Thursday, 26 December 2024

SHEROES పుస్తకావిష్కరణ


ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారంటే ఒక auditorium లో ఆ పుస్తకం గురించి మాట్లాడే కొద్ది మంది వక్తలు, ప్రేక్షకులు,రచయిత ఆ కార్యక్రమంలో ఉంటారు.వక్తలు మాట్లాడిన తరువాత ఓ నాలుగు పుస్తకాలు విడుదల చేసి సభను ముగిస్తారు ఎక్కడయినా.ఆ విధానాన్ని SHEROES పుస్తక విడుదల కార్యక్రమం బ్రద్దలు కొట్టింది. Dr శివ ఆర్ జాస్తి, అహల గార్లు రచించిన ఈ పుస్తకం ఆంగ్లం లో జనవరిలో విడుదల కాగా ప్రస్తుతం వంగపల్లి పద్మ దానికి తెలుగు లోకి అనువాదం చేయగా విడుదల చేసే కార్యక్రమం ఇది.256 మంది ధీర వనితల జీవితాలను గురించి క్లుప్తంగా వివరిస్తూ వారు సాధించిన అనుపమాన మైన లక్ష్యాలను నేటి బాలలకు పరిచయం చేయడం ద్వారా వారిలో ప్రేరణ నింపడానికి రచయితలు ఈ పుస్తకం ద్వారా ప్రయత్నించారు.ఈ పుస్తకానికి బాబు డుండ్రపల్లి వేసిన బొమ్మలు అద్భుతమైన అందాన్ని తీసుకొచ్చాయి.అందరు SHEROES బొమ్మలు ప్రదర్శనగా ఉంచడం ప్రత్యేక ఆకర్షణ.అదనంగా మరో 100 మంది SHEROES ను గుర్తించారు మరో సంచికలో చేర్చడానికి. మొత్తం దాదాపుగా 350మంది బాలికలచే SHEROES పాత్రల ఏకపాత్రాభినయాలు చేయించి వారిలోని ప్రతిభ ను ఈ సందర్భంగా గుర్తించడం ప్రశంసనీయం. ప్రతి రూమ్ లో 40 మంది చొప్పున 8 గదుల్లో 350 మంది బాలికలు ప్రదర్శన ఇవ్వగా వారిని 16 మంది జడ్జి లు పరిశీలించి ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక చేసి వారిచే సభలో మరల వారి ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు.మధ్యాహ్నం ఈ పుస్తకం లోని కొంతమంది SHEROES అయిన ఉషా ముళ్ళపూడి, శ్యాల తాళ్లూరి, వంగపల్లి పద్మ, ఓల్గా, వంటి వారితో పుస్తక ఆవిష్కరణ చేయించారు. 350 బాలికలకు ఈ పుస్తకాలు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలు బహుకరించారు.ప్రసాద్ గారు ఇందులో పాల్గొనే బాలికలను,తల్లిదండ్రులను సమన్వయం చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు.ఇంకా NRIVA నుండి పందిరి శ్రీనివాస్ గారు కార్యక్రమ సమన్వయ కర్త గా చక్కని పాత్ర పోషించారు.Oxford పాఠశాలను వేదికగా ఇచ్చినందుకు పాఠశాల అధినేత వేదకుమార్ గారికి పుస్తక రచయితలు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఒద్దుల రవిశేఖర్

పుస్తకాల పండక్కి వెళ్ళొద్దాం


పుస్తకం మస్తకపు ద్వారాలను తెరిచి విశాల ప్రపంచాన్ని చూపిస్తుంది. కాలం ఎంత మారినా పుస్తకం చేతికి తీసుకుని చదువుతూ ఉహించుకుంటూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ మజానే వేరు.పుస్తకపు పరిమళం అక్షరాల ద్వారా వెదజల్లబడుతుంది.దాన్ని గ్రోలుతూ ఉంటే మనస్సు విభిన్న భావోద్వేగాలకు లోనవుతుంటే ప్రపంచం మన ముందు సాక్షాత్కారించి నట్లుంటుంది. ఎందరో కవులు,రచయితలు తమ సృజనాత్మకతకు,మేధస్సుకు పదును పెట్టి ఎన్నో విలువైన విషయాలు మనకందిస్తుంటే మనం అతి సులభంగా ఆ జ్ఞానాన్ని అనుభూతిని పొందు తున్నాం.

ఇక విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగే పుస్తకాల పండుగ గురించి. ఎన్ని వందల స్టాళ్ల లో ఎన్ని వేల పుస్తకాలు కొలువు దీరి ఉన్నాయో, పుస్తక ప్రియులను రా రమ్మని ఆహ్వానిస్తూ! తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలా విభిన్న భాషల్లో మనల్ని ఆనందింప జేయడానికి సిద్ధంగా ఉన్నాయి.ఎంతో మంది కవులు,రచయితలు తమ పుస్తకాలను స్వయంగా అమ్ముతున్నారు. ఆ ప్రాంగణంలో పుస్తక ఆవిష్కరణలు, సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు,పిల్లల ప్రదర్శనలు, రకరకాల తినుబండారాలు ఇలా ఓ పండుగనే తలపిస్తుంది. వేల మంది ఎంతో ఆసక్తిగా పుస్తకాలు చూస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ కొంటున్నారు. పాత మిత్రుల కలయిక, కొత్త మిత్రులు పరిచయం కావడం ఓ అదనపు ప్రయోజనం.

ప్రతి ఒక కుటుంబం తమ పిల్లలతో కలిసి తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇది.చదివే అలవాటు లేని వారు కూడా ఒక్క సారి సందర్శిస్తే ఏదో ఒక పుస్తకం కొనక మానరు.పిల్లలకు ఇప్పటినుండే విభిన్న పుస్తకాలు చదివే అలవాటు చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు చదవడం అలవాటయితే జీవితాంతం ఆ అలవాటు మానరు. వారికి మీరు ఇచ్చే అతి గొప్ప బహుమతి పుస్తకం అయితే చదవడం నేర్పే అలవాటు వారి జీవితాలను అత్యున్నత స్థాయికి తీసుకు వెడుతుంది.

చివరగా ఇంకో 4 రోజులు అంటే 29/12/24 9:00PM వరకు మాత్రమే NTR Stadium (దాశరధి కళా ప్రాంగణం ), ఇందిరాపార్క్ దగ్గర హైదరాబాద్ లో ఈ పండుగ జరుగుతుంది. ఒక్కసారి ఈ పండక్కి వెళ్లిరండి .

 ఒద్దుల రవిశేఖర్(https://www.facebook.com/share/p/15ZfRWHbbW/)

Sunday, 15 September 2024

47.పాటల పూదోట

 హిందీ musical language. మాటలు పాటలుగా ఒదిగే భాష. మహేంద్రకపూర్ పాడిన ఈ old melody వినండి. ప్రకృతిలోని మేఘం, ఆకాశం, జలపాతాలు, పర్వతాలు, ఇలా అన్నిటిని వర్ణిస్తూ విహరిస్తూ, వర్ణిస్తూ మనల్ని మైమరిపించేలా చేసే ఈ గీతం వింటుంటే ఇలా కదా జీవించాల్సింది వర్తమానంలో ప్రకృతితో కలిసి అనిపిస్తుంది.(https://youtu.be/904vZjjVhJU?si=MVJM9hek7E-K8s1L)

పుట్టినరోజు మొక్కలు నాటి పెంచడం.... ఈనాడు వార్త



పుడమికి పచ్చదనమే ఊపిరి


• మొక్కల పెంపే లక్ష్యంగా ముందడుగు •


భావితరాలకు మార్గదర్శకులు ఆ ఉపాధ్యాయులు


పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం కీలకమని గుర్తించిన ఆ మాస్టార్లు కేవలం వాటిని పాఠాలకే పరిమితం చేయలేదు. విద్యార్థులకు భవిష్యత్తు నిర్దేశనం చేసే మార్గదర్శకులుగా మారారు. తాము పనిచేస్తున్న పాఠశాలలోనే అటు విధులు నిర్వహిస్తూ ఇటు పచ్చదనానికి శ్రీకారం చుట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే మార్కాపురం పట్టణానికి చెందిన ఉపాధ్యా యులు ఒద్దుల రవిశేఖర్ రెడ్డి, ఎం.శ్రీనివాస్


న్యూస్ టుడే, మార్కాపురం పట్టణం


పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్న రవిశేఖర్ రెడ్డి 


పుట్టిన రోజు గుర్తుండి పోయేలా...


