Sunday, 29 July 2012

డబ్బు సృష్టించే అహంకారం(5)

            డబ్బు సమాజాన్ని శాసిస్తున్న రోజులివి.సంపద పట్ల విపరీత మైన వ్యామోహం ప్రజల్లో వ్యాపించింది.
ఎప్పు డైతే దీనికి అంత ప్రాధాన్యత ఏర్పడిందో ఎవరికయితే డబ్బు ఉందొ వారికి సంఘంలో విలువ గౌరవం పెరిగి పోసాగాయి.డబ్బున్న వారు గొప్ప వారుగా ,డబ్బు లేని వారు సామాన్యులుగా పరిగణింప బడే సంస్కృతి ప్రబలింది ఎప్పుడైతే దీనికంత ప్రముఖ స్థానం లభించిందో అది వున్న వారికి సహజం గా గుర్తింపు లభించటంతో వారు తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణింపబడాలని కోరుకోవటం మొదలయింది.సహజంగా వారికి సంఘంలోఅన్ని పనులు చకచకా జరిగిపోవటం,ప్రభుత్వాలు వారు చెప్పినట్లు అనుకూల నిర్ణయాలు తీసుకోవటంతో వారి సంపద అనూ హ్యంగా పెరిగిపోతుంది.
        ఈ నేపధ్యంలో ఎవరికి వారికి వ్యక్తిగత స్థాయిలో డబ్బుద్వారా వచ్చే గుర్తింపును కోరుకోవటం ,ధనవంతుల మనే దర్పం ప్రదర్శించటం ,డబ్బు లేని వారిని తక్కువగా భావించటం ,తమ దైనందిన వ్యవహారాల్లో ఆ అహాన్ని చూపించే తత్వం స్థిరపడటంతో అది సంపద ద్వారా వచ్చిన అహంకారం గా పరిగణించవచ్చు.ఇది ప్రజల మధ్య ఎన్నో వైరుధ్యాలు సృష్టిస్తోంది.మధ్య తరగతి వారిలో కూడా తమ కంటే తక్కువ ఆస్తిని కలిగి ఉన్నవారి పట్ల చిన్న చూపు చూస్తున్నారు.సొంత ఇల్లు కలిగిన ఇంటి యజమానులు అద్దెకుండే వారిపై ఈ అహంకారంతో కూడిన మాటలు వాడ టం మనం వింటూ ఉంటాము.
      సంపద కలిగిన వారు దానిని ఎలా ప్రదర్శించాలి  అనే కోణంలో ఆలోచిస్తుంటారు.తమ కట్టుకున్న ఇంటి ద్వారా ధరించే బంగారు ఆభరణాల ద్వారా,ఖరీదయిన బట్టలు ధరించడం ద్వారా ,విలాసవంత మైన వాహనాలు ద్వారా భారీ వేడుకలు నిర్వహించటం ద్వారా తమ గుర్తింపును పెంచుకోవటానికి ,ఇతరులకు తమ ఆర్ధిక హోదా అర్థం కావ టానికి దాని ద్వారా తమ అహంకారాన్ని చూపిస్తుంటారు.ఈ క్రమంలో వారు తమ కంటే తక్కువ ఆర్ధిక స్థాయి కలి గిన వారిపట్ల వారిమాట తీరులో వారి వ్యవహార ధోరణిలో అడుగడుగునా సంపద ఇచ్చిన అహంకారం తొణికిసలాడు తుంది.బంధువుల మధ్య ఈ ధోరణి సంబంధాలను క్షీణింప చేస్తుంది.వారు సంపాదించే క్రమంలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేస్తూ,వారి హక్కులను కాలరాస్తూ ,తమ తోటి ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను తామే సొంతం చేసుకుంటూ వ్యవహరించే ఈ ధోరణి సమాజానికి ఎంతో అరిష్టం.
      సంపద కలిగిన వారిలో కొంత మంది ఎంతో నిరాడంబరంగా ,ఎక్కడా ఈరకమైన అహంకార ధోరణి చూపకుండా
సరళమైన జీవితాన్ని గడిపే వారిని మనం గమనిస్తుంటాము.ధర్మ బద్దంగా సంపాదిస్తూ ప్రభుత్వానికి పన్నులు కడు తూ సేవా కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనించ వచ్చు.అటువంటి వారు పెద్ద పారిశ్రామిక వేత్తలలో కూడా వున్నారు.మన మధ్య లో కూడా ఎంతో మందిని మనం గుర్తించ వచ్చు.
       సంపద సుఖాన్ని,విలాసవంత మైన జీవనాన్ని ఇవ్వ వచ్చు.ఆరోగ్యం సరిగా లేక పోతే ఎంత డబ్బు వున్నా నిష్ప్రయోజనం.సుగర్,బి.పి లేని ధన వంతులను మనం తక్కువగా గమనిస్తాంఎంత డబ్బులున్నా ఏమీ తినటానికి ఉండదు.తిన్నది అరగదు.సమస్యలతో కంటినిండా నిద్రపట్టదు.heart attacks,cancers వస్తే పరిస్థితి మరింత దారుణం. ఇంత మాత్రానికి డబ్బు పేరుతో విర్ర వీగటం ,అహంకారం ప్రదర్సించటం,తమ తోటివారిని ఇబ్బందులు పెట్టటం ఎంత వరకు సమంజసం.సంపాదనకు అంతు లేదు.ఎంత సంపాదించినా వారికంటే అధిక ధనవంతులు ఉంటూనే వుంటారు.వారు చూపించే ఆధిపత్యం ,అహంకారం తక్కువ ధనవంతులను మరల బాధ కలిగిస్తుంది.
        సంపద వున్నా తృప్తిగా జీవించకపోతే ,సమాజంలో మంచి పేరు,గౌరవం జీవిత కాలం లో సాధించలేకపోతే దేన్ని చూసుకుని ఇంత అహంకారం ప్రదర్సించారో అది మరణిస్తే తన వెంట రాదు కదా!అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాలని ,భూమండలాన్నంతా తన పాదాక్రాంతం చేసుకోవాలని బయలుదేరి భారత దేశం వచ్చి తిరిగి వెళుతూ మార్గ మద్యంలో మరణిస్తూ తన రెండు చేతులు తన శవ పేటిక పై చాచి ఉంచే లాగా ఏర్పాటు చేయ మన్నాడట తాను ఏమీ తీసుకు పోవటం లేదు అని చెప్పటానికి.
            తాను తన కంటే అధిక ధనవంతుల ద్వారా పొందే అవమానం తో బాధ పడే వ్యక్తి దానిని ఇతరుల పై చూప కుండా ఆ లక్షణం తనలో వున్నట్లు గుర్తించి సంపద ద్వారా అహంకారాన్ని కాకుండా,వినయాన్ని పెంచుకుంటూ తోటి మనుషుల యెడల సహకార ధోరణితో మెలిగితే తన జీవితం ధన్యం అయినట్లే!

