ఒంటరితనం నుండి బయట పడే మార్గాల గురించి చర్చిస్తూ మనం ఏకాంతంలో మన అంతరంగ స్థితిని గమనిస్తూ గడపాలి అనుకున్నాము.మరి ఏకాంతం అంటే ఏమిటి?ఒంటరితనానికి ఏకాంతానికి గల తేడా ఏమిటి?అన్న విషయాలు పరిశీలిద్దాము.తోడు లేక పోవటం,నిర్లక్ష్యం చేయబడటం,దగ్గరివారు వదలి వెయ్యటం,ఎవ్వరు పట్టించుకోక పోవటం,విస్మరించబడటం,అందరితో సంబంధాలు తెగిపోవటం,దగ్గరి వారు మరణించటం ఇలా ఎన్నో రకాల స్థితులలో మనిషికి కలిగే భావమే ఈ ఒంటరితనం.ఒక రకంగా ఇవన్నీ మనిషిని వేదనకు గురిచేసేవే!వాటినుండి బయట పడటానికి ఏకాంతాన్ని కూడా ఒక మార్గంగా ప్రస్తావిం చుకున్నాము.
మరి ఏకాంతం అంటే ఏమిటి?ఎవరితోనూ,దేనితోను కలవని స్థితి .మనం ఈ ప్రపంచం లోకి ఎలా వచ్చాము?ఒక్కరిగానే వచ్చాము కదా!కవల పిల్లల విషయంలో తప్ప.అలాగే మరణంలోకూడా మన కెవ్వరు తోడు రారు కదా!మరి మధ్యలో ఉన్న జీవితమంతా ఏ విధంగా గడుపుతున్నాం.
ఒక్కరయి రావటం....ఒక్కరయి పోవటం నడుమ ఈ నాటకం ,విధి లీల.........
పాటలాగా!చిన్నప్పుడు అమ్మానాన్నలు,బంధువులు,,తరువాత స్నేహితులు ,భార్య ,పిల్లలు ఇరుగు పొరుగు సమాజంలో ఎంతో మంది మన జీవితంలోకి ప్రవేశిస్తారు.ఈ సంబంధాలలో ఎన్నో కష్టాలు,బంధాలు వాటన్నటి నుండి ఏర్పడే ఒంటరితనాన్ని పరిశీలించాం .కాని మనిషి ఈ అన్ని సంబంధాలలో ఉంటూ వాటినుండి కలిగే అన్ని సమస్య లను నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండగలడా!ఉండలేడు.ప్రతి సంబంధం సృష్టించే సుఖాలను,సంతోషాలను ,బాధలను ,కన్నీళ్లను,కష్టాలను,ఈర్ష్యా అసూయలను,కోపం,ద్వేషాలను ఆశలను,కోరికలను దురాశ ,దుఖాలను,భయాలను అన్నింటిని గురించి ఆలోచిస్తూ సంఘర్షణకు గురి అవుతూ మనసు ఒంటరితనానికి లోనవుతూ ఉంటుంది .దీన్నుం డి తప్పించుకోవటానికి రకరకాల పలాయన మార్గాలను మనసు అన్వేషిస్తుంది.ఒంటరితనంలో పుట్టే భయాన్నుండి తప్పించుకోవటానికి ఎన్నుకునే మార్గాలు మరింత బాధకు గురిచేస్తాయి.
మరి వాటినన్నింటిని తప్పించుకోవటం కాకుండా పై పరిస్తితులన్నింటిని అర్థం చేసుకొని అవగాహనతో ఆ పరి స్థితులకు తగ్గట్లు స్పందిస్తూ ఎవరికివారు తమకు సంబంధించిన తమ లోకాన్ని ఒక దానిని సృష్టించుకుంటే ఎలా ఉంటుంది?ఆ స్థితి దేని నుండి పారిపోతే వచ్చేది కాదు.తన పరిస్థితిని తాను అర్థం చేసుకొని మనసును పై అన్ని క్లేశా ల నుండి దూరంగా ఉండే స్థితిని కల్పించు కోవటం,అన్నిరకాల బందాలలోని బాధనుండి ,అన్ని రకాల భయాల నుండి,మన మనసును కట్టడి చేసే రకరకాల ప్రతిబంధకాలనుండి స్వేచ్చను కల్పించే ఆ స్థితిని మనకు మనం సృష్టించుకుంటే ఎలా ఉంటుంది.అంటే మనతో మనం గడపటంతో ఇది సాధ్యమవుతుంది.
ఎప్పుడూ ఎవరో ఒకరితో మాటలాడుతూ,లోకాభిరామాయణం ముచ్చటిస్తూ ,మన కష్టాలు బాధలు,సంతో షాలు పంచుకునే వాళ్ళుఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే బదులు మన మొత్తం మనసులో జరిగే ప్రక్రియల ను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మన మనసులోకి ఓ ఏకాంత సౌందర్యం ప్రవేశిస్తుంది.అది ఒంటరి తనం లాంటి ది కాదు.ఊహ తెలిసినప్పటినుండి మరణించే వరకు మనకు తోడు ఎవరుంటారు.మన మనసే కదా ఉండేది! దానిని ఎప్పుడు ఎవరో ఒకరి ఆలోచనలతో నింపే బదులు దానిని మనతోనే ఉండనిస్తే! ఆ ఉండటంలో ఓ ప్రశాంత చిత్తం ఏర్ప డుతుంది మనల్ని గురించి మనం సంపూర్ణంగా ఆవగాహన చేసుకున్న స్థితి.మనలో ఉన్న బలాలు,బలహీనతలు మనలోని వక్రత,సక్రమత మన లోపాలు అన్నీ అర్థం అయిన స్థితి.
ఆ స్థితిని మనకు మనం కల్పించుకుంటే ,అంత సమయాన్ని మనకు మనం ఇవ్వగలిగితే మన మనసు అద్భు తాలు సృష్టించదా !అందులోంచి ఉల్లాసం ఆహ్లాదం ఉద్భవిస్తాయి.ఏ బంధానికి చిక్కుకోని స్థితి,ఎవరిపై ఆధార పడనీ స్థితి,ఓ స్వేచ్చా ప్రపంచం,మనదైన లోకం.చిన్నప్పటి మనలోని అమాయకత్వం స్వచ్చత ,సున్నితత్వం మనసులో ఉద్భవించి మన కళ్ళల్లోకి ప్రవహిస్తుంది.అప్పుడు ఆ ఏకాంత సరోవరంలో పూసే ఆనంద కలువల పరిమళం మది నిండా ఆవరించటం మన అనుభవంలోకి వస్తుంది.ఏటిగట్ల వెంట ఉదయపు వ్యాహ్యాళి,సాయంత్రపు నడకలు,పార్కు ల్లో మనం ఏకాంతంగా గడపటం,కాలువ గట్ల వెంట పంట పొలాలలో,నదుల ఒడ్డున ఎవరికీ వీలయినచోట వారు ఈ ఏకాంతాన్ని సృష్టిం చుకుంటే,అన్నింటికీ మించి మన ఇంటిలోనే మనం కల్పించుకునే ఈ ఏకాంతం మనలో మానసిక పరివర్తనకు దారి తీస్తుంది.ఆ పరివర్తనలోనే ఓ దివ్యానందం ఉద్భవిస్తుంది.