సత్యం ఒక్కటే దర్శనాలు వేరు
సేకరణ, సంకలనం : ఆర్కే ప్రభు, రవీంద్ర కేలేకర్ అనువాదం: వాడ్రేవు చిన్న వీరభద్రుడు.
ఈ పుస్తకం గాంధీ ఠాగూర్ల మధ్య జరిగిన లేఖల ఆధారంగా వ్రాయబడింది.
ఏ విషయం పైన అయినా చర్చించుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చించుకుంటే ఒక ఏకాభిప్రాయానికి రావచ్చు రాకపోనూవచ్చు అంతమాత్రాన వ్యక్తిగతంగా విభేదించుకోవాల్సిన పనిలేదు
గాంధీ,ఠాగూర్ ల మధ్య కూడా ముఖ్య మైన విషయాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయి. వారి ఆలోచనలలో స్పష్టత ప్రత్యర్థి ఆలోచనలపై అవగాహనలతో సహా విచక్షణా జ్ఞానం సంయమనం పటిష్టంగా ఉండాలి. ఇంగ్లాండ్ యూరప్ అమెరికా దేశాలలో తరచూ ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటూ ఉంటారు.ప్రాచీన భారతదేశంలో ఇలాంటి చర్చ సంస్కృతి మనం గుర్తిస్తాం కానీ ప్రస్తుతం ఇది అంతరించి ప్రవచనాలు ప్రబలుతున్నాయి. వేదాలలో ఉపనిషత్తులలో సత్యాన్వేషణ ఎక్కువ నచికేతుడు -యముడు, గార్గి -యాజ్ఞవల్క్యుడు మధ్య జరిగిన సంవాదాలు ఇందుకు ఉదాహరణలు.
గాంధీ ఠాగూర్ లు భిన్న ధ్రువాలు కానీ వారి ఆత్మ ఒక్కటే ఠాగూర్ చింతనాపరుడైన మానవుడు కవీశ్వరుడు. గాంధీజీ కర్మయోగి మహాత్ముడు. ఇద్దరూ సత్యం కోసం ఒకరితో ఒకరు తీవ్రంగా తల పడ్డప్పటికీ వారి మధ్య వ్యక్తిగత సంబంధాలు కానీ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ సుహృద్భావాలు కానీ ఈషన్మాత్రం చెక్కుచెదరలేదు.వారి లేఖల్లోని కొన్ని విషయాలు ఎవరు వ్రాసారో తెలియజేస్తూ పరిచయం చేస్తున్నాను. వాటి అంతరార్ధం పూర్తిగా తెలుసుకోవాలంటే పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే.
ఠాగూర్
ఎవరైతే మమకారాన్ని ప్రత్యేక అస్తిత్వాన్ని పోగొట్టుకోగలరో వారు అనంతత్వాన్ని అందుకోగలుగుతారు.ఎవరైతే అనంతత్వాన్ని కనుగొంటారో వారు అమృతులవుతారు.ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ తననే దర్శిస్తుందో అతడే మహాత్ముడు.ఎవరు అందరి హృదయాల్లో నిలిచి ఉంటాడో ఎవరి కార్యక్రమాలు అపరిమితాలో ఆ అనంతాత్ముడే మహాత్ముడు. మనుషులు ఆత్మ త్యాగమయ పూర్వకమైన జీవితం జీవించినప్పుడు అనంతత్వాన్ని అందుకుంటారు.
గాంధీజీ విజయ రహస్యం ఆయన ఆధ్యాత్మిక శక్తి లోను నిర్విరామ ఆత్మ బలిదానాలలో ఉంది ఆయన త్యాగమూర్తి ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది ఆయన విముక్తాత్ముడు పసి పిల్లవాడి తరహా నిరాడంబరత్వం ఉంది సత్యం పట్ల ఆయన విధేయత చెక్కుచెదరనిది. మానవాళి పట్ల ఆయన ప్రేమ తీవ్రమైనది రుజువైనది ఇది క్రీస్తు స్వభావం.ప్రాచ్య ప్రపంచపు ఆత్మకు గాంధీ విలువైన ప్రతీక.
అధికారం అన్ని రూపాల్లోనూ అహేతుకంగానే ఉంటుంది. అది శకటాన్ని గుడ్డిగా ఈడ్చుకుపోయే గుర్రం లాంటిది ఆ ప్రయాణంలో నైతిక పార్శ్వం అంటూ ఉంటే అది ఆ గుర్రాన్ని నడిపే మనిషి లోనే ఉంటుంది.కోపాన్ని కోపం లేకుండా చేయించు.చెడుని మంచితో జయించు.తమకు ఓటమి నిశ్చయమని తెలిసి కూడా తమ ఆదర్శాలకు కట్టుబడి ఉండడం లోనే నిజమైన విజయం దాగివుంది. అత్యున్నతమైన ప్రేమ సాహసం నా కందివ్వు మాట్లాడగలిగే చేసి చూపించగలిగే వ్యధ చెందగలిగే,అన్నిటినీ వదులుకోగలిగే సాహసం ఒంటరిగా ఉండగలిగే సాహసం మృత్యుముఖంలో బ్రతుకుపట్ల విశ్వాసం, ఓటమి సమక్షంలో గెలుపు గురించిన నమ్మకం, సౌందర్య దుర్భలత్వంలో దాగిన అమేయశక్తి అవమానా న్ని అంగీకరించగలిగే వేదనలోని హుందాతనం, తనకి అవమానం జరిగినా ప్రతీకారం తీర్చుకోవాలనుకోని హృదయం..... వీటినే నాకివ్వు
ప్రేమ ఒక్కటే ఆధ్యాత్మిక చరమ సత్యం. నిరాకరించే మనః స్థితి సదా విభజనను కోరుకుంటుంది. అంగీకరించే మనఃస్థితి ఏకత్వాన్ని అభిలషిస్తుంది. మానవుడి మనస్సు సత్యాన్ని వివిధ పార్శవాల్లో, వివిధ కోణాల్లో సమీపించే ప్రయత్నమే చేస్తుంది.
