Thursday, 25 April 2013

ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ----కె.బాలకృష్ణా రెడ్డి గారి దీర్ఘ కవిత పై సమీక్ష

వర్తమాన సమాజంలో మనిషి జీవితం ఎలా ఉన్నది? 
అతను ఎలా జీవిస్తున్నాడు? ఎటువంటి పనులు 
చేస్తున్నాడు? అతని ప్రవర్తన ఎలా ఉంది?అతను చేసే
తప్పులు ఏమిటి? మనిషి ఎందుకిలా తన జీవితాన్ని నిప్పులకుంపటిగాసంఘర్షణల రణంగా
మార్చుకున్నాడు. 
చివరికి తన వెంట ఏమి తీసుకు వెడుతున్నాడు? జీవితాన్ని 
ఎలా జీవించాలి?మనిషన్నవాడు ఎలా ఉండాలి? 
మరణించేంత వరకు ఏమి చెయ్యాలి?వంటి ప్రశ్నలు 
భావ కవిగా ప్రసిద్ధులైనకె.బాలకృష్ణా రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసాయి.
అది ఇలా "ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ "
 అనే దీర్ఘకవితగా మారింది.

      అరవై పేజీల ఈ జీవన కావ్యాన్ని ఒక వ్యాసంలో విశ్లేషించటం సాధ్యం కాదు.
ఇందులోని ముఖ్యమైన విషయాలను, అద్భు
తమైన కవిత్వాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. "ప్రశ్నిస్తున్నా..."
 అని కవితకు ముందు ఆయన వ్రాసిన కవితా నేపధ్యం చదివితే చాలు మొత్తం అంతా అర్థమవుతుంది.
ఇది మనిషి కథ
ప్రతి మనిషి వ్యథ 

నిరంతరం సంపాదించాలనే చూస్తున్న 
మనిషి అర్ధాంతరంగా మాయమైన వేళ
ఆహ్వానిస్తుంది ఆరడుగుల నేల 
అక్కడ అతని ఆత్మను తట్టి లేపి 
కవి అనుసంధించిన ప్రశ్నల పరంపరలే ఈ కావ్యం. 

మనిషివైతే రగిలిపో మనసుంటే పగిలిపో
దానవతను విస్మరించి మానవతను 
ఆవిష్కరించి మానవుడిగా మిగిలిపో 

అంటూ మనిషి గురించి మానవత్వాన్ని
గురించి పూర్తి కవితా వస్తువుగా వచ్చిన కావ్యమిది. 
పుట్టి నప్పటి నుండి వృద్ధాప్య 
వరకు జీవితాన్ని వర్ణిస్తూ

బాల్యం
బంగరు స్వప్నం
అరిషడ్వర్గం దరిచేరని దుర్గం
వృద్ధాప్యం
వేలవేల అనుభవాల
అనునయాల సంకలనం   ----- చాలా సులభంగా అర్థమవుతున్న పదాల పొందిక. 

జీవితం ఒక కమ్మని యోగం   ------- ఒక యోగం లాగా జీవితాన్ని గడిపితే ఎంత బాగుంటుంది.
మరణం తప్పదని తెలిసి
ప్రతిక్షణం రణన్నినాదం
ప్రతి నిముషం మారణ హోమం
పగలు రేయి అసుర కేళీ కలాపం 
 

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ దృశ్యానికి ఇది ప్రతిబింబం.
స్మశానాన్ని వర్ణిస్తూ 

జీవన సాఫల్యాన్ని,వైఫల్యాన్ని
దైన్యాన్ని హైన్యాన్ని
తర్కిం చుకునే ఏకైక ప్రదేశం

సమాజం లోని అన్ని వృత్తుల వారు
తమ వృత్తి ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం బాగుపడుతుందని 
కవి భావిస్తాడు.కాని వారు ఆ పని చేస్తున్నారా అన్న 
ఆవేదనతో

దేశం కన్నీరు పెడుతుంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తుంది

ఒకప్పటి మనిషి తనం మరచి రాక్షత్వాన్ని
మనిషి అలవరచుకున్నాడు అని కవి బాధపడతాడు.
మరణించిన 
మనిషిని శ్మశానం లోకాసేపు ఆపి అతని ఆత్మతో సంభాషిస్తాడు 
కవి.అతను జీవితం లో ఏమేమి చేసాడో ఏమి కోల్పోయాడో 
ప్రశ్నిస్తూ ఈ దీర్ఘ కవితను కోన సాగిస్తాడు.


జీవితం ఒక వరం
'జీవించు' వాళ్ళెందరు

ప్రేమించటం ఒక తపస్సు
'ప్రేమించే' వాళ్ళెందరు
  
ఎంత లోతయిన ప్రశ్న వేసారో గమనించండి.తన జీవిత కాలంలో అర్థాంగిని
ఏ  మేరకు అర్థం చేసుకున్నావు అమ్మా నాన్నలను ఏ  విధంగా  అర్థం ఎలా చేసుకున్నావు
 అని ప్రశ్నిస్తూ

అర్థం కాలేదా అమ్మ మనసు
వ్యర్థం అయింది కదా నాన్న తపస్సు

నీ ఎదుగుదల కోసం ఎంతో మందిని 
నాశనం చేసావు,
వారి ఉసురు నీకు తగిలిందేమో అంటూ

నువ్వు  మనిషితనం కోల్పోయావు  
మానవతకు దూరంగా జరిగావు.
సంగీతం సాహిత్యం లాంటి కళలంటే 
తెలీకుండాజీవించావు
జీవిత మంటే ఓ ఆహ్లాదం

మందారాలు, మకరందాలు
సింధూరాలు, సిరిచందన గంధాలు
మధు వనాలు, మలయానిలాలు
హరివిల్లులు, విరిజల్లులు
పూల పుప్పొళ్ళు, పున్నమి చప్పుళ్ళు

లాంటి తన భావ కవితా విభ్రమాన్ని
మన కళ్ళ 
ముందు౦చుతాడు. ఇంత అందమయిన జీవితాన్ని నరక ప్రాయం 
చేసుకున్నావెందుకని కవి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. 

