(Free translation for an American poem by Ravi sekhar Oddula). అసాధారణ జీవితం కోసం శ్రమపడమని మీ పిల్లలకు చెప్పకండి. ఆ ప్రయత్నం చూడటానికి ఆరాధనీయంగా ఉండవచ్చు కానీ అది మూర్ఖత్వానికి దారి. వారికి సాధారణ జీవితం లోని అద్భుతాలను,ఆశ్చర్యకరమైన అనుభవాలను పరిచయం చేయండి. టమాటా,జామ,రేగు వంటి పండ్లరుచులను ఆస్వాదించనీయండి పెంపుడు జంతువులు ,మనుషులు చనిపోతే ఎలా స్పందించాలో(ఏడ్వాలో) చూపండి. చేతి స్పర్శలో వచ్చే అనంతమైన సంతోషాన్ని వారికి చెప్పండి. సాధారణంగా వారిని జీవించనియ్యండి. అసాధారణమైనది తన పని తాను చూసుకుంటుంది...........స్వేచ్చానువాదం ఒద్దుల రవిశేఖర్.(కవి పేరు దొరకలేదు.వారికి ధన్యవాదాలు)
Wednesday, 1 July 2020
Friday, 29 May 2020
భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం.
భూమిపై ఆరో వినాశనాన్ని ఆపేద్దాం. భూమిపై జీవ వైవిధ్యాన్ని ,సమృద్ధిని కాపాడటానికి A Global deal for nature(GDN) అనే science policy ని 19 మంది అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించారు.రానున్న ఆరోవినాశ నాన్ని తప్పించేందుకు 7 లక్షలకోట్లు అవసరమవుతాయి అని ఈ విధానం చెబుతుంది.2015 పారిస్ ఒప్పందం తర్వాత,భూవినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో రెండో అతిపెద్ద నిర్ణయం ఇదే.ఇది భావితరాలకు మనం ఇవ్వబోయే ఆటగిపెద్ద బహుమతి ఈ విధానం.
Wednesday, 20 May 2020
సాయి అభయారణ్యం
http://www.saisanctuary.com/ SAI(SAVING ANIMALS INITIATIVE) ఇండియాలో మొట్టమొదటి Private wildlife sanctuary. మనం మొక్కలు నాటితే సంతోషపడతాం,అవి పెరిగి పెద్దయి చెట్లయితే మరింత ఆనందిస్తాం.మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి.కానీ అమెరికాలో స్థిరపడ్డ అనిల్.కె.మల్హోత్రావి ఆలోచనలు ఏకంగా ఓ అభయారణ్యాన్ని సృష్టించేలా చేశాయి.1986 లో ఇండియా వచ్చాక కర్ణాటకలోని కొడగు జిల్లాలో 300 ఎకరాలు భూమి కొన్నారు.ఆయన భార్య పమేలా,పర్యావరణ ప్రేమికురాలు తారాచందర్ మరికొంతమంది ఆయనకు సహకరించారు.అందులో 700 సం క్రితం చెట్టు ఓ ప్రత్యేకం.300 రకాల పక్షులు,పునుగు పిల్లులు,పులులు,ఏనుగులు జింకలు ఇలా వందలాది జీవరాసులున్నాయి.ఇందులో రెండు cottages నిర్మించి యాత్రికులను ఆహ్వానిస్తున్నారు.వాటిద్వారా వచ్చే డబ్బుతో ఆ అరణ్యాన్ని నిర్వహిస్తున్నారు.మనం ఓ సారి వెళ్లి చూసొద్దామా!ప్రసిద్ద కంపెనీలు CSR (Corporate social responsibility)క్రింద ఇటువంటి అరణ్యాలను సృష్టించవచ్చు.
Tuesday, 19 May 2020
నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ
ఆధునిక ఇతిహాసం,నాదేశం నా ప్రజలు(My country-My people రచన:గుంటూరు శేషేంద్ర శర్మ )పై ఒక విశ్లేషణ :ఒద్దుల రవిశేఖర్ *కవి వ్యక్తీకరణ సమాజం గురించి అందులోని సమస్యలకు తన ప్రతిస్పందన.ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్లమంది కోసం,భారత దేశం లోని 50 కోట్లమంది(రచనాకాలం జనాభా)కోసం గొంతెత్తుతాను అంటూనే ఈ దేశమే కాదు మానవ జాతి అంతా ఇదే వేదన పడుతుందని విశ్వవేదనను తన కలం ద్వారా పలికించాడు. తన పలికే నా దేశపు నాలికపై పలుకుతుందని ప్రకటించాడు. *ఇతిహాస నిర్మాణానికి తన అనుభవం,పాండిత్యం అంతా ధారబోసి రచించానని ప్రకటిస్తూ నా రక్తమే ఈ ఇతిహాసం అనడంలో తనలో పగిలిన బడబానలమేఈ రచన అంటూ విశ్వమానవుడయ్యారు."అనుభవ జ్ఞాన నేత్రద్వంద్వం" అనే పదప్రయోగం అద్భుతం.అనుభవం,జ్ఞానం అనే రెండు నేత్రాలతో మానవచరిత్రను పిండినట్లు తెలియజేసారు.