Monday, 30 April 2012

నేడే!మేడే!

హలాలతో పొలాలదున్నీ
జాతికి జవసత్తువనిచ్చే 
కర్షకవీరుల త్యాగం.
గనిలో,పనిలో,ఖార్ఖానాలో  
విరామమెరుగక,విశ్రమించక
జగతికి జవజీవాలిచ్చే 
కార్మికధీరుల కష్టం.
మెలి తిరిగే నరాలతో 
పట్టువీడని కరాలతో
జనుల అవసరాలు తీరుస్తున్న 
శ్రామిక లోకపు స్వేదం.
కండర కష్టం నమ్ముకొని 
ఎండను,వానను,చలినీ 
లెక్కచేయని తత్వం.
చక్రం,రంపం
పగ్గం ,మగ్గం
కొడవలి,నాగలి
సమస్త వృత్తులు
శ్రమైక జీవన సౌందర్యానికి 
అచ్చమైన ప్రతీకలు.
మీ కల్యాణానికి 
మీ సౌభాగ్యానికి 
మీ పోరాటానికి 
నేడే!మేడే!
                   ఈ కవితకు స్పూర్తి  శ్రీశ్రీ మహాప్రస్థానం లోని ప్రతిజ్ఞ అనే కవిత    
                                 శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు.

Saturday, 28 April 2012

మానవ జీవన లక్ష్యమేమిటి?3


             మానవ జీవన లక్ష్యమేమిటి? ఈ  ప్రశ్నతో ఇంతకు ముందు వ్యాసం ముగించాను కదా! వ్యాసంలో  మనకు నష్టం చేసే సంస్కారాలను పేర్కొన్నాను.వాటిలో కొన్ని జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా వుంది .ఉదాకోపము అలాగే మంచి సంస్కారాలు కూడా ఏర్పడతాయి. పరిసరాలద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా ఎదు ర్కొన్న సమస్యల ద్వారా, తల్లిదండ్రులు నేర్పిన విలు వల ద్వారా ఇవి ఏర్పడుతుంటాయి.
             అవి ప్రేమ,కరుణ,దయ,సహనం ,శాంతి,అహింస,సేవాగుణం ,సర్దుకుపోయే తత్వం,అర్థంచేసుకోవటంఅణకువ ,విచక్షణ కలిగివుండటం,వినయం,వివేకం,త్రుప్తి,ప్రశాంతత నిరహంకారం ,ఆశావాదదృక్పథం, గెలుపు, ఓటములను సమంగా తీసుకోవటం, కుతూహలం ,ఆసక్తి ,పెద్దలను గౌరవించటం ,నిజా యితి,స్వచ్చత,పవిత్రత, స్నేహతత్వం,ఆనందం,మానవత్వం,నైతికత,సత్యమునే పలకటం,క్రమశిక్షణ, జిజ్ఞా,బాధ్యత,అన్వేషణా దృక్పథం   విధేయత,నమ్మకం,సమయపాలన,నిస్వార్థం,మర్యాద ,ప్రశంసించటం,అంకితభావం,పట్టుదల,కృషి,ప్రశాంతచిత్తం మార్పును ఆహ్వానించటం ,ఓపిక,జాగ్రత్త,సున్నితత్వం సోదరభావం,క్షమాగుణం సానుభూతి,జాలి,ప్రోత్సాహంకృత జ్ఞత,అవగాహన,దేశ,వర్ణ,కుల,మత,ప్రాంతాలకతీతమైన మనస్తత్వం (విశ్వమానవ సౌబ్రాత్రుత్వం) వంటివి.వీటిలో కూడా కొన్నిజన్యుపరంగా,జీవితంతో పాటు నేర్చుకునేవి కొన్నివుంటాయి.కానీ ప్రస్తుతం సంస్కారాలు మనుష్యు లలోతగ్గి పోతున్నాయి.
           మనం చేసే చర్యలను బుద్ది ఇది తప్పు,ఇది ఒప్పుఅని చెబుతూవుంటుంది.కానీ దాని మాటను మనసు లెక్కచెయ్యదు.మనిషి వ్యతిరేక సంస్కారాలు ప్రదర్శించటం,అనుభవించటం అలవాటు చేసుకున్నాడు.పై చెప్పిన అనుకూల సంస్కారాలపై నిలబడాలంటే ఎంతో నిబద్ధత కావాలి.బ్రతుకు పోరాటంలో పడి ఇవన్నీ వదిలేసి నష్ట పరచే సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాడు.కాని మనకు తెలియకుండా ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపి రకరకాలైన మానసిక వ్యాధుల రూపంలో దీర్ఘకాలికంగా వస్తున్నాయి.మంచి సంస్కారాలు మనిషికి అద్భుత మైన  ఆరోగ్యాన్నిస్తాయి.చూడండి! పల్లెటూరి వారికి రక్తపోటు,షుగర్,గుండె జబ్బులు,అధిక బరువులాంటి సమస్య  లు చాలా తక్కువగా వుంటాయి .కోరికలు తక్కువ .ఉన్నదానితో సంతృప్తి చెందుతారు.
                         ఇక మనిషి జీవిత లక్ష్యమేమిటి? పాటికే మీకు అర్థమయ్యే వుంటుంది.
            క్షణక్షణం ఆనందంతో జీవించటం.సుఖ,సంతోషాలు బాహ్యమైనవి.ఆనందం అంతర్గత మైనది .అది లోపలి నుండి పెల్లుబుకుతుంది.హృదయము నుండి మనసులోకి వస్తుంది.మంచి సంస్కారాలతో ఆనందం వస్తుంది మనస్సంతా ప్రేమను నింపుకొని వుంటే మనమంతా అన్వేషించే అద్భుతం ప్రత్యక్షమవుతుంది అదే సత్యం.  

