కాలం చెక్కిన గాయాన్ని మాన్పటానికి ప్రయత్నం ఒకవైపు,నిర్లక్ష్యపు చేష్టలతో ప్రాణం మీదకు తెచ్చుకునే మనుషులొక వైపు, ఇది జరుగుతున్న వర్తమానం. ప్రకృతిలో ఎప్పుడూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం.చరిత్ర మొత్తం మనకు కనిపిస్తున్నదిదే. విధ్వంసక ఆయుధాల కుప్పలపై కూర్చున్న రాజ్యాలొక వైపు,నిస్సహాయంగా చూస్తున్న ఐక్యరాజ్య సమితి మరో వైపు ,నడుస్తున్న నాటకమిదే. మనిషికి రక్షణ ఛత్రంలా ప్రకృతి ఒక వైపు,దాన్ని ఛిద్రం చేస్తూ కాలుష్యం మరోవైపు మనం నిత్యం చూస్తున్నదిదే. అయస్కాంత మేదో ఆకర్షించినట్లు సంపద కేంద్రీకృతం ఒకవైపు,కోట్ల మంది దరిద్రనారాయణుల జీవితమొకవైపు , కఠిన వాస్తవమిదే. సృష్టికి ప్రతిసృష్టి చేసే విజ్ఞానం ఒక వైపు,జీవితాలను దుర్భరం చేసుకునే అజ్ఞానం మరోవైపు. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ ఒక వైపు,నియంతృత్వపు పరిపాలనలోని దైన్యం మరో వైపు. బంగారం లాంటి భూమిని మరుభూమిగా మారుస్తున్న వైనం ఒక వైపు,అంగారకుడి ఉపరితలంపై ఆవాసం కోసం ఆరాటం మరో వైపు. నాణ్యమైన,సుఖప్రదమైన జీవితాలొక వైపు,క్షణ క్షణం బ్రతుకు నరకం మరొక వైపు. అధిక ఆహారంతో ఊబకాయ ప్రపంచం ఒకవైపు,ఆకలితో డొక్కలంటుకుపోయిన ప్రజలొక వైపు. వేలకోట్ల ఆకాశ హర్మ్యాలొక వైపు,నిత్యం రాత్రి ఆకాశం చూసే కోట్లాది బ్రతుకులొక వైపు. ఈ ఘర్షణకు అంతం ఎప్పుడో, లేదా అంతమే పరిష్కారమా! కాలమే సమాధానం ఇవ్వాలి..... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment