Thursday, 15 July 2021

యువతతో జగతి ముందుకు(Better India Better world)

 రచయిత:N.R.నారాయణమూర్తి.  అనువాదం:వసుంధర.                                    పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్          ఇండియాలో ఉపాధి కల్పనకు,పేదరిక  నిర్ మూలనకి వ్యాపారదక్షతను సాధనం చేసుకోవాలన్న ఆలోచన నుండి ఉదయించిందే ఇన్ఫోసిస్ అని ,యువతతో పనిచేస్తున్నప్పుడు తన మెదడు బాగా పనిచేస్తుంది అని  ముందుగా చెప్పడం ద్వారా పుస్తక ఉద్దేశ్యాన్ని,ఆయన ఇచ్చే సందేశాలను గూర్చి తెలియజేసారు రచయిత.మన దేశం సాధించిన విజయాలు తక్కువేమీ కావంటూ దేశంలో పేదరికం,నిరక్షరాస్యత, వ్యాధులు,విద్య వంటి విషయాల్లో మనం ఉన్న స్థాయిని వాస్తవికంగా తెలియజేసారు.నిజాయితీ పరులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే ఏ దేశమైనా ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలదు.ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనాలి.వాటి సాఫల్యాని కి త్యాగాలు చేయాలంటారు. విద్యార్థులారా అన్న  వ్యాసం లో మనం ఉత్పత్తి చేసిన సంపద కారణంగా గుర్తింపు వస్తుంది.మనకున్నది నిర్భాగ్యులతో పంచుకోవడమే మన సంపదకు సద్వినియోగం అని యువతకు గొప్ప సందేశమిచ్చారు.మనదేశ ప్రజల దయనీయ స్థితులు వివరిస్తూ 1000 సం. రాల బానిసత్వం వల్ల వచ్చిన ఉదాసీనత ను వదిలి పెట్టాలని,నమ్రతను అలవర్చుకోవాలని పిలుపిస్తారు.రేపు నేను కనిపించకపోతే,నేనేమయ్యానని నా వాళ్ళు వెతుక్కునేందుకు నేనేం చెయ్యాలి?అని అంతర్మధనం చెందుతారు.మార్పొక్కటే నేటి ప్రపంచం లో నిత్యం .ఏ రంగం లో నైనా ప్రావీణ్యత సాధించటం మొక్కటే విజయానికి మార్గం అని దిశానిర్దేశం చేస్తారు.ఎందుకూ అని కాదు,ఎందుక్కాదు అని ప్రశ్నించుకోవాలంటారు. పాశ్చాత్యుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్న వ్యాసం లో తనకంటే ఎక్కువ సాధించినవారిపట్ల గౌరవభావం ఉండాలని,పూచీ పడే స్వభావముండాలని,నిజాయితీతో,సమయపాలన పాటిస్తూ ఉండాలంటారు.1991 లో మన దేశానికి ఆర్ధిక స్వాతంత్ర్య0 వచ్చింది.హరిత,శ్వేత విప్లవాలు ,1991 ఆర్ధిక సంస్కరణలు రోదసీ విజ్ఞానం,అణుశక్తి,software విప్లవం దేశ స్వరూపాన్ని మార్చివేశాయి అంటారు.జ్ఞానాన్ని నవీకరణకు ఉపయోగించుకునే దేశం లాభపడుతుంది అంటారు.ఉన్నత విద్యారంగం లో సంస్కరణలు రావాలని ఆశిస్తారు.నాయకుల స్థాయిని బట్టి దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు.తను స్థాపించిన ఇన్ఫోసిస్ యాత్రాక్రమాన్ని వివరిస్తూ లాభాల్ని చట్టబద్ధంగా నైతికంగా సాధించాలి అంటారు.ఇందులో ఇంకా వాణిజ్య సంస్ధ పాలన,వ్యాపార దక్షత,ప్రపంచీకరణ వంటి ఎన్నో అంశాలపై స్పూర్తిదాయక,సందేశాత్మక వ్యాసాలున్నాయి.యువతను తీవ్రంగా ప్రభావితం చేసే పుస్తకం ఇది.ముఖ్యంగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఎదగాలనుకున్న యువత చదివితీరాల్సిన పుస్తకం ఇది.

Wednesday, 14 July 2021

ఆర్థిక చరిత్ర (The worldly philosophers)