Friday, 27 July 2012

అందంగా వుండే వారిలో అహంకారం ఉంటే!(4)


           నేను  ఎక్కువ అన్న భావం ప్రదర్శించే వారిని సమాజం లో చాలా మందిని చూస్తుంటాము.అందం ద్వారా భావం ఏర్పడిన వాళ్ళు తాము ఇతరుల కంటే చాలా అందంగా ఉన్నామని దానిని ప్రద ర్శించుకోవటం   కోసం అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ,విభిన్న సందర్భాలలో దానిని మాటల రూపం లో ,హావభావాల రూపం లో వ్యక్తం చేస్తుంటారు.అందంగా లేని వ్యక్తుల పై కామెంట్ చేస్తుంటారు.మేము B.ED  చదివే రోజుల్లో మా మిత్రుడు ఒకతను నల్లగా ఉంటాడు.కాని మంచి తెలివితేటలు ,ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యము ఉన్నాయి.ఇంకొక మిత్రుడు చాలా అందంగా ఉండేవాడు.అతను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు.ఒకరోజు ఒక అంశం పై సెమినార్ జరిగితే ఇద్దరు మాట్లాడారు.సెమినార్ అయిన తర్వాత అందంగా ఉండే మిత్రుడు మా దగ్గరికి వచ్చి నా మిత్రుని (నల్లగా వుండే)తో నీవు అచ్చు శివరాసన్లా (రాజీవ్ గాంధీ హంతకుడు) ఉన్నావు,అన్నాడుఇంకొకరయితే ఎలా సమాధానమిచ్చేవారో కాని నా మిత్రుడు చాలా కూల్ గా నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా అందంగాఉన్నావు అన్నాడు.అంతే వ్యాఖ్య చేసిన మిత్రుడు బాధపడి విచారం వ్యక్తం చేసాడు.
           ఈ విధం గా ఎంతో మంది అందంగా లేని వారిపట్ల అవమానకరమైన రీతిలో మనసు బాధ పడే లాగే వ్యాఖ్యానిస్తుంటారు.ముఖ్యంగా నలుపు,ఎత్తు,లావు గురించి కామెంట్స్ చేస్తుంటారు. అహంకారం ప్రదర్శించే వ్యక్తులు అవతలి మనుషుల మంచి తనానికి విలువ ఇవ్వరు.ఎప్పుడయినా తమకి అవసరమయినప్పుడు బాధలో వున్నప్పుడు వీరికి అందం లేని వారు సహాయం చేస్తే అప్పుడు వారిలో మానసిక మార్పు రావచ్చు.లేదా తాము ఆరోగ్యాన్ని కోల్పోయి అందాన్ని కోల్పోయినప్పుడు వారిలో అహంకారం సమసి పోవచ్చు.లేదా వయసు మీరిన తర్వాత వచ్చే వృద్ధ్యాప్యంవలన ముడతలు పడిన పడిన శరీరాన్ని అద్దంలో చూసుకుంటూ అప్పుడు తీరిగ్గా అహంకారాన్ని తొలగించుకోవచ్చు. లోపల జీవితం ముగిసి పోతుంది.అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలే గాని అహంకారాన్ని ఇవ్వ కూడదు.
     అందాల పోటీల్లో మీ జీవిత లక్ష్య మేమిటని అందగత్తెలను ప్రశ్నిస్తే సమాజానికి సేవచేయాలనో,అనాధలను వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవ చేయాలనో సమాధానమిస్తారు.అంటే వారిలో ఎంత వరకు  అంతఃసౌందర్యం ఉందో పరీక్షిస్తారు.అక్కడ సరి అయిన సమాధానము చెప్పేవారికే ప్రపంచ సుందరి కిరీటం దక్కుతుంది.వారికన్నా అందం గా వుండి  సరి అయిన సమాధానం చెప్పని వారికి కిరీటం తప్పి పోయిన సందర్భాలున్నాయి ..
        బాహ్య సౌందర్యం తాత్కాలిక మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది . రోజుకు మహనీయుల గురించి తలచుకుంటూ వుంటామంటే వారి ప్రవర్తన ,వారి ఆలోచనలు,వారి ఆచరణలను బట్టే  .ప్రపంచంలో ఎంతో మంది అంద మైన వాళ్ళు పుట్టారు,మరణించారు.అందం పేరుతో గొప్పవారుగా పరిగణింప బడే వారు ఎంత మంది?ఎంతో అందమైన సినిమా నటులయినా వారి నటనకు గుర్తింపు పొందుతారు, కాని అందంగా ఉన్నంత కాలం ఆరాధిస్తారు  తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా!అందంగా లేని ఎంతో మంది ఎన్నో రంగాల్లో అద్భుత మైన తెలివితేటలతో గొప్ప సేవా భావం తో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
      ఒక్క క్షణం అందంగా ఉండే వారంతా ఆలోచిస్తే వారిలో ఇటువంటి అహంకార మేమైనా ఉంటే  దాన్ని తమంతట తాము గుర్తిస్తే అంటే తమకి లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తిస్తే క్షణమే అహంకారం నుండి బయట పడగలరు.అప్పుడు వారికి ప్రపంచ మంతా అందంగా కనబడుతుంది.ముఖ్యం గా వారి మనస్సులో  అహంకారం  ఎప్పుడయితే తొలగి పోతుందో వారి ముఖము దేదీప్య మానంగా వెలిగిపోతూ వారు ద్విగుణీకృత మయిన తేజస్సు తో ప్రకాశిస్తారు.