నువ్వు మాత్రం మనిషి తనం కోల్పోయావు?

మన నాగరికత, భాష సంస్కృతి 
అంతరిస్తున్నాయని   కవి ఆవేదన


ఎంత ఖేదం నలుగురికీ పంచావో 
ఎంత మోదం బూడిద పాలు చేసావో    ------- మనిషి చేస్తున్న
దిదే కదా!

నవ్వడం మరిచి పోయావు
నడవడం మరిచి పోయావు
నయాగరాలు మరచిపోయావు
నయగారాలు మరచి పోయావు
ఎన్ని అద్బుతాలు కోల్పోయావు
ఎన్ని జీవన సత్యాలు విస్మరించావు

అని కోల్పోయిన జీవితాన్ని గురించి చెబుతున్నాడు.

గుట్టలుగా కలిమి పోగుచేసుకున్న వ్యామోహం
కట్టెలతో చెలిమి చేస్తున్న దృశ్యం
  

అంటూ నీ వెంట ఏమీ రావు అనే సందేశం వినిపిస్తున్నాడు. మనిషికున్న భయాలకు మూల కారణం

అజ్ఞానం,అవివేకం
అక్కర లేని ,అవసరం లేని
కలిమితో బాంధవ్యం      ------ అని ఒక్క మాటతో 
తేల్చేస్తారు కవి.


మనిషికి డబ్బు చేసింది
నయం కాని మాయదారి జబ్బు చేసింది    --------

 అన్నకఠిన సత్యాన్ని ఆవిష్కరించారు. 


ప్రతి వ్యక్తిలో నైతిక విలువల పతనం
కుట్రలు,కుయుక్తుల చెలగాటం
మానవత శిధిల మై పోతున్న ఆనవాళ్ళు
దానవత రొద చేస్తున్న కీచురాళ్ళు     --------- 

అంటూ మనిషి తత్వాన్ని x-రే తీసాడు.


ప్రేమంటే ఒక ఉన్మాదం
ప్రేమించకుంటే ఉగ్రవాదం
ఏ ఉదాత్త సంస్కృతికి చిహ్నాలు
ఏ గొప్ప నాగరికతకు ఆనవాళ్ళు       ---------

 అంటూ ప్రేమ పేరుతో జరుగుతున్న
 ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నాడు.


మానవత్వం కోల్పోయిన మనిషి
మృదుత్వం ఆర్ద్రత ఆవిరయిన మనిషి    ------

మనిషి ఇలా ఉన్నాడు ప్రస్తుతం.


ఒకటే జీవితం
ఇంత ఉలికి పాటెందుకు
ఒకటే దేహం
ఇంత రాద్దాంతమెందుకు     ------- 

నాలుగు మాటల్లో జీవిత సారం చెప్పారు.

ఒక ఒప్పందం చేసుకుందాం
చితి మంటల సాక్షిగా
చివరి వీలునామా వ్రాసుకుందాం 
కనీసం వచ్చే జన్మ లోనయినా మనిషిగా నడయాడాలని
శపథం చేసుకుందాం       ------- 

 అంటూ
 మనిషికి వీడ్కోలు ఇస్తున్నాడు.

ఈ భూమిపై మనజీవితం
విహారానికొచ్చినట్లుండాలి .
వచ్చిన పని కాగానే మృత్యువు సడి వినగానే
హాయిగా నిష్క్రమించాలి
ఒక చరిత్రను లిఖించి
ప్రతి ఒక్కరూ మహాత్ముడయి
నిర్గమనం చేయాలి.
అదే నిజమైన మరణం.
మహాభినిష్క్రమణం 

మనిషిని గురించి ఇంత వేదన చెంది, 
జీవితం ఎలా ఉండాలో, 
ఎలా ఉండకూడదోఇంత సరళంగా ఇంత అంద మైన 
పదాలతోచెప్పిన కావ్యం మనకు కనిపించదు. 
సామాన్య పాఠకుడిని కూడా చివరి వరకు చదివిస్తూ తీసుకువెడుతుందిప్రతి ఒక్కరికి తన జీవితం లోని 
అనేక సంఘటనలను గుర్తుకుతెస్తుంది.

మనిషి తరపున వారికి ధన్యవాదాలు. 

ఈ జీవన కావ్యం ప్రతి ఒక్కరు చదవతగ్గది. కె. బాలకృష్ణా రెడ్డి గారి కవితల కొరకు వారి "కవితాంధ్ర "
బ్లాగ్ చూడగలరు.


                         

                          

