ఏదయినా ఒక విషయాన్ని గురించి సమగ్రంగా వివరంగా అన్ని కోణాల్లో వ్రాయడాన్ని వ్యాసం అంటారు.మనకున్న జ్ఞానానికి,సృజనాత్మక శక్తికి,తార్కిక శక్తికి వ్యాసం నిదర్శనం.స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ,నెహ్రూ తమ భావాలను వ్యాసాల రూపంలో ప్రజలకు తెలియజేసేవారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు.అలాగే కొన్ని సంస్థలు కూడా వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తుంటాయి.విద్యార్థి ఏదయినా అంశాన్ని లోతుగా పరిశీలించడానికి, విషయాన్ని సేకరించడానికి తన స్వంత భాషలో అభివ్యక్తీకరించడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.మన మాతృభాష అయిన తెలుగుతో పాటు హిందీ ,ఇంగ్లీష్ లలో కూడా పాఠశాల స్థాయిలో విద్యార్థులను వ్యాసరచనలో ప్రోత్సాహించాలి.కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాలను నేర్చుకుని పరీక్షలు వ్రాయడం కాకుండా ప్రపంచంలోని విభిన్న విషయాలను తెలుసుకోవడానికి వ్యాసరచన పోటీలు దోహదం చేస్తాయి.ఒక భాష మనకు బాగా వచ్చు అంటే ఆ భాషలో బాగా మాట్లాడటం తో పాటు వ్రాయడం కూడా వస్తే పరిపూర్ణత వచ్చినట్లు. ఇక విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలైన సివిల్స్,గ్రూప్ 1 స్థాయి పరీక్షలు వ్రాయడానికి చిన్నప్పటినుంచి వ్యాసరచన ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.పరీక్షల కోసం నేర్చుకుని రాయడం కాకుండా ఏ విషయాన్ని అయినా విశ్లేషించి మన అభిప్రాయాలను వ్యక్తీకరించడం విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం పాఠశాలల్లో మార్కులు గ్రేడుల మాయాజాలం లో పది వ్యాసరచన ప్రక్రియను ప్రక్కకు పెట్టారు.కనీసం నెలకు ఒక అంశంలో నైనా తెలుగు,హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన పోటీలను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థుల భవితకు బంగరు బాటలు వేసినట్లే. విద్యార్థులు ఏదైయినా అంశంపై తమ స్వంత అనుభవాలను,అభిప్రాయాలను వ్రాసే విధంగా కూడా ప్రోత్సాహిస్తే వారికి రచనా శక్తి అలవడుతుంది.సమాజంలో తాము గమనించే అంశాలపట్ల తమకు వచ్చే ఆలోచనలను,మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా,ఉన్నతంగా మారడానికి అవసరమయ్యే వినూత్న సంస్కరణలను వ్యాసాలరూపంలో వ్రాసి వార్తాపత్రికలు, సోషల్ మీడియా ద్వారా కూడ ప్రజలకు తెలియజేయవచ్చు. పైన తెలిపిన విధంగా పాఠశాల స్థాయినుంచే వ్యాసరచన పట్ల ఆసక్తిని,ఇష్టాన్ని,విద్యార్థుల్లో కలిగించడం ప్రతి ఒక్క ఉపాధ్యాయుని బాధ్యత.....ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment