ఇల్లు అద్దెకు ఇచ్చినంత తేలికగా
అక్కడ గర్భాశయాలు దొరుకుతాయి
ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి
వంశాకురాలను కడుపులో పెంచి అప్పగించాలి
ప్రేమ వాత్సల్యాల పాత్ర లేనే లేదు
ఇంట్లో దాచి వుంచిన వస్తువు ఇచ్చినంత తేలికగా
బ్యాంకు లాకర్ లో బంగారం దాచినంత సులువుగా
అంగట్లో సరుకును కొనుక్కున్నంత సునాయాసంగా
అక్కడ వారసులను కొనుక్కుంటారు
తనువులోని ప్రతికణం లోని శక్తి నిస్తూ
రక్త మాంసాలను రంగరించి మరో జీవికి జన్మ నిస్తూ
మనః శరీరాలు అనుభవించే క్లేశాలను భరిస్తూ
కుటుంబ అవసరాల కోసం మగువ చేస్తున్నదీ త్యాగం
దేహాన్ని కర్మాగారంగా మార్చి
కడుపును యంత్రం గా చేసి
ఉచ్వాస నిశ్వాసాలను ఊపిరులుగా ఊది
ప్రాణవాయువును ఇంధనంగా అందిస్తూ
ప్రతి జీవక్రియకు ప్రయాసపడి భారము మోస్తూ
ప్రాణాన్ని ఫణంగా పెట్టి చేస్తున్న ఈ సృష్టి యజ్ఞం
ఆమె పాలిట జీవన్మరణ పోరాటం
పునర్జన్మ ఎత్తి మరో జీవికి జన్మనిచ్చిన ఆమెకు
కడుపు తీపి ప్రేమను పుట్టిస్తే
కరెన్సీ నోట్లు నిర్దాక్షిణ్యంగా దానిని తుంచి వేస్తే
కళ్ళ నీళ్ళు కుక్కు కొని ప్రేగు బంధం తెంచుకొని
సంతానాన్ని చేజేతులా అప్పగించి
కాసుల గల గలలను లెక్కబెట్టుకుంటూ
మాతృత్వానికి ధరను నిర్ణయించుకున్న
ఓ అభాగ్య అద్దె మాతృమూర్తి!
నీ ఆకలి కేకలకు అమ్మతనం చిన్నబోయింది
ఇలాటివి చాలా వింటున్నాం. సర్వ సాధారణం అయిపోయిన అద్దె అమ్మల అవసరాలు రక రకాలు.
ReplyDeleteమీరు వ్రాసిన విషయంలో ఆవేదన నిండుగా ఉంది. :(
మీ స్పందనకు ధన్యవాదాలు.గుజరాత్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ విషయాన్ని ఆంధ్రభూమి లో పెద్ద వ్యాసంగా వచ్చిన విషయానికి స్పందన ఈ కవిత.
Deleteచక్కని కవిత, అభినందనలు.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు
Deleteమన్నించాలి......
ReplyDeleteఅద్దె గర్భంలోని మాతృత్వం గురించి మాట్లాడే మనం
స్పెర్మ్ డోనర్స్ పితృత్వాన్ని గురించి ఎందుకని చర్చించం
స్పెర్మ్ ద్వార పితృత్వాన్ని సొమ్ము చేసుకుంటుంటే
మాతృత్వం ధర పలికితే తప్పేంటో చెప్పండి మరి!!!!
గుజరాత్ లో పెద్ద ఎత్తున ఇది జరుగుతుందని ఆంధ్రభూమి లో వచ్చిన కథనానికి అక్షర రూపం ఇది.మీరన్న కోణం లో కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఇంతకంటే ఆక్షేపనీయం.మానవ సంబంధాలు వ్యాపారమవుతుంటే ప్రతి అంశం ఇలాగే ఉంటుంది.ఈ కవితలో మగువలు పడే కష్టం,ఆమె పేదరికం ఆమెను అలా చేపించింది అన్న అంశాలను అందుకే ప్రస్తావించాను.మీరు ప్రస్తావించిన అంశాన్ని అంతకంటే తీవ్రంగా గర్హించాలి.వీటికి సరైన చట్టాలు రావాలి.మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteఊహించని అంశాలు..ఎలా స్పందించాలో అర్ధమయ్యేలోపలే ఎన్నో అనర్ధాలు జరిగిపోతున్నాయి. కవిత వేదనాభరితంగా ఉంది.
ReplyDeleteసమాజం లో ఎన్నో సంఘటనలు ,సమస్యలు .మానవ విలువలన్నీ ఏదో ఒక కారణంతో ఒక్కొక్కటి కనుమరుగవుతుంటే వాటిని కనీసం గుర్తించాలనే తపన.మీకు ధన్య వాదాలండి.
Deleteగుజరాత్ లో ఎక్కువమంది ఇలా చేస్తున్నారని అసలు తెలీదు.
ReplyDeleteఅది కర్రెక్టా కాదా అని చెప్పలేను కాని,డబ్బు కోసం తప్పట్లేదు కొంత మందికి అంతే!
అవసరాల కోసం స్త్రీ అయినా ,పురుషుడయినా ఇలా మనిషి పుట్టుకను సైతం వ్యాపారం చేయటం మొదలు పెడితే దీని ఫలితాలు చాలా దారుణం గా మారబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో స్త్రీ ఆరోగ్యం ప్రధాన అంశం.ఒక్కోసారి ఆమెకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉండవచ్చు.వీటన్నింటికి బదులుగా ఎంతోమంది అనాధ పిల్లలున్నారు వారిని దత్తత తీసుకోవచ్చు.మీకు ధన్యవాదాలు.
