Friday, 13 April 2012

కవితకు అందని నీ ఆకృతి!

                                               కుసుమ కోమల హృదయిని నీకు నీరాజనం 
                                               పారాణి పూసిన నీ పాదాలు కవితామయం 
                                               నీ  మెడ లో జాలువారిన ముత్యాలసరం
                                               సచ్చీలత సంగమించిన సునంద కావ్యం 
                                                                 షట్సూత్రాల సారం మదించిన విరించి 
                                                                 కాలూనిన భూమిలో పలుకును విపంచి 
                                                                 గాలిలో ప్లవిస్తూ సాగిన నీ  గాత్రం 
                                                                 నా వీనులను చేరినది ఆ స్తోత్రం 
                                                ప్రభాతాన అరవిరిసిన మందారం 
                                                నీ  జడలోనే   దానికి సింగారం 
                                                చిద్విలాసం  నీ దరహాసం 
                                                ఆల్చిప్పలు నీ  నేత్రద్వయం 
                                                                 కవితకు అందని నీ ఆకృతి 
                                                                 మైమరచింది ఈ ప్రకృతి  
                                                                 

Thursday, 12 April 2012

చిన్నారి పాపలు


చిన్నారి పాపల   చిలిపి నవ్వులు 
మురిపించే చిలిపి చేష్టలు 
స్వచ్చమయిన  వారి మోము 
వారిని వీడి మేముండ లేము 
     బోసి మాటల మా బుజ్జి రూపాలు 
     మా పాలిట  మరువ లేని కల్ప వృక్షాలు 
     సొట్టలు పడే మా పాప బుగ్గలు 
     చూడాలనిపించే చిన్ని నడకలు 
అలరారే ఆనందాల వలయాలు 
కురిపిస్తారు చిరునవ్వుల జల్లులు 
పాల వెన్నల లాంటి పాప పళ్ళు 
గంతులేసే లేడి కూనల్లాంటి పాదాలు 
     చక్రాల్లాంటి అందమయిన కళ్ళు 
     మాకు కలకాలం వారి తీపి గుర్తులు 
     కమ్మని లాలి  పాటలకు వారి సంతోషాలు 
     కల్మషం లేని బంగారు హృదయాలు 
     మా భవిష్యత్ ప్రతి రూపాలు