ఒద్దుల రవిశేఖర్ రెడ్డి తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొక్కల పెంపకంపై అమితమైన ఆసక్తి ఉన్న ఈయన తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో పచ్చదనం పెంపునకే ప్రాధా న్యమిచ్చారు. విద్యార్థులను ఆ బాటలో నడిపేందుకు విద్యార్థుల పుట్టిన రోజు సంద ర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల పుట్టిన రోజులను ముందుగానే రాసు కొని వారికి ఆ విషయాన్ని గుర్తు చేసి మొక్కలు తెప్పించి పుట్టిన రోజు నాటేలా చూశారు. దీంతో ఆ పాఠశాలలో ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది తన సొంత ఖర్చులతో కొంత, దాతల సహకా రంతో మరికొంత నగదును పోగు చేసి వివిధ రకాలు మొక్కలు కొని నాటుతున్నారు. సపోట, దానిమ్మ, సీతాఫలం, నేరేడు, బాదం, బత్తాయి వంటి మొక్కలతో పాటు కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 13 సంవత్సరాలుగా ఆయన పనిచేసే ప్రతి పాఠశాలలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టి వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం. మొక్కల పెంపకానికి సంబందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Thursday, 12 September 2024

పుట్టిన రోజు మొక్కలు నాటడం

               పుట్టినరోజు ఎవరికయినా మధురమైన రోజు. పుట్టిన రోజులు ఎంతో వైభవంగా,ఘనంగా ఆడంబరంగా జరపటం చూస్తున్నాము.అలాగే సంపన్నులు,రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎంతోడబ్బు ఖర్చు చేస్తున్నారు.పిల్లల పుట్టిన రోజులు మరింత వేడుకగా చేస్తుంటారు. పుట్టిన తరువాత మొదటి,రెండు సంవత్సరాలు పర్లేదు కానీ తరువాత నిరాడంబరంగా జరుపుకుంటే బాగుంటుందేమో!

          ఇక పోతే పుట్టిన రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు.వాటి అమలులో విఫలం అవుతుంటారు.ఇది అంతా మామూలే!కానీ ఆ రోజు మొక్కలు నాటితే ఎలా ఉంటుంది,కానీ ఎక్కడ నాటాలి ? నాటగానే సరిపోదు వాటిని సంరక్షించాలి, పెంచాలి. అప్పుడే కదా ఫలితం.నేను పనిచేసే చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల లో పిల్లలందరికీ వారి పుట్టిన రోజు నాడు మొక్కలు నాటమని చెప్పాము. వారి పుట్టినరోజు లు ఒక నోట్స్ లో వ్రాసుకొని ముందుగానే వారికి గుర్తు చేసి వారి పుట్టినరోజు మొక్కలు తెచ్చేలా ఏర్పాటు చేసి మొక్కలను ప్రార్ధనా సమావేశంలో ప్రధానోపాధ్యాయులకు ఇస్తూ పిల్లలకు photos తీయడం,పిల్లలందరితో జన్మదిన శుభాకాంక్షలు చెప్పించడం మొక్కలు నాటేటప్పుడు వారి తరగతి మిత్రులతో శుభాకాంక్షలు చెప్పిస్తూ photos, వీడియో తీసి వారి తల్లి దండ్రులకు పంపడం చేయడం వలన విద్యార్థులందరు మొక్కలు పాఠశాల కు బహుకరిస్తున్నారు. తరువాత వాటి సంరక్షణ, పెంపకం బాధ్యత లు తరగతుల వారీగా సిమెంట్ తో కట్టిన పెట్టెల్లో విద్యార్థులే చూసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు chacolates, sweets పంచే విధానం అందరు మానుకున్నారు.ఈ కార్యక్రమం HM Y. శ్రీనివాస రావు గారు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సాగుతోంది.