Deleteకనలేని వారికి ఓ బిడ్డని పెంచే అపూర్వ అవకాశం ఇస్తున్నారు, తామూ ఓ ఆర్థికంగా బాగుపడుతున్నారు. ఒకొరి అవసరాలు మరొకరు తీర్చుకునే చట్టబద్ధమైన వ్యాపారం. పిల్లలకు సరైన జీవితాన్ని ఇవ్వలేని వాళ్ళు కేవలం మాతృత్వ అనుభూతి కోసం కని పడేయడం కన్నా ఇది చాలా వుత్తమం.
ReplyDeleteదీనికి చట్టబద్ధత వున్నట్లు ఎక్కడా ఆవ్యాసంలో లేదు.దీని ఫలితాలు చాలా కోణాల్లో నష్టం కలుగజేస్తున్నాయి.అంతగా పిల్లలు కావాలంటే ఎంతో మంది అనాధ పిల్లలున్నారుకదా!మీకు ధన్యవాదాలు.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteశంకర్ గారూ,
ReplyDelete"science with the human face" ఇది సాధ్యమేనా. సైన్సు టెక్నాలజీ కలిసి భూమిని మానవ నివాస యోగ్యం కాకుండా చేస్తున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇదొక పెద్ద ఇండస్ట్రీ అయ్యింది. అద్దె గర్భంలోని మాతృత్వం అయినా, స్పెర్మ్ దోనేటింగ్ అయినా సైన్సు టెక్నాలజీ యొక్క ఫలితాలే. మనం అద్దె తల్లుల గురించే మాట్లాడుకుంటున్నాం, అయితే DNA మరియు Cloning టెక్నాలజీ తల్లి తండ్రులు కావాలనుకుంటే తమకు పుట్టబోయే పిల్లవాడు ఏ సల్మాన్ ఖాన్ లాగానో లేక జాన్ అబ్రహాం లాగానో కనొచ్చు. ఈ ప్రక్రియ జంతువులలో చేసి చూపించిన విషయం మనం చూసాం. పుట్టబోయే శిశువు ఆడా మగా అని డాక్టర్ల సహాయంతో తెలుసుకోగలుగుతున్నాం. కానీ సైన్సు సహాయంతో చాలా చిన్న urine test తో తెలుసుకోగలిగే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయట. సైన్సు అభివృద్ది ఎవరూ ఆపలేనిది. కానీ దీని ఫలాలు సక్రమంగా అందాలన్నా, వినాశకారి కాకుండా ఉండాలన్నా చట్టం దాని అమలు చాలా ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ఉపయోగించుకోవడంలో మనిషి నీతి తప్పకుండా వుండాలి. "science with the human face and morale" అంటే బావుంటుందేమో.
బాగా చెప్పారు. మీతో ఏకీభవిస్తున్నాను.
Deleteసైన్స్ తనపని తాను చేసుకుంటూ పోతుంది, దాన్ని ఎలా, ఎంతవరకూ వాడుకోవాలో సమాజం నిర్ణయించుకుంటుంది, అవసరమైతే చట్టాల ద్వారా నియత్రించుకుంటుంది.
మీరన్నట్లు సైన్సు అభివృద్ధిని ఆహ్వానిం చాల్సిందే !అదే సమయం లో అది మనిషి అదుపులో ఉండాలి.మానవుల పై క్లోనింగ్ కు అనుమతి ఇవ్వలేదు.అమ్మాయని తెలిసి ఎంతమంది గర్భస్రావం చేసుకోవట్లేదు.దీని ద్వారా స్త్రీ,పురుష నిష్పత్తి తగ్గిపోయి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది.మీకు ధన్యవాదాలు.
Deleteవిజ్ఞానం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు.
ReplyDeleteకొంత మంచి...కొంత చెడు...అంతా యూస్ చేసే వాళ్ళ
చేతిలో ఉంది
మీకు స్వాగతం, ధన్యవాదాలు.కత్తిని ఎలాగయినా ఉపయోగించుకోవచ్చు కదా! అలగే ఇదీనూ
Deleteఏమైనా ప్రకృతికి విరుధ్ధంగా చేసే ఏపనిలోనైన పరిణామాలు వైపరీత్యంగానే ఉంటాయని నా అభిప్రాయం.
ReplyDeleteస్వాగతము మీకు.మీరు కవితలోని భావాన్ని బాగా అర్థం చేసుకున్నారు.మీకు ధన్యవాదాలు.
ReplyDeleteశ్రీ రవిశేఖర్ గారికి, నమస్కారములు.
ReplyDeleteచక్కటి భావాన్ని తెలియచేశారు. మీ ఇతర కవితలనుకూడా చదివాను. అన్నీ బాగున్నాయి. ఇతర వర్గాలు :విద్య; వృత్తి; ఆరోగ్యం మొదలైనవాటినికూడా చదివాను. అవి ఆలోచింప చేసేవిగా, వివరణాత్మకంగా వున్నాయి. ముఖ్యంగా మీ రచనా శైలి బాగుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
పెద్ద వారు మీకు మేము చెప్పాలి నమస్కారాలు.మీ స్పందనకు ధన్యవాదాలు.నా కవితలు ఇతర రచనలు ఓపికగా చదివినందుకు మీ ప్రశంసకు కృతజ్ఞతలు.
Delete