Friday, 27 April 2012

నా హృ(మ)ది లో ...



మానస వీణకు తీగెలు సరిచేసి
స్వరాలు కూరుద్దామని కూర్చున్నా
సంధ్యా సాగరపు ఒడ్డున
అప్పుడప్పుడు పాదాలు స్పృశించే
అలల చిరుతాకిడి  చెంతన
మనసు నా వశం కావటం లేదు
సరిగమలు పలికిస్తున్నంతలో
ఉవ్వెత్తున సవ్వడి చేస్తూ కెరటాలు
ఎక్కడికో వెళ్లాలని
సముద్రుని విడిచి ఎగరాలని
అంతలోనే మళ్ళీ వెనక్కి
నా ఆలోచనలు అంతే
ఓ వరుసలో కూర్చి పాటగా పలికిద్దామన్నా 
పల్లవులను కూర్చి గొంతెత్తి పాడుదామన్నా
ఏవో సంక్లిష్ట సంకేతాలు
మరేవో అస్పష్ట సంగీతాలు
నా మనో సాగరాన ఒక్కోసారి నెమ్మదిగా
ఇంకోసారి ఉధృతంగా విరుచుకుపడే స్థాయిలో
ఏవేవో ఒత్తిడులు
మరేవో బంధాలు
ఒత్తిడులనుండి కొన్ని దృశ్యాలు
బంధాలనుండి మరిన్ని చిత్రాలు
కాని కెరటాల్లా కాకూడదు నావి
నిగ్రహంతో లక్ష్యాన్ని ఢీకొనాలి
తీగెలు సరిచేస్తూ కాలం గడిపేయకూడదు.
గుర్రపు గిట్టల బలంతో విచారపు
గతాన్ని వెనక్కి తన్ని
వర్తమానపు సంకేతాలను మోసుకుంటూ
భవిష్యత్ ఛాయాపథం లోకి దూసుకెళ్ళాలి.
తేనె లొలుకు తెనుగుకు మాలలు కట్టి
తీయనైన పాటలతో హారతి పట్టి
ముందుకు మున్ముందుకు వెళతాను
కష్ట జీవి స్వేదంతో నేను కలిసిపోతాను
కార్మికుడి కన్నీటిలో లీనమౌతాను
అనాధ నేత్రాలకు వెలుగౌతాను
ఇదంతా కేవలం భావోద్వేగం కాదు
నా హృదిలోని  స్పందనలు
నా మదిలోని   భావనలు

Thursday, 26 April 2012

"విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగు

                సైన్సు పై తెలుగులో "విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగును ప్రారంభిస్తున్నాను.ఇంతవరకు ఏ అగ్రిగేటర్ లో చేర్చలేదు. కారణం మొదట దానిని ఇంగ్లీష్ బ్లాగు గా ప్రారంభించటమే!ప్రస్తుతం దీన్ని తెలుగు లోకి మార్చి అన్ని agregators తో  లింక్ చేయటం జరిగింది.
              సైన్సు ద్వారా సత్యాన్వేషణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ది చేయటం దీని ప్రధాన ఉద్దేశం .విద్య అంతా ఇంజనీరింగ్,మెడిసిన్ ల వైపు వెడుతుంది.సైన్సు గురించి తెలియజేయటమే కాకుండా అందులో కుతూహ లాన్ని,జిజ్ఞాసను రేకెత్తించే విధంగా ఇందులో వ్యాసాలూ వుంటాయి.మీ పిల్లలచేత చదివించి మీరు అర్థము చేసుకొని వారికి వివరించగలరు.
              ప్రస్తుతం ఈ విశ్వం 18  సూత్రాలు పై నడుస్తుందని శాస్త్రవేత్తలు తీర్మానించారు.వాటి గురించి వ్యాసాలూ వస్తు న్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు .సైన్సు పట్ల ఆసక్తి వున్నవారు  దీనిని ఉపయోగిం చు కోగలరు 
ఈ   బ్లాగు  పై దీని url వున్నది . ఈ బ్లాగు   url   http://cvramanscience.blogspot.in  

