( మార్చ్ నెలలో స్నేహం(1),స్నేహం ఓ ఆహ్లాదం (2)తరువాత స్నేహం పై వ్యాసాలలో ఇది మూడవది.)
స్నేహం చేసుకుందామని ఎవరూ ప్రయాణం మొదలెట్టరనుకుంటా ! ఎందుకో రెండు హృదయాలు ట్యూన్ అవుతాయి.ఇద్దరు మగ అయినా ఇద్దరు ఆడ అయినా ,ఒక మగ ఒక ఆడ అయినా స్నేహితులు కావచ్చు చిన్నపిల్లలు కూడా ఒకరిద్దరితో స్నేహం చేస్తారు.వారితోనే ఎక్కువ మాట్లాడటం,వారి ఇళ్ళకు వెళ్ళటం వారితో ఎక్కువగా ఆడటం పరస్పర అభిప్రాయాల్ని పంచుకోవటం ఇలా స్కూల్ స్థాయి నుండి కాలేజీ వరకు తరువాత జీవి తంలోను స్నేహం ఓ భాగమయి పోతుంది.
అసలు స్నేహం చేయటం ఎందుకు?స్నేహానికి జీవితం లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి.జీవితం చివరి వరకు అవ సరమా!అవసరాలతో స్నేహాన్ని కోలుస్తామా!ఆస్తులు,అంతస్తులను స్నేహం చూస్తుందా!అలా చూస్తే అది స్నేహం అవుతుందా!అంతస్తులను చూసి స్నేహితులుగా వుంటే దాన్లో ప్రయోజనాలను ఆశిస్తారు కదా!ప్రయోజనాన్ని ఆశిం చేది స్నేహం ఎలా అవుతుంది?
ప్రాథమిక స్థాయి నుండి 10 వ తరగతి వరకు కనుక కలిసి చదువుకుంటే ఆ స్నేహం జీవితంలోగట్టి పడి చివరి దాకా ఉంటుందేమో!స్నేహంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక.చిన్ననాటి స్నేహితులు ఆ ముచ్చట్లు ఇచ్చిన త్రిల్ మరేదీ ఇవ్వదేమో!చిన్నప్పుడు ఆడిన ఆటలు,చేసిన అల్లరి పెద్దయిన తర్వాత గుర్తు చేసుకుంటే ఆ తన్మయ త్వం ఆ ఆనందం వర్ణించనలవికాదు.
కాలేజీ నుండి ఉద్యోగం వచ్చే వరకు మిత్రులు ఓ రకం.పరిపక్వత కలిగిన స్నేహం.ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం,సాంత్వన పొందటం,పరస్పరం సహాయం చేసుకోవటం జరుగుతుంది.ఒక రకంగా కుటుంబం లోని వారికంటే ఎక్కువ స్నేహంగా ఉంటారు.ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది.అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్లకి అమ్మనాన్నలకి చెప్పుకోలేని సంగతులన్నీమిత్రులతోనే కదా పంచుకునేది.జీవితంలో 25 సం :వరకు అంటే పెళ్ళ య్యే వరకు స్నేహమొక ఆపాత మధురం.ఓ సజీవ స్రవంతి.ఓ భావ ప్రకంపనా ప్రపంచం.తరువాత జీవితంలో మన ఉద్యోగం లో మంచి స్నేహితులు తారస పడతారు .పరస్పర అవగాహ నతో కుటుంబ స్నేహితులు గా మారతారు ఇలా జీవన పయనం లో స్నేహం ప్రాధాన్యత ఎంత ఉందో!