్తకాల రూపేణా ఈ సమాచారం  దొరుకుతుంది.అలాగే ఏ ఆహారం ఎటువంటి నష్టం కలుగ జేస్తుందో కూడా మనం డాక్టర్స్ ద్వారా సమాచార సాధనా ల  ద్వారా తెలుసుకుంటూ ఉంటాం.కానీ ఆచరణ కొచ్చేసరికి విఫల మవుతూ ఉంటాం.రుచి కోసం ఎప్పుడయినా తినటం వేరు,ప్రతి రోజు రుచులకు అలవాటుపడి ఎక్కువ మోతాదులో తినటం వేరు.ఒక పదార్థం మనకు హాని కరమైనది అని తెలిసిన వెంటనే దాన్నుండి క్రమేపీ దూరం కావటం మొదలెట్టాలి.అవసరానికి మించి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం,అధిక కొవ్వును పెంచుకోవటం,ఊబకాయాన్ని పొందటం ఇదంతా ఓ విష వలయం.పోషక విలువలుగల ఆహారాన్ని సరిపోయినంత తీసుకోవటం అవసరం.
    మనం తీసుకునే ఆహారం ద్వారానే పలురకాల రుగ్మతలు వస్తుంటే,ఇక దుర్వ్యసనాలకు అలవాటు  పడ్డ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పూర్వ కాలం మనుషులందరూ శారీరక శ్రమ చేసి జీవనం సాగించేవారు కాబట్టి వారికి ఏ వ్యాయామం అవసరం ఉండేది కాదు.కానీ ప్రస్తుతం పట్టుమని పావుగంట శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్నాం.అందుకని ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించటం,యోగా,ప్రాణాయామం,ధ్యానం చెయ్యటం మానవునికి అవసరమైనది.ఉప్పుకారం తగ్గించుకోవటం,మంచినీరు ఎక్కువగా తీసుకోవటం, ప్రశాంతంగా నిద్రించటం ఎంతో అవసరం.కూల్ డ్రింక్స్ కు  బదులు పళ్ళ రసాలు,కొబ్బరినీరు,మజ్జిగ తీసుకోవటం ఉత్తమం.
       ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎవరికి  వారు తమకి తగిన విధానాన్ని ఎన్నుకొని అవలంబిస్తూ  ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని  ఆశిద్దాం.

6 comments:

 1. అందరి ఆరోగ్యానికి అవసరమైన పోస్ట్.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీ స్పందనకు

   Delete
 2. చక్కటి పోస్ట్ రవిశేఖర్ గారు.
  ఫోషక విలువలున్న ఆహారం తీసుకోవటం,క్రమం తప్పకుండా వ్యాయం పాటించటం ఇవి రెండు చేస్తే చాలా మటుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మంచి విషయాలు నలుగురితో పంచుకోవడంలో,రాయడంలో మీకు మీరే సాటి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వెన్నెల గారు.మంచిని పెంచటం,పంచటం అందరి బాధ్యత .ఏదో ఉడతా భక్తిగా నా ప్రయత్నం.

   Delete
 3. నిజమేనండి. ఆరోగ్యమే మహాభాగ్యం.
  ఆరోగ్యం గురించి చక్కటి విషయాలను తెలియజేసారు.

  ReplyDelete
  Replies
  1. ఆరోగ్యం కాపాడుకోవటంలో ఎన్నో విధాలు.ఎవరికీ వీలయింది వారు చేయటం ఉత్తమం.మీకు ధన్యవాదాలు.

   Delete