రచయిత :తంగిరాల సుబ్బారావు పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్ ఉయ్యాలవాడ నారసింహారెడ్డి యుద్ధ వీరగాధ (విప్లవ కాలము క్రీ. శ 1845-1847) బుడ్డా వేంగళ రెడ్డి దాన వీర గాధానిక (జీవిత కాలము:క్రీ. శ 1822-1900) చిరంజీవి " సైరా నరసింహా రెడ్డి " చిత్రం విడుదల కాగానే ఒక్క సారి అందరి దృష్టి ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పై పడింది. ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఎంతో శ్రమకోర్చి సేకరించి గుడిగుచ్చి అందించిన ఈ పుస్తకం లో నారసింహా రెడ్డిని సూర్యుడిగాను, వేంగళ రెడ్డిని చంద్రునిగాను వర్ణించారు రచయిత. చరిత్ర ఎప్పుడూ వ్రాసే వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది అందుకే చరిత్రపై ఎన్నో భే ధాభిప్రాయాలు ఉంటాయి. నారసింహారెడ్డి విషయం లో అదే జరిగింది. కానీ రచయిత బ్రిటిష్ ప్రభుత్వం భద్రపరిచిన రికార్డులను, జనపదాల్లో పాడుకునే పాటలను, వీరగాధలను పరిగణన లోకి తీసుకొని ఆయన బ్రిటిష్ వారిపై విప్లవ శంఖం పూరించారని అర్ధమవుతుంది అంటారు. ఆయననను భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ వీరుడిగా రచయిత పేర్కొన్నారు. అలాగే 1866 లో రాయలసీమ ప్రాంతం లో వచ్చిన ఎర్రగాలి కరవు, ధాత కరవుల కాలంలో 3 నెలల పాటు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన అపర దానకర్ణుడిగా ఖ్యాతి గాంచారు బుడ్డా వేంగళ రెడ్డి. ఆయన తన జీవితమంతా తన ఆస్థి పాస్తులను దాన ధర్మాలకే ఖర్చు చేశారు.చారిత్రక ప్రాంతాలపై ఆసక్తి ఉన్నవారు పుస్తకం మొదట్లో, చివర్లో ఇచ్చిన చిత్రాలు చూసి ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చును. గిద్దలూరు దగ్గర కొత్త కోటపై ఉన్న ఫిరంగులను మేము విహార యాత్రలో చూసాము. ఈ పుస్తకం లో బండి గోపాలరెడ్డి, కలవటాల జయరామారావు బందుమియ్య రచనలను పొందు పరచారు. చివరలో బ్రిటిష్ ప్రభుత్వం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వడం వలన రచనకు మరింత విశ్వసనీయత కలిగింది. గ్రంధాలయం లో ఎప్పటినుండి ఉందో ఈ పుస్తకం ఇప్పటికి చదివింది నేనే. ఆసక్తి గల వారు అన్ని ప్రభుత్వాగ్రంధాలయాల కెళ్ళి చదువ వచ్చును.
No comments:
Post a Comment