Tuesday, 24 April 2012

మన మనసులో సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ?2


                వ్యాసం లోని మొదటి భాగం లో చెప్పిన దశ లోపే చిన్నప్పటి స్వచ్చత,సున్నితత్వం ,స్వేచ్చ,ఆనందం సగం కోల్పోతాము.ఇక వివాహ జీవితం,తల్లిదండ్రుల పోషణ ,పిల్లలు, ఆర్థిక పరిస్థితులు ఎన్నో వస్తాయి.ఇద్దరు ఉద్యో గం చేస్తే వచ్చేవి ,చేయకపోతే వచ్చేవి,ఆఫీసులలో,పొరుగువారితో స్నేహితులతో ,బంధువులతో  వచ్చే సమస్య లు ఇలా మొత్తం జీవితంలో బాధ్యతలు,బంధాలు.సమస్యల సుడిగుండంలోమనిషి పూర్తిగా కూరుకుపోతాడు .పెళ్ళయి న కొత్తలో సరదాగా వున్నా పిల్లలు,వారి ఆరోగ్యాలు ,వారి పెంపకం పెద్ద సమస్య.వారు బడికి పొయ్యే  దశ కు వచ్చే సరికి ఫీజులు,వారి చదువు సమస్య . లోపు సంసార జీవితంలోని మధురిమలు తగ్గి సమస్యల బరువు పెరిగి రకరకాలైన మానసిక లక్షణాలు మనిషిలో స్థిరపడి పోతాయి
         అవి భయం ,ఆందోళన,ఒత్తిడి,అనుమానం అసహనం,విసుగు,బద్ధకం,అలసట, ఆరోగ్యం గురించి చింత అరిష డ్వర్గాలయిన  కామ,క్రోధ,లోభ,మోహ,మద మాత్సర్యాలు,ఈర్ష్య,అసూయ కోపం,ద్వేషం పోటీతత్వం, అసంతృప్తి అశాంతి ,ఘర్షణ,పెనుగులాట,ఒంటరితనం,నైరాశ్యం,ప్రేమరాహిత్యం ,బ్రతుకు పోరాటం,గందరగోళం,వైషమ్యాలు ఆగ్రహం, నేను అనే అహంకారం,ఆధిక్యతా భావన ,న్యూనతా భావన, కపటం,మోసం చేయటం,కోర్కెలు, సుఖాసక్తి భీతి,అభద్రతా ,వేదన, నటన,అబద్దాలాడటం,చాడీలు చెప్పటం,ఇతరులను విమర్శించటం(ప్రత్యక్షంగా పరోక్షంగా) ఇతరుల వినాశనాన్ని కోరటం,ఇతరులకు హాని చేయటం,అవినీతి,ఆశ్రిత పక్షపాతం,లంచం తీసుకోటం,ఇవ్వటం హింస ,క్రౌర్యం ,రాగ భావోద్వేగాలు, వంటి అనేక రకాలైన మానసిక లక్షణాలు మనలో స్థిర పడి పోతాయి.మరి    చిన్నప్పటి కల్మషం లేని స్వచ్చమైన ,స్వేచ్చ కలిగిన పై చెప్పిన లక్షణాలు ఏవీ లేని మనసును పొందటం ఎలా?మనసు వాటన్నింటిని వదిలి ఉండ లేదా?
          అటువంటి మార్పు మనసు కోరుకుంటుందా!జీవితపు పరుగు పందాన్ని ప్రతి మనిషి ఎన్నోకోరికలు ఆశ లు ,ఆకాంక్షలతో మొదలు పెడతాడు.కొంత మంది తమ లక్ష్యాలను చేరుకుంటారు.కాని లక్ష్యం చేరుకున్న వారైనా ,చేరని  వారయినా ఎక్కువ శాతం జీవితాన్ని మాత్రం మధ్యలో కోల్పోతారు.ఎందుకిలా జరుగు తోంది తన జీవి తం తనకు కాకుండా పోయినతర్వాత మనిషి ఎందు కోసం ఇన్ని సమస్యలతో ఇంత బాధతో దిగులుతో జీవితా న్ని గడుపుతున్నాడు?మరణం వరకు ఇదే స్థితిని అనుభవించాలా ?మరి మనకి ఏ  స్థితి కావాలి?
            మానవ జీవిత లక్ష్య మేమిటి?దాని కంటే పెద్ద ప్రశ్న?మన(నీ,నా)జీవిత లక్ష్యమేమిటి ?తరువాతి  వ్యాసం లో ఈ  విషయాలు చర్చిద్దాము.

