Monday, 4 June 2012

ప్రకృతికే సరికొత్త భాష్యాన్నిద్దాం


నీలి  సంగీతాన్ని  పరచుకొని ఆకాశం
శశి కోసం ఎదురుచూస్తున్నట్లు
నీరెండ చాయలో నిలబడి నీకోసం
నాలో నేనే పల్లవి పలికిస్తుంటా
సంధ్య యాత్రను ముగించుకొని తన ఒడిలో
ఒదిగే దినకరుని కోసం చూసే పర్వతాల్లాగా
నింగిని రంగులతో అద్ది ముగ్గులతో ముద్దిడి
ఇంద్ర ధనుస్సు తో అలంకరించి వేచి చూస్తుంటా
మల్లెలు మత్తుగా పిలుస్తున్నాయి మరి
జాబిలి ఎందుకో ఈ రోజు రెచ్చగొడుతుంది
భావ విహంగాలు నా నుండి నీకు చేరటం లేదా
నా గాన మకరందాన్ని నింపుకొని గాలిలో
అలలై తేలి నా విరహాన్ని వినిపించటంలేదా
పూల పల్లకిని సిద్ధం చేసి పండు వెన్నెలను రంగరించి
మంచు ముత్యాల తోరణాలు కట్టి
తెల్ల మబ్బుల అల్లరి చిత్రాల కాన్వాసులను
నీవు వచ్చేదారుల్లో స్వాగతానికి పెట్టా
మాటలు రాని చుక్కలకు పలుకులను
పాటలు రాని ఉరుములకు గీతాలు నేర్పించా
దారంతా పున్నమి కాంతులు వున్నా నీకోసం
మెరుపుల చమక్కులను సిద్ధం చేసా
ఏంటో నా పిచ్చిగానీ నీకివన్నీ ఇచ్చే తృప్తి  కంటే
నా సాంగత్యం లోనే నీ హృదయ సరస్సులో
ప్రేమ పుష్పాలు విరుస్తుంటాయి
కానీ ఎందుకో నీ కోసం ఈ ఆకాశపు చిత్రాలన్నీ
భువి పైకి తెచ్చి నీ కందించాలనిపిస్తుంటుంది
నీవు నాదరికొస్తే మనం  ఈ
ప్రకృతికే సరికొత్త   భాష్యాన్నిద్దాం  

8 comments:

  1. చాలా బాగుంది ......సూపర్...!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ!సీత గారు మీ ప్రశంసకు.

      Delete
  2. మీ బాగ్ ఈ రోజు చాలా సేపు ఓపెన్ అవ్వలేదు. ఆ కామెంట్ కూడా పెట్టాను నా బ్లాగ్ లో.
    కవిత విషయానికి వస్తే, ఎలా స్పందించాలో కూడా తెలీదు నాకు. Simply superb!
    చాలా బాగుందండి,"ఓ విరిచూపు" కవిత చదివినప్పుడు, ఎంత నచ్చిందో ఇది అంతకంటే నచ్చేసింది.

    ReplyDelete
    Replies
    1. అలాగా!గూగుల్ verification కోడ్ అడిగారు.ఇప్పుడు సమస్య లేదు.ఈ కవిత లో అంతా ప్రేయసి ఆగమనం కోసం ప్రియుడు ఎన్ని రకాలుగా ఆమెను మెప్పించాలో ప్రక్రుతి పరం గా చెబితే ఎలా ఉంటుందో అనుకొని వ్రాసింది.మీకు అంతలా నచ్చినందుకు చాలా thanks.

      Delete
  3. చాలా చాలా బాగుంది రవిశేఖర్ గారు........!
    సూపర్..:)
    లేట్ గా చుసా...:(

    ReplyDelete
    Replies
    1. మీరు ఇంతకు ముందు వ్యాఖ్య వ్రాసారు.అయినా మరల చదివినా మీకు మరింత బాగా నచ్చినందుకు మీకు మరిన్ని ధన్యవాదాలు.

      Delete