Wednesday, 25 July 2012

అహంకారం యొక్క లక్షణాలు (3)


గత భాగం తరువాయి
అహంకారం యొక్క లక్షణాలను ఒకసారి గమనిద్దాము.
1)ఇతరుల కంటే  తాను అధికము అనే భావన మనిషిలో వుంటే అతని ప్రవర్తన లో అది ప్రతి సందర్భం లో కనిపిస్తూ ఉంటుంది.అతని మాట తీరులో అది వ్యక్త మవుతూ ఉంటుంది.ఇది అందం,డబ్బు,పదవి,,జ్ఞానం వలన కలుగుతుం టుంది.వీటిని ప్రదర్శిస్తూ మిగతా వారికి ఇవి లేవు అంతా నాకే తెలుసుఅన్న భావం లో ఉంటాడు. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయటం,అవమాన పరచటం ,అసహ్యించుకోవడం,ద్వేషించడం చేస్తుంటాడు.
2))వీరి ఆలోచనా విధానం పరిమితమైన చట్రం  లో బంధించబడి ఉంటుంది.వీరు ప్రపంచం  గురించి గాని సమాజ శ్రేయస్సు గురించి కాని ఆలోచించరు.ఎవరు ఏమైనా ఫరవాలేదు.అన్న ధోరణిలో ఉంటారు.
3))పక్షపాతం తో వ్యవహరిస్తారు.నా కులం ,నా మతం ,నా వర్గం,నా పార్టీ గొప్ప అని భావిస్తూ  తను చెప్పిన విషయాన్నే అందరు అంగీకరించాలని భావిస్తుంటారు.ఇది సత్యాన్ని అంగీకరింప నీయదు.
4))ప్రపంచాన్ని తన కోణం లోనే చూస్తాడు.తన కనుకూల మైన దానిని మాత్రమే ఇష్ట పడతాడు.
5)నిరంతరం గుర్తింపు కోరుకుంటూ ఉంటాడు.తను చేసిన ప్రతిపనిని అందరు మెచ్చు కోవాలని భావిస్తుంటాడు .ఆస్తి,అంతస్తు,నటన,పదవి,జ్ఞానం,వీటి ద్వారా నిరంతరం గౌరవాన్ని కోరుకుంటూ ఉంటాడు.తమ కంటే వేరొకరికి గుర్తింపు వస్తుందన్నా భరించలేరు.
6)వీరు ఏ పదవిలో వున్నా తమ క్రింది సిబ్బందిని తమ ప్రవర్తన ద్వారా ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
7)నేను చాలా ప్రత్యేకం ,నేను చాలా ముఖ్య మైన వ్యక్తిని అనుకుంటూ నిరంతరం ప్రాముఖ్యతను కోరుకుంటూ ఉంటాడు.
8)వీరు కొన్ని నిర్దిష్ట మయిన పద్ధతులు పాటిస్తూ ఉంటారు.వాటికి వ్యతిరేకం గా ఏమి జరిగినా తట్టుకోలేరు.రాజీ పడరు.వీరికి నచ్చజెప్పడం చాలా కష్టం.
9)వీరు నిరంతరం కీడును శంకిస్తూ,ఇతరుల లో నిరంతరం లోపాలను ఎంచుతూ ఉంటారు.వీరికి మంచి కన్నా చెడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
10)వీరు జీవితాన్ని అశాంతి,అసంతృప్తి,ఘర్షణలతో గడుపుతారు.
11) ఎప్పుడు భౌతిక వాదం లో మునిగి తేలుతూ తన అంతరంగ స్థితిని గురించిన ఆలోచన ఎప్పుడు చేయరు.
     అహంకారం కలిగిన వ్యక్తులు తమకు తాము నష్టం కలిగించుకోవడమే కాక సమాజాన్ని ఎన్నో కష్ట,నష్టాలకు గురిచేస్తుంటారు.
మరి ఈ అహంకారాన్ని ఏర్పడకుండా చూసు కోవడం ఎలా?ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడం ఎలా?
తరువాయి భాగంలో వివరిస్తాను. 