అందుకే ఎంతో స్థిరంగా ఇది ఈ శతాబ్దపు పాటగా ధైర్యంగా ప్రకటించుకున్నారు. *తన అనుభూతికోసం ప్రతితరం కవులు ఒక భాషను సృష్టించుకుంటారు.ఈ కాలపు మనిషిని అవిష్కరించడాానికి నేను ఒకభాషను,ఒక లోకాన్ని సృష్టించానని ,ఎందుకంటే మనిషి లాగా,ఎవరికీ తలవంచని స్వతంత్రమానవుడు ఈ కాలం మనిషి కనుక. ఇప్పటి మనిషి గతం లోని వ్యవస్థను విధ్వంసం చేయడమే లక్ష్యంగా నమ్ముతాడు కాబట్టి.కనుక తన రచన ఇప్పటి మనిషి ఆశల్ని,ఆశయాల్ని, తిరుగుబాటును ప్రతిబింబిస్తుందని చెబుతారు. *కర్షకుని ఇతివృత్తమే ఈ కావ్యం.ఈ ఇతిహాసం లో అంతా కర్షకుని శ్రమే కనపడుతుంది .ప్రపంచ సాహిత్యాన్ని విస్తారంగా చదివిన అనుభవం ఆయన ఇచ్చిన విభిన్నభాషల్లోని పుస్తకాల ఉదాహరణనుబట్టి మనకర్ధమవుతుంది. ఒకటో సర్గ. కర్షకుని,కార్మికుని హస్తం ఎన్ని పనులు చేస్తుందో వర్ణిస్తూ "మానవ జీవిత పొలాల్ని దున్నుతా"అన్న ఒక్క వాక్యం తో వివరిస్తారు.కానీ రైతుకు ఏమీ దక్కలేదని నిర్వేదం చెందుతాడు.ప్రపంచంలో అన్ని మార్పులు తన చేతి గుండా జరుగుతున్నా తన జీవితం ఏమీ మారలేదని ఆవేదన తో తనలో రగిలే ఎర్రకోరికనే ఒక జెండాగా ప్రకటిస్తారు.తన అంతరంగ ఆవేదనను తిరుగుబాటుగా మార్చి పలుకుతున్న ఈ భావాలు చూడండి."తుఫానులు లెక్కజేయని నాకు ఈ క్షుద్బాధ ఒక లెక్కా!మిలియన్ల సుత్తులు, కొడవళ్లు సూర్యకిరణాల్లో ప్రతిఫలిస్తున్నాయి.".సముద్రపు అశాంతిని,ం
ఝoఝామారుతపు ఆవేశాన్ని తనలో పలికిస్తున్నాడు. *కాలమనే కాగితంపై ఒక స్వప్నం రాసి తన ఊపిరితో సంతకం చేస్తా అంటూ భవిష్యత్ తరానికి ఒక సందేశం అందిస్తారు.తన కోరిక మనిషిలో అశాంతిని రేకెత్తించి ఉద్రిక్త రక్తం లా ప్రాకుతుంది అంటారు.తన పద్యాలను పొందే అర్హత భూగోళo మీద అన్ని జాతులకూ ఉంటుందంటారు.పైన తెలిపిన ధిక్కార ధోరణి ఏమయినా రుచించక నోబుల్ బహుమతి నిరాకరించారేమో అనిపిస్తుంది.అంతలోనే వసంతాన్ని వర్ణిస్తూ మనల్ని హాయిగా పలుకరిస్తారు. *అడవుల్ని కప్పుకొని, నదుల్ని తలపాగాలాగా చుట్టుకోవడం,రస్తాలను ఉత్తరీయాలుగా వేసుకోవడం లాంటి ప్రయోగాలతో ప్రకృతే తానై పోయాడు.తన దేశపు పర్వతాలను ఇతిహాసాలుగా మలచ దలుచుకున్నా అని ప్రకటిస్తూ తన మార్గం చెప్పకునే చెప్పారు. రెండోసర్గ: తనను ఒక తుఫానుగా పరిచయం చేసుకుంటాడు. తన జాతి కెరటంలా ఆకాశం మీదికి దుముకుతుంది అని ధిక్కరిస్తారు. నగరాలు ఏర్పడకముందు,నదుల్ని దాటి ఇతర దేశాలకు ఎలా ప్రయాణమయ్యింది వర్ణిస్తూ భూమిని వాక్యంలా,నీలి సముద్రాలు,కామాలు,సెమీకొలన్లుగా పరిగణిస్తాడు. సముద్రాలు,భూమి ప్రేమ లేఖలు వ్రాసుకునే నీలిసిరిగిన్నెలుగా అభివర్ణిస్తూ అందులోని సిరాలోనుంచి గాలులు మోసుకొచ్చే అక్షరాలే సామ్రాజ్యాలు,నాగరికతలు,విజ్ఞానం అని ఓ మనోహరమైన పోలికను ప్రతిపాదించారు. మూడో సర్గ హైదరాబాద్ మహానగరంగా మారాక ఎంత కాలుష్యకారకంగా మారిందో ఇందులో వర్ణిస్తారు.చెట్లు తనకేసి చూస్తూ మాకు కవిత్వాలు వద్దు,వెయ్యి ప్రళయాలు దట్టించిన ఒక బాంబు ఇవ్వమని అడుగుతాయని చెప్పడం ద్వారా చెట్లెంత విషాదంలో ఉన్నాయో కాలుష్యాన్ని పీల్చలేక అనిపిస్తుంది.పూలెందుకు పూస్తాయి ఇవి,బుల్లెట్లు పూయక అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు.మిలియన్ల కొద్దీ మనుషుల గొంతుల్ని కాలం నొక్కివేస్తుంది ఈ నగరం లో,కానీ నీలగిరి కొండల్లో చెట్లు,పర్వతాల నడుమ చిక్కి చూస్తుంది కాలం అనే పోలికతో కవిత్వం లో కొత్త పోకడలు పోతారు." ఇక్కడ మనిషి సంతోషపు ఇంద్రజాలం లో శబ్దమై,పాటై, పక్షుల పర్వతాల శరీరాల్లో ప్రవహిస్తాడు.కాలం చేతి వేళ్ళ లోంచి కారిపోతాడు మనిషి."ఈ వాక్యాల్లో మనిషి పొందే ఆనందపు అంచుల్ని పట్టి మనముందుంచుతారు.