Tuesday, 23 April 2013

పుస్తకాలే మన నేస్తాలయితే !            తల్లి  సుద్దులు  చెబుతుంది .తండ్రి మార్గం చూపిస్తాడు.గురువు ఇంగితం బోధిస్తాడు.ఏక కాలంలో ఈమూడు ధర్మాలను స్నేహనిష్టతో నిర్వర్తించేది మాత్రం లోకంలో పుస్తకాలు ఒక్కటే!-------డా సర్వేపల్లి రాధాకృష్ణన్
            కల్పతరువు,గురువు,పురాతన,ప్రస్తుత భవిష్యత్కాల సంపద ,కరదీపిక,ఆశారేఖ పుస్తకమే ----మహాత్మా గాంధీ.
            మంచి మిత్రులు,మంచి పుస్తకాలు,మంచి నిద్ర..... వీటికి మించిన మంచి ప్రపంచం మరొకటి ఏముంటుంది.--------మార్క్ ట్వైన్
         షేక్స్పియర్ ,గర్సిలసో లవేగా వంటి విశ్వ విఖ్యాత సాహిత్య వేత్తల జన్మదినం ఏప్రిల్ 23 .ఈ రోజును UNESCO ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించింది.
           పుస్తకం మనిషి మస్తకం లోని భావాల ఆలోచనల అనుభవాల అనుభూతుల వ్యక్తీకరణ. విశ్వావి ర్భావం భూమి చరిత్ర,జీవ పరిణామ క్రమం చారిత్రక విశేషాలు,మనిషి సృష్టించిన విభిన్నతత్వాలు కను గొన్న జ్ఞానము ,సృజించిన కళలు,సృష్టించిన సాహిత్యం మొత్తం అంతా అక్షరబద్ధం గావించటం అవి పుస్త కాల రూపంలోమనిషి జ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యంలా మనకు దర్శనమిస్తున్నాయి.
           ఒక పుస్తకం చదువుతున్నామంటే ఆ రచయిత అనుభవాన్ని లేదా అతని జ్ఞానాన్ని మనం కొద్ది సమయం లోనే తెలుసుకుంటున్నాము.ఆ రచయిత దాన్ని పుస్తక రూపంలో మలచటానికి అహోరాత్రాలు కష్టించి ఉంటాడు అతని కష్టాన్ని మనం ఎంతో తేలికగా చదివేసి తెలుసుకుని ఆనందిస్తున్నాము.జ్ఞానం అనుభవం ద్వారా,తనకు కలిగి న ఆలోచన ద్వారా,పుస్తకాల ద్వారా,ఎవరో ఒకరు నేర్పటం ద్వారా లభిస్తుం ది.దానిని ఇతరులకు పంచటం అతని ప్రాధమిక కర్తవ్యం.అందుకే మనిషి సృష్టించిన ప్రతి విషయం ఈ రోజు పుస్తకాల రూపంలో ప్రపంచ మంతా అందుబాటులో ఉంది.
        మంచి పుస్తకాలు చిరకాల స్నేహితుల్లాంటివి.మంచి స్నేహితులు దొరికిన వారు చాలా అదృష్ట వంతులు .కాని మంచి పుస్తకాన్ని నమ్ముకుంటే వారు మరింత అదృష్ట వంతులు.
           కాని ప్రస్తుతం T.V,COMPUTER,CELLPHONE వచ్చిన తర్వాత చదవటం కంటే చూడటం ఎక్కువయిం ది.కాలాన్ని ఎక్కువగా సినిమాలు,సీరియల్లు,క్రికెట్ ,ఫోన్ సంభాషణలు,బాతాఖానీలు,వంటి వ్యాపకాలతో చద వటం తగ్గిపోతుంది.
           విద్యార్ధి దశలోనే పిల్లలకు పుస్తకాలు(తరగతి పుస్తకాలే కాదు) చదివించటం నేర్పిస్తే ఆ అలవాటు  జీవిత మంతా  ఉంటుంది.మంచి కథల పుస్తకాలు చదివిస్తే వారిలో ఊహా శక్తి పెరుగుతుంది.ఇక యువత తమ జీవితానికి పనికి వచ్చే వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకునే  పుస్తకాలు చదివితే మంచిది.అలాగే మలి  వయసులో మెల్లిగా తత్వం ,సాహిత్యం,ఆధ్యాత్మికం వంటి విషయాల వైపు దృష్టి మళ్లిస్తే బాధ్యతల నుండి విరమించిన తర్వాత ఆ అలవాటు మంచి నేస్తమవుతుంది.
      ఇలా ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ,తాము మెచ్చిన ఏదో ఒక పుస్తకాన్ని రెండు నెలలకు ఒకటి అయినా చదవ గలిగితే ఎంతో  బాగుంటుంది.సమయం ఉన్నవారు ఎంత చదివితే అంత జ్ఞానం.
               జ్ఞానం తేనె లాంటిది.దాన్ని మరణించే లోపు ఎంత సేవిస్తే అంత మంచిది.
 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకాలను మన స్నేహితులుగా మార్చుకుందాం.మన జీవితాలను ఉన్నతంగా మార్చుకుందాం