Tuesday, 10 April 2012

చెడ్డ వ్యసనాలు మానుకోవటం ఎలా?2


            మంచి అలవాట్లు ఏవో చెప్పుకునే ముందు చెడ్డ అలవాట్ల గురించి ఆలోచిద్దాము.ఇంతకుముందు వ్యాసం లో చెప్పుకున్నట్లు మొట్టమొదటగా ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవన్నీ చెడ్డఅలవాట్లే! వాటిలో పొగాకు ఉత్పత్తులన్నీ హాని కలిగించేవే !బీడీలు,సిగరెట్లు ,చుట్టలు,గుట్కా,ఇలా!ఇవి ఎన్నో రకాల క్యాన్సర్ లకు కారణమవుతున్నాయి.దీని గురించి అవగాహన వున్నవారు వారు సయితం వ్యసనంలో నుండి బయటకురాలేకపోతున్నారు.ఉదాహరణకు డాక్టర్స్ కూడా!కొన్ని దేశాల్లో పొగాకు పంటను బాగా తగ్గించి వేస్తున్నారు.మన(భారత్ ) దేశం లో కూడా వీటిని నిరు త్సాహపరచటానికి  పన్నులు  పెంచుతున్నారు.
       అలాగే మద్యం విశ్వవ్యాపితమయిపోయింది.ఆల్కాహాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణమవుతుంది. సామా జిక  హింసకు దారి తీస్తుంది .వాహన ప్రమాదాలు,గృహహింస,హత్యలకు,మానభంగాలకు మద్యం ప్రధాన కారణ మవుతుంది.ఇక డ్రగ్స్ తీసుకోవటం వ్యసనాలకు పరాకాష్ట.మనిషిని ఇవి నిర్వీర్యం చేస్తున్నాయి.మనిషి  పూర్తిగా పతనమయ్యాడు అనటానికి ఇది నిదర్శనం.పెద్ద కుటుంబాల వారి పిల్లలు,యూనివర్సిటి ,కాలేజీ విద్యార్థులు మహమ్మారి బారిన పడుతున్నారు.మనిషి ప్రతి రోజు పొడులు,ఇంజక్షన్స్తీసుకోక పోతే ఎంతో బాధను, వేదనను అనుభవిస్తారు.ఇవి తీసుకొని విపరీతమయిన హింస, అత్యాచారాలు చేస్తున్నారు.
           ఇక పేకాట(ప్లేయింగ్ కార్డ్స్ ),గుర్రప్పందాలు(రేసులు ) ,కాసినోస్,క్లబ్స్, పబ్స్ వీటిల్లో మనిషి పూర్తిగా డబ్బు పోగొట్టుకొని సంసారాలు నాశనం చేసుకొంటున్నాడు.అలాగే షేర్లు కూడా!తన సంపాదనలో పది శాతం అయితే పర్లేదు కాని పెద్ద ఎత్తున వీటిల్లో పెట్టుబడి పెట్టటం కూడా ప్రపంచం లో సంక్షోబానికి కారణ మయ్యాయి.దీర్గకాలిక మదుపుకయితే పర్లేదు, వార్రెన్ బఫేట్ లాగా! రోజు చేసే ట్రేడింగ్,ఫీచర్స్,ఇవన్నీ మనిషిని నిలువునా దగా చేసేవే! మనిషి లోని అత్యాశకు ఇవి ప్రతిబింబాలు.వీటిని ఆర్ధిక వ్యసనాలు గా చెప్పవచ్చు.
        ఇక పోతే విపరీతంగా కూల్ డ్రింక్స్ త్రాగటం ,కూల్ డ్రింక్స్ లో ఏమేమి ఉంటాయో డిల్లి కి చెందిన ఓ ఆరోగ్య సంస్థ రెండు సంవత్సరాల క్రింద ఇచ్చిన నివేదిక  భారత్ లో ఓ  సంచలనం.వాటిల్లో పురుగుమందుల అవశేషాలు కని పిమ్చాయని చెప్పింది రైతులు  వీటిని పొలాలకు కొడితే పురుగులు చనిపోయాయి.అమెరికాలో మంచినీరు త్రాగకుండా ఎక్కువగా డ్రింక్స్ త్రాగుతున్నారని ప్రభుత్వం మంచినీరు త్రాగమని చెప్పాల్సివస్తుంది.ప్రతిరోజు ఒక 250ml  త్రాగేవారికి  చాలా  ఆరోగ్య  సమస్యలు  వస్తాయని తాజా వార్తలు.ఇక వీటిని ఫ్యామిలీ డ్రింక్స్ లాగా ఫ్రిజ్ లో పెట్టుకొని త్రాగుతుంటారు.