ఇక్కడ పక్షులు, కీటకాలు అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాయి.ఇక్కడ మనిషి బుద్ది,అహంకారాలకు అధికారం లేదు.అందుకే కాలాన్ని నగరాలనుండి, కొండల్లోకి ఈడ్చుకువచ్చి సంహరించాను అని చెప్పడం ద్వారా తను ఎంత ప్రకృతి ప్రేమికుడో,అందులో ఎంత లీనమయ్యారో,ఎంత ఆనందం అనుభవించారో మన కర్ధమవుతుంది.విత్తనమై,చెట్టయి, పువ్వై వాటి మార్పుల్ని ,.పక్షినై,చేపనై మారి వాటి స్వేచ్ఛను తాననుభవిస్తారు. పండు ఒట్టి సన్యాసి! సత్యదర్శనం కోసం తపస్సులో మునిగి పోయిన ఋషి ,ఎప్పుడయితే అది లభిస్తుందో అప్పుడు రాలిపోతుంది.అంతవరకు పండు ధ్యానం చేస్తున్న ఋషి అంటారు.ఈ ఒక్క పోలికతో ఆయన కవితా సౌందర్యం తాత్వికసీమల వైపు పయనిస్తోంది.రాలే పండు అనుకుంటుందట-చెట్టు గింజ తన కడుపులో ఉందని,చెట్టు నేను,ఒకటేనని ఎంత తాత్వికతను పండించారో ఇక్కడ! ఈ ధరిత్రి ఒక సృష్టి ప్రదర్శనశాల.పశువులు,పక్షులు,వృక్షాలు,మనుషులు అందరూ మట్టిలోకి అస్తమిస్తారు.కాలం అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది.,నిర్దాక్షిణ్యంగా.ఈ నాగరికతలను నిర్మించటానికి చెమట ఒక శాశ్విత అంతర్వాహినిిలా ప్రవహిస్తూ ఉంటుందని హెప్పడా ద్వారా శ్రామికుని పాత్రను ఆవిష్కరిస్తారు. ఈ ప్రదర్శనశాల ఎన్నో నాగరికతలు,ప్రభుత్వాలు వచ్చిపోతుంటాయి.అన్ని నశించిపోతుంటాయి.కానీ మనిషి బౌద్ధికశక్తి మరో మార్పుకు బీజం వేసుకుంటుంది. నాలుగో సర్గ. ఇందులో మళ్లీ తన కవిత్వాన్ని కదనాశ్వo లా దూకిస్తారు.ఎరుపు,రక్తం వంటి మాటలతో ధిక్కారం తన అజెండాగా ప్రకటిస్తారు.నేను పోయినా నా కవిత్వం,నా జ్ఞాపకాలు ఈ దేశపు గాలిలో పక్షులై పాడుతుంటాయి,అని తన కవిత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తారు.చెట్లను,ఆకులుకాదు తుపాకులు కాయమని అడుగుతున్నాడు.అంతలోనే నిర్వేదం లో మునిగిపోతాడు. ఇప్పటివరకు ప్రకటించిన తిరుగుబాటు మాయమై తను ఓడిపోతున్న జీవినని,నేలమీద నడుస్తున్న బాటసారినని, ధ్యానంచేసుకోవాలనుందని ,తన ఏకాంతానికి భంగం కలిగించని దేవుడు లేని దేవాలయానికి పారిపోవాలని ఉందని తన నిస్సహాయతను వ్యక్తపరుస్తారు.ఈ ధ్యానంలోనుండే చివరకు దేవుడినయ్యాను అని చెప్పుకుంటారు.సూర్యోదయం,సూర్యాస్తమయాల్లేని అలౌకిక నిశ్శబ్దం లో మునిగిపోయాను అని తన స్థితిని వర్ణిస్తారు.చెట్లను నరికే కసాయి వాని చేతులు నరకాలి అని తనెంత వృక్ష ప్రేమికుడో తెలియజేస్తారు.తన ప్రయాణాన్ని తన ప్రేయసికి తెలియ జేస్తూ ఆయన కలం తెలుగు భాషను భరత నాట్యం ఆడేలా చేసింది."నీవక్షస్ శాద్వలసీమ మీద నా కవోష్ణ కిరణాల హిరణ్యం వెదజల్లుతాను". ఐదో సర్గ మళ్లీ ఇందులో తనే నీ మోహినీత్వoతో తనని మోసం చేయవద్దని తనలో ద్వేషాన్ని తొలగించవద్దని,దాంతో నాలోని అగ్ని పర్వతాలు పగలనీయమని కోరుకుంటాడు.ఈ నేల ఎంతకఠినమైందో చెబుతూ తన గాయాల రక్త జ్వాలల్ని ఎండమావులుగా ఉమ్మివేస్తున్న నేల గా అభివర్ణిస్తారు."అవి రాళ్ళని ఎవరన్నారు,నోళ్ళుమూసుకున్న అంతరాత్మలు"అని చెప్పడంలో రాళ్లు ఎన్ని యుగాలనుండి అన్ని దోపిడీలు,దారుణాలు చూస్తూ మౌనంగా ఉన్నాయో మనకు తెలియజేస్తారు. కర్షకునికి నీ ఒంటరికావు,నీ అడుగులో అడుగేసే వాళ్ళు ఉన్నారని మరువకు అంటాడు.కొండలు ఎందుకు అరవవు,రాత్రుల కపాలాలు పగలవెందుకు,ఈ నక్షత్రాలు చచ్చి నేలకు రాలవెందుకు,ఈ జనం నా మాట వినరెందుకు ,వీరిని ఎలా మార్చాలో తెలీదు అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు. ఆరోసర్గ. పరిణామ క్రమంలో భూమంతా మానవులు స్వేచ్చగా తిరిగినట్లు తను అలాంటి దేశద్రిమ్మరినని చెబుతూ నేను పీల్చే ఊపిరే పోట్లాట అని స్పష్టంగా ఎలుగెత్తిచాటుతారు."