Wednesday 1 January 2020

కాలచక్రం 2020

కాల చక్రం తిరుగుతూ ఉంది.మన భూమి 454 కోట్ల సంవత్సరాలనుండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.ఒక్కో పరిభ్రమణాన్ని ఒక్కో సంవత్సరంగా మనం పరిగణిస్తుంటాం.అంటే ప్రస్తుతం క్రీస్తు జననం తర్వాత 2019 పరిభ్రమణాలు పూర్తి చేసి 2020 వ పరిభ్రమణం మొదలెట్టింది మన భూమి.గణాల్ని,తెగల్ని,సమూహాలను,రాజ్యాల్ని దాటుకుంటు ప్రస్తుతం దేశాల్ని చూస్తుంది.ఒక్కటిగానున్న తనను గీతలు గీసి ముక్కలు చేసుకున్న కాలాన్ని చూస్తుంది.దేశాల పరంగా, మతాల పరంగా,జాతుల పరంగా విడిపోయిన తనని తాను చూసుకుంటుంది భూమి.                                     జీవరాశి నివసించటానికి అనుగుణంగా సిద్ధమయిన భూమి అదే జీవరాశి లో అత్యున్నతమైన దశకు చేరుకున్న మానవుని దెబ్బకు విలవిలలాడుతుంది.struggle for existence, survival of the fittest సూత్రాలతో జీవపరిణామ  ముందుకు సాగుతోంది.అత్యంత నాణ్యమయిన జీవితం గడపటానికి ,సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనిషి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు.                                                                 పారిశ్రామిక యుగానికంటే ముందు స్వచ్ఛమైన గాలి,నీరు,పచ్చని అడవులతో కాలుష్యరహితంగా ఉన్న ఈ భూమి అత్యున్నత సాంకేతిక యుగం లో కాలుష్యభరితమై,జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ,భూతాపం ఎక్కువయ్యి కొట్టుమిట్టాడుతోంది.2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీ లు పెరిగి జీవికి నివాసయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.                                            మరో ప్రక్క ఇవేవీ పట్టని దేశాలు,ఒకదానిపై మరొకటి పోటీతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో, వాణిజ్యయుద్దాలతో సంపద సృష్టితో,అభివృద్ధి పేరుతో తీవ్రంగా పోటీ పడుతూ ప్రస్తుత తరం భవిష్యత్తును ఫణంగా పెడుతూ దూసుకెడుతున్నాయి.                                             నాణ్యమైన, ఆరోగ్యకరమైన,ఆనందకరమైన ,సమతుల జీవనం ఎలా ఉండాలో భూటాన్ లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవచ్చు.                                                               భూమి ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన అభివృద్ధి,మన సంపద,జీవజాతుల మనుగడ.ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు సమావేశమై తక్షణం భూవిధ్వంసానికి కారణమయ్యే ప్రతిఅంశాన్ని లోతుగా చర్చించి అమలుపరిచే కార్యాచరణ సిద్ధం చేయాలి.ప్రతి ఒక్కరు,ఏ పనిచేస్తున్నా పర్యావరణానికి,ప్రకృతికి ఏమయినా కీడు చేస్తున్నామా అని ఆలోచించాలి.ఎవరివంతు ప్రయత్నం వారు చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని బహుమతిగా ఇవ్వవచ్చు.లేదంటే భావితరాలు మనల్ని క్షమించవు.                                                                        క్రీ.శ 2020 వ భూ పరిభ్రమణ శుభాకాంక్షలు.                     ఒద్దుల రవిశేఖర్.

Monday 10 September 2018

అనంతపురం యాత్ర.