Sunday, 22 April 2012

మన మనసులో విభిన్న సంస్కారాలు(ముద్రలు)ఎలా ఏర్పడతాయి?1



ఒక సారి అందరం బాల్యం లోకి వెళ్లి వద్దామా!ఒక సారి ఆలోచించండి .అప్పుడు మన మనస్సులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా వున్నాయి? కదా!ఎంత తేడా ! అసలు ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్చంగా ,స్వేచ్చగా , బాధలు,భయాలు కష్టాలు లేకుండా రోజు పనులు ఆరోజు చేసుకుంటూ వర్తమానాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఆడుకుంటూ, స్నేహితులతో నవ్వుతు ,త్రుళ్ళుతూ ,కబుర్లు చెబుతూ ,సాయంత్రం చదివినంత చదివి ప్రశాంతం గా గాఢ నిద్ర పోయి ఉదయాన్నేఆనందంగా నిద్ర లేస్తాము.ఎక్కడా ఇప్పుడు మనకున్న రకరకాలయిన లక్షణాలు అప్పుడు ఏమీ లేవు.మన జీవితం లో చదువు ఒక భాగం మాత్రమే! అన్ని విషయాలు మన బాల్యం లో ప్రధాన పాత్ర పోషించేవి.ఉమ్మడి కుటుంబాలు,పంటచేలు,పిల్లకాలువలు, ఊరి రచ్చబండ, హరి కథలు,బుర్రకథలు,తెర సినిమాలు,తోలుబొమ్మలాటలు,పండుగలు ఇలా ఊరంతా సందడిగా వుండేది.పట్టణాల్లో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రిందట  క్రిందట ఇంత వేగవంతమైన జీవితం లేదు.
          విషయమేమంటే మన బాల్యం లో మన మనసు పరిస్థితి ఏమిటి !ప్రస్తుతం మనం ఎలా వున్నాం.మధ్యలో మన మనసుకే మయింది.పదవ తరగతి వరకు పల్లెల్లో వున్నాం ఇంటర్ కు పట్టణాల్లోకి వచ్చాం.ఇంటర్లో కూడా చదువు,సినిమాలు,ఆటలు అన్ని కలిసి ఉండేవి రోజుల్లో కాలేజీ లలో ప్రేమలు అంతగా లేవు.అమ్మాయిలతో మాట్లాడాలంటే నే సిగ్గు.ఇక ప్రేమలు కూడానా!అసలు ఇంటర్ పూర్తి అయ్యేలోపు ఒకటి రెండు మాటలు మాట్లాడితే గొప్ప.అలాగే డిగ్రీ లో అప్పుడప్పుడే చిరు ప్రేమలు అక్కడా ఇక్కడా కనిపిస్తుండేవి .ఎక్కువ స్నేహితులతో గడపటం సరదాగా సినిమాలు అలా అలా గడిచిపోయింది.కాని ఇక్కడే ఎవరికయినా కొన్ని అనుభవాలు నమోదవుతాయి. .స్నేహితులతో మన ప్రవర్తన,ఒకోసారి స్నేహితుల దూరం ,అమ్మాయిలతో సరదాగా మాట్లాడటం స్నేహం అనుకోవ టం,తరువాత ప్రేమ అనుకోవటం, ఒకవైపునుండే ఆరాధించడం ,చెప్పలేకపోవటం ,డిగ్రీ అయిపోవటం చివరికి ఏమి కాకుండా పోవటం . ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అనుభవాలు.ఇక డిగ్రీ తరువా ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టా లు మొదలవుతాయి.అప్పటి దాకా వున్న ప్రపంచం వేరు ఇక పోటీ వాతావరణం లోని ప్రపంచం వేరు.ఇక్కడి నుండి ఉద్యోగం సంపాదించుకోవటం  వరకు ఒక దశ ! .  దశలో  మనకెన్నో  సమస్యలు ,ఆర్ధిక  పరమైనవి మానసిక పర మైనవి స్నేహం ,ప్రేమలు మనల్ని వెంటాడుతుంటాయి.సరే అందరు ఏవో ఒక తిప్పలు పడి ఉద్యోగంసాధించు కుంటారు  .
          ఆకష్టాలు,ఇబ్బందులు,ఎదురయ్యే చెడు పరిస్థితులు ఇవన్నీ కలిపి మనలో రకరకాలైన అనుభవాల ముద్ర లు, మనకు విభిన్న వైఖరులు ఏర్పడే విధంగా చేస్తాయి ఉద్యోగం వస్తుందో రాదో అని భయం, ఆందోళన, భవిష్యత్తు తలచుకొని దిగులు,మానసిక ఒత్తిడి అందులో డబ్బు కోల్పోయేవారు,లంచం ఇచ్చి మోస పోయే వాళ్ళు కోచింగ్ లకి ఎంతో డబ్బు ఖర్చు కావటం ఇలా ఎన్నో సమస్యలు వేధించి వుంటాయి.ఇక విదేశాలకు పోయేవారి కష్టాలు,వీసాల కోసం తిప్పలు ఇవన్నీ ఒక జీవితానికి సరిపడా అనుభవం వచ్చేస్తుందిఉద్యోగం దొరికితే ఓకే .దొరక్కపోతే మరింత ఇబ్బంది.ఏదో ఒక వ్యాపారం,వ్యవసాయం లాంటి స్వయం ఉపాధి పనుల వైపు మళ్లుతారు.
         ఇక అసలు సమస్య మొదలు.వివాహం. ముందుగా ప్రేమించుకున్న వారు ఉద్యోగం రాకుండానే పెళ్లి చేసు కుంటారు,కొందరు ఉద్యోగం వచ్చాక చేసుకుంటారు.ఇక పెద్దలు ఒప్పుకోకపోతే ఇంటినుండి వెళ్లి పోయే వారు మరో రకం!పెద్దలు కుదిర్చిన సంభంధాలు చేసుకునేవారు, ప్రేమించుకొని పెద్దల అంగీకారం తో చేసుకునేవారు , ప్రేమ విఫలమై వేరేవారిని వివాహం చేసుకునేవారు ,జీవితాలను అంతం చేసుకునే వారు .జీవితంలో వివాహం  అసలు చేసు కోని వారు ఇలా రకరకాలుగా వుంటారు . ఎక్కువభాగం  వివాహం చేసుకొనే వారే !ఇంత  వరకు   ఏర్పడే అనుభవాల ముద్రలు ఒకరకం ,ఇక జీవితం లో ఏర్పడే అనుభవాల ఆధారం గా ఏర్పడే సంస్కారాలు ఒకరకం .
  అవి వచ్చే వ్యాసం లో వివరిస్తాను. 