నేను సత్యాగహిని,సత్యం నా గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతం,నా గొంతులో గర్జిస్తున్న జలపాతం అని సత్యం కోసం తన కోసం తన పోరాటాన్ని ఆరంభిస్తారు."దేశం కోసం పోరాడటానికి తరలిరమ్మని ప్రజలకు పిలిపిస్తున్నాడు.మీ వేడి గొంతులతో నా తుపాకులూ, నా శతఘ్నులు తయారుచేసుకుని దేశం కన్నీరును తుడుస్తాను"అని తన దేశభక్తిని చాటుకుంటారు."నా గొంతు ,నా భాష జాతికి అంకితం,నేను ఒక రక్త ప్రవక్తను".అంటూ నా పద్యాలనే బందూకులు తీసుకురండి,మబ్బుల్లో దాచుకున్న పిడుగులు తెండి,రండి,అంటూ తనని తాను ఝంఝామారుతాన్ని అని ప్రజలకు పిలుపిస్తారు.పీడిత ప్రజలదే ఈ భూమి,నాతో కలిసినడవండి, నాగళ్ళు తీసుకు రండి,మనల్ని బానిసలు చేసిన వాళ్ల ప్రాణ వాయువులు తీద్దాం రమ్మని విప్లవోన్ముఖం వైపు ఒకరకంగా ఒక Long March కోసం పిలుపిస్తారు.ఆకలి ,దప్పికలు నీ స్వేచ్ఛను హరిస్తున్నాయి.విద్యార్థులను పుస్తకాలు వదిలేసి పొలాలు ఆక్రమించుకుందాం రమ్మంటారు."స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస.అది నీ రక్తపు సజీవభాష. నీ చివరి శ్వాస వరకు స్వేచ్ఛను నిలుపుకోవడమే నీ ధ్యాస "అంటూ మనిషికి స్వేచ్ఛ ఎంత అవసరమో తెలియ జేస్తారు.తన ఆగమనాన్ని ,తన మహాప్రస్థానం కర్షకులకోసం అంటూ తన శక్తి ,రక్తం అంతా ధాన్యంగా,పండ్లుగా మారిపోవాలి.తను ఒక ఉద్యమ విద్యుత్తు ఇస్తున్నానంటూ పిలుపిస్తారు.తిండి గింజలు ఎలా వస్తున్నాయి.వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకోవాలంటారు."భూమిని బుజ్జగిస్తాను,లలితంగా లాలిస్తాను.వెన్నలాంటి మన్నుతో గోరుముద్దలు చేసి పైర్ల పసినోళ్ళ కందిస్తాను.".భూమి పట్ల,పంట పట్ల రైతు ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరు వ్రాయగలరు.ఇంత చేస్తున్నా నాకు గుడిసెతప్ప ఏమీ లేదని కర్షకుని దైన్యాన్ని తనలో పలికిస్తారు. ఉదయాన్నే సూర్యోదయం అవుతుందని ఆశిస్తే సూర్యగ్రహణం వచ్చిందని ,మనుషుల్ని అలా మోసం చేసారని ఆవేదనతో జ్వలించి పోతారు."ఎవరు నేల గొంతు ఆలకించి దాన్ని లాలించి తన చెమటతో,రక్తంతో వెన్నలా,జున్నులా మృదువు చేశారో" రైతు దేహంలోకి ,మనసులోకి పరకాయ ప్రవేశం చేసినట్లుంది ఈ కవిత్వం.ఇంత చేసినా చివర్లో ఒక్కగింజ దక్కలేదని బాధపడతారు.మనిషిని అవమానించిన వాణ్ణి దుర్భాష లాడతారు.తిట్లు చిన్నవి,నా దేహమంతా అగ్నిఛ్చటుల వర్షపాతం వీస్తోంది. అది మిమ్మల్ని భస్మిపటలం చేస్తోంది అని హెచ్చరిస్తారు.రైతుకు ఏమీ దక్కనివ్వని ఈ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడు."ఈ దేశం లో ఒంగేవాడికి ఒంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు"అని బానిసలుగా బ్రతికే వారిని ప్రశ్నిస్తారు. ఏడవ సర్గ చెట్లను మునీశ్వరులతో పోలుస్తారు.సూర్యుడు భూమిని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. తన దేశాన్ని తన ప్రేయసిలో చూసుకుంటూ ఆమె అందించే ప్రేమతో ఈ శతాబ్దం విసిరే క్రూర సవాళ్ళను ఎదుర్కొంటాను,అని ముగిస్తారు. *శ్రామికునిపట్ల,కర్షకుని పట్ల సామాన్యమానవుని పట్ల ఇంత ప్రేమ,ఆపేక్ష చూపించిన కవి మనం చూడలేమేమో!శ్రీశ్రీ మహా ప్రస్థానం మానవ సంగీతాన్ని పలికిస్తే శేషేంద్ర "నా దేశం,నా ప్రజలు" మనిషి గుండెలోని బడబాగ్నిని అగ్నిపర్వతం లా తుఫానులా విరుచుకు పడేలా చేస్తుంది. *ఈ ధిక్కార ధోరణే ఆయనకు నోబుల్ బహుమతిని దూరం చేసిందేమో అనిపిస్తుంది.ఠాగూర్ "గీతాంజలి"కి ఏమాత్రం తీసిపోని కావ్యం.నోబుల్ బహుమతికి అర్హమైన కావ్యం.