                 ఫిజిక్స్ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సమావేశం అనంతపురంలో 9/9/18 న ఉండటం తో చుట్టుపక్కల ప్రదేశాలు శనివారం చూద్దామని నాగ మూర్తి ప్రతిపాదించడంతో ఏడో తారీఖు సాయంత్రం అనంతపురం బయలుదేరాము. ఉదయాన్నే ఆనంద భాస్కర్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్లు
హోటల్ కు వచ్చి పలకరించారు. టిఫిన్ గా ఆప్రాంత ప్రత్యేక వంటకమైన  ఓలిగలు పెట్టించారు. పక్
భక్ష్యం కంటే పలుచగా చాలా బాగున్నాయి.                                               8:30 కి కార్ లో బయలుదేరాము, మొదట పెనుగొండ కోట కు  బయలుదేరాం. మార్గమధ్యంలో  కియా మోటార్స్ మీదుగా వెళ్ళాము, వందల ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి కొరియా భాషలో దారి పక్కన బోర్డులు దర్శనమిస్తున్నాయి, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు పోషించిన సాళ్వనరసింహరాయలు స్థాపించిన కోట ఈ పెనుగొండ కోట, చుట్టూ కోటగోడ తప్ప ఏమీ మిగల్లేదు అక్కడే కాళేశ్వర్ ఆశ్రమం, జైన దేవాలయం చూసి కృష్ణదేవరాయలు అద్భుతమైన విగ్రహాన్ని చూసాము.
                అక్కడ నుండి లేపాక్షి వెళ్ళాము మేము వస్తున్నామని ఆనంద్ భాస్కర్ చెప్పడంతో కేశవరెడ్డి మమ్మల్ని స్వాగతిస్తూ ఆలయంలోని శిల్పాల ప్రాధాన్యతను తెలియచేస్తూ 2 గంటలపాటు వివరించారు, మరియు ప్రత్యేక దర్శనం చేయించి వారు చేసిన అతిధి మర్యాద మరువలేనిది, వారు లేకపోతే ఒక అర్ధగంటలో బయటికి వచ్చే వారం అక్కడ మాకు పశ్చిమగోదావరి మిత్రుడు శేషేంద్ర గారు కలిశారు అందరిని మరలా కేశవరెడ్డి వారి ఇంటికి తీసుకెళ్లి
ఆదరించారు, తరువాత ప్రసిద్ధి చెందిన నంది విగ్రహాన్ని
దర్శించాము. గండభేరుండ పక్షి ని ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించారట, లేపాక్షి ఆలయానికి సరియైన ప్రచారం లేదనిపిస్తుంది తమిళనాడు ఆలయాల తరహాలో శిల్పకళ ఉట్టిపడు తుంది.పర్యాటకులు విస్తారంగా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
                 కదిరి దగ్గర ఉండే తిమ్మమ్మ మర్రిమాను దగ్గరికి వెళ్లాం.దాదాపు 600 సంవత్సరాల క్రితం తిమ్మమ్మ నాటిన ఈ మొక్క 8 ఎకరాల్లో విస్తరించి అద్భుతంగా కనిపిస్తుంది.
పచ్చగా కళకళలాడుతూ ఉన్న మర్రిచెట్టును తనివితీరా చూసాం.చెట్టు మొదలు శిథిల
మవటంతో అక్కడ చిన్నగుడి కట్టారు.అటవీ శాఖ దీనిని చాలా చక్కగా పరిరక్షిస్తుంది.ప్రతి సంవత్సరం ఈ చెట్టు  విస్తరిస్తోంది.
ఈ వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయింది.
 తరువాత కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యాము..

Tuesday 28 August 2018

మహాబలిపురం(తమిళనాడు) యాత్ర.