Tuesday, 24 July 2012

స్వార్థం ,అహంకారం రెండు వేర్వేరా!లేదా ఒకటేనా!(2)


గత వ్యాసం తరువాయి భాగం.
గత వ్యాసం పై కొన్ని సందేహాలకు సమాధానాలు .స్వార్థం ,అహంకారం అంటే ఏమిటి ?రెండు ఒకటా?వేర్వేరా ?ఒక సారి మనం నిఘంటువు అర్థాలు పరిశీలిస్తే వీటి గురించి మనకు ఒక అవగాహన వస్తుంది.
అహంకారం=గర్వం,ఆత్మాభిమానం,క్రోధం
అహం=గర్వం
అహంభావం= గర్వం
స్వార్థం =స్వప్రయోజనం
స్వార్థపరుడు =తన ప్రయోజనాన్ని చూసుకునే వాడు.ఇవి తెలుగు అకాడెమి వారి నిఘంటువు లోని  అర్థాలు
ఇక oxford dictionary లో
ego=the part of the mind that reacts to reality and has a sense of idividuality.మానవుని మనసులో ఏర్పడే నేను అనే వ్యక్తిత్వ భావన
egoism=an ethical theory that treats self interest as the foundation of morality
అనగా నేను లేదా తన ప్రయోజనం మే  ప్రధానమైన నైతిక సిద్దాంతం
  egoism is a term used in philosophy and psychology to mean self interest

selfish=concerned chiefly with one"s own profit or pleasure.
ఆధ్యాత్మికంగా
అహంకారం =అహం+ఆకారం =నేనే శరీరాన్ని.
అహంబ్రహ్మస్మి =నేనే బ్రహ్మాన్ని అన్నట్లుగా
              ఒకవ్యక్తి యొక్క మానసిక మట్టం చుట్టూ ఏర్పడే పరిమితమైన స్థితిని అహంకారం అంటారు.సహజత్వా నికి   విరుద్ధంగా సమత్వాన్ని  కోల్పోయిన స్థితినే అహంకారం అంటారు.నేను ఫలానా ,ఇదినాది,నాకు కావాలి అనే భావనలతో జీవించే స్థితినే అహంకారం అంటారు.
                                         i,my,mine are the three states of egoism.
       ఈ రెండింటికి అర్థాలు ఒకే లాగా కనిపిస్తున్నప్పటికీ సూక్ష్మంగా ఆలోచిస్తే కొన్ని భేదాలను గమనించ వచ్చు.అవి1)స్వార్థం అంటే కేవలం తన ప్రయోజనం చూసుకునే వాడు.
2)అహంకారం  అనగా తన ప్రయోజనమే ప్రధానమైన నైతిక  సిద్దాంతం. ఇంకా గర్వం అనికూడా అర్థం.ఇది కూడా philosophy, psychology లలో స్వప్రయోజనం అనే వాడారు అని  .oxford dictionary చెబుతుంది.కాని నిఘంటువుల అర్థాలతో పాటు మన indian philosophy ని పరిశీలిస్తే ఇది ఒక మానసిక భావనగా పరిగనిస్తారు.
          మొదట మానవుడికి ఏర్పడిన భావనను పై అర్థాల ప్రకారం స్వార్థం అన్న అహంకారం అన్న ఒకటేగా కనబడుతుంది.కాని ఆదిమ కాలంలో ఇది కేవలం ఆహార సేకరణ లో ఏర్పడిన భావం గా పరిగణిస్తే  మొదట స్వార్థం గా ప్రవర్తించేవాడు అని పరిగనించ వచ్చు.తరువాత పరిణామ క్రమం లో ఇది ఒక మానసిక స్థితిగా మారి దీనిని కోపం లాగా తన  మాటల ద్వారా ముఖం లో భావాన్ని చూపించే ఒక మానసిక సమస్య మారింది.ఇక ప్రస్తుతం దీన్ని వాడే క్రమం లో గర్వం గా కూడా తీసుకుంటున్నారు.
         ఏది ఏమైనప్పటికి,మనిషి కి ఎప్పుడో ఒకప్పుడు ఉదయించిన ఈ అహంకారాన్ని అర్థం చేసుకొని
దీని లక్షణాలను వివరంగా వచ్చే వ్యాసం లో చర్చిద్దాము.      