Saturday, 16 May 2020
విత్తనాలు నాటుదాం.
పండ్లు తినడం మనకు బాగా అలవాటు.ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.ఏ కాలం లో వచ్చే పండ్లను ఆయాకాలాల్లో తినడం ఎంతో మంచిది.విదేశాల్లోనుండి దిగుమతి అయ్యే ఖరీదైన పండ్ల కంటే మన దేశం లో పండ్లు తక్కువ ధరలో దొరుకుతాయి.పండ్ల తోటలను చూస్తే అక్కడ రైతులు వాటిని ఎంత కష్టపడి పండిస్తున్నారో అర్ధమవుతుంది ఒకప్పుడు మాకు బత్తాయి తోట ఉండేది.నీళ్లు లేక ఎండిపోయాయి.sweets,oil foods,junk food కు పెట్టే ఖర్చులో సగభాగం పండ్లు తినడానికి వెచ్చిస్తే రైతులు లాభపడతారు. మనం తినే పండ్లలో విత్తనాలు ఉంటాయి.వాటిని మనం పారవేస్తూ ఉంటాము.కానీ ఒక్కసారి ఆలోచించండి.ఆ విత్తనాల ద్వారానే కదా ఆయా మొక్కలు మొలిచేది.మరి వాటిని భద్రపరిచి,ఎండపెట్టి,ఎక్కడయినా భూమిలో పాతితే మొక్కలు మొలుస్తాయి కదా!అడవిలో చెట్లు ఎవరు నాటుతున్నారు.విత్తనాలు నేలపై పడి వర్షాలు పడ్డప్పుడు మొలకెత్తుతాయి.అలాగే రాబోయే వానాకాలం లో మనం తిన్న పండ్ల విత్తనాలను ఎక్కడ వీలయితే అక్కడ భూమిలో నాటితే సరి. పండ్ల విత్తనాలే కాదు,చింతపండు ఇంట్లో వాడతాము కదా,వాటి విత్తనాలు,ఇంకా వేప,కానుగ, మర్రి,రావి ఏవి దొరికితే అవి నాటుకుంటూ వెడితే వాటిలో 10 శాతం బ్రతికినా మేలే కదా! నేను విత్తనాలు దాచిపెడుతున్నాను,మీరు చేస్తారా ఈ పని.మన భూమికోసం,మన పిల్లలకోసం ఈ పని చేద్దాం.చేస్తారు కదూ!