Wednesday, 18 April 2012

అభిసారికనై!

                                   నా పదమంజీరాలు అల్లరి
                                   సవ్వడులు చేస్తున్నాయి ప్రభూ!
                                   నీ హ్రుదయాంచలాన మెరిసే
                                   ఊహా ప్రపంచపు గీతికల్ని 
                                   మకరందాన్నిఅద్ది పలికించమంటున్నాయి 
                                                    నీ హృదయస్పందన అంది
                                                    నెలలు గడిచిపోతున్నాయి  స్వామీ!
                                                    అభిసారికనై నీ పరిష్వంగాల స్మృతులను
                                                    క్రుతులుగా కూర్చి పాడుకుంటూ 
                                                    ప్రతి నిమిషము ఓ యుగంలా గడిపేస్తున్నా! 
                                   నా నిమీలిత నేత్రాలు సంధ్యారుణ 
                                   కిరణాల్ని చూడలేక పోతున్నాయి 
                                   ఈ సంధ్యలోనే కదా మనం 
                                   పాడిన ప్రేమ పల్లవులు 
                                   ప్రతి కెరటం విని పులకించి పోయింది 
                                   ఆ జ్ఞాపకాలు గుర్తువచ్చి నా మనసు
                                   నా వశం తప్పి పోతుంది 
                                                  ఆకసములోని ప్రతి మబ్బు తునక
                                                  మన ప్రేమ రాగాన్నేఆలపించలేదా!
                                                  సముద్ర తీరాన ప్రతి ఇసుక రేణువు 
                                                  మన దోసిళ్ళనుండి జాలువారి
                                                  త్రుప్తి పడినదే కదా!
                                  ప్రతి అలను అడుగుతున్నాను 
                                  నా వర్తమానం నీ కందించమని 
                                  ఏమిటో ప్రియతమా !నా మదిలో
                                  నీ ఫై నా ప్రేమ ప్రవాహమై ,
                                  ప్రమోదమై! ప్రణవ నాదాన్ని
                                  నిరంతరంగా పలికిస్తూనే వుంది
                                  నీ సందేశం అందే వరకు ఈ విరహం
                                  ఇలా పలుకుతూనే వుంటుంది.

Monday, 16 April 2012

అమ్మ ప్రేమ గుర్తు వుంటే జన్మభూమి మీవెంటే !