          ఇలా మనం ప్రతి పుట్టిన రోజు ఒక మొక్క నాటినా ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారిమవుతాము.ఓ కల కంటే తప్పు లేదనుకుంటా! ప్రపంచంలో ప్రతి ఏటా ఇలా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినా   ఏటా 800 కోట్ల మొక్కలు నాటవచ్చు.అప్పుడు ఈ భూమి మీద నీటి కరువు ,గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండవేమో!

మీరు కూడా మీ గుర్తుగా ఈ భూమికి  బహుమతిగా ఒక మొక్క నాటుతారు కదూ !భూమికి మనం చూపించాల్సిన కృతజ్ఞత మొక్కలు నాటి పెంచడం కన్నా మరేముంటుంది!........ఒద్దుల రవిశేఖర్

Sunday, 14 January 2024

46. పాటల పూదోట

 శ్రీమణి కలం నుండి జాలువారిన అచ్చ తెనుగు నుడికారం అనురాగ్ కులకర్ణి, రమ్యల మృదు మధుర స్వరాల్లో నింపి పల్లె అందాలను సంగీతం తో తో జత చేసి సినిమా కాన్వాస్ పై పరిచిన ఈ మనోజ్ఞ గీతం శతమానం భవతి చిత్రంలోనిది.మూలాలను, అనుబంధాలను గుర్తు చేసే ఈ సినిమాను ఓ సారి చూడండి.దర్శకుడు వేగేస్న సతీష్ maru(https://youtu.be/e5T1gbGJuAc?si=UWbBj0m4l8ei6wyV)

Thursday, 11 January 2024

45. పాటల పూదోట

 ఘంటాడి కృష్ణ తక్కువ instruments వాడి చక్కని melody పలికించాడు.యాదగిరి చిక్కని తెలుగు పదాలు ఉన్నికృష్ణన్ స్వరంలో కొత్త సొబగులు అద్దుకున్నాయి.పాట వింటున్నంత సేపు మనసు హాయిగా, హృదయం దూది పింజలా తేలిపోతుంటుంది. (https://youtu.be/gVwsAZlHE8M?si=7eTJqJ_rvLasYbmp)

Wednesday, 10 January 2024

నరసింహుడు -ఇప్పటి భారత దేశ నిర్మాత కథ


రచయత :వినయ్ సీతాపతి

అనువాదం :జి.వళ్ళీశ్వర్, టంకశాలఅశోక్,కె.బి గోపాలం 

పుస్తకపరిచయం :ఒద్దుల రవిశేఖర్

భారత దేశానికి స్వాతంత్ర్యo వచ్చిన తరువాత 44 ఏండ్ల వరకు ఒక దశగా తరువాత ఒక దశగా దేశ ఆర్ధిక విధానాన్ని విభజించి చూడాలి. మొదటి దశలో సోషలిస్ట్ దృక్పధంతో సాగిన ఆర్ధిక వ్యవస్థ 1991 నుండి సరళీకరించిన ఆర్ధిక వ్యవస్థగా మార్పు చెందింది. ఈ మార్పుకు కారణం అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు. ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం గురించి సవివరంగా వివరించారిందులో.మొట్ట మొదటి పార్లమెంట్ ఎన్నికల్లోనే నరసింహా రావు రాజకీయ రంగప్రవేశం చేశారు.రాజకీయాలు,పరిపాలన,ఆర్ధిక వ్యవస్థ లు నడిచే తీరు తెన్నులు తెలుసు కోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.అధికారం లో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడం లో ఎదురయ్యే ఆటంకాలను వ్యక్తిగత వ్యవహార శైలితో ఎలా అధిగమించవచ్చో ఇందులో గమనించవచ్చు. నరసింహారావు తీసుకు వచ్చిన సంస్కరణలు భారతదేశ రూపు రేఖలను చాలా వరకు మార్చి వేసాయి.ఆర్ధిక సంస్కరణ వల్ల రహదారులు, విమానయానం,టెలిఫోన్,T. V రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.భారత దేశం కత్తి అంచుపై నడవ వలసి ఉంటుందని ఆయన అంటుండేవారు.ఈ పుస్తకాన్ని రచయిత ఆసక్తికరంగా మలిచారు.ఈ పుస్తకం లో ని కొన్ని అంశాలు