Thursday, 11 April 2013

విజయనామ ఉగాది ---తెలుగు వైభవం


       
                          ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలందరికి విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.తెలుగు వారి మొట్ట మొదటి పండుగ ఇది.చైత్ర శుద్ధ పాడ్యమిన ఈ పండుగ వస్తుంది..ఇది ఉగాది అనే సంస్కృత పదానికి వికృతం.యుగానికి  ఆది కాబట్టి యుగాది అయింది.
       ఉగాది=ఉక్+ఆది ,ఇందులో ఉక్ అనగా నక్షత్రము అని అర్థం.మనిషి ఆది నక్షత్రాన్ని కనుగొన్న రోజు ఆదిమ దశ నుండి వైజ్ఞానిక దశకు ఎదిగే క్రమంలో జరుపుకున్న తొలి ఉత్సవం అని అంటారు.
      నూతన సంవత్సరం లో కలుగబోయే సుఖ దుఖాలకు,తీపి గుర్తులకు చెడు అనుభవాలకి ప్రతీక ఈ షడ్రుచులుగల ఉగాది పచ్చడి.పచ్చడిలో వాడిన ప్రతి వస్తువు ఒక్కోఔషధం.వేప పూత(చేదు),మామిడి ముక్కలు(వగరు ),చింత పండు పులుసు(పులుపు),చెరకు ముక్కలు,మిరియాలు(కారం
) జీల కర్ర,బెల్లం(తీపి),లవణం(ఉప్పు) శనగలు,పాలు,కొబ్బెర ముక్కలను కలుపుతారు. ఇంకా అరటిపళ్ళు,ఎండు ద్రాక్ష,జీడిపప్పు,బాదం పప్పు కూడా రుచి కోసం వేసుకుంటారు.ఈ పచ్చడి తినటం శరీరానికి మంచిది.బంధు మిత్రులకు కూడా పంచాలి.
             చై త్రం,వైశాఖం ఈ రెండు నెలల్ని కలిపి వసంత రుతువు అంటారు.ఈ కాలంలో గాలి మెల్లగా వీస్తుంది.చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త చివుళ్ళు చిగురిస్తాయి.ఇది వసంతోదయానికి స్పష్ట మైన లక్షణం.కోయిలలు మదురం గా కూస్తుంటాయి.ఈ రుతువులో కోయిల మామిడి చిగురు తింటూ ఉత్సాహంగా గానం చేస్తుంటే ప్రకృతి పరవశించి పోతుంది.సృష్టిలో జరిగే ఈ రమణీయ మైన మార్పు మనకు ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని కలిగిస్తుంది.
         ఈ సందర్భంగా తెలుగు భాష గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
                                            మంచి గుమ్మడి కన్నా దంచిన
                                         కొవ్వడ్ల బియ్యము కూడు కన్నా
                                       మేల్ జహంగీర్ మామిడి పండు కన్నా సుం
                                            కారిన లే సజ్జకంకి కన్నా
                                   కమియ పండిన ద్రాక్ష కన్న,చక్కర తగ
                                        బోసి వండిన పాలబువ్వ కన్న
                                      రస దాడి కన్నా పనసతోన కన్న,క
                                        జూరము కన్నను జున్నుకన్న
                                  అలతి పెర తేనియల కన్న,నామని తరి
                                     కొసరి కోసిన కోయిల కూత కన్న
                                    ముద్దులోలికెడి జవరాతిమోవి కన్న
                                    తీయ నైన దెయ్యది? అదే తెలుగు బాస    __ముదిగొండ వీర భద్ర మూర్తి.
                                  ఎంత కమ్మగా ఆ కవి వర్ణించాడో చూడండి.
         శాత వాహనుల కాకతీయుల ,కృష్నదేవరాయల పాలనలో తెలుగు భాష వృద్ది చెందింది.కృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యదలో దేశ భాష లందు తెలుగు లెస్స అన్నాడు.ఇటలీ దేశస్థుడైన నికొలా య్ కామ్తే1420 లోమన భారత దేశం వచ్చినప్పుడు మన  తెలుగు భాష గురించి Italiyan of the east అన్నాడు.ఇటలీ భాష కూడా మన భాష లాగే అజంత భాష. అనగా పదము చివర అచ్చుతో అంత మయ్యె భాష.ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి సుందర తెలుంగు అన్నాడు.
        శాతవాహనులలో ప్రముఖుడైన హాలుడి ఆస్థానం లో గునాడ్యుడు ఆస్థాన కవిగా ఉండే వాడు.ఆ యన పైశాచీ భాషలో వ్రాసిన  బృహుత్కథ ప్రపంచం లోని ప్రముఖ భాష  లన్నింటిలోకి అనువాదం అయింది.ఇది  తెలంగాణాలో పుట్టింది.దీనిని సోమ దేవుడు తెలుగు లో కథా సరిత్సాగరం గా అనువదించారు.
        తెలుగు మొట్ట మొదటి పద్యం తరువోజ ఇది అద్దంకి లో పుట్టింది.కందం కరీంనగర్ లో పుట్టింది.వేమన ఆట వెలది లో అద్భుత మైన పద్యాలు వ్రాసారు.ఆది కవి నన్నయ,తిక్కన ఎర్రన కవిత్రయం మహా భారతాన్ని ఆంధ్రీకరిం చారు.ఆధునిక కాలం లో గురజాడ,వ్యవహారిక భాశోద్యం సారధి గిడుగు రామమూర్తి తెలుగును సుసంపన్నం చేసారు.తన జీవితాన్ని తెలుగు భాష కోసం వెచ్చించిన మహనీయులు బ్రౌన్.వీరు ఎన్నో తెలుగు గ్రంధాలను వెలికి తీసారు.అలాగే కద్వెల్,గిన్,హాల్డేన్ మొదలైన వారు ఎంతో సేవ చేసారు.డా డేనియల్ నేజర్స్ తెలుగు వారి బుర్ర కథలపై పరిశోధన చేసి పారిస్ లో సిద్దాంత వ్యాసం సమర్పించాడు.
            కర్నాటక సంగీత వాగ్గేయ కారుల్లో త్రిమూర్తు లైన శ్యామ శాస్త్రి,త్యాగ రాజు,ముత్తు స్వామి మన తెలుగు వారే .వస్తుత ఇది తెలుగు సంగీతమే.
          ప్రపంచం లో లిపి ఉన్న భాషల్లో అత్యుత్త మైన దాని ఎంపిక చేయగా మన తెలుగుకు ద్వితీయ స్థానంవచ్చింది కొరియాకు ప్రధమ స్థానం ,ఆంగ్లానికి తృతీయ స్థానం వచ్చాయి.దీనికి విశేష కృషి చేసి అచ్చ తెనుగు సొగసును సొబ గును ప్రపంచానికి చాటిన వారు మాడ భాషి సంపత్కుమార్.
          ఎదుటివారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ మాటల భావం వారి మెదల్లలోకి వెడుతుంది.అదే వారి మాతృ భాషలో మాట్లాడితే నేరుగా వారి హృదయాలను తాకుతుంది--------నెల్సన్ మండేలా    ఇది అక్షర సత్యం కదా!
        ప్రతి ఒక్కరు తమ మాతృ భూమిని ,సంస్కృతిని,మాతృ భాషను గౌరవించాలి.ఎందుకంటే అవి మనకు ఆనందాన్ని కలిగించేవి.--------------ఋగ్వేదం
        600 సంవత్సరాల క్రిందట భరతుని నాట్య శాస్త్రం నుండి సిద్ద్డెంద్ర యోగి కూచి పూడి  నాట్యాన్ని సృష్టించారు చక్కర తేనెల ఊట,మధురామ్రుతాల తోట ,నవరస నాట్య దీపిక మన కూచిపూడి
        బాపు బొమ్మలు,బాపు అక్షర శైలి మన భాషకే సొంతం.అన్నమయ్య ,త్యాగయ్య,క్షేత్రయ్య ప్రముఖ వాగ్గేయ కారులు.
          మల్లె పూవు కంటే----- మంచి గంధము కంటే
          పంచదార కంటే----పాల కంటే
          తెలుగు భాష లెస్స!దేశభాషలకు,సం
          గీతభాష తెలుగు జాతి భాష ----------రసరాజు
   ఒక సంగీత మేదో పాడినట్లు ,భాసించు నపుడు వినిపించు భాష అన్నారు విశ్వనాద.
   అవధానం తెలుగు భాషలో మాత్రమే ఉంది కొండవీటి వెంకట కవులు,గరికపాటి,నాగ ఫనిశర్మ ప్రసిద్ధులు.
చలం,శ్రీశ్రీ,శేషేంద్ర శర్మ,డా సి.నారె, దాశరథి ఇలాంటి ఎంతో మంది ఆధునిక కవుల వలన కూడా తెలుగు భాష పరిమళిస్తుంది.
(పై సమాచారం తెలుగు వెలుగు మాస పత్రిక, మరికొన్ని ఇతర పుస్తకాలనుండి సేకరించినది.వారికి ధన్య వాదాలు.)