ఆకాశంలో చందమామ ను చూపిస్తూ
బిడ్డకు గోరుముద్దలు తినిపించే ఆమెను చూస్తే 
అమ్మను చూడాలనిపిస్తుంది!
పరుగెత్తుకెళ్ళి అమ్మ కాళ్ళఫై వాలాలనిపిస్తుంది
తడబడు అడుగులతో నడుస్తున్న బాబును
ఎంతో ప్రేమ తో పట్టుకొని నడిపిస్తున్న ఆమెను చూస్తే
మరొక్క సారి అమ్మ చిటికెన వ్రేలు పట్టుకొని నడవాలని పిస్తుంది
అమ్మ ఒడిలో ఆనందంగా ఆడాలనిపిస్తుంది.
చలికి మునగ తీసుకొని పడుకొని వున్నబాబుకి 
సవ్వడి లేకుండా దుప్పటి కప్పుతున్న ఆమెను చూస్తే
అమ్మ కడుపులో వెచ్చగా నిదుర పోవాలనిపిస్తుంది 
పరుగెత్తుతూ  గెంతులేస్తున్న పిల్లాన్ని బెదిరిస్తూ
దారిలోకి తెచ్చుకొంటున్న ఆమెను చూస్తే
అమ్మ చేత మెత్తని దెబ్బలు తినాలనిపిస్తుంది
అమ్మ అంటే కమ్మనైపాట 
అమ్మ అంటే అమృతపు ఊట 
నా సందేశం తన కందిందేమో ఆకాశం లో 
అమ్మ రూపం చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లుంది
ఇంత ప్రేమ నామీద చూపించి అక్కడున్నావమ్మా !
నా మది నదిలో నీ ప్రేమ రాగం పలుకుతోంది
నీ ప్రేమ నన్నెంత వాణ్ని చేసిందో తెలుసామ్మా
నీ కొడుకు కుబేరుడయ్యాడమ్మా!
నీ ప్రేమను నా జన్మభూమి ఫై చూపిస్తూ
ఆకలి కేకలు లేకుండా చేస్తున్నాను.
వ్యాధులు లేని సమాజానికి అంకురార్పణ చేస్తున్నాను
మహోన్నతమైన  నైతిక విద్య నందిస్తున్నాను.
జన్మ భూమి సేవతో  నీ ఋణం  తీర్చుకుంటున్నాను
నా జన్మభూమిలో నా పేరెంత మార్మోగినా
నా జన్మభూమంతా నా వెంటే ఉన్నదన్నా
అది నువ్వు చూపించిన ప్రేమ వల్లనే నమ్మా 
         PMKM Fine arts ,Ongole వారు   రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన "అమ్మ ప్రేమ గుర్తు వుంటే జన్మభూమి మీవెంటే !"అనే కవితా పోటిలో రెండవ బహుమతి పొందిన కవిత .

Saturday, 14 April 2012

10 మంచి అలవాట్లు చేసుకోవటం ఎలా !(3)


మీ జీవితాన్ని ప్రభావితం చేసే 10 మంచి అలవాట్లు చేసుకోవటం  ఎలా !(3)

                ఇంతకు ముందు వ్యాసంలో చెప్పుకున్న చెడు అలవాట్ల స్థానంలో అలవాట్లువుంటే మనసు  తృప్తి పడ్తుంది,ఏవి ఆరోగ్యానికి మంచిది,ఏవి ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడతాయి, అలవాట్లు మనకి మన జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి?అన్న విషయాలు చూద్దాము.మనిషికి ప్రాథమికం గా తృప్తి,హాయి, ఆనందం కలిగించేవి మొదట గమనిద్దాము.
        1)మనకున్న పంచేంద్రియాల గురించి మొదట ఆలోచిద్దాము.కంటికి ప్రకృతి,అందమయిన దృశ్యాలు ఆనందా న్ని కలిగిస్తాయి . ప్రతిరోజు ఆకాశాన్ని,సూర్యోదయ ,సూర్యాస్తమయాలను,చంద్రుని వెన్నెలను ,నక్షత్రాలను ,చెట్లను ,పక్షులను గమనించగలిగితే ఎంతో ఆహ్లాదం గా వుంటుంది.అలాగే అందుబాటులో వున్నవారు కాలువలు ,నదులు ,సముద్రాలకు,ఉదయం,సాయంత్రం షికారుకు వెళ్ళగలిగితే  నడకలాగా అనుకుంటే ఎంత బాగుంటుంది.ప్రకృతిని మనం కళ్ల ద్వారా మనసులో నింపితే మన మనసు విశాలమవుతుంది.దీన్ని మించిన తృప్తి ఇంకోటి లేదు.ఎక్కడికి పోలేని వారు తమ ఇంటి ఫై కెక్కిగమనిస్తే సరి! అవకాశం,పరిస్థితులు    అనుకూలించిన  వారు వారాంతం లో ఒక ప్రాంతానికి  వెళ్లి అక్కడి దృశ్యాలను మనసు లో నింపుకొని వారం పాటు ఆనందాన్ని ఫొటోస్,వీడియో ద్వారా ముచ్చటించుకుంటూఆనం  దించవచ్చు.ఇంటర్నెట్ లో అందమయిన ప్రకృతి నివీక్షించవచ్చు .నదులు,సముద్రాలు ,పర్వతాలు లోయ లు,సరస్సులు మొత్తం నెట్ లో వీడియో రూపం లో వున్నాయి.అన్ని ప్రాంతాలకు పోవటం కుదరదు కాబట్టి గూగుల్ ఎర్త్ తో హిమాలయాల ఫై విహరించ వచ్చు.మీకు ఇంకా ఎన్నో ఆలోచనలు రావచ్చు ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకోండి మనసంతా ఆనందం తో నిండి పోతుంది.ఇదంతా కన్ను తెరిస్తే ఆనందం .కన్ను మూస్తే ఆనందం కలగాలంటే చక్కటి నిద్ర కావాలి.సగటు మనిషికి వయసు ను బట్టి నిద్ర అవసర మవుతుంది .చిన్నపిల్లలకి పది నుండి పన్నెండు గంటల నిద్ర అవసరం.కొద్దిగా పెద్ద పిల్లలకి 8-10 గంటల కాలేజీ పిల్లలకి  6-10 గంటల నిద్ర అవసరం .25-45 వయసు గల వారికి ఆరు,లేదా ఏడుగంటలు నిద్ర కావాలి ఇక ఫైన ఆరుగంటలు నిద్ర పట్టిందంటే ఆరోగ్యానికి మంచిది.ఇది నేను సుమారుగా చెప్పాను. అప్పుడప్పుడు పాటించకపోయినా  సాధ్యమయినంతవరకు ఒక పద్ధతిలో ఫై అలవాటును గనుక పాటించినట్లయితే  మంచి ఆరోగ్యం మీ సొంతం.
2)ఇక రెండవ అలవాటు !చెవులకేమి కావాలి!.మధురమైన సంగీతం ,మనసుకు నచ్చిన పాటలు వింటూ వుంటే ఆనందలోకాలలో తేలినట్లు ఉండదా!శాస్త్రీయ సంగీతం ,ఇష్ట పడేవారు,మధుర స్వరాలు పాత పాట లు ,ఆధునిక పాటలు నచ్చేవాళ్ళు ఇలా ఏదయినా మీ మనసుకు నచ్చింది వింటుంటే అదే కదా ఆనందం దీనితో పాటు సెలయేటి గలగలలు,జలపాతాల హోరు,పక్షుల కిలకిలలు, కోయిల గానాలు ఏటి ఒడ్డున నీటి సవ్వడులు విధంగా ప్రకృతి పలికించే విభిన్న సంగీతాలను  వినటం కళ!  .హరిప్రసాద్ గారి sound of deserts,sound of rivers లాంటి ప్రకృతి  సంగీతాన్ని వినగలిగితే మనసుకెంత హాయి!
3)ఇక  నాసిక  ద్వారా  పొందే  తృప్తి ,ఆనందం  విషయానికి  వస్తే పూల పరిమళం  మనసు  నెంత మత్తెక్కి స్థాయి సుగంధ ద్రవ్యాలు,అగరుబత్తి,ఇంకా నాసిక కు ఏవి హాయినిస్తాయో వాటి మధ్య నుండ గలిగితే ఇక మనసు వేరే వ్యసనాల కోసం ఎందుకు చూస్తుంది.దీనిని ఒక అలవాటుగా మారిస్తే ఎలా వుంటుంది.