Sunday, 22 July 2012

మనిషిలో అహంకారం ఎలా మొదలయింది? 1


                   సమూహంలో ఉంటూ అందరు కలిసి ఆహారాన్ని సేకరిం చుకుంటూ ,దానిని కలిసి పంచుకుని తింటూ ఉన్నంత కాలం మనిషికి వ్యక్తిగతమంటూ ఏదీలేదు.ఎప్పుడయితే కుటుంబం ఏర్పడిందో అప్పుడు ఆహార సంపాద నలో స్వార్థం బయలుదేరి నా కుటుంబం,నా పిల్లలు,నా ఇల్లు అన్న వ్యక్తిగతమైన భావనలు బలపడ్డాయి. ఆహారా న్ని  తన కుటుంబానికి దాచి పెట్టుకోవటం,వస్తువులను సేకరించుకోవటం సంసారానికి కావలసిన  అన్ని రకాల పదార్థాల సేకరణలో మనుషుల మధ్య పోటీ ఏర్పడటం,ఆ పోటీలో మనిషి తత్వం లో మార్పులు చోటు చేసుకున్నా యి .అందులోంచి పుట్టినదే నా అన్న భావన.అప్పుడు ఈ భావన కేవలం బాహ్య పరిస్థితులకు మాత్రమే అన్వయిం చుకుని మనుష్యులు ప్రవర్తించే వారు.ఇది బాగా పూర్వ కాలానికి సంబంధించినది.
         సమూహాలనుండి,ఉమ్మడి కుటుంబాల నుండి  నేడు చిన్న కుటుంబాలు ఏర్పడ్డ తర్వాత వ్యక్తిగత వాదం పెరి గింది.ప్రతి సమస్యను తనే అధిగమించటానికి దాని గురించి ఆలోచించటం ప్రారంబించాడు.బాహ్య అవసరాలకోసం ప్రా రంభమైన ఈ తత్వం పూర్తిగా వ్యక్తి తన మనస్సును దానితో నింపి మధనం చేయటం ప్రారంభం కావటంతో మన సం తా నేను నాకు,నా వలన,నన్ను ,నాయొక్క నావారు,నాతోనే, నేను లేకపోతే ఇలాంటి ఎన్నో భావాలు మనిషి లో స్థిరపడిపోయాయి.మరల ఇవన్నీ మనిషి ప్రాధమిక అవసరాలు తీర్చుకోవటం వరకు బాగానే ఉంది.ఈ తత్వం ఇతరు లకు నష్టం కలిగించే విధంగా ,ఇతరుల హక్కులు కాలరాసే విధంగా తయారయినప్పటి నుండి దీని పై చర్చ ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది.
          మరో వైపు మానవ పరిణామ క్రమంలో అభివృద్ది నా అన్న భావన వలన కూడా జరిగింది.కాని ఇది వ్యక్తి అభి వృద్దిని దెబ్బ తేసే విధంగా ఇతరుల హక్కులకు భంగం కలిగించే దశగా ప్రస్తుత దశను భావించవచ్చు.దీనినే మనం ప్రస్తుతం అహం అని అహంకారం అని నేను అనే భావన అని అంటున్నాము.ప్రస్తుత దశ  గురించి చర్చిద్దాము.       .          
          మానవ  జీవనం 20 వ శతాబ్దం నుండి విభిన్న మార్పులకు లోనవుతూ వస్తుంది.ప్రతి రంగం లో ఆధునిక మైన శాస్త్ర సాంకేతికత ప్రభావం తో అనూహ్యమైన అభివృద్ధి చోటుచేసుకుంటుంది.అదే సమయంలో మనిషి జీవన విధానం,ఆలోచనా విధానం మారిపోతూ వస్తుంది.ప్రపంచ మంతా వ్యక్తి వాదం ప్రబలి తన కుటుంబం,తన పిల్లలు కేంద్రం గా మనిషి ఆలోచన కేంద్రీకృత మయింది.తను అభివృద్ధి అయ్యే క్రమంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వస్తుంది.ఇతరులతో  పోటీ పడటం తన ఆధిక్యతను చూపించటానికి ప్రయత్నించటం,ఇతరులతో పోల్చుకుంటూ తను వారికంటే తక్కువ,లేదా ఎక్కువ అనే భావనలకు లోనవుతూ సంఘర్షణ లో ఉన్నాడు.
       ఈ క్రమంలో తన అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తూ స్వార్థాన్ని,సంకుచితత్వాన్ని పెంచుకుంటూ ఎవరు ఏమైనా ఫర్లేదు, నేను అందరినీ అధిగమించాలి.అంతా నాకు కావాలి,ఇది నాది,నేను ఫలానా అనే భావనలు మనిషికి అహంకారం సృష్టించాయి.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Thursday, 19 July 2012

అద్దెగర్భం


ఇల్లు అద్దెకు ఇచ్చినంత తేలికగా
అక్కడ గర్భాశయాలు దొరుకుతాయి
ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి
వంశాకురాలను  కడుపులో పెంచి అప్పగించాలి
ప్రేమ వాత్సల్యాల పాత్ర లేనే లేదు
ఇంట్లో దాచి వుంచిన వస్తువు ఇచ్చినంత తేలికగా
బ్యాంకు లాకర్ లో బంగారం దాచినంత సులువుగా
అంగట్లో సరుకును కొనుక్కున్నంత సునాయాసంగా
అక్కడ వారసులను కొనుక్కుంటారు
తనువులోని ప్రతికణం లోని శక్తి నిస్తూ
రక్త మాంసాలను రంగరించి మరో జీవికి  జన్మ నిస్తూ
మనః శరీరాలు అనుభవించే క్లేశాలను భరిస్తూ
కుటుంబ అవసరాల కోసం మగువ చేస్తున్నదీ త్యాగం
దేహాన్ని కర్మాగారంగా మార్చి
కడుపును యంత్రం గా చేసి
ఉచ్వాస నిశ్వాసాలను ఊపిరులుగా  ఊది
ప్రాణవాయువును ఇంధనంగా అందిస్తూ
ప్రతి జీవక్రియకు ప్రయాసపడి భారము మోస్తూ
ప్రాణాన్ని ఫణంగా పెట్టి చేస్తున్న ఈ సృష్టి యజ్ఞం
ఆమె పాలిట  జీవన్మరణ పోరాటం
పునర్జన్మ ఎత్తి మరో జీవికి జన్మనిచ్చిన ఆమెకు
కడుపు తీపి ప్రేమను పుట్టిస్తే  
కరెన్సీ నోట్లు నిర్దాక్షిణ్యంగా దానిని తుంచి వేస్తే  
కళ్ళ నీళ్ళు కుక్కు కొని ప్రేగు బంధం తెంచుకొని 
సంతానాన్ని చేజేతులా అప్పగించి 
కాసుల గల గలలను లెక్కబెట్టుకుంటూ 
మాతృత్వానికి ధరను నిర్ణయించుకున్న 
ఓ అభాగ్య అద్దె  మాతృమూర్తి! 
నీ ఆకలి కేకలకు అమ్మతనం చిన్నబోయింది 

