Thursday, 29 April 2021

ప్రేమ....యండమూరి

            పల్లెను వర్ణించాలంటే మాటలు చాలవు.వేప చెట్టు వేదం చదవడం,కొబ్బరాకులు నీటిలో జల తరంగిణులు మ్రోగించడం తో మొదలవుతుంది రచయిత పద విన్యాసం." వేదసంహిత"ను సృష్టిస్తూ బ్రహ్మ ఆమెను గురించి శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు అక్షరాలను విరజిమ్ముతుంటే మనకు విభ్రమం కలుగుతుంది. ,మోహనరాగం,బిలహరి గురించి లోతుగా తెలుసుకుని మరీ మనకు వివరిస్తారిందులో.ఆంథ్రోపాలజీ గురించి పాఠకుడికి వివరంగా పరిచయం చేస్తూ ఇది ప్రేమ పై ఆధారపడి ఉందని చెప్పిస్తూ నవల యొక్క ప్రధాన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తారు.ఊరు మేల్కోవడాన్ని కన్నులకు కట్టినట్లు వ్రాస్తారు.పనిచేసే వారు పాడే పాటల్లోని అంత రార్ధాన్ని కూలంకషంగా వివరిస్తారు. "పొద్దున్నే ఊరు మేల్కొవటం ఓ పాటైతే మేల్కొన్న తోటను చూడటం ఒక కావ్యం.ప్రేమ ,పైరును పోల్చడం ఆసక్తికరం.ఆంత్రోపాలజీ ప్రేమ చుట్టూ కోట కట్టి అందులో ప్రేమను బంధించింది అని చెబుతూ మనుషులు ఎందుకు ప్రేమ రాహిత్యంగా,ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వివరించిన తర్కం బాగుంది."ప్రేమించడానికి హృదయం ఉండాలి.ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి" ప్రేమంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక ఆకర్షణ వల్ల కలిగే సంపర్కం మాత్రమే కాదు,విశ్వాన్నీ,ప్రకృతిని,సాటి మనిషిని ప్రేమించడం అని చెప్పడం ద్వారా ప్రేమకు సంపూర్ణ నిర్వచనం ఇచ్చారు.                                                            చరిత్ర చదివిన వారికే సరిగా ఈ అపాచీ కల్చర్(red indians) గురించి తెలీదు.సరిగ్గా ఈ విషయాన్ని తన "ప్రేమ" కు ఇరుసుగా మలచుకున్నారు యండమూరి.పోలీస్ ఆఫీసర్,అపాచీ నాయకుడి మధ్య సంభాషణలు సినిమాగా తీస్తే కళ్ళప్పగించి చూస్తాం."కోరిక యొక్క సాంద్రతని కొలిచే సాధనాలు ఇంకా ఈ ప్రపంచం లో కనుగొనబడలేదు." "ద్వేషం స్థానం లో ప్రేమను నింపండి.నవ్వును ప్రేమించండి." చక్కటి సందేశాలు."కన్నీటి చుక్కకి చాలా విలువుంది.ఇతరుల కష్టాల్ని చూసి అది స్రవించాలే కానీ,మన గురించి కాదు".గొప్ప సహానుభూతిని చూపే భావం. " సాటి మనిషికి చేయి అందిస్తే ప్రపంచమంతా సుఖ శాంతులతో వర్ధిల్లుతుందనే నమ్మకమే విశ్వ జనీనమైన ప్రేమ"అన్న వాక్యాల ద్వారా ప్రేమలోని విశ్వ వ్యాప్త భావనను ఆవిష్కరించారు. "ప్రేమకి పునాది నమ్మకమయితే పై కప్పు భద్రత".                                               పిల్లలాడే ఆటల్లోని అర్ధాలు వివరిస్తారు.ప్రకృతి ని వర్ణించడం లో యండమూరి తర్వాతే ఎవరయినా అనిపిస్తుంది."ప్రకృతి ని ప్రేమించడమే అన్నిటికన్నా గొప్ప".ప్రేమించు --ప్రేమను పొందు అన్న ఆలోచనా స్రవంతే సంక్రాంతి.ఇక 5 రోజుల పెళ్లిళ్లు ఎలా చేస్తారో చదవ వలసిందే.మనం మరచిన మన సంప్రదాయాలన్నీ గుర్తు చేస్తారు."మట్టినీ, మేఘాన్ని, మొక్కనీ ప్రేమించ లేని వాడు ప్రపంచం లో దేనినీ ప్రేమించలేడు.   అచ్చ తెలుగు సంస్కృతి నిండిన ఓ పల్లె గురించి వ్రాసిన విధానాన్ని ప్రతి తెలుగువాడు చదవాలి.ఇక తెలుగు భాషలోని గొప్పదనాన్ని వివరిస్తూ పద్యాలు మన భాషకు ఎలా తలమానికమో ఛందస్సు అలంకారాలు మనకే ఎలా ప్రత్యేకమో వివరించడం తెలుగు భాషపై మనకు మరింత మక్కువని పెంచేలా చేస్తాయి.ఆంధ్ర ,తెలంగాణ,రాయలసీమ నేపధ్యాలుగా కవి చెప్పిన గేయాలు హృదయాన్ని హత్తుకుంటాయి.తనను ఉరితీయబోయిన కార్టిస్ ను తన రక్తం ఇచ్చి రక్షించబోయిన అభిషేక్ పాత్ర ద్వారా ప్రేమ విశ్వరూపాన్ని చూపారు." మీకీ ప్రపంచం లో అయిష్టమైన దేదీ లేదా అన్న ప్రశ్నకు .....యండమూరి పలికించిన జవాబు ఏ తత్వ వేత్త చెప్పిన దానికి తీసిపోదు.ఈ ఒక్క జవాబు ఆయన్ను నవలా శిఖరాగ్రాన నిలబెడుతుంది."ప్రేమంటే సౌందర్యం,సౌందర్యమంటే ఆనందం." ఉప్పెన లో సముద్రం లో ప్రేయసీ ప్రియులు గడిపే దృశ్యం ఇందులో చదివి ప్రభావితమైనట్లుగా ఉంది.అద్భుతమైన ఈ వర్ణన ఉప్పెన సినిమాలో ఆవిష్కృతమైంది.ఓ మహాత్మాగాంధీ, ఓ నెల్సన్ మండేలా,ఓ మార్టిన్ లూధ ర్ కింగ్,ఓ ఆంగ్ సాన్ సూకీ లా అభిషేక్ ని అపాచీల కోసం పోరాటం చేసే నాయకుడిగా నిలపటం విశ్వ జనీనమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం....ఒద్దుల రవిశేఖర్.

No comments:

Post a Comment