        కాఫీ ,టీ లను చివరిగా ఎందుకు చెబుతున్నానంటే 1 లేదా 2  కప్పులయితే పర్లేదు! కానీ చాలా మంది ఇంత కంటే ఎక్కువగా త్రాగేవారే!ప్రకృతి  వైద్యులు ఇది కూడా ఒప్పుకోరు.ఇందులో వుండే కెఫీన్ మెదడు ఫై ప్రభావం చూపించి రుచిని మరల కోరుకోవటం వలన ఎక్కువ సార్లు త్రాగుతారు.దీని వలన ఆకలి మందగించటం అసరిగా అరగకపోవటం, అజీర్తికి దారి తీ స్తుంది .ఏది ఏమి అయినా  అలవాటు వ్యసనంగా మారకుండా చూసుకోవాలి.
         మరి ఫైన చెప్పిన వ్యసనాలు  అన్ని చెడ్డ వ్యసనాలే.మరి మంచి వ్యసనాలు ఉంటాయా! తరువాత చెబుతాను . చెడ్డ వ్యసనాలు వున్నా వారు కూడా అందులోంచి బయట పడాలని చూస్తుంటారు.కాని మిత్రులు ,వీకెండ్ పార్టీస్,సమావేశాలు ,ఆఫీసులలో కొలీగ్స్  కారణంగా  వీటిని వాడలేని పరిస్థితికి వస్తారు.ఆరోగ్యం డబ్బు ఇలా ఎన్నో కోల్పోవలసివస్తుంది. మొదట వీరు చేయాల్సింది,పొగాకు ఉత్పత్తులు ,మద్యం ,  డ్రగ్స్   తీసుకునేవారు వాటివల్ల
 నష్టాలని ఇంటర్నెట్ లో గాని డాక్టర్స్ ద్వారా గాని,స్పష్టం గా తెలుసుకోవాలి.ఎప్పుడయితే  నష్టాలు అర్థమవుతా యో వారిలో మానసిక పరివర్తన కలగవచ్చు.ప్రతి వ్యక్తి తన మనసు ఈ విధంగా ఎందుకు అలవాటు చేసుకుందో విశ్లే షించుకోవాలి.తనఫై  ఆధార పడ్డ కుటుంబ సభ్యుల ముఖాలను అవి తీసుకునే టపుడు గుర్తుకు తెచ్చుకోవాలి .వారి అమాయక  మయిన  ముఖాల్లోని స్వచ్చత ,వారు మీపట్ల చూపించే ప్రేమ,ఇన్నింటిని మీ వ్యసనం అదిగమి స్తుంటే  వారి ప్రేమకు మీరు విలువ ఇవ్వనట్లే!కుటుంబ పెద్ద చెడు వ్యసనాలకు లోనయి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే ఆ కుటుంబ సభ్యులు మౌనం గా రోదిస్తుంటారు.మద్యం వలన కొన్ని కోట్ల కుటుంబాలు,ఆర్థికం గా ఆరోగ్య పరంగా చితికిపోతున్నాయి.గృహ హింస తీవ్రంగా ప్రబలి పోతుంది.స్వచ్చ మయిన  అమాయక మయిన తన బిడ్డల  ముఖం ఫై చిరునవ్వు చెదరకుండా ఉండాలంటే ఫై వ్యసనాలు మానాల్సిందే.అలా పరివర్తన కొంతమందికి వస్తుంది.
                 అప్పటికి మారనివారు ఆరోగ్యం దెబ్బతింటే ఎలావుంటుందో ఒక్క సారి ఊహించుకోవాలి.అలా ఆరోగ్యం దెబ్బతిన్న వారిని కలుసుకొని వారి కష్టాలు తెలుసుకోవాలి.అప్పుడు మరికొంత మందికి మార్పు రావచ్చు.
ఇక ఈ వ్యసనాలు పరాకాష్టకు చేరిన వారికి సహాయ కేంద్రాలు  వున్నాయి .అక్కడ చక్కటి సలహాలు,సూచనలు కొంత చికిత్స తో ఈ వ్యసనాలు మాన్పిస్తారు.ఈ విధం గా మనిషి తలుచుకుంటే ఖచ్చితంగా వాటికి బానిస కాకుండా వుండగలడు.ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వారి ఫై ద్వేషం పెంచుకోకుండా ప్రేమతో వారిని సన్మార్గం లోకి తేవచ్చు.ఈ వ్యాసాన్ని దయచేసి ఈ అలవాట్లు ఉన్నవారితో చదివించగలరు.ఆ రకం గా వారికి మీరు సహాయం చేసినట్లే! 
          తరువాతి వ్యాసంలో మంచి అలవాట్లు చేసుకోవటం ఎలా ?అన్న విషయాలు ,అవి ఏమిటి వివరిస్తాను. 