Tuesday, 17 July 2012

నా హృదయ సీమ


 అహంకారం ఎరుగని సరిహద్దులకు
 నా మనసు విస్తరించనీ 
 అలంకరణలకు విలువివ్వని
 అభిమానాన్ని సంతరించు కోనీ
 ఆప్యాయతానురాగాల భావాల
 సమున్నత్వాన్ని పెంపోందించుకోనీ
 ఈ విశాల   విశ్వాంతరాళంలో 
 నా మానసిక సౌందర్యం విస్తరించి ప్రకాశించనీ
 నా హృదయ సీమ లోని ప్రతి కణం  ఈ ప్రకృతి పై
 అవ్యాజ్య అభిమానాన్ని నిలుపుకోనీ
 నా మనోగగనాన స్నేహ మధురిమల పరిమళాలు
నా శ్వాస  నాళాల్లో ప్రాణవాయువు
 ప్లవించే వరకు గుబాళించనీయనీ
 అని నా హృద్యంతరం లోని శక్తిని కోరుతున్నా

Sunday, 15 July 2012

దుర్యోధన దుశ్శాసన పర్వం


"అర్ధ రాత్రి ఆడది స్వేచ్చగా తిరగగలిగిన నాడే
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు "
అన్న మహనీయుల మాటలు తుత్తునియలు చేస్తూ
క్రూర వికటాట్టహాస పదఘట్టనలు
లేడి కూనలను వేటాడే క్రూర మృగాల  కర్కశత్వం
ఒంటరి అసహాయ మహిళపై అమానుషం
వ్యంగ్య బాణాలు ,విషరసాయనాల్లాంటి మాటలు
దేహాన్ని దగ్ధగీతంలా దహిస్తుంటే
నెత్తురు సలసలా మరిగి నరనరాల్లోకి
ప్రవహించదా! అభిమాన వతికి
పోరాటం పొత్తిళ్ళలో పెరిగిన బిడ్దేమో
గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రతిఘటిస్తే
కామోన్మాదం తలకెక్కిన విషపురుగుల
వికృత పైశాచికత్వం నిద్రలేచి
దుర్యోధన దుశ్శాసన పర్వానికి తెర తీసింది.
మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం
ఎక్కడో ఓ చోట ప్రతిరోజు ద్రౌపది ఆక్రందనలు
నిస్సిగ్గుగా నిలబడి చూస్తున్న జనం సాక్షిగా
విలువల వలువలు తగల బడుతుంటే
ఒళ్లంతా గొంగళి పురుగులు ప్రాకినట్లు
శరీరాన్ని తాకరాని చోట్ల తాకుతుంటే
నిస్సహాయంగా,బేలగా ముకులిత హస్తాలతో
మొగ్గలా ముడుచుకుని దీనంగా వేడుకుంటుంటే
తోడేళ్ళ గుంపు ఒక్కపెట్టున దాడి చేసినట్లు
అంగాంగాలను దుర్మార్గంగా తడుముతుంటే
కీచకుల వారసత్వాన్ని నీచంగా ప్రదర్శిస్తున్న
ఈ దానవ జాతిని ఏ పేరుతో పిలిచినా తక్కువే
అమ్మల స్తన్యంతో పెరిగిన కండలతో
అక్కచెల్లెల్ల ఆప్యాయత మరచిన రాక్షసత్వంతో
రెచ్చి పోతున్న ఈ మానవ మృగాలను ఏమనాలి?
హృదయవిదారకంగా విలపిస్తున్నా
వినోదంలా చూస్తున్న కన్నులున్న దృతరాష్ట్ర జాతి
సభ్యత సంస్క్రుతులకు సమాధి కడుతున్ననరాధముల్ని
యుగాల తరబడి క్షమిస్తున్నమానవజాతి
ఏ చరిత్రకు వారసులు వీరంతా !
మానవత్వం మరచిన ఈ మదాంధులను
ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? 