4)ఇక నోటి  రుచుల విషయానికి వస్తే జిహ్వ చాపల్యం మనల్ని ఎన్నో కోరికలను కోరు తుంది .పండ్లు,వాటి రసాలు పచ్చి కూరగాయలు వాటి సలాడ్ లు మొలకలు,త్రుణధాన్యాలు ఆహారం లో భాగంగా చేసుకొంటూ అప్పుడప్పుడు రుచి కోసం విభిన్న రకాల పదార్థాలను ఆస్వాదిస్తుంటే మంచిది.టీ,కాఫీ,కూల్ డ్రింక్స్   బదులుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ,పండ్ల రసాలు అలవాటుగా చేసుకుంటూ ఎప్పుడై నా రుచికోసం వాటిని తీసుకోవచ్చు.
5)ఇక మనసు చెడ్డ వ్యసనాలనుంచి  బయటకు రావాలంటే చివరిది అయిన స్పర్స గురించి ఆలోచిద్దాము మొక్కలు , చెట్లు,పూలస్పర్శను పొందటం, ఈత ద్వారా నీటి స్పర్శను,చక్కటి  వైవాహిక సంబంధం గడుపుతూ మంచి శృంగారాన్ని అనుభవించటం ,బిడ్డల్ని ప్రేమ తో దగ్గరికి తీసుకోవటం ,జంతువులను పక్షులను స్పృశిస్తూ వాటి స్పందనలను గమనించటం మనసుకు ఎంతో తృప్తి ఆనందాన్ని ఇవి ఇస్తున్నప్పుడు ఇక సమయమెక్కడుంటుంది చెడ్డ వ్యసనాల జోలికి పోవటానికి !
6)ఇక మిగిలిన వాటి గురించి చూద్దాము.ఇవికూడా ఫై వాటి క్రిందకే వస్తాయి.కాకపోతే ప్రత్యేకంగా చెబుతు న్నాను. వ్యాయామం ప్రతిరోజు చేయటం ఎంత చక్కని అలవాటు.దీని గురించి ఇంతకు ముందు వ్రాసాను.మీ కిష్ట మయినది  ఎన్నుకోండి.నడక,ఈత, యోగ ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం మీ కను కూల   ఎన్నుకోండి .క్రమం తప్పకుండా చేయండి. విద్యార్థులకు ఆటలు పెద్ద వారికి ప్రత్యేక వ్యాయామాలు మంచిది.కొంత మంది ఒక  నెలరోజులు జిం నకు వెడతారు,మానేస్తారు.అయిన మరల మరల మొదలు పెడుతూనే వుండండి.
7)పుస్తక పఠనం మీ అభిరుచికి అనుగుణ మైన పుస్తకాలు చదవండి.ఆరోగ్యం,వృత్తి,వ్యక్తిత్వ వికాసం ,తత్వం ,మంచి నవలలు ఇలా ఎన్నో విభాగాలున్నాయి .కనీసం నెలకు ఒక పుస్తకమన్నపూర్తి అయ్యే వి ధంగా  రోజుకి కొన్ని పేజీ లు  చదివే అలవాటు మంచిది.రచయితలు ఎంతో మధించి వ్రాస్తారు.వారి అనుభ వాన్ని మనం చదివి మన కనుగుణంగా విశ్లే షింకుంటే బాగుంటుంది.ఇది ఒక చక్కటి అలవాటు.
8)మీకు  ఎన్నో  చేయాలని  వుంటుంది .అన్ని చేస్తూ ఒక్క దాని మీద పూర్తి దృష్టి పెట్టకుండా వుంటారు .అలా కాకుండా మీకు అభిరుచిలో ప్రావీణ్య మున్నట్లనిపిస్తుందో దాన్నేఅలవాటుగా రోజు చేయగలిగితే ఎంత బాగుం టుంది!ఇది ఎవరికి  వారు ఎన్నుకోవాలి.
9)ఇక మీతో మీరు గడపటం ఇదికూడా ఒక అలవాటేనా అనుకోకండి!ఒక్కరు ఎవరు తోడు లేకుండా ఇంటి ఫైన గాని, మీ ఏకాంత మందిరం లోగాని ఏమిచేయకుండా గడపటం బహుశా  ధ్యానం అనుకుంటారు..కే అది కొంతవరకు మంచిదే!దాని కంటే ఏకాంతం లోనే మనకు మనం మన మనసును గమనిస్తూవుంటే  ఎలా వుంటుందో చూడండి.మీకు తెలియని కొత్త ఆనందం మీ మనసులోకి వస్తుంది.ఇంకా ఒక సాయంత్రం అంద మైన చెట్ల దగ్గరికి వెళ్లి ప్రకృతిని గమనిస్తూ   ఏకాంతాన్ని ఆనందించండి.
10)ఇక చిట్టచివరిగా మన మనసుకు ఆనందం కలిగించేది సేవ !దీన్ని విభిన్న రకాలుగా చేయవచ్చు డబ్బుతో మాత్రమే కాదు.ఆలోచించండి. బ్లాగు లో సేవ పేజి  చూడండి.మీకే ఎన్నో ఆలోచ నలు మనసులోకి వస్తాయి.అది ఎంత చిన్నదైనా ఒకటి చేయండి.
       నేను ఆచరించేవి,గమనిం చినవి   కొన్ని మీకు చెప్పాను అన్ని చేయాలని లేదు.లోకో భిన్నరుచి !మీ దగ్గర కూడా అద్భుత మైన అలవాట్లు ఉండవచ్చు.మీరు మీ భావాలను పంచుకోండి.ఇవి అన్ని ఒకరకం .మన ప్రవర్తన కు సంబందించినవి వేరే వ్యాసం లో వ్రాస్తాను.
మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవటమే మంచి అలవాట్ల లక్ష్యం.