 పుస్తక రచయిత:రాబర్ట్ హెల్బ్రోనర్                       అనువాదం:జాస్తి జవహర్ లాల్.                             పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్.                            ఆర్థిక సమస్యల మీద చర్చలు ఒక సిద్ధాంతానికి,ఇజానికి కట్టుబడక,ప్రతి ఇజం లోను ఎంతో కొంత నిజం ఉంటుందని,ఏ విషయాన్నయినా,ఇతరుల దృక్పధాన్ని అర్ధం చేసుకోవడానికి నిష్పాక్షికత అవసరం.దీన్ని రాబర్ట్ చక్కగా సమతౌల్యం చేశారని అనువాదకులు ముందుమాటలో చెప్పటం తో పుస్తకం చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది.                                  ఆర్థిక దృక్పధం:ఉమ్మడి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థికశాస్త్రం అవసరమైంది.17 వ శతాబ్దం వరకు కూడా అమెరికాలో లాభం ఒక నేరంగా పరిగణించేవారు అని తెలిసుకుంటే ఆశ్చర్యమేస్తుంది.లాభాపేక్ష ఆధునిక మానవుడితోనే వచ్చింది.16 శతాబ్దం చివరివరకు ఇంగ్లాండ్ లో ఎక్కడ చూసినా బీదలే ఉండేవారు.పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ఆర్థిక వ్యక్తిగా అవతరించాడు.                                                    ఆర్థిక శాస్త్రవేత్తలలో ఆద్యుడు ఆడమ్ స్మిత్.ఈయన నైతిక భావ సిద్ధాంతం ప్రతిపాదించారు.విపణిని నియంత్రించే సూత్రాలు వివరించాడు.             మాల్తస్ రికార్డో: జనాభా గుణశ్రేడి లో వనరులు,ఉత్పత్తులు అంక శ్రేడి లో పెరుగుతాయి.ఆహార లభ్యత మానవుల సంఖ్యని శాసిస్తుంది.ఇంకా ఇందులో సోషలిస్టులు అయిన రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్,చార్లెస్ పౌరియర్,జాన్ స్టువర్ట్ మిల్ ల గురించి వివరించారు.                   కార్ల్ మార్క్స్:కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేది మార్క్స్,ఏంగెల్సులు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక.హెగెల్ ప్రతిపాదించిన గతి తార్కిక భౌతిక వాదం మార్క్స్ ఏంగెల్స్ లను ఆకర్షించింది.సాంఘిక మార్పులకు,రాజకీయ విప్లవాలకు అప్పటి ఆర్థిక పరిస్థితులే కారణం.ఫ్యాక్టరీలు కార్మిక వర్గాన్ని సృష్టిస్తే,విపణి విధానం వ్యాపార వర్గాన్ని సృష్టించింది అంటారు మార్క్స్.డార్విన్ జీవ పరిణామాన్ని కనుగొన్నట్లుగా మార్క్స్ చరిత్రలో సంఘ పరిణామాన్ని కనుగొన్నారు అంటారు ఏంగెల్స్.ఇంకా ఇందులో వెబ్లెన్,మేవర్ట్ జోసెఫ్ షాంపెటర్ వంటి వారి గురించి వివరిస్తారు. గతం లో సంపద అన్న ధ్యాసగాని,దాచిపెట్టుకోవాలన్న తపన గాని లేవు.కొన్ని పనులు చెయ్యడం లో లాభం ఉన్నదనుకొన్నప్పుడు పెట్టుబడిదారుడు అవతరించాడు.ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో కూడిన పుస్తకం ఇది.ఆర్ధిక శాస్త్రం మీద ఇష్టం ఉన్న వ్యక్తులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Monday, 12 July 2021

ప్రకృతితో స్నేహం చేద్దాం రండి.

 ఆహారసేకరణ కోసం ప్రతి రోజు 40 కి.మీ నడిచి ఎంతో శ్రమ కోర్చి ఆహారం సంపాదించే దశ నుండి కూర్చున్నచోట నుండి లేవకుండా కోరిన తిండి తినే దశకు వచ్చిన మానవుడు శ్రమకు,ప్రకృతికి దూరమయ్యాడు.దానితో ఎన్నో జబ్బులు చుట్టుముట్టి విలవిలలాడుతున్నాడు.తిరిగి ప్రకృతి మూలాల్లోకి వెళ్లకుండా ఈ తప్పును సరిదిద్దుకోలేం.మొక్కలతో,చెట్లతో,ప్రకృతితో స్నేహం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.మన ఇంటి ముందు,వెనుక మొక్కలు నాటి పెంచడం దగ్గరనుండి,రహదారుల వెంట,ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచడం వరకు ఎవరికి వీలయిన విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు భూమికి మనం చెల్లించే బాకీగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.అలాగే పిల్లలకు చిన్నప్పటినుండే ఈ అలవాటు నేర్పిస్తే వారి జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది.ఇంకా ఈ కరోనకాలం లో తమ సొంత గ్రామాలకు,పట్టణాలకు చేరిన యువకులు మొక్కలు నాటి పెంచే కార్యక్రమం తో పాటు తమ వ్యవసాయక్షేత్రాల్లో తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తే శ్రమ విలువ తెలుస్తుంది.అలా పొలం అందుబాటులో లేని వాళ్ళు తమ బంధువులు రైతులయితే వారి పొలాల్లోకి వెళ్లి చిన్నపాటి పనులు చేయండి.నీరు కట్టడం,కలుపు తీయడం,మట్టిపనులు చేయండి.చెమట పడుతుంటే కలిగే ఆనందాన్ని అనుభవించండి.మట్టి వాసన,నీటి పలకరింపులతో పులకరించండి.మొక్కలు రోజు పెరుగుతుంటే పరిశీలించడం అద్భుతమైన అనుభవం.ఇవన్నీ చేస్తున్నవాడిగా చెబుతున్నా,ప్రయత్నించండి.ఒక ముఖ్య విషయం ఆరోగ్యం కోసం ఉదయపు,సాయంత్రపు నడకలు,వ్యాయామాలు చేస్తుంటాం.చెమట చిందిస్తుంటాం.కానీ పైన చెప్పిన పనులు చేస్తుంటే దాని వల్ల ప్రకృతికి మేలు చేయడం తో పాటు సహజానందం కలుగుతుంది.మన శ్రమ ఓ పుష్పంగా,ఓ కాయగా,ఓ కూరగాయగా,నీడ నిచ్చే చెట్టుగా మారుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది.ప్రకృతి తో స్నేహం చేద్దాం,రండి....ఒద్దుల రవిశేఖర్.