Sunday 5 April 2020

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey)      ఒక సమీక్ష.   .........   By  ఒద్దుల రవిశేఖర్                                                                            2000  సంవత్సరం లో అనగా 20 సంవత్సరాల క్రితం నంద్యాలలో ఈ పుస్తకం కొని చదివాను.నా మీద బాగా ప్రభావితం చూపిన పుస్తకం ఇది.సత్యవతి గారిచే తెలుగులో అనువదించబడింది.మళ్లీ చదవాలని నిర్ణయించుకుని గత 10 రోజుల్లో పూర్తి చేశాను.కొద్దిగా వివరంగా ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తాను.                                                        తొలి పలుకులో మన పరిష్కారాలెప్పుడూ దేశాకాలాతీతమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి.ఇదే ఈ పుస్తక మూలసారం.                                                             పుస్తకం ఒకటవ భాగం:దృక్పధాలు-సిద్ధాంతాలు,అంతరంగం నుండి బహిరంగానికి,7 అలవాట్లు ఒక అవలోకన.                    ఆలోచనలు ఎట్లా ఏర్పడతాయి,మన దృక్పధాన్ని అవి ఎలా నిర్దేశిస్తాయి అన్న అంశాలపై రచయిత పరిశోధించారు.గత 200 సంవత్సరాలలో వచ్చిన వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని చదివిన రచయిత మొదటి 150 సంవత్సరాలలో వచ్చిన సాహిత్యం నైతికత,నిజాయితీ పునాదిగా వస్తే తరువాతి 50 సంవత్సరాల లో వచ్చింది మన ప్రవర్తన,వైఖరులు,నైపుణ్యాల గురించి చెబుతుంది.                 మన ప్రవర్తన మన స్వభావం దేనినుంచి పుట్టుకొచ్చిందో ఆ మూల దృక్పధాన్ని సరిచేసుకోనంతవరకు మనకు నిజమైన ఫలితాలు దక్కవు అంటాడు రచయిత.దృక్పధాలు సిద్ధాంత కేంద్రకంగా ఉండాలంటారు. ఇందులో చెప్పబడిన 7 అలవాట్లు మన ఇంగితజ్ఞానం లో ,మన అంతరాత్మ లో నిక్షిప్తమై ఉన్నాయని వీటిని గుర్తించి వెలికి తీయడం మన కర్తవ్య మంటారు.                                                                     రెండవభాగం:వ్యక్తిగత విజయం.                                                 మొదటి అలవాటు:క్రియా సంసిద్ధత(Be proactive) ఈ అలవాటును దార్శనికతా సూత్రాల క్రింద మనకు వివరిస్తారు.విక్టర్ ఫ్రాంకెల్ చెప్పిన మానవ స్వభావపు మౌలిక సూత్రం " ప్రేరణకి,స్పందనకీ మధ్య మానవులకు స్పందనను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది" నుండి రచయిత బాగా ప్రభావితమయ్యారు.మనం మార్చగలిగే అంశాల పట్ల దృష్టిపెట్టమని,మార్చలేని వాటిని గురించి పట్టించుకోవడం మానమని చెబుతారు.మన ప్రభావ వృత్తాన్ని పెంచుకోమంటారు.మనకి మనం చేసుకునే వాగ్దానాలకు ఇతరులకు చేసే వాటికి నిబద్ధులై ఉండడమే మన క్రియా సంసిద్ధతకి రుజువు అంటారు.వాగ్దానాలు చేసి నిలుపుకోవడం మనలో నిజాయితీని పెంచుతుంది.                    రెండవ అలవాటు:అంతం ధ్యాసతో ఆరంభం(Begin with the  end in mind)   ఈ అలవాటును వ్యక్తిగత నాయకత్వ సిద్ధాంతాల ఆధారంగా వివరించారు."మీ జీవితాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవన గమనాన్ని ప్రారంభించడం మీలో ఎంతో మార్పు తెస్తుంది".గమ్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహనతో గమనాన్ని ప్రారంభించడం,మనలో గొప్ప మార్పు తెస్తుందంటారు.ఎవరికి వారు వారి జీవిత లక్ష్య ప్రకటనను తయారు చేసుకోమంటారు.                            మూడవ అలవాటు:ముందు విషయాలు ముందు(Put first things first) ఈ అలవాటును వ్యక్తిగత నిర్వహణా సిద్ధాంతాల ఆధారంగా వివరించారు. మనుషులు చేసే పనులు 4 విభాగాలుగా ఉంటాయంటారు.మన ప్రాథమ్యాలను చక్కగా plan చేసుకుని అవి urgent గా మారకుండా ముందుగానే పూర్తి చేయమంటారు.                       3 వ భాగం:సామాజిక విజయం,పరస్పరాధార దృక్పధాలు.            