• నరసింహా రావు బహుభాషా కోవిదుడు.10 భాషలు వచ్చు. గ్రంథ రచయిత కూడా.

• • నర్సింహా రావు రచనలు " The insider ", The other half 

• Analysis until paralysis (కొంప మునిగే దాకా మీనమేషాలు లెక్కించడం )

• కొన్ని సందర్భాలలో నోరు తెరిచి తీవ్రంగా స్పందించడం కన్నా నోరు మూసుకుని కూర్చోవటమే అత్యుత్తమ స్పందన

• రాఘవ పాండవీయం.... ఒకే పదాలు ఒక అర్థం లో రామాయణం మరో అర్థం లో భారతం చెబుతాయి.

• ఈయన హయాం లో మానవ వనరుల శాఖ సృష్టి జరిగింది.

• మార్పు ఒక్కటే శాశ్వతం

• సంస్కరణలు క్రమంగా చోటు చేసుకోవాలి. గతం లోని ఉత్తమ లక్షణాలు స్వీకరించి వాటిని మెరుగు పరచాలి.

• మనకు నిర్వచనమనే ఒక గొప్ప సంప్రదాయం ఉంది.దానిని భాష్యకార అంటారు.

• అసమ్మతి అన్నది సంప్రదాయం లో భాగం. ప్రధాన సంస్కృతులను అంతర్గతంగా సంస్కరించటం భారతదేశపు సంప్రదాయం.

• హామ్లెట్ ఆలోచనలు గల నిష్క్రియాపరుడు.క్విక్సోట్ ఆలోచించని విప్లవకారుడు

Sunday, 7 January 2024

యాదగిరి గుట్ట (తెలంగాణ ) సందర్శన

 ఎప్పటినుండో చూడాలి అనుకున్న యాదగిరి గుట్ట ను అభివృద్ధి చేసాక చూడడం ఆనందం కలిగించింది. MGBS(Hyderabad , busstand) 10 గంటల కల్లా చేరు కోగానే కుప్పలు తెప్పలుగా జనం ఉన్నారు. ఎక్కడికి వీరంతా అనుకుని కొందరిని అడిగితే వారంతా గుట్ట కే అని చెప్పారు.3 భాగాలు మహిళలే కనిపించారు.తెలంగాణ లో కొత్త గా వచ్చిన ప్రభుత్వం RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.ticket ధరలు తగ్గించి ఉంటే బాగుండు అని మహిళలే అన్నారు. అత్యవసర ప్రయాణీకులకు సమస్య గా మారింది.6 వ bus అతి కష్టం మీద seat దొరికించుకుని బయలు దేరాం. City దాటేసరికి గంట పట్టింది.65 km ప్రయాణానికి రెండున్నర గంట పట్టింది. దారిలో భువనగిరి కోట కొండపై కనిపించింది. ఆ కొండంతా ఒకటే బండ లాగా ఉంది.ఇహ గుట్ట bus stand దిగాక కొండపైకి వెళ్లే దేవస్థానం ఉచిత bus ఎక్కే సరికి యుద్ధం చేసినంత పని అయింది. కొండ చుట్టూ మొక్కలు, పచ్చిక తో పచ్చగా ఉంది. Bus stand చుట్టూ shoping complex కట్టారు. యాత్రికుల కోసం ఎదురుగా కొండపైన విల్లాస్ కట్టారు. కొండపైకి నూతన రహదారి కోసం flyover గా కట్టారు. Car పైకి వెళ్లాలంటే ₹500 ticket పెట్టారు కొండ పై స్థలాభావం వల్ల.ఒకటే private canteen ఉంది భోజనానికి. Tiffin తిన్నాం.కొండ చుట్టూ కోట లాగా గోడ పునర్ నిర్మించారు. ఉన్న స్థలం లోనే వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు.ఇంకా కొండ క్రింద పూర్తి చేయవలసిన పనులు ఉన్నాయి. Shopping complex లు మొదలు కాలేదు.సెలవు రోజుల్లో కాకుండా వారం మధ్యలో వెళ్లడం మంచిది.