Saturday, 25 April 2020
Monday, 20 April 2020
SAPIENS A Brief history of human kind by Yuval Noah Harari పై విశ్లేషణ ......ఒద్దుల రవిశేఖర్
SAPIENS A Brief history of human kind by Yuval Noah Harari పై విశ్లేషణ ......ఒద్దుల రవిశేఖర్ మాములుగా మనం History books చదవాలంటే అంతగా ఆసక్తి చూపం.ఎందుకంటే అవి వ్రాసిన రచయితల శైలి కావచ్చు,అందులోని సమాచారాన్ని అందించే క్రమం కావచ్చు మనలో చదవాలనే ఉత్సాహాన్ని కలిగించవు. మానవ జీవిత పరిణామ క్రమాన్ని తెలిపే నండూరి రామమోహనారావు గారి "నరావతారం "నేను 8వ తరగతిలో చదివినప్పటినుండి నాకు ఆసక్తి పెరిగింది.తరువాత జీవ శాస్త్రం లో వచ్చిన చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం మరింత ఉత్సుకతను కలిగించింది.అలా ఈ విషయాలపై అక్కడక్కడా కొన్ని పుస్తకాల్లో,మరియు వార్తాపత్రికల్లో ,science magazines లో తెలుసుకుంటూ వస్తున్న క్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా బోధిస్తున్న క్రమంలో అసలు ఈ విశ్వము ఎలా ఏర్పడింది,విశ్వ పరిణామ క్రమం తెలుసుకోవాలనే జిజ్ఞాస ను కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు రోహిణీ ప్రసాద్ రచించిన "విశ్వాంతరాళం"తీర్చింది.ఇక TED talks లో Big history project గురించి David christian చెప్పింది విన్న తరువాత మరింత స్పష్టత వచ్చింది.(https://www.bighistoryproject.com/home)తరువాత మార్కాపురం రేడియో స్టేషన్ డైరెక్టర్ మహేష్ గారు కోరిక మేరకు "విజ్ఞాన ప్రపంచం "శీర్షిక తో 12 ఎపిసోడ్స్ కార్యక్రమాన్ని నన్ను ఇంటర్వ్యూ చేసి రికార్డింగ్ చేసి,ప్రసారం చేశారు.విశ్వ,మానవ పరిణామ క్రమాల గురించి తెలుసుకుంటూ,విద్యార్థులకు,కొన్ని public seminars బోధించడం జరుగుతూనే ఉంది.ఈ దశలో చరిత్ర ప్రొఫెసర్ యువల్ నోహ్ హరారి రచించిన "Sapiens" A brief history of humankind book ,shop లో casual గా చూసాక,ఇదేదో మన కోసమే వ్రాశారట్లుందే అనుకొని కొని 1 సంవత్సరం అయింది.ఇదిగో ఇలా ఈ కరోనా కాలం లో చదివాను.చదువుతుంటే ఎన్నో సందర్భాల్లో విభ్రమానికి గురయ్యాను ఆయన విశేషణకు.దీని తెలుగు అనువాదం కూడా దొరుకుతుంది.ఇక ఇందులో 4 విభాగాలు,20 chapters ఉన్నాయి. Part 1: The cognitive Revolution :ఇందులో ఆఫ్రికా నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హోమోసేపీఎన్స్ చరిత్ర వివరిస్తారు. Part 2:The Agricultural revolution:ఆహార సేకరణ నుండి ఆహారం ఉత్పత్తి కి మారిన క్రమాన్ని వివరిస్తారు.Part 3:The unification of humankind ఇందులో సమూహాలుగా,జాతులుగా,మతపరంగా,డబ్బుపరంగా,సామ్రాజ్యాల పేరుతో ఎలా మానవ జాతి ఏకమయ్యిందో వివరిస్తారు.Part4:The scientific revolution:ఇందులో విజ్ఞాన విప్లవం ఎలా మనల్ని ప్రభావితం చేసిందో సమగ్రంగా విశ్లేషిస్తారు.చివర్లో మన (హోమోసే పియన్స్) భవిష్యత్తు గురించి విభ్రాంతికరమైన విషయాలు తెలియజేస్తూ "తమ కేమి కావాల్నో తెలియని ఈ మానవజాతి ప్రయాణం కన్నా భయంకరమైనది ఇంకా ఏమైనా ఉన్నదా?"అని ప్రశ్నిస్తూ మన మెదడు నిండా భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తారు.ఈ క్రింది లింక్ లో రచయిత స్వయంగా వీడియో ల రూపంలో ఈ పుస్తక సమాచారాన్ని గురించి వివరించారు.https://www.youtube.com/playlist?list=PLfc2WtGuVPdmhYaQjd449k-YeY71fiaFp
Sunday, 5 April 2020
అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్
అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్ 2000 సంవత్సరం లో అనగా 20 సంవత్సరాల క్రితం నంద్యాలలో ఈ పుస్తకం కొని చదివాను.నా మీద బాగా ప్రభావితం చూపిన పుస్తకం ఇది.సత్యవతి గారిచే తెలుగులో అనువదించబడింది.మళ్లీ చదవాలని నిర్ణయించుకుని గత 10 రోజుల్లో పూర్తి చేశాను.కొద్దిగా వివరంగా ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తాను. తొలి పలుకులో మన పరిష్కారాలెప్పుడూ దేశాకాలాతీతమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి.ఇదే ఈ పుస్తక మూలసారం. పుస్తకం ఒకటవ భాగం:దృక్పధాలు-సిద్ధాంతాలు,అంతరంగం నుండి బహిరంగానికి,7 అలవాట్లు ఒక అవలోకన. ఆలోచనలు ఎట్లా ఏర్పడతాయి,మన దృక్పధాన్ని అవి ఎలా నిర్దేశిస్తాయి అన్న అంశాలపై రచయిత పరిశోధించారు.గత 200 సంవత్సరాలలో వచ్చిన వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని చదివిన రచయిత మొదటి 150 సంవత్సరాలలో వచ్చిన సాహిత్యం నైతికత,నిజాయితీ పునాదిగా వస్తే తరువాతి 50 సంవత్సరాల లో వచ్చింది మన ప్రవర్తన,వైఖరులు,నైపుణ్యాల గురించి చెబుతుంది. మన ప్రవర్తన మన స్వభావం దేనినుంచి పుట్టుకొచ్చిందో ఆ మూల దృక్పధాన్ని సరిచేసుకోనంతవరకు మనకు నిజమైన ఫలితాలు దక్కవు అంటాడు రచయిత.దృక్పధాలు సిద్ధాంత కేంద్రకంగా ఉండాలంటారు. ఇందులో చెప్పబడిన 7 అలవాట్లు మన ఇంగితజ్ఞానం లో ,మన అంతరాత్మ లో నిక్షిప్తమై ఉన్నాయని వీటిని గుర్తించి వెలికి తీయడం మన కర్తవ్య మంటారు. రెండవభాగం:వ్యక్తిగత విజయం. మొదటి అలవాటు:క్రియా సంసిద్ధత(Be proactive) ఈ అలవాటును దార్శనికతా సూత్రాల క్రింద మనకు వివరిస్తారు.విక్టర్ ఫ్రాంకెల్ చెప్పిన మానవ స్వభావపు మౌలిక సూత్రం " ప్రేరణకి,స్పందనకీ మధ్య మానవులకు స్పందనను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది" నుండి రచయిత బాగా ప్రభావితమయ్యారు.మనం మార్చగలిగే అంశాల పట్ల దృష్టిపెట్టమని,మార్చలేని వాటిని గురించి పట్టించుకోవడం మానమని చెబుతారు.మన ప్రభావ వృత్తాన్ని పెంచుకోమంటారు.మనకి మనం చేసుకునే వాగ్దానాలకు ఇతరులకు చేసే వాటికి నిబద్ధులై ఉండడమే మన క్రియా సంసిద్ధతకి రుజువు అంటారు.వాగ్దానాలు చేసి నిలుపుకోవడం మనలో నిజాయితీని పెంచుతుంది. రెండవ అలవాటు:అంతం ధ్యాసతో ఆరంభం(Begin with the end in mind) ఈ అలవాటును వ్యక్తిగత నాయకత్వ సిద్ధాంతాల ఆధారంగా వివరించారు."మీ జీవితాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవన గమనాన్ని ప్రారంభించడం మీలో ఎంతో మార్పు తెస్తుంది".గమ్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహనతో గమనాన్ని ప్రారంభించడం,మనలో గొప్ప మార్పు తెస్తుందంటారు.ఎవరికి వారు వారి జీవిత లక్ష్య ప్రకటనను తయారు చేసుకోమంటారు. మూడవ అలవాటు:ముందు విషయాలు ముందు(Put first things first) ఈ అలవాటును వ్యక్తిగత నిర్వహణా సిద్ధాంతాల ఆధారంగా వివరించారు. మనుషులు చేసే పనులు 4 విభాగాలుగా ఉంటాయంటారు.మన ప్రాథమ్యాలను చక్కగా plan చేసుకుని అవి urgent గా మారకుండా ముందుగానే పూర్తి చేయమంటారు. 3 వ భాగం:సామాజిక విజయం,పరస్పరాధార దృక్పధాలు. మనపై మనం విజయం సాధించుకోలేకపోతే,ఇతరులపై విజయం సాధించలేము.ఇందులో వ్యక్తులతో మంచి అనుబంధాలను కలిగి ఉండాలంటారు.ఇందుకు ఇతరులను అర్ధం చేసుకోవడం,నిబద్దత,నిజాయితీ కలిగి ఉండడం ముఖ్యం అంటారు. నాలుగవ అలవాటు:గెలుపు/గెలుపు ఆలోచన(Think win/win) ఈ అలవాటును పరస్పర నాయకత్వ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఈ దృక్పధానికి 1)నిజాయితీ(integrity)2)పరిణతి (Maturity) 3) పుష్కల మనస్తత్వం (abundance mentality) ఈ 3 లక్షణాలున్నవారు ఎటువంటి నైపుణ్యాలతో పనిలేకుండానే సామజిక విజయం సాధిస్తారు.గెలుపు/గెలుపు ఒప్పందం అనేది ఒక దృక్పధం,సత్యశీలం.సత్సంబంధాల ఫలితం. అయిదవ అలవాటు:ముందు అర్ధం చేసుకోండి,తరువాత అర్ధం అవండి. ఈ అలవాటును సహానుభూతి భావ ప్రసార సిద్ధాంతాల ఆధారంగా వివరించారు.సహానుభూతితో వినడం నేర్చుకోవాలంటారు.అనగా అర్ధం చేసుకునే ఉద్దేశం తో వినడం.చెప్పే వారిని లోతుగా,సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం.తరువాత మీరు వారికి అర్ధం అవుతారు.మన ఆలోచనల్ని స్పష్టంగా,నిర్దిష్టంగా,దార్శనికంగా, సందర్భానుసారంగా చెబితే మనపట్ల విశ్వసనీయత పెరుగుతుంది అంటారు.దాపరికం లేని సంభాషణ వలన సమస్యల్ని మొగ్గలోనే తుంచవచ్చు అంటారు. ఆరవ అలవాటు:సమ్మిళిత శక్తి (synergy). ఈ అలవాటును సృజనాత్మక సహకార సిద్ధాంతాలు ఆధారంగా వివరిస్తారు.సిద్ధాంత కేంద్రక నాయకత్వం యొక్క సారాంశమే సమ్మిళిత శక్తి అంటారు.ఒక బృందం అంతా కలిసి పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త వాటిని స్వాగతించడమే సమ్మిళిత శక్తి.జీవితం ఎప్పుడూ ద్వందాల నడుమే ఉండదని,మూడవ ప్రత్యామ్నాయం ఉంటుందని తెలుసుకోవాలంటారు.