                   చెన్నైలోని చూడదగ్గ ప్రదేశాలలో మైలాపూర్లోని కపాలీశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడుతుంది. ముందున్న అతి విశాలమైన కోనేరు చూపులు పక్కకు తిప్పనివ్వదు. దీనికి దగ్గరలో రామకృష్ణ మిషన్ ఆశ్రం ఉంది ఇది 1905 లోనే ప్రారంభించబడింది శారదామాత వివేకానంద ఇక్కడికి వచ్చారు.                                                              అలాగే మెరీనా బీచ్ ఉదయాన్నేచూస్తే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే శుభ్రత బాగా తక్కువ.అన్నాదురై,MGR ,జయలలిత,కరుణానిధి సమాధులు ఇక్కడ ఉండటంతో యాత్రా స్థలంగా మారింది.                                            ఇక ప్రత్యేకంగా చూడాలనుకుని ప్లాన్ చేసుకొని మహాబలిపురం వెళ్ళాం ప్రభుత్వ బస్సులు ఉన్నా ఎక్కువ ప్రాంతాలు చూడలేమని కారు తీసుకుని ఏడు గంటలకు బయలుదేరి 8:30 కల్లా  మహాబలిపురం చేరాము. అడయార్ ఆనంద భవన్ లో టిఫిన్ చేశాం ఊరిబయట విశాలమైన స్థలంలో రిసార్ట్ లాగా ఉంది రుచి బాగా ఉన్నా, విపరీతమైన ధరలు ఉన్నాయి. మొదట షోర్ టెంపుల్ చూసి పాండవ రధాల దగ్గరికి వెళ్లాము. రాయిని చెక్కి గుడిని శిల్పాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
                   ఇసుకలో పూడిపోతే వెలికితీసినట్లు గా ఉంది సహజత్వం ఉట్టిపడేలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది సముద్రపు ఒడ్డున ఉంది తర్వాత లైట్ హౌస్ దగ్గర కొండపైన గుడి చూసాము. అక్కడనుండి నది సముద్రంలో కలిసే చోటుకనిపిస్తుంది .మొదట ఈ కొండపైన గుడిపై old light house ఉండేది.1900 లో బ్రిటిష్ వారు కొత్తగా కట్టారు.దీనిపై నుండి సముద్రాన్ని చూడటం గొప్ప అనుభూతి.తరువాత మ్యూజియం చూసాము.ఓడల విడిభాగాలు,ఆ ప్రాంతం లో దొరికిన విభిన్నమైన వస్తువులు ఇక్కడ ఉంచారు.ఓడ పై భాగంలో గల గద ఆకారంలో ఉన్న వస్తువు చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక మహాబలిపురానికి ప్రత్యేకమైనటువంటి రాళ్ళపై శిల్పాలు గుడులు చూసాము.చివరలో సీషోర్ టెంపుల్ చూసాం ఇదికూడా పల్లవులు చోళులు హయాంలో నిర్మించిందే ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది ప్రక్కనే బీచ్ చూసుకొని తిరుగు ప్రయాణమయ్యాం.                                                                                        మార్గమధ్యంలో దక్షిణ చిత్ర , జైన దేవాలయం చూశాం. దక్షిణ చితలో దక్షిణ భారతదేశం లోని పాతకాలపు ఇండ్లను తిరిగి కడుతున్నారు.  ఇక్కడ దక్షిణ భారత కళలు పరిరక్షించ బడుతున్నాయి ఈ ఆలోచన ఒక విదేశీయురాలుకు వచ్చింది ఆమె ఈ ప్రాంతానికి వచ్చి 13 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించింది ఇది గొప్ప ఆలోచన.  జైన దేవాలయం అత్యద్భుత నిర్మాణశైలితో రాజస్థాన్ వారు నిర్మించారు. జైన మతానికి చెందినటువంటి తీర్థంకరుల యొక్క విగ్రహాలు ఇందులో ప్రత్యేకత. నిర్మాణం పై భాగమంతా అర్థ చంద్రాకారంగా ఉంటుంది. మీరు ఒకసారి మహాబలిపురం చూసి  వస్తారు కదూ!