Monday, 1 January 2024

కాలం నుంచి నేర్చుకుందాం


మంచు కరుగుతుంది.... అది ఉష్ణ ధర్మం.కాలం కరుగుతుంది.... అది విశ్వ ధర్మం.కాల చక్రం గిరగిరా తిరుగుతుంది. అసలు కాల భావనను ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి జీవ రాశి తెలుసుకుంది. పక్షులు జంతువులు ప్రకృతికి అనుగుణంగా, కాలానుగుణంగా జీవిస్తుంటాయి. మొదట్లో మనుషులు అలానే జీవించారు.ప్రస్తుతం మనుషులు పకృతికి విరుద్ధంగా కొండొకచో ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నారు.

ఇక విషయానికి వస్తే మరో సంవత్సరం కాల గర్భం లో కలిసిపోయింది. గతం నుండి పాఠాలు నేర్చుకుని వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ కు ప్రణాళికలు రచించాలి.

మరి కాలం నుండి ఏం నేర్చుకోవాలి. కాల గమనం మన ఆలోచనా తీరుపై ఏదయినా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు ఆలోచిద్దాం.కాలం నిత్య నూతనం. మనం మాత్రం వయసు పెరిగే కొద్ది ఎన్నో శారీరక,మానసిక మార్పులకు లోనవుతుంటాం. మన అనుభవాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంటాయి. యువత నూతన అనుభవాల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. పెద్దలు తమ అనుభవాలను వారికి పాఠాలుగా చెప్పాలను కుంటారు. పిల్లలు,విద్యార్థులు, యువత తాము చేసి చూసి తెలుసుకోవాలను కుం టారు. రెండింటి మధ్య సమతుల్యత అవసరం. కాలం నిత్యం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది.పరీక్షలను తట్టుకోవాలి మరెన్నో సవాళ్లు విసురుతుంది. సవాళ్ళను ఎదుర్కోవాలి.వాటిని తట్టుకుని ముందుకు వెళితే అందమైన ఆనందమైన భవిష్యత్ ఉంటుంది. ఎన్నో సాధించాలి అనుకుంటాం,ప్రణాళికలు వేసుకుంటాం. కొంతమంది విజయం సాధిస్తుంటారు.ఎక్కువమంది వైఫల్యం చెందుతుంటారు.గెలుపైనా ఓటమైనా తాత్కాలికం. వాటిని అర్ధం చేసుకుని అందుకనుగుణంగా మన వ్యవహరించాలి. గెలిచామని విర్ర వీగ కూడదు. ఓటమికి క్రుంగి పోకూడదు. ఉదయిస్తూ సూర్యుడు ఉత్తే జాన్నిస్తాడు.సాయంత్రం అస్తమిస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటాడు. తనలోని దశలన్నీ మానవ జీవితం లో ఉంటాయని అన్నింటిని దాటుకుని నాలాగా పూర్ణ బింబంలా జీవించమని, నిండు పున్నమి మీ జీవితాల్లో ప్రసరిస్తుందని జాబిల్లి మనకు నేర్పిస్తుంటాడు. సృష్టి లో ప్రతిదీ చలనం లో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ, సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంటాయి. మనం కూడా విభిన్న ప్రాంతాలను చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆ స్వాదిస్తూ,వైవిధ్యమైన సంస్కృతులను తెలుసుకుంటూ ఉంటే మనసు,హృదయం విశాలం అవుతుంది.ఇలా కాలం మనకెన్నో నేర్పుతుంది. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే..... ఒద్దుల రవిశేఖర్