Sunday, 7 April 2013

ఆరోగ్యమే మన లక్ష్యమైతే !


                మనం ఎన్నో లక్ష్యాలను సాధించాలని అనుకుంటాం.మానవ జీవన పురోగమనానికి ఈ వైఖరే  కారణం కానీ మనం అనుకున్న లక్ష్యాలను సాధించటానికి మన ఆరోగ్యం సహకరించాలి కదా!లక్ష్యాల సాధనకు ఓ లక్ష్యం పెట్టుకోవాలి.అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం.మన పెద్దలు ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటించేవారు.ప్రశాంత మైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించారు.వేగవంత మైన ఆధునిక జీవన శైలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంది.చివరికి ఆరోగ్యం పాడవగానే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా,శారీరకంగా మానసికంగా క్రుంగి పోతుంటారు.కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకుంటే ఎవరికి  వారు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.
       వివిధ రకాలయిన ఆహార పదార్ధాలు  ఎటువంటి పోషక విలువలు కలిగి ఉన్నాయో  NIN(National institute of Nutrition) వారు  సమగ్రంగా పరిశోధించి తెలియ జేశారు.ప్రతి రోజు దినపత్రికల్లో,పుస్తకాల రూపేణా ఈ సమాచారం  దొరుకుతుంది.అలాగే ఏ ఆహారం ఎటువంటి నష్టం కలుగ జేస్తుందో కూడా మనం డాక్టర్స్ ద్వారా సమాచార సాధనా ల  ద్వారా తెలుసుకుంటూ ఉంటాం.కానీ ఆచరణ కొచ్చేసరికి విఫల మవుతూ ఉంటాం.రుచి కోసం ఎప్పుడయినా తినటం వేరు,ప్రతి రోజు రుచులకు అలవాటుపడి ఎక్కువ మోతాదులో తినటం వేరు.ఒక పదార్థం మనకు హాని కరమైనది అని తెలిసిన వెంటనే దాన్నుండి క్రమేపీ దూరం కావటం మొదలెట్టాలి.అవసరానికి మించి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవటం,అధిక కొవ్వును పెంచుకోవటం,ఊబకాయాన్ని పొందటం ఇదంతా ఓ విష వలయం.పోషక విలువలుగల ఆహారాన్ని సరిపోయినంత తీసుకోవటం అవసరం.
    మనం తీసుకునే ఆహారం ద్వారానే పలురకాల రుగ్మతలు వస్తుంటే,ఇక దుర్వ్యసనాలకు అలవాటు  పడ్డ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పూర్వ కాలం మనుషులందరూ శారీరక శ్రమ చేసి జీవనం సాగించేవారు కాబట్టి వారికి ఏ వ్యాయామం అవసరం ఉండేది కాదు.కానీ ప్రస్తుతం పట్టుమని పావుగంట శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్నాం.అందుకని ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించటం,యోగా,ప్రాణాయామం,ధ్యానం చెయ్యటం మానవునికి అవసరమైనది.ఉప్పుకారం తగ్గించుకోవటం,మంచినీరు ఎక్కువగా తీసుకోవటం, ప్రశాంతంగా నిద్రించటం ఎంతో అవసరం.కూల్ డ్రింక్స్ కు  బదులు పళ్ళ రసాలు,కొబ్బరినీరు,మజ్జిగ తీసుకోవటం ఉత్తమం.
       ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎవరికి  వారు తమకి తగిన విధానాన్ని ఎన్నుకొని అవలంబిస్తూ  ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని  ఆశిద్దాం.