Sunday, 8 April 2012

మన వ్యసనాలు మానుకోవటం ఎలా?1


            వ్యసనం గురించి తెలుసుకునే ముందు అలవాటు అంటే ఏంటో తెలుసుకోవాలి.మనం రోజు క్రమం తప్ప కుండా చేసేవాటిని అలవాటు అనవచ్చు.ఉదాహరణకు కాలినడక,మంచినీళ్ళు త్రాగటం,వ్యాయామం చెయ్యటం సంగీతం వినడం,పుస్తకాలు చదవటం,యోగా,ధ్యానం చెయ్యటం లాంటివి.అలాగే కొంతమంది రోజు సిగ రెట్లు ,బీడీ లు,చుట్టలు,మద్యం త్రాగుతారు.కొంతమంది గుట్కాలు,మాదక ద్రవ్యాలు వాడతారు.ఫై అలవాట్లను వదలకుండా ప్రతి రోజు చేస్తూ వుంటారు.
           మరి మీకు పాటికే అర్థమయి వుంటుంది.ఏవి మంచి అలవాట్లో?ఏవి చెడు అలవాట్లో?ఇక్కడ మంచి, చెడు అంటే అర్థం ఏమిటి?దేనికి మంచి! అలవాట్ల వలన మనకు ఆరోగ్యపరంగా,మానసికంగా, కుటుంబపరంగా సామాజి కంగా మేలు జరిగితే మంచి అలవాట్ల క్రింద లెక్క.అలాగే కీడు జరిగితే చెడు అలవాట్ల క్రింద లెక్క.
        కొంతమంది ఫై అలవాట్లను వదలలేని పరిస్థితికి చేరుకుంటారు.ఉదాహరణకు వ్యాయామం చెయ్యకుంటే ఏదో లాగా వుండటం,యోగా చెయ్యకుండా వుండలేకపోవటం,పుస్తకాలు విడవకుండా చదవటం అప్పుడు వాటిని మంచి వ్యసనాలు అంటారు. అలవాటును మనం వదలలేని స్థితికి చేరుకున్నా మన్నమాట.
              మరికొంతమంది కాఫీ ,టీ లు ప్రతి రోజు 4 లేక ,5 సార్లు (ఇంకా ఎక్కువ సార్లు త్రాగేవారు చాలా మంది వున్నారు)త్రాగకుండా వుండలేకపోవటం,సిగరెట్లు రోజులేక,3 packs  త్రాగకుండా ఉండలేక పోవటం,ఇక మద్యం సేవించకుండా వుండలేకపోవటం ఇవి చెడ్డ వ్యసనాలుగా మనం పరిగణించవచ్చు అంటే అలవాటు యొక్క తారాస్థా యి వ్యసనం అన్నమాట .
           మరి అలవాట్లు ఎందుకు చేసుకోవాలి?ఎందుకు వదులుకోవాలి?అవి వ్యసనాలుగా మారేంత స్థితి ఎందు కు వచ్చింది ?వీటిని పరిశీలిద్దామా!
             ఏదయినా మనం క్రమం తప్పకుండా ఒక పనిచేస్తువున్నామంటే అందులో ఏదో మనకు త్రుప్తి ,సుఖం ,సంతోషం,ఆనందం దొరుకుతున్నట్లు భావిస్తాం . త్రుప్తి మరల మరల మనసు కోరుతున్నదన్నమాట!ఇక మన సు కోరినదే తడవుగా మన ఇంద్రియాలు వాటిని తీరుస్తున్నాయన్నమాట !ఉదా హరణ కు కాఫీ,టీ లు త్రాగిన తరు వాత ఎలా వుంటుంది.మనసులో ఎక్కడో త్రుప్తి!మరికొంతమందికి కాఫీ ,టీ లు పడనిదే ప్రక్రుతిపిలుపులు కూడా రావు.అలా నిబధ్ధమయి పోయి వుంటారు.అంటే అది వ్యసనం స్థాయికి చేరిందన్నమాట!అదేవిధంగా బీడిలు ,సిగ రెట్లు,చుట్టలు(విదేశాల్లో సిగార్స్ )త్రాగటం !ఎంతో ఇష్టం గా కాల్చి పారేస్తుంటారు .ఎక్కువగా ఒత్తిడి తో కూడిన పను లు  చేసేవారు,వీటిని ఖచ్చితంగా కాలుస్తారు.ఇక మద్యం త్రాగటం social status నేడు.ఒకప్పుడు  త్రాగుతారా!అని ఆశ్చర్యపోయేవారు.ప్రస్తుతం త్రాగరా!అని అంటున్నారు!ఇలా అలవాట్లు వ్యసనం స్థాయికి చేరుకొని మనుషుల ఆరోగ్యం ఫై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.
         తరువాతి వ్యాసం లో మంచి అలవాట్లను చేసుకోవటం ఎలా?చెడ్డ అలవాట్లను మానుకోవటం ఎలా?గురించి తెలియ చేస్తాను.

స్వప్నం

                                          ఎదలోయలలోని భావవాహిని
                                                     మదిపొరలను తట్టి లేపితే అది స్వప్నం
                                          మనసులోని పాటకు రాగం కట్టి
                                                      తాళం వేసి ఆలపిస్తుంది.
                                          నీ ప్రత్యక్ష వీక్షనలకు రంగులు అద్ది
                                                      నిను మరోలోకానికి తీసుకు వెడుతుంది
                                          నీ అంతఃర్మధనానికి రూపమిచ్చి
                                                      నీకు తెలియని నిన్ను చూపిస్తుంది.
                                          నీ బలహీనతలను ఆవిష్కరిస్తుంది.
                                          ఏవో అస్పష్ట సంకేతాలనిస్తుంది
                                          మనసు పొరల్లోని భావాల రాపిడికి
                                                      స్వప్నం ప్రతిరూపం
                                          ఆ స్వాప్నిక జగత్తు హిమవన్నగం
                                          పాతాల లోతుకు జారిన అనుభవం
                                                       నీలో నీవే కల