Friday, 13 July 2012

స్నేహం ఎక్కడనుండి ప్రారంభమవ్వాలి?(4)


          చిన్నప్పటి స్నేహంలో అంటే 10 వతరగతి వరకు స్నేహితుల మధ్య అనుబంధం గాఢంగా ఉంటుంది. వారి లోకం అంతా ఆటలు,చదువులు,బడి,ఉపాధ్యాయులు,విభిన్నమైన కళలు వంటి అంశాలతోసాగిపో తుంది.ఇక్కడ ఆటల్లో ఒకే అభిరుచి ఉన్నవాళ్ళు ఎక్కువ సన్నిహితంగా వుంటారు.చదువులో చర్చించు కుంటూ మరి కొంత మందితో స్నేహంగా వ్యవహరిస్తారు.రకరకాలయిన కళల పట్ల ఇష్టం ఉన్నవారు అందులో స్నేహాన్ని వెతుక్కుం టారు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోఅయితే ప్రభుత్వపాఠశాలలలో ఆటలు ఎక్కు వగా ఆడిపిస్తున్నారు..ప్రైవేటు పాఠశా లలు ఎక్కువశాతం మార్కులు,ర్యాంక్స్,talent test లతో IIT foundation  లతో మునిగిపోయి ఆటలు,కళలకు అసలు స్థానం లేకుండా చేసాయి.కొన్ని ప్రైవేటు పాఠశా లలు ఇందుకు మినహాయింపు .ఇలా బాల్యంలో అభిరుచులలోని సారూప్యత వల్ల ఒకరిద్దరితో ఏర్పడిన గాఢమైన స్నేహం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉన్నది.తరగతి మొత్తం తో స్నేహం చేయరు కాబట్టి వారు classmates గా మిగిలి పోతారు.ఈ వయసులో స్నేహితులతో ఆటలు,కంప్యూటర్ గేమ్స్ సినిమాలు,టి.వి చూడటంలో ఎక్కువగా మునిగిపోతే చదువు దెబ్బ తినే ప్రమాదముంది.తల్లిదండ్రులు ఈ స్నేహాలను గమనిస్తూ ఉండా లి.ఇక్కడే యుక్త వయస్సు ప్రారంభ మవుతుంది.కనుక శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మాన సిక ఉద్వేగాలు ఉంటాయి.వీటిని parents గమనించి వారితో స్నేహితు లుగా వ్యవహరిస్తూ వారి ని సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది.పిల్లలతో సంభాషిస్తూ వారి ఉపాధ్యాయులతో చర్చిస్తూ ఉంటె చెడు స్నేహాల వైపు దారితీయకుండా ఉంటారు.
           తల్లిదండ్రులు పిల్లలకు మొదటి స్నేహితులుగా ఉండాలి.తరువాత అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్లు అన్న చెల్లె ళ్ళు ,అక్కా తమ్ముళ్ళు పరస్పరం స్నేహితులుగా వ్యవహరిస్తే అంతకు మించిన స్నేహితులు బయట దొరకరు పర స్పర అభిప్రాయాలు పంచుకోవటం అనేది స్నేహానికి మొదటి పునాది.ఇది సొంత ఇంట్లోనుండే ప్రారంభమవ్వాలి పిల్ల ల మధ్య స్నేహాన్ని వృద్ది చేయాల్సిన బాధ్యత పెద్దలపై కూడా ఉంది ఒకరిని ముద్దు చేస్తూ అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ వేరొకరిని సరిగా పట్టించుకోక పోవటం ,ఆడపిల్లలకి ఒకరకం చదువు,అబ్బాయికి మరింత మంచి చదువు చెప్పించే సంస్కృతి ఇప్పుడు A.P లో బాగా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిని చదివిస్తూ ప్రైవేటు schools లోఅబ్బాయిలను చదివించటం ఎక్కువ యింది.పిల్లల్ని ఎప్పుడయితే సమానంగా చూస్తూ,వారితో చర్చిస్తూ స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తామో వారు కూడా తమలో తాము అంతే స్నేహంగా ఉంటారు.బయటి స్నేహితుల కంటే ఇంట్లో స్నేహితులు ఎంతో మంచిది కదా!ఆ విధంగా అన్నదమ్ములు అక్కా చెల్లెలు వ్యవహరించాలి.చిన్నప్పటి ఈ గాఢతే  పెద్ద యిన తర్వాత అనుబంధాలు,ఆప్యాయతలు చివరి వరకు ఉండటానికి దోహదం చేస్తుంది అన్న తమ్ము డికి స్నేహితుడైతే 95% అతని అభిప్రాయాలు పంచుకుంటాడు.ఇంకా ఏవైనా చెప్పలేనివి తన మిత్రులతో పంచుకుం టాడు.అలాగే అక్కచెల్లెళ్ళు కూడా !ఇలాంటి బంధాలు కుటుంబాల్లో అభివృద్ది కావాలి.
          కొంత మంది అభిమానాలు మనసులో ఉంచుకుంటారు.కాని వాటిని వ్యక్తం చేయలేరు.ప్రతి మనిషి ఎదుటి మనిషి నుండి స్నేహపూర్వకమైన పలకరింపును ఆశిస్తారు.భార్య అయినా పిల్లలయినా అదే కోరు కుంటారు.పనుల ఒత్తిడితో,బాధ్యతల బరువుతో తండ్రి పిల్లల పైన ,భార్య పైన చిరాకుతో కోపంతో విసుక్కుం టే వారి మనసులో క్రమేపి ఓ రకమైన వ్యతిరేక భావం ముద్ర పడి పోతుంది.కాబట్టి తండ్రి తన పిల్లల పట్ల స్నేహంగా ఉంటూ భార్యను మంచి స్నేహితురాలిగా పరిగణిస్తూ ఉండాలి.అలాగే తల్లి కూడా పిల్లల పట్ల తన భర్త పట్ల తన ఇష్టాన్ని,ప్రేమను వ్యక్త పరు స్తూ మంచి స్నేహితురాలిగా వ్యవహరించాలి.అప్పుడు ఆ కుటుం బం ఆనందంగా ఉంటుంది.పిల్లలు కాలేజిల నుండి మా ఇంట్లో ఇద్దరు స్నేహితులు(తల్లి దండ్రులు ) నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని త్వరగా ఇంటికి వస్తారు.ఈ స్నేహ సౌరభాలు పిల్లలు తమ మనస్సు లోనింపుకొని బయట ఉన్న తమ స్నేహితులతో వ్యవహరిస్తారు.అప్పుడు ఆ స్నేహాలు కల్మషం లేకుండా  అవాంఛనీయధోరణులకు దారితీయకుండా సక్రమ మార్గంలో ఉంటాయి.