Friday, 29 March 2013

అమ్మా-నాన్న,ఓపెన్ హౌస్ అను సేవా సంస్థలు


            మనం ఎన్నో రకాలయిన ప్రేమలను చూస్తూఉంటాం.తల్లి ప్రేమ,తండ్రి ప్రేమ ,సహోదర ప్రేమ ,సమ వయసు ప్రేమ .మరి  ఏ  బంధము  లేకుండా సేవ చేసే ప్రేమను ఏమంటాము ....పిచ్చి ప్రేమ అంటామేమో .మతిస్థిమితం లేని వారిపై ఇటువంటి ప్రేమనే చూపుతున్నారు "అమ్మా నాన్న"ఆశ్రమం  నిర్వాహకులు శంకర్ ఆయన భార్యపరమేశ్వరి హైదరాబాద్ విజయవాడ రహదారిలోని చౌటుప్పల్ ప్రాంతం లోని ఈ ఆశ్రమంలో పాతిక మంది మతిస్థిమితం కోల్పో యిన వ్యక్తులు కనిపిస్తారు.వారిని కంటికి రెప్పలా చూస్తూ,వారిని మామూలు మనుషులుగా తీర్చి దిద్ది వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు.తన అన్న పిచ్చివాడిలా మారి పోయి చాలా కాలం కనిపించక కొన్నేళ్ళకు హైదరా బాద్ ఉస్మానియా ప్రాంతం లో చెత్త కుప్పల్లో చనిపోయి కనిపించాడట.నా అన్నలాగ మరొకరు ప్రాణాలు వదలకూడ దని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాము అంటాడు శంకర్.
     పని మీద  హైదరాబాద్   వచ్చి నిలువ నీడ లేక జేబులో డబ్బు లేక  ఉన్నారనుకొండి .అలాంటి వాళ్ళ కోసం డా .వింజమూరి ప్రకాష్ స్థాపించిన "ఓపెన్ హౌస్" సిద్ధంగా ఉంటుంది.సరూర్ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంకు ప్రక్కనే ఉన్నఈ హౌస్ లోకి ఎవరైనా రావచ్చు.కాకపోతే అక్కడ వున్న వంట పదార్థాలతో మీరే  వండుకొని తృప్తిగా తిని ఒకటి,రెండు రోజులు బస చేసి వెళ్ళవచ్చు.పేద విద్యార్థులు,నిరుద్యోగులు దీనిని ఉపయోగించు కుంటున్నారు .వంట చేసుకోలేని వారికోసం వాలంటీర్స్ ఉన్నారు.దీనికి సాయం చేయాలనుకునే వారు 040-24046000 కు ఫోన్ చేయవచ్చు.
   పై రెండు సేవా  సంస్థల వివరాలు సాక్షి,ఆంధ్రజ్యోతి నుండి సేకరించినవి.వారికి ధన్యవాదాలు.వారు చేసే ఈ గొప్ప ప్రయత్నాలను అందరికీ తెలియజేయాలనే ఆలోచన.  