ప్రకృతి అంతా సమ్మిళితమే. నాలుగవ భాగం:పునరుద్ధరణ. ఏడవ అలవాటు:కత్తికి పదును(Sharpen the saw). ఈ అలవాటును పునరుద్దరణ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఇందులో మన స్వభావం లోని భౌతిక,ఆధ్యాత్మిక,బౌద్ధిక,మానసిక/సామాజిక దిశలను పునరుద్ధరించుకోవాలి.ఈ 4 దశల్లో 6 అలవాట్లను పునరుద్ధరించు కోవచ్చు.రోజూ పై 4 దిశల్లో పునరుద్ధరణకు కృషి చేస్తుంటే 6 అలవాట్లు శక్తివంతం అవుతాయి.ఇదే కత్తికి పదును అనే 7 వ అలవాటు. మనతో మనం ఏకత్వం సాధించడం,మనకు ప్రేమాస్పదులైన వారితో ఏకత్వం సాధించడం అనేదే అత్యంత ప్రభావ శీ లుర 7 అలవాట్లు ఇచ్చే మధురఫలం అంటారు. సత్య సిద్ధాంతాలనేవి ప్రకృతి ధర్మాలు.వీటికి అనుగుణంగా నడిస్తే మన స్వభావం లో దివ్య లక్షణాలు వచ్చి చేరతాయి.మన జన్మ సార్ధకమవుతుందంటారు. మనని ఒకరు ఇష్టపడడం కన్నా నమ్మడం మేలు.నమ్మకం,గౌరవం ఉన్నప్పుడు ప్రేమ సహజంగా ఉబికి వస్తుంది. మనం ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల గురించి విని ఉంటాము,చదివి ఉంటాము.కానీ జీవితం లో విజయం సాధించడానికి వేగవంతమైన పరిష్కారాలు లేవని సిద్ధాంతాల ఆధారంగా ఈ 7 అలవాట్లు కలిగి ఉంటే అదే పరిపూర్ణమైన జీవితం అంటారు.ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి 50 లక్షల ప్రతులు అమ్ముడు పోయిన పుస్తకం ఇది. అందరూ తప్పక చదవండి.
Wednesday, 1 January 2020
కాలచక్రం 2020
కాల చక్రం తిరుగుతూ ఉంది.మన భూమి 454 కోట్ల సంవత్సరాలనుండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.ఒక్కో పరిభ్రమణాన్ని ఒక్కో సంవత్సరంగా మనం పరిగణిస్తుంటాం.అంటే ప్రస్తుతం క్రీస్తు జననం తర్వాత 2019 పరిభ్రమణాలు పూర్తి చేసి 2020 వ పరిభ్రమణం మొదలెట్టింది మన భూమి.గణాల్ని,తెగల్ని,సమూహాలను,రాజ్యాల్ని దాటుకుంటు ప్రస్తుతం దేశాల్ని చూస్తుంది.ఒక్కటిగానున్న తనను గీతలు గీసి ముక్కలు చేసుకున్న కాలాన్ని చూస్తుంది.దేశాల పరంగా, మతాల పరంగా,జాతుల పరంగా విడిపోయిన తనని తాను చూసుకుంటుంది భూమి. జీవరాశి నివసించటానికి అనుగుణంగా సిద్ధమయిన భూమి అదే జీవరాశి లో అత్యున్నతమైన దశకు చేరుకున్న మానవుని దెబ్బకు విలవిలలాడుతుంది.struggle for existence, survival of the fittest సూత్రాలతో జీవపరిణామ ముందుకు సాగుతోంది.అత్యంత నాణ్యమయిన జీవితం గడపటానికి ,సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనిషి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు. పారిశ్రామిక యుగానికంటే ముందు స్వచ్ఛమైన గాలి,నీరు,పచ్చని అడవులతో కాలుష్యరహితంగా ఉన్న ఈ భూమి అత్యున్నత సాంకేతిక యుగం లో కాలుష్యభరితమై,జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ,భూతాపం ఎక్కువయ్యి కొట్టుమిట్టాడుతోంది.2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీ లు పెరిగి జీవికి నివాసయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మరో ప్రక్క ఇవేవీ పట్టని దేశాలు,ఒకదానిపై మరొకటి పోటీతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో, వాణిజ్యయుద్దాలతో సంపద సృష్టితో,అభివృద్ధి పేరుతో తీవ్రంగా పోటీ పడుతూ ప్రస్తుత తరం భవిష్యత్తును ఫణంగా పెడుతూ దూసుకెడుతున్నాయి. నాణ్యమైన, ఆరోగ్యకరమైన,ఆనందకరమైన ,సమతుల జీవనం ఎలా ఉండాలో భూటాన్ లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవచ్చు. భూమి ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన అభివృద్ధి,మన సంపద,జీవజాతుల మనుగడ.ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు సమావేశమై తక్షణం భూవిధ్వంసానికి కారణమయ్యే ప్రతిఅంశాన్ని లోతుగా చర్చించి అమలుపరిచే కార్యాచరణ సిద్ధం చేయాలి.ప్రతి ఒక్కరు,ఏ పనిచేస్తున్నా పర్యావరణానికి,ప్రకృతికి ఏమయినా కీడు చేస్తున్నామా అని ఆలోచించాలి.ఎవరివంతు ప్రయత్నం వారు చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని బహుమతిగా ఇవ్వవచ్చు.లేదంటే భావితరాలు మనల్ని క్షమించవు. క్రీ.శ 2020 వ భూ పరిభ్రమణ శుభాకాంక్షలు. ఒద్దుల రవిశేఖర్.
Subscribe to:
Posts (Atom)