Wednesday, 11 July 2012

ఓ స్వరం


ఓ స్వరం
నిశీధి నిద్రను చెరిపేస్తూ
ఓ గాత్రం
భావనా వీచికలను శ్రుతిచేస్తూ
స్వాప్నిక జగత్తులో
 ప్రేమైక లోకంలో
విహరిస్తూ
తపిస్తూ వున్న
నన్ను స్పర్శించింది
అలలా
సెలయేటి గలగలలా
కరిగిన మంచులా
చల్లగా
మెల్లగా
వీణను మీటిన నాదంలా
కోయిల గొంతున రాగంలా
నన్నే స్మరిస్తూ
నన్నే జపిస్తూ
నా హృదయ కోశం లో
ప్రతి  పొరను కదిలిస్తూ
గగనంలో ఎగురుతున్న
మేఘాలను పలకరిస్తూ
సున్నితంగా
సునిశితంగా
చిరుగాలి సవ్వడిలో
వెన్నెల చల్లదనంలో
మిళితమై చేరింది
వీనుల విందుగా    

Friday, 6 July 2012

వెన్నెల్లో జలకమాడినట్లు!


                                             నీలిరంగు పూసిన ఆకాశం కాన్వాసుపై
                                                  ధవళ వర్ణపు బొట్టు పెట్టినట్లు
                                             తల్లి చుట్టూ పాలకోసం తిరిగే పిల్లాడిలా
                                                 భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ
                                                 భువిపై రవి కల్పించిన రాతిరిని
                                                 వెలుగును నింపి కావలి కాస్తూ
                                                 పని ఒత్తిడిలో అలసి పవళించిన
                                             జనజీవన స్రవంతికి చల్లని కాంతినిస్తూ
                                                      చుక్కలన్నీ బిక్కుమంటూ
                                             మినుకుమినుకుమంటూ చూస్తుంటే
                                             వెండి మేఘాలను మరింత మెరిపిస్తూ
                                             పుడమి ఒడి పై పున్నమి చంద్రుడు
                                             పిండార బోసినట్లు వెన్నెలను ప్రసరిస్తుంటే
                                                  నా తనువులోని అణువణువూ
                                                  పరవశంతో  మైమరిచి పోతుంది
                                                  పౌర్ణమిలో ధ్యానం చేస్తుంటే
                                             నా శ్వాసలో మలయ పవనపు సందడి
                                             నా మేను వెన్నెల్లో జలకమాడిన అనుభూతి
                                             నా వీనుల్లో మురళీరవపు మంద్రనాదాలు
                                             మెల్ల మెల్లగా మనసంతా ఆలోచనారహిత స్థితి
                                             శూన్యం మదినిండా ఆవరించిన అలౌకిక స్థితి
                                                      అంతఃశ్చేతనలోని చైతన్యం
                                                పురి విప్పిన మయూరపు నాట్యమై
                                               వెన్నుపూసనుండి జరజరా పైకి ప్రాకి
                                               మెదడంతా ఆక్రమించిన విద్యుత్తేజమై
                                             శిరసునిండా విశ్వమంతా పరచుకున్నట్లు
                                                   ఓ సంపూర్ణ సహజానందం
                                                   దేహమంతా వ్యాపించింది

Sunday, 1 July 2012

యాంత్రిక మైన జీవితం


కష్ట పడితే ప్రభవించేది స్వేదం 
ఉద్విగ్నపు సంతోషానికి ఫలితం ఆనంద భాష్పం
గుండె గాయమైతే కన్నీటి ప్రవాహం
అనుభూతుల స్మరణలో కళ్ళల్లో చెమర్చే తడి
కష్టాలకు,ఆనందాలకు
అనుభూతులకు ,అనుబంధాలకు
స్పందించే మన శరీర ధర్మం
జీవితంలో ఇదేకదా నిత్యం జరిగేది
మనసుపై బాధల ఒత్తిడి పడనీకుండా
శోకం జ్ఞాపకాలుగా మిగలకుండా
 రక్షించే శరీర  యంత్రాంగం తీరు అర్థమైతే
మనిషికి మానసిక సమస్య లుండ వేమో!
శ్రమ లేని జీవితం
ఆనందం లేని జీవనం
నిస్సారమైన సంసారం
మదినిండా త్రుప్తి లేని గమనం
కాలంతో పరుగులు
బంధాలలో అంతులేని అంతరం
యాంత్రిక మైన యుగం లో
మనిషెంత కూరుకుపోతున్నాడో
ఇక స్పందనలకు సమయ మెక్కడ !