Tuesday, 2 October 2012

మహాత్మా గాంధి -సత్యం,అహింస



              ఐక్యరాజ్య సమితి మహాత్మాగాంధీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందటానికి ఎంతో రక్తపాతాన్ని చవిచూసాయి.మన దేశంలో మాత్రమే మహాత్మా గాంధి నాయకత్వంలో అహింసాయుతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించగలిగాము.సత్యం,అహింసలు ఆయుధాలుగా గాంధిజీ సాగించిన ఈ పోరాటం ప్రపంచానికి ఆదర్శం.
             గాంధిజీ తన ఆత్మ కథ చివరిలో సత్యం,అహింస  గురించి ఈ విధంగా వివరిస్తారు.ఆయన మాటల్లోనే
             "సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో,ఏ రూపంలో చూచానో ఆ రూపంలో  దాని వివరించడానికి సదా ప్రయ త్నించాను.ఈ ప్రయోగాల వలన  పాఠకుల మనసులో సత్యము,అహింస పై అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం.సత్యం కంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు .సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం.నా అహింస సత్యమయమైనా అది ఇంకా అపూర్ణమే,అపరిపక్వమే.వేలాది సూర్యుల్నిప్రోగు చేసినా,సత్యమనే సూర్యున్ని చూడలేము.అంత తీక్షణ మైనది సత్యం.అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శిం చవచ్చు.అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యం కాదు.ఇప్పటి వరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల ఆధారంగా  చేసుకొని ఈ మాట చెబుతున్నాను.ఇట్టి వ్యాప్తి చెందినా సత్యనారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవి ని ప్రతి ప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం."
   మహాత్మా గాంధీ ప్రవచించిన ఈ సత్యము,అహింస ల గురించి ఆలోచించే ఓపిక,తీరిక ప్రస్తుతం మనకున్నాయా !అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ప్రపంచమంతా రాజ్యాల మధ్య,జాతుల మధ్య సమూహాల మధ్య వ్యక్తు ల మధ్య హింస రాజ్యమేలుతుంది.దేశాల మధ్య ఆధిపత్య పోరాటాలు యుద్ధాలుగా పరిణమిస్తు మానవ జాతిని అంతులేని హింసకు గురి చేసాయి.మొదటి రెండవ  ప్రపంచ యుద్దాల వలన  కొన్ని కోట్ల మంది మరణించినా కూడా ఇంకా దేశాలు యుద్దాలు చేస్తూ ఉన్నాయి.అలాగే వ్యక్తులు  చేసే హింస కూడా తక్కువేమీ కాదు.హింస ద్వారా రాజ్యాలు అయినా వ్యక్తులయినా చివరకు సాధించేది ఏమీ ఉండదు.
       అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నఈ సందర్భంలో మానవ జాతి తనకు తాను చేసుకునే హింస నుండి కూడా బయట పడాలి.మనుషుల ప్రాణాలను అలవోకగా తీసే ఈ సమాజం లో ఇక వన్య ప్రాణులను ప్రకృతిని మానవుడు నాశనం చేయటంలో ఆశ్చర్యం లేదు.విజ్ఞానం పెరుగుతుందని మనిషి అనుకుంటూ అజ్ఞానంతో ప్రవర్తి స్తున్నాడు.తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రకృతిని ఏమి ప్రేమించగలడు ఒకరికి అపకారం చెయ్యకుండా బ్రతకటమే మనిషికి గల ప్రాధమిక కర్త వ్యం.అప్పుడు ప్రకృతిని,ప్రాణులను ప్రేమిం చటం నేర్చుకుంటాడు.ఇందుకు సత్యం,అహింసల పథంలో మనిషి ప్రయాణం చేయాలి.

No comments:

Post a Comment