తటస్థ వైఖరితో వైజ్ఞానిక సహకారంతో మనం పాశ్చాత్య ప్రపంచాన్ని సమీపిస్తే ఈ మానవ ప్రపంచ యదార్థ పరిస్థితిని అవగాహన చేసుకోగలుగుతాం.కబీర్ నానక్ తాత్కాలిక అవరోధాలను అతిక్రమించి శాశ్వతత్వపు సంపూర్ణ దిగంతాన్ని చూడగలిగిన సమ్యక్ దృష్టి వారిది. సర్వ విషయాల్లోని అంతరంగంలోకి మనం ప్రవేశించడానికి కావలసిన ఆధ్యాత్మిక దృష్టిని ఇవ్వగలిగే మంత్రం భారతీయ మంత్రం శాంతి మంచితనం ఏకత్వాల మంత్రం.
మనిషి అంతఃపూర్వ ప్రపంచంలో లేని సంభావ్యతల్ని సంభవం చేయడం కోసం నడుంబిగించాడు.తన స్వీయ శక్తి సామర్థ్యాలతో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయడమే మానవుడి యదార్ధ కర్తవ్యం మనిషి జీవించేది ప్రధానంగా తన అంతరంగిక ప్రకృతి మీద. సత్యం గుణాత్మకం అది మన ఆత్మ నిర్ధారణ వాక్యం మనిషి తన సంకల్పంతో వివేకంతో తన ప్రేమతో తన కార్యాచరణతో నిర్మించగలిగే దేశమే అతని నిజమైన దేశం అనిపించుకుంటుంది తమ కోపాన్ని యదేచ్చగా వ్యక్తం చేయడం అనేది ఒక రకమైన ఆత్మ దుబారా. మన దేశాన్ని మన స్వీయ సృజనాత్మక సాధ్యంతో నిర్మించాలనే పిలుపు గొప్ప పిలుపు
మన హృదయం ప్రేమ సత్యాన్ని అంగీకరించినట్టే మన మనసు జ్ఞాన సత్యాన్ని అంగీకరిస్తుంది అసత్యం కన్నా అపరిశుద్ధమైంది మరి ఏదీ లేదు.
మానవుడు ఒక మానసరహిత శిలా ప్రతిమ ఈనాడు మన దేశాన్ని పూర్తిగా పీల్చిపిప్పి చేస్తున్న ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే అది విజ్ఞాన శాస్త్రాన్ని వదిలిపెట్టి కేవలం చేతులకు పని చెప్తే సరిపోదు మానవుడి జ్ఞానకాండ ఆగిపోయి అతని కర్మకాండ మాత్రం కొనసాగుతూ ఉండాలను కోవడం కన్నా మించిన గౌరవ విహీన ప్రయాస మరొకటి ఉండబోదు.
విష్ణువు చేతిలో పద్మం చక్రం ఉంటాయి పద్మము పరిపూర్ణతలోని పరమాదర్శం చక్రము నిరంతర చలన ప్రక్రియ.విష్ణుశక్తి పరిపూర్ణతను కోరుకునే నిరంతర క్రియాశక్తి.విజ్ఞాన శాస్త్రం చేస్తున్నది విష్ణు చక్ర మహిమను విస్తరింప చేయడమే
గాంధీ
ఇంగ్లీష్ మీడియం విద్య భారతీయుల్ని అనుకరణ వాదులుగా మార్చింది చదువుకున్న భారతీయుణ్ణి నిర్వీర్యం చేసింది.
దుఃఖం అనే యదార్ధాన్ని ఎత్తిచూపుతూ దాన్ని దూరం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు బుద్ధుడు. బ్రహ్మవిద్యలో ఆనందమనే యదార్థాన్ని ఎత్తిచూపుతూ దాన్ని పొందవలసిందిగా ఉద్బోధిస్తూ ఉంటారు.ఒక విషయాన్ని స్వీకరించడం ఏ విధంగా ఒక ఆదర్శం కాగలదో దాన్ని పరిత్యజించడం కూడా అంతే ఆదర్శం కాగలదు.మనిషికి తన దేహవ్యావృత్తి నుండి విమోచన లేదా దేహం పట్ల దాస్యం అంతరించడమే ఆనందానికి శాశ్వత అనుగ్రహానికి దారి తీస్తుంది అసహజమైన అధార్మికమైన హింస సిద్ధాంతం బదులు తమకు హాని కలిగించని సహజమైన ధార్మికమైన సహాయం నిరాకరణ సిద్ధాంతాన్ని జాతి స్వీకరించింది.
నా భావాలతో వేధించినంత మాత్రాన ఆ విభేదం నాకు అప్రియమెలా అవుతుంది కేవలం అభిప్రాయ భేదమే అసంతోషకారకమైతే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా ఒక్కలానే ఆలోచించరు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదం కటువుగా ఉండకపోవడం.ప్రకృతిలో అద్భుతమైన అనూ హ్య మైన వైవిధ్యం వెనుక ధ్యేయంలో వ్యూహంలో ఆకృతిలో ఒక ఏకత్వాన్ని చూడగలగాలి...... సేకరణ :ఒద్దుల రవిశేఖర్