Friday, 6 April 2012

బాలల బాంధవి

ఓ స్వరం
మూగగా రోదిస్తున్న కోట్లాది చిన్నారుల గొంతయింది
బాదల్ని భరిస్తున్న బాల కార్మికుల హృదయ స్పందనయింది
                తొలి అడుగు వేసేటపుడు ఎన్నో అడ్డంకులు
                 మలి అడుగులో ఎన్నో కళ్ళల్లో మెరుపులు
కాయలు కట్టిన చేతులు
బరువులతో వంగిన భుజాలు
పని అలసటలో దైన్యం  నిండిన  కళ్ళు
విప్పారి చూసిన  క్షణం
            తమ నేస్తాన్ని చూసుకొని
             వారి మనసు ఆకాశ మంత య్యింది
వెట్టిలోనుంచి,నిర్భందాలనుంచి
గనుల్లోనుంచి ,పరిశ్రమలనుంచి
పొలాల్లోంచి,అన్ని బంధనాల్లోంచి
పరుగు పరుగున పలకా బలపం
పట్టుకున్న క్షణాలు వారికో అద్భుతం
                స్వేచ్చ లోని  మాధుర్యమేమిటో
                ఆత్మీయత అంటే ఏమిటో
                అక్షరాల్లో వున్న ఆకర్షణ ఏమిటో
                చదువు లోని ఆనంద మేమిటో
                అమ్మ ప్రేమ లోని కమ్మదన మేమిటో
                చవి చూపించిన శాంతమ్మ
ఒడుల్లాంటి బడులలో బంగారు భవిష్యత్తు
కోసం  కలలు  కంటున్న  లక్షల మంది  చిన్నారుల
 కనురెప్పల వెనుక కమ్మని కల అయ్యింది
                బడి బయట వున్న   ప్రతి పిల్లాడు బాలకార్మికుడని  
                పిల్లలు వుండాల్సింది బడులలోనే , పనుల్లో కాదని
బాల కార్మికత్వానికి కారణం పేదరికం కాదని
సమాజ అంగీకారమే లేత చేతులకు సంకెళ్ళని
 ప్రభుత్వ విధానాలను సమూలంగా మార్చిన సిద్ధాంతం
రామన్ మెగసెసే అవార్డ్ అయింది ఆమె సొంతం
 అందుకే అయింది ఆమె బాలల బాంధవి
                                           ప్రధమ బాలల హక్కుల చైర్ పర్సన్ గా రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత dr.శాంతా సిన్హా నియమించ  బడిన సందర్భముగా వ్రాసి సమర్పించ బడ్డ కవిత  . 