Thursday, 21 March 2013

తెలుగు సౌరభం


       తెలుగు  సౌరభం  పేరుతో 7 వ రాష్ట్ర స్థాయి రచయితల మహాసభలు 2013 ఫిబ్రవరి 8,9,10 తేదీలలో ఒంగోలు లోని T.T.D కళ్యాణ మండపం నందు ఘనం గా జరిగాయి.3 వ రోజు జరిగిన సమావేశానికి నేను హాజరయ్యాను.ఉదయం జరిగిన సాహిత్య శిక్షణా శిబిరం లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  గ్రహీత కే.శివారెడ్డి ఆధ్వర్యం లో జరిగింది.మొదట ప్రముఖ కవి దర్భ శయనం శ్రీనివాసా చార్య  హాజరయిన కవులకు కవిత్వం పై పలు సూచనలు చేసారు.
       మంచి కవిత్వం వ్రాయటానికి జీవితానుభవం,విస్తృత అధ్యయనం దోహదం చేస్తాయి.మన చింతన లోనుండి పుట్టిన ఆవేశం నుంచి కవిత్వం ఉద్భ విస్తుంది.భావం, భాషల పై మనకున్న మోహం మనల్ని నడిపిస్తాయి.కాని భాష పట్ల నిర్మోహం కూడా అలవర్చుకోవాలి.మన తాత్విక సాధన కవిత్వం లో శబ్దమై కూర్చుంటుంది.
    కవిత్వానికి మూలకాలు భావన,భాష .ఇవి నిరంతరం చదవడం ద్వారా అలవడతాయి.కవిత పాఠకుడు మననం చేసుకుని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించాలి.బాలగంగాధర తిలక్ అంటాడు.కవిత చదివితే ఆనందం లాంటి విచారం కలగాలంటాడు కవిత ఆరంభం ఒక పెద్ద అవస్థ అంటాడు శ్రీ శ్రీ .కవిత అవిచ్చిన్నంగా ఉండాలి.కవిత లో సంక్లిష్టత ,కష్టమైన  మాటలు తగ్గిం చాలి.ఒక పాదానికి ఇంకో పాదానికి మధ్య అన్వయం కుదరాలి.విషాద కవిత నుండి పాఠకుడు DISTURB కావాలి గందర గోళానికి గురికాకూడదు.మృదువైన కవితలో శబ్దానికి,శబ్దానికి మధ్యలో సామరస్యం ఉండాలి.భాషా సంపద విస్తృతం గా ఉంటె వాటిని మన భావనలకు ఎన్నుకోవచ్చు.ఏ కవితయినాపాఠకుడిని తన జీవితం లోకి పునర్దర్శనం చేయగలిగితే అది గొప్ప కవిత.కవిత్వం లో బాధ్యతా రాహిత్యానికి తావు లేదు.కవిత్వానికి శబ్దం కాదు.భావన ప్రధానం.ఒక ఇంగ్లీష్ కవిత పేరు అమెరికా .అందులో ఈ విధంగా ఉంది .WHERE THE LIBERTY IS STATUE.మంచి కవికి క్లుప్తత కావాలి.గరుకైన పదాలు కావాలి.పత్రికల్లో పడటం గీటురాయి కాదు.కవికి నమ్రత కావాలి.కవి గొప్ప భావుకుడు కావాలి.మంచి కవిత్వం చదివిన వెంటనే మనసులో  నిశ్శబ్దం ఆవరించాలి.
       కథలపై డా:వి.చంద్ర శేఖర రావు కవులకు సూచనలు చేసారు.కథా రచనలో సమాజం లోని సంఘటనలు transform కావాలి.కథ, కవిత meditative process లో  పుడతాయి.రాయలేనితనం,తపన ,నుండి  కథ కవిత ఉదయిస్తాయి మన లో గొప్ప కాంక్ష,నిలవనీయని అగ్ని పుట్టాలి.వాతావరణం,పాత్రలు ,పాత్రల  స్వ భావం గురించి  అవగాహన   చేసుకొని కథ మొదలెట్టాలి.కథకు శైలి శిల్పం అవసరం.సమాజం, మనుషుల్లోని ప్రేమ,కథల్లో ప్రస్తావించాలి.కథ వ్రాయాలనే దహించే అగ్ని ఉండాలి.
విమర్శ  పై పాపినేని  శివశంకర్
         వి మర్శకుడికి నిజాయితీ అవసరం.ప్రశంస  కూడా విమర్శ లో ఒక భాగమే విమర్శ అంటే గుణాగుణ  పరామర్శ. విమర్శ గొప్ప అన్వేషణ.కవి జీవితాన్ని ఉన్నతీకరిస్తాడు.కవిత్వాన్ని సాహిత్యాన్ని విమర్శకుడు ఉన్నతీకరిస్తాడు.శివారెడ్డి గారు కవిని ప్రేమించి ప్రోత్సాహించాలి అంటాడు.దాన్ని ప్రేమపూర్వక అభినందన అంటారు.దర్భశయనం కవితలను విశ్లేషణ చేస్తాడు.నేను నిష్కర్షగా విమర్శి స్తుంటాను.విమర్శకుడు కుల మత ప్రాంత రహిత విమర్శ చేయాలి.విమర్శ ఆలోచనా ప్రధాన మైనది.మానవ జీవితానికి,మానవ సంస్కారానికి విరుద్ధమైనది అనవసరం.
        ఘజ ల్స్  గురించి పెన్నా శివరామ కృష్ణ  వివరించారు.దేవీ ప్రియ నిర్వాహకులకు కొన్ని సూచనలు చేసారు.
      సాయంత్రం సభకు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి.హనుమారెడ్డి అధ్యక్షత వహింఛి బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతుల అన్నదాన దాతృత్వాన్ని ప్రశంసించారు.తరువాత గరికపాటి నరసింహారావు గారిని సభకు పరిచయం చేసారు ఆయన వాగ్ధాటి సభికులను మంత్ర ముగ్ధులను చేసింది.ఆయన మాటలలోనే "తెలుగు భాషకు తల్లి వేర్లు  తెగిపోతు న్నాయి.మనం చివుల్లకు నీళ్ళు పోస్తున్నాము.పాటశాల స్థాయి లోనే పిల్లలకు వేమన పద్యాలు నేర్పించాలని అందులో వున్న  వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలని  ఉపాధ్యాయు లను కోరారు.విరాట పర్వాన్ని మానవత్వం కోసం చదవాలి.భారత జాతిలో వున్నా మూఢ నమ్మకాలు పోవాలి.స్వామీజీల వెంట పడే జనాలు శాస్త్రవేత్తల  వెంట నడవాలని  కోరారు. పురాణాలలోని పద్యాలలో వున్నా వ్యక్తిత్వ వికాసాన్ని వివరించారు.మనిషి యొక్క గుప్పెడు గుండెలో ఆనందముందా?  ఎదగాలంటే ఏకాంతం కావాలి.ఉపాధ్యాయుడు జీవితాంతం చదవాలి.కవులు ఎక్కడ మంచి కవిత్వ మున్నా ప్రశంసించాలి వాస్తవాన్ని ఊహ తో సమర్ధించాలి.ఊహను వాస్తవం తో  సమర్ధించాలి.అతనే మహాకవి.అవినీతి తగ్గాలంటే ముగ్గురి వలన  సాధ్యమవుతుంది.వారు తల్లి తండ్రి,ఉపాధ్యాయుడు.ముందు మానవ సంభందాల్లోని అవినీతిని పారద్రోలాలని చెప్పారు.
     సభలు దిగ్విజయంగా  జరగటానికి పొన్నూరి  శ్రీనివాసులు గారు ప్రముఖ కవి బాలకృష్ణారెడ్డి గారు కృషి  చేశారు 