మనపై మనం విజయం సాధించుకోలేకపోతే,ఇతరులపై విజయం సాధించలేము.ఇందులో వ్యక్తులతో మంచి అనుబంధాలను కలిగి ఉండాలంటారు.ఇందుకు ఇతరులను అర్ధం చేసుకోవడం,నిబద్దత,నిజాయితీ కలిగి ఉండడం ముఖ్యం అంటారు.                                                                  నాలుగవ అలవాటు:గెలుపు/గెలుపు ఆలోచన(Think win/win) ఈ అలవాటును పరస్పర నాయకత్వ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఈ దృక్పధానికి 1)నిజాయితీ(integrity)2)పరిణతి (Maturity) 3) పుష్కల మనస్తత్వం (abundance mentality) ఈ 3 లక్షణాలున్నవారు ఎటువంటి నైపుణ్యాలతో పనిలేకుండానే సామజిక విజయం సాధిస్తారు.గెలుపు/గెలుపు ఒప్పందం అనేది ఒక దృక్పధం,సత్యశీలం.సత్సంబంధాల ఫలితం.            అయిదవ అలవాటు:ముందు అర్ధం చేసుకోండి,తరువాత అర్ధం అవండి.                                                                    ఈ అలవాటును సహానుభూతి భావ ప్రసార సిద్ధాంతాల ఆధారంగా వివరించారు.సహానుభూతితో వినడం నేర్చుకోవాలంటారు.అనగా అర్ధం చేసుకునే ఉద్దేశం తో వినడం.చెప్పే వారిని లోతుగా,సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం.తరువాత మీరు వారికి అర్ధం అవుతారు.మన ఆలోచనల్ని స్పష్టంగా,నిర్దిష్టంగా,దార్శనికంగా, సందర్భానుసారంగా చెబితే మనపట్ల విశ్వసనీయత పెరుగుతుంది అంటారు.దాపరికం లేని సంభాషణ వలన సమస్యల్ని మొగ్గలోనే తుంచవచ్చు అంటారు.                          ఆరవ అలవాటు:సమ్మిళిత శక్తి (synergy).                                ఈ అలవాటును సృజనాత్మక సహకార సిద్ధాంతాలు ఆధారంగా వివరిస్తారు.సిద్ధాంత కేంద్రక నాయకత్వం యొక్క సారాంశమే సమ్మిళిత శక్తి అంటారు.ఒక బృందం అంతా కలిసి పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త వాటిని స్వాగతించడమే సమ్మిళిత శక్తి.జీవితం ఎప్పుడూ ద్వందాల నడుమే ఉండదని,మూడవ ప్రత్యామ్నాయం ఉంటుందని తెలుసుకోవాలంటారు.ప్రకృతి అంతా సమ్మిళితమే.                   నాలుగవ భాగం:పునరుద్ధరణ.                                                    ఏడవ అలవాటు:కత్తికి పదును(Sharpen the saw).             ఈ అలవాటును పునరుద్దరణ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఇందులో మన స్వభావం లోని భౌతిక,ఆధ్యాత్మిక,బౌద్ధిక,మానసిక/సామాజిక దిశలను పునరుద్ధరించుకోవాలి.ఈ 4 దశల్లో 6 అలవాట్లను పునరుద్ధరించు కోవచ్చు.రోజూ పై 4 దిశల్లో పునరుద్ధరణకు కృషి చేస్తుంటే 6 అలవాట్లు శక్తివంతం అవుతాయి.ఇదే కత్తికి పదును అనే 7 వ అలవాటు.                                                    మనతో మనం ఏకత్వం సాధించడం,మనకు ప్రేమాస్పదులైన వారితో ఏకత్వం సాధించడం అనేదే అత్యంత ప్రభావ శీ లుర 7 అలవాట్లు ఇచ్చే మధురఫలం అంటారు.                         సత్య సిద్ధాంతాలనేవి ప్రకృతి ధర్మాలు.వీటికి అనుగుణంగా నడిస్తే మన స్వభావం లో దివ్య లక్షణాలు వచ్చి చేరతాయి.మన జన్మ సార్ధకమవుతుందంటారు.                    మనని ఒకరు ఇష్టపడడం కన్నా నమ్మడం మేలు.నమ్మకం,గౌరవం ఉన్నప్పుడు ప్రేమ సహజంగా ఉబికి వస్తుంది.                                                                                   మనం ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల గురించి విని ఉంటాము,చదివి ఉంటాము.కానీ జీవితం లో విజయం సాధించడానికి వేగవంతమైన పరిష్కారాలు లేవని సిద్ధాంతాల ఆధారంగా ఈ 7 అలవాట్లు కలిగి ఉంటే అదే పరిపూర్ణమైన జీవితం అంటారు.ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి 50 లక్షల ప్రతులు అమ్ముడు పోయిన పుస్తకం ఇది.   అందరూ తప్పక చదవండి.





2 comments: