Monday, 25 June 2012

త్రిశంకు నరకం


                                                           
   నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి  పిలుస్తుంటే
   మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే
   లేత పాదాలు అటువైపే దారితీస్తుంటే
   ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ని 
   అగ్నిపర్వతం క్రేటర్లో మునగపోతున్నట్లు
   తుఫాన్ కన్నులో కాలు మోపబోతున్నట్లు 
   కాళ్ళ క్రింద భూమి చీలబోతున్నట్లు 
   ఏ సంకేతాలు వాడికి అందలేదు 
   ఆటలోని ఆనందం 
   కుతూహలం లోని ఉత్సాహం 
   వాడిని మరణం అంచుల్లోకి 
   వెళ్ళకుండా ఆపలేదు 
   అన్వేషణ అంతమయ్యే లోపు 
   వాడు త్రిశంకు నరకం లోకి 
   జారుతున్నాడు 
   కన్నులు పొడుచుకున్నా  
   కానరాని గాడాంధకారం  
   ఒళ్లంతా చీరుకుపోయి కారుతున్న రక్తం  
   ఏదో బండరాయి వాని చావుకు అడ్డుపడింది 
   అప్పుడు మొదలయ్యింది ప్రత్యక్ష నరకం 
   ఉచ్చ్వాస,నిశ్వాసలు భారంగా మారుతూ 
   కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ 
   గొంతు నిండా మట్టితో ఉక్కిరిబిక్కిరవుతూ 
   క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే 
   సమాంతర బోరుకు సన్నాహాలు 
   ఆక్సిజన్ గొట్టాల జారవేత 
   గంటలతరబడి వేలమంది కన్నీటి ధారలతో 
   గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో 
   మార్మోగుతున్న ఆ ప్రాంతంలో 
   ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం 
   బయటకు తీసిన వాడి శరీరంలో 
   కొన ఊపిరయినా ఉందేమోననే ఆశ 
   నిరాశగా మారిన ఆ క్షణం 
   దిక్కులు పిక్కటిల్లేలా శోకం 
   ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో 
   రక్కసిలా నోరు తెరిచిన ఈ బోరు బావుల్లో 
   యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు 
   చిన్నారుల చిరునవ్వుల కోసం                                                                                                                                                               

19 comments:

  1. she died yesterday, nijame vaatini poodchadaniki mana vanthu krushi cheyali.
    good one, keep writing.

    ReplyDelete
    Replies
    1. ఎన్నిసార్లు ఇలా జరిగినా ప్రజల్లో పాలకుల్లో మార్పు రావటం లేదు.thank you.

      Delete
  2. మొదటి తప్పు ఆ చిన్నారిని కన్న తల్లిదండ్రులది.
    చిన్న పిల్లలు ఎక్కడికి పోతున్నారో కూడా చూడలేని వాళ్ళు పిల్లలని కనడం ఎందుకు?

    ఇక మీడియా హడావిడి చూస్తే "పీప్లీ లైవ్" సినిమా గుర్తొచ్చింది.
    ఈ లైవ్ షో మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. జనం చూస్తూనే ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. అయ్యో...మన దేశంలో ప్రాణానికి వున్న విలువ ఎప్పటికి తెలుస్తుందో..

      Delete
    2. బోనగిరి గారికి, మీరన్నట్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందులో భాగమే!మీ స్పందనకు ధన్యవాదాలు.
      జ్యోతిర్మయి గారికి ప్రాణాలు అవలీలగా పోయే దేశాల్లో మనదేశం చాలా ముందుంది.మీకు కూడా ధన్యవాదాలు.

      Delete
  3. పూడ్చివేస్తే నీళ్ళులేక మరెన్నో గొంతులు పూడిపోతాయేమో...

    బోరు డయామీటర్ ఏడాది పిల్లల ఆవరేజ్ డయా కన్నా తక్కువ వుండేలా(<8") నిషేదించాలి. అతిక్రమించిన బోరు కంపెనీలపై 10లక్షల ఫైన్ వేయాలి. వాడని బోర్లపై మూతలు వుంచకపోతే 5లక్షలు ఫైన్, 3నెలలు జైలు శిక్ష లేదా రెండూ.

    ఇగపోతే ... మీ కవితావేశం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ సలహాలు చాలా బాగున్నాయి .మీకు ధన్యవాదాలు.

      Delete
  4. బోర్ వెల్ పై మూతలు లేకపోవడమే ఈ అనర్థాలకి కారణం...
    ఆ మూతలు తీసి అమ్ముకుంటారు...
    ఇక్కడ కూడా (మధ్య ప్రదేశ్)చూస్తుంటాం ఇలాంటి ఘటనలు...
    ఫెయిల్ అయిన బోర్లని పూర్తిగా మూసేయాలి....
    మీ స్పందన ,ఆవేదన సరైనవే...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. బోర్లు తవ్వటానికి ఎన్నో నిబందనలు చట్టాలు వున్నాయి.అమలుజరిపే వారు లేరు,పాటించేవారు లేరు.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  5. ప్రాణం చాల విలువయినది .మీ కవిత లో ఆవేశం,ఆవేదన చాల చక్క గా ఆవిష్కరించారు రవిశేఖర్ గారు..

    --
    సీత..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సీత గారూ!విలువైన ప్రాణాలు నిర్లక్ష్యానికి బలవుతున్నాయని ఆవేదన!

      Delete
  6. బాబోయ్....మనసు ఏదోలా అయిపోతుంది అండి.. ఎంతటి నరకమో కదా అది...
    బాగా ఆవిష్కరించారు..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాయి గారూ! t.v లో ఆ దృశ్యాలు చూస్తుంటే నిర్లక్ష్యానికి ప్రాణాలు ఎలా బలవుతున్నాయో అర్థమవుతుంది.

      Delete
  7. కొందరి నిర్లక్ష్యాలకి.. చిన్నారుల ప్రాణాలు బలి.. చాలా విచారకరం.
    మీ కవితలో ఆణువణువూ.. ఆక్రోశం,ఆవేదనే..కదలాడింది. :( :(

    ReplyDelete
    Replies
    1. ఇదే కాదు! షిర్డీ వెళ్ళే బస్సు ప్రమాదం ఎంత ఘోరం.కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమే దానికి కారణం .మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  8. ముందు కవిత అర్ధం కాలేదు. కామెంట్స్ చూసాక అర్ధం అయ్యింది.
    ప్రాణానికి విలువ లెదు ఇండియా లో అని జ్యోతి గారన్నది నూటికి నూరు పాళ్ళు నిజం!
    మీ కవిత ఆ బాలిక వేదన కళ్ళకి కట్టినట్టు చూపించింది. కంట నీరు తెప్పించ్చింది.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి ఘోరాలు ఎన్నో!మనమెంత జాగ్రత్తగా వున్నా రోడ్ మీద వచ్చే వాహనాల అతివేగం తో సాయంత్రం ఇంటికి చేరతామో లేదో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.మీది స్పందనామయ హృదయం.మీకు ధన్యవాదాలు.

      Delete
  9. అన్నట్టు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను.
    టైటిల్ అద్భుతంగా పెట్టారు.

    ఆ చిన్నారి పరిస్థితిని "త్రిశంకు నరకం" అనే ఒక్క మాటతోనే సూటిగా వర్ణించవచ్చు.

    ReplyDelete