Sunday, 17 February 2013

"నిరంతర సత్యాన్వేషి " జిడ్డు కృష్ణమూర్తి


               ఈ రోజు జిడ్డు కృష్ణమూర్తి  వర్దంతి.1895 మే 11 న  జనించిన ఆయన  1986 february 17 న పరమ పదిం చారు.1910 నుంచి 1985 వరకూ ప్రపంచ మంతా పర్యటనలు చేసి ప్రసంగాలు చేసారు.జీవితాన్ని అద్భుతంగా పరిశీ లించి దాన్ని సమగ్రంగా ఏకముఖంగా చూడ మని చెప్పాడు.మనుషులందరు ఎవరికీ వారు హృదయాల నిండా ప్రేమను,అనురాగాన్ని నింపుకొని స్వస్వరూప జ్ఞానాన్ని అవగతం చేసుకోవడం అవసరం అని చెప్పారు .సత్యానికి ఓ నిర్దిష్ట మార్గం లేదని ప్రకటించారు.మనిషిని కట్టి పడవేసిన అలవాట్లు,ఆచారాలు,సంప్రదాయాల పరిమిత ప్రయోజ నాలు  గ్రహించి ఆ బంధాల నుంచి ఎవరికీ వారే విముక్తి చెందాలని పిలుపిచ్చారు.
               సత్యాన్ని  వ్యవస్తీ  కరించటం మంచిది కాదని ,సత్యం అనేది pathlessland అని ప్రకటించారు.
   నా ఏకైక లక్ష్యం "మనిషిని  సంపూర్ణంగా ,నిర్నిబంధంగా విముక్తుడిని చేయాలి."
         "to set man absolutely unconditinally free"
 ఆనంద  సామ్రాజ్యానికి  తాతాళపు చెవి   ఎవరి  అధీనం  లోనో  లేదు .ఆ  తాళపు  చెవి  మీరే .మిమ్మల్ని  మీరు  వికాస   పరచుకోవడం ,నిష్కల్మషంగా తయారవడం మీదనే  ఆ భూమిక నిలిచి ఉంది.
   కృష్ణ మూర్తి తన బోధనల సారాంశం(core of teaching) అంటూ అక్టోబర్ 21 1980 న ఒక ప్రకటన చేసారు.దీనిని 7 విభాగాలుగా పరిశీలించాలి.
1)సత్యం అనేది ఒక దుర్గమ క్షేత్రం .దానిని చేరటానికి రహదారులు లేవు.దానికి ఒక సంస్థ ద్వారా ,వ్యవస్థ  ద్వారా సిద్దాంతం ద్వారా చేరలేము.తన సంబంధ బాంధవ్యాల దర్పణం ద్వారా మనస్సు అంతర పరివర్తనల అవగాహన ద్వారా మనస్సును సమగ్రంగా పరిశీలించటం ద్వారా చేరు కోవచ్చు.
2)మనిషి తన మనస్సులో ఎన్నో రూపాలు,అభిప్రాయాలు ,విశ్వాసాలు తయారు చేసుకున్నాడు.వాటి బరువు అతని మానసిక వాతావరణాన్ని క్రుంగ  దీస్తుంది.తన సంబంధాలను భారం చేస్తుంది.ఇదే మన సమస్యలన్నింటికీ మూల  కారణం.
3)మనిషి చిత్తం లో ఉన్నదంతా కలిసి మనిషిని రూపొందిస్తుంది.పేరు,రూపం ,సంప్రదాయం వాతావరణం .పర్యావ రణాల వలన  బాహ్యంగా ఏర్పడిన సంస్కారం ఇదంతా కలిసి మనిషి వ్యక్తిత్వం గా భావించ బడుతుంది.చేతనం లో ఉన్న దాన్నుండి విముక్తుడిగా ఉండడం లోనే ప్రత్యేకత ఉంది.
4)ఎటువంటి  దృక్కోణం  లేకుండా జీవిత పరిశీలన  చేసుకోవడమే స్వేచ్చ.పరిశీలన  చేసుకున్న కొద్దీ తనకు ఎంత స్వేచ్చ లేదో తెలిసివస్తుంది.మన దైనందిన కార్య కలాపాలలో అరమరికలు లేని ఎరుకతో నిండిన స్వేచ్చ అతి ప్రధాన మైనది .
5) కాలం  నుంచి గతం నుంచి పుట్టిందే  అనుభవమూ,జ్ఞానము .మన పనులన్నీ అనుభవం నుంచి,సమయం నుంచీ పుడుతున్నాయి.మనిషి ఎప్పుదూ గతానికి బానిసగా  తయారవుతున్నాడు మనసును ఆలోచనలను మన పనుల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి.ఎప్పటికప్పుడు విముక్తుడిగా పని చేయ గలగడం సహజ ప్రవృత్తి గా  తయారయి పోవాలి.
6)మనిషి  తన ఆలోచనలను భావనలను పరిశీలనాత్మకంగా చూసుకున్నందువల్ల భావకునికి(thinker)
భావన(thought) కు మధ్య వున్నా అంతరం తొలగిపోతుంది.అప్పుడు పరిశీలనా మటుకే మిగులుతుంది.అదే అంతః స్పూర్తి దాని మీద గతం యొక్క సమయం యొక్క నీడలు ప్రభావాలు  పడవు.
7)పరిపూర్ణంగా కాదనడమే(total negation) ఉన్న దాని సారాంశం మనసు తీసుకు వచ్చిన అన్ని రూపాలను ప్రతి రూపాలను తోసి రాజనడం వలన  మానసిక వాతావరణాన్ని సుధ్ధం చేయడం అవుతుంది.అప్పుడే ప్రేమ అంకురిస్తుంది.అదే కారుణ్యం(compassion) అదే  వివేకం (intelligence)
పై అంశాలను సంపూర్ణం గా ఆచరణ లోకి తెస్తే చివరి మెట్టు సాధ్య మవుతుంది.
   చివరి మెట్టు "ప్రేమ"
మనస్సును పూర్తిగా ప్రేమతో నింపుకో.ఆ తరువాత ఏదయినా చేయి. అంటారు కృష్ణ  మూర్తి.మనసు హృదయము ప్రేమతో నిండిన తర్వాత మనిషి చెడు చేయ లేడు .  మంచి చేయడం తప్ప ఇంకేమీ చేయలేడు.

  శ్రీ  విరించి రచించిన "నిరంతర సత్యాన్వేషి " అన్న రచన నుండి పై వ్యాసం సేకరించటం జరిగింది.వారికి కృతజ్ఞతలు . .

Thursday, 7 February 2013

అందరూ కుశలమా!


చాలా కాలమయింది బ్లాగు మిత్రులను కలిసి అందరు క్షేమమేనా!మరిన్ని కొత్త విషయాలతో త్వరలో మీ ముందుకు !
మీ రవిశేఖర్