Monday, 2 April 2012

బాధించే జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?3


            ఇక చివరగా మనసంటే ఏమిటి?మనమేగా !రెండు ఒకటేగా !అంటే   తనకు తాను ఓదార్చుకొని తనకు కలిగిన జ్ఞాపకాన్ని తనే మరచిపోవాలి.దానికి మన మనసు తో కొన్ని ప్రక్రియలు నిర్వహించాలి .జ్ఞాపకాన్ని వదలటానికి దాన్ని పట్టుకునేదేది?బాధఅదిఎక్కడ కలిగింది మన మనుకుకుంటాము. హృదయానికి గాయం అయింది !మన స్పందనలు,మన సున్నితత్వం హృదయానికి  సంబంధించిన వే, కాని విచక్షణ బుద్ధికి సంబందించినది హృదయపు  బాధకూడా మనసు బాధకూడా మనసు  సరిచేయాల్సిందే! అంతవరకు o.k కదా!ఇది అంతా ఆలోచించండి బాగా.నాకు లానే మీరు ఆలోచించాలని లేదు.నేను ఒక కోణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.మీకు మరిన్ని కొత్త ఆలోచనలు రావచ్చు.
                   పరిష్కారం  దిశగా అడుగులు  వేద్దాం.ప్రతి   మనిషి తనకు తాను పూర్తిగా విభిన్నం  మన ఆలోచనలుఅభిప్రాయాలు   అభిరుచులు ప్రవర్తన మనకే సొంతం.తల్లి,తండ్రి ,భార్య ,భర్త పిల్లలు ,స్నేహితులు బంధువులు ఎవ్వరు నీవు కాదు..ఇంకా   కఠినంగా  చెప్పాలంటే నీవు ప్రేమించినవిఇష్టపడ్డవి, పెంచుకున్నవిపంచుకున్నవి ప్రతిది  కూడా   నీలాగే    వేరేవారికి వుండాలని  లేదు కాలం వాటినన్నిటిని  తుంచి వేస్తూ ముందుకు  పోతుంటుంది .నీవు  పెంచుకున్నంత మమకారం  వారికి నీ  ఫై  వుండదు . ప్రేమికులు  వైవాహిక   జీవితం  లో  పెళ్లికి  ముందు సాంద్రతను  అనుభవించ గలుగు తున్నారా  !మనం పొందిన అనుబంధాల్లోని గాఢతలు  ప్రస్థుతం    సంబంధాల్లో లేవు .కాని గతం  మన ఊహల్లో వుంటుంది   .గతం  మన జీవితం  లో  నిజం గా వర్తమానం  అయ్యుంటె  ఖచ్చితంగా   వర్తమానానికి  మరో  గతం  తోడవుతుంది    ..కఠినంగా  చెప్పినా వాస్తవ  మిదే  !ఇకపోతే మన హ్రుదయ సమ్మతి  లేకుండా   ఒక్కరు, ఒక్క విషయం మనల్ని బాధించలేవు  గాయం కలిగించిన వ్యక్తులు  పశ్చాత్తాపపడి   వుండవచ్చు .కొంతమంది  మీకు విచారం వ్యక్తం  చేసి వుండవచ్చు . మరి కొంత  మంది మీకు తెలియకుండానే   మిమ్మల్ని తమ  మనసులోనే  క్షమాపణలు  కోరివుండ   వచ్చు.అంటే  వారు మారి ఉండవచ్చు .సన్నిహితులు  ఎలాంటి  మార్పుకు లోనైతే  మనం  గాయాలను మరచి పోవటానికి   కొద్దిగా క్షమ వుంటె  చాలు.స్నేహితులు   అలా దూరమైతే    మరల కలవక పోయినా  మనసులోనే  వారిని క్షమించేసుకొని  బాధనుండి విముక్తి  చెందవచ్చు.ప్రతి  జ్ఞాపకాన్ని మన మనసు పొరల పై  నుండి  శుభ్రం  చేసుకునేందుకు   క్షమ ఒక ఆయుధం.
           ఇంకొకటి  కలవ లేనంతగా   దెబ్బతిన్న  సంబంధాలు పునరుధ్ధరించ లేక  పోయినా   దెబ్బ మనసు నుండి  తుడిచి    వేయటానికి  మరో  ఆయుధం వుంది గమనించండి .మన జీవన ప్రయాణం  లో  అందరు మనకు పరిచయం అయిన వారే !(బంధువులతో   సహా).కాని చివరివరకు  మనకు మనమే  తోడుగా   వుంటాము .ఇది రైలు  ప్రయాణం  ఎక్కుతుంటారు ,.దిగుతుంటారు .మరణం  వరకు మనకు తోడు   మన మనసు మాత్రమే  వుంటుంది .ఇతరులకోసం ,వేరెవరికోసమో ,ఏవో సంఘటనల  నుంచో   దాన్ని మనం వారి ఆలోచనలతో  ,బాధలతో   నింపి మన మనసును వారికి, బాధలకు అప్పజెప్పేబదులు మన మనసును మన స్వాధీనం లో  వుంచుకుందాము .దాన్ని శుభ్రం  చేసుకుంటే    అద్దం పై  మనకు మనం మరింత  కొత్తగా   కని పిస్తాము .మన ముఖం లో  మరింత  వెలుగు వస్తుంది .ఇది ఎవరికోసమో  కాదు,పూర్తిగా  మన కోసమే  .అప్పుడు   మనస్సు చిత్రం పై  వర్తమానం లో   ని ప్రతిక్షణం    ఆనంద  గీతాన్ని  లిఖించుకుందాము.మన విషాదాలకు మరొకరు కారణం  కాకూడదు .అలాగే   మనం మరొకరి విషాదాలకు మూలం  కాకూడదు .మన ఆనందం మన చేతుల్లోనే   వుంది.అప్పుడు మాత్రమే   మనం  ఇతరులకి  ఆనందాన్ని ఇవ్వగలం.అప్పుడు  చూడండి !మన  జీవితాల్లో   ప్రతిక్షనం    సజీవ నిత్య  చైతన్యం  తాండవిస్తుంది .అది అవతలి వారికి కూదా   అధ్భుతం  లా తోస్తుంది .వారిలో  మార్పు వస్తుంది .వెంటనే  రాకున్న క్రమేపి  వస్తుంది .కాని మనం మాత్రం  వర్తమానాన్ని  క్షణక్షణం  మనకోసం  ఆనందంగా   గడపవచ్చు .ఆలోచించండి .