Thursday 19 October 2017

శ్రీశైలం ఆనకట్ట సందర్శన

కృష్ణా నది ఉరవళ్లతో డాం నిండి గేట్లు ఎత్తివేశారని తెలిసి శ్రీశైలం వెళ్ళాము.దారంట నల్లమల అడవి వర్షాలకు మనోహరంగా కనిపిస్తుంటే చూస్తూ వెళ్ళాము.పోగానే పర్యాటక సందర్శన బస్ ఎక్కి బయలుదేరాము.పాలధార పంచదార దగ్గర శంకరాచార్యుడు తపస్సు చేసాడంటారు.అక్కడ జలధార ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియదు.తరువాత శిఖరం చూసుకుని ఆనకట్ట దగ్గరికి వెళ్ళాము,రెండు కళ్ళు  చాలలేదు ఆ ప్రవాహాన్ని చూడటానికి.6 గేట్లు ఎత్తారు.డాం ఉపరితలం లో గుఱ్ఱపుడెక్క నిండి ఉంది.ప్రవాహం అంతెత్తునుండి పడి పాము పడగ విప్పి పైకి లేచినట్లు లేచి మరల పడుతూ వెండి మబ్బుల్లా తెల్లని నురగను వ్యాపింప చేస్తుంటే మనసు ఆనందం తో పరవశించింది. అక్కడ ప్రవాహాన్ని చూడటానికి ఒక భద్రమైన ఏర్పాటు చేసి ఉంటే బాగుండు. కెమెరా నిండా ఆ దృశ్యాలను బంధించి మళ్లీ శ్రీశైలం చేరుకుని గుడి సందర్శనకు వెళ్ళాము,జనం లేకపోవటం తో త్వరగా దర్శనం పూర్తయింది.గుడికి దక్షిణం వైపు అందమైన రంగులతో రంగవల్లిక లద్దారు. తరువాత పాతాలగంగ చూడటానికి మెట్లు దిగుతూ వెళ్ళాము.ఆనకట్ట వెనుకగా చూస్తే నిండుకుండలా ప్రశాంతంగా ఉంది.అక్కడ కొండలపై కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి.కెమెరాతో వాటిని బంధించి రోప్ వే  ద్వారా తిరుగు ప్రయాణం అయ్యాము.తప్పకుండా రోప్ వే ఎక్కండి, మంచి అనుభూతి ,అక్కడనుండి మరిన్ని ఫొటోస్ తీసాము.బస్ ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాయి.express bus tickets పల్లెవెలుగు కన్నా రెట్టింపు కన్నా ఎక్కువున్నాయి.ఏదేమైనా ఒక్కరోజు ప్రయాణం లో ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకొని వచ్చాము.ఈ క్రింది చిత్రాలన్నీ అక్కడివే.






Monday 26 June 2017

కృష్ణమూర్తి ఫౌండేషన్,చెన్నై సందర్శన

             








ఎప్పటినుండో అనుకుంటున్న కోరిక తీరింది.నిన్న ఆదివారం 25/6/17 న చెన్నై egmore నుండి అడయార్ లోని జిడ్డు కృష్ణమూర్తి నివసించిన వసంత విహార్ ను చూడటానికి వెళ్ళాను.అడయార్ లోని ఆంధ్ర మహిళసభ నుండి Greenways road లో కొద్దిగా ముందుకు వెడితే వస్తుంది.అమెరికా నుండి ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక నెలపాటు ఉపన్యాసాలు ,చర్చలు చేస్తుంటారు.                  6 ఎకరాల సువిశాల స్థలం లో పాతకాలపు రెండస్తుల భవనం ఉంటుంది.పైన కృష్ణమూర్తి పుస్తకాలతో కూడిన గ్రంధాలయం,క్రింద సమావేశ మందిరం ఉన్నాయి.చుట్టూ విభిన్న రకాల వృక్షాలతో కూడిన తోట ఉంది.వెదురు,మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి.ఆయన మరణించిన తరువాత ఆయన కోరిక మేరకు అధ్యయన కేంద్రంగా మార్చారు.ప్రతి నెల 3 రోజుల ఉండేలాగా అక్కడకు వెళ్ళాలి.ఆ 3 రోజుల్లో చర్చలు,వీడియో పాఠాలు,పుస్తక పఠనం లో నిమగ్నమయి మన జీవితాలలో జరిగే అనేక విషయాలపై లోతయిన అవగాహన కలిగించుకోవచ్చు అని చెప్పారు.ఉండటానికి వసతి ఉంది.అఖిలేష్ అని అక్కడే ఉండే నిర్వాహకుడు ఈ విషయాలు చెప్పారు.కృష్ణమూర్తి స్కూల్ నిర్వాహక లైన భరత్ గారు పరిచయమయ్యారు.నేను టీచర్ అని చెప్పగానే స్కూల్ లో పనిచేయండి అని ఆహ్వానించారు.ఈ క్రింది చిత్రాలు చూస్తే మీరు తప్పక వెడతారు.అడ్రస్ THE STUDY ,KRISHNAMURTI FOUNDATION INDIA,Vasantha vihar,124 Greenways Road,R.A.Puram,Chennai 600028 Landmark- between Andhra Mahila sabha hospital and Greenways Road Railway station) Tel:044-24937803/596,Email:vvstudy@kfionline.org,website:www.kfionline.org,Facebook:kfivasantaviharchennai